15 అడుగుల వరకు పెరిగిన తన చెరకు పంటను నిచ్చెన పైకి ఎక్కి చూపుతున్న జగదీశ్ యాదవ్
అవును..!మట్టిని పూర్తిగా నమ్మిన రైతు ఎన్నడూ నష్టపోడు..!!ఈ నమ్మకాన్ని సజీవంగా నిలబెడుతున్నాడు ఓ యువ రైతు.మట్టిలోని సూక్ష్మజీవరాశి పంటలకు సంజీవనిలా పనిచేస్తూ రైతులకు సిరులు కురిపిస్తోంది. మట్టి ద్రావణాన్ని పంటలపై పిచికారీ చేస్తే అద్భుత దిగుబడులు సాధించవచ్చని ఆవిష్కరించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి విశేష కృషి క్రమక్రమంగా రైతు లోకానికి చేరువ అవుతోంది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడకుండా.. కేవలం మట్టి ద్రావణం, నూనెలతోనే.. చెరకు, పత్తి, కంది+మొక్కజొన్న తదితర పంటలను విజయవంతంగా సాగు చేస్తున్న యువ రైతు జగదీశ్ యాదవ్ విజయగాథ ఇది.
మట్టిలో పెరిగే పంటలకు ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులూ అక్కరలేదని.. కేవలం మట్టి ద్రావణం చాలని యువ రైతు జగదీశ్ యాదవ్ స్వానుభవంతో చాటిచెబుతున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్ గ్రామానికి చెందిన రైతు తుమ్మల మల్లయ్య, బుచ్చమ్మ దంపతుల మూడో కుమారుడు జగదీశ్ యాదవ్ డిగ్రీ వరకు చదువుకొని తండ్రి బాటలోనే వ్యవసాయం చేస్తున్నారు.
30 ఎకరాల పొలం ఉంది. గత ఏడాది వరకు రసాయనిక వ్యవసాయం చేస్తూ వచ్చిన జగదీశ్ ఈ ఏడాది సేంద్రియ పద్ధతుల్లో సాగుకు శ్రీకారం చుట్టారు. 12 ఎకరాల్లో చెరకు, మిగతా 18 ఎకరాల్లో బీటీ–2 పత్తి, కంది అంతరపంటగా మొక్కజొన్న, ఆలుగడ్డ తదితర పంటలను సాగు చేస్తున్నారు.
ఈ పంటల్లో రసాయనిక ఎరువులు, పురుగుమందులు అసలు వాడటం లేదని జగదీశ్ చెప్పారు. పంటల ఎదుగుదల దశలో నూనెలను డ్రిప్‌తో పంటలకు అందిస్తున్నారు. దీంతోపాటు ప్రముఖ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) పద్ధతిలో మట్టి ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడులు సాధిస్తున్నారు. గత ఏడాది శనగ పంటలను రసాయనిక పద్ధతిలోనే సాగు చేశారు. శనగపచ్చ పురుగు ఆశించగా సీవీఆర్ పద్ధతి గురించి తెలుసుకొని ఎకరానికి 30 కిలోల లోపలి మట్టిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే 5–7 రోజుల్లో పురుగు బెడద పోయిందన్నారు. ఆ స్ఫూర్తితో ఈ ఏడాది పంటలన్నిటినీ సీవీఆర్ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు.
15 అడుగుల ఎత్తు పెరిగిన చెరకు
12 ఎకరాల్లో సాగు చేస్తున్న చెరకు తోట అసాధారణంగా 14–15 అడుగుల ఎత్తు పెరగటం విశేషం. గడ ఒకటి 3 కిలోల బరువు ఉండటంతో.. ఎకరానికి 70–80 టన్నుల దిగుబడి వస్తుందని జగదీశ్ ఆశిస్తున్నారు. ఈ నెల 20 నుంచి చెరకు నరికి ఫ్యాక్టరీకి తోలనున్నారు. తమ ప్రాంతంలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడిన వారి చెరకు తోటలు తమ తోట కన్నా సగం ఎత్తు మాత్రమే ఎదిగాయని, ఎకరానికి 40 టన్నులకు మించి దిగుబడి వచ్చే అవకాశం లేదన్నారు. వీరు ఎరువులకే ఎకరానికి రూ. 20 వేల వరకు ఖర్చు చేశారని, తాము 12 ఎకరాలకు 4 దఫాలలో మొత్తం కలిపి కేవలం 60 లీటర్ల నూనెలను వాడామని(ఖర్చు రూ. 5 వేలు) తెలిపారు.
80632 రకం 13 టన్నుల చెరకు విత్తనాన్ని వరుసల మధ్య 5 అడుగులు.. మొక్కల మధ్య అరడుగు దూరంలో మూడు కన్నుల ముచ్చెలను గత మార్చి 20న నాటారు. చెరకు సాగుకు ముందు 12 ఎకరాల్లో 15 రోజుల పాటు రూ. 25 వేల ఖర్చుతో గొర్రెలను మందగట్టారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు 7 సార్లు సీవీఆర్ చెప్పిన విధంగా మట్టి ద్రావణాన్ని పిచికారీ చేశారు. పైమట్టి(భూమిపైన 6 అంగుళాల లోతు వరకు ఉన్న మట్టి) 15 కిలోలు, లోపలి మట్టి(భూమిలో 6 అంగుళాల లోతు నుంచి 4 అడుగుల లోతు వరకు ఉన్న మట్టి) 15 కిలోలను కలిపి 200 లీటర్ల డ్రమ్ముల్లో కలిపి ఎకరానికి పిచికారీ చేశామన్నారు.
జేసీబీతో తన పొలంలో ఒక మూల నుంచి రెండు ట్రాక్టర్ల మట్టిని తీసి దాచిపెట్టుకొని ఉపయోగించామన్నారు. స్ప్రేయర్లకు అందనంత ఎత్తుకు పెరగటంతో జూలై నాటి నుంచి మట్టి ద్రావణం పిచికారీని కూడా నిలిపివేశానని జగదీశ్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం 15 అడుగుల ఎత్తుకు పెరగటంతో జడలు వేయడానికి కూడా నిచ్చెనలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం విశేషం. కలుపు, జడలు వేయటం, ఫ్యాక్టరీకి తోలకం తదితర ఖర్చులన్నీ పోను 12 ఎకరాలకు రూ. 22 లక్షల వరకు నికరాదాయం వస్తుందని భావిస్తున్నానని తెలిపారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకపోవటం వల్ల ఖర్చు తగ్గించుకోవటం సాధ్యమైంది. ఆ మేరకు పర్యావరణానికి జరిగే కీడును కూడా నివారించినట్టయింది.
పత్తికి గులాబీ పురుగు సోకలేదు!
కొన్ని ఎకరాల్లో బీటీ–2 రకం పత్తి, కంది+మొక్కజొన్న తదితర పంటలను కూడా ఈ ఏడాది రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా జగదీశ్ యాదవ్ సాగు చేయటం విశేషం. గులాబీ రంగు పురుగు తమ పొలంలో కనిపించలేదన్నారు. తెల్లదోమ, పచ్చదోమల నివారణకు ప్రతి 15 రోజులకోసారి మట్టి ద్రావణాన్ని(15 కిలోల పైమట్టి + 15 కిలోల లోపలి మట్టిని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి) పిచికారీ చేశామన్నారు. దోమ ఉధృతంగా ఉందనిపిస్తే 10 రోజులకోసారి పిచికారీ చేశామన్నారు.
పైమట్టి ద్రావణం వల్ల పంట ఏపుగా పెరుగుతుందని, లోపలి మట్టి ద్రావణం వల్ల చీడపీడలు దరిచేరకుండా ఉంటాయన్నారు. నూనెలను ఎకరానికి 4 లీటర్ల చొప్పున రెండు సార్లు డ్రిప్ ద్వారా అందించామన్నారు. సాధారణంగా పత్తి రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులకు మాత్రమే ఎకరానికి రూ. 20 వేలకు పైగా ఖర్చు చేశారని, తాము ఎకరానికి మహా అయితే రూ. వెయ్యి మాత్రమే ఖర్చు చేశామన్నారు. మట్టి ద్రావణాన్ని తామే పిచికారీ చేసుకుంటామన్నారు. భారీ వర్షాల దెబ్బకు దిగుబడి తగ్గిందని అంటూ.. ఎకరానికి సగటున 9–10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు.
ఎన్ని రసాయనిక ఎరువులు వేసినా ఇంత దిగుబడి రాదు!
చింతల వెంకటరెడ్డి చెప్పినట్లు మట్టి ద్రావణంతోపాటు.. నూనెలను వాడటం వల్లనే ఆశ్చర్యకరమైన దిగుబడులు సాధించగలిగాను. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండానే చెరకు తోట అద్భుతమైన దిగుబడి ఇచ్చింది. పత్తిలో ఎకరానికి రూ. 20 వేల వరకు రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఖర్చు తగ్గింది. రసాయనిక వ్యవసాయం చేసే ఇతర రైతులతో సమానంగా 8–11 టన్నుల దిగుబడి వస్తుంది. ఏ రకంగా చూసినా మట్టి ద్రావణం చక్కని ఫలితాలనిస్తున్నదని రెండేళ్లుగా వివిధ పంటలు సాగు చేసిన అనుభవంతో గ్రహించాను. ఇతర రైతులకూ ఇదే చెబుతున్నాను.
– తుమ్మల జగదీశ్ యాదవ్ (80088 61961), పట్లూర్, మర్పల్లి మండలం, వికారాబాద్ జిల్లా
(సీవీఆర్ మట్టి ద్రావణం గురించి పూర్తి వివరాలకు‘సాక్షి సాగుబడి’ ఫేస్‌బుక్ గ్రూప్ చూడండి.)
– కె.సుధాకర్ రెడ్డి, సాక్షి, మర్పల్లి, వికారాబాద్ జిల్లా
మట్టి ద్రావణం తయారీ
Comments
Please login to add a commentAdd a comment