ఉల్లిపై విజిలెన్స్
Published Thu, Nov 7 2013 3:27 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ఉల్లిని అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి ధర పెరుగుదలకు కారణమవుతున్న వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లా కేంద్రంలోని ఉల్లి హోల్‌సేల్ షాపులపై దాడులు చేసి ఏకంగా 32 టన్నుల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. 7 దుకాణాలను సీజ్ చేశారు. మరో రెండింటిపై కేసులు నమోదు చేశారు. స్థానిక పొట్టి శ్రీరాములు కూరగాయల మార్కెట్‌లో బుధవారం అధికారులు ఉల్లి విక్రయ షాపులపై దాడు లు చేసి సోదాలు జరపగా అనధికారికంగా నిర్వహిస్తున్న గొడౌన్లలో పెద్ద ఎత్తున ఉల్లి నిల్వలు బయటపడ్డాయి. సోదాలు జరిపిన తొమ్మిది షాపుల్లో రెండిం టికి లెసైన్సులు ఉండగా, అవి చెల్లుబాటులో ఉన్నా యో లేదో తెలుసుకొనేందుకు సంబంధిత శాఖాధికారులకు పంపించాలని నిర్ణయించారు.
మిగిలిన ఏడు షాపులను సీజ్ చేశారు. ఈ మొత్తం తొమ్మిది షాపులపైనా కేసులు నమోదు చేశారు. దుకాణాలకు హోల్‌సేల్ స్థాయిలో లెసైన్సులు అవసరమైనప్పటికీ చిల్లర వర్తకులుగా చెలామణీ అవుతుండటాన్ని కూడా అధికారులు గుర్తించారు. మొత్తం 800 బస్తాలు స్వాధీనం చేసుకొని వ్యవసాయ మార్కెట్ కమిటీకి అప్పగించారు. ఒక్కో బస్తాలో 40 కిలోలు చొప్పున మొత్తం 32వేల కిలోలు అంటే 32 టన్నులుగా లెక్కకట్టారు. కాగా ప్రతి బస్తాలో 40 కిలోల ఉల్లి ఉంటుందని వ్యాపారులు చెబుతుండగా, అధికారులు అనుమానంతో కొన్ని బస్తాలను తూకం వేశారు. వారి అనుమానాలను నిజం చేస్తూ బస్తాకు 35 నుంచి 36 కిలోలు మాత్రమే ఉండడంతో తూకాలు కూడా సక్రమంగా లేవని నిర్ధారించారు.
గత కొంతకాలంగా ఉల్లి ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య మధ్య తరగతి ప్రజలు ఉల్లిని కొనుగోలు చేయలేని స్థితి లో ఉండిపోయారు. కొందరు వర్తకులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు మరింత పెరిగేలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నా జిల్లా అధికారులు స్పందించలేదు. ఇటువంటి తరుణంలో విజిలెన్స్ దాడుల్లో పెద్ద ఎత్తున అక్రమ నిల్వలు బయటపడడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే కిలో ఉల్లి రూ.25కే విక్రయిస్తున్నట్లుగా మార్కెట్‌లోని షాపులన్నింటి ఎదుట బోర్డులు వేలాడదీయించారు. ఇంతకంటే ఎక్కువకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఈ దాడుల్లో విజిలెన్స్ డీఎస్పీ కుమార్, సిఐ రేవతిలతో పాటు, సీఎస్‌డీటీ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement