ఎరువుల షాపులపై విజిలెన్స్ దాడులు
-
రూ.9 లక్షల పురుగు మందుల అమ్మకాలు నిలిపివేత
-
రూ.3 లక్షల ఎరువుల స్వాధీనం
గొల్లప్రోలు :
మండలంలోని దుర్గాడ, వన్నెపూడి గ్రామాల్లోని ఎరువులు, పురుగు మందుల షాపులపై మంగళవారం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రెండు బృందాలుగా దాడులు చేశారు. సుమారు రూ.9.14 లక్షల విలువైన పురుగు మందుల అమ్మకాలను నిలిపివేశారు. రూ.3 లక్షల విలువైన ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. వన్నెపూడిలోని విజిలెన్స్ సీఐ గౌస్‌బేగ్ ఆధ్వర్యంలో స్థానిక కేవీఆర్ ఏజెన్సీలోని నిల్వలు, స్టాకు రికార్డులను పరిశీలించారు. షాపు నిర్వహణకు సరైన పత్రాలు లేకపోవడం, అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంతో రూ.7.20 లక్షల విలువైన పురుగు మందుల అమ్మకాలు నిలుపుదల చేసినట్టు ఆయన తెలిపారు. స్టాకు రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడం తదితర కారణాలతో రూ.1.82 లక్షల విలువైన ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. మైన్స్ ఏజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దుర్గాడలో...
దుర్గాడలో విజిలెన్స్ సీఐ ఎన్‌వీ భాస్కరరావు, ఏఓ జి.శ్రీనివాస్ తదితరులు షాపుల్లో తనిఖీలు చేశారు. వేగులమ్మ గుడి సమీపంలో అనుమతి లేకుండా షాపు నిర్వహిస్తున్న గుండ్ర తమ్మయ్య షాపును తనిఖీ చేశారు. ఆ షాపులో రూ.85 వేల విలువైన 144 బస్తాల ఎరువులు, రూ.53 వేల విలువైన పురుగు మందులు స్వాధీనం చేసుకున్నట్టు ఏఓ శ్రీనివాస్ తెలిపారు. సూర్యాఏజన్సీలో రూ.1.41 లక్షల విలువైన పురుగు మందులు అమ్మకాలను నిలుపుదల చేశామని, రూ.19 వేల విలువైన ఎరువులను సీజŒ æచేసినట్టు తెలిపారు. ఈ షాపులపై చట్ట ప్రకారం చర్యలకు ఆదేశించామన్నారు. తనిఖీల్లో సిబ్బంది కోటి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.