కొమరబండంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ నిర్వాకం
సీఎంఆర్ ధాన్యం పక్కదారిపట్టించినట్లు గుర్తించిన అధికారులు
మిల్లుపై రాష్ట్ర విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు
పరారీలో మిల్లు యజమాని నీల సత్యనారాయణ
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలోని కొమరబండంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ప్రభుత్వం సరఫరా చేసిన రూ.100 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. గడిచిన రెండేళ్లుగా సీఎంఆర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఈ మిల్లుపై మంగళవారం రాష్ట్ర విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ, పోలీస్‌శాఖల అధికారులు 30 మంది బృందంగా ఏర్పడి మూకుమ్మడి దాడి చేశారు.
దాడి విషయాన్ని ముందుగానే పసిగట్టిన మిల్లు యజమాని నీలా సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, మిల్లు భాగస్వాములు పరారైనట్లు అధికారులు తెలిపారు. దాడుల నిర్వహిస్తున్న టీమ్‌లకు జిల్లా అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, పోలీస్ అధికారులు సహకారం అందించారు.
3 సీజన్‌ల నుంచి బియ్యం ఇవ్వడంలేదు.
కొమరబండ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండ్రస్ట్రీస్ గత రెండేళ్లుగా, మూడు సీజన్‌లకు సంబంధించి సుమారు రూ.90 కోట్ల విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు. 2022–23 వానాకాలం సీజన్‌కు సంబంధించి 15,628 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం 7,067 టన్నులు ఆ మిల్లు ఇచ్చిందనీ, 8,607 టన్నుల బియ్యం బకాయి పడిందని చెప్పారు.
ఇక ఇదే సంవత్సరం యాసంగి సీజన్‌కు సంబంధించి 10,408 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 202 టన్నుల బియ్యం మాత్రమే సదరు మిల్లు నుంచి వచ్చిందని, 10, 206 టన్నులు బకాయి పడిందని వివరించారు. దీంతో పాటు 2023–24 వానాకాలం సీజన్‌కు సంబంధించి 2748 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 261 టన్నులు మాత్రమే వచ్చిందనీ, ఇంకా 2487 టన్నులు బకాయి ఉందని తెలిపారు.
ఈ మూడు సీజన్‌లకు సంబంధించి మొత్తం 21,300 టన్నుల బియ్యం ఇవ్వాలని దీని విలువ రూ.90 కోట్ల వరకు ఉంటుందని, అపరాధ రుసుంతో కలిపితే దాదాపు రూ.100 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్
కోదాడకు చెందిన శ్రీ వెంకటేశ్వరరైస్ ఇండ్రస్ట్రీస్ యజమాని నీల సత్యనారాయణ కస్టమ్ మిల్లింగ్ రైస్ సక్రమంగా ఇవ్వకపోవడంతో 2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించి మిల్లుకు కేటాయించిన 15,237 టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర స్థాయిలో వేలం వేశారు.
వేలంలో ధాన్యం దక్కించుకున్న వారు మిల్లు వద్దకు ధాన్యం కోసం వెళితే అక్కడ ఆ ధాన్యం లేదని చెప్పి, దాన్ని మర పట్టించి ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్‌పై పూర్తి నివేదికను రాష్ట్ర కమిషనర్‌కు అందిస్తామని, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment