విజయనగరం కంటోన్మెంట్ :రైస్‌మిల్లర్లపై ఎట్టకేలకు విజిలెన్స్ అధికారులు దాడులకు ఉపక్రమించారు. పేరుకుపోయిన ధాన్యం నిల్వలు, కస్టమ్ మిల్లింగ్ ముందుకు సాగకపోవడం తదితర కోణాల్లో వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. వీరికి సమాంతరంగా పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా తనిఖీలు చేశారు. కాకపోతే, దాడుల పరిస్థితి చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది. జేసీ ఆదేశాలకు, విజిలెన్స్ దాడులకు మధ్య సమయం ఎక్కువగా ఉండడం వల్ల ఈలోపు మిల్లర్లు జాగ్రత్త పడ్డారని, అందు వల్లేవాస్తవాలు బయటికి రాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మిల్లర్లు లెవీలో రేషన్ బియ్యం వినియోగిస్తున్నారన్న సమాచారంతో పాటు పలుమార్లు రేషన్ బియ్యం కూడా అక్రమ రవాణా జరుగుతూ పట్టుబడడంతో జిల్లాలో ఏదో జరుగుతుందోనన్న అనుమానాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని పక్కన పెట్టి పీడీఎస్ బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్‌గా ఇచ్చేస్తున్నారని, కొన్ని చోట్ల అందుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. వీటిన్నింటిపై ‘సాక్షి’ లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో అంతవరకు నోరు మెదపని జిల్లా అధికారులు డిఫెన్స్‌లో పడ్డారు. చివరకు తమ పీకకు చుట్టుకుంటుందన్న భయంతో కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎదురైంది. అందు లో భాగంగానే మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి, గుట్టురట్టు చేయాలని విజిలెన్స్ అధి కారులకు ఆదేశించారు.
దీంతో మంగళవారం భోగాపురం, డెంకాడ, గంట్యాడ, పార్వతీపురం మండలాల్లోని మిల్లులపై విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఉపకలెక్టర్లు దాడులు నిర్వహించారు. మిల్లుల్లో ఉన్న ధాన్యం నిల్వలు, వారిచ్చిన కస్టమ్ మిల్లింగ్ రైస్, ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉంది? అన్న వివరాలను సేకరించి, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడంతో మిల్లర్లలో వణుకు మొదలైంది. గంట్యాడ మండలం సిరిపురంలోని యడ్ల రమణమూర్తికి చెందిన కృష్ణవేణి మిల్లులో విజిలెన్స్ సీఐలు ఉమాకాంత్, రేవతమ్మల నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. 20 కిలోల ధా న్యం మాత్రమే తేడా వచ్చినట్టు మొదట తేల్చారు. గం ట్యాడ మండలంలోని కనకదుర్గ ఫ్లోర్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు గజపతిరావు నేతృత్వంలో భోగాపురం మండలంలోని శుభకరి రైస్‌మిల్లును, డెంకాడలోని శ్రీమన్నారాయణ రైస్‌మిల్‌ను ఆయా మండలాల తహశీల్దార్లతో కలిసి తనిఖీ చేశారు. అయితే అక్కడ మిల్లుల్లో ఎటువంటి పొరపాట్లూ లేవని తేల్చేశారు.
రికార్డులు మాత్రం నిర్వహించలేదని వారిని రికార్డులు సక్రమంగా నిర్వహించుకోవాలని హె చ్చరించినట్లు డీఎం ఎం గణపతిరావు సాక్షితో చెప్పారు. అదేవిధంగా పార్వతీపురంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీతారామయ్య కూడా మిల్లులను తనిఖీ చేశారు. దీనిపై జాయింట్ కలెక్టర్ బి రామారావు మాట్లాడుతూ విజిలెన్స్ అధికారులు గానీ, తాము నియమించిన ఇతర అధికారులు గానీ రాత్రికి లేదా రేపు ఉదయం నివేదిక ఇస్తారని, నివేదిక ఆధారంగా వారిపై చర్యలు ఉంటాయని తెలి పారు. మిల్లుల్లో లెక్కలు తేలేదాకా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. పూర్తి లెక్కలు తేలాకే మళ్లీ కొనుగోళ్లు చేపడతామన్నారు. అయి తే ఉదయం నుంచే దాడు లు మొదలు పెట్టినా ఏ మిల్లులోనూ అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించలేదు. సిఫార్సులకు, దాడులకు మధ్య సమయం ఎక్కువగా ఉండడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదన్న వాదనలు తాజాగా వినిపిస్తున్నాయి.
రైస్ మిల్లులపై దాడులు
Published Wed, Jan 21 2015 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM