
చంద్రగిరిలో పోస్టింగ్ కావాలంటే డబ్బులిచ్చి తీరాల్సిందే..
లంచం కోరుతూ ఓ కాంట్రాక్టర్‌తో పంచాయతీ ఈవో ఫోన్ సంభాషణ
ఆ కాంట్రాక్టర్ ఫిర్యాదుతో వలపన్ని ఈవోను పట్టుకున్న ఏసీబీ
ఏసీబీ చేతిలో కీలక ఆడియో సంభాషణలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: సీఎం చంద్రబాబు ఇలాకా చంద్రగిరిలో ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. పట్టుబడ్డ ఆ అధికారి, ఫిర్యాదుదారుడికి మధ్య ఫోన్ సంభాషణకు సంబంధించిన కీలక రికార్డులు ఏసీబీ చేతికి చిక్కినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ‘నేను ఆ సీటుకు రావడానికి ఎమ్మెల్యే సతీమణికి రూ.50 లక్షలు ఇచ్చాను.. మీలాంటి కాంట్రాక్టర్ల దగ్గర కూడా డబ్బు తీసుకోకుండా పని చేయాలంటే.. నేను ఎలా బతకాలి? నేను ఇచ్చిన డబ్బు ఎలా సంపాదించుకోవాలి? నా కుటుంబం రోడ్డున పడితే ఎవరికి చెప్పుకోవాలి?’ అంటూ ఇటీవల చంద్రగిరిలో ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ ఈవో మహేశ్వరయ్య, కాంట్రాక్టర్ దినేష్‌ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఏసీబీ అధికారుల చేతికి చిక్కినట్టు తెలిసింది.
చంద్రగిరిలో పంచాయతీ తరఫున రావాల్సిన బిల్లుల మంజూరుకు కాంట్రాక్టర్ దినేష్ నుంచి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య రూ.50 వేలు డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు దినేష్‌కు ఓ రికార్డింగ్ చిప్ ఇచ్చి నాలుగు రోజుల పాటు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను రికార్డ్ చేసినట్టు తెలిసింది. అనంతరం శుక్రవారం పంచాయతీ ఈవోను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
కాగా, ఆ సంభాషణలో పంచాయతీ ఈవో మహేశ్వరయ్య.. ఎమ్మెల్యే సతీమణికి రూ.50 లక్షలు ఇచ్చి ఆ ఉద్యోగాన్ని తీసుకున్నట్టుగా చెప్పడం కూడా అందులో రికార్డ్ అయినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల బదిలీల సమయంలో.. చంద్రగిరిలో ఉద్యోగం చేయడానికి వచ్చిన ఉద్యోగుల నుంచి స్థానిక ప్రజా ప్రతినిధికి ఎవరెవ్వరు ఎంత ముడుపులు ఇచ్చారో కూడా వారి సంభాషణల్లో నిక్షిప్తమై ఉన్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment