
నదీగర్భంలో వున్న నిర్మాణాలను కూల్చుతున్న అధికారులు
పోలాకి: ఏళ్ల తరబడి తీరప్రాంత మత్స్యకారు లు, స్థానికులు, పర్యావరణ అభిమానులు చే స్తున్న పోరాటాలు ఫలించాయి. అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్ అంపలాం’తో ఆక్రమణలో వున్న వంశధార నదీమతల్లి చెర వీడినట్టయింది. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆర్డీవో ఎం.వి.రమణ ఆధ్వర్యంలో తహశీల్దార్ ఎ.సింహాచలం సిబ్బందితో కలసి దాదాపు 50మంది పోలీ సు బందోబస్తు మధ్య వంశధార నదీతీరానికి చేరుకున్నారు. అక్కడ పోలాకి–2 రెవెన్యూ పరిధిలో 516 సర్వే నెంబర్‌లో నదీగర్భంలో అక్రమంగా నిర్మాణం చేపట్టిన దాదా పు 20 ఎకరాల్లోని రొయ్యిల చెరువులను తొలగింపునకు పూనుకున్నారు. అంపలాం గ్రామానికి ఆనుకుని వున్న ఆ ప్రాంతంలో అప్పటి వరకూ ఏం జరుగుతుందో తెలియక అటు ఆక్రమణదారులు, ఇటు స్థానికులు అదే పనిగా చూ స్తూ ఉండిపోయారు. ఈలోగా జేసీబీ యంత్రాలతో గంటల వ్యవధిలోనే ఆక్రమణలు తొలగింపు చేపట్టి ఆపరేషన్ అంపలాం విజయవంతం అయినట్లు అధికారులు ప్రకటించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసరావు, ఇద్దరు ఆర్‌ఐలు, విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఐదు గురు సర్వేయర్లు, పదిమంది వీఆ ర్వోలు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు. నరసన్నపేట సీఐ తిరపతి, ఎస్‌ఐలు చిన్నం నాయుడు, సత్యనారాయణ, 50మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
వంశధార ‘సాక్షి’గా కబ్జాదారుల ఆగడాలు..
పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడిచి, నదులు, కాలువలు, చెరువులు, సముద్ర పరివాహక ప్రాంతాల్లో కబ్జాకు తెగబడుతున్న వారికి అధికారులు చేపట్టిన ఆపరేషన్ గట్టి హెచ్చరికే అని చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు రెచ్చిపోయి మరీ భూఆక్రమణలకు పాల్పడ్డారు. వారిపై అప్పట్లో ‘సాక్షి’ లో కథనాలు సైతం ప్రచురితమయ్యాయి. అయితే నాటి పాలకుల కనుసన్నల్లో నడిచే యంత్రాంగం సైతం అటువైపు కన్నెత్తి చూడలేదు. నదిగా అడ్డంగా గట్టువేసి, మత్స్యకారుల జీవనోపాధి గండికొట్టేలా.. చేసినా సర్వే పేరుతో తాత్సారం చేశారు. నది ప్రవాహ దిశ మార్చుకుని ఇటీవల వరదల్లో ఉగ్రరూపం చూపితే గానీ అప్పట్లో చేపట్టిన ఘనకార్యాన్ని యంత్రాంగం గుర్తించలేకపోయింది.
ఆక్రమణల తొలగింపు అసాధ్యం అనుకున్నాం..
నదికి అడ్డంగా గట్టువేసి ఆక్రమించుకున్న భూమిలో రొయ్యల చెరువులు తవ్వుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఎన్నోసార్లు ఈ విషయంపై మండల, జిల్లాస్ధాయి అధికారులకు ఫిర్యాదు చేశాం. ఇక ఆక్రమణలు తొలగించటం సాధ్యం కాదని అనుకున్నాం. నూతన ప్రభుత్వం ఏర్పడి నిండా నాలుగు నెలలు కాకముందే ఆక్రమణలు తొలగింపు సంతోషదాయకం.
–కోడ లక్ష్మీపతి, మత్స్యకారుడు, రాజారాంపురం
కలెక్టర్ ఆదేశాలతోనే ఆపరేషన్
జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే ఆపరేషన్ నిర్వహించాం. ఆక్రమణలు ఎక్కడున్నా ఇదే స్ధాయిలో స్పందిస్తాం. నదీ సంగమ ప్రదేశంలో రొయ్యల చెరువులు తవ్వకంతో నది దిశను మార్చుకుని ఇటీవల వరద కళింగపట్నం వైపు మళ్లింది. మళ్లీ ఇలాంటి ఆక్రమణలు పునరావృత్తం కాకుండా మండల రెవెన్యూ సిబ్బందికి సూచనలు చేశాం.
–ఎం.వి.రమణ, ఆర్డీవో, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment