G. r. maharshi
-
హ్యూమరం: కైసే బనేగా ప్రధాని?
ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం హడావుడిగా ఉంది. నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ మైక్ తీసుకుని, ‘‘మిత్రులారా! ఇప్పుడు కౌన్ బనేగా ప్రధాని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. పురాతన సంస్కృతిని మనం అభిమానిస్తాం కాబట్టి, మొదట ఏనుగుకి పూలమాల ఇచ్చి అది ఎవరి మెడలో వేస్తే వారినే ప్రధానిని చేద్దాం’’ అన్నాడు. మాలతో గజం ప్రవేశించింది. అందరి మెడలు నిక్కబొడుచుకున్నాయి. ఏనుగు కాసేపు ఆలోచించి, అటూ ఇటూ తిరిగింది. ‘గజరాజు జిందాబాద్’ అని అందరూ కేకలు పెట్టారు. తనకేదో అపాయం జరుగుతుందని భయపడి ఏనుగు ఘీంకరిస్తూ పారిపోయింది. ‘‘గజం మిథ్య, పలాయనం మిథ్య. ఇదంతా కాంగ్రెస్ కుట్ర. ఏనుగు పారిపోయినంత మాత్రాన ప్రజలు పారిపోరు. ప్రజాస్వామ్యం పారిపోదు. ఎలక్షన్, సెలక్షన్ వల్లే పార్టీ రిసరెక్షన్. మా నిర్ణయానికి లేదు కరెక్షన్. కాంగ్రెస్ సొత్తు కరప్షన్. ప్రజలకు మేము తప్ప లేదు మరో ఆప్షన్’’ అన్నాడు వెంకయ్యనాయుడు. రాజ్‌నాథ్‌సింగ్ లేచి, ‘‘మన దేశంలో గోచీ లేకపోయినా ప్రతివాడి దగ్గర సెల్‌ఫోన్ ఉంటుంది. ఎస్ఎంఎస్ల ద్వారా ఓటింగ్ పెడతాం. ప్రధానిగా ఎవరు ఉండాలో ఎస్.ఎం.ఎస్. పంపండి’’ అన్నాడు. సుష్మా స్వరాజ్ మైక్ తీసుకుని, ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే మాట్లాడే హక్కు ఉంటుంది. ప్రధానికి ఎంత మాత్రం ఉండదని మన్మోహన్సింగ్ రుజువు చేశారు. పీఎం అంటే పర్ఫెక్ట్లీ మైమ్ అని అర్థం. అందుకే ఆయన సైగలు చేస్తారు తప్ప మాట్లాడరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఈ మెయిల్ పంపి ప్రధానిని సెలక్ట్ చేయండి’’ అంది. బండారు దత్తాత్రేయ ఉత్సాహంగా లేచి, ‘‘కార్డులు రాయడంలో నేను రికార్డు. ఉత్తరానికి మించిన ప్రజాపత్రం లేదు. లెటరే బెటర్. అందువల్ల పోస్ట్ ద్వారా ప్రధాని పోస్టుని ఎంచుకోండి’’ అన్నాడు. గడ్కరి లేచి, ‘‘ఫేస్ వాల్యూ తెలుసుకోవాలంటే ఫేస్‌బుక్‌ని మించింది లేదు. సోషల్ నెట్వర్క్ ద్వారా పార్టీ నెట్వర్క్ తెలుసుకుందాం’’ అన్నాడు. అటుగా వెళుతున్న ఒక సామాన్యుడికి ఈ హడావుడి చూసి అనుమానమొచ్చి, ‘‘ఏం జరుగుతోంది ఇక్కడ?’’ అని అడిగాడు. ‘‘ప్రధాని ఎవరుండాలనే విషయంపై పోటీ’’ అని చెప్పాడో కార్యకర్త. ‘‘ఎన్నికలు ఇంకా రాలేదు కదా!’’ అనుమానంగా అడిగాడు సామాన్యుడు. ‘‘ఎన్నికలు వస్తే మా పార్టీ గెలిస్తే మాకు మద్దతిచ్చే పార్టీలు గెలిస్తే అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడే క్లారిఫికేషన్.’’ ‘‘నిచ్చెనలు వేసి వేసి కింద నేల లేకుండా చేసుకున్నారు. ఆలూ చూలూ లేకుండా కొడుకు పేరు సోమలింగమంటే ఇదే!’’ అని గొణుక్కుంటూ సామాన్యుడు వెళ్లిపోయాడు. - జి.ఆర్.మహర్షి మహర్షిజం రాజకీయమంటే ఎలుకల కళాశాలకు పిల్లిని ప్రిన్సిపాల్‌గా నియమించడం రుద్రాక్ష మాలల్ని పులి అమ్మడం నీతిచంద్రిక పుస్తకాన్ని నక్క రాయడం కప్పల సమూహానికి పాముతో ఉపదేశాలు వినిపించడం భవిష్యత్తు అద్భుతమని... బలికి వెళ్లే గొర్రెని నమ్మించడం హింస మానాలని సింహం సత్యాగ్రహం చేయడం నిజాయితీ గురించి తోడేలు తొడగొట్టడం -
హ్యూమరం: జనం మనం - మనం జనం
ప్రజల్ని రంజింపజేయడానికి పగటి వేషాలే కరెక్టని చంద్రబాబు నిర్ణయించుకున్నాడు. వెంటనే పర్సనల్ మేకప్‌మ్యాన్‌ను పెట్టుకుని కృష్ణుడి వేషం వేశాడు. ‘బావా ఎప్పుడు వచ్చితీవు’ అని జనం ముందుకొచ్చాడు. ‘‘ఇక ఎప్పటికీ రానని హరికృష్ణ వెళ్లిపోయాడు సార్, ఆ పద్యం మనకు అనర్థం’’ అని పీఏ చెప్పాడు. ‘‘నాటకం వేరు, జీవితం వేరు. జీవితంలో నాటకం కలిస్తే రాజకీయం. నాటకంలో జీవితం కలిస్తే అరాజకీయం. ఏది నాటకమో, ఏది జీవితమో ప్రజలకు అర్థం కాకపోవటం మన అదృష్టం’’ అని విడమరిచి చెప్పాడు బాబు. జనం విజిల్స్ వేసి చప్పట్లు కొట్టారు. రెస్పాన్స్‌కు పొంగిపోయిన బాబు ఈసారి భీముడి వేషంలో వచ్చి, ‘‘ధారుణి రాజ్యసంపద మదంబున...’’ అంటూ తొడగొట్టాడు. జనం వన్స్‌మోర్ అన్నారు. ‘‘తెలుగుజాతి జోలికొస్తే తొడలు విరగ్గొడతా, తోక కోసి సున్నం పెడతా, కాళ్లు కట్టెపుల్లల్లా విరుస్తా’’ అన్నాడు బాబు. జనం ఈలపాట పాడారు. బాబు ఈసారి ఇంజనీర్ వేషంలో వచ్చి, ‘‘హైదరాబాద్‌ను నిర్మించింది నేనే. ఒకప్పుడు అక్కడేముండేది చార్మినార్, గోల్కొండ తప్ప. రోడ్లు వేయించి బిల్డింగ్లు కట్టించాను. బిల్‌క్లింటన్‌ను రప్పించాను. బిల్‌గేట్స్‌ను ఒప్పించాను’’ అన్నాడు. ‘‘ఇంజనీర్ మీరే, తెలుగువారి డాక్టర్ మీరే. అన్నిటికీమించిన యాక్టర్ మీరే’’ అని జనం అన్నారు. బాబు ఉబ్బితబ్బిబ్బయి ఈసారి మెజీషియన్ వేషంలో వచ్చాడు. ‘‘తిమ్మిని బమ్మి చేస్తా. బమ్మిని బొమ్మ చేస్తా. నీళ్లలో నిప్పు పుట్టిస్తా. ఉప్పును చూపించి అప్పు పుట్టిస్తా. చిలుకను ఉడుతగా చేస్తా. ఉడుతను ఊసరవెల్లిగా మారుస్తా’’ అంటూ చేతిలోని కర్రను అటూ ఇటూ తిప్పాడు. అరచేతిలో స్వర్గం కనిపించింది. ‘‘జనం మనం, మనం జనం. నన్ను నమ్మితే కొనగోటిపై వైకుంఠం. నమ్మకపోతే కైలాసం’’ అన్నాడు బాబు. జనం ‘‘ఆహా ఓహో’’ అన్నారు. ‘‘నా వేషాలపై మీ అభిప్రాయం?’’ అడిగాడు బాబు. ‘‘అయ్యా! మీరెన్ని వేషాలు వేసినా మీ అసలు వేషం మాకు తెలుసు. మమ్మల్ని రంజింపజేస్తున్నానని మీరనుకుంటున్నారు. మిమ్మల్ని రంజింపజేయాలని మేము కాసేపు వేషం వేస్తున్నాం. మీకిప్పుడు కావలసింది మేకప్ కాదు ప్యాకప్’’ అన్నారు జనం. - జి.ఆర్.మహర్షి మహర్షిజం ఢిల్లీలో ఏం జరుగుతోంది? తోలు బొమ్మలాట. రాష్ట్రంలో..? కురుక్షేత్ర నాటకం. కాకపోతే నటులే తమ పాత్రల్ని మరిచిపోయారు. చిరంజీవి రోల్? ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. నో డైలాగ్స్. మన్మోహన్సింగ్? నో డైలాగ్స్. నో ఎక్స్ప్రెషన్స్. టీడీపీలో... ఏకపాత్రాభినయం. కిరణ్ పాత్ర? ఓన్లీ డైలాగ్స్. నో ఎక్స్ప్రెషన్స్. -
హ్యూమరం: వైరాగ్య కిరణం
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్: ‘‘రాష్ట్రంలో పరిస్థితులెలా ఉన్నాయి?’’ విలేకరుల ప్రశ్న. ‘‘స్థితి నుంచి పరిస్థితి, పరిస్థితి నుంచి సంకట స్థితి, దుస్థితి, చివరికి యధాతథస్థితి వస్తాయి. ఉన్న పరిస్థితులను చెడగొట్టడం, తిరిగి బాగుచేయడం. దీన్ని స్థితి స్థాపక శక్తి అంటారు. శాంతిని పాడుచేసి భద్రత కల్పించడం, భద్రత లేకుండా చేసి శాంతికోసం వెతకడం; దీన్ని లా అండ్ ఆర్డర్ అంటారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందుగలడందులేడని సందేహం వలదు. ఎందెందు వెతికినా అధిష్టానమే కదా.’’ ‘‘మేం అడిగిందేమిటి? మీరు చెప్పిందేమిటి?’’ తికమకపడ్డారు విలేకరులు. ‘‘అడుగడుగున గుడి ఉంది. అందరిలో గుడి ఉంది.’’ ‘‘కొంపదీసి బీజేపీలో చేరతారా ఏమిటి?’’ ‘‘ఏ పార్టీకైనా ప్రజలే న్యాయ నిర్ణేతలు. వాళ్లు అనుకుంటే మనకు సెలవిప్పిస్తారు.’’ ‘‘వెకేషన్ వెళుతున్నారా?’’ ‘‘వెకేషన్, అకేషన్, సఫకేషన్, ఎలెక్ట్రిఫికేషన్... ఎవ్వనిచే జనించు అధిష్టానం.’’ ‘‘అన్నింటికీ అధిష్టానమేనా? మీరు సొంతంగా మాట్లాడరా?’’ ‘‘సొంతంగా చేస్తే పంతమంటారు. పంతంగా చేస్తే ఇంటికి పదమంటారు. ఢిల్లీ కంటే ఇల్లే పదిలం.’’ ‘‘రాష్ట్రంలో ఏం జరుగుతోంది?’’ ‘‘ఢిల్లీ లొల్లి.’’ ‘‘మీరూ చంద్రబాబు కుమ్మక్కయ్యారట.’’ ‘‘ఇద్దరం ఒకే పడవలో ఉన్నాం. మునగక తప్పదని నాకు తెలుసు. బాబుకి తెలిసినా గజఈతగాడిలా బస్సుయాత్రకు బయలుదేరాడు. బస్సుతో జనం కస్సుబుస్సు తగ్గేనా? అంతా బుస్సు. చత్వారమొచ్చిన తర్వాత రెండు కళ్లయినా ఒకటే, నాలుగు కళ్లయినా ఒకటే. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు...’’ అని కిరణ్ పాట ఎత్తుకున్నాడు. ఇంతలో పీఏ వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. ‘‘ఢిల్లీకి రమ్మని పిలుపు. ఎందుకు పిలుస్తారో వాళ్లకూ తెలియదు. ఎందుకు పోతానో నాకూ తెలియదు. అయిననూ పోయి రావలె హస్తినకు.’’ ‘‘మీ సంగతి సరే. ప్రజల పరిస్థితి ఏమిటి?’’ ‘‘ఒక్కండు మీ మొర ఆలకించడు. పొగ పెట్టారు. సెగ చుట్టుకుంది. బాల్ పట్టుకుని జనం కాచుకు కూచున్నారు. ఎన్నికలొస్తే అవుట్ చేయటానికి. అవుట్లు కాల్చడానికి...’’ ‘‘ప్రజలకు మీరిచ్చే సందేశం?’’ ‘‘గెడకర్ర లేకుండా తీగపై నడవడం ప్రాక్టీస్ చేయమని!’’ - జి.ఆర్.మహర్షి మహర్షిజం తెలుగు తమ్ముడి ఆవేదన: ముందుచూపుతో ఉన్న చూపుని పోగొట్టుకున్నాడు మా చంద్రబాబు. మనదేశంలో మనుషులకే కాదు, డబ్బుకీ జబ్బు చేస్తుంది. మిణుగురులతో చీకటిని పారదోలడమే రాజకీయం. కాంగ్రెస్ నాయకుడి కామెంట్: మావాళ్లు చేపలకు వలేసి తామే వలలో చిక్కుకున్నారు.