హ్యూమరం: రాజకీయ నాటకం
రవీంద్రభారతిలో రాజకీయ నాటకోత్సవాలు. కిరణ్‌కుమార్‌రెడ్డిని, చంద్రబాబుని ముఖ్య అతిథులుగా పిలిచారు.చంద్రబాబు మైక్ తీసుకున్నాడు: ‘‘మొహానికి రంగేస్తే నాటకం. రంగు లేకుంటే రాజకీయం. నాటకం లేకుండా రాజకీయం లేదు. రాజకీయం లేకుండా నాటకం ఉండొచ్చు. ప్రేక్షకులున్నా లేకపోయినా నాటకం ఆగకూడదు. ఎవరి నటనకు వాళ్లే చప్పట్లు కొట్టుకుని, అవార్డులు ప్రకటించుకుంటే పాలిటిక్స్‌లో పైకొస్తాం. వెనుకటికి రోజుకో నాటకం ఆడేవాళ్లం. ఇప్పుడు గంటకో నాటకం ఆడితేనే ప్రజలకు వినోదం. రాజకీయాలు, నాటకాలు కలిసిపోయిన తరువాత జనం అసలు నాటకాలను చూడటం మానేశారు. కానీ రాజకీయం బతికున్నంతకాలం నాటకం బతికుంటుందని, ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను’’ అని ముగించాడు.
కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, ‘‘నాటకాల్లో చంద్రబాబు సీనియర్. ఆయన మా తండ్రిగారి హయాం నుంచి నాటకాలు ఆడుతున్నారు. అందువల్ల గత రెండేళ్ల నుంచి ఆయనతో శిక్షణ పొంది, రకరకాల నాటకాలతో జనాల్ని చల్లబరుస్తున్నాను. నా డెరైక్షన్ మేరకు ఆయన డైలాగులు చెబుతున్నాడు. ఆయన దర్శకత్వంలో నేను యాక్షన్ చేస్తున్నాను. ప్రభుత్వం పడిపోకుండా ప్రతిపక్ష నేత కాపాడటమే అన్నిటికంటే గొప్ప డ్రామా’’ అన్నాడు.
హఠాత్తుగా చిరంజీవి రంగప్రవేశం చేసి, ‘‘నన్ను పిలవకుండా నాటకోత్సవాలు జరపడం అన్యాయం. వాళ్లిద్దరికీ ఏది నాటకమో ఏది రాజకీయమో తెలుసు. నాకు తెలియదు. అందుకే రంగు పూసుకుని రాజకీయాల్లోకి వచ్చేసరికి రంగు పడింది. తెరపై నటిస్తే చప్పట్లు కొట్టిన జనం, రాజకీయాల్లో నటిస్తే తెర ఎందుకు దించారో తెలియదు’’ అన్నాడు.
నిర్వాహకులు వచ్చి, ‘‘జనాన్ని మరిచిపోయి టూరిజానికి అలవాటు పడిన కేంద్రమంత్రి చిరంజీవి అర్జెంట్‌గా టూర్ వెళ్లాల్సి ఉన్నందువల్ల, మొదట ఏకపాత్రాభినయం చేస్తారు’’ అని ప్రకటించారు.
చిరంజీవి స్టేజీమీదకొచ్చి అయిదు నిమిషాల పాటు పెదాలు కదిలించాడు. ‘సౌండ్’ అని జనం అరిచినా పట్టించుకోలేదు. ‘‘సౌండ్‌లు, రీసౌండ్‌లు ఆయనెప్పుడో మరిచిపోయి సెలైంట్‌గా మారిపోయారు. ఏం మాట్లాడితే జనంతో ఏం ప్రమాదమోనని మూకాభినయం చేసి వెళ్లిపోయారు’’ అని నిర్వాహకులు వివరణిచ్చారు.
తరువాత కృష్ణుడి వేషంలో చంద్రబాబు, అర్జునుడి వేషంలో కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చారు. రావడం రావడమే ‘ఇచ్చోటనే...’ అని పద్యం ఎత్తుకున్నాడు చంద్రబాబు.
‘‘సార్! మీరు వేసింది కృష్ణుడి వేషం. పాడుతున్నది హరిశ్చంద్ర పద్యం’’ అని నిర్వాహకులు సరిచేయడానికి ప్రయత్నించారు.
‘‘వేషానికి తగిన పద్యం, సందర్భానికి తగినట్టు సంభాషణలు చెప్పడం నా డిక్షనరీలోనే లేదు’’ అన్నాడు బాబు.
వెంటనే కిరణ్‌కుమార్‌రెడ్డి ‘ధారుణి రాజ్యసంపద’ అని ఢిల్లీకి తొడగొట్టి పద్యం పాడాడు.
నిర్వాహకులొచ్చి, ‘‘వాళ్లు రోజుకో రకం నాటకం ఆడ్డం వల్ల పాత్రలు, పద్యాలు మరిచిపోయారు. ఈసారి ఎన్నికల్లో సినిమా చూపించి వాళ్ల నాటకాన్ని బంద్ చేయండి’’ అని విన్నవించుకున్నారు.
- జి.ఆర్.మహర్షి
మహర్షిజం
అనంతపురం సామెత: నక్కను నమ్మిన సింహం, సింహాన్ని నమ్మిన జింక రెండూ ఒకటే!
పల్నాడు సామెత:
సింహాన్ని భయపెట్టాలంటే ముందు
తోడేలుని చంపాలి.
తెలుగు తమ్ముని ఆవేదన:
కోళ్లబుట్టలో చేయి పెడుతున్నాననుకుని
మా చంద్రబాబు తేళ్లబుట్టలో చేయిపెట్టాడు.
దురదృష్టం:
పులి ఎదురైనప్పుడు బుల్లెట్ల కోసం వెతుక్కోవడం!
నెల్లూరు సామెత:
ఆరు నూరయ్యే వరకు నోరు మూసుకోకూడదు.
చిత్తూరు సామెత:
మేకను నరకడానికి ముందు మెడ నిమరాలి!