Berlin Special Olympics 2023: Sangareddy Rishitha Won Silver, Know Her Inspiring Life Journey In Telugu - Sakshi
Sakshi News home page

Special Olympics Silver Winner Rishitha Story: తల్లిదండ్రుల కష్టం ఏమిటో అర్థం చేసుకోలేని స్థితిలోనూ! శెభాష్‌ బిడ్డా.. బంగారు తల్లివే!

Published Mon, Jul 10 2023 7:12 PM | Last Updated on Fri, Jul 21 2023 7:46 PM

Berlin Special Olympics 2023: Sangareddy Rishitha Won Silver Inspiring Story - Sakshi

Special Olympics 2023: ‘‘కష్టాలురానీ కన్నీళ్లురానీ.. ఏమైనాగానీ ఎదురేదీరానీ.. ఓడీపోవద్దు రాజీపడొద్దు.. నిద్రే నీకొద్దు నింగే నీ హద్దు.. గెలుపు పొందె వరకు.. అలుపు లేదు మనకు’’.. కష్టాల కడలిలో కొట్టుకుపోతున్నా సానుకూల దృక్పథం వీడొద్దని, సంకల్ప బలం ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ ఉండదంటూ స్ఫూర్తిని రగిల్చాడో సినీకవి.

నిరాశలో కూరుకుపోయిన వారిని తట్టిలేపి గమ్యం వైపు పరుగులు తీయమని చాటిచెప్పే ఈ పాటలోని ప్రతీ వాక్యం రిషితకు సరిగ్గా సరిపోతుంది. వైకల్యం కేవలం శరీరానికి మాత్రమే కానీ ఆత్మవిశ్వాసానికి కాదని నిరూపించిన ఈ బంగారు తల్లిది సంగారెడ్డి.

అమ్మ కడుపులో ఉండగానే
అమ్మ కడుపులో ఉండగానే కవల సోదరుడిని పోగొట్టుకుని.. డౌన్‌ సిండ్రోమ్‌ బారిన పడ్డ రిషితను కంటికి రెప్పలా కాపాడుకున్నారు తల్లిదండ్రులు. గుండెకు రంధ్రంతో పాటు వైకల్యంతో జన్మించిన తమ చిన్నారిని చూసి జాలి పడ్డవారే..  శెభాష్‌ బిడ్డా అని అభినందించే స్థాయికి తీసుకువచ్చారు.

అమ్మానాన్నలు తనకోసం పడుతున్న కష్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ వారితో పాటు దేశం మొత్తం గర్వపడేలా చేసింది రిషిత. బెర్లిన్‌లో జరిగిన స్పెషల్‌ ఒలంపిక్స్‌లో రజత పతకాలు సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. అసాధారణ ప్రతిభతో రోలర్‌ స్కేటింగ్‌లో సత్తా చాటి మెడల్స్‌తో తిరిగి వచ్చింది.

ఇబ్బందులు ఉన్నా
బీహెచ్‌ఈఎల్‌కు చెందిన ప్రశాంత్‌రెడ్డి- మాధవి దంపతులు తమకు కవలలు పుట్టబోతున్నారన్న వైద్యుల మాట విని ఎంతగానో మురిసిపోయారు. ఇద్దరు పిల్లల ఆలనాపాలనా, బంగారు భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కన్నారు. కానీ విధిరాత మరోలా ఉంది.

గర్భంలో ఉండగానే పిల్లాడు చనిపోయాడు.. ఆ ప్రభావం అతడి కవల సోదరి రిషితపై కూడా పడింది. డౌన్‌సిండ్రోమ్‌ బారిన పడిందామె. పైగా పుట్టిన తొమ్మిది నెలల తర్వాత రిషిత గుండెలో రంధ్రం ఉందన్న భయంకర నిజం తల్లిదండ్రులకు తెలిసింది.

గుండె నిబ్బరంతో
కడుపులో ఉండగానే ఓ బిడ్డను పోగొట్టుకుని.. భూమ్మీదకు వచ్చిన పాపాయి కూడా ఎంతకాలం బతుకుందో తెలియని పరిస్థితిలోనూ ప్రశాంత్‌రెడ్డి- మాధవి గుండె నిబ్బరం కోల్పోలేదు. తాము ఊపిరి పోసిన ప్రాణాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వెనుకడుగు వేయలేదు.

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించి.. వారి సాయంతో పాపకు చికిత్స చేయించారు. అందరిలా కాకుండా మరింత ప్రత్యేకంగా ఉన్న తమ బుజ్జాయిని స్పెషల్‌ కేర్‌ స్కూళ్లో చేర్పించారు.

ఆత్మవిశ్వాసం సడలనివ్వకుండా
అక్కడే రిషిత జీవితం మలుపు తిరిగింది. ఆమెలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభను ట్రైనర్‌ గుర్తించాడు. దీంతో రోలర్‌ స్కేటింగ్‌లో ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు.

అంతేకాదు రిషితలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా వివిధ నగరాల్లో జరిగిన పోటీలకు సైతం తీసుకువెళ్లేవారు. అలా ఒక్కో అడుగు వేస్తూ రిషిత స్పెషల్‌ ఒలంపిక్స్‌కు అర్హత సాధించింది. ఆమె టాలెంట్‌ను గుర్తించిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కూడా మద్దతుగా నిలిచింది.

తల్లిదండ్రులు, కోచ్ ఇచ్చిన ప్రోత్సాహంతో రిషిత అంచెలంచెలుగా ఎదిగింది. తప్పకుండా ఒలంపిక్స్‌లో మెడల్‌ సాధిస్తుందన్న వారి నమ్మకాన్ని నిలబెడుతూ స్పెషల్‌ ఒలంపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించింది. 

నిజంగా స్ఫూర్తిదాయకం
చిన్న చిన్న మనస్పర్థలు, గొడవలకే విడిపోయే దంపతులు ఉన్న ఈ సమాజంలో సంతానం విషయంలో ఎంతటి కష్టం వచ్చినా తట్టుకుని నిలబడ్డ ప్రశాంత్‌రెడ్డి- మాధవి నిజంగా ఈతరం జంటలకు ఆదర్శనీయం. పదహారేళ్లుగా బిడ్డను పసిపాపలా సాకుతూ ఆమెను ఈ స్థాయికి చేర్చిన వారిద్దరికీ హ్యాట్సాఫ్‌! 

అదే విధంగా.. వైకల్యాన్ని జయించి తల్లిదండ్రులను సగర్వంగా తలెత్తుకునేలా చేసిన రిషితకు అభినందనలు!! 190 దేశాల నుంచి వచ్చిన అథ్లెట్ల నుంచి పోటీని తట్టుకుని గెలుపొందిన ఆమెకు జేజేలు!!

ప్రభుత్వం రిషిత లాంటి స్పెషల్‌ కిడ్స్‌కు చిన్నప్పటి నుంచే అండగా నిలిస్తే అమ్మానాన్నలతో పాటు ఆ పిల్లలకు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని రిషిత తల్లిదండ్రులు అంటున్నారు. నిజమే కదా!!

ఏమిటీ స్పెషల్‌ ఒలంపిక్స్‌?
శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా 1968లో స్పెషల్‌ ఒలంపిక్స్‌ ఆరంభించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు 32 క్రీడా విభాగాల్లో పోటీపడతారు. అథ్లెటిక్స్‌, సైక్లింగ్‌, పవర్‌లిఫ్టింగ్‌, రోలర్‌స్కేటింగ్‌, స్విమ్మింగ్‌ ఇలా వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తారు. 
-సుష్మారెడ్డి యాళ్ల

చదవండి: సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement