G.r. maharshi
-
కుంభమేళాలో తప్పిపోయిన కుర్రాడా!
కుళాయి తిప్పితే జలజల రాలేది కవిత్వం కాదు. అవి పైపుల్లోని నీళ్లు మాత్రమే. ఆత్మ మెలిదిరిగినపుడు, నరాలను పిండినప్పుడు, కాలిగోరు నుంచి పాములా పాకుతూ, కంటి నుంచి రాలే నిశ్శబ్దపు కన్నీటిబొట్టే కవిత్వం. ‘జీరోడిగ్రీ’లో ఆ కన్నీళ్లు గడ్డకట్టుకుపోయి అక్షరాలైనాయి. కవిత్వపు చక్కదనం, కన్నీటి చిక్కదనం తెలిసినవాడు మోహన్ రుషి. మోహన్ కొత్తగా ఏమీ చెప్పలేదు. అన్నీ మనకు తెలుసు. తెలిసినా గుర్తించం. గుర్తించినా అంగీకరించం, అంగీకరించినా మన లోపలి అరల్లో భద్రంగా దాస్తాం. ఆ రహస్యపు గాజుపెట్టెను అతను పగులగొట్టాడు. గాయపడ్డాడు, కట్టు కట్టుకోవడం తెలియనివాడు, కనికట్టు ఎరుగనివాడు. కుంభమేళాలో తప్పిపోయిన కుర్రాడు మోహన్ రుషి. మేళా మనల్ని అబ్బురపరుస్తుంది, భయపెడుతుంది. తప్పిపోయిన చాలామంది ఇళ్లు చేరుకోరు. వాళ్లకోసం ఎవరో వెతుకుతుంటారు. వాళ్లు ఇంకెవరినో వెతుకుతుంటారు. వెతకడంలోనే కొందరు బతుకును ముగిస్తారు. ఈ కవిత్వం అందరికీ ఒకేలా అర్థం కాకపోవచ్చు. అసలు అర్థమే కాకపోవచ్చు. ఇఫ్స్ అండ్ బట్స్‌తో సముదాయించుకోవాలని చూస్తే పెద్దగా వొరిగేది కూడా ఉండదు. ఒక పల్లెటూరి అబ్బాయి నగరానికొచ్చి తన ముఖాన్ని పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ ఈ కవిత్వం. కూలిన రాజ్యాలను పునర్నిర్మించొచ్చేమో కానీ, చెదిరిన ఆ పిచ్చుక గూడుని ఏ గడ్డిపోచలతోనూ తిరిగి కట్టలేరని అంటాడు మోహన్. ఈ ప్రపంచంలో చాలామంది పైకి మనుషులు, లోపల ‘గొల్లుంలు’. గొల్లుం అంటే మనిషి కాదు. జంతువు కాదు. వినయంగా ఉంటూ వంకీ కత్తితో పొడుస్తాడు. నవ్వుతూ రక్తం తాగుతాడు. పసితనంలోనే వృద్ధుడు (లార్డ్ ఆఫ్ ద రింగ్స్ పుస్తకంలో ఒక పాత్ర పేరు గొల్లుం). బ్రాండెడ్ బట్టల ముసుగులో ఈ జంతువులు ఎక్కువై లైఫ్‌స్కిల్స్‌కి సానపెడుతూ మనుషుల్ని పీక్కుతింటున్నాయి. వేటగాళ్లని వేటాడితే తప్ప, బతకలేని నగరంలో తెగిపోయిన పతంగుల్ని ఎగరేసే ప్రయత్నంలో ఉన్నవాడు మోహన్. ఈ పుస్తకాన్ని అమ్మకి అంకితమిచ్చాడు. ‘లోకం మెచ్చని నా బతుకుని లోకంగా చేసుకున్న అమ్మ రాజమల్లమ్మకు’ అన్నాడు. ఈ వాక్యమే అతి గొప్ప ఆర్ట్ పీస్. - జి.ఆర్.మహర్షి -
ఇండియాలో దాగిన హిందుస్తాన్ ఆసక్తి రేపే పుస్తకం
తాజా పుస్తకం గతం నుంచి వర్తమానం, వర్తమానం నుంచి భవిష్యత్తు నిర్మితమవుతాయి. చరిత్ర కూడా ఇలాగే అడుగులు వేస్తూ వెళుతుంది. ఒక్కోసారి తప్పటడుగులు కూడా. అయితే తప్పటడుగులు వేసిన వారికి తమ తప్పిదాలు తెలియకపోవచ్చు. ముందు తరాల వారు వాటిని గుర్తిస్తారు. గాంధీలో ఉన్న హిందుత్వ భావనే దేశ విభజనకు కారణమైందని, ఆ తరువాత నెహ్రూ దాన్ని పెంచి పోషించాడని ఈ పుస్తక రచయిత పెరి అండర్సన్ అంటారు. పెరి అండర్సన్ ఆంగ్లో-ఐరిష్ రచయిత. ప్రముఖ మార్క్సిస్టు మేధావి. ఆయన గతంలో ‘ఇండియన్ ఐడియాలజీ’ పేరుతో ఇంగ్లిష్‌లో రాసిన పుస్తకమే ఇప్పుడు ‘ఇండియాలో దాగిన హిందుస్తాన్’ పేరుతో అనువాదమై వెలువడింది. ఈ పుస్తకంలోని అంశాలను మనం సమర్థించవచ్చు. లేదా విమర్శించవచ్చు. కాని చర్చించాల్సిన విషయాలు కొన్ని ఇలా ఉన్నాయి. ఇండియా అన్న భావనే యూరప్ నుంచి సంక్రమించింది. ఎందుకంటే అంతకు ముందు అది చిన్న చిన్న రాజ్యాల సమూహం. అందుకే బ్రిటిష్‌వాళ్లు సులభంగా జయించి ఒక్కటి చేశారు. లౌకికవాదాన్ని అనుసరించే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీకి చేతికి వచ్చిన తరువాత పురాణాలు, మత ధర్మశాస్త్రాలను చొప్పించి ఆయనకు తెలియకుండానే హిందుత్వని అమలు చేశారు. గాంధీ పట్ల ముస్లింల అపనమ్మకానికి ఇది బీజం వేసింది. మున్ముందు ఇది దేశవిభజనకు దారి తీసింది. 1922లో చౌరీచౌరాలో పోలీసులపై హింస జరిగినందుకు నిరసనగా దేశవ్యాప్త ఉద్యమాన్ని నిలుపుదల చేయించిన గాంధీ, రెండవ ప్రపంచ యుద్ధాన్ని సమర్థించడమే కాకుండా సైన్యంలో చేరమని కూడా పిలుపునిచ్చారు. ఆయన అహింసాయుధంపై ఆయనకే స్పష్టత లేదు. అంటరానివాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలను మంజూరు చేస్తూ బ్రిటిష్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా గాంధీ చేశారు. నిస్సహాయ స్థితిలో అంబేద్కర్ కూడా గాంధీకి లొంగిపోయారు. ఈ విషయమై చనిపోయేవరకూ అంబేద్కర్ బాధ పడుతూనే ఉన్నారు. నెహ్రూకి గాఢమైన మత విశ్వాసాలు లేకపోయినా అనేక అంశాల్లో గాంధీ హిందుత్వనే ఆయన అనుసరించాడు. కాశ్మీర్ విషయంలో నెహ్రూ చేసిన తప్పిదాల వల్లే ఈనాటికీ రక్తం ఏరులై పారుతోంది. వ్యక్తిగత ఇష్టాయిష్టాలను రాజకీయాలకు ముడిపెట్టే అలవాటు నెహ్రూకి ఉంది. బహిరంగ సభలో నాగాలాండ్ ప్రజలు తనకి పిరుదులు చూపించి అవమానించారనే కోపంతో ఆయన నాగాలాండ్‌పై కర్కశంగా ప్రవర్తించారు. (‘గాంధీ అనంతర భారతదేశం’ పుస్తకంలో రామచంద్ర గుహ కూడా ఇదే చెబుతారు) మతతత్వం వల్ల లబ్ది చేకూరుతుందనుకుంటే బిజెపి, కాంగ్రెస్‌లు ఒకేలా వ్యవహరిస్తాయి. 2002లో గుజరాత్లో చనిపోయిన వారి కంటే 1984లో ఢిల్లీలో జరిగిన ఊచకోతలో చనిపోయిన వాళ్ల సంఖ్యే ఎక్కువ.రాజకీయాలపై ఆసక్తి ఉన్న వాళ్లందరూ చదవాల్సిన పుస్తకమిది. - జి.ఆర్.మహర్షి ఇండియాలో దాగిన హిందుస్తాన్- పెరి అండర్సన్; హెచ్.బి.టి ప్రచురణ; వెల: రూ.150; ప్రతులకు: 040- 23521849 -
హ్యూమరం: ఓడ మీద పిల్లి
విలేకరుల సమావేశం. మైకు తీసుకున్న చంద్రబాబు, ‘‘ఢిల్లీవాళ్లకు బుద్ధి లేదు. కాంగ్రెస్ నాయకులకు తలా తోకా లేదు’’ అని తిట్లు ఎత్తుకున్నాడు. ‘‘విభజనకు మీరు అనుకూలమా? వ్యతిరేకమా?’’ అని విలేకరులు అడిగారు. ‘‘విభజన అనే పదంలో భజన ఉంది. భక్తితో జనం పాడే పాటని భజన అంటారు. వి అంటే విక్టరీ. గతంలో నేను రెండు వేళ్లు చూపించేవాడిని. దానికి వేరే అర్థముందని తెలిసి మానేశాను. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికేయడమే రాజకీయం. అన్నింట్లో వేలు పెడితే మన వేలితో మన కన్ను పొడుస్తారు.’’ ‘‘మేము అడిగిన ప్రశ్నేంటి?’’ అని విలేకరులు అడ్డు తగిలారు. ‘‘ప్రశ్నలు వేయడమే జ్ఞానమని ఉపనిషత్తులు చెబుతున్నాయి. సమాధానం చెప్పడమే అజ్ఞానమని సామవేదం చెబుతోంది. వేదం వల్ల నిర్వేదం, నిర్వేదం వల్ల నిర్వికారం సంభవిస్తాయి. సంభవామి యుగే యుగే అంటే సంభావన లేకుండా ఏ యుగం నడవదని అర్థం. సామాన్యుడి చేతికి చిప్పనివ్వడమే అర్థశాస్త్రం. చిప్పలకు డిమాండ్ పెరిగినా, కొబ్బరి రైతుకు నష్టమొస్తే అది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.’’ ‘‘మీరు సమైక్యానికి అనుకూలమా?’’ ‘‘అనుకూల ప్రతికూలతల వల్ల సానుకూలత, సమైక్యం వల్ల ఐక్యత, ఐక్యత వల్ల ఎడతెగని అనైక్యత వస్తాయి. సమంగా ఐక్యం కావడం అంటే భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావడమే. ఓటరుకీ నాయకుడికీ మధ్య అనుసంధానమే మా పార్టీ ఎజెండా. ఎన్నికలయ్యే వరకు ఓటరే దేవుడు. తరువాత ఐదేళ్లూ నాయకుడే వినాయకుడు. జెండాలు మోసేవాడికి పదవులు రావు. పదవులొచ్చేవాడు జెండాలు మోయడు.’’ ‘‘సార్! మీరు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.’’ ‘‘నోరున్నది మాట్లాడ్డానికే. మాటలున్నది ఇతరులకి చెప్పడానికేనని అలెగ్జాండర్ గ్రాహంబెల్ అన్నాడు. అందుకే ఆయన ఫోన్ కనిపెట్టాడు. ఫోన్ వల్ల పోయే కాలం, సెల్‌ఫోన్ వల్ల పైకి పోయే కాలం దాపురించాయి. గన్ పెన్‌ల కంటే ఫోన్ గొప్పది.’’ ‘‘మీరు గోడ మీద పిల్లి.’’ ‘‘కాదు ఓడ మీద పిల్లి. ఓడకి చిల్లు పడింది. పిల్లి ఓడలో ఉన్నా మునిగిపోతుంది. నీళ్లలోకి పడినా మునిగిపోతుంది. గోడ, ఓడ ముఖ్యం కాదు. పిల్లి ఉందా లేదా అన్నది ముఖ్యం. క్యాట్ ఈజ్ ఆల్వేస్ రైట్. వంద ఎలుకల కంటే ఒక పిల్లి గొప్పది. నో లెఫ్ట్ నో రైట్ ఓన్లీ క్యాట్’’ అంటూ ఒక కర్ర తీసుకుని ‘నాకు నచ్చనివి రాస్తే బడితె పూజ’ అని గిరగిర కర్ర తిప్పాడు. ఆయన బుర్ర తిరుగుడుకి జడుసుకుని విలేకరులు బతుకు జీవుడా అంటూ పారిపోయారు. - జి.ఆర్.మహర్షి మహర్షిజం శకునం చెప్పే బల్లి అన్ని దేశాల్ని షటప్ అని బెదిరించే అమెరికా చివరికి షట్‌డౌన్ చేసుకుంది. మన్మోహన్సింగ్ ఏం చేస్తున్నారు? ఆర్డినెన్స్‌లు చించి ఆరేస్తున్నారు. తెలుగుదేశం పరిస్థితి? ముందు గొయ్యి, వెనుక నుయ్యి, తలమీద పొయ్యి. బాబన్న కొత్త పేరు బాబూ నరేంద్ర చంద్ర మోడీ బుల్లెట్‌కి రివాల్వర్‌కి మధ్య తగాదా పెట్టడమే రాజకీయం! రాహుల్‌గాంధీ ప్రత్యేకత? పిట్ట కొంచెం కోతలు ఘనం