
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో టీడీపీ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. తాజాగా అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేసిన వైఎస్సార్‌సీపీ నేతలపై ఇసుక మాఫియా దాడులు చేసింది. వైఎస్సార్‌సీపీ నేతలపై కర్రలతో టీడీపీ ఇసుక మాఫియా దాడులకు తెగబడింది.
వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం బొడ్డేపల్లి గ్రామం వద్ద టీడీపీ ఇసుక మాఫియా రెచ్చిపోయింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యదేచ్చగా ఇసుక అక్రమ రవాణాకు టీడీపీ నేతలు పాల్పుడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ఇసుక తవ్వకాలు జరుపుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇసుక తవ్వకాలు, అక్రమ తరలింపును వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఆముదాలవలస వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ చింతాడ రవికుమార్, పార్టీ నేతలు తాజాగా అనధికార ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లి పరిశీలించారు. దీంతో, ఇసుక మాఫియా వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకుంది. టీడీపీ ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అనంతరం, వైఎస్సార్‌సీపీ నేతలపై కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా, టీడీపీ నేతలు జిల్లాలోని నాగావళి, వంశధార నదుల్లో ఇష్టానుసారం ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
ఈ సందర్భంగా చింతాడ రవి కుమార్ మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణా చేస్తూ టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన మాపై దాడులు చేస్తున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో అనేక చోట్ల ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నాడు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్ల రూపాయలను దోచుకుంటున్నాడు. ఇసుక మాఫియా దాడులు చేసినా.. అక్రమ రవాణాపై పోరాడుతూనే ఉంటాం. రైల్వే బ్రిడ్జ్ ఆనుకొని 100 మీటర్ల దూరంలోనే ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment