Rishita
-
సోషల్ మెసేజ్‌తో ‘కావేరి’
రిషిత, ఫైజల్, షేక్ అల్లాబకాషు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కావేరి". రాజేష్ నెల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కావేరి సినిమా, ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా హీరోయిన్ రిషిత మాట్లాడుతూ - పేరెంట్స్ ఎప్పుడూ అమ్మాయిలకే జాగ్రత్తలన్నీ చెబుతుంటారు. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది. ఇవే జాగ్రత్తలు అబ్బాయిలకు చెబితే అమ్మాయిల పట్ల ఇన్ని అకృత్యాలు ఈరోజు సొసైటీలో జరగవు. ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే అదే తల్లిదండ్రులు ఎంతో వేదనకు గురవుతారు. మా సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉంది’ అన్నారు. ‘కావేరి సినిమా ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో అందరికీ కనువిప్పు కలిగించేలా ఉంటుంది. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ కుదిరింది’ అని సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అన్నారు. ‘నన్ను నేను బిగ్ స్క్రీన్ మీద చూసుకోవడం ఎంతో హ్యాపీగా ఉంది. కావేరి అందరికి నచ్చుతుంది’ అని హీరో ఫైజల్ అన్నారు.‘ఇందులో కావేరి క్యారెక్టర్ బోల్డ్ గా, రా అండ్ రస్టిగ్ గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ లో రిషిత ఆకట్టుకునేలా నటించారు. రాజ్ కిరణ్ మ్యూజిక్ మా మూవీకి ఆకర్షణ అవుతుంది. మంచి సోషల్ మెసేజ్ తో మేము చేసిన చిత్రమిది’ అని డైరెక్టర్ రాజేశ్ నెల్లూరు అన్నారు.‘అబ్బాయిల ప్రవర్తన బాగుంటే అమ్మాయిలు సేఫ్ గా ఉంటారు. తమపై దాడులు జరిగినప్పుడు అమ్మాయిలు ధైర్యంగా ఎదుర్కోవాలి అనే అంశాలను ఈ మూవీలో చూపిస్తున్నాం. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా చూడాల్సిన చిత్రమిది’ అని నిర్మాత షేక్ అల్లాబకాషు అన్నారు. -
తల్లిదండ్రుల కష్టం ఏమిటో అర్థం చేసుకోలేని స్థితిలోనూ! శెభాష్ బిడ్డా..
Special Olympics 2023: ‘‘కష్టాలురానీ కన్నీళ్లురానీ.. ఏమైనాగానీ ఎదురేదీరానీ.. ఓడీపోవద్దు రాజీపడొద్దు.. నిద్రే నీకొద్దు నింగే నీ హద్దు.. గెలుపు పొందె వరకు.. అలుపు లేదు మనకు’’.. కష్టాల కడలిలో కొట్టుకుపోతున్నా సానుకూల దృక్పథం వీడొద్దని, సంకల్ప బలం ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ ఉండదంటూ స్ఫూర్తిని రగిల్చాడో సినీకవి. నిరాశలో కూరుకుపోయిన వారిని తట్టిలేపి గమ్యం వైపు పరుగులు తీయమని చాటిచెప్పే ఈ పాటలోని ప్రతీ వాక్యం రిషితకు సరిగ్గా సరిపోతుంది. వైకల్యం కేవలం శరీరానికి మాత్రమే కానీ ఆత్మవిశ్వాసానికి కాదని నిరూపించిన ఈ బంగారు తల్లిది సంగారెడ్డి. అమ్మ కడుపులో ఉండగానే అమ్మ కడుపులో ఉండగానే కవల సోదరుడిని పోగొట్టుకుని.. డౌన్ సిండ్రోమ్ బారిన పడ్డ రిషితను కంటికి రెప్పలా కాపాడుకున్నారు తల్లిదండ్రులు. గుండెకు రంధ్రంతో పాటు వైకల్యంతో జన్మించిన తమ చిన్నారిని చూసి జాలి పడ్డవారే.. శెభాష్ బిడ్డా అని అభినందించే స్థాయికి తీసుకువచ్చారు. అమ్మానాన్నలు తనకోసం పడుతున్న కష్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ వారితో పాటు దేశం మొత్తం గర్వపడేలా చేసింది రిషిత. బెర్లిన్‌లో జరిగిన స్పెషల్ ఒలంపిక్స్‌లో రజత పతకాలు సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. అసాధారణ ప్రతిభతో రోలర్ స్కేటింగ్‌లో సత్తా చాటి మెడల్స్‌తో తిరిగి వచ్చింది. ఇబ్బందులు ఉన్నా బీహెచ్ఈఎల్కు చెందిన ప్రశాంత్‌రెడ్డి- మాధవి దంపతులు తమకు కవలలు పుట్టబోతున్నారన్న వైద్యుల మాట విని ఎంతగానో మురిసిపోయారు. ఇద్దరు పిల్లల ఆలనాపాలనా, బంగారు భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కన్నారు. కానీ విధిరాత మరోలా ఉంది. గర్భంలో ఉండగానే పిల్లాడు చనిపోయాడు.. ఆ ప్రభావం అతడి కవల సోదరి రిషితపై కూడా పడింది. డౌన్‌సిండ్రోమ్ బారిన పడిందామె. పైగా పుట్టిన తొమ్మిది నెలల తర్వాత రిషిత గుండెలో రంధ్రం ఉందన్న భయంకర నిజం తల్లిదండ్రులకు తెలిసింది. గుండె నిబ్బరంతో కడుపులో ఉండగానే ఓ బిడ్డను పోగొట్టుకుని.. భూమ్మీదకు వచ్చిన పాపాయి కూడా ఎంతకాలం బతుకుందో తెలియని పరిస్థితిలోనూ ప్రశాంత్‌రెడ్డి- మాధవి గుండె నిబ్బరం కోల్పోలేదు. తాము ఊపిరి పోసిన ప్రాణాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వెనుకడుగు వేయలేదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించి.. వారి సాయంతో పాపకు చికిత్స చేయించారు. అందరిలా కాకుండా మరింత ప్రత్యేకంగా ఉన్న తమ బుజ్జాయిని స్పెషల్ కేర్ స్కూళ్లో చేర్పించారు. ఆత్మవిశ్వాసం సడలనివ్వకుండా అక్కడే రిషిత జీవితం మలుపు తిరిగింది. ఆమెలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభను ట్రైనర్ గుర్తించాడు. దీంతో రోలర్ స్కేటింగ్‌లో ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు. అంతేకాదు రిషితలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా వివిధ నగరాల్లో జరిగిన పోటీలకు సైతం తీసుకువెళ్లేవారు. అలా ఒక్కో అడుగు వేస్తూ రిషిత స్పెషల్ ఒలంపిక్స్‌కు అర్హత సాధించింది. ఆమె టాలెంట్‌ను గుర్తించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా మద్దతుగా నిలిచింది. తల్లిదండ్రులు, కోచ్ ఇచ్చిన ప్రోత్సాహంతో రిషిత అంచెలంచెలుగా ఎదిగింది. తప్పకుండా ఒలంపిక్స్‌లో మెడల్ సాధిస్తుందన్న వారి నమ్మకాన్ని నిలబెడుతూ స్పెషల్ ఒలంపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించింది. నిజంగా స్ఫూర్తిదాయకం చిన్న చిన్న మనస్పర్థలు, గొడవలకే విడిపోయే దంపతులు ఉన్న ఈ సమాజంలో సంతానం విషయంలో ఎంతటి కష్టం వచ్చినా తట్టుకుని నిలబడ్డ ప్రశాంత్‌రెడ్డి- మాధవి నిజంగా ఈతరం జంటలకు ఆదర్శనీయం. పదహారేళ్లుగా బిడ్డను పసిపాపలా సాకుతూ ఆమెను ఈ స్థాయికి చేర్చిన వారిద్దరికీ హ్యాట్సాఫ్! అదే విధంగా.. వైకల్యాన్ని జయించి తల్లిదండ్రులను సగర్వంగా తలెత్తుకునేలా చేసిన రిషితకు అభినందనలు!! 190 దేశాల నుంచి వచ్చిన అథ్లెట్ల నుంచి పోటీని తట్టుకుని గెలుపొందిన ఆమెకు జేజేలు!! ప్రభుత్వం రిషిత లాంటి స్పెషల్ కిడ్స్‌కు చిన్నప్పటి నుంచే అండగా నిలిస్తే అమ్మానాన్నలతో పాటు ఆ పిల్లలకు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని రిషిత తల్లిదండ్రులు అంటున్నారు. నిజమే కదా!! ఏమిటీ స్పెషల్ ఒలంపిక్స్? శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా 1968లో స్పెషల్ ఒలంపిక్స్ ఆరంభించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు 32 క్రీడా విభాగాల్లో పోటీపడతారు. అథ్లెటిక్స్, సైక్లింగ్, పవర్‌లిఫ్టింగ్, రోలర్‌స్కేటింగ్, స్విమ్మింగ్ ఇలా వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తారు. -సుష్మారెడ్డి యాళ్ల చదవండి: సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా! -
ఎకో గణేశా! ఏకదంత గణేశా!!
ఏ సామాజిక ఉద్యమానికైనా పిల్లలను మించిన సారథులు మరెవరూ ఉండరు. వాళ్ల మెదడులో ఒక బీజాన్ని నాటితే అది మొలకెత్తి మహావృక్షమై పెరుగుతుంది. ఉద్యమం ఉద్దేశం నెరవేరి తీరుతుంది. ‘మట్టి గణేశుడిని పూజిద్దాం’ అని పెద్దవాళ్లకు ఎంతగా చెప్పినా అలా విని ఇలా వదిలేస్తారు. అదే పిల్లలకు చెబితే చేసి చూపిస్తారు. గణేశ చతుర్ధి అంటేనే పిల్లల పండుగ. ఆ వేడుక కోసం పిల్లల చేతనే గణేశుడి బొమ్మను తయారు చేయిస్తే ఎలా ఉంటుంది? మట్టితో గణేశుడి విగ్రహాన్ని చేయడమెలాగో పిల్లలకు నేర్పిస్తే చాలు. ఎంతటి రంగురంగుల ఆకర్షణీయమైన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు కనిపించినా సరే పిల్లలు వాటి వంక కూడా చూడరు. బెంగళూరుకు చెందిన రిషితాశర్మ కూడా అలాంటి ప్రయోగాన్నే చేస్తున్నారు. ఉద్యమ సాధనం రిషితాశర్మ జీరో వేస్ట్ యాక్టివిస్ట్. ప్రజల్లో సామాజిక చైతన్యం తీసుకురావడానికి ఆమె గత ఆరేళ్లుగా గ్రీన్ ఉత్సవ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణేశ విగ్రహాల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన రిషిత 2017 నుంచి మట్టి గణేశుడి తయారీ వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. బెంగళూరులో తాను నివసించే వైట్ ఫీల్డ్‌లో ఉన్న అపార్ట్మెంట్ సొసైటీ నుంచే మొదలు పెట్టారామె. ఏడాదికి నలభై వర్క్‌షాప్‌లతో మొత్తం ఎనిమిది వందల మందికి మట్టి వినాయకుడి బొమ్మల తయారీ నేర్పిస్తున్నారు. అందులో ఎక్కువగా పిల్లలను భాగస్వాములను చేస్తున్నారు. అరగంటలో రెడీ వినాయకుని బొమ్మ చేయడానికి బంకమట్టి, నీరు, టూత్ పిక్‌లు(ఏదో ఒక పుల్లలు), చాకు లేదా స్పూన్ తీసుకోవాలి. మట్టిని ఫొటోలో ఉన్నట్లుగా తయారు చేసుకోవాలి. పుల్లల సహాయంతో మట్టి ముద్దలను జత చేయాలి. మట్టి ముద్దను స్పూన్‌తో వత్తి చెవుల ఆకారం వచ్చేటట్లు చేయాలి. పాదాలకు, చేతులకు వేళ్లను పుల్లతో లేదా స్పూన్ చివరతో నొక్కుతూ గీయాలి. తలపాగా కూడా అంతే. రంగులు కావాలంటే కృత్రిమ రంగుల జోలికి పోకుండా ఇంట్లో ఉండే పసుపు, బీట్రూట్ రసంతో విగ్రహానికి రంగులు అద్దాలి. ఇంకా ఆకర్షణీయంగా కావాలనుకుంటే పెసలు, మినుములు, కూరగాయల గింజలు, ఆవాల వంటి దినుసులను మట్టిలో కలుపుకోవచ్చు లేదా వినాయకుడి విగ్రహం మీద అలంకరించవచ్చు. అయితే ఇవి తప్పనిసరి కాదు. ఎప్పటికీ పండగే వినాయక చవితి వేడుకలు పూర్తయిన తర్వాత విగ్రహాన్ని నీటిలో కరిగించి ఆ మట్టిని మొక్కలకు పోసుకోవచ్చు. మట్టిలో కనుక గింజలను కలిపి ఉంటే... ఒక మడిని సిద్ధం చేసుకుని ఆ మడిలో వినాయకుడిని కరిగించిన మట్టి నీటిని పోయాలి. ఓ వారానికి మొలకల రూపంలో పచ్చదనం ఇంటి ఆవరణలో వెల్లివిరుస్తుంది. ఆ పచ్చదనం ఎప్పటికీ వాడని పండుగ. -
నచ్చకపోతే తిట్టండి
‘‘పండుగాడి ఫొటో స్టూడియో’ సినిమా నచ్చితే ఇతరులకు చెప్పండి.. నచ్చకపోతే నన్ను తిట్టండి. ఎక్కడైనా తప్పు ఉంటే ఎత్తి చూపండి.. సరిదిద్దుకుంటాను’’ అని దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. అలీ, రిషిత జంటగా పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ– ‘‘రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ఏపీలో చిత్రీకరించిన తొలి సినిమా మాదే. ఈ సినిమాలో మా హీరో ఎవరికి ఫొటో తీస్తే వారికి పెళ్లయిపోతుంది. ఎందుకు అలా జరుగుతుంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. పూర్తి గ్రామీణ నేపథ్యంలో మా చిత్రం కొనసాగుతుంది. మా కథను దర్శకుడు సుకుమార్‌గారు ఓకే చేసిన తర్వాతే చిత్రీకరణ మొదలుపెట్టాం. దర్శకులు జంధ్యాల, కె. బాలచందర్ గార్ల ఆశీర్వాదం మా సినిమాకి ఉంటుందని భావిస్తున్నా. యాజమాన్య చక్కని సంగీతం అందించారు. ఈ చిత్రంలో అలీని కమర్షియల్ హీరోగా చూపించాను. నేను బ్లాక్‌బస్టర్ తీశానా? సక్సెస్ఫుల్ సినిమా తీశానా? ఫెయిల్యూర్ సినిమా తీశానా? అని నిర్ణయించేది ప్రేక్షకులే. వారి తీర్పు కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. -
పండుగాడు వస్తున్నాడు
అలీ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. ఈ చిత్రంలో రిషిత కథానాయికగా నటించారు. దిలీప్ రాజా దర్శకత్వంలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలలో ఈ సినిమా విడుదల కానుంది. ‘‘ఈ సినిమాలో హీరో అలీ ఎవరికి ఫోటో తీస్తే వారికి పెళ్లి కుదురుతుంది. ఇదే ప్రధానాంశం. కుటుంబ సమేతంగా చూడదగ్గ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం. చక్కటి పాటలు, ఫైట్స్‌తో అలీ ప్రేక్షకులను అలరిస్తారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని చిత్రబృందం తెలిపింది. బాబూ మోహన్, వినోద్‌కుమార్, జీవ, సుధ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు యాజమాన్య సంగీతం అందించారు. -
ఫొటో తీస్తే పెళ్లయిపోద్ది
అలీ, రిషిత జంటగా దిలీప్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. ‘వీడు ఫోటో తీస్తే పెళ్లయి పోద్ది’ అన్నది ఉపశీర్షిక. పెదరావూరు ఫిలింసిటీ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ– ‘‘జంధ్యాల మార్క్ కామెడీతో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో మా హీరో అలీ ఎవరికి ఫొటో తీస్తే వారికి పెళ్లి అయిపోతుంది. ఇందులోని పాత్రలు విలక్షణంగా, నటీనటుల పేర్లు వైవిధ్యంగా ఉంటాయి. నూతన నటుడు సందీప్ రాజా, టీనా చౌదరి ఈ చిత్రంలో విలక్షణ పాత్రలు పోషించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని ఈ నెలాఖరులో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. బాబుమోహన్, సుధ, జీవా, శ్రీలక్ష్మీ, రామ్‌జగన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: మురళీమోహన్ రెడ్డి. -
వినోదాల స్టూడియో
హాస్య నటుడు అలీ హీరోగా నటించిన చిత్రం ‘పండుగాడి ఫోటోస్టూడియో’. ‘వీడు ఫోటో తీస్తే పెళ్లయి పోద్ది’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమాతో రిషిత హీరోయిన్గా పరిచయమవుతున్నారు. దిలీప్ రాజా దర్శకత్వంలో పెదరావురు ఫిలిం సిటీ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ సుకుమార్‌గారు ఓకే చేసిన కథ ఇది. జంధ్యాల మార్క్ కామెడీ ఉంటుంది. ఈ చిత్రంలో హీరోకి 40 సంవత్సరాలు వచ్చేవరకు పెళ్లి కాదనే నాగదేవత శాపం ఉంటుంది. ఆ క్రమంలోనే కంచు కనకరత్నంతో ప్రేమలో పడతాడు హీరో. వీరి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కిందా? నాగదేవత శాపం వల్ల ఆగిందా? అన్నది ఆసక్తికరం. పూర్తి హాస్యభరిత చిత్రమిది. 1150 చిత్రాల్లో నటించిన అలీగారు ఈ చిత్రంలో హీరోగా మంచి నటనని ప్రదర్శించారు. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, కెమెరా: మురళీమోహన్ రెడ్డి. -
జంధ్యాల మార్క్ కామెడీతో.
హాస్యనటుడు అలీ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. (వీడు ఫోటో తీస్తే పెళ్లి అయిపోద్ది) అన్నది ట్యాగ్‌లైన్. రిషిత కథానాయికగా నటిస్తున్నారు. దిలీప్ రాజా దర్శకత్వంలో పెదరావూరు ఫిల్మ్ స్టూడియో పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రం గుంటూరు జిల్లా తెనాలిలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ క్లాప్ ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. దిలీప్ రాజా మాట్లాడుతూ– ‘‘హాస్యానికి, అపహాస్యానికి రెండు అక్షరాలు మాత్రమే తేడా. దీన్ని గమనించే పూర్తిస్థాయి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులతో మా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. హాస్యంలో జంధ్యాలగారి, దర్శకత్వంలో బాలచందర్‌గారి ప్రభావం నాపై ఉంటుంది. అందుకే దేవుళ్లను మొక్కకుండా వారికే మొక్కాను. ఈ సినిమా జంధ్యాల మార్క్ కామెడీగా ఉంటుంది’’ అన్నారు. ‘‘కథ చాలా బాగుంది. ఇళయరాజాగారి వద్ద పనిచేసిన యాజమాన్య సంగీతంలో, శ్రేయా ఘోషల్ పాడిన పాటలు ప్రేక్షకులని మెప్పిస్తాయి. చాలా కాలం తర్వాత ఫుల్ కామెడీ సినిమా చేస్తున్నాను. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అని అలీ అన్నారు. ప్రదీప్ రావత్, జీవ, సుధ, దేవిశ్రీ, ‘చిత్రం’ శ్రీను, టీనా చౌదరి, ‘జబర్దస్త్’ రాము తదితరులు నటిస్తున్నారు. -
తల్లిదండ్రుల ఒత్తిడే ఆ విద్యార్థిని ప్రాణం తీసిందా?
నల్గొండ: ఆ విద్యార్థిని అప్పటి వరకు బాగానే ఉంది. క్లాస్‌కు కూడా వెళ్లింది. ఇంతలో ఏమైందో ఏమో, తాను చదువుతున్న స్కూల్ భవనం పైనుంచి దూకేసింది. నిండు ప్రాణాలను బలవంతంగా తీసేకుంది. కన్నవారికి తీరని కడుపుకోత మిగిల్చింది. నల్గొండ జిల్లా కోదాడలో ఈ దుర్ఘటన జరిగింది. విగతజీవిగా మారిన ఆ అమ్మాయి పేరు రిషిత. ఓ ప్రైవేట్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. తెలంగాణ బంద్ కావడంతో టెన్త్ విద్యార్థులకు ఉపాధ్యాయులు ఒక గంట క్లాస్ మాత్రమే పెట్టారు . క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి బయల్దేరిన రిషిత, బుక్స్ మర్చిపోయానంటూ మళ్లీ లోపలికి వెళ్లింది. అంతే ఇక తిరిగిరాలేదు. వాచ్‌మేన్, తోటి విద్యార్థులు చూస్తుండగానే స్కూల్ 5వ అంతస్థు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. రిషిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిషిత తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. కూతురి భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రిషిత కూడా బాగానే చదువుతుందని, మంచి మార్కులు తెచ్చుకుంటుందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. స్కూల్ యాజమాన్యం మాత్రం రిషితపై తల్లిదండ్రుల ఒత్తిడి ఎక్కువగా ఉండేదని, అందువల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.