హ్యూమరం: ఓడ మీద పిల్లి
విలేకరుల సమావేశం. మైకు తీసుకున్న చంద్రబాబు, ‘‘ఢిల్లీవాళ్లకు బుద్ధి లేదు. కాంగ్రెస్ నాయకులకు తలా తోకా లేదు’’ అని తిట్లు ఎత్తుకున్నాడు. ‘‘విభజనకు మీరు అనుకూలమా? వ్యతిరేకమా?’’ అని విలేకరులు అడిగారు. ‘‘విభజన అనే పదంలో భజన ఉంది. భక్తితో జనం పాడే పాటని భజన అంటారు. వి అంటే విక్టరీ. గతంలో నేను రెండు వేళ్లు చూపించేవాడిని. దానికి వేరే అర్థముందని తెలిసి మానేశాను. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికేయడమే రాజకీయం. అన్నింట్లో వేలు పెడితే మన వేలితో మన కన్ను పొడుస్తారు.’’
‘‘మేము అడిగిన ప్రశ్నేంటి?’’ అని విలేకరులు అడ్డు తగిలారు. ‘‘ప్రశ్నలు వేయడమే జ్ఞానమని ఉపనిషత్తులు చెబుతున్నాయి. సమాధానం చెప్పడమే అజ్ఞానమని సామవేదం చెబుతోంది. వేదం వల్ల నిర్వేదం, నిర్వేదం వల్ల నిర్వికారం సంభవిస్తాయి. సంభవామి యుగే యుగే అంటే సంభావన లేకుండా ఏ యుగం నడవదని అర్థం. సామాన్యుడి చేతికి చిప్పనివ్వడమే అర్థశాస్త్రం. చిప్పలకు డిమాండ్ పెరిగినా, కొబ్బరి రైతుకు నష్టమొస్తే అది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.’’
‘‘మీరు సమైక్యానికి అనుకూలమా?’’
‘‘అనుకూల ప్రతికూలతల వల్ల సానుకూలత, సమైక్యం వల్ల ఐక్యత, ఐక్యత వల్ల ఎడతెగని అనైక్యత వస్తాయి. సమంగా ఐక్యం కావడం అంటే భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావడమే. ఓటరుకీ నాయకుడికీ మధ్య అనుసంధానమే మా పార్టీ ఎజెండా. ఎన్నికలయ్యే వరకు ఓటరే దేవుడు. తరువాత ఐదేళ్లూ నాయకుడే వినాయకుడు. జెండాలు మోసేవాడికి పదవులు రావు. పదవులొచ్చేవాడు జెండాలు మోయడు.’’
‘‘సార్! మీరు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.’’
‘‘నోరున్నది మాట్లాడ్డానికే. మాటలున్నది ఇతరులకి చెప్పడానికేనని అలెగ్జాండర్ గ్రాహంబెల్ అన్నాడు. అందుకే ఆయన ఫోన్ కనిపెట్టాడు. ఫోన్ వల్ల పోయే కాలం, సెల్‌ఫోన్ వల్ల పైకి పోయే కాలం దాపురించాయి. గన్ పెన్‌ల కంటే ఫోన్ గొప్పది.’’
‘‘మీరు గోడ మీద పిల్లి.’’
‘‘కాదు ఓడ మీద పిల్లి. ఓడకి చిల్లు పడింది. పిల్లి ఓడలో ఉన్నా మునిగిపోతుంది. నీళ్లలోకి పడినా మునిగిపోతుంది. గోడ, ఓడ ముఖ్యం కాదు. పిల్లి ఉందా లేదా అన్నది ముఖ్యం. క్యాట్ ఈజ్ ఆల్వేస్ రైట్. వంద ఎలుకల కంటే ఒక పిల్లి గొప్పది. నో లెఫ్ట్ నో రైట్ ఓన్లీ క్యాట్’’ అంటూ ఒక కర్ర తీసుకుని ‘నాకు నచ్చనివి రాస్తే బడితె పూజ’ అని గిరగిర కర్ర తిప్పాడు.
ఆయన బుర్ర తిరుగుడుకి జడుసుకుని విలేకరులు బతుకు జీవుడా అంటూ పారిపోయారు.
- జి.ఆర్.మహర్షి
మహర్షిజం
శకునం చెప్పే బల్లి
అన్ని దేశాల్ని షటప్ అని బెదిరించే అమెరికా చివరికి షట్‌డౌన్
చేసుకుంది.
మన్మోహన్‌సింగ్ ఏం చేస్తున్నారు?
ఆర్డినెన్స్‌లు చించి ఆరేస్తున్నారు.
తెలుగుదేశం పరిస్థితి? ముందు గొయ్యి, వెనుక నుయ్యి, తలమీద పొయ్యి.
బాబన్న కొత్త పేరు బాబూ నరేంద్ర చంద్ర మోడీ
బుల్లెట్‌కి రివాల్వర్‌కి మధ్య తగాదా పెట్టడమే రాజకీయం!
రాహుల్‌గాంధీ ప్రత్యేకత?
పిట్ట కొంచెం కోతలు ఘనం