గుండెకోత
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎడతెరిపి లేని వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు, వాగులు, వంకలు.. నీట మునుగుతున్న పంటలు.. జలదిగబంధంలో చిక్కుకుంటున్న గ్రామాలు.. ఇదీ జిల్లాలో ప్రస్తుత పరిస్థితి. ఇన్నాళ్లూ వర్షాభావంతో అల్లాడిపోయిన ప్రజలను అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎగువన ఒడిశాలోనూ వర్షాలు కురుస్తున్న వర్షాలతో వంశధార ఉగ్రరూపం దాల్చుతోంది. నదీతీర గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికార యంత్రాంగం సైతం హెచ్చరికలు జారీ చేసింది. మండలస్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్‌తోపాటు ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తీర మండలాల తహశీల్దార్లను అందుబాటులో ఉండి అనుక్షణం పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. ఇప్పటిప్పుడు ప్రమాదం లేకపోయినా వంశధార నీటిమట్టం పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
వంశధారకు వరద
వంశధారలో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుతోంది. గత రె ండు రోజులుగా జల్లాతో పాటుగా ఒడిశాలోని వంశధార పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదిలో నీటి ప్రవాహం శుక్రవారం రాత్రి నుంచి బాగా పెరిగింది. శనివారం ఉదయం 7 గంటలకు గొట్టా బ్యారేజ్ వద్ద 85,626 క్యూసెక్కుల నీరు ప్రవహించగా, 10 గంటలకు అది 81,446 క్యూసెక్కులకు తగ్గింది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు 78,112 క్యుసెక్కుల ప్రవాహం ఉంది. నీటి ప్రవాహం తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా ఎగువన ఇంకా వర్షాలు తెరిపివ్వనందున ఏ క్షణంలోనైనా మళ్లీ నీటి ప్రవాహం ఉద్ధృతం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. వర్షాల తీవ్రత కొనసాగితే వంశధారకు వరదలు రావచ్చని అంచనా వేస్తున్నారు.
అదే జరిగితే శ్రీకాకుళం, గార, భామిని, కొత్తూరు, సరుబుజ్జిలి, ఎల్.ఎన్.పేట, పోలాకి, జలుమూరు, హిరమండలం, ఆమదాలవలస, నరసన్నపేట మండలాలు ప్రభావితమవుతాయి. దాంతో ఈ మండలాల్లోని 124 తీర గ్రామాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే 32 గ్రామాల్లో పంట పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. కొత్తూరు మండలంలోని పెనుగొటివాడ తదితర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరో ప్రధాన నది అయినా నాగావళిలో ప్రస్తుత సాధారణ నీటి ప్రవాహమే ఉన్నా.. అది కూడా క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి తోటపల్లి వద్ద నదిలో 15,450 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎగువ నుంచి వరద పెరగడంతో తోటపల్లి వద్ద నీటి ప్రవాహం 26,706 క్యూసెక్కులకు పెరిగింది. బ్యారేజీ నీటిమట్టం 100.7 మీటర్లుగా నమోదైంది.
ఇన్‌చార్జీల పర్యవేక్షణ
వరదలు వచ్చే అవకాశం ఉన్నందున పరిస్థితులను సమీక్షించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునేందుకు జిల్లాలోని మూడు డివిజన్లకు ఆయా ఆర్డీవోలను ఇన్‌చార్జీలుగా నియమితులయ్యారు. మండల ఆధికారులు ఆయా మండలాల్లోని లోతట్టు ప్రాంతాలను సందర్శించి పరిశీలించాలని ఆదేశించారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండేలా సూచనలు చేయాలని ఆయన చెప్పారు.
మంత్రి సమీక్ష
జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కారణంగా వంశధార, నాగావళి నదీ పరివాహక గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, నీటిపారుదల శాఖ మంత్రి దేవినే ని ఉమామహేశ్వరరావులు ఆదేశించారు. ఈ మేరకు శనివారం జిల్లా యంత్రాంగంతో పరిస్థితిని సమీక్షించారు. అవసరమైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, జిల్లాలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలని ఆదేశించారు.