ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉండదంటూ ఓ సినీ కవి ఎప్పుడో చెప్పాడు. కొత్తగా అదే విషయాన్ని లింక్డ్‌ఇన్ తేల్చి చెప్పింది. ఇందు కోసం ఇండియాతో పాటు వివిధ దేశాల్లో ఉన్న వృత్తి నిపుణుల నుంచి అభిప్రాయాలను సవివరంగా తీసుకుంది. వాటిని క్రోడీకరించి తాజాగా ఫలితాలు ప్రకటించింది.
పని ప్రదేశాల్లో నవ్వుతూ జోకులేస్తూ తమ ఎమోషన్స్‌ని ప్రకటిస్తూ పని చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతామంటూ ఇండియాలో 76 శాతం మంది ప్రొఫెషనల్స్ తేల్చి చెప్పారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఆడుతూ పాడుతూ పని చేయడాన్ని ఇంకా ఆస్వాదిస్తున్నట్టు 86 శాతం మంది తెలిపారు. ఇలా చేయడం వల్ల ప్రొడక్టివిటీ ఇంకా పెరుగుతున్నట్టు తాము గుర్తించామన్నారు.
సరదగా జోకులేస్తూ ఫన్నీ ఎన్విరాన్‌మెంట్‌లో పని చేయడాన్ని ఇష్టపడటంలో ఇండియన్లు, ఇటాలియన్లు మిగిలిన దేశాలకు చెందిన ప్రొఫెషన్స్‌ని వెనక్కి నెట్టారు. పని ప్రదేశంలో సరదాగా ఉండటాన్ని ఇష్టపడుతున్నట్లు ఈ రెండు దేశాల్లో 38 శాతం మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. రోజుకు కనీసం ఒక్క జోకైనా పని ప్రదేశంలో వేస్తుంటమని వీరు చెబుతున్నారు. ఇండియా, ఇటాలియన్ తర్వాత జర్మన్ (36 శాతం), బ్రిట్స్ (34 శాతం), డచ్ (33 శాతం), ఫ్రెంచ్ (32 శాతం), ఆస్ట్రేలియా (29 శాతం)లు నిలిచాయి.
ఇండియాలో కూడా దక్షిణ భారతదేశానికి చెందిన ప్రొఫెనల్స్ జోకులు పేల్చడంలో అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. ఇక్కడి ఫ్రొఫెషనల్స్ నుంచి సేకరించిన అభిప్రాయం ప్రకారం వర్క్‌ప్లేస్‌లో కనీసం ఒక్క జోకైనా వేసే వారిలో దక్షిణ భారతీయులు 43 శాతం ఉన్నారు. తర్వాతి స్థానాల్లో పశ్చిమ, తూర్పు, ఉత్తర భారతీయులు ఉన్నారు. పని ప్రదేశంలో నార్త్‌ఈస్ట్‌కు చెందిన వారు చాలా సీరియస్‌గా ఉంటారని తేలింది.
జోకులేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందనే భావనలో 71 శాతం మంది భారతీయ ప్రొఫెషనల్స్ ఉన్నారు. 56 శాతం మంది పని ప్రదేశాల్లో చతుర్లాడటాన్ని నాన్ ప్రొఫెషనల్ థింగ్‌గా పరిగణిస్తున్నట్టు లింక్ట్‌ఇన్ సర్వే చెబుతోంది. అయితే పని ప్రదేశంలో సరదాగా ఉండటాన్ని తప్పుగా చూడటం అనే అలవాటు మన సొసైటీలో ఎక్కువగా ఉందనే అభిప్రాయం ఎక్కువైంది. ముఖ్యంగా పురుషలతో పోల్చినప్పుడు మహిళలకు ఈ సమస్య ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment