వంశధారకు సుప్రీం వరం | supreme gift for vansadhara | Sakshi
Sakshi News home page

వంశధారకు సుప్రీం వరం

Published Wed, Dec 18 2013 3:36 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

supreme gift for vansadhara

శ్రీకాకుళం, న్యూస్‌లైన్:  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మానస పుత్రిక, శ్రీకాకుళం జిల్లావాసుల కలల ప్రాజెక్టు సాకారానికి మార్గం సుగమమైంది. జిల్లాను సస్యశ్యామలం చేసే వంశధార ఫేజ్-2 ప్రాజెక్టుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుపై సరిహద్దు ఒడిశా రాష్ట్రం లేవనెత్తిన అభ్యంతరాలను కోర్టు తిరస్కరించింది. దీంతో వంశధార నది నుంచి 5 టీఎంసీల నీటిని అదనంగా వినియోగించుకునే వెసులుబాటు మన రాష్ట్రానికి లభించింది. ప్రాజెక్టు పూర్తి అయితే సుమారు 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
 70 శాతం వ్యవసాయాధారితమైన శ్రీకాకుళం జిల్లాకు పూర్తిస్థాయి సాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి స్పందించి రూ.900 కోట్ల అంచనా వ్యయంతో వంశధార ఫేజ్-2 ప్రాజెక్టు మంజూరు చేశారు. ఇందులో భాగంగా నేరడి వద్ద బ్యారేజీ, కాట్రగడ వద్ద సైడ్ వియర్ నిర్మించాలని నిర్ణయించారు.
 అడుగడుగునా ఒడిశా ఆటంకాలు
 అయితే ఈ ప్రాజెక్టుపై సరిహద్దు రాష్ట్రమైన ఒడిశా అభ్యంతరాలు లేవదీసింది. అనేక ఆటంకాలు సృష్టించింది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రంలోని భూమి ముంపునకు గురవుతుందని వాదించింది. ఆంధ్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. చివరికి ఒడిశాలోని 100 ఎకరాలు ముంపునకు గురవుతాయని గుర్తించిన ఆంధ్ర ప్రభుత్వం అప్పట్లో ఆ భములకు నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. నేరడీ బ్యారేజ్, కాట్రగడ సైడ్ వియర్‌ల నిర్మాణంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దిగువనున్న ఆంధ్రప్రదేశ్ అదనపు జలాలను వినియోగించుకుంటే తమకు నష్టం వాటిల్లుతుందని కూడా అభ్యంతరం చెప్పింది.

ఆ మేరకు సుప్రీంకోర్టు స్టే మంజూరు చేయడంతో బ్యారేజీ, సైడ్ వియర్ నిర్మాణాలు నిలిచిపోయాయి. అయితే ఆంధ్ర రాష్ట్రానిది న్యాయమైన వాదన కావడంతో సుప్రీంకోర్టు నుంచి అనుకూల తీర్పు వస్తుందన్న నమ్మకంతో ఆ రెండింటినీ మినహాయించి మిగిలిన పనులు పూర్తి చేయాలని అప్పట్లో వైఎస్ ఆదేశించడంతో కాలువల నిర్మాణం దాదాపు పూర్తి అయ్యింది. సైడ్ వియర్, బ్యారేజీ నిర్మించకపోవడంతో పంటలకు నీరందించలేని పరిస్థితి ఏర్పడింది.
 ఆది నుంచీ అదే తీరు
 ఈ ప్రాజెక్టు విషయంలో మొదటి నుంచీ ఒడిశా వితండవాదం చేస్తోంది. తనకు కేటాయించిన నీటినే వాడుకోలేని పరిస్థితుల్లో ఆంధ్ర వాటాను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. వంశధారలో ఏటా 105 టీఎంసీల జలాలు సముద్రంలో వృథాగా కలిసిపోతున్నాయని నిపుణులు లెక్కగట్టారు. ఆ మేరకు రెండు రాష్ట్రాలు చెరో 52.5 టీఎంసీల నీటిని వాడుకునేలా 1967లో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఎగువనున్న ఒడిశా రాష్ట్రం ఎన్నో అడ్డంకులు సృష్టించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇబ్బందుల పాల్జేసింది. తనకు కేటాయించిన 52.5 టీఎంసీల్లో 2 శాతాన్ని కూడా ఆ రాష్ట్రం వినియోగించుకోవడం లేదు. అదే సమయంలో మన రాష్ట్రం తన వాటాలో 15 టీఎంసీల నీటిని వినియోగించుకుంటోంది. వంశధార ఫేజ్-2 ప్రాజెక్టు పూర్త అయితే మరో 5 టీఎంసీల వరకు వినియోగించుకోవచ్చని యోచించింది.

ఈ అదనపు వినియోగాన్ని, ముంపు సమస్యను బూచిగా చూపుతూ ఒడిశా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై క్షేత్ర పరిశీలనకు సుప్రీంకోర్టు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఆ మేరకు ట్రిబ్యునల్ సభ్యులు ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు రాష్ట్రాల్లోని వంశధార పరివాహక ప్రాంతాలను, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను, కొత్త ప్రాజెక్టు నిర్మాణ స్థలాలను పరిశీలించారు. మన రాష్ట్రంలో వీరి పర్యటన సాఫీగా సాగినా.. ఒడిశాలో మాత్రం పలువురు రాజకీయ నాయకులు ప్రజలను రెచ్చగొట్టి ట్రిబ్యునల్ సభ్యులను అడ్డుకోవడం, వారిని తరమడం వరకు వెళ్లారు.

అయితే పోలీసుల సాయంతో బృందం  సభ్యులు కూలంకుషంగా పరిశీలించి, నిపుణులు, ఇరు రాష్ట్రాల ఇంజినీరింగ్ అధికారుల అభిప్రాయాలు తీసుకొని సమగ్ర నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఈ నివేదిక అధారంగా ఒడిశా అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఫేజ్-2లో భాగంగా ప్రస్తుతానికి కాట్రగడ వద్ద సైడ్ వియర్ నిర్మించి, అదనపు నీరు వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. నేరడి రిజర్వాయర్ విషయం తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. దీని వల్ల శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్‌లో 2.50 లక్షలు, రబీలో లక్ష ఎకరాలకు సాగునీరు  అందుతుందని నీటిపారుదల అధికారులు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement