
అతివేగంతో కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
భార్యాభర్త, కుమార్తె మృతి..కుమారుడి పరిస్థితి విషమం
కారులోని మరో ఏడుగురికి తీవ్ర గాయాలు
చివ్వెంల మండలం బీబీగూడెం శివారులో ఘటన
చివ్వెంల (సూర్యాపేట): బంధువులందరితో కలిసి సంతోషంగా ఉప్పలమ్మ పండుగ జరుపుకున్నారు.. పిల్లాపాపలతో కలిసి ఉల్లాసంగా గడిపారు. వారి సంతోషాన్ని చూసి మృత్యువుకు కన్నుకుట్టిందేమో.. కుటుంబాన్ని మొత్తం ఒకేసారి కబలించింది. బంధువుల ఇంట్లో పండుగకు వెళ్లి తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైంది. తీవ్ర గాయాలపాలైన ఓ బాలుడు అనాథగా మిగిలాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై ఆదివారం జరిగింది.
నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌తో..
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కంటయపాలెం గ్రామానికి చెందిన గడ్డం రవీందర్ (34) హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య రేణుక (29), కుమార్తె రిషిత (7), కుమారుడు రిషిక్రిష్ణ ఉన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం కోటపహాడ్ గ్రామంలో రేణుక మేనమామ కోతి జనార్ధన్ ఇంట్లో ఉప్పలమ్మ పండుగ కోసం రవీందర్ కుటుంబంతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి కోటపహాడ్‌కు వచ్చాడు.
పండుగ ముగిసిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో పాటు అతడి బావమరిది గంధం మధు, అతడి కుమార్తె సాన్విక, కుమారులు గగన్ చందర్, మల్లికార్జున్, అర్వపల్లి మండలం పర్సాయిపల్లి గ్రామానికి చెందిన రవీందర్ బంధువు కడారి పుష్ప, ఆమె కుమారులు హర్షిత్, జాగ్విన్ కలిసి కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు. కారు బీబీగూడెం గ్రామ శివారులోకి రాగానే సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న వీరి కారును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న రవీందర్, అతడి భార్య రేణుక, కుమార్తె రిషిత అక్కడికక్కడే మృతిచెందారు. రవీందర్ కుమారుడు రిషిక్రిష్ణతోపాటు మరో ఇద్దరు చిన్నారులు హర్షిత్, గగన్ చందర్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. రవీందర్, రేణుక తలలు ఛిద్రం కావడంతో పోస్టుమార్టం సోమవారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఒక్కపూట ఉండమన్నా ఉండలే..
ఒక్కపూట ఉండి వెళ్లమని చెప్పినా వినకుండా హైదరాబాద్‌కు బయల్దేరిన అరగంట లోపే తమవారి మరణవార్త తెలియడంతో మృతుల బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఒక్కపూట గ్రామంలో ఆగినా ఈ ఘోర ప్రమాదం తప్పేదని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment