
రేషన్‌డీలర్లపై విజి‘లెన్స్’
► హైదరాబాద్‌లో పట్టుబడిన కిరోసిన్ ట్యాంకర్
► కూపి లాగిన అధికారులు
► పంపిణీ చేయకుండానే చేసినట్లు రికార్డులు
► 11 మందిని విచారించిన అధికారులు
గట్టు : మండలంలోని రేషన్ డీలర్లపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. తీగ లాగితే డొంక కదలినట్లు హైదరాబాదులో రెండు రోజుల క్రితం పట్టుబడిన కిరోసిన్ వ్యవహారంపై గురువారం రాష్ట్ర విజిలెన్స్ అధికారులు గట్టులో విచారణ నిర్వహించారు. రాష్ట్ర విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, నారాయణపేట ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఎస్‌ఓ వనజాక్షి, గద్వాల ఏఎస్‌ఓ ఓం ప్రకాష్ గట్టు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ ఎల్లయ్య సమక్షంలో 11 మంది రేషన్ డీలర్లను విచారించారు. వివరాల్లోకి వెళితే.. రేషన్ షాపుల ద్వారా రాయితీపై అందజేసే కిరోషన్‌ను సరఫరా చేయకుండానే చేసినట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు.
మండలంలోని ఆరగిద్ద-2, చింతలకుంట-2, తుమ్మలచెరువు, రాయాపురం, కుచినేర్ల, యర్సన్‌దొడ్డి,యల్లందొడ్డి, మల్లాపురం, మల్లాపురంతండాల్లో 11 రేషన్ దుకాణాలకు మొత్తం 9199 లీటర్లను సరఫరా చేసినట్లు రికార్డులను సృష్టించినట్లు వారి దృష్టికి వచ్చింది. హైదరాబాదులో విజిలెన్స్ అధికారులు పట్టుకున్న కిరోసిన్ ట్యాంకర్ వ్యవహరంపై కూపి లాగగా గట్టు, మల్దకల్ మండలాలకు చెందిన రేషన్ షాపులకు సరఫరా చేసే కిరోసిన్‌గా గుర్తించినట్లు సమాచారం. 11 రేషన్ షాపులకు కిరోసిన్ సరఫరా చేసినట్లు రికార్డులో నమోదు చేసినట్లు విజిలెన్‌స అధికారులు గుర్తించారు. అయితే 11 మంది రేషన్ డీలర్లను స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. ఆయా షాపులకు పంపిణీ చేసిన సరుకుల వివరాల రికార్డులను పరిశీలించారు. ఏప్రిల్ నెల కోటా కిరోసిన్‌ను రేషన్ దుకాణాలకు సరఫరా చేయలేదని సదరు డీలర్లు అధికారులకు తెలియజేశారు. వీటిపై పూర్తి విచారణ కొనసాగుతుందని, పూర్తి నివేదిక ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఇన్‌స్సెక్టర్ శ్రీధర్ సాక్షికి తెలిపారు.
32వేల లీటర్ల కిరోసిన్ దుర్వినియోగం
గద్వాల : నియోజకవర్గంలోని పలు మండలాల్లో మొత్తం 32వేల లీటర్ల కిరోసిన్ దుర్వినియోగం అయినట్లు విజిలెన్‌స అధికారులు ధ్రువీకరించారు. గురువారం గద్వాలలో వారు విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో విజిలెన్‌స అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. 20 వేల లీటర్ల కిరోసిన్ సరఫరా చేసినట్లు బోగస్ రికార్డులు సృష్టించినట్లు తెలిపారు. మిగతా 12వేల లీటర్ల కిరోసిన్ స్టాక్ ఉన్నట్లు రికార్డులు సృష్టించారని తెలిపారు. స్టాక్ ఎక్కడ ఉందో తెలిజేయడం లేదన్నారు. సమావేశంలో విజిలెన్‌స సీఐ శ్రీధర్ భూపాల్, అధికారులు రాజేష్ చైతన్య, ఖురేష్ ఉన్నారు.
మల్దకల్‌లో..
మండలంలోని పలు గ్రామాల్లో విజిలెన్‌స అధికారులు దాడులు చేశారు. పెద్దపల్లి, బిజ్వారం, ఉలిగేపల్లి, మేకలసోంపల్లి, సద్దలోనిపల్లి, అడవిరావుల్‌చెర్వు, నేతువానిపల్లి, మద్దెలబండ, తాటికుంట, కుర్తిరావుల్‌చెర్వు, నాగర్‌దొడ్డి, విఠలాపురం గ్రామాలలోని రేషన్ షాపులను తనిఖీ చేశారు. రేషన్ డీలర్లకు పంపిణీ చేసిన కిరోసిన్ బిల్లులను పరిశీలించారు. 14మంది డీలర్లకు కిరోసిన్ పంపిణీ చేయకుండానే హోల్‌సేల్ డీలర్ బిల్లులు పంపిణీ చేసినట్లు విచారణలో బయటపడినట్లు అధికారులు తెలి పారు. దాడుల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రాజేష్, సురేష్, రేవతిలతోపాటు రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.