తెలంగాణ వ్యతిరేకిని కాను | i am not oppose of telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ వ్యతిరేకిని కాను

Published Mon, Apr 14 2014 12:37 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

తెలంగాణ  వ్యతిరేకిని కాను - Sakshi

తెలంగాణ వ్యతిరేకిని కాను

 సాక్షి ప్రతినిధి సంగారెడ్డి: గుబురు గడ్డం.. కురుల జుట్టు.. కలుపుగోలుతత్వం.. అంతకు మించిన ఆవేశం.. అన్నీ కలిస్తే తూర్పు జగ్గారెడ్డి. ఒక ప్రత్యేక సామాజిక వర్గానికి వ్యతిరేకిగా ముద్రపడ్డ ఆయన ఆదివారం వాళ్లతోనే గడుపుతూ కనిపించారు. వారిని బుజ్జగిస్తున్నారు.. బాస చేస్తున్నారు.. మొత్తానికి ఓట్ల కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ‘సాక్షి ప్రతి నిధి’ని చూడగానే నవ్వుతూ పేపరోళ్లకు ఇక్కడేం పనండీ అంటూ దగ్గరకొచ్చారు. ఈ మాజీ ప్రభుత్వ విప్ తన మనసులోని భావాలను ఠమొదటిపేజీ తరువాయి
 ‘సాక్షి’తో పంచుకున్నారు. తాను తెలంగాణ వ్యతిరేకిని కాదు అంటూనే సమైక్యంలోనే అభివృద్ధి జరుగుతుందని భావించినట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభావం కనీసం మెదక్ పార్లమెంటుపై కూడా ఉండదని, ఆయనకు ఓటమి తప్పదని కుండబద్దలు కొట్టారు. జగ్గారెడ్డితో సాక్షి ప్రతినిధి ఇంటర్వ్యూ ఇలా సాగింది.

 సాక్షి : సంగారెడ్డి అసెంబ్లీపై కేసీఆర్ ప్రభావం ఉంటుంది కదా? గెలుపు కోసం మీరు ఎలాంటి వ్యూహాలు చేస్తున్నారు?  
 జగ్గారెడ్డి: కేసీఆర్ ప్రభావం సంగారెడ్డి అసెంబ్లీ స్థానం మీదనే కాదు, అసలు మెదక్ పార్లమెంటు మీదనే ఉండదు. మీరు రాసుకోండి.. కేసీఆర్ ఓడిపోవడం ఖాయం. మెదక్ పార్లమెంటు మీద కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయం. మా పార్టీ అభ్యర్థి శ్రవణ్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారు. తెలంగాణ వచ్చాక కూడా కేసీఆర్ ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది తెలంగాణ వికాసం. ఇప్పటికీ దాన్ని అడ్డుకోవటం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రజలకు దూరంగా ఉంటారు, అభివృద్ధికి ఇంకా దూరంగా ఉంటారు. అందుకే నేను కేసీఆర్‌తో విభేదించాను. ఇక నేను గెలవటం కోసం ప్రత్యేక వ్యూహాలు అవసరం లేదు. నేను చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయి.

 సాక్షి: అభివృద్ధి పనులు గెలిపిస్తాయని అనుకున్నప్పుడు  కార్యకర్తలను రాక్ గార్డెన్‌కు పిలిచి ఎందుకు సెల్‌ఫోన్లు, కుక్కర్లు పంచారు?
 జగ్గారెడ్డి: సికింద్రాబాద్ రాక్ గార్డెన్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి నేను వెళ్లాను, అది చాలా పెద్ద గార్డెన్, పక్కనే వేరే వాళ్ల ఫంక్షన్ ఏదో జరుగుతోంది. టీఆర్‌ఎస్, ఆ పార్టీ టీ ఛానల్  కుట్రలు చేసి లేనివాటిని నాకు ఆపాదించే ప్రయత్నం చేసింది. ఫంక్షన్ హాల్లో ఉన్న కుక్కర్లు, మద్యం బాటిల్స్ తెచ్చి నాకు ఆపాదించారు. సెల్‌ఫ్లోన్లు ఎలా వచ్చాయో విచారణలో తేలుతుంది. ఇలాంటి కుట్రలతో జగ్గారెడ్డి మెజార్టీని తగ్గించలేరు.

 సాక్షి: అవసరం అయితే పోలింగ్ బూత్ క్యాప్చర్ చేయాలని గతంలో మీరు కార్యకర్తలకు నూరిపోశారు కదా?
 జగ్గారెడ్డి: మనిషి ముందు ఒక మాట, మనిషి వెనుక ఒక మాట మాట్లాడే తత్వం కాదు నాది. బరాబర్ ‘బూత్ క్యాప్చర్’ అనే పదం అన్న. అది ఏ సందర్భంలో అన్నానో చెప్తా. ఎన్నికల కోడ్ ఇంకా అమల్లోకి రానప్పుడు కార్యకర్తల మీటింగ్ పెట్టాను. ప్రతి కాంగ్రెస్  కార్యకర్త సైనికునిగా పని చేయాలని చెప్పిన. లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరా. రాజకీయ విశ్లేషకులు చూసినప్పుడు కార్యకర్తలు బూత్ క్యాప్చర్ చేశారా...! అనే అనుకునేంతమెజార్టీతో గెలిపించాలని చెప్పిన. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసం అన్న మాటలు. ఇందులో తప్పుందా?

 సాక్షి: మీరు సమైక్యవాది కదా?  ఎన్నికలకు ఎలా వెళ్తారు?
 జగ్గారెడ్డి: నేను తెలంగాణ వ్యతిరేకిని కాదు, కాని సమైక్యంగా ఉంటేనే రాష్ర్టం అభివృద్ధి చెందుతుందని నమ్మాను. ఇక నేను ఏ నిర్ణయం తీసుకున్నా సంగారెడ్డి ప్రజల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా నా నియోజకవర్గం అభివృద్ధికి సహకరించారు. రూ. కోట్లు పట్టుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను.

 సాక్షి: వైఎస్సార్ సహాయం చేశారని చెప్తున్నారు, మరి ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో పెడుతున్నప్పుడు మీకు బాధ అనిపించలేదా?
 జగ్గారెడ్డి: ముఖ్యంగా వైఎస్సార్ మరణం నన్ను చాలా బాధపెట్టింది. ఎందుకు అలా జరిగిందిరా దేవుడా..! అని చాలాసార్లు బాధపడ్డాను. సంగారెడ్డి అభివృద్ధిలో వైఎస్సార్ నాకు సహకరించారు. ఆ తర్వాత ఆయన పేరు దోషిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పుడు కూడా బాధనిపించింది.
 
 సాక్షి: ముస్లిం సామాజిక వర్గానికి వ్యతిరేకమని మీ మీద ముద్ర ఉంది కాదా, వాళ్లు మీకు ఓట్లు ఎలా వేస్తారు?
 జగ్గారెడ్డి: నేను ముస్లిం సామాజిక వర్గానికి వ్యతిరేకమని టీఆర్‌ఎస్ విషప్రచారం చేస్తోంది. ఇందులో ఏమాత్రం నిజం లేదు. రేపు నాకు రాబోయే మెజార్టీలో సర్వ మతాల ప్రజల భాగస్వామ్యం ఉంటుంది. నన్ను ఆశీర్వాదించాలని ముస్లింలను చేతులు జోడించి అడుగుతున్నా.
 
 సాక్షి: మీకు ఫైర్‌బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది కదా? మీరు మొదటి నుంచి అంతేనా?
 జగ్గారెడ్డి: నిజమే.. మీరు అన్నట్టు నన్ను ఫైర్ బ్రాండ్ అంటారు. ఎదుటి వాళ్లు అన్యాయంగా అసత్యాలు, అర్థ సత్యాలు మాట్లాడినప్పుడు నేను చూస్తూ ఊరుకోలేను. కొంత ఆవేశానికి లోనవుతాను, కాని నేను ఎంత ఆవేశంతో మాట్లాడినా అనాలోచితంగా, అర్థరహితంగా, పూట గడుపుకోవడానికో మాత్రం మాట్లాడను.

 సాక్షి: ఫైర్‌బ్రాండ్ ఎన్నికల ముందు ఎందుకు మౌనముద్రలోకి వెళ్లింది? టికెట్ కోసమేనా?   
 జగ్గారెడ్డి: నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, ఆ తర్వాతే నాయకుణ్ణి. ఎన్నికల ముందు నేను మౌనంగా ఉన్న మాట నిజమే. దానికి కారణం టికెట్ నాకే వస్తుందనే విశ్వాసం, నమ్మకం నా కుంది. అందుకే మౌనంగా ఉండి పార్టీ క్యాడర్ గందరగోళానికి గురికాకుండా జాగ్రత్త పడ్డాను.

 సాక్షి:జైలుకు వెళ్లడం మీకు బాధ అనిపించిందా?
 జగ్గారెడ్డి: పోలీసులు, జైలు నాకు కొత్తకాదు, ప్రజల మధ్యకొచ్చి నిలబడ్డప్పుడు పోలీసు కేసులు సర్వసాధారణం. నేను మొన్న జైలుకు వెళ్లింది  కూడా ప్రజల కోసమే. ఇందులో బాధపడాల్సింది ఏముంది? చాలా గర్వపడ్డాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement