humour
-
ఒక్కసారి నవ్వండి.. ఇక నవ్విస్తూనే ఉంటారు!
ప్రపంచంలో ఉచితంగా దొరికే విలువైన ఔషధం ఏమిటో తెలుసా? నవ్వు! నవ్వా?! అని హాశ్చర్యపడకండి. ఇది నిజం. ఒక్కసారి నవ్వి చూడండి. మీలో ఉన్న ‘టెన్షన్’ ‘ఒత్తిడి’ ‘బాధ’ అనే మహా సముద్రాలు చుక్క నీరు లేకుండా ఎండిపోతాయి. మనసు హాయిగా ఆకాశంలో తేలిపోతుంటుంది. వెయ్యి ఏనుగుల బలం ఉచితంగా మన ఒంట్లోకి వచ్చి చేరుతుంది. నవ్వే వాళ్లు–నవ్వించే వాళ్లు అనేది ఒకప్పటి మాట. అయితే చెన్నైలోని ‘ది హిస్టీరికల్’లాంటి క్లబ్‌లు ఇద్దరి మధ్య ఉన్న రేఖను తొలగించాయి. ఇక్కడ అందరూ నవ్వించేవాళ్లే. నవ్వులను హాయిగా ఆస్వాదించేవాళ్లే! చెన్నైలోని ఫస్ట్ ఆల్–ఉమెన్ ఇంప్రొవైజేషన్ థియేటర్ ‘ది హిస్టీరికల్’ ప్రత్యేకత ఏమిటంటే ప్రేక్షకులు నవ్వడంతోపాటు నవ్వించేలా చేయడం. ప్రేక్షకులు ఒక ఐడియా చెబితే దాని నుంచి ఆశువుగా హాస్యాన్ని పుట్టిస్తారు. ఇది మాత్రమే కాదు ఫన్–యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఉదా: స్పిన్ ఏ యాన్–ఒక పదం చెబితే దాన్ని నుంచి సన్నివేశాలను, హాస్యాన్ని సృష్టించడం. జిప్ జాప్ జోప్–ప్లేయర్స్ తమలో అపారమైన శక్తి ఉందని నమ్ముతుంటారు. దాన్ని ఇతరులకు పంచి, ఇలా చెయ్యి... అని చెబుతుంటారు. డబుల్ ఎండోమెంట్–మూడో ప్లేయర్‌కు ఏం చెప్పాలనేది ఇద్దరు ప్లేయర్స్ రహస్యంగా మాట్లాడుకుంటారు. ‘ది హిస్టీరికల్ క్లబ్’ అనేది షాలిని విజయకుమార్ మానసపుత్రిక. ఒకప్పుడు చెన్నైలోని ‘హాఫ్–బాయిల్డ్ ఇంక్’ ఇంప్రూవ్ కామెడీ గ్రూప్‌లో పనిచేసింది. ఆ గ్రూపులో తానొక్కరే మహిళ. ‘కామెడీ ఫీల్డ్‌లోకి ఎంతోమంది మహిళలు రావాలనే కోరికతో ది హిస్టీరికల్ క్లబ్‌ను ప్రారంభించాను. స్త్రీలలో సహజంగా నవ్వించే గుణం ఉంటుంది. అయితే ఆ ప్రతిభను తమ సన్నిహితుల దగ్గర మాత్రమే ప్రదర్శిస్తారు. అంతర్జాతీయ, దేశీయ క్లబ్‌ల నుంచి స్ఫూర్తి పొంది ప్రారంభించిన ‘ది హిస్టీరికల్’ మా నమ్మకాన్ని నిలబెట్టింది’ అంటుంది శాలిని. శాలిని మొదట తన ఐడియాను నటుడు కార్తీక్‌తో పంచుకున్నప్పుడు ‘బాగుంటుంది’ అని ప్రోత్సహించాడు. ఆ తరువాత అమృత శ్రీనివాసన్‌తో కలిసి, మన దేశంలోనే పెద్దదైన ‘ఇవమ్’ స్టాండప్–కామెడీ మూమెంట్ సహకారంతో ‘ఫీల్ ఫ్రీ టూ బీ ఫన్నీ’ కామెడీ క్యాంపెయిన్ ప్రారంభించింది. దీని ద్వారా ‘ది హిస్టీరికల్ క్లబ్’కు అవసరమైన పదమూడుమంది మహిళలను ఎంపిక చేసుకున్నారు. ‘ఇంప్రొవైజేషనల్ థియేటర్ లేదా ఇంప్రూవ్ అనేది కామెడీలోని సబ్ జానర్. చిన్న స్టోరీ లైన్ చెబితే అప్పటికప్పుడు హాస్యాన్ని పుట్టించే కళ. మనలోని సృజనాత్మకశక్తులను ప్రదర్శించడానికి వేదిక’ అంటుంది ‘ది హిస్టీరికల్’ సభ్యులలో ఒకరైన జిక్కీ నాయర్. ‘నవ్విపోదాం’ అని ప్రేక్షకులుగా వచ్చినవాళ్లు ఇతరులను నవ్వించడం అనేది అంత తేలిగ్గా ఏమీ జరగదు. మొదట బిడియ పడతారు. వాతావరణానికి అలవాటుపడతారు. ఆ తరువాత ఆత్మవిశ్వాసంతో తమలోని సృజనకు రెక్కలు ఇస్తారు. హాయిగా నవ్విస్తారు. ‘ఇప్పుడు ఉన్న సభ్యులతో మాత్రమే సంతృప్తి పడడం లేదు. ఇంకా ఎక్కువమంది సభ్యులు భాగమయ్యేలా కృషి చేస్తాం’ అంటుంది శాలిని. ‘ది హిస్టీరికల్ లక్ష్యం ఒకటే... ఇందులో చేరిన సభ్యులు తమలోని బిడియాలు, భయాలను పక్కనపెట్టి సౌకర్యంగా ఉండాలి. నవ్వడంతో పాటు నవ్వించాలి కూడా’ అంటుంది జిక్కి నాయర్. ‘మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చిన కార్యక్రమం ఇది. ఎలాంటి ఒత్తిడి లేకుండా మన ఐడియాలు పంచుకోవచ్చు. అవి నవ్వుల పువ్వులవ్వడం చూడవచ్చు’ అంటుంది ‘ది హిస్టీరికల్’ కార్యక్రమంలో పాల్గొన్న సుచిత్ర శంకరన్. (క్లిక్ చేయండి: మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి) -
పని ప్రదేశంలో సరదాగా ఉండటంలో మనోళ్లే తోపులు!
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉండదంటూ ఓ సినీ కవి ఎప్పుడో చెప్పాడు. కొత్తగా అదే విషయాన్ని లింక్డ్ఇన్ తేల్చి చెప్పింది. ఇందు కోసం ఇండియాతో పాటు వివిధ దేశాల్లో ఉన్న వృత్తి నిపుణుల నుంచి అభిప్రాయాలను సవివరంగా తీసుకుంది. వాటిని క్రోడీకరించి తాజాగా ఫలితాలు ప్రకటించింది. పని ప్రదేశాల్లో నవ్వుతూ జోకులేస్తూ తమ ఎమోషన్స్‌ని ప్రకటిస్తూ పని చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతామంటూ ఇండియాలో 76 శాతం మంది ప్రొఫెషనల్స్ తేల్చి చెప్పారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఆడుతూ పాడుతూ పని చేయడాన్ని ఇంకా ఆస్వాదిస్తున్నట్టు 86 శాతం మంది తెలిపారు. ఇలా చేయడం వల్ల ప్రొడక్టివిటీ ఇంకా పెరుగుతున్నట్టు తాము గుర్తించామన్నారు. సరదగా జోకులేస్తూ ఫన్నీ ఎన్విరాన్మెంట్లో పని చేయడాన్ని ఇష్టపడటంలో ఇండియన్లు, ఇటాలియన్లు మిగిలిన దేశాలకు చెందిన ప్రొఫెషన్స్‌ని వెనక్కి నెట్టారు. పని ప్రదేశంలో సరదాగా ఉండటాన్ని ఇష్టపడుతున్నట్లు ఈ రెండు దేశాల్లో 38 శాతం మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. రోజుకు కనీసం ఒక్క జోకైనా పని ప్రదేశంలో వేస్తుంటమని వీరు చెబుతున్నారు. ఇండియా, ఇటాలియన్ తర్వాత జర్మన్ (36 శాతం), బ్రిట్స్ (34 శాతం), డచ్ (33 శాతం), ఫ్రెంచ్ (32 శాతం), ఆస్ట్రేలియా (29 శాతం)లు నిలిచాయి. ఇండియాలో కూడా దక్షిణ భారతదేశానికి చెందిన ప్రొఫెనల్స్ జోకులు పేల్చడంలో అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. ఇక్కడి ఫ్రొఫెషనల్స్ నుంచి సేకరించిన అభిప్రాయం ప్రకారం వర్క్‌ప్లేస్‌లో కనీసం ఒక్క జోకైనా వేసే వారిలో దక్షిణ భారతీయులు 43 శాతం ఉన్నారు. తర్వాతి స్థానాల్లో పశ్చిమ, తూర్పు, ఉత్తర భారతీయులు ఉన్నారు. పని ప్రదేశంలో నార్త్ఈస్ట్కు చెందిన వారు చాలా సీరియస్‌గా ఉంటారని తేలింది. జోకులేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందనే భావనలో 71 శాతం మంది భారతీయ ప్రొఫెషనల్స్ ఉన్నారు. 56 శాతం మంది పని ప్రదేశాల్లో చతుర్లాడటాన్ని నాన్ ప్రొఫెషనల్ థింగ్‌గా పరిగణిస్తున్నట్టు లింక్ట్‌ఇన్ సర్వే చెబుతోంది. అయితే పని ప్రదేశంలో సరదాగా ఉండటాన్ని తప్పుగా చూడటం అనే అలవాటు మన సొసైటీలో ఎక్కువగా ఉందనే అభిప్రాయం ఎక్కువైంది. ముఖ్యంగా పురుషలతో పోల్చినప్పుడు మహిళలకు ఈ సమస్య ఎక్కువగా ఉంది. చదవండి: భవిష్యత్తులో ఎక్కువ ఉద్యోగాలు ‘గిగ్’లోనే లభిస్తాయట -
ఇదీ! సీఎం నవీన్ పట్నాయక్ అంటే..
సాక్షి, భువనేశ్వర్ : మానవీయ దృక్పథం వాస్తవ కార్యాచరణను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యక్షంగా ప్రతిబింబింపజేశారు. అధికారిక కార్యక్రమాలు ముగించుకుని, ఆదివారం సాయంత్రం తన ఇంటికి వెళ్తున్న ముఖ్యమంత్రికి అదే దారిలో అంబులెన్స్ సైరన్ వినిపించింది. దీంతో అప్రమత్తమైన ఆయన కాన్వాయ్‌ను నిలపాలని, ఆ అంబులెన్స్ వెళ్లిన తర్వాత కాన్వాయ్ ముందుకు పోవాలని ఆదేశించారు. ఈ సంఘటనను చూసిన అక్కడి ప్రజలు ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (ఎన్ఆర్సీపై నవీన్ పట్నాయక్ కీలక వ్యాఖ్యలు) (ఒడిశా సీఎం సంచలన నిర్ణయం) -
'వారు నేర్చుకోవడం లేదా.. అయితే నవ్వించండి'
లండన్: మీ చిన్నారులు ఏ కొత్త విషయాలు చెప్పినా అస్సలు నేర్చుకోవడం లేదని.. అలవాటు చేసుకోవడం లేదని బాధపడుతున్నారా? వారికి పదే పదే అదే అంశాన్ని నేర్పించేందుకు ప్రాయసపడుతున్నారా? అయితే ఒక్క క్షణం ఆగి అలా చేయడానికి బదులు వారిని ఓసారి నవ్వించే ప్రయత్నం చేయండని చెబుతున్నారు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు. అలా నవ్వించడం ద్వారా వారు ఎలాంటి విషయాలు చెప్పినా ఇట్టే నేర్చుకొని అలవాటుపడిపోతారని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పేదిశగా ఏడాదిన్నర చిన్నారులను ప్రయోగానికి తీసుకున్న శాస్త్రవేత్తలు వారికి తలా ఓ బొమ్మ చేతికి ఇచ్చారు. అందులో కొందరు పిల్లలు ఆ బొమ్మతో ఆడుకోగా మరికొందరు మాత్రం తీసుకున్న వెంటనే నేలకేసి కొట్టడం మొదలుపెట్టారు. ఇది చూసి మరో గ్రూపులో ఆడుకుంటున్న పిల్లలు నవ్వుకుంటూ తిరిగి తమ ఆటను కొనసాగించారు. దీని ప్రకారం నవ్వడం ద్వారా పిల్లలు రెట్టింపు ప్రశాంతతను పొంది ఏ అంశాన్నైనా తమలో ఇముడ్చుకునేందుకు కావాల్సిన శక్తిని పొందగలుగుతారని శాస్త్రవేత్తలు తెలిపారు. -
కామన్ మ్యాన్ స్టోరీ
హ్యూమరం ఒక సామాన్యుడు పోలీస్‌స్టేషన్‌కి వచ్చి తనకి పిచ్చిపట్టిందని, కొంతకాలం సెల్లో వేయాలని ప్రాధేయపడ్డాడు. ఎస్.ఐ. తొణక్కుండా బెణక్కుండా చూశాడు. పిచ్చి పట్టిందని తనకు తానుగా కనిపెట్టినవాడెవడూ పిచ్చివాడు కాదని, అతను జ్ఞాని అయివుండొచ్చని అనుమానించాడు. లాఠీ వల్ల పిచ్చి వదిలిపోవడమో, కొత్తగా పిచ్చి పట్టడమో జరిగే అవకాశాలున్నాయని వివరించాడు. న్యాయం చేసినా చేయకపోయినా ఫిర్యాదుదారుడి మాటలు వినడం పోలీస్ ధర్మమని అన్నాడు. తన మాటలు వినే మనిషి కూడా ఒకడున్నాడని సంతోషించి సామాన్యుడు మొదలుపెట్టాడు: ‘‘అయ్యా! దసరా పండక్కి ఊరెళదామనుకున్నాను. బస్సులు లేవు. ప్రైవేట్ బస్సువాళ్లని అడిగితే ఐదొందల టికెట్ రెండు వేలని చెప్పారు. నేను ఆశ్చర్యపోతూ ఉండగా, ఇంకో ఐదొందల రేటు పెంచాడు. గత్యంతరం లేక ఆటోలో రైల్వేస్టేషన్‌కు బయలుదేరాను. గోతుల్లో ఎగిరి దూకుతూ కదిలిన ఆటో ఒక గోతిని ఎగరలేక కూలబడింది. నడుము పట్టేసింది. పడుతూ లేస్తూ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ డాక్టర్లు లేరు. రాష్ట్రమే జబ్బుపడి ఉంటే, ఇక మనుషుల జబ్బులను ఎవరు పట్టించుకుంటారని వార్డ్బాయ్ హితోపదేశం చేశాడు. ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళదామని ఇంకో ఆటో ఎక్కాను. ఆ కుదుపులకి పట్టేసిన నడుము ఆటోమ్యాటిగ్గా సెట్‌రైట్ అయింది. సంతోషంతో రైల్వేస్టేషన్‌కి వెళ్లాను. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర పది రైళ్ల పొడవు క్యూ ఉంది. క్యూలోనే పడుకుని నిద్రపోతే మరుసటిరోజు టికెట్ దొరికింది. రెలైక్కడానికి వెళితే అది కనిపించలేదు. ఈగల్లా మనుషులు దాన్ని చుట్టుముట్టేశారు. మనుషుల మీద నుంచి పాకుతూ రైలుకి వేలాడబడ్డాను. ముక్కు తూ మూలుగుతూ రైలు కదిలింది. కొంచెం దూరం పోయి రైలు ఆగింది. కరెంట్ పోయిందన్నారు. ఎప్పుడొస్తుందో తెలియదని, ఎప్పటికైనా రావచ్చని చెప్పారు. ఇంతలో పోలీసులొచ్చి దొరికినవాడిని దొరికినట్టు చావబాదారు. ‘రైల్ రోకో చేస్తార్ బే’ అంటూ కర్రలతో తరుముకున్నారు. రైలు దానంతటదే రోకిందని చెప్పినా వినిపించుకోలేదు. దెబ్బలకు తట్టుకోలేక పొలాల వెంబడి పరిగెత్తాను. ఇంతలో పిల్లల కోడిలా ఒక సర్వీస్ ఆటోవాడు వచ్చి స్టీరింగ్‌పై కూర్చోగలిగితే ఊళ్లోకి తీసుకెళతానన్నాడు. చచ్చీ చెడీ స్టీరింగ్‌పై కూచుంటే అటూ ఇటూ విష్ణుచక్రంలా మనిషిని తిప్పి ఊరు చేర్చాడు. ఇల్లు చేరితే మా అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. హడలిపోయి ఏం జరిగిందని అడిగాను. కరెంట్ లేక ఫేస్బుక్ కనిపించలేదని శోకించింది. జుట్టు పీక్కుని వీధిలోకొస్తే, ‘వస్తే రానీ పోతే పోనీ’ సినిమాపై అభిప్రాయం చెప్పమని టీవీలవాళ్లు వెంటపడ్డారు. వాళ్ల నుంచి పారిపోతూ ఉంటే కొంతమంది నాయకులు పులివేషాలతో ఎదురొచ్చారు. అక్కసు పట్టలేక వాళ్లను కరిచేసి మీ దగ్గరికి వచ్చాను’’ అని సామాన్యుడు ముగించాడు. ఈ రాష్ట్రంలో జీవించేవాడికి పిచ్చిపట్టకపోతేనే ఆశ్చర్యమని, పిచ్చిపట్టడం సామాన్య ధర్మమని ఎస్.ఐ. బోధించి ఊరడించి సామాన్యుడిని పంపేశాడు. - జి.ఆర్.మహర్షి -
హ్యూమరం: జనం మనం - మనం జనం
ప్రజల్ని రంజింపజేయడానికి పగటి వేషాలే కరెక్టని చంద్రబాబు నిర్ణయించుకున్నాడు. వెంటనే పర్సనల్ మేకప్‌మ్యాన్‌ను పెట్టుకుని కృష్ణుడి వేషం వేశాడు. ‘బావా ఎప్పుడు వచ్చితీవు’ అని జనం ముందుకొచ్చాడు. ‘‘ఇక ఎప్పటికీ రానని హరికృష్ణ వెళ్లిపోయాడు సార్, ఆ పద్యం మనకు అనర్థం’’ అని పీఏ చెప్పాడు. ‘‘నాటకం వేరు, జీవితం వేరు. జీవితంలో నాటకం కలిస్తే రాజకీయం. నాటకంలో జీవితం కలిస్తే అరాజకీయం. ఏది నాటకమో, ఏది జీవితమో ప్రజలకు అర్థం కాకపోవటం మన అదృష్టం’’ అని విడమరిచి చెప్పాడు బాబు. జనం విజిల్స్ వేసి చప్పట్లు కొట్టారు. రెస్పాన్స్‌కు పొంగిపోయిన బాబు ఈసారి భీముడి వేషంలో వచ్చి, ‘‘ధారుణి రాజ్యసంపద మదంబున...’’ అంటూ తొడగొట్టాడు. జనం వన్స్‌మోర్ అన్నారు. ‘‘తెలుగుజాతి జోలికొస్తే తొడలు విరగ్గొడతా, తోక కోసి సున్నం పెడతా, కాళ్లు కట్టెపుల్లల్లా విరుస్తా’’ అన్నాడు బాబు. జనం ఈలపాట పాడారు. బాబు ఈసారి ఇంజనీర్ వేషంలో వచ్చి, ‘‘హైదరాబాద్‌ను నిర్మించింది నేనే. ఒకప్పుడు అక్కడేముండేది చార్మినార్, గోల్కొండ తప్ప. రోడ్లు వేయించి బిల్డింగ్లు కట్టించాను. బిల్‌క్లింటన్‌ను రప్పించాను. బిల్‌గేట్స్‌ను ఒప్పించాను’’ అన్నాడు. ‘‘ఇంజనీర్ మీరే, తెలుగువారి డాక్టర్ మీరే. అన్నిటికీమించిన యాక్టర్ మీరే’’ అని జనం అన్నారు. బాబు ఉబ్బితబ్బిబ్బయి ఈసారి మెజీషియన్ వేషంలో వచ్చాడు. ‘‘తిమ్మిని బమ్మి చేస్తా. బమ్మిని బొమ్మ చేస్తా. నీళ్లలో నిప్పు పుట్టిస్తా. ఉప్పును చూపించి అప్పు పుట్టిస్తా. చిలుకను ఉడుతగా చేస్తా. ఉడుతను ఊసరవెల్లిగా మారుస్తా’’ అంటూ చేతిలోని కర్రను అటూ ఇటూ తిప్పాడు. అరచేతిలో స్వర్గం కనిపించింది. ‘‘జనం మనం, మనం జనం. నన్ను నమ్మితే కొనగోటిపై వైకుంఠం. నమ్మకపోతే కైలాసం’’ అన్నాడు బాబు. జనం ‘‘ఆహా ఓహో’’ అన్నారు. ‘‘నా వేషాలపై మీ అభిప్రాయం?’’ అడిగాడు బాబు. ‘‘అయ్యా! మీరెన్ని వేషాలు వేసినా మీ అసలు వేషం మాకు తెలుసు. మమ్మల్ని రంజింపజేస్తున్నానని మీరనుకుంటున్నారు. మిమ్మల్ని రంజింపజేయాలని మేము కాసేపు వేషం వేస్తున్నాం. మీకిప్పుడు కావలసింది మేకప్ కాదు ప్యాకప్’’ అన్నారు జనం. - జి.ఆర్.మహర్షి మహర్షిజం ఢిల్లీలో ఏం జరుగుతోంది? తోలు బొమ్మలాట. రాష్ట్రంలో..? కురుక్షేత్ర నాటకం. కాకపోతే నటులే తమ పాత్రల్ని మరిచిపోయారు. చిరంజీవి రోల్? ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. నో డైలాగ్స్. మన్మోహన్సింగ్? నో డైలాగ్స్. నో ఎక్స్ప్రెషన్స్. టీడీపీలో... ఏకపాత్రాభినయం. కిరణ్ పాత్ర? ఓన్లీ డైలాగ్స్. నో ఎక్స్ప్రెషన్స్.