ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఆరోగ్యకరమైన నేలలు
మెట్ట పంటల్లో మెరుగైన వంగడాల కోసం ఇక్రిసాట్‌లో పరిశోధనలు
ఎన్నో ప్రయోజనాలంటున్న పరిశోధకులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మన ఆహారం ఆరోగ్యానికి మేలు చేసేదిగా ఉండాలంటే ఆహార ఉత్పత్తులు పండే నేల కూడా ఆరోగ్యంగా ఉండాలి. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడిన నేలల్లో పండే పంటలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. అలాంటిది ఆరోగ్యానికి మేలు చేసే, అధిక దిగుబడులనిచ్చే ఆధునిక వంగడాల అభివృద్ధికి మెట్ట ప్రాంత పంటల అంతర్జాతీయ పరిశోధన కేంద్రం (ఇక్రిసాట్) కొత్త దారిలో పరిశోధనలు చేస్తోంది.
ఇందుకోసం పునరుత్పాదక వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తోంది. ఈ దిశగా ముందడుగు సైతం వేసింది. భారత్‌తోపాటు వివిధ దేశాల్లో ఎక్కువగా సాగయ్యే వేరుశనగ, కంది, సజ్జ, పొద్దుతిరుగుడు, శనగ వంటి మెట్ట పంటల్లో మెరుగైన వంగడాల కోసం ఈ విధానంలో పరిశోధనలు జరుగుతున్నాయి.
ఏడాదంతా ఏదో పంట..
ఈ పునరుత్పత్తి వ్యవసాయం పద్ధతిలో.. ఒకే కమతంలో పక్కపక్కనే వివిధ రకాల పంటలు వి త్తుకుంటారు. ఒక్కో పంట ఒక్కో దశలో ఉంటుంది. ఏడాదంతా వాటి అనుకూల కాలానికి తగ్గట్లుగా ఈ పంటలు వేసుకుంటున్నారు. ఒక పంట కొతకొచ్చే దశలో మరో పంట కాయ దశలో ఉంటుంది. ఇంకో పంట పూత దశకు వస్తుంది.
రెండు బ్లాకుల్లో సాగు..
ఇక్రిసాట్‌లో మొత్తం నాలుగు రకాల నేలలు ఉండగా అందులో ఎర్ర, నల్లరేగడి నేలల్లోని రెండు బ్లాకుల్లో పునరుత్పత్తి వ్యవసాయ విధానంపై పరిశోదనలు సాగుతున్నాయి. ఎర్ర నేలతో కూడిన బ్లాకులో వేరుశనగ, పొద్దుతిరుగుడు, సజ్జ, కంది పంటలను ఒకే కమతంలో సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలతో కూడిన మరో బ్లాక్‌లో శనగ, పొద్దుతిరుగుడు, సజ్జ, కంది పంటలు వేశారు.
ఇవీ ప్రయోజనాలు..
రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానంలో అనేక ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సాగవుతున్న పంటల్లో దేనికైనా చీడపీడలు ఆశిస్తే ఆ ప్రభావం పక్కనే ఉన్న మరో పంటకు వ్యాపించేందుకు వీలుండదు. ఆ పంటకే పరిమితమవుతుంది. అదే ఒకే పంట పూర్తి విస్తీర్ణం వేస్తే చీడపీడలు పూర్తి విస్తీర్ణంలో పంటలను ఆశించే ప్రమాదం ఉంటుంది. దీన్ని ఈ విధానం ద్వారా అధిగమించేలా పరిశోధనల ప్రక్రియ కొనసాగుతోంది.
అలాగే ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా, పంటలకు ఉపయోగకరమైన ఫంగస్‌ను నాశనం కాకుండా కాపాడుకోవచ్చు. హానికరమైన రసాయనాలు, కలుపు మందులు, పురుగు మందులపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్యకరమైన నేలపై పర్యావరణానికి అనుకూలమైన రీతిలో ఈ వ్యవసాయం ఉంటుంది. విలువైన ప్రకృతి వనరులు క్షీణించకుండా, వనరులు మరింత బలోపేతం అయ్యేందుకు ఈ విధానం దోహదపడుతుంది.
సాధారణంగా ఏటా అధిక మోతాదుల్లో ఎరువుల వాడకం వల్ల నేల స్వభా వాన్ని కోల్పోతూ ఉంటుంది. కానీ పునరుత్పాదక వ్యవసాయ విధానం ద్వారా నేల పునరుజ్జీవం చెందుతుంది. డీగ్రేడ్ అయిన నేల రీస్టోర్ అవుతుందని రీసెర్చ్ స్కాలర్ కల్పన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment