ఇష్టారాజ్యంగా రైతులకు విక్రయిస్తున్న దుకాణదారులు
మందుల చిట్టీ తప్పనిసరి అనే నిబంధన బేఖాతర్
కలుపు, చీడపీడల నివారణకు ఇష్టారాజ్యంగా క్రిమిసంహారకాల వాడకం
రైతుల అవగాహనా రాహిత్యానికి తోడు వ్యవసాయాధికారుల నిర్లక్ష్యం
దేశంలోనే పురుగు మందుల వాడకంలో మూడో స్థానంలో తెలంగాణ
విషతుల్యమవుతున్న పంటలు..ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
గ్లైపోసేట్ కలుపు మందును బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణకు ఉపయోగిస్తారు. వాస్తవానికి బీజీ–3 పత్తి విత్తనంపై నిషేధముంది. కానీ అనేకమంది రైతులు దీనిని సాగు చేయడంతో పాటు గ్లైపోసేట్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఎరువులు, పురుగు మందు దుకాణాల్లో
అందుబాటులో ఉండటంతో అవగాహన లేకుండానే రైతులు దాన్ని కొంటున్నారు. కొందరు రైతులు వరిలో పెరిగే కలుపు నివారణకు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో ఒక రైతు అలాగే వరిలో కలుపు నివారణకు ఉపయోగిస్తే పంట మొత్తం మాడిపోయింది.
సాక్షి, హైదరాబాద్: మనం ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్ ప్రిస్కిప్షన్ (మందుల చిట్టీ) ఆధారంగానే మందులు వాడుతుంటాం. కానీ వ్యవసాయం చేసే రైతులు పంటలకు వచి్చన చీడపీడలను వదిలించేందుకు తమ ఇష్టారాజ్యంగా పురుగు మందులు వాడేస్తున్నారు. దీంతో పంటలు విషతుల్యమవుతున్నాయి. మోతాదుకు మించి వాడటంతో ఆయా పంటలు వినియోగిస్తున్న మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరోవైపు పంటల్ని కొత్త కొత్త చీడపీడలు ఆశిస్తున్నాయి.
వ్యవసాయాధికారులు ప్రిస్క్రిప్షన్ రాసిస్తేనే రైతులకు దుకాణాదారులు పురుగు మందులు విక్రయించాలనే నిబంధన రాష్ట్రంలో బేఖాతర్ అవుతోంది. దీంతో రాష్ట్రంలో విచ్చలవిడిగా పురుగు మందుల విక్రయాలు జరుగుతున్నాయి. వ్యవసాయాధికారుల పర్యవేక్షణ లోపంతో పరిస్థితి ఇష్టారాజ్యంగా మారింది.
భారీగా సాగు..పురుగుమందుల వినియోగం
తెలంగాణలో వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, పప్పు ధాన్యాల పంటలు ఎక్కువగా సాగవుతుంటాయి. వానాకాలంలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు. అందులో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.48 లక్షల ఎకరాలు కాగా, వరి సాధారణ సాగు విసీర్తం 57.18 లక్షల ఎకరాలు. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 8.52 లక్షల ఎకరాలు, మొక్కజొన్న సాధారణ సాగు విసీర్ణం 6.09 లక్షల ఎకరాలు, సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.29 లక్షల ఎకరాలుగా ఉంది.
లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేస్తున్న రైతాంగం..వాటిని కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తున్నారు. ఒక్క వానాకాలం సీజన్‌కే అన్ని రకాల ఎరువులూ కలిపి 24.40 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని నిర్ధారించారు. అందులో యూరియానే 10.40 లక్షల మెట్రిక్ టన్నులు ఉండటం గమనార్హం. వీటికితోడు భారీగా పురుగుమందుల వినియోగంతో పంటలు విషతుల్యమవుతున్నాయి.
ఎకరానికి 360 కిలోల పురుగు మందుల వినియోగం!
నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ తాజా అధ్యయన నివేదిక ‘భారత వ్యవసాయ పరిస్థితి’ప్రకారం పంజాబ్, హరియాణ తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా పురుగు మందులు వినియోగిస్తున్నారు. అంటే పురుగుమందుల వాడకంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నమాట. పంజాబ్‌లో రైతులు ఎకరానికి 500 కిలోలు, హరియాణలో 440 కిలోలు పురుగు మందులు వినియోగిస్తుండగా, తెలంగాణలో 360 కిలోల పురుగు మందులు ఉపయోగిస్తున్నారని నివేదిక తెలిపింది.
ఆరు జిల్లాల్లో ఎక్కువ
గతంలో వ్యవసాయ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో క్రిమి సంహారక రసాయనాల వినియోగం అత్యధికంగా ఉంది. వరి, పత్తి, కంది పంటలకు ఎక్కువగా క్రిమి సంహారక రసాయనాలు వినియోగిస్తున్నట్లు తేలింది. రైతులు దుకాణాదారుల వద్దకు వెళ్లడం.. వారు ఏది ఎంత వాడమంటే అంత వాడుతున్న పరిస్థితి నెలకొంది. వాస్తవానికి భూసార పరీక్షలు నిర్వహించి, వ్యవసాయాధికారుల సూచనలకు అనుగుణంగా ఎరువులు, పురుగుమందుల వాడకం ఉండాలి. నిజానికి పంటలను చీడపీడలు పట్టిపీడిస్తుంటే వ్యవసాయశాఖ అధికారులు వాటిని పరిశీలించి ఏ మందులు వాడాలో సూచిస్తూ మందుల చిట్టీ (ప్రిస్కిప్షన్) రాయాలి. కానీ అవేవీ జరగడంలేదు.
ఆరోగ్యంపై ప్రభావం
రసాయన పురుగుమందులను విచ్చలవిడిగా వినియోగించిన పంటలు మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. గ్లైపోసేట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తే క్యాన్సర్ సోకే ప్రమాదముంది. ఆ మందు చల్లినచోట చుట్టుపక్కల పంటలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. పశువులు, పక్షులపై ప్రభావం చూపి జీవవైవిధ్యానికి నష్టం వాటిల్లుతుంది. ఇతరత్రా మందులు వాడిన పంటలు తినడం వల్ల కూడా దీర్ఘకాలంలో అనారోగ్యానికి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది.
అయినా ఏళ్లుగా మూసపద్ధతి సాగుకు అలవాటు పడిన రైతులు మోతాదుకు మించి ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారని, మోతాదుకు మించి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల తెగుళ్లు నశించకపోగా ఏటా కొత్తవి పుట్టుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి భూమిని, వాతావరణాన్ని కలుíÙతం చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వారు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో రైతులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment