vansadhara
-
ఆపరేషన్ అంపలాం సక్సెస్
పోలాకి: ఏళ్ల తరబడి తీరప్రాంత మత్స్యకారు లు, స్థానికులు, పర్యావరణ అభిమానులు చే స్తున్న పోరాటాలు ఫలించాయి. అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్ అంపలాం’తో ఆక్రమణలో వున్న వంశధార నదీమతల్లి చెర వీడినట్టయింది. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆర్డీవో ఎం.వి.రమణ ఆధ్వర్యంలో తహశీల్దార్ ఎ.సింహాచలం సిబ్బందితో కలసి దాదాపు 50మంది పోలీ సు బందోబస్తు మధ్య వంశధార నదీతీరానికి చేరుకున్నారు. అక్కడ పోలాకి–2 రెవెన్యూ పరిధిలో 516 సర్వే నెంబర్లో నదీగర్భంలో అక్రమంగా నిర్మాణం చేపట్టిన దాదా పు 20 ఎకరాల్లోని రొయ్యిల చెరువులను తొలగింపునకు పూనుకున్నారు. అంపలాం గ్రామానికి ఆనుకుని వున్న ఆ ప్రాంతంలో అప్పటి వరకూ ఏం జరుగుతుందో తెలియక అటు ఆక్రమణదారులు, ఇటు స్థానికులు అదే పనిగా చూ స్తూ ఉండిపోయారు. ఈలోగా జేసీబీ యంత్రాలతో గంటల వ్యవధిలోనే ఆక్రమణలు తొలగింపు చేపట్టి ఆపరేషన్ అంపలాం విజయవంతం అయినట్లు అధికారులు ప్రకటించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసరావు, ఇద్దరు ఆర్ఐలు, విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఐదు గురు సర్వేయర్లు, పదిమంది వీఆ ర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. నరసన్నపేట సీఐ తిరపతి, ఎస్ఐలు చిన్నం నాయుడు, సత్యనారాయణ, 50మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. వంశధార ‘సాక్షి’గా కబ్జాదారుల ఆగడాలు.. పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడిచి, నదులు, కాలువలు, చెరువులు, సముద్ర పరివాహక ప్రాంతాల్లో కబ్జాకు తెగబడుతున్న వారికి అధికారులు చేపట్టిన ఆపరేషన్ గట్టి హెచ్చరికే అని చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు రెచ్చిపోయి మరీ భూఆక్రమణలకు పాల్పడ్డారు. వారిపై అప్పట్లో ‘సాక్షి’ లో కథనాలు సైతం ప్రచురితమయ్యాయి. అయితే నాటి పాలకుల కనుసన్నల్లో నడిచే యంత్రాంగం సైతం అటువైపు కన్నెత్తి చూడలేదు. నదిగా అడ్డంగా గట్టువేసి, మత్స్యకారుల జీవనోపాధి గండికొట్టేలా.. చేసినా సర్వే పేరుతో తాత్సారం చేశారు. నది ప్రవాహ దిశ మార్చుకుని ఇటీవల వరదల్లో ఉగ్రరూపం చూపితే గానీ అప్పట్లో చేపట్టిన ఘనకార్యాన్ని యంత్రాంగం గుర్తించలేకపోయింది. ఆక్రమణల తొలగింపు అసాధ్యం అనుకున్నాం.. నదికి అడ్డంగా గట్టువేసి ఆక్రమించుకున్న భూమిలో రొయ్యల చెరువులు తవ్వుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఎన్నోసార్లు ఈ విషయంపై మండల, జిల్లాస్ధాయి అధికారులకు ఫిర్యాదు చేశాం. ఇక ఆక్రమణలు తొలగించటం సాధ్యం కాదని అనుకున్నాం. నూతన ప్రభుత్వం ఏర్పడి నిండా నాలుగు నెలలు కాకముందే ఆక్రమణలు తొలగింపు సంతోషదాయకం. –కోడ లక్ష్మీపతి, మత్స్యకారుడు, రాజారాంపురం కలెక్టర్ ఆదేశాలతోనే ఆపరేషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే ఆపరేషన్ నిర్వహించాం. ఆక్రమణలు ఎక్కడున్నా ఇదే స్ధాయిలో స్పందిస్తాం. నదీ సంగమ ప్రదేశంలో రొయ్యల చెరువులు తవ్వకంతో నది దిశను మార్చుకుని ఇటీవల వరద కళింగపట్నం వైపు మళ్లింది. మళ్లీ ఇలాంటి ఆక్రమణలు పునరావృత్తం కాకుండా మండల రెవెన్యూ సిబ్బందికి సూచనలు చేశాం. –ఎం.వి.రమణ, ఆర్డీవో, శ్రీకాకుళం -
పరిహారం కోసం వంశధార నిర్వాసితుల ఆందోళన
-
వంశధార నిర్వాసితులతో చర్చలు విఫలం
శ్రీకాకుళం: హిర మండలం పాడలి గ్రామంలో వంశధార నిర్వాసితులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నాలుగు రోజుల క్రితం ఆందోళన నిర్వహించిన నిర్వాసితులు నిర్మాణ పనులు ఆపించారు. పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్య, తహశిల్దార్ కాళీప్రసాద్, డీఎస్పీ ఆదినారాయణలు వంశధార పనులకు సహకరించాలని కోరుతూ నిర్వాసితులతో ఆదివారం చర్చించారు. అయితే అధికారుల సమాధానంతో నిర్వాసితులు సంతృప్తి చెందలేదు. -
నిలకడగా వంశధార
- ఇన్‌ఫ్లో 3112 క్యూసెక్కులు - యథాతథంగా కిందకు విడిచిపెడుతున్న బ్యారేజీ అధికారులు హిరమండలం వంశధారలో నీటి ప్రవాహం నిలకడగా ఉంది. 3112 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. వాటిని యథాతథంగా నీటి ప్రవాహాన్ని కిందకు వదులుతున్నారు. గత కొద్దిరోజులుగా నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ఎగువ ఒడిశాలో తేలికపాటి జల్లులు పడుతుండడంతో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోంది. నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం 103.06 మిల్లీమీటర్లు నమోదైనట్టు వంశధార డీఈ ప్రభాకరరావు తెలిపారు. ప్రస్తుతం మూడు గేట్లు ద్వారా నీటిని విడిచిపెడుతున్నారు. -
వంశధార వారికే కట్టబెట్టేద్దాం
రెండోదశ మిగిలిన పనుల్లో పాత కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూర్చే యత్నం రంగం సిద్ధం చేసిన నీటిపారుదల శాఖ హైదరాబాద్: వంశధార రెండో దశలోని 87, 88 ప్యాకేజీల పనులు పూర్తి చేయలేక చతికిల పడిన కాంట్రాక్టర్లకే.. మిగిలిన పనులను తాజా ధరల ప్రకారం రూపొందించిన కొత్త అంచనా వ్యయంతో కట్టబెట్టడానికి నీటిపారుదల అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఈ రెండు ప్యాకేజీలను 2005లో శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, హార్విన్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకున్నాయి. కానీ అప్పటినుంచి రెండుసార్లు గడువు పొడిగించినా పనులు పూర్తి చేయలేకపోయాయి. తాజా ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని పెంచితేనే పనులు పూర్తి చేస్తామని మొండికేశాయి. గత ప్రభుత్వాలు ఇందుకు అంగీకరించలేదు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్యాకేజీల అంచనా వ్యయాన్ని భారీగా పెంచుకోవడానికి ఆ సంస్థలు ప్రయత్నించి విజయం సాధించాయి. మిగిలిన పనుల విలువ రూ.90 కోట్లు కాగా.. తాజాగా ఈ పనుల విలువను రూ.429 కోట్లుగా అంచనా వేశారు. పాత కాంట్రాక్టర్లలో ఒకరు అధికార పార్టీ ఎమ్మెల్యే కాగా.. మరో కాంట్రాక్టర్ టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నేతకు స్వయానా సోదరుడు కావడం గమనార్హం. తొలి అంచనా వ్యయం రూ.140 కోట్లు రెండు ప్యాకేజీల తొలి అంచనా వ్యయం రూ.140 కోట్లు. అందులో దాదాపు రూ. 50 కోట్ల విలువైన పనులు మాత్రమే చేసిన కాంట్రాక్టర్లు మిగతా పనులు చేయకుండా నిలిపివేశారు. ఒప్పందం ప్రకారమైతే కాంట్రాక్టర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. అలా చర్యలు తీసుకోకపోగా.. తాజా ధరల ప్రకారం మిగిలిన పనుల విలువను రూ.429 కోట్లుగా అంచనా వేశారు. వంశధార విషయంలో నిర్ణయం తీసుకోవడానికి హైపవర్ కమిటీ సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించినా గురువారం ఆ సమావేశం జరగలేదు. కార్యదర్శుల కమిటీతో కానిచ్చేద్దాం.. రూ.100 కోట్ల కంటే తక్కువ విలువైన పనుల విషయంలో కార్యదర్శుల కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. దీంతో హైపవర్ కమిటీకి వెళ్లకుండా కార్యదర్శుల కమిటీలోనే ‘మమ’ అనిపించి పాత కాంట్రాక్టర్లకే కట్టబెట్టాలనే నిర్ణయానికి నీటిపారుదల అధికారులు వచ్చినట్లు తెలిసింది. పాత అంచనా ప్రకారం మిగిలిన పనుల విలువ రూ.90 కోట్లే కాబట్టి తాజా అంచనా విలువ రూ.429 కోట్లను పరిగణనలోకి తీసుకోకుండా, ఫైల్లో పాత విలువనే ప్రస్తావిస్తే హైపవర్ కమిటీకి వెళ్లాల్సిన అవసరం ఉండదనే ఎత్తుగడ వేసినట్లు సమాచారం. ఆ విధంగా ఫైల్ రూపొందించాలని ఇంజనీర్లను నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశించారు. వచ్చే వారం కార్యదర్శుల కమిటీ భేటీ ఏర్పాటు చేసి.. అనుకున్నట్టుగా పని కానిచ్చేసేందుకు రంగం సిద్ధమైందని వంశధార ఇంజనీరింగ్ అధికారుల ద్వారా తెలిసింది. -
గుండెకోత
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎడతెరిపి లేని వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు, వాగులు, వంకలు.. నీట మునుగుతున్న పంటలు.. జలదిగబంధంలో చిక్కుకుంటున్న గ్రామాలు.. ఇదీ జిల్లాలో ప్రస్తుత పరిస్థితి. ఇన్నాళ్లూ వర్షాభావంతో అల్లాడిపోయిన ప్రజలను అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎగువన ఒడిశాలోనూ వర్షాలు కురుస్తున్న వర్షాలతో వంశధార ఉగ్రరూపం దాల్చుతోంది. నదీతీర గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికార యంత్రాంగం సైతం హెచ్చరికలు జారీ చేసింది. మండలస్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్‌తోపాటు ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తీర మండలాల తహశీల్దార్లను అందుబాటులో ఉండి అనుక్షణం పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. ఇప్పటిప్పుడు ప్రమాదం లేకపోయినా వంశధార నీటిమట్టం పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. వంశధారకు వరద వంశధారలో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుతోంది. గత రె ండు రోజులుగా జల్లాతో పాటుగా ఒడిశాలోని వంశధార పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదిలో నీటి ప్రవాహం శుక్రవారం రాత్రి నుంచి బాగా పెరిగింది. శనివారం ఉదయం 7 గంటలకు గొట్టా బ్యారేజ్ వద్ద 85,626 క్యూసెక్కుల నీరు ప్రవహించగా, 10 గంటలకు అది 81,446 క్యూసెక్కులకు తగ్గింది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు 78,112 క్యుసెక్కుల ప్రవాహం ఉంది. నీటి ప్రవాహం తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా ఎగువన ఇంకా వర్షాలు తెరిపివ్వనందున ఏ క్షణంలోనైనా మళ్లీ నీటి ప్రవాహం ఉద్ధృతం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. వర్షాల తీవ్రత కొనసాగితే వంశధారకు వరదలు రావచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే శ్రీకాకుళం, గార, భామిని, కొత్తూరు, సరుబుజ్జిలి, ఎల్.ఎన్.పేట, పోలాకి, జలుమూరు, హిరమండలం, ఆమదాలవలస, నరసన్నపేట మండలాలు ప్రభావితమవుతాయి. దాంతో ఈ మండలాల్లోని 124 తీర గ్రామాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే 32 గ్రామాల్లో పంట పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. కొత్తూరు మండలంలోని పెనుగొటివాడ తదితర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరో ప్రధాన నది అయినా నాగావళిలో ప్రస్తుత సాధారణ నీటి ప్రవాహమే ఉన్నా.. అది కూడా క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి తోటపల్లి వద్ద నదిలో 15,450 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎగువ నుంచి వరద పెరగడంతో తోటపల్లి వద్ద నీటి ప్రవాహం 26,706 క్యూసెక్కులకు పెరిగింది. బ్యారేజీ నీటిమట్టం 100.7 మీటర్లుగా నమోదైంది. ఇన్చార్జీల పర్యవేక్షణ వరదలు వచ్చే అవకాశం ఉన్నందున పరిస్థితులను సమీక్షించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునేందుకు జిల్లాలోని మూడు డివిజన్లకు ఆయా ఆర్డీవోలను ఇన్‌చార్జీలుగా నియమితులయ్యారు. మండల ఆధికారులు ఆయా మండలాల్లోని లోతట్టు ప్రాంతాలను సందర్శించి పరిశీలించాలని ఆదేశించారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండేలా సూచనలు చేయాలని ఆయన చెప్పారు. మంత్రి సమీక్ష జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కారణంగా వంశధార, నాగావళి నదీ పరివాహక గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, నీటిపారుదల శాఖ మంత్రి దేవినే ని ఉమామహేశ్వరరావులు ఆదేశించారు. ఈ మేరకు శనివారం జిల్లా యంత్రాంగంతో పరిస్థితిని సమీక్షించారు. అవసరమైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, జిల్లాలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలని ఆదేశించారు. -
వంశధారకు సుప్రీం వరం
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మానస పుత్రిక, శ్రీకాకుళం జిల్లావాసుల కలల ప్రాజెక్టు సాకారానికి మార్గం సుగమమైంది. జిల్లాను సస్యశ్యామలం చేసే వంశధార ఫేజ్-2 ప్రాజెక్టుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుపై సరిహద్దు ఒడిశా రాష్ట్రం లేవనెత్తిన అభ్యంతరాలను కోర్టు తిరస్కరించింది. దీంతో వంశధార నది నుంచి 5 టీఎంసీల నీటిని అదనంగా వినియోగించుకునే వెసులుబాటు మన రాష్ట్రానికి లభించింది. ప్రాజెక్టు పూర్తి అయితే సుమారు 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 70 శాతం వ్యవసాయాధారితమైన శ్రీకాకుళం జిల్లాకు పూర్తిస్థాయి సాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి స్పందించి రూ.900 కోట్ల అంచనా వ్యయంతో వంశధార ఫేజ్-2 ప్రాజెక్టు మంజూరు చేశారు. ఇందులో భాగంగా నేరడి వద్ద బ్యారేజీ, కాట్రగడ వద్ద సైడ్ వియర్ నిర్మించాలని నిర్ణయించారు. అడుగడుగునా ఒడిశా ఆటంకాలు అయితే ఈ ప్రాజెక్టుపై సరిహద్దు రాష్ట్రమైన ఒడిశా అభ్యంతరాలు లేవదీసింది. అనేక ఆటంకాలు సృష్టించింది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రంలోని భూమి ముంపునకు గురవుతుందని వాదించింది. ఆంధ్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. చివరికి ఒడిశాలోని 100 ఎకరాలు ముంపునకు గురవుతాయని గుర్తించిన ఆంధ్ర ప్రభుత్వం అప్పట్లో ఆ భములకు నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. నేరడీ బ్యారేజ్, కాట్రగడ సైడ్ వియర్ల నిర్మాణంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దిగువనున్న ఆంధ్రప్రదేశ్ అదనపు జలాలను వినియోగించుకుంటే తమకు నష్టం వాటిల్లుతుందని కూడా అభ్యంతరం చెప్పింది. ఆ మేరకు సుప్రీంకోర్టు స్టే మంజూరు చేయడంతో బ్యారేజీ, సైడ్ వియర్ నిర్మాణాలు నిలిచిపోయాయి. అయితే ఆంధ్ర రాష్ట్రానిది న్యాయమైన వాదన కావడంతో సుప్రీంకోర్టు నుంచి అనుకూల తీర్పు వస్తుందన్న నమ్మకంతో ఆ రెండింటినీ మినహాయించి మిగిలిన పనులు పూర్తి చేయాలని అప్పట్లో వైఎస్ ఆదేశించడంతో కాలువల నిర్మాణం దాదాపు పూర్తి అయ్యింది. సైడ్ వియర్, బ్యారేజీ నిర్మించకపోవడంతో పంటలకు నీరందించలేని పరిస్థితి ఏర్పడింది. ఆది నుంచీ అదే తీరు ఈ ప్రాజెక్టు విషయంలో మొదటి నుంచీ ఒడిశా వితండవాదం చేస్తోంది. తనకు కేటాయించిన నీటినే వాడుకోలేని పరిస్థితుల్లో ఆంధ్ర వాటాను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. వంశధారలో ఏటా 105 టీఎంసీల జలాలు సముద్రంలో వృథాగా కలిసిపోతున్నాయని నిపుణులు లెక్కగట్టారు. ఆ మేరకు రెండు రాష్ట్రాలు చెరో 52.5 టీఎంసీల నీటిని వాడుకునేలా 1967లో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఎగువనున్న ఒడిశా రాష్ట్రం ఎన్నో అడ్డంకులు సృష్టించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇబ్బందుల పాల్జేసింది. తనకు కేటాయించిన 52.5 టీఎంసీల్లో 2 శాతాన్ని కూడా ఆ రాష్ట్రం వినియోగించుకోవడం లేదు. అదే సమయంలో మన రాష్ట్రం తన వాటాలో 15 టీఎంసీల నీటిని వినియోగించుకుంటోంది. వంశధార ఫేజ్-2 ప్రాజెక్టు పూర్త అయితే మరో 5 టీఎంసీల వరకు వినియోగించుకోవచ్చని యోచించింది. ఈ అదనపు వినియోగాన్ని, ముంపు సమస్యను బూచిగా చూపుతూ ఒడిశా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై క్షేత్ర పరిశీలనకు సుప్రీంకోర్టు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఆ మేరకు ట్రిబ్యునల్ సభ్యులు ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు రాష్ట్రాల్లోని వంశధార పరివాహక ప్రాంతాలను, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను, కొత్త ప్రాజెక్టు నిర్మాణ స్థలాలను పరిశీలించారు. మన రాష్ట్రంలో వీరి పర్యటన సాఫీగా సాగినా.. ఒడిశాలో మాత్రం పలువురు రాజకీయ నాయకులు ప్రజలను రెచ్చగొట్టి ట్రిబ్యునల్ సభ్యులను అడ్డుకోవడం, వారిని తరమడం వరకు వెళ్లారు. అయితే పోలీసుల సాయంతో బృందం సభ్యులు కూలంకుషంగా పరిశీలించి, నిపుణులు, ఇరు రాష్ట్రాల ఇంజినీరింగ్ అధికారుల అభిప్రాయాలు తీసుకొని సమగ్ర నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఈ నివేదిక అధారంగా ఒడిశా అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఫేజ్-2లో భాగంగా ప్రస్తుతానికి కాట్రగడ వద్ద సైడ్ వియర్ నిర్మించి, అదనపు నీరు వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. నేరడి రిజర్వాయర్ విషయం తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. దీని వల్ల శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్‌లో 2.50 లక్షలు, రబీలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని నీటిపారుదల అధికారులు తెలిపారు.