
సాక్షి, విశాఖపట్నం: ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్.. ప్రజలను మోసం చేసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. చంద్రబాబులాగా మోసం చేయడం వైఎస్ జగన్‌కు తెలియదని కన్నబాబు చెప్పుకొచ్చారు. గ్రూప్-2 అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్‌గా కురుసాల కన్నబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ధర్మాన కృష్ణ దాస్, ఎంపీ తనూజ రాణి, గుడివాడ అమర్నాథ్, వరుదు కళ్యాణి, ధర్మశ్రీ, కేకే రాజు, పండుల రవీంద్ర బాబు సహా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..‘నాకు బాధ్యత అప్పగించిన వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. ఈ ప్రాంతంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఉత్తరాంధ్ర ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఇక్కడ వైఎస్సార్‌సీపీ ఎంతో బలంగా ఉంది. ఉత్తరాంధ్ర ఉద్యమాల పురిటి గడ్డ. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని చూశారు.
ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్. సినిమా హీరోలను మించి వైఎస్ జగన్‌కు జనాలు వస్తున్నారు. ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ సిక్స్ కాదు.. సూపర్ 60 ఇచ్చేవారు. రాష్ట్రంలో చంద్రన్న పగ, చంద్రన్న దగ అనే పథకాలను అమలు చేస్తున్నారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. వైఎస్ జగన్ చెప్పిందే చేస్తారు. పేదల పక్షపాతి వైఎస్ జగన్. ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ నిలబడుతుంది. ప్రజల కోసం పోరాడుతుంది. జగన్ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు, నేతలు ఎందరో ఉన్నారు. రాజకీయ పార్టీల్లో వలసలు సాధారణం. జగన్ సేన అన్ని పార్టీల సేనల కంటే బలంగా ఉంది. లక్షా 20వేల కోట్లు అప్పు చేసి చంద్రబాబు ఏమి చేశారో తెలియదు’ అంటూ కామెంట్స్ చేశారు.

Comments
Please login to add a commentAdd a comment