Sudden attacks
-
ఒకే ఒక్క రైస్ మిల్లు... రూ. వంద కోట్ల ధాన్యం దగా
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలోని కొమరబండంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ప్రభుత్వం సరఫరా చేసిన రూ.100 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. గడిచిన రెండేళ్లుగా సీఎంఆర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఈ మిల్లుపై మంగళవారం రాష్ట్ర విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ, పోలీస్‌శాఖల అధికారులు 30 మంది బృందంగా ఏర్పడి మూకుమ్మడి దాడి చేశారు. దాడి విషయాన్ని ముందుగానే పసిగట్టిన మిల్లు యజమాని నీలా సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, మిల్లు భాగస్వాములు పరారైనట్లు అధికారులు తెలిపారు. దాడుల నిర్వహిస్తున్న టీమ్‌లకు జిల్లా అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, పోలీస్ అధికారులు సహకారం అందించారు. 3 సీజన్ల నుంచి బియ్యం ఇవ్వడంలేదు. కొమరబండ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండ్రస్ట్రీస్ గత రెండేళ్లుగా, మూడు సీజన్లకు సంబంధించి సుమారు రూ.90 కోట్ల విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు. 2022–23 వానాకాలం సీజన్‌కు సంబంధించి 15,628 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం 7,067 టన్నులు ఆ మిల్లు ఇచ్చిందనీ, 8,607 టన్నుల బియ్యం బకాయి పడిందని చెప్పారు. ఇక ఇదే సంవత్సరం యాసంగి సీజన్‌కు సంబంధించి 10,408 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 202 టన్నుల బియ్యం మాత్రమే సదరు మిల్లు నుంచి వచ్చిందని, 10, 206 టన్నులు బకాయి పడిందని వివరించారు. దీంతో పాటు 2023–24 వానాకాలం సీజన్‌కు సంబంధించి 2748 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 261 టన్నులు మాత్రమే వచ్చిందనీ, ఇంకా 2487 టన్నులు బకాయి ఉందని తెలిపారు. ఈ మూడు సీజన్లకు సంబంధించి మొత్తం 21,300 టన్నుల బియ్యం ఇవ్వాలని దీని విలువ రూ.90 కోట్ల వరకు ఉంటుందని, అపరాధ రుసుంతో కలిపితే దాదాపు రూ.100 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్ కోదాడకు చెందిన శ్రీ వెంకటేశ్వరరైస్ ఇండ్రస్ట్రీస్ యజమాని నీల సత్యనారాయణ కస్టమ్ మిల్లింగ్ రైస్ సక్రమంగా ఇవ్వకపోవడంతో 2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించి మిల్లుకు కేటాయించిన 15,237 టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర స్థాయిలో వేలం వేశారు. వేలంలో ధాన్యం దక్కించుకున్న వారు మిల్లు వద్దకు ధాన్యం కోసం వెళితే అక్కడ ఆ ధాన్యం లేదని చెప్పి, దాన్ని మర పట్టించి ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్‌పై పూర్తి నివేదికను రాష్ట్ర కమిషనర్‌కు అందిస్తామని, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం
ర్యాంపులపై అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక దాడులు మూడు లారీల పట్టివేత నిఘా పెంచాలని ఆదేశం చోడవరం : జిల్లాలో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియాపై జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ కన్నెర్ర చేశారు. నేరుగా ఆయనే ఆకస్మిక దాడులు చేసి అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించారు. దీంతో ఇసుక అక్రమ రవాణాపై ఇన్నాళ్లూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగంలోనూ కదలిక వచ్చినట్లైంది. చోడవరం నియోజకవర్గ పరిధి శారద, పెద్దేరు, బొడ్డేరు నదీ పరీవాహక ప్రాంతాల్లోని గోవాడ, గజపతినగరం, గౌరీపట్నం, మార్టమ్మరేవు, లక్ష్మీపురం కల్లాల పరిధిలోని ఇసుక ర్యాంపులపై ఆదివారం అర్ధరాత్రి దాడులు చేశారు. ఇసుక లోడుకు సిద్ధంగా ఉన్న మూడు లారీలను, పలువురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై నిఘా మరింత పెంచాలని, రాత్రి సమయాల్లో గస్తీ విస్తృతం చేయాలని సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు. కనిపించిన ఇసుక లారీలన్నింటినీ సీజ్ చేస్తున్నారు. ఎస్పీయే నేరుగా రంగంలోకి దిగడంతో కిందస్థాయి పోలీసు అధికారులు ఉరుకు పరుగులు తీశారు. మాఫియా గుండెల్లో గుబులు అధికారుల నిర్లక్ష్యం పుణ్యమాని ఇన్నాళ్లూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ, అక్రమంగా నదులు, గెడ్డల్లో ఇసుకను తరలించుకుపోతూ ప్రభుత్వానికి ఒక్కపైసా కూడా ఆదాయం రానీయకుండా ఇసుక మాఫియా ఏటా రూ.కోట్లు ఆర్జిస్తున్న విషయం తెలిసిందే. దీనివల్ల నదులు, గెడ్డలపై ఉన్న వంతెనలు, గ్రోయిన్లు, ఆనకట్టలు దెబ్బతింటున్నాయి. వీటిని సంరక్షించాల్సిన రెవెన్యూ, పోలీసు, భూగర్భ గనులు, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ శాఖలు ఇసుమంతైనా పట్టించుకోవడంలేదు. అడపాదడపా నామమాత్రంగా కేసులు పెడుతుండడంతో అక్రమార్కులు తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇటీవల పలువురు రెవెన్యూ అధికారులపై మాఫియా పలు చోట్ల దాడులు కూడా చేయగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కొత్తగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కోయ ప్రవీణ్ ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపే చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఎక్కడా ఇసుక తవ్వకాలు, రవాణా జరగకుండా చర్యలు మరింత పెంచాలని కిందస్థాయి పోలీసు అధికారులకు గత వారం రోజుల కిందటే ఆయన ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు కొంత మెతక వైఖరి అవలంబించిన అధికారులు సైతం ఎస్పీ ఆదేశాలతో అలెర్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఏకంగా జిల్లా ఎస్పీయే నేరుగా ఇసుక మాఫియా ఆగడాలపై దృష్టిసారించారు. ఎస్పీ ఈ తరహా దాడులు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇసుక మాఫియా పుణ్యమా అని పలు నదుల్లో వంతెనలు, గ్రోయిన్లు కూలిపోయిన దృష్ట్యా ఈ తరహా దాడులు ఎంతైనా అవసరమని ప్రజలు అంటున్నారు. -
పౌరసరఫరా శాఖాధికారుల దాడులు
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్ : జిల్లా పౌరసరఫరాల శాఖాధికారిణి జె. శాంతకుమారి నేతృత్వంలో అధికారులు స్టోన్‌హౌస్‌పేటలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల వ్యాపారం నిర్వహిస్తున్న దుకాణాలపై సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తమ షాపులపై కూడా అధికారులు దాడులు నిర్వహిస్తారనే అనుమానంతో పలువురు వ్యాపారులు తలుపులు మూసివేసి పరారయ్యారు. స్థానిక పప్పుల వీధిలో రోజూ ఉదయం విపరీతమైన రద్దీగా ఉంటుంది. అటువంటిది అధికారుల దాడులతో గంట పాటు ఆ ప్రాంతం బోసిపోయింది. పప్పులవీధిలో సుమారు 40 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురాళ్ల వీధిలోని దుకాణాలపై దాడులు నిర్వహించారు. దీంతో అందరు తలుపులు ముసివేసి వెళ్లిపోయారు. చివరకు పంచనామ నిర్వహించి ఇళ్లను తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించడంతో ఒక్కొక్కరుగా వచ్చి తలుపులు తీశారు. ముందు గదిలో ఇతర వస్తువుల విక్రయం.. లోపలికి పోతే గ్యాస్ సిలిండర్ల వ్యాపారం చేస్తున్నారు. బాత్రూమ్లు, బెడ్రూమ్లు, మంచాల కింద సిలిండర్లను దాచి పెట్టారు. కింద సిలిండర్ల ఉంచి పైన గోతాలు వేసి దాచారు. అధికారులు విస్తృతంగా గాలించి అక్రమంగా ఉన్న 42 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 82 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. 20 మందికి పైగా 6ఏ కేసులు నమోదు చేశారు. డీఎస్ఓ శాంతకుమారి మాట్లాడుతూ గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిలిండర్లను పూర్తిస్థాయిలో పరిశీలించి ఏ ఏజెన్సీల నుంచి వచ్చాయో పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏజీపీఓ లక్ష్మణబాబు, సీఎస్డీటీలు పుల్లయ్య, నిరంజన్, లాగరస్ పాల్గొన్నారు. -
దాబాల్లో.. దాగుడుమూతలు
మెదక్ టౌన్, న్యూస్‌లైన్ : ఎక్సైజ్ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం వెరసి హైవేలపై ఉండే దాబాల్లో మద్యం వ్యాపారం 3 పెగ్గులు 6 గ్లాసులుగా విరాజిల్లుతోంది. దాబాల్లో మద్యం విక్రయాలు, సిట్టింగులకు అనుమతులు లేకపోయినా అధికారుల సమన్వయంతో వ్యాపారాలు కొనసాగుతున్నాయన్న విమర్శలున్నాయి. సోమవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెదక్‌లోని ఓ దాబాపై ఆకస్మికంగా దాడులు చేసి అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం స్థానిక అధికారుల డొల్లతనం బయటపడింది. జిల్లాలో సంగారెడ్డి, మెదక్ ఎక్సైజ్ ఈఎస్ పరిధిలో 147 వైన్స్ షాపులున్నా యి. మరికొన్నింటికి దుకాణాలకు ఇటీవలే నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఇదిలా ఉండగా.. జిల్లాలోని మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, తుప్రాన్, సిద్దిపేట, పటాన్చెరు, రామాయంపేట, గజ్వేల్ పరిధిలోని దాదాపు 90 శాతం దాబాల్లో మద్యం విక్రయాలు, అక్రమ సిట్టింగులు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇదేమని ఆరా తీయగా.. తమకు అనుమతులు ఉన్నాయని బుకాయిస్తున్నారు. వాస్తవానికి దాబాల్లో మద్యం విక్రయాలు, సిట్టింగులకు అనుమతులు ఉండవు. అయితే మద్యం వ్యాపారుల నుంచి అధికారులు భారీ మెత్తంలో మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగితే వ్యాపారులను కార్యాలయాలకు పిలిపించి మందలించడం లేకపోతే చిన్న పాటి కేసు నమోదు చేయటం అధికారులకు అనవాయితీగా మారుతోంది. హైవేలపై‘పెగ్’ సిస్టం : జిల్లాలోని ప్రధా న హైవేలపై ఉన్న జహీరాబాద్, సంగారెడ్డి, తూప్రాన్, జోగిపేట, ఆర్సీ పురం, రామాయంపేట లాంటి ప్రాంతాల్లో హైవేకు అనుకుని ఉన్న దాబాల్లో కొత్త గా ‘పెగ్’ సిస్టంను అమలు పరుస్తున్నా రు. మందుబాబులు వచ్చిన రెండు నిమిషాల్లో పెగ్ మందు చేతికందుతుంది. వెంటనే మందు కొట్టేసి అక్కడి నుంచి వెళుతున్నారు. సోమవారం ఎక్సై జ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెదక్ పట్టణ సమీపంలోని రాజ్ దాబాపై దాడులు నిర్వహించి కేసు నమోదు చేసినా.. మరుసటి రోజు యథావిధిగా మద్యం సిట్టింగ్‌లు నిర్వహించడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
హడలెత్తించిన ఎక్సైజ్ అధికారులు
నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్ : ఎక్సైజ్ అధికారులు శుక్రవారం హడలెత్తించారు. నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్, సారంగాపూర్, లక్ష్మణచాంద మండలాల్లో తెల్ల కల్లు దుకాణాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. 13కిలోల క్లోరోఫాం, రెండు కిలో డైజోఫాం స్వాధీనం చేసుకున్నారు. 35మందిపై కేసు నమోదు చేశారు. 21మందిని అరెస్టు చేశారు. రెండు వ్యాన్లు, ఒక బైక్ సీజ్ చేశారు. వివరాలను నిర్మల్ ఎక్సైజ్ సీఐ బాబురావు వెల్లడించారు. కల్తీ కల్లు విక్రయాలు సాగుతున్నాయన్న ఫిర్యాదు మేరకు నిజామాబాద్‌కు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంటు, ఎక్సైజ్ సభ్యులు మూడు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. నిర్మల్ మండలం సోఫినగర్లోని కల్లు దుకాణంలో నిజామాబాద్ అసిస్టెంట్ ఎక్సైజ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ పీర్సింగ్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై బల్తార్ రాజు దాడి చేసి ఐదు కిలోల క్లోరోఫాం, కిలో డైజోఫాం స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ సీజ్ చేశారు. 10 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో 9 మంది పరారీలో ఉండగా, ఒకరిని అరెస్టు చేశారు. లక్ష్మణచాందలోని దుకాణంపై నిజామాబాద్‌కు చెందిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి లకా్ష్మనాయక్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సైలు చంద్రశేఖర్, అబ్దుల్ అతిక్ల బృందం దాడి చేసింది. ఎనిమిది కిలోల క్లోరోహైడ్రైడ్, కిలో డైజోఫాం స్వాధీనం చేసుకున్నారు. ఒక బైక్ సీజ్ చేశారు. 9 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో నలుగురిని అరెస్టు చేశారు. సారంగాపూర్ మండలం చించోలి(బి), లక్ష్మీపూర్, గోపాల్పేట్ గ్రామాల్లోని కల్లు దుకాణాలపై నిజామాబాద్‌కు చెందిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్‌రెడ్డి, సీఐ మహేశ్ దాడి చేశారు. లక్ష్మీపూర్‌లో ఆరుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఒక వాహనాన్ని సీజ్ చేశారు. చించోలి గ్రామంలో ఇద్దరిపై, గోపాల్‌పేట్‌లో 8 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆయా ప్రాంతాల్లో తెల్లకల్లు నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. అధికారులతో వాగ్వాదం... సోఫినగర్ వద్ద ఎక్సైజ్ అధికారుల దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పలువురిని అరెస్టు చేయడంపై కొందరు నాయకులు ఎక్సైజ్ కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. అమాయకులను అరెస్టు చేశారని ఆరోపించారు. కల్తీకల్లు విక్రయాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని, అన్ని దుకాణాలపై దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇందులో టీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు, పలువురు గౌడ సంఘాల నాయకులు, కులస్తులు పాల్గొన్నారు. -
ఏసీబీ గుబులు
సాక్షి, ఒంగోలు : సాక్షాత్తూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌పై శనివారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి సీనియర్ ఆడిట్ అధికారి ఎస్.విజయభాస్కర్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్న నేపథ్యంలో అవినీతి అధికారుల్లో గుబులు మొదలైంది. ముఖ్యంగా ప్రకాశం భవన్లో అనేక ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు ఉండటంతో ఏసీబీ అధికారుల దాడి సంఘటన దావానలంలా వ్యాపించడంతో శనివారం ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఒక్కొక్కరుగా చల్లగా జారుకున్నారు. జిల్లాలో పనిచేసే అనేకమంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి నిత్యం ఒంగోలుకు వచ్చి పోతుంటారు. దీంతో వారు రోజూ కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరే సమయం కన్నా గంట ముందుగానే జారుకున్నారు. గత నెల 19న కొత్తపట్నం ఆర్ఐ షేక్ షాజిదాను లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. పదిహేను రోజుల్లో మరో అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో తరువాత ఎవరు? అనే అనుమానం జిల్లాలోని పలువురు అవినీతి అధికారుల్లో కలవరం పెట్టిస్తోంది. మరోవైపు ఆదాయనికి మించి ఆస్తులు ఉన్న అధికారులు సైతం ఏసీబీ దెబ్బకు ఎప్పుడు ఎలాంటి దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని పలు ముందు జాగ్రత్త చర్యల్లో తలమునకలై ఉన్నట్లు సమాచారం. గతంలో ఏసీబీకి చిక్కి రిమాండ్‌కు వెళ్లిన అధికారులు రెండు మూడు రోజుల్లో లేకపోతే వారం రోజుల్లోపు బెయిల్‌పై విడుదలయ్యేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయి. గత నెల 19న కొత్తపట్నం ఆర్ఐ నెల్లూరు కేంద్ర కారాగారానికి రిమాండ్‌పై వెళ్లారు. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆమెకు బెయిల్ లభించకపోవడంతో ఇంకా జైల్లోనే ఉన్నారు. తాజాగా ఆదివారం సీనియర్ ఆడిట్ అధికారి విజయభాస్కర్‌ను నెల్లూరు ఏసీబీ ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్ ముందు అధికారులు హాజరు పర్చగా ఆయన్ను ఈ నెల 17వ వరకు మేజిస్ట్రేట్ రిమాండ్‌కు పంపారు. ఫలితమిస్తున్న విస్తృత ప్రచారం మరోవైపు ఏసీబీ అధికారులు ఒక అడుగు ముందుకేసి లంచాల కోసం ప్రజలను పీడిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సమాచారాన్ని తమకు అందజేయాలని కరపత్రాల ద్వారా విస్తృతంగా చేస్తున్న ప్రచారం ఫలితాలనిస్తోంది. జిల్లా ఆడిట్ కార్యాలయ అధికారిని పట్టుకున్న దరిమిలా పలువురు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఏసీబీ అధికారులను అభినందిస్తున్నారు. లంచం తీసుకున్న ఆ ఒక్క అధికారి మాత్రమే కాకుండా తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఆ కార్యాలయంలో లంచపు సొమ్ములో మరికొందరికి కూడా వాటాలు వెళతాయని వారు చెప్తుండటం గమనార్హం. చాపకింద నీరులా నిఘా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పనిచేసే ప్రభుత్వ అధికారులు, సిబ్బందిలో అవినీతికి పాల్పడుతున్న వారి జాబితాను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. వీరు చాపకింద నీరులా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తెలిసింది. గతేడాది జిల్లాలో గిద్దలూరు, దర్శి, చీమకుర్తిలలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు జరిపి పెద్దఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 9 మందిని లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం, మరో అధికారిని ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని గుర్తించి కేసులు నమోదు చేశారు. కొత్తపట్నం ఆర్ఐను, ఆ తర్వాత 16 రోజుల్లో సీనియర్ ఆడిట్ అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ప్రజల్లో సైతం ఏసీబీపై నమ్మకం ఏర్పడిందని చెప్పవచ్చు. త్వరలో జిల్లాలో మరికొన్ని దాడులు ఉంటాయని సంబంధిత అధికారి ఒకరు వ్యాఖ్యానించడం ఈ అంశానికి బలం చేకూరింది.