కామన్ మ్యాన్ స్టోరీ
హ్యూమరం
ఒక సామాన్యుడు పోలీస్‌స్టేషన్‌కి వచ్చి తనకి పిచ్చిపట్టిందని, కొంతకాలం సెల్‌లో వేయాలని ప్రాధేయపడ్డాడు. ఎస్.ఐ. తొణక్కుండా బెణక్కుండా చూశాడు. పిచ్చి పట్టిందని తనకు తానుగా కనిపెట్టినవాడెవడూ పిచ్చివాడు కాదని, అతను జ్ఞాని అయివుండొచ్చని అనుమానించాడు. లాఠీ వల్ల పిచ్చి వదిలిపోవడమో, కొత్తగా పిచ్చి పట్టడమో జరిగే అవకాశాలున్నాయని వివరించాడు. న్యాయం చేసినా చేయకపోయినా ఫిర్యాదుదారుడి మాటలు వినడం పోలీస్ ధర్మమని అన్నాడు.
తన మాటలు వినే మనిషి కూడా ఒకడున్నాడని సంతోషించి సామాన్యుడు మొదలుపెట్టాడు: ‘‘అయ్యా! దసరా పండక్కి ఊరెళదామనుకున్నాను. బస్సులు లేవు. ప్రైవేట్ బస్సువాళ్లని అడిగితే ఐదొందల టికెట్ రెండు వేలని చెప్పారు. నేను ఆశ్చర్యపోతూ ఉండగా, ఇంకో ఐదొందల రేటు పెంచాడు. గత్యంతరం లేక ఆటోలో రైల్వేస్టేషన్‌కు బయలుదేరాను. గోతుల్లో ఎగిరి దూకుతూ కదిలిన ఆటో ఒక గోతిని ఎగరలేక కూలబడింది. నడుము పట్టేసింది. పడుతూ లేస్తూ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ డాక్టర్లు లేరు. రాష్ట్రమే జబ్బుపడి ఉంటే, ఇక మనుషుల జబ్బులను ఎవరు పట్టించుకుంటారని వార్డ్‌బాయ్ హితోపదేశం చేశాడు.
ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళదామని ఇంకో ఆటో ఎక్కాను. ఆ కుదుపులకి పట్టేసిన నడుము ఆటోమ్యాటిగ్గా సెట్‌రైట్ అయింది. సంతోషంతో రైల్వేస్టేషన్‌కి వెళ్లాను. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర పది రైళ్ల పొడవు క్యూ ఉంది. క్యూలోనే పడుకుని నిద్రపోతే మరుసటిరోజు టికెట్ దొరికింది. రెలైక్కడానికి వెళితే అది కనిపించలేదు. ఈగల్లా మనుషులు దాన్ని చుట్టుముట్టేశారు. మనుషుల మీద నుంచి పాకుతూ రైలుకి వేలాడబడ్డాను. ముక్కు తూ మూలుగుతూ రైలు కదిలింది. కొంచెం దూరం పోయి రైలు ఆగింది. కరెంట్ పోయిందన్నారు. ఎప్పుడొస్తుందో తెలియదని, ఎప్పటికైనా రావచ్చని చెప్పారు. ఇంతలో పోలీసులొచ్చి దొరికినవాడిని దొరికినట్టు చావబాదారు. ‘రైల్ రోకో చేస్తార్ బే’ అంటూ కర్రలతో తరుముకున్నారు.
రైలు దానంతటదే రోకిందని చెప్పినా వినిపించుకోలేదు. దెబ్బలకు తట్టుకోలేక పొలాల వెంబడి పరిగెత్తాను. ఇంతలో పిల్లల కోడిలా ఒక సర్వీస్ ఆటోవాడు వచ్చి స్టీరింగ్‌పై కూర్చోగలిగితే ఊళ్లోకి తీసుకెళతానన్నాడు. చచ్చీ చెడీ స్టీరింగ్‌పై కూచుంటే అటూ ఇటూ విష్ణుచక్రంలా మనిషిని తిప్పి ఊరు చేర్చాడు. ఇల్లు చేరితే మా అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. హడలిపోయి ఏం జరిగిందని అడిగాను. కరెంట్ లేక ఫేస్‌బుక్ కనిపించలేదని శోకించింది. జుట్టు పీక్కుని వీధిలోకొస్తే, ‘వస్తే రానీ పోతే పోనీ’ సినిమాపై అభిప్రాయం చెప్పమని టీవీలవాళ్లు వెంటపడ్డారు. వాళ్ల నుంచి పారిపోతూ ఉంటే కొంతమంది నాయకులు పులివేషాలతో ఎదురొచ్చారు. అక్కసు పట్టలేక వాళ్లను కరిచేసి మీ దగ్గరికి వచ్చాను’’ అని సామాన్యుడు ముగించాడు.
ఈ రాష్ట్రంలో జీవించేవాడికి పిచ్చిపట్టకపోతేనే ఆశ్చర్యమని, పిచ్చిపట్టడం సామాన్య ధర్మమని ఎస్.ఐ. బోధించి ఊరడించి సామాన్యుడిని పంపేశాడు.
- జి.ఆర్.మహర్షి