Chemical fertilizer
-
నేలమ్మకు కొత్త శక్తి.. చీడపీడల విముక్తి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మన ఆహారం ఆరోగ్యానికి మేలు చేసేదిగా ఉండాలంటే ఆహార ఉత్పత్తులు పండే నేల కూడా ఆరోగ్యంగా ఉండాలి. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడిన నేలల్లో పండే పంటలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. అలాంటిది ఆరోగ్యానికి మేలు చేసే, అధిక దిగుబడులనిచ్చే ఆధునిక వంగడాల అభివృద్ధికి మెట్ట ప్రాంత పంటల అంతర్జాతీయ పరిశోధన కేంద్రం (ఇక్రిసాట్) కొత్త దారిలో పరిశోధనలు చేస్తోంది. ఇందుకోసం పునరుత్పాదక వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తోంది. ఈ దిశగా ముందడుగు సైతం వేసింది. భారత్‌తోపాటు వివిధ దేశాల్లో ఎక్కువగా సాగయ్యే వేరుశనగ, కంది, సజ్జ, పొద్దుతిరుగుడు, శనగ వంటి మెట్ట పంటల్లో మెరుగైన వంగడాల కోసం ఈ విధానంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఏడాదంతా ఏదో పంట.. ఈ పునరుత్పత్తి వ్యవసాయం పద్ధతిలో.. ఒకే కమతంలో పక్కపక్కనే వివిధ రకాల పంటలు వి త్తుకుంటారు. ఒక్కో పంట ఒక్కో దశలో ఉంటుంది. ఏడాదంతా వాటి అనుకూల కాలానికి తగ్గట్లుగా ఈ పంటలు వేసుకుంటున్నారు. ఒక పంట కొతకొచ్చే దశలో మరో పంట కాయ దశలో ఉంటుంది. ఇంకో పంట పూత దశకు వస్తుంది. రెండు బ్లాకుల్లో సాగు.. ఇక్రిసాట్‌లో మొత్తం నాలుగు రకాల నేలలు ఉండగా అందులో ఎర్ర, నల్లరేగడి నేలల్లోని రెండు బ్లాకుల్లో పునరుత్పత్తి వ్యవసాయ విధానంపై పరిశోదనలు సాగుతున్నాయి. ఎర్ర నేలతో కూడిన బ్లాకులో వేరుశనగ, పొద్దుతిరుగుడు, సజ్జ, కంది పంటలను ఒకే కమతంలో సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలతో కూడిన మరో బ్లాక్‌లో శనగ, పొద్దుతిరుగుడు, సజ్జ, కంది పంటలు వేశారు. ఇవీ ప్రయోజనాలు.. రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానంలో అనేక ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సాగవుతున్న పంటల్లో దేనికైనా చీడపీడలు ఆశిస్తే ఆ ప్రభావం పక్కనే ఉన్న మరో పంటకు వ్యాపించేందుకు వీలుండదు. ఆ పంటకే పరిమితమవుతుంది. అదే ఒకే పంట పూర్తి విస్తీర్ణం వేస్తే చీడపీడలు పూర్తి విస్తీర్ణంలో పంటలను ఆశించే ప్రమాదం ఉంటుంది. దీన్ని ఈ విధానం ద్వారా అధిగమించేలా పరిశోధనల ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా, పంటలకు ఉపయోగకరమైన ఫంగస్‌ను నాశనం కాకుండా కాపాడుకోవచ్చు. హానికరమైన రసాయనాలు, కలుపు మందులు, పురుగు మందులపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్యకరమైన నేలపై పర్యావరణానికి అనుకూలమైన రీతిలో ఈ వ్యవసాయం ఉంటుంది. విలువైన ప్రకృతి వనరులు క్షీణించకుండా, వనరులు మరింత బలోపేతం అయ్యేందుకు ఈ విధానం దోహదపడుతుంది.సాధారణంగా ఏటా అధిక మోతాదుల్లో ఎరువుల వాడకం వల్ల నేల స్వభా వాన్ని కోల్పోతూ ఉంటుంది. కానీ పునరుత్పాదక వ్యవసాయ విధానం ద్వారా నేల పునరుజ్జీవం చెందుతుంది. డీగ్రేడ్ అయిన నేల రీస్టోర్ అవుతుందని రీసెర్చ్ స్కాలర్ కల్పన పేర్కొన్నారు. -
సేంద్రియ పాల ఆవశ్యకత
రైతులకు బాసటగా నిలుస్తున్నది. మన దేశం సగటున రోజుకు 170 మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేస్తూ, ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. అధిక పాల ఉత్పత్తితో పాటుగా, నాణ్యమైన పాలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సేంద్రియ పాల ఉత్పత్తి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ పూర్వరంగంలో మనం కూడా సేంద్రియ పాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. భూమిలో సేంద్రియ ఎరువులు వేసి పండించిన దాణాలను, పశుగ్రాసాలను మేసిన పశువులు ఇచ్చే పాలే సేంద్రియ పాలు. ఇందులో ఎటువంటి రసాయనిక అవశేషాలు ఉండవు. సేంద్రియ పాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.. ► రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గడం, తద్వారా ఖర్చు తగ్గడం. ► రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాలు లేని నాణ్యమైన, కల్తీ లేని పాలను ఉత్పత్తి చేయటం. ► సేంద్రియ పాలలో ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. అలానే పాలీ సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఎక్కువే. ► సేంద్రియ పాల పదార్థాలలో ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. ► రసాయనిక ఎరువుల అవశేషాలు పాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అవి శరీరంలోని ముఖ్యభాగాలను – కాలేయాన్ని, మూత్రపిండాలను, పేగులను దెబ్బతీస్తాయి. ► సేంద్రియ పాలను ఉత్పత్తి చేయటం అంత తేలికైన విషయం కాదు. పశువుకు మేపే దాణా, మేత మొత్తాన్నీ సేంద్రియ పద్ధతుల్లోనే పండించాలి. మొక్కజొన్న, జొన్నలు, తవుడు మొదలైనవి. ► సాధారణంగా భూమిలో మేలు చేసే సూక్ష్మజీవులు చాలా ఉంటాయి. రసాయనిక ఎరువుల వాడకం వలన ఇవి నశిస్తాయి. దీని వలన భూసారం తగ్గిపోయి, భూమి తన ఉత్పాదక శక్తిని కోల్పోతుంది. ► రసాయనిక ఎరువులు గాని, పురుగుమందులు గాని పశుగ్రాసాల సాగులో వాడితే ఆ పశుగ్రాసాలను తిన్న పశువుల పాలలో వాటి అవశేషాలు పేరుకుంటాయి. కొవ్వులతో జత కట్టే గుణం రసాయనాలకు ఉండటమే ఇందుకు కారణం. ఇటువంటి పాలు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ► పిల్లలు త్వరగా పరిపక్వ దశకు రావడానికి కూడా ఇదే కారణం. కాబట్టి సేంద్రియ పాల ఉత్పత్తిపై దృష్టి పెట్టడం ఉత్తమం. – డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ, ప్రొఫెసర్ అండ్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్‌స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి. -
రసాయనిక ఎరువుల వల్లే షుగర్, గుండెజబ్బులు!
పంటలకు వేసే రసాయనిక ఎరువులే రైతులను, వినియోగదారులను షుగర్, గుండె జబ్బుల పాలుజేస్తున్నాయా? అవునని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రసాయనిక ఎరువులలోని విషతుల్యమైన భారఖనిజాలకు.. రైతులు షుగర్, గుండెజబ్బుల పాలు కావడానికి మధ్య సంబంధం ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నానోసైన్స్, వాటర్ రీసెర్చ్ యూనిట్ శాస్త్రవేత్తలు నిర్ణయానికి వచ్చారు. తమిళనాడులోని ఒక గ్రామంలో 900 మంది రైతులు, వినియోగదారుల మూత్ర నమూనాలను సేకరించి అధ్యయనం చేసినప్పుడు ఆశ్చర్యకరమైన ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ నిధులతోనే ఈ అధ్యయనాన్ని చేపట్టడం విశేషం. కోయంబత్తూరులోని కొవై మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో ఈ మూత్ర నమూనాలను పరీక్షించారు. మద్రాస్ ఐఐటీలో రసాయన శాస్త్ర ఆచార్యుడు ప్రదీప్ తలప్పిల్ ఈ అధ్యయన వివరాలు వెల్లడించారు. ‘మూత్ర నమూనాలు ఇచ్చిన ఈ 900 మందిలో 82.5% మంది వ్యవసాయదారులు. అధ్యయనం చేసిన ఆ గ్రామంలో పంటలకు వాడుతున్న రసాయనిక ఎరువుల్లో అత్యంత విషతుల్యమైన భార ఖనిజాలు ఉన్నట్లు కనుగొన్నారు. 43.4% మంది షుగర్‌కు ముందు దశలో ఉన్న వారు, 16.2% మంది షుగర్ వ్యాధికి గురైన వారు, 10.3% మంది గుండెలో రక్తనాళాలు పూడుకుపోయే జబ్బు (అథెరోసెలెరోసిస్) బారినపడ్డారని... ప్రదీప్ తలప్పిల్ చెప్పారు. ఊబకాయం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలున్న వారికి ఈ జబ్బులు రావడం సహజం. అయితే, ఈ 900 మందికి అటువంటివేమీ లేకపోయినప్పటికీ ఆశ్చర్యకరంగా షుగర్, గుండె జబ్బుల పాలయ్యారని ఆయన వివరించారు. గ్రామీణుల్లో షుగర్, గుండె జబ్బులు గతంలో కన్నా పెరుగుతున్నాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి చెబుతోంది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఇటీవల ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... ఏటేటా ప్రతి వెయ్యి మంది గ్రామీణులలో ఇద్దరు షుగర్ వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. వీటికి రసాయనిక ఎరువులే కారణమవుతున్నాయన్నది తాజా అధ్యయనంలో తేలిన విషయం. రైతులు ఆహార ఉత్పత్తిదారులైతే... వినియోగదారులమైన మనం సహ ఉత్పత్తిదారులమని అనుకోవచ్చు. మనం ఎటువంటి ఆహారం కావాలంటే రైతులు అటువంటి ఆహారాన్నే పండిస్తారు. మనం వరి బియ్యం, గోధుమలు వద్దు... ఆరోగ్య సిరులనిచ్చే సిరిధాన్యాలే కావాలని మనం అంటే... రైతులు వాటినే పండించి మనకు ఇస్తారు. కాబట్టి, రసాయనాలు అవసరం లేకుండా ఆరోగ్యదాయకంగా పంటలు పండించడాన్ని ప్రోత్సహిద్దాం. సేంద్రియ పద్ధతుల్లో చిరు(సిరి)ధాన్యాలను, పప్పుధాన్యాలను, నూనెగింజలను పండించే రైతులను అధిక ధర ఇచ్చి మరీ ప్రోత్సహిద్దాం. భూమాతను అనారోగ్యం నుంచి పోషకాల లోపం నుంచి కాపాడదాం. అనవసర జబ్బుల నుంచి, ఆత్మహత్యల నుంచి రైతులను రక్షించుకుందాం. మన పిల్లల, మన ఆరోగ్యాలను రక్షించుకుందాం. మనం కదలడానికి, మంచి వైపు కదలడానికి ఇంకా ఎన్నెన్ని అధ్యయనాలు చేయాలి? ఎంత కాలం చేజారాలి? అన్నవే మనముందున్న ప్రశ్నలు. -
అమృతాహారం.. ఆర్థికానందం!
అడపా వెంకట రమణ చైతన్యవంతుడైన రైతు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని భోగాపురం ఆయన స్వగ్రామం. సొంత పొలంలో నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ.. సంతోషంగా ఉన్నారు. ‘సాక్షి’లో ప్రతి మంగళవారం ప్రచురితమవుతున్న ‘సాగుబడి’ కథనాల ద్వారా పొందిన స్ఫూర్తితోనే ప్రకృతి వ్యవసాయం చేపట్టానని, అప్పటి నుంచీ ‘సాగుబడి’ పేజీలన్నిటినీ సేకరించి దాచుకుంటూ మళ్లీ మళ్లీ చదువుకుంటున్నానని వెంకట రమణ సంతోషంగా చెప్పారు.రసాయనాలు వాడకుండా పండించిన బియ్యం తినడం వల్ల తనకున్న ఆస్తమా, డస్ట్ ఎలర్జీ పూర్తిగా పోయాయని, భూమి తల్లితోపాటు తన ఆరోగ్యం కూడా బాగైందని ఈ విలేకరితో ముఖతా చెబుతున్నప్పుడు ఆయన కళ్లలో కృతజ్ఞతాపూర్వకమైన సంతృప్తి, ఆనందం కనిపించింది. వెంకట రమణ తొలినాళ్లలో ఒడిదుడుకులను, ఇరుగు పొరుగు వారి ఎగతాళి మాటలను లక్ష్యపెట్టకుండా ముందడుగు వేసి.. అమృతాహారాన్ని అపురూపంగా పండిస్తున్న ఒక రైతుగా గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఆర్థికానందాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా పొందుతున్నారు.తన ప్రకృతి వ్యవసాయ ప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే.. ‘‘సాక్షి సాగుబడిలో ప్రచురితమైన ‘జీవితేచ్ఛకు నార్వోసి నీర్వెట్టి..’ అనే కథనం నాలుగేళ్ల క్రితం నన్ను కదిలించింది. అదే సంవత్సరం నుంచే ప్రకృతి వ్యవసాయం చేపట్టాను. ప్రతి వారం సాగుబడి కథనాలు చదివి, అవగాహన చేసుకుంటున్నాను. పాటించాల్సిన మెలకువలు, పద్ధతులను సవివరంగా వస్తున్న కథనాలతో సొంతంగా అన్ని సేంద్రియ ఎరువులు తయారు చేసుకోగలుగుతున్నాను.. ఎక్కడెక్కడో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల క«థనాలతో అదే బాటలో తాము పయనించడానికి సాక్షి సాగుబడి మార్గదర్శిగా మారింది. తొలి ఏడాదే మా సొంత పొలం ఆరెకరాల్లో వరిని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వేశాను. పిండీ(రసాయనిక ఎరువులు), పురుగుమందులు కొట్టిన తోటి రైతులకు ఎకరానికి 30 బస్తాల ధాన్యం పండితే నాకు 15 బస్తాలు పండాయి(నాలుగో ఏడాదికి ఎకరా దిగుబడి 25 బస్తాలకు పెరిగింది). పిండెయ్యకపోతే ఎలా పండుతుంది? అంటూ ప్రత్తిపాడు– రాపర్తి గ్రామాల రైతులు తెగ ఎగతాళి చేశారు. ఇది పనికొచ్చే వ్యవసాయం కాదన్నారు. అయితే, మార్కెట్లో సాధారణ ధరకే ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చింది. రసాయనిక అవశేషాల్లేని బియ్యం అని చెప్పి అమ్ముకోవడం తెలియలేదు. ఆవేశంతో ఒకేసారి ఆరెకరాలు వేయడం తప్పని అర్థమైంది. తర్వాత నుంచి రెండెకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే ఏలేరు కాల్వ నీటితో సార్వా, దాళ్వా ఊడుస్తున్నాను. ఇప్పుడు ఎకరానికి ఖాయంగా 25 బస్తాలు పండిస్తున్నా. చీడపీడలొస్తాయేమోనన్న బెంగ లేదు. రెండేళ్లుగా అయితే పురుగు కషాయాల అవసరం కూడా నాకు రాలేదు. కలుపు మందులు చల్లటం లేదు. నిశ్చింతగా పంట పండుతుంది. మూడో పంటగా మినుములు వేస్తున్నా. వర్షాలు దెబ్బతీయకపోతే చేతికి మినుములు వస్తాయి. లేదంటే భూసారం పెంచడానికి భూమిలో కలిపి దున్నేస్తున్నాను.. నేను చిన్నప్పుడు వర్షాధారంగా పిండి వేయకుండానే మా అమ్మానాన్నా పంటలు పండించే వారు. పెద్దయ్యేటప్పటికి రసాయనిక వ్యవసాయం పుంజుకుంది. రెండు పంటలకూ కలిపి ఎకరానికి 14 బస్తాల రసాయనిక ఎరువులు వేస్తున్నారు. రెండు సార్లు గుళికలు, ఐదారుసార్లు పురుగుమందులు చల్లుతున్నారు. రెండు పంటలకు ఎకరానికి రూ. 50 వేలు ఖర్చవుతున్నది. సార్వాలో 30–35 బస్తాలు, దాళ్వాలో 27 బస్తాలు పండిస్తున్నారు. వాళ్లు బస్తా ధాన్యం మహా అయితే, రూ. 1,400కు అమ్ముతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నాకు ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ. 20 వేలు ఖర్చవుతుంది. సార్వా, దాళ్వా కలిపి 50 బస్తాలు పండించి, క్వింటా ధాన్యం రూ. 2,000కు అమ్ముతున్నా. వాళ్లకన్నా నాకే నికరాదాయం ఎక్కువగా వస్తున్నది. వాళ్లు మార్కెట్‌కు తీసుకెళ్లి ధర ఎంతుంటే అంతకు అమ్ముకోవాలి. నేను మార్కెట్ కోసం వెతుక్కోనక్కరలేదు. ఖాతాలున్నాయి. వాళ్లే ఇంటికి వచ్చి నేను చెప్పిన ధరకు తీసుకెళ్తున్నారు..పిండేసిన బియ్యం తినేటప్పుడు నాకు ఆస్తమా, డస్ట్ ఎలర్జీ ఉండేవి. ప్రకృతి ఆహారం తిన్నాక అవి పోయాయి. మా చేనును చూస్తుంటే పసిపాప నవ్వును చూసినట్టుంటుంది. ఎటెళ్లి వచ్చినా చేలోకి వెళ్లి 10 నిమిషాలు గట్టుమీద కూర్చుంటే కానీ ఊసుపోదు..’’ – వెలుగుల సూర్య వెంకట సత్యవరప్రసాద్, సాక్షి, పిఠాపురం, తూ.గో. జిల్లా నేను ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన రెండో ఏడాది మా ఇరుగు పొరుగు వరి పొలాలకు ఎండాకు తెగులు వచ్చింది. ఎకరానికి 10 బస్తాలు కూడా రాలేదు. అయితే, మా పొలానికి ఎండాకు తెగులు రాలేదు. నా దిగుబడి తగ్గలేదు. ఇది చూసిన తర్వాత రైతుల్లో ఆలోచన మొదలైంది. ఏమో అనుకున్నాం గానీ ప్రకృతి వ్యవసాయంలో ఇంత శక్తి ఉందా? అంటూ నోరెళ్లబెట్టారు. అయితే, కౌలు రైతులు నష్టాల భయంతో ముందుకు రాలేకపోతున్నారు. ఎకరానికి కౌలు పది బస్తాలు. అందువల్ల వాళ్లు వెనకాడుతున్నారు. ఎరువుల మీద సబ్సిడీని రైతులకు నేరుగా నగదు రూపంలో వరుసగా మూడేళ్లు ఇస్తేగానీ కౌలు రైతులు మారలేరు. భూమికి, రైతుకు తల్లీబిడ్డకున్న అనుబంధం ఉంది. ప్రకృతి వ్యవసాయంతో భూమిని బతికించి, రైతును బతికించుకోవాలి.. (రైతు వెంకట రమణను 99899 84347 నంబరులో సంప్రదించవచ్చు). జీవామృతం కలుపుతున్న వెంకట రమణ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
చెరకు చెట్లకు నిచ్చెనలు!
అవును..!మట్టిని పూర్తిగా నమ్మిన రైతు ఎన్నడూ నష్టపోడు..!!ఈ నమ్మకాన్ని సజీవంగా నిలబెడుతున్నాడు ఓ యువ రైతు.మట్టిలోని సూక్ష్మజీవరాశి పంటలకు సంజీవనిలా పనిచేస్తూ రైతులకు సిరులు కురిపిస్తోంది. మట్టి ద్రావణాన్ని పంటలపై పిచికారీ చేస్తే అద్భుత దిగుబడులు సాధించవచ్చని ఆవిష్కరించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి విశేష కృషి క్రమక్రమంగా రైతు లోకానికి చేరువ అవుతోంది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడకుండా.. కేవలం మట్టి ద్రావణం, నూనెలతోనే.. చెరకు, పత్తి, కంది+మొక్కజొన్న తదితర పంటలను విజయవంతంగా సాగు చేస్తున్న యువ రైతు జగదీశ్ యాదవ్ విజయగాథ ఇది. మట్టిలో పెరిగే పంటలకు ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులూ అక్కరలేదని.. కేవలం మట్టి ద్రావణం చాలని యువ రైతు జగదీశ్ యాదవ్ స్వానుభవంతో చాటిచెబుతున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్ గ్రామానికి చెందిన రైతు తుమ్మల మల్లయ్య, బుచ్చమ్మ దంపతుల మూడో కుమారుడు జగదీశ్ యాదవ్ డిగ్రీ వరకు చదువుకొని తండ్రి బాటలోనే వ్యవసాయం చేస్తున్నారు. 30 ఎకరాల పొలం ఉంది. గత ఏడాది వరకు రసాయనిక వ్యవసాయం చేస్తూ వచ్చిన జగదీశ్ ఈ ఏడాది సేంద్రియ పద్ధతుల్లో సాగుకు శ్రీకారం చుట్టారు. 12 ఎకరాల్లో చెరకు, మిగతా 18 ఎకరాల్లో బీటీ–2 పత్తి, కంది అంతరపంటగా మొక్కజొన్న, ఆలుగడ్డ తదితర పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటల్లో రసాయనిక ఎరువులు, పురుగుమందులు అసలు వాడటం లేదని జగదీశ్ చెప్పారు. పంటల ఎదుగుదల దశలో నూనెలను డ్రిప్‌తో పంటలకు అందిస్తున్నారు. దీంతోపాటు ప్రముఖ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) పద్ధతిలో మట్టి ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడులు సాధిస్తున్నారు. గత ఏడాది శనగ పంటలను రసాయనిక పద్ధతిలోనే సాగు చేశారు. శనగపచ్చ పురుగు ఆశించగా సీవీఆర్ పద్ధతి గురించి తెలుసుకొని ఎకరానికి 30 కిలోల లోపలి మట్టిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే 5–7 రోజుల్లో పురుగు బెడద పోయిందన్నారు. ఆ స్ఫూర్తితో ఈ ఏడాది పంటలన్నిటినీ సీవీఆర్ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. 15 అడుగుల ఎత్తు పెరిగిన చెరకు 12 ఎకరాల్లో సాగు చేస్తున్న చెరకు తోట అసాధారణంగా 14–15 అడుగుల ఎత్తు పెరగటం విశేషం. గడ ఒకటి 3 కిలోల బరువు ఉండటంతో.. ఎకరానికి 70–80 టన్నుల దిగుబడి వస్తుందని జగదీశ్ ఆశిస్తున్నారు. ఈ నెల 20 నుంచి చెరకు నరికి ఫ్యాక్టరీకి తోలనున్నారు. తమ ప్రాంతంలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడిన వారి చెరకు తోటలు తమ తోట కన్నా సగం ఎత్తు మాత్రమే ఎదిగాయని, ఎకరానికి 40 టన్నులకు మించి దిగుబడి వచ్చే అవకాశం లేదన్నారు. వీరు ఎరువులకే ఎకరానికి రూ. 20 వేల వరకు ఖర్చు చేశారని, తాము 12 ఎకరాలకు 4 దఫాలలో మొత్తం కలిపి కేవలం 60 లీటర్ల నూనెలను వాడామని(ఖర్చు రూ. 5 వేలు) తెలిపారు. 80632 రకం 13 టన్నుల చెరకు విత్తనాన్ని వరుసల మధ్య 5 అడుగులు.. మొక్కల మధ్య అరడుగు దూరంలో మూడు కన్నుల ముచ్చెలను గత మార్చి 20న నాటారు. చెరకు సాగుకు ముందు 12 ఎకరాల్లో 15 రోజుల పాటు రూ. 25 వేల ఖర్చుతో గొర్రెలను మందగట్టారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు 7 సార్లు సీవీఆర్ చెప్పిన విధంగా మట్టి ద్రావణాన్ని పిచికారీ చేశారు. పైమట్టి(భూమిపైన 6 అంగుళాల లోతు వరకు ఉన్న మట్టి) 15 కిలోలు, లోపలి మట్టి(భూమిలో 6 అంగుళాల లోతు నుంచి 4 అడుగుల లోతు వరకు ఉన్న మట్టి) 15 కిలోలను కలిపి 200 లీటర్ల డ్రమ్ముల్లో కలిపి ఎకరానికి పిచికారీ చేశామన్నారు. జేసీబీతో తన పొలంలో ఒక మూల నుంచి రెండు ట్రాక్టర్ల మట్టిని తీసి దాచిపెట్టుకొని ఉపయోగించామన్నారు. స్ప్రేయర్లకు అందనంత ఎత్తుకు పెరగటంతో జూలై నాటి నుంచి మట్టి ద్రావణం పిచికారీని కూడా నిలిపివేశానని జగదీశ్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం 15 అడుగుల ఎత్తుకు పెరగటంతో జడలు వేయడానికి కూడా నిచ్చెనలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం విశేషం. కలుపు, జడలు వేయటం, ఫ్యాక్టరీకి తోలకం తదితర ఖర్చులన్నీ పోను 12 ఎకరాలకు రూ. 22 లక్షల వరకు నికరాదాయం వస్తుందని భావిస్తున్నానని తెలిపారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకపోవటం వల్ల ఖర్చు తగ్గించుకోవటం సాధ్యమైంది. ఆ మేరకు పర్యావరణానికి జరిగే కీడును కూడా నివారించినట్టయింది. పత్తికి గులాబీ పురుగు సోకలేదు! కొన్ని ఎకరాల్లో బీటీ–2 రకం పత్తి, కంది+మొక్కజొన్న తదితర పంటలను కూడా ఈ ఏడాది రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా జగదీశ్ యాదవ్ సాగు చేయటం విశేషం. గులాబీ రంగు పురుగు తమ పొలంలో కనిపించలేదన్నారు. తెల్లదోమ, పచ్చదోమల నివారణకు ప్రతి 15 రోజులకోసారి మట్టి ద్రావణాన్ని(15 కిలోల పైమట్టి + 15 కిలోల లోపలి మట్టిని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి) పిచికారీ చేశామన్నారు. దోమ ఉధృతంగా ఉందనిపిస్తే 10 రోజులకోసారి పిచికారీ చేశామన్నారు. పైమట్టి ద్రావణం వల్ల పంట ఏపుగా పెరుగుతుందని, లోపలి మట్టి ద్రావణం వల్ల చీడపీడలు దరిచేరకుండా ఉంటాయన్నారు. నూనెలను ఎకరానికి 4 లీటర్ల చొప్పున రెండు సార్లు డ్రిప్ ద్వారా అందించామన్నారు. సాధారణంగా పత్తి రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులకు మాత్రమే ఎకరానికి రూ. 20 వేలకు పైగా ఖర్చు చేశారని, తాము ఎకరానికి మహా అయితే రూ. వెయ్యి మాత్రమే ఖర్చు చేశామన్నారు. మట్టి ద్రావణాన్ని తామే పిచికారీ చేసుకుంటామన్నారు. భారీ వర్షాల దెబ్బకు దిగుబడి తగ్గిందని అంటూ.. ఎకరానికి సగటున 9–10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. ఎన్ని రసాయనిక ఎరువులు వేసినా ఇంత దిగుబడి రాదు! చింతల వెంకటరెడ్డి చెప్పినట్లు మట్టి ద్రావణంతోపాటు.. నూనెలను వాడటం వల్లనే ఆశ్చర్యకరమైన దిగుబడులు సాధించగలిగాను. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండానే చెరకు తోట అద్భుతమైన దిగుబడి ఇచ్చింది. పత్తిలో ఎకరానికి రూ. 20 వేల వరకు రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఖర్చు తగ్గింది. రసాయనిక వ్యవసాయం చేసే ఇతర రైతులతో సమానంగా 8–11 టన్నుల దిగుబడి వస్తుంది. ఏ రకంగా చూసినా మట్టి ద్రావణం చక్కని ఫలితాలనిస్తున్నదని రెండేళ్లుగా వివిధ పంటలు సాగు చేసిన అనుభవంతో గ్రహించాను. ఇతర రైతులకూ ఇదే చెబుతున్నాను. – తుమ్మల జగదీశ్ యాదవ్ (80088 61961), పట్లూర్, మర్పల్లి మండలం, వికారాబాద్ జిల్లా (సీవీఆర్ మట్టి ద్రావణం గురించి పూర్తి వివరాలకు‘సాక్షి సాగుబడి’ ఫేస్బుక్ గ్రూప్ చూడండి.) – కె.సుధాకర్ రెడ్డి, సాక్షి, మర్పల్లి, వికారాబాద్ జిల్లా మట్టి ద్రావణం తయారీ -
సేంద్రియ ‘బరువు’
► ముందుకు సాగని సేంద్రియ ఎరువు యూనిట్లు హా రూ.11.46 కోట్ల పెండింగ్ ► ఆరు నెలలుగా మంజూరుకాని బిల్లులు ► మూడేళ్లుగా నెరవేరని లక్ష్యం ప్రస్తుత సమాజంలో ఎన్నో రకాల రోగాలకు కారణం రసాయనిక ఎరువులతో పండించిన పంటలు. రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2015లో వర్మీకంపోస్టు పథకాన్ని తీసుకొచ్చారు. రైతులు తమకు అనువుగా ఉన్న పొలాల్లో కంపోస్టు షెడ్లు నిర్మించుకునే విధంగా రూపకల్పన చేశారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ పథకం నత్తనడకన సాగుతోంది. గుర్రంకొండ: ప్రజల ఆరోగ్యంతో పాటు, రైతుల ఆదా యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన వర్మీకంపోస్టు యూనిట్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం నీరుగారిపోతోంది. యూనిట్ల నిర్మాణంపై రైతులు ఆసక్తి కనబరిచినా ఆరు నెలలుగా వీటికి సంబం ధించిన బిల్లులు మంజూరు కాకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. ఈ కారణంగా గడిచిన మూడేళ్లలో సరాసరి 70 శాతం యూనిట్ల నిర్మాణాలు కూడా పూర్తి కాలేదు. పలు గ్రామాల్లో నిర్మించుకున్న యూని ట్లలో ఎరువులు తయారు చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. పైగా వీటికోసం చేసిన ఖర్చు రైతులకు అదనపు భారంగా మారింది. యూనిట్ నిర్మాణ విలువ.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక యూనిట్ నిర్మాణానికి రూ.18 వేలు మంజూరు చేస్తారు. మొదటి దశలో పునాది వేస్తే రూ.1000, రెండో దశలో తొట్టె నిర్మాణాలు పూర్తి చేస్తే రూ.12 వేలు, మూడో దశలో పందిరి, ఎరువులు వేసుకుంటే రూ.3000, నాలుగో దశలో వానపాములను కొనుగోలు చేసి తొట్టెల్లో వేస్తే రూ.2000 ఇలా మొత్తం రూ.18 వేలు మంజూరు చేస్తారు. రెండు తొట్టెలను మూడు అడుగుల వెడల్పు, ఏడు అడుగుల పొడవు, రెండున్నర అడుగుల ఎత్తుతో నిర్మించాల్సి ఉంటుంది. ఎరువుల తయారీ ఇలా.. నిర్మాణం పూర్తయిన తొట్టెల్లో ఆవు పేడ నింపాల్సి ఉం టుంది. వానపాములను తొట్టెలోని ఎరువులో వేసి కలియబెడతారు. నాలుగు నెలల తర్వాత వానపాములను, సేంద్రియ ఎరువు నుంచి వేరుచేస్తారు. అలా వేరుచేసిన దాన్నే వర్మీకంపోస్టు ఎరువుగా పిలుస్తారు. ఇందులో రసాయనిక ఎరువులైన కాంప్లెక్సు, యూరియాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. రసాయనిక ఎరువుల అధిక వినియోగంతో భూసారం దెబ్బతినడమేగాక భూమి గుల్ల అవుతుంది. అదే వర్మీకంపోస్టు ఎరువు వినియోగంతో పంటకు అన్ని రకాల రోగాల నుంచి రక్షణతో పాటు మొక్కల ఎదుగుదల, పంట అధిక దిగుబడికి తోడ్పడుతుంది. మార్కెట్లో వర్మీకంపోస్టు ఎరువులకు ఎక్కువ డిమాండ్ ఉండడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితి.. ఈ ఏడాది మార్చి నుంచి చేపట్టిన వర్మికంపోస్టు యూనిట్ల నిర్మాణాలకు సంబంధించి రూ.11.46 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నిర్మాణాలు పూర్తి చేసుకున్న రైతులు బిల్లులు అందక ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకుని ఎరువుల ఉత్పత్తి ప్రారంభం కానివి 5,266 యూనిట్లు ఉన్నాయి. పలుచోట్ల ఐకేపీ అధికారులు రైతులకు వానపాములు సకాలంలో పంపిణీ చేయలేదు. మరికొన్ని చోట్ల వానపాములకు సంబంధించి బిల్లులు చేతికందకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కనీసం రబీ సీజన్‌కైనా సంప్రదాయ ఎరువులతో వ్యవసాయ చేద్దామనుకున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. బిల్లులు ఇవ్వలేదు.. వర్మీకంపోస్టు యూ నిట్ నిర్మించుకుని నెలలు గడస్తున్నా ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదు. రెండు బిల్లులు పెండింగ్‌లో ఉంచారు. బిల్లులు ఇస్తే మిగతా పనులు పూర్తి చేసుకుంటాం. సేద్యానికి వర్మీకంపోస్టు ఎరువు ఎంతో అవసరం. అధికారులు బిల్లులు వెంటనే మంజూరు చేయాలి. – పార్వతమ్మ, కొత్తపల్లె వానపాములు ఇస్తే ఎరువులు తయారు చేసుకుంటాం.. మేము వర్మీకంపోస్టు యూని ట్లు కట్టుకుని ఐదు నెలలకు పైగా గడుస్తోంది. అధికారులు రెండు బిల్లులు పెండింగ్‌లో ఉంచారు. కనీసం వానపాములునైనా ఇస్తే ఎరువు తయారు చేసుకుంటాం. ఇప్పటికే ఆవుపేడ తొట్టెల్లో నింపుకున్నాం. రానున్న వ్యవసాయ పనులకు ఈ ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయి. – కమలమ్మ, చిట్టిబోయనపల్లె -
వరిలో ఎరువుల యాజమాన్యం ఇలా..
ఎరువులు ఎక్కువ వాడితే చీడపీడల ముప్పు భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా వాడుకోవాలి పరీక్షలు చేయంచకుంటే వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలి సార్వా వరిసాగులో ఎరువుల యాజమాన్యమే కీలకం. అయితే ఎరువుల వాడకంపై రైతులకు అంతగా అవగాహన ఉండటంలేదు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పట్టించుకోకుండా తోటి రైతులు వాడుతున్నారని తమ పొలంలోనూ అవసరం ఉన్నాలేకున్నా ఎడాపెడా ఎరువులను చల్లి ఖర్చులు పెంచుకుంటున్నారు. ఎరువుల యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు పాటిస్తేనే అధిక దిగుబడులు వస్తాయని మండవల్లి సబ్ డివిజన్ ఏడీఏ ఈదా అనిల్‌కుమారి సూచిస్తున్నారు. ఎరువుల వినియోగం ఆమె మాటల్లోనే.. ఎరువుల వినియోగంలో రైతులకు సరైన అవగాహన లేనందువల్ల అటు ఆర్థికంగా, ఇటు దిగుబడుల పరంగా నష్టపోతున్నారు. నీటి యాజమాన్యంతో పాటు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంలోనూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాలి. వరిసాగులో రసాయన ఎరువులపై రైతులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగా ఎరువులను వాడినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. భూసార పరీక్షలు చేయించనప్పుడు ఎకరానికి 25 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 నుంచి 16 కిలోల పొటాష్ లభించే ఎరువులను మాత్రమే వాడాలి. అంతకు మించి వాడితే పొలంపై తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉంది. మూడు విడతలుగా యూరియా చల్లుకోవాలి వరిపైరు పెరిగేందుకు నత్రజని ఎంతగానో దోహదపడుతుంది. దీనిని మూడు దఫాలుగా పొలంలో చల్లుకోవాలి. నాట్లు వేసే ముందు, దుబ్బు చేసే దశలో, అంకురం ఏర్పడే దశలో నత్రజనిని అందిచే ఎరువులను వాడుకోవాలి. నత్రజని పోషకాన్ని సరైన మోతాదులో అందించేందుకు యూరియా వాడే విధానంపై రైతులు అవగాహన కల్పించుకోవాలి. ఎకరానికి 25 నుంచి 32 కిలోల నత్రజని అందించాలంటే 55 నుంచి 70 కిలోల యూరియాను పొలంలో చల్లుకోవాలి. దీనిని మూడు సమ భాగాలుగా విభజించి చల్లుకోవాల్సి ఉంటుంది. పైరు పెరుగుదల ఆశించిన రీతిలో లేకుంటే అదనంగా 10 నుంచి 15 కిలోల వరకు యూరియా వాడవచ్చు. యూరియా అధిక వినియోగం వల్ల అనేక అనర్థాలు ఎదురవుతాయి. యూరియా ఎక్కువైతే వరి మొక్కల ఆకుల్లో పత్రహరితం అధికంగా ఉంటుంది. ఫలితంగా పురుగులు దాడిచేస్తాయి. అగ్గితెగులు, ఆకుముడత తెగులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. భాస్వరం సకాలంలో అందించాలి మొక్కల వేరుల పెరుగుదలకు పోషక పదార్థంగా భాస్వరం ఉపయోగ పడుతుంది. దీనిని నాట్లు వేసేముందు దమ్ములో లేదా నాట్లు వేసిన 15 రోజుల్లోపు కాంప్లెక్స్ ఎరువుగా వాడాల్సి ఉంటుంది. నాట్లు వేసిన 15 రోజుల తరువాత ఈ ఎరువును పొలంలో చల్లుకున్నా ఉపయోగం ఉండదు. అయితే పొలంలో జింకులోపం తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ ఎరువును సకాలంలో పైరుకు అందిస్తేనే మొక్కల ఎదుగుదల, దిగుబడులు బాగుంటాయి. పొటాష్‌తో రోగని రోధక శక్తి వరి మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెంచడానికి అవసరమైన పోషకాలను మొక్కలోని వివిధ భాగాలకు సరఫరా చేయడానికి పొటాష్ ఉసయోగపడుతుంది. వరి పంటకు అవసరమయ్యే 12 నుంచి 16 కిలోల పొటాష్ అందించేందుకు 20 నుంచి 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను పొలంలో చల్లుకోవాలి. దీనిని రెండు సమ భాగాలుగా చేసి మొదటి దఫా, రెండో దఫా యూరియాతో కలిపి వేస్తే ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. -
రసాయనిక ఎరువు, నేల గుండె బరువు
భార్యను సంతృప్తి పర్చడానికి ఒక కొడుకు తల్లి గుండెను కోరుతాడు. ఆ తల్లి కొడుకు సంతోషం కోసం తన గుండెను తీసి అతని దోసిట పెడుతుంది. దొసిటి కందిన తల్లి గుండెను భార్యకు చేర్చి మెప్పందుకోవడానికి వడివడిగా పరుగెడు తుండగా పోటురాయి తగిలి తుళ్లిపడబోతాడు. అతగాడి దోసిట్లో ఉన్న అమ్మ గుండె ‘అయ్యో నాయనా భద్రంరా! దెబ్బేమైనా తగిలిందా?’ అని ఆదుర్దా పడిందని జానపద గాథ. కన్నతల్లి ఔన్నత్యాన్ని చాటే ఈ కథ అచ్చంగా నేల తల్లికి వర్తి స్తుంది. తీరొక్కరీతిలో విధ్వంసం చేస్తూ తనువెల్ల గాయాలు చేస్తున్నా జీవకోటికి అన్నం పెట్టి ప్రాణాలు నిలుపుతోంది. ఇది నేలతల్లి ఔదార్యం. మనిషి పేరాశ ప్రకృతి వనరుల విధ్వంసానికి కారణమయింది. విచక్షణ లేకుండా సాగిన ఈ విధ్వంస క్రీడ పర్యావరణ చక్రాన్ని విరగదోసింది. లాభమే పరమావధిగా మారిన వ్యవసాయంలో విచక్షణా రహితంగా వాడుతున్న రసా యనాలు నేలను కుళ్లబొడిచి గుల్ల చేశాయి. ఫలితంగా నేలవారణంలోని మను గడ సాగించే వృక్ష, పశు, ప్రాణకోటి సమతౌల్యం దెబ్బతింది. ఫలితంగా సకల జీవకోటికి ఆహారం అందించే జీవావరణం దారుణంగా దెబ్బతింది. నిస్సార మైన నేల సమాజ ఆహార అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేని స్థితికి చేరింది. మనిషిలాగే స్వాభావికంగా శోషణ, జీర్ణ, శ్వాస, విసర్జక ధర్మాలను కలిగి ఉండే నేల తనలో కలుస్తున్న లక్షలాది టన్నుల విషరసాయనాల ఫలితంగా నిర్వీర్యమయింది. నేలకు నిరంతరం జీవశక్తి అందించే సూక్ష్మజీవావరణాన్ని రసాయనాలు నాశనం చేశాయి. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) శాస్త్రవేత్తలు పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9 వ్యవసాయ మండలాలలో జరిపిన పరిశోధనల్లో సూక్ష్మ, స్థూల పోషకాలు కనిష్ట స్థాయికి పడిపోయాయని ప్రకటించారు. సారవంతమైన నేలలుగా పేరుపడిన డెల్టా ప్రాంతాల్లో కూడా మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజని శూన్యస్థాయికి దిగజారిందని తేలింది. జాతీయ భూ సర్వేక్షణ, వినియోగ ప్రణాళిక మండలి దేశపు మొత్తం సాగుభూమి 329 మిలియన్ హెక్టార్లలో 121 మిలియన్ల హెక్టార్లు పూర్తిగా నిస్సారమైనట్లు ప్రకటించింది. ఈ ఉసరక్షేత్రాలను సాగులోకి తేవడం పెద్ద సవాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో పత్తిసాగు చేస్తున్న పలు ప్రదేశాల్లో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో రసాయనిక ఎరువుల ద్వారా వెలువడుతున్న కర్బన ఉద్గారాల శాతం అత్యధికం అని తేలింది. మెరుగైన యాజమాన్య పద్ధతులు అనుసరిస్తున్న వ్యవసాయ క్షేత్రాలలో హెక్టార్‌కు 547 కిలోగ్రాముల రసాయనిక ఎరువులు వాడుతున్నారు. దీంతో 1,642 కిలోగ్రాముల కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి. అదే సంద్ర వ్యవసాయంలో హెక్టారుకు 1,127 కిలోల ఎరువులు వినియోగిస్తుండగా వెలువడుతున్న కర్బన ఉద్గారాలు 3,312 కిలోగ్రాములు. తీవ్రత రెట్టింపు కంటే ఎక్కువని తేలింది. ప్రపంచాన్ని వణికిస్తున్న గ్లోబల్ వార్మింగ్ ఈ ఉద్గారాల ఫలితమే. ఫలితంగా సంభవిస్తున్న ప్రకృతి విలయాల ధాటికి అభివృద్ధి చెందిన దేశాలు, అగ్రరాజ్యాలు భయభ్రాంతమై నిలువునా నీరుకారిపోతున్నాయి. ఇప్పుడిది మనిషి ఆహార సమస్య మాత్రమే కాదు, మనుగడను ప్రశ్నిస్తున్న సమస్య. నేల తల్లికి కొత్తజీవంపోయడమే మానవాళి మనుగడకు భరోసా. మనవ హక్కులు మనిషికే కాదు మట్టికీ ఉండాలని, ఇక నుంచి ఉంటాయని బొలీవియా దేశాధక్ష్యుడు ఎవోమోరెల్ ప్రకృతి పరిరక్షణ చట్టాన్ని ప్రకటించారు. దేశ రాజకీయ వర్గాలు, సామాజిక బృందాలు స్వాగతించాయి. బొలీవియా బంగారు, తగరపు ఖనిజాలపై డేగకన్నేసిన అగ్రరాజ్యం దశా బ్దాలుగా విచక్షణరహితంగా తవ్వి తీసుకుపోయింది. ఫలితంగా పర్యావర ణానికి తీవ్ర హాని జరిగింది. ఈ విధ్వంసం ఇలాగే సాగితే సమీప భవిష్యత్‌లోనే బొలీవియా ఎడారి అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే బొలీవియా ప్రపంచంలోనే తొలిసారిగా ప్రకృతి పరిరక్షణ చట్టం చేసింది. పచ్చమమ పేరుతో ప్రకృతి మాతను కొలిచే అండియాన్ ఆదివాసీ సమాజం విశ్వాసాల ప్రభావం ఈ చట్టానికి ప్రేరణ. ఆదీవాసుల విశ్వాసం ప్రకారం ‘‘పచ్చమమ సజీవ స్వరూపం, పవిత్రురాలు. జీవకోటి మనుగడకు ఆధారం. తన తేజస్సుతో శాశ్వత సమతుల్యాన్ని, సామరస్యతా సందేశాలను అందిస్తోంది. చరాచర ప్రాణికోటి వైవిద్యాలను తనలో ఇముడ్చుకొని నడిపిస్తోంది’’ అని ఈ చట్టం పేర్కొంది. ఈ చట్టాన్ని పరిచయం చేస్తూ బొలీవియా విదేశీ వ్యవహారాల మంత్రి డేవిడ్ చొక్వెహూవంకా ‘‘మాను, మనిషితో పాటు ప్రాణమున్న ప్రతిజీవితో కలిసి అంతా ఓ పెద్ద కుటుంబం. భూప్రపంచమంతా ఆ కుటుంబంలో భాగమే అనేది మా విశ్వాసం. అదే మా తాతతండ్రులు మాకు నేర్పింది. ఆహారం, వాతావరణం, ఇంధనం, ధనం, ఏ సమస్యనైనా ఈ విశ్వాసం వెలుగులోనే పరిష్కరించుకుంటాం’’అని డేవిడ్ చొక్వెహూవంకా చెప్పారు. మనుగడ హక్కు, ప్రకృతి మార్పుల్లో మానవ ప్రమేయ నిరోధంతో పాటు, జన్యుమార్పిడి నిరోధక హక్కులు ఇందులో ముఖ్యమైనవి. ఈ చట్టం అమలు బాధ్యత పౌరసమాజానికి బదలాయిస్తున్నామని డేవిడ్చొ ప్రకటించారు. - జిట్టా బాల్‌రెడ్డి, ‘సాక్షి’ సాగుబడి డెస్క్