ప్రజల్ని రంజింపజేయడానికి పగటి వేషాలే కరెక్టని చంద్రబాబు నిర్ణయించుకున్నాడు. వెంటనే పర్సనల్ మేకప్‌మ్యాన్‌ను పెట్టుకుని కృష్ణుడి వేషం వేశాడు. ‘బావా ఎప్పుడు వచ్చితీవు’ అని జనం ముందుకొచ్చాడు. ‘‘ఇక ఎప్పటికీ రానని హరికృష్ణ వెళ్లిపోయాడు సార్, ఆ పద్యం మనకు అనర్థం’’ అని పీఏ చెప్పాడు. ‘‘నాటకం వేరు, జీవితం వేరు. జీవితంలో నాటకం కలిస్తే రాజకీయం. నాటకంలో జీవితం కలిస్తే అరాజకీయం. ఏది నాటకమో, ఏది జీవితమో ప్రజలకు అర్థం కాకపోవటం మన అదృష్టం’’ అని విడమరిచి చెప్పాడు బాబు.
జనం విజిల్స్ వేసి చప్పట్లు కొట్టారు. రెస్పాన్స్‌కు పొంగిపోయిన బాబు ఈసారి భీముడి వేషంలో వచ్చి, ‘‘ధారుణి రాజ్యసంపద మదంబున...’’ అంటూ తొడగొట్టాడు. జనం వన్స్‌మోర్ అన్నారు.
‘‘తెలుగుజాతి జోలికొస్తే తొడలు విరగ్గొడతా, తోక కోసి సున్నం పెడతా, కాళ్లు కట్టెపుల్లల్లా విరుస్తా’’ అన్నాడు బాబు. జనం ఈలపాట పాడారు.
బాబు ఈసారి ఇంజనీర్ వేషంలో వచ్చి, ‘‘హైదరాబాద్‌ను నిర్మించింది నేనే. ఒకప్పుడు అక్కడేముండేది చార్మినార్, గోల్కొండ తప్ప. రోడ్లు వేయించి బిల్డింగ్‌లు కట్టించాను. బిల్‌క్లింటన్‌ను రప్పించాను. బిల్‌గేట్స్‌ను ఒప్పించాను’’ అన్నాడు.
‘‘ఇంజనీర్ మీరే, తెలుగువారి డాక్టర్ మీరే. అన్నిటికీమించిన యాక్టర్ మీరే’’ అని జనం అన్నారు. బాబు ఉబ్బితబ్బిబ్బయి ఈసారి మెజీషియన్ వేషంలో వచ్చాడు.
‘‘తిమ్మిని బమ్మి చేస్తా. బమ్మిని బొమ్మ చేస్తా. నీళ్లలో నిప్పు పుట్టిస్తా. ఉప్పును చూపించి అప్పు పుట్టిస్తా. చిలుకను ఉడుతగా చేస్తా. ఉడుతను ఊసరవెల్లిగా మారుస్తా’’ అంటూ చేతిలోని కర్రను అటూ ఇటూ తిప్పాడు. అరచేతిలో స్వర్గం కనిపించింది.
‘‘జనం మనం, మనం జనం. నన్ను నమ్మితే కొనగోటిపై వైకుంఠం. నమ్మకపోతే కైలాసం’’ అన్నాడు బాబు. జనం ‘‘ఆహా ఓహో’’ అన్నారు.
‘‘నా వేషాలపై మీ అభిప్రాయం?’’ అడిగాడు బాబు.
‘‘అయ్యా! మీరెన్ని వేషాలు వేసినా మీ అసలు వేషం మాకు తెలుసు. మమ్మల్ని రంజింపజేస్తున్నానని మీరనుకుంటున్నారు. మిమ్మల్ని రంజింపజేయాలని మేము కాసేపు వేషం వేస్తున్నాం. మీకిప్పుడు కావలసింది మేకప్ కాదు ప్యాకప్’’ అన్నారు జనం.
- జి.ఆర్.మహర్షి
మహర్షిజం
ఢిల్లీలో ఏం జరుగుతోంది?
తోలు బొమ్మలాట.
రాష్ట్రంలో..?
కురుక్షేత్ర నాటకం. కాకపోతే నటులే తమ పాత్రల్ని మరిచిపోయారు.
చిరంజీవి రోల్? ఓన్లీ ఎక్స్‌ప్రెషన్స్. నో డైలాగ్స్.
మన్మోహన్‌సింగ్? నో డైలాగ్స్. నో ఎక్స్‌ప్రెషన్స్.
టీడీపీలో... ఏకపాత్రాభినయం.
కిరణ్ పాత్ర? ఓన్లీ డైలాగ్స్. నో ఎక్స్‌ప్రెషన్స్.