pesticides shops
-
ప్రిస్కిప్షన్ లేకుండానే పురుగుమందులు!
గ్లైపోసేట్ కలుపు మందును బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణకు ఉపయోగిస్తారు. వాస్తవానికి బీజీ–3 పత్తి విత్తనంపై నిషేధముంది. కానీ అనేకమంది రైతులు దీనిని సాగు చేయడంతో పాటు గ్లైపోసేట్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఎరువులు, పురుగు మందు దుకాణాల్లో అందుబాటులో ఉండటంతో అవగాహన లేకుండానే రైతులు దాన్ని కొంటున్నారు. కొందరు రైతులు వరిలో పెరిగే కలుపు నివారణకు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో ఒక రైతు అలాగే వరిలో కలుపు నివారణకు ఉపయోగిస్తే పంట మొత్తం మాడిపోయింది.సాక్షి, హైదరాబాద్: మనం ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్ ప్రిస్కిప్షన్ (మందుల చిట్టీ) ఆధారంగానే మందులు వాడుతుంటాం. కానీ వ్యవసాయం చేసే రైతులు పంటలకు వచి్చన చీడపీడలను వదిలించేందుకు తమ ఇష్టారాజ్యంగా పురుగు మందులు వాడేస్తున్నారు. దీంతో పంటలు విషతుల్యమవుతున్నాయి. మోతాదుకు మించి వాడటంతో ఆయా పంటలు వినియోగిస్తున్న మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరోవైపు పంటల్ని కొత్త కొత్త చీడపీడలు ఆశిస్తున్నాయి.వ్యవసాయాధికారులు ప్రిస్క్రిప్షన్ రాసిస్తేనే రైతులకు దుకాణాదారులు పురుగు మందులు విక్రయించాలనే నిబంధన రాష్ట్రంలో బేఖాతర్ అవుతోంది. దీంతో రాష్ట్రంలో విచ్చలవిడిగా పురుగు మందుల విక్రయాలు జరుగుతున్నాయి. వ్యవసాయాధికారుల పర్యవేక్షణ లోపంతో పరిస్థితి ఇష్టారాజ్యంగా మారింది. భారీగా సాగు..పురుగుమందుల వినియోగం తెలంగాణలో వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, పప్పు ధాన్యాల పంటలు ఎక్కువగా సాగవుతుంటాయి. వానాకాలంలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు. అందులో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.48 లక్షల ఎకరాలు కాగా, వరి సాధారణ సాగు విసీర్తం 57.18 లక్షల ఎకరాలు. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 8.52 లక్షల ఎకరాలు, మొక్కజొన్న సాధారణ సాగు విసీర్ణం 6.09 లక్షల ఎకరాలు, సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.29 లక్షల ఎకరాలుగా ఉంది.లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేస్తున్న రైతాంగం..వాటిని కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తున్నారు. ఒక్క వానాకాలం సీజన్‌కే అన్ని రకాల ఎరువులూ కలిపి 24.40 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని నిర్ధారించారు. అందులో యూరియానే 10.40 లక్షల మెట్రిక్ టన్నులు ఉండటం గమనార్హం. వీటికితోడు భారీగా పురుగుమందుల వినియోగంతో పంటలు విషతుల్యమవుతున్నాయి. ఎకరానికి 360 కిలోల పురుగు మందుల వినియోగం! నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ తాజా అధ్యయన నివేదిక ‘భారత వ్యవసాయ పరిస్థితి’ప్రకారం పంజాబ్, హరియాణ తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా పురుగు మందులు వినియోగిస్తున్నారు. అంటే పురుగుమందుల వాడకంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నమాట. పంజాబ్‌లో రైతులు ఎకరానికి 500 కిలోలు, హరియాణలో 440 కిలోలు పురుగు మందులు వినియోగిస్తుండగా, తెలంగాణలో 360 కిలోల పురుగు మందులు ఉపయోగిస్తున్నారని నివేదిక తెలిపింది. ఆరు జిల్లాల్లో ఎక్కువ గతంలో వ్యవసాయ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో క్రిమి సంహారక రసాయనాల వినియోగం అత్యధికంగా ఉంది. వరి, పత్తి, కంది పంటలకు ఎక్కువగా క్రిమి సంహారక రసాయనాలు వినియోగిస్తున్నట్లు తేలింది. రైతులు దుకాణాదారుల వద్దకు వెళ్లడం.. వారు ఏది ఎంత వాడమంటే అంత వాడుతున్న పరిస్థితి నెలకొంది. వాస్తవానికి భూసార పరీక్షలు నిర్వహించి, వ్యవసాయాధికారుల సూచనలకు అనుగుణంగా ఎరువులు, పురుగుమందుల వాడకం ఉండాలి. నిజానికి పంటలను చీడపీడలు పట్టిపీడిస్తుంటే వ్యవసాయశాఖ అధికారులు వాటిని పరిశీలించి ఏ మందులు వాడాలో సూచిస్తూ మందుల చిట్టీ (ప్రిస్కిప్షన్) రాయాలి. కానీ అవేవీ జరగడంలేదు.ఆరోగ్యంపై ప్రభావం రసాయన పురుగుమందులను విచ్చలవిడిగా వినియోగించిన పంటలు మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. గ్లైపోసేట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తే క్యాన్సర్ సోకే ప్రమాదముంది. ఆ మందు చల్లినచోట చుట్టుపక్కల పంటలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. పశువులు, పక్షులపై ప్రభావం చూపి జీవవైవిధ్యానికి నష్టం వాటిల్లుతుంది. ఇతరత్రా మందులు వాడిన పంటలు తినడం వల్ల కూడా దీర్ఘకాలంలో అనారోగ్యానికి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది.అయినా ఏళ్లుగా మూసపద్ధతి సాగుకు అలవాటు పడిన రైతులు మోతాదుకు మించి ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారని, మోతాదుకు మించి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల తెగుళ్లు నశించకపోగా ఏటా కొత్తవి పుట్టుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి భూమిని, వాతావరణాన్ని కలుíÙతం చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వారు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో రైతులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని తెలిపారు. -
పురుగుమందుల దుకాణాల్లో సోదాలు
సాక్షి, అమరావతి: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా 77 హోల్‌సేల్, రిటైల్ ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయా షాపుల్లో ఈ–పోస్ యంత్రంలో పేర్కొన్న నిల్వలకు, బుక్ బ్యాలెన్స్‌లో ఉన్న నిల్వలకు పొంతన లేకపోవడం, ఓ–ఫారం లేకుండా ఎరువుల విక్రయం, స్టాక్ రిజిస్టర్లు సరిగా నిర్వహించకపోవడం, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు ఎరువులు విక్రయించడం, బిల్లు పుస్తకాలు, స్టాక్ బోర్డులు నిర్వహించకపోవడం తదితర అవకతవకలు జరుగుతున్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు రూ.29.14 లక్షల విలువైన 243.192 టన్నుల ఎరువులను స్వాధీనం చేసుకుని 18 కేసులు నమోదు చేశారు. అలాగే రూ.7.10 లక్షల విలువైన 92 టన్నుల ఎరువులను సీజ్ చేసి రెండు కేసులు నమోదు చేశారు. రూ.19.37లక్షల విలువైన 965 లీటర్ల పురుగుమందులను స్వాధీనం చేసుకుని 11 కేసులు నమోదు చేశారు. మరో రూ.2.96లక్షల విలువైన 105.95 కేజీల ఘన పురుగుల మందు నిల్వలను సీజ్‌చేశారు. -
ఎరువుల షాపులపై విజిలెన్స్ దాడులు
రూ.9 లక్షల పురుగు మందుల అమ్మకాలు నిలిపివేత రూ.3 లక్షల ఎరువుల స్వాధీనం గొల్లప్రోలు : మండలంలోని దుర్గాడ, వన్నెపూడి గ్రామాల్లోని ఎరువులు, పురుగు మందుల షాపులపై మంగళవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండు బృందాలుగా దాడులు చేశారు. సుమారు రూ.9.14 లక్షల విలువైన పురుగు మందుల అమ్మకాలను నిలిపివేశారు. రూ.3 లక్షల విలువైన ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. వన్నెపూడిలోని విజిలెన్స్ సీఐ గౌస్‌బేగ్ ఆధ్వర్యంలో స్థానిక కేవీఆర్ ఏజెన్సీలోని నిల్వలు, స్టాకు రికార్డులను పరిశీలించారు. షాపు నిర్వహణకు సరైన పత్రాలు లేకపోవడం, అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంతో రూ.7.20 లక్షల విలువైన పురుగు మందుల అమ్మకాలు నిలుపుదల చేసినట్టు ఆయన తెలిపారు. స్టాకు రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడం తదితర కారణాలతో రూ.1.82 లక్షల విలువైన ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. మైన్స్ ఏజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దుర్గాడలో... దుర్గాడలో విజిలెన్స్ సీఐ ఎన్వీ భాస్కరరావు, ఏఓ జి.శ్రీనివాస్ తదితరులు షాపుల్లో తనిఖీలు చేశారు. వేగులమ్మ గుడి సమీపంలో అనుమతి లేకుండా షాపు నిర్వహిస్తున్న గుండ్ర తమ్మయ్య షాపును తనిఖీ చేశారు. ఆ షాపులో రూ.85 వేల విలువైన 144 బస్తాల ఎరువులు, రూ.53 వేల విలువైన పురుగు మందులు స్వాధీనం చేసుకున్నట్టు ఏఓ శ్రీనివాస్ తెలిపారు. సూర్యాఏజన్సీలో రూ.1.41 లక్షల విలువైన పురుగు మందులు అమ్మకాలను నిలుపుదల చేశామని, రూ.19 వేల విలువైన ఎరువులను సీజŒ æచేసినట్టు తెలిపారు. ఈ షాపులపై చట్ట ప్రకారం చర్యలకు ఆదేశించామన్నారు. తనిఖీల్లో సిబ్బంది కోటి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
పురుగు మందులు, ఎరువుల దుకాణాల తనిఖీ
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : జిల్లాలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అంతర్ జిల్లా అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. వ్యవసాయ శాఖ విజయనగరం జిల్లా డీడీ ఎస్బీ శవ్యానంద్, శ్రీకాకుళం జిల్లా రాజాం సహాయ వ్యవసాయ సంచాలకుడు సీహెచ్ వెంకట్రావు ఆధ్వర్యంలో రాజానగరం, రాజమహేంద్రవరం, కోరుకొండ తదితర ప్రాంతాల్లో ఎరువుల దుకాణాలు, గోదాములపై ఈ దాడులు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎరువుల ధరలను తగ్గించడంతో దుకాణాదారులు ఏవిధంగా అమ్ముతున్నారనే విషయంపై ఆరా తీశారు. పాతస్టాకును పాత ధరలకే అమ్మాలని, విధిగా కొత్త, పాత ధరల పట్టికను దుకాణాలు ముందు ఉంచాలని సూచించారు. రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం మండలాల్లో ఎరువుల దుకాణాల రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కోరుకొండ ఏడీఏ డి.వెంకటకృష్ణ, రాజమహేంద్రవరం రూరల్ వ్యవసాయాధికారి కె.శ్రీనివాస్, ఏఈవోలు వేణుమాధవ్, పీటర్, రఘుకుమార్ పాల్గొన్నారు. -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
పాచిపెంట : మండల కేంద్రంలో రెండు ఎరువుల దుకాణాలతో పాటు చినబజార్ సెంటర్లోని పెస్టిసైడ్స్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా రికార్డులు, నిల్వలను సరిపోల్చాచరు. రశీదు బుక్ సరిగ్గా లేకపోవడంతో శ్రీ కష్ణా ఎరువుల దుకాణంలో అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. భూర త్రినాథ్ ఎరువుల షాపునకు సంబంధించి ప్రత్యేకంగా నిల్వలు ఉంచేందుకు గది నిర్మాణం చేపట్టాలని సూచించారు. చినబజార్ సెంటర్లో గల శ్రీసాయిరాం పెస్టిసైడ్స్ దుకాణానికి సంబంధించి ఓచర్లు సరిగ్గా లేకపోవడంతో రశీదులు వచ్చాక విక్రయాలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో విజిలెన్స్ డీడీ పి.వి.ఎస్.సి హరి, ఏడీఏ విజయకుమార్, ఏడీ చంద్రశేఖర్లతో పాటు పాచిపెంట వ్యవసాయాధికారి వి.వెంకటయ్య, ఎం.బాబ్జిలు పాల్గొన్నారు. -
ఎన్ఫోర్స్మెంట్ దాడులు: విత్తనాలు స్వాధీనం
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఎరువులు, విత్తనాల షాపులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అలాగే బోధన్‌లో కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి... 1.60 లక్షల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.