
చెరకు పంటలో ఇదో ప్రత్యేకమైన వెరైటీ
జ్యూస్ కోసం ఎక్కువగా వినియోగంలో 62175 రకం
రుచితో పాటు స్థూల, సూక్ష్మ పోషకాలు దీని ప్రత్యేకత
సంగారెడ్డి జిల్లాలో 2 వేల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు
వేసవిలో ఎక్కువ డిమాండ్..రాష్ట్రమంతటికీ ఇక్కడి నుంచే సరఫరా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వేసవి వచ్చిందంటే చాలు.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో, శివారు ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన అనేకచోట్ల చెరకు రసం (కేన్ జ్యూస్) బండ్లు కనిపిస్తుంటాయి. చెరకు రసాన్ని ఇష్టంగా తాగేవారు చాలామందే ఉంటారు. చెరకు నుంచి చక్కెర, బెల్లం తయారు చేస్తారనేది అందరికీ తెలిసిందే. అయితే రసం కోసం ఓ ప్రత్యేకమైన చెరకు పంట ఉంది. అదే ‘బాసట్’. చెరకును సాగు చేసే సంగారెడ్డి జిల్లా రైతులు.. స్థానికంగా ‘బాసట్’ పేరుతో 62175 చెరకు రకాన్ని సాగు చేస్తున్నారు.
ఈ చెరకు తెల్ల రంగులో ఉండటంతో పాటు, ఇందులోంచి రసం (జ్యాస్) ఎక్కువగా వస్తుంది. అలాగే ఈ చెరకుకు పూత ఉండదు. దీంతో జ్యూస్ ఎంతో రుచికరంగా ఉంటుంది. సాధారణంగా చక్కెర కర్మాగారాలకు తరలించే చెరుకులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కానీ ఈ రకంలో జ్యూస్ ఎక్కువగా వస్తుంది.
సుమారు రెండు వేల ఎకరాల్లో..
ఈ ప్రత్యేక వెరైటీ చెరకును సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ డివిజన్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. సుమారు రెండు వేల ఎకరాల్లో ఈ ప్రత్యేక రకం సాగ వుతోంది. జహీరాబాద్ మండలంతో పాటు, ఝరా సంఘం, మొగుడంపల్లి, కొహీర్ మండలాల పరిధి లో ఈ బాసట్ రకం ఎక్కువగా సాగవుతోంది. ఏటా ఫిబ్రవరి నుంచే వ్యాపారులు ఇక్కడికి వచ్చి రైతుల వద్ద చెరకును కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు.
ఎండలు ముదిరితే డిమాండ్
ఎండల తీవ్రత ఎక్కువైతే ఈ చెరకుకు డిమాండ్ మరింత పెరుగుతుంది. ఎందుకంటే వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు ఎక్కువమంది చెరుకు రసం తాగుతుంటారు. దీంతో ఏప్రిల్, మే మాసాల్లో టన్ను రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పలుకుతుంది. ఒకవేళ మే లోనే వర్షాలు ప్రారంభమైతే ధరను తగ్గిస్తుంటారు. సాధారణంగా టన్ను రూ.3 వేల వరకు ఉంటుంది.
రెండేళ్లుగా సాగు చేస్తున్నా..
గత రెండు సంవత్సరాలుగా ఈ బాసట్ చెరకు పండిస్తున్నా. పది నెలల్లో పంట చేతికందుతుంది. ఇటీవలే పంట నరికి రెండురోజుల క్రితం హైదరాబాద్‌కు సరఫరా చేశా. టన్నుకు రూ.3 వేల చొప్పున రేటు వచ్చింది. ఎండాకాలం వస్తే చెరకు రసానికి డిమాండ్ పెరుగుతుంది. దీంతో బాసట్ చెరకును ఎక్కువగా తీసుకెళుతుంటారు. ఫ్యాక్టరీ చెరకు సాగు కంటే ఇది కొంత మేలే. – తెనుగు శేఖర్, చెరకు రైతు, ఈదుల్‌పల్లి, సంగారెడ్డి జిల్లా
రసం వస్తుందనే వ్యాపారులు కొంటారు..
రెండు ఎకరాల్లో బాసట్ రకం వేశా. హైదరాబాద్ నుంచి వ్యాపారులు వచ్చి ఈ చెరకును కొనుగోలు చేస్తుంటారు. ఎండాకాలం వస్తే డిమాండ్ పెరుగుతుంది. రసం బాగా వస్తుందనే ఈ రకాన్ని ఎక్కువగా తీసుకెళుతుంటారు. – మొగులప్ప, చెరకు రైతు,రాయికోడ్, సంగారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment