Dr ys rajasekha reddy
-
తెలంగాణ వ్యతిరేకిని కాను
సాక్షి ప్రతినిధి సంగారెడ్డి: గుబురు గడ్డం.. కురుల జుట్టు.. కలుపుగోలుతత్వం.. అంతకు మించిన ఆవేశం.. అన్నీ కలిస్తే తూర్పు జగ్గారెడ్డి. ఒక ప్రత్యేక సామాజిక వర్గానికి వ్యతిరేకిగా ముద్రపడ్డ ఆయన ఆదివారం వాళ్లతోనే గడుపుతూ కనిపించారు. వారిని బుజ్జగిస్తున్నారు.. బాస చేస్తున్నారు.. మొత్తానికి ఓట్ల కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ‘సాక్షి ప్రతి నిధి’ని చూడగానే నవ్వుతూ పేపరోళ్లకు ఇక్కడేం పనండీ అంటూ దగ్గరకొచ్చారు. ఈ మాజీ ప్రభుత్వ విప్ తన మనసులోని భావాలను ఠమొదటిపేజీ తరువాయి ‘సాక్షి’తో పంచుకున్నారు. తాను తెలంగాణ వ్యతిరేకిని కాదు అంటూనే సమైక్యంలోనే అభివృద్ధి జరుగుతుందని భావించినట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభావం కనీసం మెదక్ పార్లమెంటుపై కూడా ఉండదని, ఆయనకు ఓటమి తప్పదని కుండబద్దలు కొట్టారు. జగ్గారెడ్డితో సాక్షి ప్రతినిధి ఇంటర్వ్యూ ఇలా సాగింది. సాక్షి : సంగారెడ్డి అసెంబ్లీపై కేసీఆర్ ప్రభావం ఉంటుంది కదా? గెలుపు కోసం మీరు ఎలాంటి వ్యూహాలు చేస్తున్నారు? జగ్గారెడ్డి: కేసీఆర్ ప్రభావం సంగారెడ్డి అసెంబ్లీ స్థానం మీదనే కాదు, అసలు మెదక్ పార్లమెంటు మీదనే ఉండదు. మీరు రాసుకోండి.. కేసీఆర్ ఓడిపోవడం ఖాయం. మెదక్ పార్లమెంటు మీద కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయం. మా పార్టీ అభ్యర్థి శ్రవణ్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారు. తెలంగాణ వచ్చాక కూడా కేసీఆర్ ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది తెలంగాణ వికాసం. ఇప్పటికీ దాన్ని అడ్డుకోవటం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రజలకు దూరంగా ఉంటారు, అభివృద్ధికి ఇంకా దూరంగా ఉంటారు. అందుకే నేను కేసీఆర్‌తో విభేదించాను. ఇక నేను గెలవటం కోసం ప్రత్యేక వ్యూహాలు అవసరం లేదు. నేను చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయి. సాక్షి: అభివృద్ధి పనులు గెలిపిస్తాయని అనుకున్నప్పుడు కార్యకర్తలను రాక్ గార్డెన్‌కు పిలిచి ఎందుకు సెల్ఫోన్లు, కుక్కర్లు పంచారు? జగ్గారెడ్డి: సికింద్రాబాద్ రాక్ గార్డెన్లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి నేను వెళ్లాను, అది చాలా పెద్ద గార్డెన్, పక్కనే వేరే వాళ్ల ఫంక్షన్ ఏదో జరుగుతోంది. టీఆర్ఎస్, ఆ పార్టీ టీ ఛానల్ కుట్రలు చేసి లేనివాటిని నాకు ఆపాదించే ప్రయత్నం చేసింది. ఫంక్షన్ హాల్లో ఉన్న కుక్కర్లు, మద్యం బాటిల్స్ తెచ్చి నాకు ఆపాదించారు. సెల్‌ఫ్లోన్లు ఎలా వచ్చాయో విచారణలో తేలుతుంది. ఇలాంటి కుట్రలతో జగ్గారెడ్డి మెజార్టీని తగ్గించలేరు. సాక్షి: అవసరం అయితే పోలింగ్ బూత్ క్యాప్చర్ చేయాలని గతంలో మీరు కార్యకర్తలకు నూరిపోశారు కదా? జగ్గారెడ్డి: మనిషి ముందు ఒక మాట, మనిషి వెనుక ఒక మాట మాట్లాడే తత్వం కాదు నాది. బరాబర్ ‘బూత్ క్యాప్చర్’ అనే పదం అన్న. అది ఏ సందర్భంలో అన్నానో చెప్తా. ఎన్నికల కోడ్ ఇంకా అమల్లోకి రానప్పుడు కార్యకర్తల మీటింగ్ పెట్టాను. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికునిగా పని చేయాలని చెప్పిన. లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరా. రాజకీయ విశ్లేషకులు చూసినప్పుడు కార్యకర్తలు బూత్ క్యాప్చర్ చేశారా...! అనే అనుకునేంతమెజార్టీతో గెలిపించాలని చెప్పిన. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసం అన్న మాటలు. ఇందులో తప్పుందా? సాక్షి: మీరు సమైక్యవాది కదా? ఎన్నికలకు ఎలా వెళ్తారు? జగ్గారెడ్డి: నేను తెలంగాణ వ్యతిరేకిని కాదు, కాని సమైక్యంగా ఉంటేనే రాష్ర్టం అభివృద్ధి చెందుతుందని నమ్మాను. ఇక నేను ఏ నిర్ణయం తీసుకున్నా సంగారెడ్డి ప్రజల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా నా నియోజకవర్గం అభివృద్ధికి సహకరించారు. రూ. కోట్లు పట్టుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. సాక్షి: వైఎస్సార్ సహాయం చేశారని చెప్తున్నారు, మరి ఆయన పేరును ఎఫ్ఐఆర్లో పెడుతున్నప్పుడు మీకు బాధ అనిపించలేదా? జగ్గారెడ్డి: ముఖ్యంగా వైఎస్సార్ మరణం నన్ను చాలా బాధపెట్టింది. ఎందుకు అలా జరిగిందిరా దేవుడా..! అని చాలాసార్లు బాధపడ్డాను. సంగారెడ్డి అభివృద్ధిలో వైఎస్సార్ నాకు సహకరించారు. ఆ తర్వాత ఆయన పేరు దోషిగా ఎఫ్ఐఆర్లో చేర్చినప్పుడు కూడా బాధనిపించింది. సాక్షి: ముస్లిం సామాజిక వర్గానికి వ్యతిరేకమని మీ మీద ముద్ర ఉంది కాదా, వాళ్లు మీకు ఓట్లు ఎలా వేస్తారు? జగ్గారెడ్డి: నేను ముస్లిం సామాజిక వర్గానికి వ్యతిరేకమని టీఆర్ఎస్ విషప్రచారం చేస్తోంది. ఇందులో ఏమాత్రం నిజం లేదు. రేపు నాకు రాబోయే మెజార్టీలో సర్వ మతాల ప్రజల భాగస్వామ్యం ఉంటుంది. నన్ను ఆశీర్వాదించాలని ముస్లింలను చేతులు జోడించి అడుగుతున్నా. సాక్షి: మీకు ఫైర్‌బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది కదా? మీరు మొదటి నుంచి అంతేనా? జగ్గారెడ్డి: నిజమే.. మీరు అన్నట్టు నన్ను ఫైర్ బ్రాండ్ అంటారు. ఎదుటి వాళ్లు అన్యాయంగా అసత్యాలు, అర్థ సత్యాలు మాట్లాడినప్పుడు నేను చూస్తూ ఊరుకోలేను. కొంత ఆవేశానికి లోనవుతాను, కాని నేను ఎంత ఆవేశంతో మాట్లాడినా అనాలోచితంగా, అర్థరహితంగా, పూట గడుపుకోవడానికో మాత్రం మాట్లాడను. సాక్షి: ఫైర్‌బ్రాండ్ ఎన్నికల ముందు ఎందుకు మౌనముద్రలోకి వెళ్లింది? టికెట్ కోసమేనా? జగ్గారెడ్డి: నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, ఆ తర్వాతే నాయకుణ్ణి. ఎన్నికల ముందు నేను మౌనంగా ఉన్న మాట నిజమే. దానికి కారణం టికెట్ నాకే వస్తుందనే విశ్వాసం, నమ్మకం నా కుంది. అందుకే మౌనంగా ఉండి పార్టీ క్యాడర్ గందరగోళానికి గురికాకుండా జాగ్రత్త పడ్డాను. సాక్షి:జైలుకు వెళ్లడం మీకు బాధ అనిపించిందా? జగ్గారెడ్డి: పోలీసులు, జైలు నాకు కొత్తకాదు, ప్రజల మధ్యకొచ్చి నిలబడ్డప్పుడు పోలీసు కేసులు సర్వసాధారణం. నేను మొన్న జైలుకు వెళ్లింది కూడా ప్రజల కోసమే. ఇందులో బాధపడాల్సింది ఏముంది? చాలా గర్వపడ్డాను. -
‘సార్వత్రికా’నికి వైఎస్ఆర్సీపీ సిద్ధం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలతోపాటు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన, పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ సీపీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పేదల తరపున పోరాటాలు నిర్వహించిన పార్టీ ప్ర జలకు మరింత చేరువ కానుంది. ఇందులో భాగంగా, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు వీలుగా సమన్వయకర్తలను నియమించింది. కొత్తగా వీరే రెండు రోజుల క్రితం జహీరాబాద్ లోక్‌సభ, బోధన్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించిన వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరో ముగ్గురు సమన్వయకర్తలను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ శాసనసభ నియోజకవర్గానికి అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రూరల్ నియోజకవర్గానికి బొడ్డు గంగారెడ్డి (సిర్పూరు) సమసన్వయకర్తలుగా వ్యవహరిస్తారని అందులో పేర్కొన్నారు. చురుకైన నాయకులు బోధన్‌కు చెందిన రవీందర్‌రెడ్డి క్రియాశీలక రాజకీయాలలో ఉంటూ వైఎస్ఆర్ సీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. యువనాయకుడు అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి విద్యా ర్థి, యువజన కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. డిచ్పల్లి ఎమ్మెల్యేగా పని చేసిన అంతిరెడ్డి బాల్‌రెడ్డి కుమారుడైన శ్రీధర్‌రెడ్డి ఉన్నత విద్యనభ్యసించారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ మండలం సిర్పూరుకు చెందిన బొడ్డు గంగారెడ్డి (సిర్పూరు) జలగం వెంగళరావు కాలంలో జరిగిన విద్యార్థి ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. సర్పంచ్‌గా, ఎంపీటీసీ, పనిచేసిన ఆయన సతీమణి బొడ్డు సుచరిత ఎంపీపీగా పనిచేశారు. సిర్పూరుకు రోడ్డు వేయడం కోసం ఉద్యమాలు నిర్వహించి సిర్పూరు గంగారెడ్డి పేరు తెచ్చుకున్నారు. జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి మహమూద్ మొహి యొ ద్దీన్, బోధన్‌కు ఎంఏ ఖాన్, కామారెడ్డికి చిల్కూరు కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డికి పటోళ్ల సిద్దార్థరెడ్డి, జుక్కల్‌కు నాయుడు ప్రకాశ్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. నా యుడు ప్రకాశ్ జిల్లా ఎన్నికల పరిశీలకులుగా కూడా ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికపైన పార్టీ కసరత్తు చేస్తుండటం రాజకీయవర్గాలలో చర్చనీయాంశం అవుతోంది. -
వైఎస్ బతికి ఉంటే వాన్‌పిక్ పూర్తయ్యేది
అరండల్‌పేట,(గుంటూరు) న్యూస్‌లైన్: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే ‘వాన్‌పిక్’ను పూర్తిచేసి ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేవారని వెఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని తీరప్రాంతాన్ని అభివృద్ధి చేసి అక్కడి ప్రజల స్థితిగతులు మార్చాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ భావించడంతో ప్రకాశం జిల్లాలోని ఓడరేవు, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నంను అనుసంధానం చేస్తూ వాన్‌పిక్ కారిడార్‌గా అభివృద్ధి చేసేందుకు అప్పటి మంత్రి వర్గం సమష్టిగా నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో ఎటువంటి అక్రమాలు జరగలేదని ఆయన తెలిపారు. 19 నెలల తర్వాత తొలిసారిగా జిల్లా కేంద్రమైన గుంటూరుకు వచ్చిన ఆయనకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోపిదేవి మాట్లాడారు. వైఎస్ మరణానంతరం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను సక్రమంగా అమలు చేయడంలేదని, ఆయన ఆశయాలను సజీవంగా ఉంచేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్లడంతో బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ఓర్చుకోలేని ఢిల్లీ పెద్దలు, పాలక, ప్రతిపక్షాలు కుమ్మక్కై అక్రమకేసులు బనాయించాయన్నారు. ఆయన్ను అరెస్ట్ చేసే ముందు తననూ బలిచేశారన్నారు. కేసులు నుంచి నిర్దోషిగా బయట పడతానని, న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందన్నారు. సమైక్యాంధ్ర అంటూ ముఖ్యమంత్రి, ఎంపీలు, మంత్రులు నాటకమాడుతున్నారని వారి మాటలను ఢిల్లీపెద్దలు వినే ప్రసక్తేలేదన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం - మర్రి రాజశేఖర్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అకారణంగా, అన్యాయంగా మాజీ మంత్రి మోపిదేవిని 16 నెలలు జైల్లో ఉంచారన్నారు. మోపిదేవికి జరిగిన అన్యాయం ప్రజలందరికీ కనపడుతుందన్నారు.మోపిదేవి నాయకత్వంలో జిల్లాలో వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం అవుతుందని, ఆయన అందరికీ మార్గదర్శకంగా ఉంటారన్నారు. ఈ సమావేశంలో నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, వాణిజ్య విభాగం కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, సమన్వయకర్తలు అనూప్, రాతంశెట్టి సీతారామాంజనేయులు, బొల్లా బ్రహ్మనాయుడు, షౌకత్, పార్టీ నాయకులు మహ్మద్ ముస్తాఫా, మేరిగ విజయలక్ష్మీ, దర్శనపు శ్రీనివాస్, శాఖమూరి నారాయణప్రసాద్ తదితరులు ఉన్నారు. పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన నాయకులతో సమావేశమై మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఎన్నికలకు ఎన్నో రోజులు లేవని, ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. జిల్లాలో అన్ని సీట్లను గెలవాలని మార్గదర్శకం చేశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. -
వంశధారకు సుప్రీం వరం
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మానస పుత్రిక, శ్రీకాకుళం జిల్లావాసుల కలల ప్రాజెక్టు సాకారానికి మార్గం సుగమమైంది. జిల్లాను సస్యశ్యామలం చేసే వంశధార ఫేజ్-2 ప్రాజెక్టుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుపై సరిహద్దు ఒడిశా రాష్ట్రం లేవనెత్తిన అభ్యంతరాలను కోర్టు తిరస్కరించింది. దీంతో వంశధార నది నుంచి 5 టీఎంసీల నీటిని అదనంగా వినియోగించుకునే వెసులుబాటు మన రాష్ట్రానికి లభించింది. ప్రాజెక్టు పూర్తి అయితే సుమారు 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 70 శాతం వ్యవసాయాధారితమైన శ్రీకాకుళం జిల్లాకు పూర్తిస్థాయి సాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి స్పందించి రూ.900 కోట్ల అంచనా వ్యయంతో వంశధార ఫేజ్-2 ప్రాజెక్టు మంజూరు చేశారు. ఇందులో భాగంగా నేరడి వద్ద బ్యారేజీ, కాట్రగడ వద్ద సైడ్ వియర్ నిర్మించాలని నిర్ణయించారు. అడుగడుగునా ఒడిశా ఆటంకాలు అయితే ఈ ప్రాజెక్టుపై సరిహద్దు రాష్ట్రమైన ఒడిశా అభ్యంతరాలు లేవదీసింది. అనేక ఆటంకాలు సృష్టించింది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రంలోని భూమి ముంపునకు గురవుతుందని వాదించింది. ఆంధ్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. చివరికి ఒడిశాలోని 100 ఎకరాలు ముంపునకు గురవుతాయని గుర్తించిన ఆంధ్ర ప్రభుత్వం అప్పట్లో ఆ భములకు నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. నేరడీ బ్యారేజ్, కాట్రగడ సైడ్ వియర్ల నిర్మాణంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దిగువనున్న ఆంధ్రప్రదేశ్ అదనపు జలాలను వినియోగించుకుంటే తమకు నష్టం వాటిల్లుతుందని కూడా అభ్యంతరం చెప్పింది. ఆ మేరకు సుప్రీంకోర్టు స్టే మంజూరు చేయడంతో బ్యారేజీ, సైడ్ వియర్ నిర్మాణాలు నిలిచిపోయాయి. అయితే ఆంధ్ర రాష్ట్రానిది న్యాయమైన వాదన కావడంతో సుప్రీంకోర్టు నుంచి అనుకూల తీర్పు వస్తుందన్న నమ్మకంతో ఆ రెండింటినీ మినహాయించి మిగిలిన పనులు పూర్తి చేయాలని అప్పట్లో వైఎస్ ఆదేశించడంతో కాలువల నిర్మాణం దాదాపు పూర్తి అయ్యింది. సైడ్ వియర్, బ్యారేజీ నిర్మించకపోవడంతో పంటలకు నీరందించలేని పరిస్థితి ఏర్పడింది. ఆది నుంచీ అదే తీరు ఈ ప్రాజెక్టు విషయంలో మొదటి నుంచీ ఒడిశా వితండవాదం చేస్తోంది. తనకు కేటాయించిన నీటినే వాడుకోలేని పరిస్థితుల్లో ఆంధ్ర వాటాను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. వంశధారలో ఏటా 105 టీఎంసీల జలాలు సముద్రంలో వృథాగా కలిసిపోతున్నాయని నిపుణులు లెక్కగట్టారు. ఆ మేరకు రెండు రాష్ట్రాలు చెరో 52.5 టీఎంసీల నీటిని వాడుకునేలా 1967లో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఎగువనున్న ఒడిశా రాష్ట్రం ఎన్నో అడ్డంకులు సృష్టించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇబ్బందుల పాల్జేసింది. తనకు కేటాయించిన 52.5 టీఎంసీల్లో 2 శాతాన్ని కూడా ఆ రాష్ట్రం వినియోగించుకోవడం లేదు. అదే సమయంలో మన రాష్ట్రం తన వాటాలో 15 టీఎంసీల నీటిని వినియోగించుకుంటోంది. వంశధార ఫేజ్-2 ప్రాజెక్టు పూర్త అయితే మరో 5 టీఎంసీల వరకు వినియోగించుకోవచ్చని యోచించింది. ఈ అదనపు వినియోగాన్ని, ముంపు సమస్యను బూచిగా చూపుతూ ఒడిశా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై క్షేత్ర పరిశీలనకు సుప్రీంకోర్టు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఆ మేరకు ట్రిబ్యునల్ సభ్యులు ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు రాష్ట్రాల్లోని వంశధార పరివాహక ప్రాంతాలను, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను, కొత్త ప్రాజెక్టు నిర్మాణ స్థలాలను పరిశీలించారు. మన రాష్ట్రంలో వీరి పర్యటన సాఫీగా సాగినా.. ఒడిశాలో మాత్రం పలువురు రాజకీయ నాయకులు ప్రజలను రెచ్చగొట్టి ట్రిబ్యునల్ సభ్యులను అడ్డుకోవడం, వారిని తరమడం వరకు వెళ్లారు. అయితే పోలీసుల సాయంతో బృందం సభ్యులు కూలంకుషంగా పరిశీలించి, నిపుణులు, ఇరు రాష్ట్రాల ఇంజినీరింగ్ అధికారుల అభిప్రాయాలు తీసుకొని సమగ్ర నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఈ నివేదిక అధారంగా ఒడిశా అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఫేజ్-2లో భాగంగా ప్రస్తుతానికి కాట్రగడ వద్ద సైడ్ వియర్ నిర్మించి, అదనపు నీరు వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. నేరడి రిజర్వాయర్ విషయం తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. దీని వల్ల శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్‌లో 2.50 లక్షలు, రబీలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని నీటిపారుదల అధికారులు తెలిపారు.