హ్యూమరం: కైసే బనేగా ప్రధాని? | Prime minister what he doing ? | Sakshi
Sakshi News home page

హ్యూమరం: కైసే బనేగా ప్రధాని?

Published Sun, Sep 22 2013 2:23 AM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM

Prime minister what he doing ?

ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం హడావుడిగా ఉంది. నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ మైక్ తీసుకుని, ‘‘మిత్రులారా! ఇప్పుడు కౌన్ బనేగా ప్రధాని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. పురాతన సంస్కృతిని మనం అభిమానిస్తాం కాబట్టి, మొదట ఏనుగుకి పూలమాల ఇచ్చి అది ఎవరి మెడలో వేస్తే వారినే ప్రధానిని చేద్దాం’’ అన్నాడు. మాలతో గజం ప్రవేశించింది. అందరి మెడలు నిక్కబొడుచుకున్నాయి. ఏనుగు కాసేపు ఆలోచించి, అటూ ఇటూ తిరిగింది. ‘గజరాజు జిందాబాద్’ అని అందరూ కేకలు పెట్టారు. తనకేదో అపాయం జరుగుతుందని భయపడి ఏనుగు ఘీంకరిస్తూ పారిపోయింది.
 
 ‘‘గజం మిథ్య, పలాయనం మిథ్య. ఇదంతా కాంగ్రెస్ కుట్ర. ఏనుగు పారిపోయినంత మాత్రాన ప్రజలు పారిపోరు. ప్రజాస్వామ్యం పారిపోదు. ఎలక్షన్, సెలక్షన్ వల్లే పార్టీ రిసరెక్షన్. మా నిర్ణయానికి లేదు కరెక్షన్. కాంగ్రెస్ సొత్తు కరప్షన్. ప్రజలకు మేము తప్ప లేదు మరో ఆప్షన్’’ అన్నాడు వెంకయ్యనాయుడు.
 రాజ్‌నాథ్‌సింగ్ లేచి, ‘‘మన దేశంలో గోచీ లేకపోయినా ప్రతివాడి దగ్గర సెల్‌ఫోన్ ఉంటుంది. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఓటింగ్ పెడతాం. ప్రధానిగా ఎవరు ఉండాలో ఎస్.ఎం.ఎస్. పంపండి’’ అన్నాడు.
 సుష్మా స్వరాజ్ మైక్ తీసుకుని, ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే మాట్లాడే హక్కు ఉంటుంది. ప్రధానికి ఎంత మాత్రం ఉండదని మన్మోహన్‌సింగ్ రుజువు చేశారు. పీఎం అంటే పర్‌ఫెక్ట్‌లీ మైమ్ అని అర్థం. అందుకే ఆయన సైగలు చేస్తారు తప్ప మాట్లాడరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఈ మెయిల్ పంపి ప్రధానిని సెలక్ట్ చేయండి’’ అంది.
 బండారు దత్తాత్రేయ ఉత్సాహంగా లేచి, ‘‘కార్డులు రాయడంలో నేను రికార్డు. ఉత్తరానికి మించిన ప్రజాపత్రం లేదు. లెటరే బెటర్. అందువల్ల పోస్ట్ ద్వారా ప్రధాని పోస్టుని ఎంచుకోండి’’ అన్నాడు.
 గడ్కరి లేచి, ‘‘ఫేస్ వాల్యూ తెలుసుకోవాలంటే ఫేస్‌బుక్‌ని మించింది లేదు. సోషల్ నెట్‌వర్క్ ద్వారా పార్టీ నెట్‌వర్క్ తెలుసుకుందాం’’ అన్నాడు.
 అటుగా వెళుతున్న ఒక సామాన్యుడికి ఈ హడావుడి చూసి అనుమానమొచ్చి, ‘‘ఏం జరుగుతోంది ఇక్కడ?’’ అని అడిగాడు.
 ‘‘ప్రధాని ఎవరుండాలనే విషయంపై పోటీ’’ అని చెప్పాడో కార్యకర్త.
 ‘‘ఎన్నికలు ఇంకా రాలేదు కదా!’’ అనుమానంగా అడిగాడు సామాన్యుడు.
 ‘‘ఎన్నికలు వస్తే మా పార్టీ గెలిస్తే మాకు మద్దతిచ్చే పార్టీలు గెలిస్తే అప్పుడు కన్‌ఫ్యూజన్ లేకుండా ఇప్పుడే క్లారిఫికేషన్.’’
 ‘‘నిచ్చెనలు వేసి వేసి కింద నేల లేకుండా చేసుకున్నారు. ఆలూ చూలూ లేకుండా కొడుకు పేరు సోమలింగమంటే ఇదే!’’ అని గొణుక్కుంటూ సామాన్యుడు వెళ్లిపోయాడు.
 -  జి.ఆర్.మహర్షి
 
 మహర్షిజం
 రాజకీయమంటే
 ఎలుకల కళాశాలకు పిల్లిని ప్రిన్సిపాల్‌గా నియమించడం
 రుద్రాక్ష మాలల్ని  పులి అమ్మడం
 నీతిచంద్రిక పుస్తకాన్ని నక్క రాయడం
 కప్పల సమూహానికి పాముతో ఉపదేశాలు వినిపించడం
 భవిష్యత్తు అద్భుతమని... బలికి వెళ్లే గొర్రెని నమ్మించడం
 హింస మానాలని సింహం సత్యాగ్రహం చేయడం
 నిజాయితీ గురించి తోడేలు తొడగొట్టడం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement