సాక్షి, ఒంగోలు : సాక్షాత్తూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌పై శనివారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి సీనియర్ ఆడిట్ అధికారి ఎస్.విజయభాస్కర్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్న నేపథ్యంలో అవినీతి అధికారుల్లో గుబులు మొదలైంది. ముఖ్యంగా ప్రకాశం భవన్‌లో అనేక ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు ఉండటంతో ఏసీబీ అధికారుల దాడి సంఘటన దావానలంలా వ్యాపించడంతో శనివారం ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఒక్కొక్కరుగా చల్లగా జారుకున్నారు.
జిల్లాలో పనిచేసే అనేకమంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి నిత్యం ఒంగోలుకు వచ్చి పోతుంటారు. దీంతో వారు రోజూ కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరే సమయం కన్నా గంట ముందుగానే జారుకున్నారు. గత నెల 19న కొత్తపట్నం ఆర్‌ఐ షేక్ షాజిదాను లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. పదిహేను రోజుల్లో మరో అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో తరువాత ఎవరు? అనే అనుమానం జిల్లాలోని పలువురు అవినీతి అధికారుల్లో కలవరం పెట్టిస్తోంది. మరోవైపు ఆదాయనికి మించి ఆస్తులు ఉన్న అధికారులు సైతం ఏసీబీ దెబ్బకు ఎప్పుడు ఎలాంటి దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని పలు ముందు జాగ్రత్త చర్యల్లో తలమునకలై ఉన్నట్లు సమాచారం.
గతంలో ఏసీబీకి చిక్కి రిమాండ్‌కు వెళ్లిన అధికారులు రెండు మూడు రోజుల్లో లేకపోతే వారం రోజుల్లోపు బెయిల్‌పై విడుదలయ్యేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయి. గత నెల 19న కొత్తపట్నం ఆర్‌ఐ నెల్లూరు కేంద్ర కారాగారానికి రిమాండ్‌పై వెళ్లారు. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆమెకు బెయిల్ లభించకపోవడంతో ఇంకా జైల్లోనే ఉన్నారు. తాజాగా ఆదివారం సీనియర్ ఆడిట్ అధికారి విజయభాస్కర్‌ను నెల్లూరు ఏసీబీ ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్ ముందు అధికారులు హాజరు పర్చగా ఆయన్ను ఈ నెల 17వ వరకు మేజిస్ట్రేట్ రిమాండ్‌కు పంపారు.
ఫలితమిస్తున్న విస్తృత ప్రచారం
మరోవైపు ఏసీబీ అధికారులు ఒక అడుగు ముందుకేసి లంచాల కోసం ప్రజలను పీడిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సమాచారాన్ని తమకు అందజేయాలని కరపత్రాల ద్వారా విస్తృతంగా చేస్తున్న ప్రచారం ఫలితాలనిస్తోంది. జిల్లా ఆడిట్ కార్యాలయ అధికారిని పట్టుకున్న దరిమిలా పలువురు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఏసీబీ అధికారులను అభినందిస్తున్నారు. లంచం తీసుకున్న ఆ ఒక్క అధికారి మాత్రమే కాకుండా తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఆ కార్యాలయంలో లంచపు సొమ్ములో మరికొందరికి కూడా వాటాలు వెళతాయని వారు చెప్తుండటం గమనార్హం.
చాపకింద నీరులా నిఘా
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పనిచేసే ప్రభుత్వ అధికారులు, సిబ్బందిలో అవినీతికి పాల్పడుతున్న వారి జాబితాను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. వీరు చాపకింద నీరులా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తెలిసింది. గతేడాది జిల్లాలో గిద్దలూరు, దర్శి, చీమకుర్తిలలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు జరిపి పెద్దఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 9 మందిని లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం, మరో అధికారిని ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని గుర్తించి కేసులు నమోదు చేశారు. కొత్తపట్నం ఆర్‌ఐను, ఆ తర్వాత 16 రోజుల్లో సీనియర్ ఆడిట్ అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ప్రజల్లో సైతం ఏసీబీపై నమ్మకం ఏర్పడిందని చెప్పవచ్చు. త్వరలో జిల్లాలో మరికొన్ని దాడులు ఉంటాయని సంబంధిత అధికారి ఒకరు వ్యాఖ్యానించడం ఈ అంశానికి బలం చేకూరింది.
ఏసీబీ గుబులు
Published Mon, Jan 6 2014 4:14 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement