vigilance officers
-
ఒకే ఒక్క రైస్ మిల్లు... రూ. వంద కోట్ల ధాన్యం దగా
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలోని కొమరబండంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ప్రభుత్వం సరఫరా చేసిన రూ.100 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. గడిచిన రెండేళ్లుగా సీఎంఆర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఈ మిల్లుపై మంగళవారం రాష్ట్ర విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ, పోలీస్‌శాఖల అధికారులు 30 మంది బృందంగా ఏర్పడి మూకుమ్మడి దాడి చేశారు. దాడి విషయాన్ని ముందుగానే పసిగట్టిన మిల్లు యజమాని నీలా సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, మిల్లు భాగస్వాములు పరారైనట్లు అధికారులు తెలిపారు. దాడుల నిర్వహిస్తున్న టీమ్‌లకు జిల్లా అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, పోలీస్ అధికారులు సహకారం అందించారు. 3 సీజన్ల నుంచి బియ్యం ఇవ్వడంలేదు. కొమరబండ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండ్రస్ట్రీస్ గత రెండేళ్లుగా, మూడు సీజన్లకు సంబంధించి సుమారు రూ.90 కోట్ల విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు. 2022–23 వానాకాలం సీజన్‌కు సంబంధించి 15,628 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం 7,067 టన్నులు ఆ మిల్లు ఇచ్చిందనీ, 8,607 టన్నుల బియ్యం బకాయి పడిందని చెప్పారు. ఇక ఇదే సంవత్సరం యాసంగి సీజన్‌కు సంబంధించి 10,408 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 202 టన్నుల బియ్యం మాత్రమే సదరు మిల్లు నుంచి వచ్చిందని, 10, 206 టన్నులు బకాయి పడిందని వివరించారు. దీంతో పాటు 2023–24 వానాకాలం సీజన్‌కు సంబంధించి 2748 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 261 టన్నులు మాత్రమే వచ్చిందనీ, ఇంకా 2487 టన్నులు బకాయి ఉందని తెలిపారు. ఈ మూడు సీజన్లకు సంబంధించి మొత్తం 21,300 టన్నుల బియ్యం ఇవ్వాలని దీని విలువ రూ.90 కోట్ల వరకు ఉంటుందని, అపరాధ రుసుంతో కలిపితే దాదాపు రూ.100 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్ కోదాడకు చెందిన శ్రీ వెంకటేశ్వరరైస్ ఇండ్రస్ట్రీస్ యజమాని నీల సత్యనారాయణ కస్టమ్ మిల్లింగ్ రైస్ సక్రమంగా ఇవ్వకపోవడంతో 2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించి మిల్లుకు కేటాయించిన 15,237 టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర స్థాయిలో వేలం వేశారు. వేలంలో ధాన్యం దక్కించుకున్న వారు మిల్లు వద్దకు ధాన్యం కోసం వెళితే అక్కడ ఆ ధాన్యం లేదని చెప్పి, దాన్ని మర పట్టించి ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్‌పై పూర్తి నివేదికను రాష్ట్ర కమిషనర్‌కు అందిస్తామని, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
హైదరాబాద్ జలసౌధలో కొనసాగుతున్న విజిలెన్స్ అధికారుల సోదాలు
-
గడువు ముగిసిన ఆహార పదార్థాలు.. హోటల్స్‌కు భారీ జరిమానా..
కడప అర్బన్ : కడప రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి, అదనపు ఎస్పీ షేక్ మాసుంబాష ఆదేశాల మేరకు మంగళవారం విజిలెన్స్ అధికారులు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం, కడప నగరపాలక సంస్థ శానిటరీ అధికారులు హోటళ్లపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. కడప నగరంలోని ఐదు హోటళ్లలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 కింద కేసులు నమోదు చేశారు. ఆయా హోటళ్లకు మొత్తం రూ.1,80,000 జరిమానా విధించారు. ఈ హోటళ్లలో రాజ్ మయూర గార్డెనియా యాజమాన్యానికి రూ.50,000, మయూర బేకరీకి రూ.60,000, ఆంధ్రరుచులుకు రూ.10,000, స్వప్న బార్ అండ్ రెస్టారెంట్‌కు రూ.40,000, రాయలసీమ స్పైస్‌కు రూ.20,000 జరిమానా విధించారు. ఈ మొ త్తాన్ని ఆయా హోటళ్ల యజమానులు కడప నగర పాలక సంస్థకు చెల్లించాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ టి.రెడ్డెప్ప, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.విజయకిషోర్, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎం.డి షంషీర్‌ఖాన్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు సంయుక్తంగా పాల్గొన్నారు. రెస్టారెంట్లకు జరిమానా ప్రొద్దుటూరు : పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి షేక్ మాసుం బాషా, ఆఫీసర్ పూల రామకృష్ణ, సీఐ అశోక్‌కుమార్, ప్రొద్దుటూరు డివిజన్ ఫుడ్ సేప్టీ ఆఫీసర్ హరిత, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీనివాసరెడ్డి, గోవిందరెడ్డిలు తనిఖీల్లో పాల్గొన్నారు. పట్టణంలోని సాగర బార్ అండ్ రెస్టారెంట్, ఆంధ్ర కిచెన్, హైదరాబాద్ చెఫ్స్, సిప్ ఇన్ రెస్టారెంట్ అండ్ బార్ హోటల్లో తనిఖీలు చేశారు. కిచెన్‌లో పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత పరిమితులను అధికారులు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించని సాగర్ బార్ అండ్ రెస్టారెంట్‌పై రూ.50 వేలు జరిమానా విధించారు. ఆంధ్రకిచెన్ రెస్టారెంట్‌పై రూ.25 వేలు జరిమానా, హైదరాబాద్ చెఫ్స్ రెస్టారెంట్‌పై రూ.25 వేలు, సిప్ ఇన్ రెస్టారెంట్ అండ్ బార్‌పై రూ.50 వేలు జరిమానా విధించారు. ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరిశీలనకు స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీకి పంపించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి మాసుం బాషా మా ట్లాడుతూ హోటల్, రెస్టారెంట్ వారు విని యోగదారులకు నాణ్యమైన పదార్థాలు అందించాలని తెలిపారు. భారత ఆహార సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో వంటకాలను తయారు చేసి అమ్మాలని చెప్పారు. ఆహార పదార్థాల్లో చైనా సాల్ట్, ఫుడ్ కలర్ ఇతర నిషేధిత పదార్థాలు వాడరాదని, పార్సిల్ విషయంలో ప్లాస్టిక్ కవర్లు వాడరాదని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని సంస్థలపై భారీ ఎత్తున జరిమానా విధించడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా నమదు చేసి వ్యాపార సంస్థలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
సీఎంఆర్ ధాన్యం మాయం
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మిల్లర్ల బాగోతం బయటపడింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మిల్లులకు ఇచ్చిన వడ్లను సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద మరాడించి ఇవ్వాల్సి ఉండగా, మిల్లర్లు బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు తేలింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం ఆరెపల్లెలో ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్‌లో రూ.27.76కోట్ల విలువ చేసే 9,522 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్‌కు 2021–22 యాసంగిలో 5,989 మెట్రిక్ టన్నులు, 2022–23 వానాకాలంలో 5,437 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 11,426 మెట్రిక్ టన్నుల (ఎంటీ) ధాన్యాన్ని సీఎంఆర్ కోసం కేటాయించారు. ఇప్పటివరకు 1,400 ఎంటీల ధాన్యం మరాడించి ఇవ్వగా ఇంకా 10,026 ఎంటీల ధాన్యం నిల్వ ఉండాలి. ఈ నెల 1న మిల్లులో విజిలెన్స్ దాడులు చేయగా 504 ఎంటీల ధాన్యం మాత్రమే ఉంది. యాసంగి ధాన్యం 4,135 మెట్రిక్ టన్నులు, వానాకాలం 5,387 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు తేల్చారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరీశ్ ఫిర్యాదుమేరకు పోలీసులు ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని ఆనంద్‌దాస్ రాంమోహన్తోపాటు తిరుమల, అనురాధపై కేసు నమోదు చేశారు. యజమాని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం అధికారులు డబ్బులను రికవరీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ మిల్లు యజమానులు, కుటుంబసభ్యుల మీద ఎలాంటి ఆస్తులు ఉన్నాయో గుర్తించే పనిలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా దాడులు జిల్లా వ్యాప్తంగా రెండు బృందాలు విజిలెన్స్ దాడులు మంగళవారం తనిఖీలు నిర్వహించాయి. మరిన్ని మిల్లుల అక్రమాలు వెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. 2021–22 యాసంగిలో 3,61,437 మెట్రిక్ టన్నుల ధాన్యం 133 మిల్లులకు కేటాయించారు. 2,44,943 మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉండగా, 1,88,151 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అప్పగించారు. ఇంకా 63 మిల్లుల నుంచి 56,792 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. క్వింటాల్ వడ్లకు రా రైస్ అయితే 67 కేజీలు, బాయిల్డ్ అయితే 68 కేజీలు సీఎంఆర్ చేసి అందించాలి. 2022–23 వానాకాలంలో 3,62,193 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 146 మిల్లులకు అప్పగించారు. సీఎంఆర్ కింద 2,42,669 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉండగా మిల్లర్లు 8,903 టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా 2,33,766 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లు తనిఖీలకు రాకముందే రేషన్ బియ్యం కొనుగోలు చేసి తెప్పించేందుకు తంటాలు పడుతున్నట్లు సమాచారం. భారీ మొత్తంలో ధాన్యం మాయమవుతున్నా జిల్లా అధికారులు గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
టీటీడీ ఉద్యోగాల పేరుతో మోసం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ వింగ్ ఏవీఎస్వో పద్మనాభన్ తెలిపిన వివరాలు.. తిరుపతిలోని కొరమేను గుంటకు చెందిన బాలకృష్ణ టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. ఈ విధంగా దాదాపు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు సమాచారం. డబ్బులు వసూలు చేసిన తర్వాత.. వారికి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను కూడా ఇచ్చేవాడు. ఈ విషయం టీటీడీ విజిలెన్స్ అధికారుల దృష్టికి రావడంతో.. వారు ప్రధాన నిందితుడైన బాలకృష్ణతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నకిలీ నియామక పత్రాలు, స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో కూడిన పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
విజిలెన్స్ విస్తృత దాడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమార్కులపై విజిలెన్స్ విభాగం కొరడా ఝళిపిస్తోంది. సామాన్యులు, అన్నదాతలకు అండగా నిలుస్తోంది. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నవారిపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. అలాగే కల్తీలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా గత రెండు నెలల్లోనే 10,015 దాడులు నిర్వహించడంతోపాటు 2,891 కేసులను నమోదు చేసింది. ఇక వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుండటంతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల్లో అక్రమాలు, నకిలీ దందాల కట్టడికి కూడా రంగంలోకి దిగింది. అంతర్జాతీయ పరిణామాలు, పంటల సీజన్ పరిస్థితులను సావకాశంగా తీసుకుని అక్రమార్కులు సామాన్యులు, రైతులను దోపిడీ చేయకుండా విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధ పరిస్థితులను సాకుగా చూపించి.. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేయడం, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించడాన్ని గుర్తించింది. రాష్ట్రంలో అందుకు అవకాశం లేకుండా కట్టడి చేసేందుకు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తోంది. ఇక కల్తీ విత్తనాలు, ఎరువుల కట్టడికి విజిలెన్స్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. అక్రమాలకు పాల్పడినవారిని గుర్తించి నిత్యావసర వస్తువుల చట్టం, తూనికలు–కొలతల చట్టం, ఆహార భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. తీవ్ర నేరాలకు పాల్పడినవారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తుండటంతో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు. తిరుపతిలో వంటనూనెల దుకాణంలో విజిలెన్స్ అధికారుల తనిఖీ 10,015 దుకాణాలు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు.. విజిలెన్స్ అధికారులు రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 6 నుంచి మే 17 వరకు ఏకంగా 10,015 దుకాణాలు, వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన 2,891 దుకాణాలు, వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశారు. వాటిలో తూనికలు–కొలతల చట్టం కింద 2,689 కేసులు, నిత్యావసర వస్తువుల చట్టం కింద 71 కేసులు, ఆహార భద్రతా చట్టం కింద 113 కేసులతోపాటు 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 515 కేసులు నమోదు కాగా అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి. అక్రమ రవాణా మార్గాలపై దృష్టి గతంలో లేని విధంగా నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలు, అక్రమ రవాణా మార్గాలపై విజిలెన్స్ దృష్టి సారించింది. కర్ణాటకలో నకిలీ విత్తనాలు తయారుచేసే ముఠాలు వ్యవస్థీకృతమైనట్టు.. అక్కడి నుంచే రాష్ట్రంలోకి తరలిస్తున్నట్టుగా గుర్తించింది. దీంతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాలపై విజిలెన్స్ అధికారులు పటిష్ట నిఘా పెట్టారు. కర్ణాటక నుంచి విత్తనాలు కొనుగోలు చేసే వారిపై దృష్టిసారించారు. అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల దుకాణాలపై రెండు రోజులుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండురోజుల్లోనే 100 దుకాణాలపై దాడులు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన 12 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ప్రత్యేక బృందాల ద్వారా రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం.. వంట నూనెలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల్లో అక్రమాలను అడ్డుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేస్తూ.. ధరలను అమాంతంగా పెంచేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇక వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుండటంతో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను విక్రయించకుండా తనిఖీలు ముమ్మరం చేశాం. అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – శంకబ్రత బాగ్చి, అదనపు డీజీ, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ తమ జిల్లా యూనిట్లను ఇంకా పునర్వ్యస్థీకరించలేదు. పాత 13 జిల్లాల యూనిట్ల వారీగా విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడులు, నమోదు చేసిన కేసుల వివరాలు.. -
వంటనూనెల అక్రమ నిల్వలపై విజిలెన్స్ దాడులు
-
వంట నూనెల బ్లాక్ దందాపై విజిలెన్స్ కొరడా
సాక్షి, అమరావతి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పేరిట రాష్ట్రంలో నిత్యావసర సరుకులకు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి విక్రయించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆహార, పౌర సరఫరాల చట్టం ప్రకారం పరిమితికి మించి వంట నూనెలు, పప్పు దినుసుల నిల్వలను కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వంట నూనెల ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న వైనంపై ‘ధరల దాడి’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పామాయిల్‌తోపాటు పెరుగుతున్న ఇతర వంట నూనెల ధరలు, పప్పు దినుసుల ధరలను నియంత్రించడానికి విజిలెన్స్ అధికారులు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 126 చోట్ల తనిఖీలు నిర్వహించగా.. 16 చోట్ల పరిమితిని మించి నిల్వలు కలిగి ఉండటాన్ని గుర్తించి కేసులు నమోదు చేశారు. నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేటలో ఉన్న వంటనూనెల హోల్‌సేల్ వ్యాపార గోడౌన్లో అధికారుల తనిఖీలు అధిక ధరలకు విక్రయిస్తున్న 15 మందిపై లీగల్ మెట్రాలజీ యాక్ట్–2009 ప్రకారం కేసులు నమోదు చేశారు. కొన్నిచోట్ల వంట నూనెల నాణ్యతను పరిశీలించేందుకు శాంపిల్స్ సేకరించారు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులతో పాటు సూపర్ మార్కెట్లు, తయారీ యూనిట్లు పరిమితిని మించి నిల్వలు కలిగి ఉన్నా, అధిక ధరలకు విక్రయించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ హెచ్చరించింది. -
కంచే చేను మేసేస్తోంది!
సాక్షి, అమరావతి: కంచే చేను మేసిన చందాన ఉద్యోగులే సంస్థ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఉన్నతాధికారులు సైతం వారి అవినీతి వ్యవహారాలకు కొమ్ముకాస్తుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్)కు రావాల్సిన ఆదాయానికి కొందరు ఉద్యోగులు గండికొడుతున్నారు. వారు చేసింది తప్పని పలు విచారణల్లో తేలినా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఏపీ ట్రాన్స్‌కో వరకూ ఫిర్యాదులు వెళ్లడంతో విజిలెన్స్ అధికారులు కూపీలాగే పనిలో పడ్డారు. ప్రతి డీడీకి సమర్పించుకోవాల్సిందే! ► విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సీజీఎం స్థాయి అధికారి ఒకరు సీఎండీ పేషీలోని ఒక అటెండర్ బంధువుకు చెందిన వాహనాన్ని అద్దెకు తీసుకుని వాడుకుంటున్నారు. నిజానికి ట్రావెల్ వాహనాన్ని వినియోగించాల్సి ఉన్నా.. అలా చేయలేదు. సంస్థ నుంచి బిల్లు రూపంలో నగదు తీసుకుంటూ అటెండర్ బంధువుకు ప్రయోజనం చేకూరుస్తున్నారు. ► ఏలూరు ఆపరేషన్ సర్కిల్లోని భీమవరం డివిజన్లో విద్యుత్ సర్వీస్ కోసం సంస్థ పేరు మీద వినియోగదారులు డీడీ తీయాలంటే తన సంతకం తప్పనిసరంటూ ఓ అధికారి నిబంధన విధించారు. ప్రతి డీడీకి కొంత మొత్తాన్ని తనకు లైన్మేన్లు చెల్లించడమన్నది ఆనవాయితీగా మార్చారు. ► తణుకు సబ్ డివిజన్లో భవనాలపై ఉన్న పెంట్ హౌస్‌కు విద్యుత్ సర్వీస్ ఇచ్చేందుకు ఇదే ప్రాంతంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ► నిడదవోలు డివిజన్ ఉండ్రాజవరం మండలంలో ఓ అధికారి.. అపార్ట్మెంట్లకు విద్యుత్ సర్వీస్ ఇవ్వడంలో అవినీతికి పాల్పడినట్టు ఫిర్యాదులు రావడంతో ఇటీవలే విజిలెన్స్ విచారణ జరిపించారు. ఇలా అనేక చోట్ల సంస్థకు రావాల్సిన ఆదాయాన్ని ఉద్యోగులు, అధికారులు పక్కదారి పట్టిస్తున్నట్టు ట్రాన్స్‌కో విజిలెన్స్‌కు సమాచారం అందింది. త్వరలోనే చర్యలు డిస్కంకు నష్టం చేకూర్చేలా ప్రవర్తించిన ఏ ఉద్యోగిపైనైనా సరే తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అటువంటి వారిపై విచారణ జరుగుతోంది. కొందరు తప్పు చేసినట్టు రుజువైనప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. వారి ప్రమేయం పైనా ఆరా తీస్తున్నాం. త్వరలోనే మా వైపు నుంచి చర్యలుంటాయి. –ఏపీ ట్రాన్స్ కో విజిలెన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు. తప్పు చేశాడని తేలినా.. శ్రీకాకుళానికి చెందిన జి.సత్యవతి తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ పొందేందుకు రూరల్ సెక్షన్‌ను సంప్రదించారు. ఆమె ఇంటికి విద్యుత్ సర్వీస్ ఇవ్వాలంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలతో కలిపి మొత్తం రూ.1,04,000 ఖర్చవుతున్నా అక్కడి అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్(ఏఈఈ) బి.నాగేశ్వరరావు ఆమె నుంచి అనధికారికంగా రూ.లక్ష తీసుకుని కేవలం రూ.8,900కే ప్రతిపాదనలిచ్చారు. సంస్థ అవసరానికి వాడుకునేందుకు పక్కన ఉంచిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలతో పని పూర్తిచేశారు. ఈ వ్యవహారంపై శ్రీకాకుళం రూరల్ ఏడీఈ విచారణ జరిపి ఎస్ఈకి నివేదిక ఇచ్చారు. ఎస్ఈ మరోసారి డివిజనల్ ఇంజనీర్ స్థాయి అధికారితో విచారణ జరిపించారు. ఆయన విచారణలోనూ ఏఈఈ నేరం రుజువైంది. ఈ మొత్తం నివేదికను విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఉండే చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం)కు ఎస్ఈ పంపించారు. తప్పు చేసిన ఇంజనీర్‌పై చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. సీజీఎం నుంచి ఎలాంటి ఆదేశాలూ వెలువడలేదు. -
లేటరైట్ గనుల్లో విజిలెన్స్ తనిఖీలు
సాక్షి, అమరావతి: ఆండ్రూ గ్రూప్ ఆఫ్ మినరల్స్‌కు చెందిన లేటరైట్ లీజుల్లో మైనింగ్ విజిలెన్స్ ప్రత్యేక బృందాలు భారీ ఎత్తున తనిఖీలు చేపట్టాయి. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం వంతాడ, అరలధార గ్రామాల పరిధిలో ఉన్న 8 లీజుల్లో జరిగిన తవ్వకాల తీరును అడుగడుగునా పరిశీలిస్తున్నాయి. వాటికి సంబంధించి కాకినాడ పోర్టులో ఉన్న 5 స్టాక్ యార్డులను సైతం విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. మాన్యువల్, ఈటీఎస్, డీజీపీఎస్ సర్వేల ద్వారా తవ్వకాలు ఏ మేరకు జరిగాయో పరిశీలించారు. వీటిద్వారా స్టాక్ యార్డులకు సంబంధించిన లేటరైట్ లెక్కలు బేరీజు వేస్తున్నారు. క్వారీల్లో జరిగిన తవ్వకాల లెక్కల్ని ఈ సర్వేలతో చేయడం సాధ్యం కాకపోవడంతో డ్రోన్ సర్వే చేయడానికి గనుల శాఖ ప్రభుత్వ అనుమతి తీసుకుంది. బెంగళూరుకు చెందిన డ్రోన్ నిపుణులతో త్వరలో సర్వే చేసి ఎంత మేరకు తవ్వకాలు జరిగాయో నిర్థారించనున్నారు. సముద్ర మట్టానికి 400 అడుగుల ఎత్తులో లీజులున్న ఈ కొండ ఉండటం, భారీగా తవ్వకాలు జరపడంతో అక్కడ సాధారణ సర్వే చేయడం సాధ్యం కాలేదని సమాచారం. అందుకే డ్రోన్ల సాయంతో ఆధునిక పరికరాలు ఉపయోగించి ఏరియల్ సర్వే చేయనున్నారు. ఈ సర్వే ద్వారా తవ్వకాలను పూర్తిగా లెక్కించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ లీజుల్లో పెద్దఎత్తున ఉల్లంఘనలు జరిగినట్టు మైనింగ్ అధికారులు చెబుతున్నారు. వాటిని లెక్కించడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం స్టాక్ యార్డులకు వచ్చిన లేటరైట్, ప్రభుత్వానికి కట్టిన సీనరేజిని లెక్కిస్తున్నారు. ఇందులో వచ్చిన తేడాను బట్టి అక్రమ తవ్వకాలను నిర్థారిస్తారు. 200 ఎకరాల అటవీ భూమిలో తవ్వకాలు అరలధార, వంతాడ అటవీ ప్రాంతంలో ఆండ్రు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టీడీపీ ప్రభుత్వ హయాంలో 8 లేటరైట్ లీజులు తీసుకుంది. ఒక్కో లీజులో పది హెక్టార్ల చొప్పున 8 లీజులకు 80 హెక్టార్ల (200 ఎకరాలు) భూమిని లీజుకు తీసుకుంది. ఈ అటవీ ప్రాంతాన్ని తీసుకున్నందుకు పరిహారంగా అనంతపురం జిల్లాలో అటవీ ప్రాంతాన్ని పెంచేందుకు అప్పట్లో ఆండ్రు కంపెనీకి అనుమతిచ్చారు. సాధారణంగా అటవీ ప్రాంతంలో మైనింగ్‌కు అనుమతులు తెచ్చుకోవడం సాధ్యమయ్యేపని కాదు. కానీ అప్పట్లో ఆండ్రు కంపెనీ పలుకుబడి ఉపయోగించి అనుమతులు తెచ్చుకున్నట్టు తెలిసింది. గనుల్లో అనుమతులకు మించి భారీగా లేటరైట్‌ను తవ్వి తరలించేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. తవ్వకాల కోసం మైనింగ్ నిబంధనలను సైతం ఉల్లంఘించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు ఈ క్వారీల్లో తనిఖీలు జరిపారు. తాజాగా విజయనగరం మైనింగ్ విజిలెన్స్ అధికారులు సూర్యచంద్రరావు, ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. తాజాగా అన్ని మైనింగ్ విజిలెన్స్ బృందాలు ప్రస్తుతం ఈ గనుల్లో తనిఖీలు జరుపుతున్నాయి. -
చంద్రబాబు హయాంలో అడ్డ‘దారి’ దోపీడి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ఎన్నికల ముందు ఉపాధి హామీ ద్వారా రాష్ట్రమంతటా పలు గ్రామాల్లో చేపట్టిన రూ.1,795.31 కోట్ల విలువైన సిమెంట్ రోడ్ల పనుల్లో పక్కా అవినీతి జరిగినట్లు స్పష్టమవుతోంది. సరిగ్గా ఎన్నికలకు 7 – 8 నెలల ముందు నిధులు అందుబాటులో లేకపోయినా గత సర్కారు టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులకు నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టింది. సర్పంచ్ల పదవీ కాలం పూర్తయిన తరువాత 2018 అక్టోబరు – 2019 మే మధ్య ఈ పనులు జరిగాయి. విజిలెన్స్ విచారణలో ఈ అక్రమాలను విజిలెన్స్ శాఖ నిగ్గు తేల్చడంతో బిల్లుల చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. 7,326 చోట్ల అక్రమాలే.. గత ఏడాదిన్నరగా కరోనా పరిస్థితులే నెలకొని ఉన్నందున లక్షల సంఖ్యలో జరిగిన రోడ్ల పనులపై విజిలెన్స్ తనిఖీలు చేపట్టడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. అయినప్పటికీ ఇప్పటివరకు 11,573 పనులపై తనిఖీలు పూర్తి చేయగా 7,326 పనులలో వివిధ స్థాయిల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయింది. ప్రతి మూడు పనుల్లో రెండింటిలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు వెల్లడైంది. 1,644 పనులను పూర్తి నాసిరకంగా నిర్థారిస్తూ ఆ రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన ఖర్చును వంద శాతం సంబంధిత వ్యక్తులు, సంస్థల నుంచి రికవరీ చేయాలని, ఒకవేళ ఇంకా బిల్లులు చెల్లించకుంటే వెంటనే నిలిపివేయాలని విజిలెన్స్ సిఫార్సు చేసింది. ఎలా తేల్చారంటే... విజిలెన్స్ అధికారులు రెండు రకాల పరీక్షల ఆధారంగా సిమెంట్ రోడ్లకు నాణ్యత పరీక్షలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం సిమెంట్ రోడ్డును తగినంత మందంతో నిర్మించారా? సిమెంట్, ఇసుక సమపాళ్లలో కలిపారా? అనే అంశాల ఆధారంగా రోడ్ల నాణ్యతను నిర్ధారించారు. నేల స్వభావం మేరకు నిబంధనలు మారుతుంటాయని అధికారులు చెప్పారు. రోడ్డు మందం ఆధారంగా.. ఇంజనీరింగ్ శాఖ అధికారుల ప్రమాణాల ప్రకారం.. నిర్ణయించిన పరిమాణం (రోడ్డు మందం)లో 20 శాతం కంటే అధికంగా నిబంధనల ఉల్లంఘన జరిగితే పూర్తి స్థాయి నాసిరకంగా నిర్ధారిస్తారు. ఉదాహరణకు సిమెంట్ రోడ్డు పది సెంటీమీటర్ల మందం మేర నిర్మించాల్సి ఉండగా 7.99 సెంటీమీటర్ల మేర మాత్రమే చేపడితే పూర్తి నాసిరకంగా నిర్ధారించి సంబంధిత ఖర్చును కాంట్రాక్టరు నుంచి రికవరీ లేదా బిల్లుల చెల్లింపు నిలిపివేత లాంటి చర్యలు చేపడతారు. ఒకవేళ 8 సెంటీమీటర్ల నుంచి 9.99 సెంటీ మీటర్ల మందంతో రోడ్డు నిర్మాణం చేపడితే ఆ పరిమాణం స్థాయిని బట్టి అక్రమాలను నిర్ధారించి తగినవిధంగా రికవరీకి సిఫారసు చేస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు గుంటూరు జిల్లా నూజెండ్లలో రామిశెట్టి హనుమంతరావు ఇంటి నుంచి ఎస్కే బడే నివాసం వరకు ఉపాధి హామీ నిధులతో రూ.13.29 లక్షల ఖర్చుతో సిమెంట్ రోడ్డు వేశారు. ఇటీవల ఆ రోడ్డును పరిశీలించిన విజిలెన్స్ అధికారులు పూర్తి నాసిరకంగా నిర్మించినట్లు నిర్ధారించారు. ఆ పనులు చేసిన వారి నుంచి వందకు 100% రికవరీ చేయాలని సిఫార్సు చేశారు. విచిత్రం ఏమిటంటే అంత నాసిరకంగా రోడ్డు పనులు ఎవరు చేయించారన్నది ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా లేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు అర్నెల్ల ముందు నూజెండ్ల మండలంలోని వివిధ గ్రామాల్లో హడావుడిగా రూ. 25.62 కోట్లతో మొత్తం 253 సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. అందులో 213 రోడ్లను విజిలెన్స్ అధికారులు పరిశీలించగా 196 రోడ్లు నాసిరకమైనవని తేల్చారు. 17 రోడ్లు మాత్రమే నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. రోడ్లన్నీ పంచాయతీల పేర్లతోనే నిర్మాణం జరిగినట్లు చూపడం గమనార్హం. నూజెండ్ల మండలం పుచ్చనూతల పంచాయతీ పరిధిలోని పాతరెడ్డిపాలెం గ్రామంలో రూ.13.85 లక్షలతో చేపట్టిన సిమెంట్ రోడ్డుదీ అదే పరిస్థితి. ఆ రోడ్డు నిర్మాణ ఖర్చును 100% సంబంధిత వ్యక్తుల నుంచి రాబట్టాలని విజిలెన్స్ పేర్కొంది. ఇక్కడ కూడా గ్రామ పంచాయతీ పేరుతోనే పనులు కానిచ్చేశారు! నూజెండ్ల మండలం పువ్వాడ గ్రామ పంచాయతీ పరిధిలో రూ.6.96 లక్షలతో ఏ.వెంకట నరసయ్య ఇంటి నుంచి ఆంజనేయస్వామి గుడి దాకా నిర్మించిన సిమెంట్ రోడ్డు వ్యవహారం కూడా ఇంతే. అదే మండలం మక్కెళ్లపాడులో రూ.12.17 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు కథ కూడా ఇదే బాపతు. మిక్సింగ్ ఎలా ఉంది? నిర్ణీత కాలం పాటు సిమెంట్ రోడ్డు మన్నికగా ఉండాలంటే సిమెంట్, ఇసుక, కంకరను తగిన నిష్పత్తుల మేరకు మేళవించాలి. నేల స్వభావాన్ని బట్టి దీన్ని నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఒక రకమైన నేలలు ఉన్న చోట బస్తా సిమెంట్‌కు రెండు బస్తాల ఇసుక, 4 బస్తాల కంకర కలపాల్సి ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. దీని ఆధారంగా సిమెంట్ రోడ్డు సామర్థ్యాన్ని నిర్ధా్దరిస్తారు. మూడింటి కలయిక ఆధారంగానే ఒక చదరపు మీటరు రోడ్డు ఎంత బరువును మోయగలదన్నది అంచనా వేస్తారు. నిర్దేశిత బరువులో కనీసం 75 % భారాన్ని రోడ్డు భరించాలి. అంతకంటే తక్కువ బరువు మోసే పరిస్థితిలో రోడ్డు ఉంటే పూర్తి నాసిరకమైనదిగా తేల్చి 100% రికవరీకి ఆదేశాలిస్తారు. 75–99.99 శాతం మధ్య బరువు భరించే స్థాయిలో రోడ్డు ఉంటే ఆ మేరకు నిర్ణీత స్థాయిలో రికవరీకి సిఫార్సు చేస్తారు. ఉదాహరణకు రోడ్డు 30 టన్నుల బరువు భరించాల్సి ఉండగా 22.5 టన్నుల కంటే తక్కువ మాత్రమే భరించేలా నిర్మాణం చేపడితే వంద శాతం డబ్బులు రికవరీకి సిఫార్సు చేస్తారు. సర్పంచులు లేని సమయంలో... ఉపాధి హామీ పథకంలో ఏ పనులు చేపట్టినా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే జరగాలి. ఈ పథకంలో కాంట్రాక్టర్లకు తావులేదు. సాధారణంగా ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో చేపట్టే సిమెంట్ రోడ్లు, ఇతర భవన నిర్మాణాల పనులు సర్పంచ్ల ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. అయితే రాష్ట్రంలో 2018 ఆగస్టు నాటికి సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ఆ సమయంలో 2018 అక్టోబరు – 2019 మే నెలల మధ్య రూ.1,795 కోట్ల విలువైన సిమెంట్ రోడ్డు పనులు జరిగినట్లు బిల్లులు తయారు చేశారు. ఆ పనులన్నీ పంచాయతీల ఆధ్వర్యంలో జరిగాయని పేర్కొంటూ వాటి పేరుతోనే బిల్లులు సిద్ధం చేశారు. అప్పటి గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి నుంచి తీర్మానాలు తీసుకొని ఆయా పనులు చేశారు. అయితే పనులు ఎవరు చేశారు? ఆ వ్యక్తులు ఎవరు? అనే వివరాలను గ్రామ పంచాయతీల వద్ద గానీ చివరకు ఇంజనీరింగ్ అధికారుల వద్ద ఎలాంటి రికార్డులు లేకుండా గుట్టుగా వ్యవహరించారు. గ్రామాల్లో టీడీపీ నేతలే ఆ పనులన్నీ అనధికారికంగా చేశారని అధికారులు పేర్కొంటున్నారు. రికార్డుల్లో లేకున్నా కోర్టులో మాత్రం కేసులు.. రోడ్ల పనులు ఎవరు చేశారన్నది రికార్డుల్లో ఎక్కడా సమాచారం లేదు. అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ తనిఖీల్లో ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో బిల్లుల చెల్లింపులలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒత్తిళ్లకు తలొగ్గి బిల్లులు చెల్లిస్తే తరువాత ఎవరి నుంచి రికవరీ చేయాలో అంతుబట్టక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో గతంలో జరిగిన నాసిరకం పనులకు బిల్లులు చెల్లించాలంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడం, రికార్డుల్లో వివరాలు ఏవీ లేకపోవడం గందరగోళానికి దారి తీస్తోంది. అప్పట్లో జరిగిన ఈ పనులకు సంబంధించి దాదాపు 50 వరకు హైకోర్టులో కేసులు దాఖలైనట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
దర్శనం టికెట్లతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు: టీటీడీ
తిరుమల: శ్రీవారి దర్శనం టికెట్లు, సేవా టికెట్ల పేరుతో వ్యాపారం చేసే దళారులు, ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెలా 20వ తేదీ ఆన్లైన్లో టీటీడీ విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది దళారులు, ట్రావెల్స్ సంస్థలు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. చెన్నైకి చెందిన రేవతి పద్మావతి ట్రావెల్స్ సంస్థ భక్తుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఆన్లైన్లో దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో సదరు సంస్థపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. భక్తులు www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే తమ ఆధార్ కార్డు నంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులు దళారులను ఆశ్రయించి నష్ట పోవద్దని కోరింది. -
వాటర్ ప్లాంట్లపై కొరడా
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న మినరల్ వాటర్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ‘మాయాజలం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్లాంట్లలో తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. బుధవారం రాష్ట్రంలోని 25 వాటర్ ప్లాంట్లపై దాడులు జరిపారు. అనంతపురం జిల్లాలో 6 (సాయి సవేరా, హనీ, ఎస్వీఆర్, సాయి సిరి ఆక్వా, అమృతబిందు, ఎస్వీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్) వాటర్ ప్లాంట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1 (ఉమా ఆక్వా), విజయనగరం జిల్లాలో 2 (ఆదిత్య మినరల్ వాటర్, శ్రీవారి ఆక్వా ఇండస్ట్రీస్), చిత్తూరు జిల్లాలో 2 (శ్రీకృష్ణా మినరల్స్, కింగ్ ఆక్వా), విశాఖపట్నం జిల్లాలో 1 (లక్ష్మీ ఆక్వా ఇండస్ట్రీ), కృష్ణా జిల్లాలో 2 (ఎస్ఎస్ అల్ట్రా టెక్, కె–వాటర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్)లతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు, కర్నూలు జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 3 వాటర్ ప్లాంట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐఎస్ఐ గుర్తింపు లేకుండా.. విజయవాడ కృష్ణలంకలోని కె–వాటర్ ప్లాంట్‌లో ఈ–కామ్ పేరిట తెలంగాణలోని కీసర చిరునామాతో రిజిస్ట్రేషన్ చేసిన సర్టిఫికేషన్ ఉన్న పోస్టర్లు అతికించి ఉన్నాయి. ఈ ప్లాంట్‌కు ఐఎస్ఐ గుర్తింపు ఉన్నట్టు పోస్టర్లపై ఉంది. జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆన్లైన్లో పరిశీలించడంతో అది బోగస్ అని తేలింది. చాలా ప్లాంట్లు ఐఎస్ఐ గుర్తింపు లేకుండా నడుస్తున్నట్టు గుర్తించారు. వాటర్ ప్లాంట్లపై దాడులు కొనసాగిస్తామని జాయింట్ ఫుడ్ కంట్రోలర్ స్వరూప్ ‘సాక్షి’కి చెప్పారు. అదే నీరు.. పేరే మారు! అధికారుల లెక్కల ప్రకారం విజయవాడ నగరంతోపాటు కృష్ణా జిల్లాలో అనుమతులు లేకుండా 1,200కు పైగా వాటర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. వాస్తవానికి రిజిస్టరైన పేరుతోనే ప్లాంట్‌లో వాటర్ బాటిళ్లకు సీళ్లు వేసి మార్కెట్లో విక్రయించాలి. నగరంలో పలు ప్లాంట్లు అందుకు భిన్నంగా వివిధ రంగులు, మూడు నాలుగు ఆకర్షణీయమైన పేర్లతో లేబుళ్లను ముద్రిస్తున్నాయి. ఆ ప్లాంటులో నీటినే బాటిళ్లలోకి నింపి వేర్వేరు బ్రాండ్లతో అమ్మకాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అన్ని అనుమతులతో పాటు వాటర్ బాటిళ్లపై తయారీదారు పేరు, తయారీ తేదీ, తయారీ స్థలం చిరునామా వంటివి స్పష్టంగా ముద్రించి ఉండాలి. అలాంటివేమీ లేకుండా వాటర్ బాటిళ్లను నింపి విక్రయిస్తే మిస్ బ్రాండెడ్ కింద కేసు నమోదు చేసి రూ.3 లక్షల వరకు జరిమానా విధిస్తామని జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ‘సాక్షి’కి చెప్పారు. -
‘మాయా జలం’పై కదిలిన యంత్రాంగం
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘మాయా జలం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా, తగిన అనుమతులు లేకుండా నడుపుతున్న వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ మంజరి సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కృష్ణా జిల్లాలో అనధికార ప్లాంట్లపై ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. విజయవాడ పటమటలోని బ్లూ వాటర్ ప్లాంట్, సూర్యారావుపేటలోని శ్రీగంగా వాటర్ ప్లాంట్లను జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు నేతృత్వంలో అధికారులు తనిఖీ చేశారు. ప్లాంట్ల సీజ్: బ్లూ వాటర్ ప్లాంట్‌కు బీఐఎస్/ఐఎస్ఐ లైసెన్స్‌లతో పాటు ఇతర అనుమతులు లేవని, వాటర్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లలో అపరిశుభ్రత తాండవిస్తోందని అధికారులు గుర్తించారు. ఇంకా వివిధ కంపెనీల (బ్లూ, వేగా, శ్రీరాం) పేర్లతో లేబుళ్లను ముద్రించి పావు లీటరు, అర లీటరు, లీటరు బాటిళ్లకు అతికించి అక్రమంగా విక్రయిస్తున్నట్టు కనుగొన్నారు. సిబ్బంది కోవిడ్ జాగ్రత్తలు పాటించకపోవడాన్ని గుర్తించారు. రోజుకు 4 వేల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను ఎనిమిదేళ్ల క్రితం ఐఎస్ఐ గుర్తింపుతో ప్రారంభించి, ఆ తర్వాత నాలుగేళ్లుగా రెన్యువల్ చేయించకుండా, ఇతర అనుమతులు తీసుకోకుండా నడుపుతున్నట్టు తనిఖీల్లో తేలిందని జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ‘సాక్షి’కి చెప్పారు. విజయవాడ పటమటలోని బ్లూ వాటర్ ప్లాంట్‌లో అధికారుల తనిఖీలు ఈ ప్లాంట్‌లో ఉన్న 6,125 సీల్డ్ వాటర్ బాటిళ్లను సీజ్ చేశామన్నారు. మరోవైపు అనుమతుల్లేకుండా నడుస్తున్న శ్రీగంగా వాటర్ ప్లాంట్‌లోనూ తనిఖీలు నిర్వహించామని, అక్కడ 90 ప్యాకెట్ల చొప్పున ఉండే 103 బ్యాగులను సీజ్ చేశామని చెప్పారు. ఈ రెండు ప్లాంట్లను సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్టు చెప్పారు. తనిఖీల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు శేఖర్‌రెడ్డి శ్రీకాంత్, గోపాల్, విజిలెన్స్ సీఐ అశోక్‌రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. బుధవారం కూడా తనిఖీలు కొనసాగుతాయని జాయింట్ కలెక్టర్ మాధవీలత చెప్పారు. కాగా, బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అనధికార వాటర్ ప్లాంట్లపై నిరంతరాయంగా దాడులు నిర్వహిస్తామని జాయింట్ ఫుడ్ కంట్రోలర్ స్వరూప్ చెప్పారు. -
విజిలెన్స్ పట్టించినా.. ఆర్టీసీ వదిలేసింది
సాక్షి, హైదరాబాద్: టికెట్ డబ్బుల లెక్కల్లో తేడాలతో కండక్టర్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో డ్రైవర్లు సస్పెండయ్యారు. వారు అప్పీళ్లకు వెళ్తే కేసులవారీగా పరీక్షించి తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ వారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కేసులు మాఫీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి, విచారణ జరిపి ఆర్టీసీకి నివేదిక ఇచ్చారు. దాదాపు 70 మందికి సంబంధించి విచారణ జరిపితే.. 39 మందిదాకా తమ దగ్గర ఉన్నతాధికారి లంచం తీసుకున్నట్టుగా స్పష్టమైన సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఈ నివేదిక ఆర్టీసీకి అందింది. అయినా బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇక ఓ డిపోలో కొందరు తాత్కాలిక సిబ్బంది పనిచేశారు. వారు విధుల్లో ఉండగానే.. కనీస వేతనాల మొత్తం పెరిగింది. ఈ మేరకు సొమ్ము విడిగా మంజూరైంది. కానీ ఈ సొమ్మును తాత్కాలిక కార్మికులకు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారు. తర్వాత చెల్లించేసినట్టు లెక్కలు చూపారు. దీనిపై ఆరోపణలు రావటంతో విజిలెన్సు విచారణ జరిగింది. పెరిగిన మేర సొమ్ము తమకు అందలేదని కార్మికులు చెప్పినట్టు సమాచారం. ఈ నివేదిక కూడా ఉన్నతాధికారులకు చేరినా.. ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే అధికారులు మరింతగా వసూళ్లకు పాల్పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగింది? ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లే కీలకం. అయినా వారి విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం కనిపించినా సస్పెన్షన్ వేటు వేస్తుంటారు. ఇలా ఏటా వంద మంది వరకు సస్పెండ్ అవుతున్నారు. చిన చిన్న కారణాలతోనే సస్పెండ్ చేస్తున్నారని, తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో సీఎం కేసీఆర్ స్పందించి నిబంధనల్లో మార్పునకు ఆదేశించారు. ఈ మేరకు కొత్త నియమావళి ఇటీవలే విడుదలైంది. అయితే ఈ కొత్త నియమావళి కూడా సరిగా లేదంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. డిపోల ముందు నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సస్పెన్షన్ వేటు పడుతుండటమే దీనికి కారణం. అయితే చిన్న ఉద్యోగుల విషయంలో కఠినంగా ఉంటున్న యాజమాన్యం.. అధికారుల విషయంలో మాత్రం చూసీచూడనట్టు ఉంటోందన్న చర్చ ఆర్టీసీలో వినిపిస్తోంది. సస్పెండైన కండక్టర్లు, డ్రైవర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో భారీగా వసూళ్లకు పాల్పడ్డట్టు తేలినా సదరు అధికారులను ఎందుకు వదిలేస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. ఇతర అధికారులు దీనిని అలుసుగా తీసుకుని వసూళ్ల పర్వం ప్రారంభిస్తారని వాపోతున్నారు. అంతర్గత విచారణ ఏదీ? కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డట్టు విజిలెన్సు నివేదిక జనవరి చివరి వారంలోనే అందినా ఆర్టీసీ యాజమాన్యం స్పందించడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. సాధారణంగా విజిలెన్సు నివేదికలు అందిన తర్వాత ఆర్టీసీ అధికారులు అంతర్గత విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. ఇటీవల వరంగల్‌లో ఓ డిపో మేనేజర్‌ను ఇలాగే సస్పెండ్ చేశారు. కానీ మరో రెండు కేసుల విషయంలో అంతర్గత విచారణ కూడా చేపట్టలేదు. ఇది ఆర్టీసీలో కార్మిక సంఘాలు తిరిగి బలోపేతం అవ్వాలన్న డిమాండ్‌కు తెరలేపుతోంది. చిన్న ఉద్యోగుల విషయంలో ఓ రకంగా, అధికారుల విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నందున.. మళ్లీ కార్మిక సంఘాలకు అవకాశం కల్పించి ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ మొదలవుతోంది. -
భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం
సాక్షి, మేడ్చల్: జిల్లాలోని మేడ్చల్ మండలం కండ్లకోయలో ఉన్న ఎకో ఆగ్రో సీడ్స్ గోదాముపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు చేశారు. రూ.31 లక్షల విలువైన భారీ నకిలీ విత్తనాలతో పాటు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, జొన్న విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న విత్తనాల ప్యాకెట్లపై టెస్టింగ్ చేసిన తేదీ, ప్యాకింగ్ చేసిన తేదీల్లో వ్యత్యాసం ఉందని తెలిపారు. సరైన పరీక్షలు నిర్వహించకుండా విత్తనాల విక్రయిస్తున్నారని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో రూ.12.24 లక్షల విలువైన 1529 మొక్క జొన్న విత్తనాల ప్యాకెట్లను, రూ.18. 76లక్షల విలువైన 1210 పొద్దు తిరుగుడు విత్తనాల ప్యాకెట్లు స్వాదీనం చేసుకున్న అధికారులు తెలిపారు. నకిలీ విత్తనాలతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతారని అధికారులు అన్నారు. సీజ్ చేసిన విత్తనాలను స్థానిక వ్యవసాయ అధికారికి అప్పగించి, వారిపై విత్తన చట్టం, ఐ.పీ.సీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
హెచ్‌టీ పత్తి విత్తనాల గుట్టు రట్టు
సాక్షి, అమరావతి: కలుపును తట్టుకునే హెచ్‌టీ (హెర్బిసైడ్ టాలరెంట్) పత్తి విత్తనాల గుట్టు రట్టయింది. నిషేధించిన ఈ పత్తి విత్తనాలను రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 15 మందితో కూడిన ఓ ముఠా అనధికారికంగా విక్రయిస్తున్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వెల్దుర్తి కేంద్రంగా.. ► హెచ్‌టీ కాటన్ విత్తనాలకు రాష్ట్రంలో అనుమతి లేదు. అయినా అనధికారికంగా విక్రయిస్తున్నట్టు వరుసగా మూడో ఏడాది కూడా ఆరోపణలు రావడంతో వ్యవసాయ శాఖ ఇటీవల కర్నూలు, గుంటూరు పరిసర ప్రాంతాల్లోని గిడ్డంగుల్లో తనిఖీలు చేపట్టింది. ► ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోనే రూ.2 కోట్ల విలువైన హెచ్‌టీ విత్తనాలు దొరికాయి. ► అక్కడ లభించిన సమాచారం ఆధారంగా కర్నూలులోని ఓ శీతల గిడ్డంగిపై, పత్తికొండ ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా.. పెద్దఎత్తున హెచ్‌టీ విత్తనాల నిల్వలు దొరికాయి. ► కర్నూలు జిల్లాలోని చాలా గిడ్డంగుల్లో హెచ్‌టీ పత్తి ఉన్నట్టు గుర్తించారు. విత్తన వ్యాపారులకు వ్యవసాయ అధికారి, పర్యవేక్షణాధికారి అయిన ఏడీఆర్ కుమ్మక్కై ఎవరిపైనా కేసులు పెట్టలేదని తేలింది. ఏమిటీ.. హెచ్‌టీ కాటన్! ► కలుపు మొక్కలను నివారించే మందుల్ని పిచికారీ చేసినా తట్టుకోగలిగిన అంతర్గత శక్తి హెచ్‌టీ పత్తి మొక్కలకు ఉండటం ప్రత్యేకత. ► అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జన్యు మార్పిడి చేసి రూపొందించిన ఈ విత్తనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. ► ఈ విత్తనాన్ని నేరుగా అమ్మినా.. మరేదైనా రకంతో కలిపి అమ్మినా నేరమే. ► గుంటూరు జిల్లాలోని కొందరు విత్తన వ్యాపారులు, కర్నూలు జిల్లాలోని కొందరు రైతులు ఈ ముఠాకు సహకరిస్తున్నారని గుంటూరు జిల్లా వ్యవసాయాధికారి వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ఆదివారం ఫిర్యాదు చేశారు. క్రిమినల్ కేసులు తప్పవు నకిలీ, అనుమతి లేని విత్తనాలు విక్రయించే వారిపైన, సహకరించే వారిపైనా పీడీ చట్టం కింద క్రిమినల్ కేసులు దాఖలు చేయాలని ఆదేశాలిచ్చాం. తప్పు చేస్తే వ్యవసాయ శాఖలోని ఉద్యోగులు, అధికారులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
నగరంలో విజిలెన్స్ అధికారుల దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ నీటి కనెక్షన్ల పై విజిలెన్స్ అధికారులు కొరడా ఝుళిపించారు. ముందస్తు సమాచారం మేరకు హైదరాబాద్ జలమండలి విజిలెన్స్ అధికారులు గురువారం పలు చోట్ల దాడులు నిర్వహించారు. అక్రమంగా నీటి కనెక్షన్లు, నీటి మోటార్లు, మీటర్లు కలిగి ఉన్నవారిని అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో స్టాలియన్ టైర్స్ కంపెనీకు చెందిన వి.ఎమ్.ఎన్ వెంకటేష్ 40 మిల్లీ మీటర్ల నీటి కనెక్షన్లను అక్రమంగా వాడుతున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 2016లో నీటి బిల్లులు చెల్లించని కారణంగా వెంకటేశ్ రూ. 29.42లక్షలు బకాయి పడ్డాడని, అందువల్ల అతని కనెక్షన్‌ను రద్దు చేశామని అధికారులు తెలిపారు. బిల్లులు చెల్లించకపోగా, అక్రమ కనెక్షన్ ద్వారా దాదాపు 25వేలకు పైగా కిలో లీటర్ల నీటిని వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. అంటే మొత్తంగా 40 లక్షల రూపాయల నీటిని అక్రమంగా వినియోగించారని, దీనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు విజిలెన్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా
తిరుపతి సెంట్రల్/సాక్షి, హైదరాబాద్: శ్రీవేంకటేశ్వర భక్తి చానల్(ఎస్వీబీసీ) చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. ఓ మహిళతో పృథ్వీరాజ్ అసభ్యంగా మాట్లాడినట్లు కొన్ని ప్రసార మాధ్యమాల్లో ఆడియో ప్రసారాలు రావడంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంటనే స్పందించి, ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. సదరు ఆడియో టేపుల్లోని వాయిస్ శాంపిల్‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పరమ పవిత్రమైన తిరుమల తిరుపతిలో అనుచిత ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. శ్రీవారి క్షేత్రం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పృథ్వీరాజ్‌ను రాజీనామా చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిసింది. తప్పు చేశానని తెలిస్తే చెప్పుతో కొట్టండి: పృథ్వీ తనపై వచ్చిన ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదని ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృథ్వీ చెప్పారు. తప్పు చేశానని తెలిస్తే తన చెప్పుతో తనను కొట్టండని అన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మహిళా ఉద్యోగితో తాను అసభ్యంగా మాట్లాడినట్టుగా ప్రచారమవుతున్న ఆడియోలో వాయిస్ తనది కాదన్నారు. శ్రీవారిపై ఒట్టేసి చెపుతున్నానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో తన వాయిస్ లేకుండా చేయాలనే ఇంత పెద్ద కుట్రపన్నారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై తానే విజిలెన్స్ విచారణ వేసుకున్నట్టు చెప్పారు. వైఎస్సార్సీపీ సిద్ధాంతాలకు కట్టుబడి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని గౌరవించి తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజధాని రైతులను ఉద్దేశించి తాను పెయిడ్ ఆర్టిస్టులని అనలేదన్నారు. తన వ్యాఖ్యలు రైతుల మనస్సులను నొప్పించి ఉంటే క్షమాపణ చెçపుతున్నానని అన్నారు. -
ఉల్లి అక్రమార్కులపై.. ‘విజిలెన్స్’ కొరడా!
సాక్షి, అమరావతి: ఉల్లి ధరలను అదుపుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని రంగంలోకి దించింది. పలు రాష్ట్రాల్లో వీటి దిగుబడి తగ్గడం.. వరదల కారణంగా మార్కెట్లో ఉల్లిపాయలకు కొద్దిరోజులుగా కొరత ఏర్పడింది. దీనిని అధిగమించేందుకు కేంద్రం ఇతర దేశాల నుంచి దిగుమతికి అనుమతించింది. అయితే, వాటి ధరల్లో పెద్దఎత్తున చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గుల కారణంగా రాష్ట్రంలోని వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచుతున్న వారిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి నేతృత్వంలో దాడులు ప్రారంభించారు. గడిచిన రెండ్రోజులుగా రాష్ట్రంలోని 10 జిల్లాల్లో పెద్దఎత్తున వీటిని నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఉల్లిపాయలను అక్రమంగా నిల్వ ఉంచడం.. కృత్రిమంగా కొరత సృష్టించి ధర పెంచి విక్రయించడం.. ఎటువంటి అనుమతులు లేకుండా హోల్‌సేల్, రిటైల్ షాపులు నిర్వహించడాన్ని అధికారులు గుర్తించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70 మంది వ్యాపారులపై ‘విజిలెన్స్’ దాడులు నిర్వహించగా 47మంది అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించారు. వారి నుంచి రూ.27,06,200 విలువచేసే 603.50 క్వింటాళ్ల ఉల్లిపాయలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలు ఉంచిన 37 మందికి జరిమానాలు విధించారు. మిగిలిన 10 మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు మించి నిల్వలు వద్దు ఇదిలా ఉంటే.. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల వద్ద నిబంధనలకు మించి ఉల్లిపాయల నిల్వలు ఉంచుకోకూడదని కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30 వరకు హోల్‌సేల్ వ్యాపారులు 50 మెట్రిక్ టన్నులు, రిటైలర్లు 10 మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వలు ఉంచుకోవాలన్నారు. మరోవైపు.. కొందరు వ్యాపారులు అగ్రికల్చర్ మార్కెటింగ్ సెస్ ఎగవేశారని ఆయన తెలిపారు. ఆదుకున్న కర్నూలు ఉల్లి కాగా, మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు రాకపోవడంతో ఆ కొరతను కర్నూలు ఉల్లిపాయలు కొంతమేర తీర్చాయి. ప్రస్తుతం రైతుబజార్లలో కర్నూలు ఉల్లిపాయలు కిలో రూ.36కు విక్రయిస్తున్నారు. దీన్ని మరింతగా తగ్గించి వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌కు ఇలా.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడం.. వరదల ప్రభావంతో ఉల్లిపాయల రవాణపై ప్రభావం పడింది. దీన్ని గమనించిన వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తెరలేపారు. అందుబాటులో ఉన్న ఉల్లిపాయలను మహారాష్ట్ర, కార్ణాటక నుంచి తక్కువ ధరకు ముందుగానే సేకరించుకుని తమ గిడ్డంగుల్లో పెద్దఎత్తున నిల్వచేశారు. వాటిని ఉద్దేశపూర్వకంగానే రోజువారీగా కొంతమేర విక్రయాలు జరుపుతూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో బహిరంగ మార్కెట్లో ఒక్కసారిగా కొరత ఏర్పడింది. వ్యాపారులు ఒక పథకం ప్రకారమే మార్కెట్‌ను ప్రభావితం చేస్తూ అక్రమార్జన చేస్తున్నారని విజిలెన్స్ పరిశీలనలో వెల్లడైంది. నిబంధనలు.. ►ఉల్లి వ్యాపారులు మార్కెట్ కమిటీ లైసెన్సులు తీసుకుని విధిగా పన్ను చెల్లించాలి. ►ఖచ్చితంగా లైసెన్స్ పొంది ఉండాలి. ►స్టాక్ నిల్వచేయడం.. విక్రయించే ధర అన్నీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ఉండాలి. ►ఎంత స్టాకు దిగుమతి చేసుకుంటున్నారు.. ఎంత విక్రయించారో లెక్కలు చూపాలి ►హోల్‌సేల్ వ్యాపారులు 50 మెట్రిక్ టన్నులు, రిటైలర్లు 10 మెట్రిక్ టన్నులకు మంచి ఉంచుకోకూడదు అక్రమంగా నిల్వచేస్తే క్రిమినల్ చర్యలు ఉల్లిపాయలను అక్రమంగా నిల్వచేసుకుని అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై క్రియమినల్ చర్యలు తీసుకుంటాం. దేశవ్యాప్తంగా ఉన్న ఉల్లి కొరతను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. హోల్‌సేల్ వ్యాపారులు తమ వద్ద 50 మెట్రిక్ టన్నులు మించి ఉల్లిపాయలను ఉంచుకోకూడదు. అదే రిటైల్ వ్యాపారుల వద్ద 10 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ షాపుల లైసెన్సులను రద్దు చేయడంతోపాటు అక్రమ నిల్వలను సీజ్ చేస్తాం. – పి. జాషువా, గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ -
హద్దులు దాటి తవ్విన ఎమ్మెల్సీ సోదరుల క్వారీలపై దాడులు
సాక్షి, మడకశిర: ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరులు జయప్ప, సుభాష్ నిర్వహిస్తున్న మెటల్ క్వారీలపై బుధవారం కర్నూలుకు చెందిన గనుల శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. గనుల శాఖ డీడీ రాజశేఖర్ అదేశాల మేరకు ఇన్స్పెక్టర్లు కొండారెడ్డి, వెంకటకృష్ణప్రసాద్‌లు మడకశిర మండల పరిధిలోని మెళవాయి పంచాయతీలోని సర్వే నంబర్ 622లోని ఎమ్మెల్సీ సోదరుల క్వారీల్లో తనిఖీ చేశారు. ఎమ్మెల్సీ సోదరులు హద్దులు దాటి భారీగా తవ్వకాలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన క్వారీ నిర్వాహకుల నుంచి అపరాధరుసుం వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు మాట్లాడుతూ, మడకశిర నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో తనిఖీలు నిర్వహించామన్నారు. నియోజవర్గంలోని అన్ని మెటల్, గ్రానైట్ క్వారీలను తనిఖీ చేస్తామన్నారు. రాయల్టీ చెల్లించకుండా, నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నడుపుతున్న క్వారీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
తిరుమలలో మరో ఇద్దరు దళారుల అరెస్ట్
-
తిరుమలలో మరో ఇద్దరు దళారుల అరెస్ట్
సాక్షి, తిరుమల: తిరుమలలో మరో ఇద్దరు దళారులను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. 17 వేల రూపాయలకు రెండు సుప్రభాతం సేవా టిక్కెట్లను విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. దళారులలో ఒకరు టీటీడీ ఉద్యోగి మధుసూదన్ కాగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖలతో టిక్కెట్లు పొంది భక్తులకు విక్రయిస్తున్నారని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. టిక్కెట్లు లేకుండానే భక్తులను విఐపి బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తునట్లు పోలీసులు గుర్తించారు. -
నామినేషన్‌పై మందుల కొను‘గోల్మాల్’
సాక్షి, అమరావతి : కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ) పరిధిలోని ఆస్పత్రుల్లో మరో భారీ కుంభకోణానికి అధికారులు తెరతీశారు. గత ప్రభుత్వ హయాంలో మందుల కొనుగోళ్లలో విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలు జరిగాయని తేలడంతో ఓ వైపు విజిలెన్స్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తుంటే మరోవైపు ఈఎస్ఐ పరిధిలోని ఆస్పత్రుల్లో కనీస మందులు లేక కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ ఏమీ పట్టని అధికారులు తాము అనుకున్నదే రూలు అన్నట్టు వందల కోట్ల రూపాయల విలువైన మందుల కొనుగోళ్ల విషయంలో అక్రమాలకు మార్గం సుగమం చేశారు. పారదర్శకంగా మందుల కొనుగోలు జరగాలంటే ఇ–ప్రొక్యూర్మెంట్ పద్ధతి సరైనదని భావించిన అధికారులు కొత్త సర్కారు రాగానే ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు. అప్పటి కార్మిక శాఖ అధికారిగా ఉన్న ఐఏఎస్ అధికారి మాధవీలత ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే కొద్ది రోజులకే ఆమె కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆ తర్వాత లావణ్యవేణి అనే మరో అధికారి ఈ శాఖకు వచ్చారు. ఈమె ఆధ్వర్యంలో టెండర్లు పూర్తి చేసి, ఎల్1గా నిలిచిన కంపెనీల నుంచి మందులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తీరా ఎల్1గా నిలిచిన కంపెనీలపై ఫిర్యాదులున్నాయని, మామూలు ధరల కంటే ఎక్కువ రేటు ఉందని ఇ–ప్రొక్యూర్మెంట్ విధానాన్ని నిలిపివేశారు. నామినేషన్ కింద మందుల సరఫరాకు అనుమతి ఇచ్చేందుకు ఈఎస్ఐ డైరెక్టరే కొన్ని కంపెనీలను ఎంపిక చేశారు. నామినేషన్ కింద అయితే భారీగా డబ్బులొస్తాయని భావించిన అధికార వర్గాలు ఈ విధానానికి తెరలేపాయని సమాచారం. ఇదే సమయంలో తక్కువ ధరకు మందులు ఇస్తామని చెప్పిన కంపెనీలు ఎందుకు ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలో పాల్గొన లేదన్నదానికి అధికారుల నుంచి జవాబు లేదు. దీంతో రెండు మాసాల పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులు కసరత్తు చేసిన ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్ల విధానం మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ధరలు మామూలుగా ఉన్నాయన్న కమిటీ ఇ–ప్రొక్యూర్మెంట్ పూర్తయ్యాక రేట్లు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు రాగానే రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) కొనుగోలు చేసే మందుల ధరకూ, ఈఎస్ఐ ఇప్రొక్యూర్మెంట్లో కోట్ చేసిన ధరలకూ బేరీజు వేయాలని ఉన్నతాధికారులు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. చంద్రశేఖర్, రామకృష్ణ, గాంధి అనే ముగ్గురు వైద్యులతో కూడిన కమిటీ సుమారు 265 రకాల మందుల ధరలను పరిశీలించింది. ఈఎస్ఐ టెండర్లలో పాల్గొన్న కంపెనీలు వేసిన ధరలకూ, ఏపీఎంఎస్ఐడీసీ ధరలకూ తేడా లేదని తేల్చింది. ఇలాంటప్పుడు ఇ–ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అమలు చేయాలని కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఆదేశాలు జారీ చేశారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా నామినేషన్ ద్వారా కొనుగోళ్లవైపే మొగ్గు చూపారు. ఇప్పటికే ఏఏ కంపెనీకి ఆర్డర్లు ఇవ్వాలో కూడా నిర్ణయించి వారికి జిల్లాల వారీగా మందుల ఇండెంట్ ఇచ్చారు. తొలి దశలో సుమారు రూ.40 కోట్లతో మందులు కొనుగోలు చేయనున్నారు. ధరలు ఎక్కువని ఇస్తున్నాం ఇ–ప్రొక్యూర్మెంట్ టెండరులో ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే నామినేషన్ కింద ఇస్తున్నాం. ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేసే మందులు అదే ధరకు వచ్చినా వాటినెవరైనా తింటారా? మా రోగులు అలాంటి మాత్రలు తినరు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు లేని విషయం వాస్తవమే. అందుకే నామినేషన్ కింద ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తున్నాం. పైగా ఈఎస్ఐ మందుల టెండర్లలో పాల్గొన్న కంపెనీల ద్వారా మందులు కొంటే రూ.230 కోట్లు నష్టం వస్తుంది. – సామ్రాజ్యం, ఈఎస్ఐ డైరెక్టర్ -
ఈఎస్ఐ ‘డైరెక్టరేట్’పై విజిలెన్స్ దాడులు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలోని ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయంలో సోమవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు విజిలెన్స్ ఎస్పీ జాషువా, విజయవాడ విజిలెన్స్ ఎస్పీ వెంకటరెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ వరదరాజులు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఆస్పత్రి వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. దాదాపు ఏడు గంటలకు పైగా విజిలెన్స్ ఎస్పీలు డైరెక్టరేట్ అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. మందులు, ఫర్నిచర్, సర్జికల్ ఐటమ్స్, రీయోజన్స్‌ల కొనుగోలులో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నట్టు తెలిసింది. ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఆస్పత్రిలో డాక్టర్లు పంపిన ఇండెంట్లకు బదులుగా అధిక కమిషన్లు ఇచ్చే మందులను బలవంతంగా కొనుగోలుచేసి.. భారీ మొత్తంలో నిల్వ ఉంచినట్టు సమాచారం. ఈఎస్ఐ బడ్జెట్ ఎంత? ఎన్ని కొనుగోలు చేస్తారు? వాటిని ఎలా వినియోగిస్తారని విజిలెన్స్ అధికారులు ఆస్పత్రి డైరెక్టరేట్ కార్యాలయ సిబ్బందిని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ మందులను ఏ స్థాయి అధికారి కొనుగోలు చేస్తారన్నదానిపై ఆరా తీశారు. చక్రం తిప్పిన ‘ఆమె’ గత ప్రభుత్వ హయాంలో ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన మహిళకు చెందిన ఫార్మాస్యూటికల్‌కే మందుల కొనుగోళ్లు ఇచ్చినట్టు విజిలెన్స్ తనిఖీల్లో కనుగొన్నారు. రాష్ట్రంలో 16 కంపెనీలున్నా.. ఈ కంపెనీకే ఎందుకు మందుల కొనుగోలు ఇచ్చారనే విషయంపై ఆరా తీశారు. అన్ని సర్జికల్ ఐటమ్స్ ఒకే ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఎలా ఇచ్చారనే దానిపై ప్రధానంగా విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. రూ.10 విలువ చేసే మందును రూ.50కి కొనుగోలు చేయాల్సి వచ్చిన విషయాలపై సిబ్బందిని ప్రశ్నించారు. పైగా ఆ ఫార్మా కంపెనీకి తక్షణమే పేమెంట్లు చెల్లించడంపై కూడా ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. సిరంజిలు వంటివి సైతం నాసిరకమైనవి సరఫరా చేసినట్టు తెలుస్తోంది. వినియోగంలో లేని మందులను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. టెలికేర్ అనే సంస్థకు ఒక్కో ఈసీజీకి రూ.450 నుంచి రూ.500 వరకు ప్రభుత్వం నుంచి వసూలు చేసినట్టు తెలుస్తోంది. బయట ఈసీజీని కేవలం రూ.100 నుంచి రూ.120కే తీస్తారు. విజిలెన్స్ డీజీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆస్పత్రులపై ఈ దాడులు జరుగుతున్నాయి. డైరెక్టరేట్ కార్యాలయం నుంచి 8 వేల పేజీల సమాచారాన్ని తీసుకుని.. దానిని అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్టు తెలుస్తోంది. 2014 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది డైరెక్టర్లు పనిచేశారు.. వారి వివరాలు సైతం సేకరించినట్టు తెలిసింది. మొత్తం మీద ఈఎస్ఐలో రూ.కోట్ల కుంభకోణం జరిగినట్లు స్పష్టమవుతోంది.