Natural farming
-
ఇంట్లో సాఫ్ట్ వేర్ కొలువు..పొలంలో ప్రకృతి సేద్యం
ఇంటి దగ్గరి నుంచే విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూనే 8.5 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలుకు చెందిన యు. బాల భాస్కర శర్మ. ఎంటెక్ చదివి సింగపూర్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఆయన కరోనా సమయంలో కర్నూలుకు వచ్చారు. ఇప్పటికీ అదే హోదాలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూనే నిబద్ధతతో కూడిన ప్రకృతి వ్యవసాయం లో అద్భుతంగా రాణిస్తున్నారు. సొంత స్టోర్ నిర్వహించటంతో పాటు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలతో పాటు కలెక్టరేట్లో ప్రతి సోమవారం కూరగాయలు విక్రయిస్తూ అందరి చేతా ఔరా అనిపిస్తున్నారు.సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూనే ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న బాల భాస్కర శర్మ కృషి ప్రశంసనీయం. కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు గ్రామం వద్ద‡వారసత్వంగా సంక్రమించిన 8.5 ఎకరాల భూమిలో అంబా గో ఆధారిత వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. 75 సెంట్లలో పాలీహౌస్ ఏర్పాటు చేసుకొని అందులో అనేక కొత్త పంటలు పండిస్తున్నారు. పెనుగాలులు, భారీ వర్షాలకు దెబ్బతింటున్నందున సాధారణంగా ఉద్యాన శాఖ పాలీహౌస్‌లను ప్రోత్సహించటం లేదు. అయితే, శర్మ తన పొలం చుట్టూ గాలులను తట్టుకునేలా నేరేడు, రేగు తదితర పండ్ల చెట్లు పెంచి, మధ్యలో పాలీహౌస్ నిర్మించి, సమర్థవంతంగా నిర్వహించటం విశేషం. జిల్లాకు పరిచయమే లేని వెల్లుల్లి, బ్రకోలి తదితర అనేక రకాల కూరగాయలను పాలీహౌస్లో సాగు చేస్తున్నారు. బ్రకోలిని కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. పాలిహౌస్‌లో వంగ, బీర, టొమాటో, పచ్చి మిరప, కాళీఫ్లవర్, క్యాబేజీ, ఎర్ర క్యాబేజి, ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, బీన్స్, చిక్కుడు, కాకర, క్యాప్సికం, ఎర్రబెండ, సొర, పొట్ల, తంబకాయ, బుడం కాయ, కీరదోసతో పాటు.. ఎర్రతోట కూర, కొత్తిమీర, పుదీన, గోంగూర, తోటకూర, పాలకూర, బచ్చలి, చుక్కకూర, మెంతికూర వంటి 35 పంటలు సాగు చేస్తున్నారు. ఎతై ్తన బోదెలు ఏర్పాటు చేసుకొని మల్చింగ్, వీడ్ మ్యాట్ వేసి మొక్కలు నాటుకున్నారు. ఆరుబయట పొలాల్లో 3 నెలలు దిగుబడినిచ్చే కూరగాయలు పాలీహౌస్లో 5 నెలల వరకు దిగుబడినిస్తున్నాయి.పండ్ల చెట్లు.. ఫైనాపిల్ కూడా..7.75 ఎకరాల్లో చాలా రకాల పండ్ల చెట్లను పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో శర్మ పెంచుతున్నారు. నిమ్మ 250, జామ 200, సీతాఫలం 200, మామిడి 40, అంజూర 100, నేరెడు 200, మునగ 200, అరటి 80 చెట్లతో పాటు కొన్ని సపోటా, కొబ్బరి, ఉసిరి, నేరెడు, రేగు, రామాఫలం చెట్లు పెంచుతున్నారు. రాయలసీమప్రాంతంలో ఇంతవరకూ లేని ఫైనాపిల్ మొక్కలను కూడా పెంచుతున్నారు. మధురై నుంచి ఎర్రబెండ సీడ్ తెప్పించి నాటుకున్నారు.ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెటింగ్కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు దగ్గర ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటు చేయటంతో పాటు బాలబాస్కర శర్మ ఆన్లైన్ మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించారు. తను పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు కెమికల్స్ లేకుండా ఆహార పంటలు పండిస్తున్న రైతుల నుంచి బియ్యం, పప్పులు, పసుపు తదితరాలను సేకరించి విక్రయిస్తున్నారు. 8 దేశీ ఆవులను పోషిస్తూ నాలుగు ట్యాంకుల ద్వారా ద్రవ జీవామృతం పంటలకు ఇస్తున్నారు. వర్మీ కంపోస్టుతో పాటు రోజుకు 40 లీటర్ల వర్మీవాష్ కూడా ఉత్పత్తి చేసి డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. చీడపీడల నివారణకు అవసరాన్ని బట్టి కషాయాలు, వేపనూనె తదితరాలను వాడుతున్నారు. సోలార్ ట్రాప్స్, తెలుపు, పసుపు జిగురు అట్టలను ఏర్పాటు చేశారు. పండ్ల తోటలకు నష్టం కలిగించే పండు ఈగ ట్రాప్‌కు ఏర్పాటు చేశారు. అన్ని పంటలకు డ్రిప్ సదుపాయం కల్పించారు.రసాయనాల్లేకుండా పండించిన పంట కావడం వల్ల కూరగాయలు, ఆకు కూరలకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. శర్మ కృషిని గుర్తించిన కర్నూలు జిల్లా యంత్రాంగం.. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రత్యేకంగా కెమికల్స్ లేకుండా పండించిన కూరగాయలు విక్రయించేందుకు అవకాశం ఇచ్చిప్రోత్సహిస్తుండటం విశేషం. ఇంటి దగ్గరి నుంచే విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూనే 8.5 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలుకు చెందిన యు. బాల భాస్కర శర్మ. ఎంటెక్ చదివి సింగపూర్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఆయన కరోనా సమయంలో కర్నూలుకు వచ్చారు. ఇప్పటికీ అదే హోదాలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూనే నిబద్ధతతో కూడిన ప్రకృతి వ్యవసాయం లో అద్భుతంగా రాణిస్తున్నారు. సొంత స్టోర్ నిర్వహించటంతో పాటు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలతో పాటు కలెక్టరేట్లో ప్రతి సోమవారం కూరగాయలు విక్రయిస్తూ అందరి చేతా ఔరా అనిపిస్తున్నారు.రసాయనాల్లేని ఆహారం అందిస్తున్నా..!సింగ్‌పూర్‌లో 2020 వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశా. కరోనా కారణంగా ఇంటికి వచ్చేశా. ఇంటి నుంచే సాఫ్ట్వేర్ ఉద్యోగం చే స్తూ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకున్నా. 8 ఆవులను పెంచుతూ పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. మా వ్యవసాయ క్షేత్రంలో కెమికల్స్ వాసన అనేది ఉండదు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో కూరగాయల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు జిల్లా కలెక్టర్ అవకాశం ఇచ్చారు. ప్రత్యేక స్టోర్‌తో పాటు వెబ్సైట్ ద్వారా కూడా విక్రయిస్తున్నాం. రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తదితర ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నామనే సంతోషం ఉంది. ఎర్ర బెండకాయకు మంచి ఆదరణ ఉంది. పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర బెండకాయను ప్రజలు ఇష్టంగా తీసుకుంటున్నారు.– యు. బాల భాస్కర శర్మ (62817 00553), సాఫ్ట్వేర్ ఇంజనీర్ కమ్ ప్రకృతి రైతు, కర్నూలు– గవిని శ్రీనివాసులు, సాక్షి కర్నూలు (అగ్రికల్చర్) -
స్ఫూర్తిదాయక ‘సాగుబడి’
హరిత విప్లవం పుణ్యమాని ఆహారోత్పత్తిలో మనదేశం స్వయం సమృద్ధి సాధించింది. ఆహార ధాన్యాలు, కూరగాయాలు, పండ్లు అధికంగా పండించడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మన వ్యవసాయ రంగం ఎదిగింది. ఇదంతా నాణానికి ఒకవైపు. ఇంకోవైపు విచ్చలవిడి రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో సాగుచేసిన ఆహార ఉత్పత్తులు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారుతున్నాయి. అధికోత్పత్తి ఆశతో మోతాదుకు మించి వాడుతున్న రసాయన ఔషధాలు, మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయి. ప్రజలు, మూగజీవాల ఆరోగ్యాలకు హానికరంగా మారడంతో పాటు నేల సారాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వ్యవసాయక ఉత్పాదకత, ఆహార భద్రత, పర్యావరణ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. వీటన్నింటికి విరుగుడుగా రసాయనేతర సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం మళ్లీ తెరమీదకు వచ్చింది.భూ సారానికి, వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించిన రసాయనిక వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా.. అతి తక్కువ సాగు ఖర్చుతో ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను పండించడమే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయం పురుడు పోసుకుంది. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో దీని గురించి రైతులకు, ఔత్సాహికులకు తెలియకుండా పోయింది. సరిగ్గా అలాంటి సమయంలోనే సాక్షి దినపత్రిక ఈ గురుతర బాధ్యతను భుజాన వేసుకుంది. పునరుజ్జీవన వ్యవసాయ కథనాలకు ‘సాగుబడి’ పేరుతో ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయించి ముందడుగు వేసింది. ప్రకృతి, సేంద్రియ రైతుల స్ఫూర్తిదాయక కథనాలతో పాటు రైతు శాస్త్రవేత్తల ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చింది. విత్తు దగ్గరి నుంచి విక్రయం వరకు.. అన్నదాతలకు ఉపయుక్తమైన సమాచారాన్ని ‘సాగుబడి’ సాధికారికంగా అందించింది. స్వల్ప వ్యవధిలోనే ‘సాగుబడి’ తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు దిక్సూచిగా అత్యంత ఆదరణ చూరగొంది. ఇంటి పంటలు, సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు చేరువ చేసింది.చదవండి: తక్కువ ఖర్చుతో.. పంటభూమిలో విషానికి బ్యాక్టీరియాతో చెక్‘సాగుబడి’లోని 2014-16 మధ్య కాలంలో ప్రచురితమైన ప్రకృతి వ్యవసాయ ప్రేరణాత్మక కథనాలను పుసక్తంగా ప్రచురించారు సీనియర్ జర్నలిస్ట్ పంతంగి రాంబాబు. ప్రకృతి, సేంద్రియ సాగుకు సంబంధించిన అన్ని అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రకృతి వ్యవసాయంలో లబ్దప్రతిష్టులైన వారు, రైతు శాస్త్రవేత్తల ఇంటర్వ్యూలతో పాటు రైతులకు అవసరమయ్యే సమాచారాన్నంతా అందించారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా ప్రచురించిన ఈ పుస్తకాన్ని చూస్తేనే అర్థమవుతుంది రచయిత నిబద్దత. ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే వారితో పాటు సేంద్రియ సాగు గురించి తెలుసుకోవాలకునే వారికి కూడా ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. రచయిత చెప్పినట్టుగా ఈ పుస్తకం ప్రకృతి వ్యవసాయానికి పెద్దబాలశిక్ష వంటిదే.సాగుబడి (మొదటి భాగం)ప్రకృతి వ్యవసాయ స్ఫూర్తి కథనాలుపేజీలు: 320;వెల: 600 /- ; రచన, ప్రతులకు:పంతంగి రాంబాబు,8639738658👉ఆన్లైన్లో సాగుబడి పుస్తకం కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
పోషకాల గని దేశీ వంగడాలు..!
రసాయనిక ఎరువులు వాడితేనే అధిక దిగుబడి ఇచ్చేలా ఆధునిక వంగడాలను తయారు చేస్తున్నారు. ఈ ఆధునిక వంగడాల్లో పోషకాలు గత 50 ఏళ్లలో సగానికి సగం తగ్గిపోయాయని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) అధ్యయనంలోనే తేలింది. అందువల్ల దిగుబడి తక్కువొచ్చినా పోషకాలతో కూడిన ఆహారోత్పత్తి కావాలనుకుంటే దేశీ వంగడాలే వాడుకోవాలి. రసాయనాలు వాడకుండా ఆరోగ్యదాయకమైన వ్యవసాయం చేయాలంటే అందుకు తగిన వనరులు సమకూర్చుకోవాలి. అందులో ముఖ్యమైనది అనువైన విత్తనం. ప్రకృతి/సేంద్రియ సేద్యానికి అనువైన విత్తనం దేశీ విత్తనమే. అందుకే ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయంతోపాటు దేశీ వంగడాలను ప్రోత్సహిస్తున్నాయి. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రకృతి సేద్యం చేపట్టిన దార్లపూడి రవి కూడా దేశీ విత్తన పరిరక్షణ కోసం విశేష కృషి చేస్తున్నారు. దేశీ వరి, చిరుధాన్యాలు తదితర పంటలకు సంబంధించి ఏకంగా 600 రకాల దేశవాళీ విత్తనాల సేకరణ, సాగు, అదనపు విలువ జోడించి ఆహార ఉత్పత్తుల తయారీ, విక్రయం.. ఈ పనులన్నీ ఆయన ఒక తపస్సులా చేసుకు΄ోతున్నారు. ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తున్న రవి అనుభవాలు ఆయన మాటల్లోనే.. ‘విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలంలోని ఉంగరాడ మా గ్రామం. పోస్టు గ్రాడ్యుయేషన్ (పర్యావరణ శాస్త్రం) చదివాక ఓ సిమెంట్ కంపెనీలో ఎజీఎంగా ఉద్యోగం చేశాను. సెలవులకో, శుభకార్యాలకో వచ్చినప్పుడు బంధుమిత్రులు చాలామందిలో ఒక విషయం గమనించాను. అజీర్తి అనో, బీపీ అనో, గ్యాస్ట్రిక్ అనో భోజనం తగ్గించేసేవారు.ఏదో వంటలు బాగున్నాయని జిహ్వ చాపల్యం ఆపులేక కాస్త ఎక్కువగా తింటే మాత్ర వేసుకోవాల్సి వస్తుందని చెప్పేవారు. దీనికి కారణం పంటల రసాయనీకరణ. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు పరిమితికి మించి రైతులు వాడేస్తుండటం చూశాను. ఈ పరిస్థితి మారాలంటే మళ్లీ పూర్వపు ప్రకృతి వ్యవసాయమే సరైనదని భావించాను.అమ్మానాన్నలను దగ్గరుండి చూసుకోవాలని కూడా మనసు చెబుతుండటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి తిరిగొచ్చేశా. మాది వ్యవసాయ కుటుంబం. రెండున్నర ఎకరాల భూమి ఉంది. పూర్తిగా వర్షాధారం. అందులో కొంతమేర మామిడి తోట ఉంది. అంతరపంటగా పెసలు, ఉలవలు, నువ్వులు సాగు చేస్తున్నాను. దాదాపు ఎకరా భూమిలో అరుదైన సంప్రదాయ వరి రకాలను సాగు చేస్తున్నాను. అవన్నీ పూర్తిగా విత్తనాల కోసమే. ఉత్తరాంధ్రలో పలువురు రైతులకు వాటిని ఇచ్చి సాగు చేయిస్తున్నా. తెలుసుకుంటూనే ‘సాగు’తూ..పదేళ్ల క్రితం కాకినాడలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా శిబిరంలో సుభాష్ పాలేకర్ చెప్పిన పద్ధతులను ఆచరణలో పెట్టాను. 80 సెంట్లలో వరి నాటాను. మామిడి తోటలో అంతర పంటగా పసుపు పెట్టాను. 30 సెంట్ల భూమిలో 30 కిలోల కస్తూరి పసుపు విత్తనం పెడితే 300 కిలోల పంట చేతికొచ్చింది. ఎండబెడితే 180 కేజీల పసుపు వచ్చింది. కొర్రలు వేస్తే మంచి దిగుబడి వచ్చింది. ఆ ఉత్సాహంతో ఐదేళ్ల క్రితం నుంచి మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి, కొంతమేర కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నాను. దేశవాళీ పంటల తియ్యదనం...ఒకప్పుడు దేశవాళీ టమాటాను చూస్తే నోరూరేది. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న హైబ్రిడ్ టమాటా వంటకు తప్ప తినడానికి చప్పగా ఉంటోంది. అన్ని పంటలదీ అదే పరిస్థితి. ఇది మారాలంటే దేశవాళీ పంటల తియ్యదనం మళ్లీ తెచ్చుకోవాలి. అందుకే దేశవాళీ విత్తనాల సేకరణ ఒక అలవాటుగా మార్చుకున్నాను. 2016 నుంచి ప్రామాణిక పద్దతి ప్రకారం వరి విత్తనాలను సేకరించి, సంరక్షిస్తున్నాను. ప్రతి విత్తన రకానికి ఒక రికార్డు కూడా నిర్వహిస్తున్నా. సంప్రదాయ వరి విత్తనాలే గాకుండా కూరగాయలు, ఆకు కూరలు, అపరాల విత్తనాలు సేకరించాను. ఔషధ మొక్కలను, విత్తనాలనూ సేకరిస్తున్నాను. వరి వంగడాల్లో ముఖ్యంగా ఎర్రబుడమలు (రెడ్ రైస్), నెల్లూరు మొలకలు విత్తనాలు సేకరించాను. అరుదైన రాజుల చిక్కుడు (ఎరుపు, తెలుపు రంగులో ఉండే విత్తనం), తొక్క తీయకుండా వండుకోవడానికి వీలయ్యే గుత్తి బీర విత్తనాలు కూడా ఉన్నాయి.ఒడిశా నుంచి తెచ్చిన శీలావతి, గాయత్రి అనే వరి విత్తనాలు, కెంపుసన్నా అనే బాస్మతి రకం విత్తనాలను కర్ణాటకలో సేకరించాను. గోదావరి ఇసుకరవ్వలు అనే రకం కూడా అన్నం వండుతుంటే మంచి సువాసన వస్తుంది. ఈ విత్తనాలనూ మూడేళ్ల నుంచి అభివృద్ధి చేస్తున్నాను. ఇలా సంప్రదాయ వరి రకాలు, చిరుధాన్యాలు కలిపి దాదాపు ఆరొందల రకాల విత్తనాలు ఇప్పటివరకూ సేకరించగలిగాను. వీటిలో చాలావరకూ తూర్పు కనుమల్లో పలువురు రైతులకు ఇచ్చి ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్నాను. ఈ ప్రాంతంలో వ్యవసాయక జీవవైవిధ్యాన్ని ప్రోదిచేయడానికి ఈ ప్రయత్నం దోహదపడుతుందనేది నా విశ్వాసం. విత్తనాల సంరక్షణా ఓ సవాలే...దేశవాళీ విత్తనాల సంరక్షణా ఒక సవాలు వంటిదే. పూర్వం వెదురుబుట్టల్లో, కుండల్లో విత్తనాలు భద్రపరిచేవారు. ముందుగా కాపుకొచ్చిన మొక్కజొన్న కంకులు, బీరకాయలు, సొరకాయలు, బెండకాయలు ప్రత్యేకంగా వేరుచేసి విత్తనాల కోసం వసారాలో వేలాడగట్టేవాళ్లు. ఆ విధానాలన్నీ ఇప్పుడు విత్తనాల నిల్వ కోసం పాటిస్తున్నాం. ఇలా ఓ సీడ్ బ్యాంక్‌ను నిర్వహించడానికి ఒక ఎన్జీవోను ప్రారంభించాను. దేశీయ పంటలకు విలువ పెంచేలా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలతో గానుగ నూనె, బిస్కెట్లు, స్నాక్స్ తయారు చేయించి విక్రయిస్తున్నాం..’(– దార్లపూడి రవి మొబైల్: 86394 56848)– అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, విజయనగరంఫోటోలు: డి.సత్యనారాయణమూర్తి (చదవండి: నాటు కోళ్లతో మంచి ఆదాయం ఆర్జిస్తున్న యువజంట..) -
సహజ సాగుకు రూ.2,481 కోట్లు
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో 7.5 లక్షల హెక్టార్లలో సహజ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం రూ.2,481 కోట్లతో జాతీయ మిషన్ ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సోమవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా కోటి మంది రైతులను సహజసాగు దిశగా ప్రోత్సహించనున్నారు. రీసెర్చి వ్యాసాలు, జర్నళ్లను దేశవ్యాప్తంగా ఔత్సాహికులందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు రూ.6,000 కోట్లతో తలపెట్టిన ‘వన్ నేషనల్, వన్ సబ్ స్క్రిప్షన్’ పథకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇతర నిర్ణయాలు... → రూ.7,927 కోట్లతో పలు రైల్వే ప్రాజెక్టులు → అరుణాచల్‌ప్రదేశ్‌లో రూ.3,689 కోట్లతో 2 హైడ్రో ప్రాజెక్టులు → అటల్ ఇన్నొవేషన్ మిషన్ కొనసాగింపు. దాని రెండో దశకు రూ.2,750 కోట్లు → పాన్ 2.0 ప్రాజెక్టుకు రూ.1,435 కోట్లు -
ప్రకృతి సేద్యం ఇంత గొప్పగా ఉంటుందని ఉహించలేదు: ప్రొ.రమేశ్ చంద్
సుభాష్ పాలేకర్ కృషితో ప్రాధమిక రూపంలో ప్రారంభమైన ప్రకృతి వ్యవసాయం గత కొన్నేళ్లలో అనేక ఆవిష్కరణలతో శాస్త్రీయతను సంతరించుకుంటూ క్లైమెట్ ఎమర్జెన్సీని తట్టుకునేలా ఆశ్చర్యకరమైన రీతిలో పరిపుష్టమవుతూ, ప్రకృతి వైపరీత్యాలను దీటుగా తట్టుకుంటూ కొత్త పుంతలు తొక్కుతోందని నీతి ఆయోగ్ సభ్యుడు, వ్యవసాయ నిపుణుడు ప్రొఫెసర్ డాక్టర్ రమేశ్ చంద్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ వికాసం తీరు తెన్నులను ఇటీవల రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన తమ నీతి ఆయోగ్, ఐసిఎఆర్ నిపుణుల బృందానికి ఒక గొప్ప అభ్యాసం (గ్రేట్ లెర్నింగ్)గా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.వినూత్న ఆవిష్కరణలుఏడేళ్ల క్రితం తాను ఆంధ్రలో పర్యటించినప్పుడు ప్రకృతి వ్యవసాయం పాలేకర్ పద్ధతికి మాత్రమే పరిమితమైందని, ఇప్పుడు వినూత్న ఆవిష్కరణలతో శాస్త్రీయత ప్రాతిపదికపై పురోగమిస్తోందని, క్షేత్రస్థాయిలో ఇంత గొప్పగా ఉంటుందని తాము ముందుగా ఊహించలేదన్నారు. పర్యటన అనంతరం ప్రొ. రమేశ్ చంద్ ఒక వీడియో సందేశంలో తన స్పందనను వెల్లడించారు. ఏపీ ప్రకృతి సేద్య ఆవిష్కరణలను వివరిస్తూ, రసాయనిక సేద్యంలో, ప్రకృతి సేద్యంలో పక్క పక్కన పొలాల్లోనే సాగవుతున్న వరి పంటను పరిశీలిస్తే.. కరువు, వరదలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రకృతి సేద్యం ఎంత మెరుగైన ఫలితాలనిస్తోందో అర్థమైందన్నారు. అదేవిధంగా, కూరగాయలు, పండ్ల తోటలను పరిశీలించినప్పుడు కూడా ఆశ్చర్యకరమైన ఫలితాలను కళ్లజూశామన్నారు. అరటి తోట సాగు చేస్తున్న ఒక రైతు జీవామృతం వంటి బయో ఇన్పుట్స్ కూడా ఇక వాడాల్సిన అవసరం లేనంతగా తన భూమిని సారవంతం చేసుకోవటం ఆశ్చర్యం కలిగించిందని ప్రొ.రమేశ్ చంద్ తెలి΄ారు. విత్తనాలకు అనేక పొరలుగా మట్టి, జీవామృతాలతో లేపనం చేసి గుళికలు తయారు చేసి, నేలలో తేమ లేని పరిస్థితుల్లో వర్షం రావటానికి ముందే విత్తుతున్నారన్నారు.విభిన్నమైన దృష్టికోణంపంటలతో, ఆచ్ఛాదనతో నేలను కప్పి ఉంచటంతోపాటు అనేక పంటలను కలిపి పండిస్తూ జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తున్నారన్నారు. గడ్డిని ఆచ్ఛాదనగా వేస్తే చెదలు సమస్య వస్తుంది కదా అని ఓ ప్రకృతి వ్యవసాయదారుడ్ని ప్రశ్నిస్తే.. చెదపురుగులు తమ మిత్రపురుగులని బదులిచ్చారన్నారు. సాధారణ రైతుల అభిప్రాయానికి ఇది పూర్తిగా విభిన్నమైన దృష్టికోణం అని, అన్ని విషయాల్లోనూ ఈ వ్యత్యాసం ఉందన్నారు. ఈ పర్యటనలో రైతులతో స్వయంగా మాట్లాడి అనేక కొత్త విషయాలను తాము నేర్చుకున్నామని, ఇది గ్రేట్ లెర్నింగ్ అని ఆయన అన్నారు. ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఫార్మింగ్ సిస్టమ్స్ నిపుణులు, మట్టి నిపుణులు, నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డా. నీలం పటేల్ కూడా మాతో ఈ పర్యటనలో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రసాయనిక వ్యవసాయానికి సంబంధించిన పద్ధతులను మాత్రమే విస్తరణ, బోధన, పరిశోధన రంగాల్లో అనుసరిస్తున్నామని, ఇక మీదట ప్రకృతి సేద్యాన్ని కూడా భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు.సబ్సిడీ ఎలా ఇవ్వగలం?ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట రసాయన వ్యవసాయంలో పండించిన పంటతో పోల్చితే చాలా మెరుగైనది. నాణ్యతకు తగిన ధర ఎలా కల్పించగలమో ఆలోచించాలి. యూరియా ధరలో 85–90% సబ్సిడీ ఇస్తున్నాం. ప్రకృతి సేద్యాన్ని దేశంలో విస్తరింపజేయటానికి ప్రోత్సాహకాలు ఎలా ఇవ్వాలో ఆలోచించాల్సి ఉందంటూ క్రేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామన్నారు. -
మట్టి కొట్టుకెళ్లనివ్వని సాగు! పీఎండీఎస్!
పంటలకు ప్రాణప్రదమైన భూమి పైపొర మట్టి వర్షపు నీటితో భారీగా కొట్టుకు పోతోంది. మట్టితో కూడిన బురద నీరు వరదలా పారుతుంటే.. ఇది ‘ప్రవహిస్తున్న భూమాత రక్తం’ అని ఓ రైతు శాస్త్రవేత్త ఆవేదన చెందారు. మట్టిని కొట్టుకెళ్లనివ్వని సాగు పేరు పిఎండిఎస్.. పిఎండిఎస్ ప్రయోజనాలు: నేల గుల్ల బారి వానపాములు వృద్ధి చెందుతాయి నేలలో నీటిని నిల్వ చేసుకొనే సామర్థ్యం పెరుగుతుంది పోషక విలువలతో కూడిన నవధాన్య పంటలు పశువులకు పచ్చి మేతగా ఉపయోగ పడతాయిఏకకాలంలో బహుళ పంటలు వేయటం వలన అదనపు ఆదాయం వస్తుంది ప్రధాన పంటల్లో కలుపు సమస్య ఉండదు. నేల కోతకు గురి కాదు ప్రధాన పంటల దిగుబడులు పెరుగుతాయి ∙నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది మట్టిలో సూక్ష్మజీవుల జీవవైవిధ్యం పెరుగుతుంది ∙ప్రధాన పంటలకు రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది ప్రధాన పంటలకు చీడపీడలు, తెగుళ్ళను తట్టుకునే సామర్ధ్యం పెరుగుతుంది వివిధ పంటల వేర్లు భూమిలో వివిధ రకాల సూక్ష్మజీవులకు ఆశ్రయం కల్పిస్తాయి. ఈ సూక్ష్మజీవుల కార్యకలాపాల ద్వారా ప్రధాన పంటకు కావలసిన స్థూల, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా అందుతాయి ప్రధాన పంటకు అతివృష్టి, అనావృష్టి వంటి వాతావరణ వైపరీత్యాలను తట్టుకునే సామర్ధ్యం పెరుగుతుంది ∙ఏడాదిలో 365 రోజులు బహుళ పంటలతో భూమిని కప్పి ఉంచే సేద్యం ఇలా సాధ్యమవుతుంది భూమిని పలు పంటలతో పూర్తిగా కప్పి ఉంచడం వల్ల నీరు ఆవిరికాకుండా ఉంటుంది.ప్రపంచ వ్యాప్తంగా భూముల్లో నుంచి ప్రతి ఏటా 2,400 కోట్ల టన్నుల మట్టి వాన నీటితో పాటు కొట్టుకు΄ోతోంది. ప్రపంచ భూభాగంలో భారత్ వాటా 2.2శాతం మాత్రమే. అయితే, ప్రపంచం ఏటా కోల్పోతున్న మట్టిలో 23శాతంని, హెక్టారుకు సగటున 16శాతం టన్నుల మట్టిని మన దేశం కోల్పోతున్నదని ఎఫ్.పి.ఓ. చెబుతున్న లెక్క. అయితే, ఢిల్లీ ఐఐటిలోని పరిశోధకుల బృందం ‘సాయిల్ ఎమర్జెన్సీ’ గురించి తాజా అధ్యయనం విస్తుగొలిపే గణాంకాలను బయటపెట్టింది. అస్సాం, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు ఎకరానికి ఏటా 100 టన్నులకు పైగా మట్టి కొట్టుకు΄ోతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో హెక్టారుకు హెక్టారుకు ఏటా 15 నుంచి 30 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఎడారీకరణకు గురవుతున్న రాయలసీమ వంటి కొన్ని చోట్ల ఏకంగా 50 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనం తేల్చింది. అడవుల నరికివేత, ప్రతి ఏటా అతిగా దుక్కిచేయటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులతో పాటు వాతావరణ మార్పులతో కుండ΄ోత వర్షాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు మాత్రం తమ భూముల్లో మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడుకోగలుగుతుండటం విశేషం. పోర్చుగల్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ గెల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ పురస్కారాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగం ఇటీవల అందుకున్న సందర్భంలో.. ప్రకృతి సాగులో ఒక ముఖ్యభాగమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పి.ఎం.డి.ఎస్.) అనే వినూత్న పద్ధతి గురించి తెలుసుకుందాం. సాయిల్ ఎమర్జెన్సీ విపత్కర స్థితిని మానవాళి దీటుగా ఎదుర్కోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు టి. విజయకుమార్ అంటున్నారు. 2023–24లో 8 లక్షల 60 వేల మంది రైతులు 3.80 లక్షల హెక్టార్లలో పి.ఎం.డి.ఎస్. పద్ధతిలో ఎండాకాలంలో వానకు ముందే విత్తారు. పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందుగా వేసవిలోనే విత్తుకునే వినూత్న పద్ధతే పి.ఎం.డి.ఎస్. సాగు. 20 నుంచి 30 రకాల పంటల విత్తనాలను కలిపి వానాకాలానికి ముందే విత్తనాలు వేస్తున్నారు. వేసవి వర్షాలకు మొలుస్తాయి. సజీవ వేరు వ్యవస్థతో మట్టిని కాపాడుకుంటూ.. సారవంతం చేసుకునే ప్రక్రియ ఇది. 30–60 రోజుల్లో ఈ పంటలు కోసిన తర్వాత రైతులు ప్రధాన పంటలు విత్తుకుంటారు. -
ఏపీ సహజ వ్యవసాయానికి ప్రతిష్టాత్మక అవార్డు
ఏడేళ్ల క్రితం రైతు సాధికార సంస్థ (RySS) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (APCNF), పోర్చుగల్‌కు చెందిన ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ 2024 గెలుచుకుంది.పర్యావరణ వ్యవస్థ రక్షణకు దోహదపడే వ్యక్తులు లేదా సంస్థలకు ప్రతి సంవత్సరం ఈ అవార్డు అందిస్తారు. ఈ అవార్డు కింద ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ఒక మిలియన్ యూరోల ప్రైజ్ మనీ లభించింది. దీనిని ఏపీసీఎన్ఎఫ్ మాత్రమే కాకుండా సాయిల్ సైంటిస్ట్ రతన్ లాల్, ఈజిప్ట్‌కు చెందిన సెకెమ్ పంచుకున్నారు.మాజీ జర్మన్ ఛాన్సలర్ అండ్ సీజీఎఫ్ జ్యూరీ ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ ఏంజెలా మార్కెల్ అధ్యక్షతన ఉన్న జ్యూరీ 117 దేశాల నుంచి వచ్చిన మొత్తం నామినేషన్లలో ముగ్గురు గ్రహీతలను ఎంపిక చేసింది. ఇందులో ఏపీసీఎన్ఎఫ్ కూడా ఒకటి కావడం విశేషం. -
మాది రైతు ప్రభుత్వం
లక్నో/సంభాల్/న్యూఢిల్లీ: భారతీయ ఆహార ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా డైనింగ్ టేబుళ్లపై ఉండాలన్నదే మనందరి ఉమ్మడి లక్ష్యమని, ఆ దిశగా కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగాన్ని నూతన మార్గంలోకి తీసుకెళ్లడానికి మన ప్రభుత్వం రైతన్నలకు తోడ్పాటునందిస్తోందని చెప్పారు. వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశంలో ప్రకృతి వ్యవసాయం, తృణధాన్యాల సాగును ప్రోత్సాహిస్తున్నట్లు చెప్పారు. సూపర్ ఫుడ్ అయిన తృణధాన్యాలపై పెట్టుబడులకు ఇదే సరైన సమయమని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన 14,000 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లో గంగా నది పరివాహక ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. దీనివల్ల రైతులు లబ్ధి పొందడంతోపాటు నది సైతం కాలుష్యం నుంచి బయటపడుతుందని పేర్కొన్నారు. మన నదుల పవిత్రను కాపాడుకోవాలంటే ప్రకృతి వ్యవసాయం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఆహార శుద్ధి రంగంలో లోపాలు అరికట్టాలని సంబంధిత పరిశ్రమ వర్గాలకు సూచించారు. స్వచ్ఛమైన ఉత్పత్తులు అందించాలని కోరారు. ‘జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్’ అనే విధానంతో పనిచేయాలన్నారు. సిద్ధార్థనగర్ జిల్లాలో పండిస్తున్న కలానమాక్ బియ్యం, చందౌలీలో పండిస్తున్న బ్లాక్ రైస్ గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ రెండు రకాల బియ్యం విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నట్లు తెలిపారు. మన ఆహార ఉత్పత్తులను ప్రపంచం నలుమూలలకూ చేర్చే సమ్మిళిత ప్రయత్నంలో ఇదొక భాగమని అన్నారు. వ్యవసాయ రంగంలో రైతులతో కలిసి పనిచేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేవారు. యూపీలో ప్రభుత్వ అలసత్వానికి చరమగీతం పాడి పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామన్నారు. సంభాల్ జిల్లాలో శ్రీకల్కీ ధామ్ ఆలయ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళుర్పించారు. -
ప్రకృతి సేద్యానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రోత్సాహం
-
పురుగుల నివారణకు జిల్లేడు ఆకుల రసం
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగయ్యే వరి పొలాల్లో పిలక, చిరు పొట్ట దశలో ఏర్పడే సూక్ష్మ పోషకాలు/ పొటాష్ లోపాలతో పాటు రసంపీల్చే పురుగుల నివారణకు జిల్లేడు ఆకుల ద్రావణం సమర్థవంతంగా పనిచేస్తోందని రైతులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయ దారులు జిల్లేడు ద్రావణాన్ని విస్తృతంగా వాడుతూ ప్రయోజనం పొందుతున్నారు. జిల్లేడు ద్రావణం తయారీకి కావాల్సిన పదార్ధాలు: 200 లీటర్ల నీరు, 20 కేజీల జిల్లేడు ఆకులు, 10 లీటర్ల నాటు ఆవు మూత్రం. తయారీ విధానం: 200 లీటర్ల నీటిలో 20 కేజీల జిల్లేడు ఆకులు వేసి 10 లీటర్ల ఆవు మూత్రం కలపాలి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కల΄ాలి. 3 రోజుల తరువాత వాడకానికి సిద్ధమవుతుంది. మోతాదు: 100 లీటర్ల నీటిలో 10 లీటర్ల జిల్లేడు ద్రావణం కలిపి పిచికారీ చెయ్యాలి. నిల్వ : 7 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. వివరాలకు: రైతు సాధికార సంస్థ ఉత్తరాంధ్ర సాంకేతిక అధికారి హేమసుందర్:80743 20481 -
ప్రకృతి సేద్యంతో తగ్గనున్న నిరుద్యోగం, రైతులకు అధికంగా ఆదాయం
రసాయనిక సేద్యం భూముల్ని బీళ్లుగా మార్చుతుంటే.. ప్రకృతి సేద్యం బీళ్లను సాగులోకి తెస్తుంది. ప్రకృతి సేద్యంతో 2050 నాటికి నిరుద్యోగం రేటు 31 నుంచి 7 శాతానికి తగ్గుతుంది. ప్రకృతి విపత్తులను దీటుగా తట్టుకోవడం ప్రకృతి సేద్యంతోనే సాధ్యం. దీనివల్ల రైతుల ఆదాయం అధికం అవుతుంది. జనాభా పెరుగుదల– ఉపాధి అవకాశాలు, ఆర్థిక పురోగతి– అసమానతలు, నేల వినియోగం, దిగుబడి – ఆహార ఉత్పత్తి తదితర కోణాల్లో రెండు విభిన్న సాగు పద్ధతుల్లో పొందే ఫలితాల్లో వ్యత్యాసాలను అధ్యయనం చేసి ఈ నివేదికలో పొందుపరిచారు. ►రసాయనాలతో కూడిన పారిశ్రామిక వ్యవసాయం ఇలాగే కొనసాగితే 2050 నాటికి రైతుల సంఖ్య సగానికి తగ్గుతుంది. నిరుద్యోగం రేటు 31 శాతం నుంచి 30 శాతానికి తగ్గుతుంది. అయితే, పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేపడితే రైతుల సంఖ్య కోటికి పెరుగుతుంది. నిరుద్యోగం రేటు 7 శాతానికి తగ్గుతుంది. ► ప్రకృతి వ్యవసాయం ద్వారా బంజరు భూములు కూడా సాగులోకి వస్తాయి. అధిక విస్తీర్ణం సాగులోకి వచ్చి అత్యధిక మంది రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. తక్కువ పెట్టుబడితో ఏడాది పొడవునా రసాయన రహిత సురక్షిత పంటలు పండిస్తారు. అందువల్ల అధిక మార్కెట్ ధర పొందుతారు. ► ప్రకృతి వ్యవసాయ విధానంలో విత్తనాలు, నీటి వినియోగం, రసాయనాలు, ఇంధనం, అప్పులు, భారీ యంత్ర సామగ్రి తదితర ఖర్చుల విషయంలో రైతులకు ఎంతో డబ్బు ఆదా అవుతుంది. ఈ రైతులు పంట ఉత్పత్తులను విలువ జోడించి అమ్ముతారు కాబట్టి అధికాదాయం వస్తుంది. ► ప్రకృతి వ్యవసాయంలో నిరుద్యోగం తగ్గి, వ్యవసాయ–వ్యవసాయేతర వేతనాల్లో అంతరం తగ్గటం కారణంగా ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ఆర్థిక వృద్ధి 6.5%కి చేరుకుంటుంది. ► రసాయనిక వ్యవసాయం కొనసాగిస్తే 2050 నాటికి ఇది 6.1 పైసలు మాత్రమే ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంలో ప్రతి రైతు ఉత్పత్తి చేసిన ప్రతి కిలో కేలరీల ఆహారానికి 10.3 పైసల ఆదాయం పొందుతారు. ► రసాయనిక వ్యవసాయం కొనసాగిస్తే 2019లో 62 లక్షల హెక్టార్లున్న సాగు భూమి విస్తీర్ణం 2050 నాటికి 55 లక్షల హెక్టార్లకు తగ్గుతుంది. కొన్ని పంటలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించే పారిశ్రామిక వ్యవసాయ విధానంలో బీడు భూముల విస్తీర్ణం 2019లో 24 లక్షల హెక్టార్ల నుంచి 2050 నాటికి 30 లక్షల హెక్టార్లకు పెరిగే ప్రమాదం ఉంది. ► ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో బీడు భూములు కూడా సాగులోకి వచ్చి 2019లో 62 లక్షల హెక్టార్లున్న సాగు భూమి 2050 నాటికి 80 లక్షల హెక్టార్లకు పెరుగుతుంది. పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగి ప్రస్తుత సవాళ్లను అధిగమించవచ్చు. ► రసాయన సేద్యంలో మొత్తం మీద తక్కువ భూమి, తక్కువ మంది రైతులు, అధిక సాగు ఖర్చులు, అధిక నిరుద్యోగ రేటుతో కలిపి వ్యవసాయ జివిఎ పెరుగుదల రేటు సగటున సంవత్సరానికి 4% నుంచి 3.5%కి తగ్గుతుంది. ► ప్రకృతి వ్యవసాయం నేల ఆరోగ్యాన్ని పెంపొందించి సారవంతమైన భూములను అందిస్తుంది. అనేక రకాల పంటలతో అధిక పంట సాంద్రత ఏర్పడుతుంది. ► ప్రకృతి వ్యవసాయం అనుసరిస్తున్న రైతులు దిగుబడిలో ఎలాంటి తగ్గుదల లేకపోవడమే కాకుండా, అధిక దిగుబడిని కూడా సాధిస్తున్నారు. వర్షాధార వ్యవసాయ భూముల్లోనూ పలు రకాల పంటల సాంద్రత వల్ల మరింత దిగుబడిని సాధిస్తున్నారు. మొత్తానికి ప్రకృతి వ్యవసాయంలో రైతులు 2019లో హెక్టారుకు రోజుకు 31,000 కిలో కేలరీల ఆహారాన్ని ఉత్పత్తి చేశారు. 2050 నాటికి అది 36,000 కిలో కేలరీలకు పెరుగుతుంది. ► రసాయనిక వ్యవసాయంలో 2050 నాటికి రైతులు రోజుకు హెక్టార్‌కు దాదాపు 44,000 కిలో కేలరీలు ఉత్పత్తి చేసినా.. ప్రకృతి సేద్యంలో పండే పంట ఉత్పత్తులు స్థూల,సూక్ష్మ పోషకాలు, పీచు పదార్ధంతో కూడిన బలవర్ధకమైన, సమతుల్యమైన ఆహారాన్ని అందిస్తాయి. ► రెండు విభిన్న పద్ధతుల్లో ఆహారోత్పత్తి, సాగు విస్తీర్ణం, వార్షిక దిగుబడులను అంచనా వేసి చూస్తే.. 2050లో ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే ఆహారం రసాయనిక వ్యవసాయం (4050 కిలో కేలరీలు/తలసరి/రోజు)లో కంటే ప్రకృతి వ్యవసాయం (5000 కిలో కేలరీలు/తలసరి/రోజు)లో గణనీయంగా పెరుగుతుంది. అంతేగాక ప్రకృతి సేద్యంలో పండించిన పంట ఉత్పత్తులు రసాయనిక ఉత్పత్తుల కంటే మరింత సమతుల్యంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ► ప్రతికూల వాతావరణ పరిస్థితులకు తట్టుకొనే విధంగా వ్యవసాయ పంటల జీవ వైవిధ్యం పెరుగుతుంది. సేంద్రియ కర్బనం నేలల్లో వృద్ధి చెందుతుంది. తద్వారా వాతావరణ మార్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ► అధిక ఉష్ణోగ్రతలు, కరువు, తుపాన్లు, వరదలు వంటి వాతావరణ విపత్తులను తట్టుకోవడం రసాయనిక సేద్యంతో సాధ్యం కాదని నివేదిక స్పష్టం చేస్తోంది. పెట్టుబడి తగ్గటం, సురక్షిత నీటితో పాటు విస్తృత స్థాయిలో ΄ûష్టికాహారం అందించడం, పర్యావరణ పరిరక్షణ వల్ల రాష్ట్రం ‘రైతు అభివృద్ధి’కి దిక్సూచిగా మారుతుంది. -
మూడేళ్ల పాటు రీసెర్చ్.. ప్రకృతి వ్యవసాయంతోనే అది సాధ్యమవుతుంది
జలమే జీవం జలమే ఆహారం.. అనే నినాదంతో ఎఫ్ఎఓ ప్రపంచ ఆహార దినోత్సవం సోమవారం నిర్వహించింది. ఈ సందర్భంగా వెలువడిన ఓ తాజా నివేదిక ఆసక్తిని కలిగిస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం అమలవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2031 నాటికి పొలాలన్నిటినీ పూర్తిగా ప్రకృతి సేద్యంలోకి మార్చాలన్నది సంకల్పం. అయితే, ప్రకృతి వ్యవసాయ ప్రభావం 2050 నాటికి ఎలా ఉంటుంది? రసాయనిక వ్యవసాయంలో కొనసాగితే ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇవి ఆసక్తికరమైన ప్రశ్నలు. ఈ అంశాలను లోతుగా శోధిస్తూ క్షేత్రస్థాయి ప్రకృతి సేద్య ఫలితాల ఆధారంగా ‘ఆగ్రోఎకో 2050 ఫోర్‌సైట్ ప్రాజెక్టు’లో భాగంగా మూడేళ్ల పాటు విస్తృతంగా అధ్యయనం చేశారు. ఫ్రెంచ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (సిఐఆర్ఎడి)కు చెందిన సీనియర్ ఆర్థికవేత్త బ్రూనో డోరిన్, ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) వ్యవసాయ శాస్త్రవేత్త అన్నే సోఫి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖకు చెందిన రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్) ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ టి. విజయకుమార్ పలువురు శాస్త్రవేత్తలు, రైతులతో కలిసి 2019 నుంచి 2022 వరకు అధ్యయనం చేశారు. అంతర్జాతీయ శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ నివేదికను రూపొందించటం విశేషం. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల ఉన్నతాధికారులతో చర్చించిన తదనంతరం ‘ఆగ్రోఎకో 2050: ఆంధ్రప్రదేశ్‌లో ఆహార వ్యవస్థలపై పునరాలోచన– ప్రకృతి వ్యవసాయం భవిష్యత్తులో ఆహార సమృద్ధిని ఎలా సాధిస్తుంది’ అనే శీర్షికన అధ్యయన నివేదిక సిద్ధమైంది. నీతి అయోగ్ సభ్యులు (వ్యవసాయం) ప్రొఫెసర్ రమేశ్ చంద్ దీన్ని న్యూఢిల్లీలో ఇటీవల విడుదల చేశారు. పారిశ్రామిక (రసాయనిక) వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని పోల్చుతూ రెండు విభిన్న పరిస్థితుల్లో 2050 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయం, ఆహారం, పర్యావరణం, ఉపాధి, సంక్షేమం తదితర రంగాల్లో ఎలా ఉండబోతోంది అనే విషయంపై విశ్లేషణను ఈ నివేదిక వెల్లడిస్తోంది. రాష్ట్రంలో విస్తృతంగా అమలవుతున్న ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం సరికొత్త ఆహార వ్యవస్థల స్థాపనలో ఎలాంటి అవకాశాలను కలిగిస్తుంది అనే కోణంలో శోధించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2020–21 నాటికి 7 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2031 నాటికి ఈ రైతుల సంఖ్య 60 లక్షలకు చేరుకోవాలన్నది లక్ష్యం. ఆర్థిక, పర్యావరణ, పోషకాహార, సామాజిక సవాళ్లను సమీకృత పద్ధతిలో పరిష్కరించే హరిత వ్యవసాయానికి ఏపీ రాష్ట్రం నాయకత్వం వహిస్తుందనేది అధ్యయన బృందం అభిప్రాయం. ‘ప్రకృతి’ నేర్పుతున్న అసాధారణ నీటి పాఠాలు! ప్రకృతి వ్యవసాయం సాగు నీటి వినియోగ పద్ధతిని సమూలంగా మార్చివేస్తుంది. ప్రకృతి సేద్యంలో సాగయ్యే పంటలు నీటిని వినియోగించుకోవటం మాత్రమే కాదు, నీటిని ఉత్పత్తి చేసుకుంటాయి కూడా! నదుల్లో ఉండే నీటికి పది రెట్లు నీరు గాలిలో ఉంది. గాలి నుంచి నీటిని సంగ్రహించి ఉపయోగించుకోవడం ప్రకృతి వ్యవసాయంలోనే సాధ్యమవుతుంది. 365 రోజులు ఆకుపచ్చగా పంటలతో పొలాన్ని కప్పి ఉంచటం, అవశేషాలతో ఆచ్ఛాదన కల్పించటం వల్ల నేలలో నుంచి తేమ ఆవిరి కావటం తగ్గుతుంది. నేలలో సేంద్రియ పదార్థం, సేంద్రియ కర్బనం పెరుగుతుంది కాబట్టి నీటిని గాలి నుంచి గ్రహించి పట్టి ఉంచుకునే శక్తి ఈ పంటలకు సమకూరుతోంది. కురిసిన 100 చుక్కల్లో 50 చుక్కలు వాగుల్లోకి పోతున్నాయి లేదా ఆవిరవుతున్నాయి. ప్రకృతి సేద్యంలో ఈ నష్టం బాగా తగ్గి, భూమిలోకి నీరు ఎక్కువగా ఇంకుతుంది.నీటిని భౌతికశాస్త్ర కోణం నుంచి అర్థం చేసుకోవటమే ఇప్పటి వరకు చేశాం. ప్రకృతి వ్యవసాయం జీవశాస్త్ర కోణం నుంచి నీటిని చూడటం నేర్పుతోంది. ఈ అసాధారణ పాఠాలు మేం నేర్చుకుంటూ సరికొత్త పద్ధతులను అమల్లోకి తెస్తున్నాం. వర్షం కురవక ముందే విత్తనాలను గుళికలుగా మార్చి విత్తుతున్నాం. నెల తర్వాత కొద్దిపాటి జల్లులు పడినా పంటలు మొలకెత్తుతున్నాయి. ఒకటికి పది పంటలు వత్తుగా వేయటం వల్ల రైతులకు చాలా లాభాలు చేకూరుతున్నాయి. బంజరు భూములను దున్నే పని లేకుండా సాగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పాదులు చేస్తూ ఒక్కో పాదులో ఐదారు రకాల విత్తనాలు వేస్తూ బంజరు భూములను సైతం రైతులు సాగులోకి తెస్తున్నారు. మన రైతుల అనుభవాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. – టి. విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఏపీ రైతు సాధికార సంస్థ -
ప్రకృతి వ్యవసాయం భేష్
చిలమత్తూరు: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటల సాగు చాలా బాగుందని ఆఫ్రికా దేశాల ప్రతినిధుల బృందం ప్రశంసించింది. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయతీ పరిధిలోని యగ్నిశెట్టిపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు బృందం శనివారం పర్యటించింది. ప్రకృతి వ్యవసాయ విభాగం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.విజయకుమార్ ఆధ్వర్యంలో సెనగల్, టునీషియా, మడగాస్కర్, జాంబియా, బెనిన్, మలవాయి తదితర ఆఫ్రికా దేశాల నుంచి 27 మంది ప్రతినిధులు యగ్నిశెట్టిపల్లిలోని పంట పొలాలను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంభిస్తున్న నందీశ్వర, నరసింహప్ప అనే రైతులకు చెందిన వేరుశనగ, నవీన్‌కు చెందిన పత్తి పంటలను పరిశీలించారు. పంటల యాజమాన్యం, చీడపీడల నియంత్రణ, ఘన జీవామృతం, బీజామృతం తయారీ, 15 నుంచి 20 రోజుల వ్యవధిలో పిచికారీ విధానం తదితర వాటిని రైతులు, అధికారులు సమగ్రంగా వివరించారు. అనంతరం గ్రామంలోని కల్పవల్లి గ్రామ సంఘం, మహేశ్వరి మహిళా సంఘ సభ్యులు ప్రధాన పంటలు ఐదు రకాలు వేయటం, 20 రకాల జీవ వైవిధ్య పంటల సాగు, 5శాతం విత్తనాలు వేసుకోవడం వల్ల వచ్చిన ఫలితాలు, మార్కెటింగ్ వంటి వాటిని విదేశీ బృందానికి వివరించారు. కార్యక్రమంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో)కు చెందిన ఆన్నె సోఫియా, సీఐఆర్ఏడీకి చెందిన బ్రూనో, ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ లక్ష్మానాయక్, అధికారులు విజయ్‌కుమార్, బాబు పాల్గొన్నారు. -
Chennamaneni Padma: ఆవులే ఆమె సర్వస్వం
‘‘ఆవు పైన ప్రేమ... లెక్చరర్ ఉద్యోగాన్ని వదులుకునేలా.. నగరం నుంచి పల్లెతల్లికి దగ్గరయ్యేలా కొండకోనల వెంట ప్రయాణించేలా వరదలను తట్టుకొని నిలబడేలా చేసింది’’ అని వివరిస్తుంది డాక్టర్ చెన్నమనేని పద్మ. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినా, వృత్తి ఉద్యోగాల్లో కొనసాగుతున్నా ఊరు ఆమెను ఆకట్టుకుంది. 200 ఆవులకు సంరక్షకురాలిగా మార్చింది. పదేళ్లుగా చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలను, వరించిన జాతీయస్థాయి అవార్డులను వివరించారు పద్మ. ‘‘నా చిన్ననాటి రోజులకు ఇప్పటికీ ఆహారంలోనూ, వాతావరణంలోనూ చాలా తేడా కనిపించేది. తెలుగు లెక్చరర్‌గా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉన్న ఎయిడెడ్ గర్ల్స్ కాలేజీలో ఉద్యోగం చేసేదాన్ని. వ్యవసాయం, ఆహారం ప్రాముఖ్యతను నేను చదువు చెప్పే అమ్మాయిలకు ప్రత్యక్షంగా చూపాలనుకున్నాను. మా నాన్నగారి ఊరు జగిత్యాలకు ఎప్పుడో ఒకసారి వెళ్లేదాన్ని. ఊరి ప్రయాణం, అక్కడి వాతావరణం నాకు బాగా నచ్చేది. ఇదే విషయాన్ని మా క్లాస్ అమ్మాయిలకు చెప్పి, ఆసక్తి ఉన్నవాళ్లు పేర్లు ఇస్తే, తీసుకెళతాను అని చెప్పాను. ఒకేసారి యాభైమంది పేర్లు ఇచ్చారు. వారందరికీ బస్ ఏర్పాటు చేసి, తీసుకెళ్లాను. వ్యవసాయంలో ఏమేం పనులు ఉంటాయో అన్నీ పరిచయం చేశాను. అక్కడి గోశాలకు తీసుకెళితే పిల్లలంతా కలిసి, లక్ష గొబ్బెమ్మలు తయారు చేశారు. ఎరువుగా గొబ్బెమ్మలు కొన్నిరోజుల తర్వాత గోశాల వాళ్లు గొబ్బెమ్మలను తీసుకెళ్లమని చెప్పారు. అప్పటివరకు ఆలోచన చేయలేదు. కానీ, వాటిని హైదరాబాద్ తీసుకొచ్చి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏదైతే అది అయ్యిందని వ్యాన్‌లో లక్షగొబ్బెమ్మలను తీసుకొచ్చి, ఇంట్లో పెట్టించాను. ఎక్కడ చూసినా గొబ్బెమ్మలే. ఇంట్లోవాళ్లు ఏంటిదంతా అన్నారు. కొన్ని రోజులు వాటిని అలాగే చూస్తూ ఉన్నాను. గోమయాన్ని ఎరువుగా వాడితే పంట బాగా వస్తుంది. అయితే, నగరంలో ఇదెలా సాధ్యం అవుతుంది అనుకున్నాను. రూఫ్ గార్డెన్వాళ్లకు ఇస్తే అనే ఆలోచన వచ్చిన వెంటనే వాట్సప్ గ్రూపుల్లో గొబ్బెమ్మలు కావాల్సిన వాళ్లు తీసుకెళ్లచ్చు మొక్కలకు ఎరువుగా అని మెసేజ్ చేశాను. రెండు, మూడు రోజుల్లో మొత్తం గొబ్బెమ్మలు ఖాళీ అయ్యాయి. ఆవుల కొనుగోలు... ఊరు వెళ్లినప్పుడల్లా దారిలో గోవుల గుంపు ఉన్న చోట ఆగి, కాసేపు అక్కడ ఉండి వెళ్లడం ఒక అలవాటుగా ఉండేది. అలా ఒకసారి 80 ఏళ్ల వ్యక్తి నా అడ్రస్ కనుక్కొని వచ్చాడు. తన దగ్గర ఉన్న ఆవులను బతికించలేకపోతున్నానని, పిల్లలు వాటిని వదిలించుకోమని చెబుతున్నారని ఏడ్చాడు. నాకేం చేయాలో అర్ధం కాలేదు. అంత పెద్ద వ్యక్తి గోవుల గురించి బాధపడుతుంటే చూడలేకపోయాను. ఏదైతే అది అవుతుందని 55 గోవులను అతను చెప్పిన మొత్తానికి నా పొదుపు మొత్తాల నుంచి తీసి, కొనేశాను. అర్ధం చేసుకుంటూ... కొనడంలో ధైర్యం చేశాను కానీ, ఆ ఆవులను ఎలా సంరక్షించాలో అర్ధం కాలేదు. వర్కర్లను, వాటికి గ్రాసం ఏర్పాటు చేయడం తలకు మించి భారమైంది. వాటిని చూసుకోవడానికి ఉద్యోగం మానేశాను. అయినవాళ్లంతా తప్పు పట్టారు. ‘కాలేజీకి త్వరలో ప్రిన్సిపల్ కాబోతున్నావ్.. ఇలాంటి టైమ్‌లో ఉద్యోగం వదులుకొని ఇదేం పని’ అన్నారు. కానీ, ఆవు లేని వ్యవసాయం లేదు. ఆవు లేకుండా మనిషి జీవనం లేదనిపించేది నాకు. ఇంట్లోవాళ్లకు చెప్పి జగిత్యాలలోనే ఆవులతో ఉండిపోయాను. కానీ, ఊళ్లో అందరినుంచీ కంప్లైంట్లే! ఆవులు మా ఇళ్ల ముందుకు వస్తాయనీ, వాకిళ్లు పాడుచేస్తున్నాయని, పోలీసు కేసులు కూడా అయ్యాయి. ఆ ఊళ్లో పుట్టిపెరిగిన దాన్ని కాదు కాబట్టి, నాకెవరూ సపోర్ట్ చేసేవాళ్లు లేరు. దీంతో ఆవులను తీసుకొని గోదావరి నదీ తీరానికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పది రోజులు గడిచాయో లేదో విపరీతమైన వానలు, వరదలు. ఆ వరదలకు కొన్ని ఆవులు కొట్టుకుపోయాయి కూడా. నాకైతే బతుకుతానన్న ఆశ లేదు. ఎటు చూసినా బురద, పాములు.. కృష్ణుడిని వేడుకున్నాను. ‘ఈ ఆవులు నీవి, నీవే కాపాడుకో..’ అని వేడుకున్నాను. అక్కణ్ణుంచి బోర్నపల్లి అటవీ ప్రాంతంలో 15 రోజులు ఆవులతో గుట్టలపైనే ఉన్నాను. మూగజీవాల గురించి, ప్రకృతి గురించి నాకేమీ తెలియదు. ఏం జరిగినా వెనక్కి వెళ్లేది లేదు అనుకున్నాను. నా మొండితనం ప్రకృతిని అర్థం చేసుకునేలా చేసింది. ఎప్పుడో వీలున్నప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్లేదాన్ని. మా ఇద్దరు అబ్బాయిలు జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఇక నా జీవితం ఆవులతోనే అనుకున్నాను. కరోనా టైమ్‌లో మా కుటుంబం అంతా హైదరాబాద్‌లో ఉంది. నేను గోవులతో అడవుల్లో ఉన్నాను. ఓసారి కుటుంబం అంతా కూర్చుని ఆవులు కావాలా, మేం కావాలో తేల్చుకోమన్నారు. ఆవులే కావాలి అన్నాను. నాకు ఉన్న ఈ ఇష్టాన్ని గమనించిన మా వారు తను చేస్తున్న సెంట్రల్‌గవర్నమెంట్ జాబ్ నుంచి వీఆర్ఎస్ తీసుకొని వచ్చేశారు. తన పొదుపు మొత్తాలను కూడా ఆవుల సంక్షేమానికి వాడాం. మహిళలకు ఉపాధి... ప్రతి యేటా ఆవుల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 200 వరకు చేరింది. 50 ఆవులను గుట్టల ప్రాంతాల వారికి ఉచితంగా ఇచ్చేశాను. మిగతా వాటి గోమయంతో పళ్ల పొడి నుంచి వందరకాల ఉత్పత్తులను తయారు చేయిస్తున్నాను. ఇక్కడి గిరిజన ప్రాంత స్త్రీలు వీటి తయారీలో పాల్గొంటున్నారు. గోమయ ప్రమిదలు, పిడకలు, యజ్ఞసమిధలు.. ఇలా ఎన్నో వీటి నుంచి తయారు చేస్తున్నాం. చిన్నా పెద్ద టౌన్లలో గోమయం ఉత్పత్తుల తయారీలో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం. ఈ ఉత్పత్తులతో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, నగర ప్రజలకు చేరువ చేస్తుంటాను. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గిరిజన మహిళలకు ఇస్తుంటాను. పట్టణాల్లో ఉన్నవాళ్లు ఎవరైనా వచ్చి ఆవులను చూసుకోవచ్చని ‘స్వధర్మ’ పేరుతో ఆన్లైన్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. వీడియోలు చూసి ముందు చాలా మంది ఉత్సాహం చూపారు. కానీ, చివరకు ముగ్గురు మాత్రమే వచ్చారు. వీడియోల్లో ఆవులను, ఇక్కడి వాతావరణం చూడటం వేరు. కానీ, నేరుగా ఈ పరిస్థితులను ఎదుర్కోవడం వేరు. ‘మేమూ వస్తాం, కానీ బెడ్రూమ్ ఉందా, అటాచ్డ్ బాత్రూమ్ ఉందా’ అని అడుగుతుంటారు. కానీ, మేమున్నచోట అలాంటి వసతులేవీ లేవు. దొరికినవి తింటూ, ఆవులతోనే జీవనం సాగిస్తూ ఉంటాం. ఆరు నెలలు గుట్ట ప్రాంతాల్లో, ఆరు నెలలు గోదావరి నదీ తీర ప్రాంతాల వెంబడి తిరుగుతుంటాను. ఈ జీవనంలో ఓ కొత్త వెలుగు, స్వచ్ఛత కనిపిస్తుంటుంది. నేర్చుకున్న వైద్యం.. మనుషుల మాదిరిగానే ఆవులు కూడా ఎంతో ప్రేమను చూపుతాయి. జబ్బు పడతాయి. వాటికి ఆరోగ్యం బాగోలేకపోతే ‘నన్ను చూడు’ అన్నట్టుగా దగ్గరగా వచ్చి నిలబడతాయి. కనిపించకపోతే బెంగ పెట్టుకుంటాయి. వాటికి జబ్బు చేస్తే సీనియర్ డాక్టర్స్‌ని పిలిíపించి చికిత్స చేయిస్తుంటాను. నేనే వాటి జబ్బుకు తగ్గ చిక్సిత చేయడం కూడా నేర్చుకున్నాను. ఆవులకు సంబంధించి మురళీధర గో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాను. దీని ద్వారా రేపటి తరం పిల్లలకు మూగజీవాల విలువ... ముఖ్యంగా ఆవు గొప్పతనాన్ని తెలియజేయాలనుకుంటున్నాను’’ అని వివరించారు పద్మ. వరించిన అవార్డులు పట్టణప్రాంతాల వారిని పల్లెకు తీసుకెళ్లి చేయిస్తున్న సేవకు 2012లో నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డ్‌ను రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ చేతుల మీదగా అందుకున్నాను. 2013లో చైనాలో జరిగే యూత్ ఎక్సే ్చంజ్ ప్రొగ్రామ్‌కి ప్రభుత్వం టాప్ 100 మెంబర్స్‌ని పంపించారు. వారిలో నేనూ ఒకరిగా ఆ సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం మర్చిపోలేనిది. ఈ యేడాది ఇందిరాగాంధీ అవార్డు సెలక్షన్‌కి కమిటీ మెంబర్‌గా ఆహ్వానం అందుకున్నాను. నిస్వార్థంగా చేసే సేవ ఏ కొద్దిమందికైనా ఉపయోగపడినా చాలు. రైతులు ఎవరైనా ఆవు కావాలని వస్తే వారి వివరాలన్నీ తీసుకొని, ఉచితంగా అందజేస్తున్నాం. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రకృతి వ్యవసాయంలో మహిళల పాత్ర అమోఘం
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయంలో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల) మహిళల పాత్ర అమోఘమని ప్రముఖ పర్యావరణ పరిరక్షకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీతా నారాయణ్ కితాబిచ్చారు. గత రెండురోజులుగా అనంతపురంలో ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించిన ఆమె గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎడారిలాంటి అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం అద్భుతంగా సాగవుతోందని చెప్పారు. కనీసం 20 సెంట్ల భూమిలో పేదలు కూరగాయలు పండించి అమ్ముకునేందుకు అమలు చేస్తున్న ఏటీఎం మోడల్ నిరుపేద రైతులను ఎంతో ఆదుకుంటోందని తెలిపారు. ఒక్కో రైతు నెలకు రూ.25 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఏర్పడటంతో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. దానిమ్మ,, బొప్పాయి, మునగ తదితర పంటలు బాగా సాగవుతున్నాయని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలో ఎస్‌హెచ్‌జీ మహిళలు ఎంతో సమర్థంగా పనిచేయడం విశేషమని పేర్కొన్నారు. సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ తాను టీటీడీ ఈవోగా పనిచేసినప్పుడు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండే శనగలను టీటీడీ కొనుగోలు చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృది్ధశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రైతుసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయమార్, సీఈవో బి.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకతి వ్యవసాయం.. ఏటీఎం మోడల్‌తో ప్రతి నెల రూ.25వేల వరకు లాభాలు
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం నిజంగానే‘ రైతును రాజు’ గా మార్చుతుందంటున్నారు ఏపీ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్–చైర్మన్, ఎక్స్అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి. విజయకుమార్. ప్రపంచవ్యాప్తంగా రసాయనాల్లేకుండా జరుగుతున్న సాగు 1% కాగా, ఏపీలో 14% కావటం విశేషం. ఏటీఎం మోడల్లో 20 సెంట్లలో అనేక రకాల కూరగాయలు, పండ్లు సాగు చేస్తూ ప్రతి నెలా కనీసం రూ. 10–25 వేలు ఆదాయం పొందే మార్గం ఉంది. చిన్న, సన్నకారు రైతులకే కాదు, భూమిలేని వ్యవసాయ కార్మికులకూ ఇది వరం లాంటిదని ఆయన అంటున్నారు.. ప్రత్యేక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. సాక్షి సాగుబడి: ఆంధ్రప్రదేశ్‌లో తామర తంపరగా విస్తరిస్తున్న ప్రకృతి వ్యవసాయం విశేషాలు..? విజయకుమార్: ఏపీలో ప్రకృతి వ్యవసాయం ప్రభుత్వ సహకారం, మహిళా సంఘాల తోడ్పాటుతో విస్తృతంగా అమలవుతోంది. 2023 మార్చి నాటికి 3,800 గ్రామ పంచాయతీలు, 3 వేల రైతు భరోసా కేంద్రాల్లో విస్తరించింది. 8.5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో పాల్గొంటున్నారు. అంటే, ఎన్రోల్ అయ్యారు. వీరిలో 2,70,000 మంది రైతులు పూర్తిగా రసాయనాలు వాడటం మానుకున్నారు. రైతుల ఎన్రోల్మెంట్ దృష్ట్యా మన దేశంలోనే ఇది అతిపెద్ద కార్యక్రమం. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో పాల్గొనటం మరే దేశంలోనూ జరగటం లేదు. ప్రకృతి వ్యవసాయ వ్యాప్తి క్రమంగా జరిగే పని. ఒక రైతుకు రెండెకరాలు ఉంటే.. ముందు అరెకరంలో ప్రయత్నిస్తారు. ఏ రైతూ రిస్క్ తీసుకోరు. అరెకరాలో సక్సెస్ సాధిస్తే.. తర్వాత సంవత్సరం విస్తీర్ణం పెంచుతారు. ఎంత ఖర్చయ్యింది, ఎంత దిగుబడి వచ్చింది, నికరాదాయం ఎంత వచ్చింది, భూమిలో మార్పేమి వచ్చింది.. ఇవీన్న చూసుకొని విస్తీర్ణాన్ని పెంచుకుంటారు. సగటున మా అనుభవంలో రైతులు ప్రకృతి వ్యవసాయంలో అన్ని విషయాలు అనుభవపూర్వకంగా అలవాటు చేసుకోవడానికి 4 ఏళ్లు పడుతుంది. అందుకని ఆ నాలుగేళ్లు ప్రభుత్వం తరఫున మేం వారికి మద్దతుగా నిలుస్తున్నాం. ఈ విధంగా 2,70,000 మంది రైతులు దాదాపు 1,40,000 హెక్టార్లలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ►ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది 3 జైవిక్ ఇండియా పురస్కారాలు వచ్చాయి. వీటితో పాటు.. వ్యక్తిగతంగా మీకు ‘డా. ఎమ్మెస్ స్వామినాధన్ ప్రకృతి పరిరక్షణ పురస్కారం’ లభించిన శుభ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు... జైవిక్ ఇండియా పురస్కారాల ప్రాధాన్యం ఏమిటి? అంతర్జాతీయంగా ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించే సంస్థ ‘ఐఫోమ్’ ఈ జైవిక్ ఇండియా పురస్కారాలు ఇస్తుంటుంది. ఐఫోమ్కు ఐక్యరాజ్యసమితికి చెందిన ఎఫ్.ఎ.ఓ., తదితర సంస్థలతో సన్నిహిత సంబంధాలుంటాయి. ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహం, సాధించిన ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వానికి 2023లో ఉత్తమ రాష్ట్ర పురస్కారం ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళా రైతుకు, ఎఫ్‌పిఓకు కూడా ఇచ్చారు. ప్రభుత్వప్రోత్సాహం ఎలా ఉంది..? ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించటంలో ఏపీ ప్రభుత్వానికి చాలా ప్రత్యేకతలున్నాయి. రైతు భరోసా కేంద్రాలన్నిటి పరిధిలోనూ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇప్పుడు 28% రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లోనూ ఈ కార్యక్రమం అమల్లో ఉంది. మున్ముందు గ్రామాలన్నిటికీ విస్తరించాలన్నది లక్ష్యం. ఏపీలో ప్రకృతి వ్యవసాయానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖనే సీఎం ఏర్పాటు చేయటం విశేషం. దీంతో మంచి ఊ΄÷చ్చింది. ప్రకృతి వ్యవసాయ విస్తరణలో మహిళా స్వయం సహాయక సంఘాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఏమిటి..? రీజనరేటివ్ అగ్రికల్చర్ అనండి, ఆర్గానిక్ అగ్రికల్చర్ అనండి.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నా ఇప్పటికీ చేస్తున్నది 1% మంది రైతులు మాత్రమే. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14% మంది రైతులు ఎంతో కొంత విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. తమకున్న పొలం మొత్తంలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు 5% ఉన్నారు. అందుకే ప్రపంచంలో ఏపీ అనుభవం ఎంతో విశిష్టమైనది. రైతులతో రసాయనాలు వాడే అలవాటు మాన్పించడం చాలా కష్టం. బలంగా ఉన్న మహిళా సంఘాల వ్యవస్థ ఇందులో పాల్గొనటం వల్ల రైతులకు క్షేత్రస్థాయిలో నైతిక మద్దతు ఇవ్వటం సాధ్యమైంది. ఈ సామాజిక తోడ్పాటు ఎంతో ఉపయోగపడుతోంది. సేద్యంలోనే కాదు, వైవిధ్యపూరితమైన ప్రకృతి పంటల దిగుబడులు కుటుంబాల ఆరోగ్యానికి చాలా అవసరమని మహిళలు గుర్తించటం కూడా ఇది వ్యాప్తి చెందడానికి ఉపయోగకరంగా ఉంది. ఏయే పంటల్లో అధిక దిగుబడి..? మా అనుభవంలో అన్ని పంటల్లోనూ ఫలితాలు బాగా వస్తున్నాయి. ఖర్చు తగ్గించడం, దిగుబడి పెంచటం, ఎక్కువ వర్షాలు పడినా/ వర్షాభావ పరిస్థితులొచ్చినా పంట తట్టుకునే శక్తి, చీడపీడలను తట్టుకునే శక్తి.. చాలా పంటల్లో అనుకున్న దానికన్నా దిగుబడులు రాబట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో రాగి పంట దిగుబడి ఎకరానికి వచ్చే దిగుబడి 400–600 కిలోల నుంచి 1200–1800 కేజీలకు పెరిగింది. ఖర్చు సగానికి సగం తగ్గింది. వరిలోనూ అంతర పంటలపై ప్రయోగాలు చేస్తున్నాం. గట్ల వెడల్పును పెంచి కూరగాయలు, పండ్ల మొక్కలు సాగు చేయమని.. పంటల వైవిధ్యం పెంచడానికి.. రైతులకు సలహా ఇచ్చాం. పవన్ సుఖదేవ్ అధ్యయనం గురించి..? పవన్ సుఖదేవ్ అంతర్జాతీయంగా పేరున్న పర్యావరణవేత్త. పర్యావరణంలో నోబెల్ వంటి టేలర్ అవార్డు గ్రహీత. వీరి జిస్ట్ సంస్థ స్వతంత్రంగా జరిపిన అధ్యయనంలో 11% అధిక దిగుబడి, 54% అధిక నికరాదాయం, పంటల వైవిధ్యం రెండింతలు పెరిగిందని వెల్లడైంది. మార్కెటింగ్‌లోకి అమూల్ ప్రవేశిస్తోందట..? అవును. ఏపీలో 80% విస్తీర్ణంలో పత్తి సహా 8 రకాల ఆహార పంటలు ప్రధానంగా సాగవుతున్నాయి. ఇప్పటికే టీటీడీ 12 రకాల ఆహారోత్పత్తుల్ని కొనుగోలు చేస్తోంది. బియ్యం, పప్పులు, వేరుశనగలు తదితరాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి అమూల్‌తో ఒప్పందం చేసుకోబోతున్నాం. మండల స్థాయిలో ప్రాసెసింగ్ సదుపాయాలు కూడా వస్తాయి. ఇది మార్కెటింగ్‌లో పెద్ద ముందడుగు అవుతుంది. ఏటీఎం మోడల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు ఎలా..? అవునండి.. నిజం. ప్రకృతి వ్యవసాయ విధానాలను సక్రమంగా అమలు చేస్తే రైతే రాజని రుజువు చేయొచ్చు. అది నిజంగా జరుగుతుంది. రైతులకు సంవత్సరానికి ఆదాయం ఒక్కసారే ఎందుకు రావాలి? ప్రతి రోజూ రావాలి.. ప్రతి వారం రావాలి.. అందుకు ఏటీఎం మోడల్ ఉపయోగపడుతుంది. అనంతపురం జిల్లాలో ఈ నమూనా తొలుత ప్రయత్నించి సత్ఫలితాలు సాధించాం. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాలకూ విస్తరింపజేస్తున్నాం. 85%గా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు, భూమి లేని వ్యవసాయ కార్మికులకు పెరటి తోటలు/ ఇంటి పంటలుగా సాగుకు కూడా ఏటీఎం మోడల్ ఒక వరం లాంటిది. 20 సెంట్లను కౌలుకు తీసుకొనైనా సాగు చేస్తే.. ప్రతినెలా ప్రతి రైతూ రూ.10,000 నుంచి 25,000 సంపాదించే అవకాశం ఉందని మా అంచనా. -
పిల్లలకు మాటలు త్వరగా వచ్చేందుకు ఔషధంగా వస
-
పెట్టుబడి ఖర్చు తగ్గించుకుంటే రైతన్నకు లాభాలు
-
ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన పంటలు ఎంతో ఆరోగ్యకరమైనది
-
రెండెకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగి
-
ప్రకృతి వ్యవసాయంలో పొదుపు సంఘాల మహిళలు
-
ప్రకృతి సేద్యం..ఉపాధికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు!
అనారోగ్యం వల్ల కోల్పోయే పనిదినాలు మూడో వంతు తగ్గాయి.ప్రకృతి వ్యవసాయంతో పంట దిగుబడులను పెరిగే జనానికి సరిపోయేంత సాధ్యమేనా? వంటి ప్రాధమిక ప్రశ్నలకు, అనుమానాలకు ఇప్పుడు పూర్తిగా కాలం చెల్లింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోత్సాహంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 8 లక్షల మందికి పైగా రైతులు ఇటువంటి ప్రశ్నలన్నిటినీ తమ అనుభవాల ద్వారా పటాపంచలు చేశారు. దిగుబడులు సరే, ప్రకృతి సేద్యంలో శాస్త్రీయత ఎంత? అనే ప్రశ్నకు కూడా ఇటీవల విడుదలైన అంతర్జాతీయ స్థాయి అధ్యయన నివేదిక దీటుగా బదులిచ్చింది. జిస్ట్ ఇంపాక్ట్, గ్లోబల్ అలియన్స్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ అనే స్వచ్ఛంద సంస్థలు ఏపీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో 2020 నుంచి మూడేళ్లు లోతుగా అధ్యయనం చేసి, ‘నాచురల్ ఫార్మింగ్ త్రో ఎ వైడ్ యాంగిల్ లెన్స్’ పేరిట నివేదికను వెలువరించాయి. ఈ నివేదికను ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.)కి కూడా సమర్పించాయి. హరిత విప్లవానికి ప్రతీకైన డెల్టా ప్రాంతంలోని పశ్చిమగోదావరి, నీటి ఎద్దడి ప్రాంతాలకు ప్రతీకైన అనంతపురం, కొండ ప్రాంత గిరిజన వ్యవసాయానికి ప్రతీకైన విజయనగరం జిల్లాల్లో 12 గ్రావలను ఎంపిక చేసుకొని, ఆయా గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం, రసాయనిక వ్యవసాయం చేసే రైతుల క్షేత్రాల్లో లోతుగా అధ్యయనం చేశాయి. ఖరీఫ్, రబీ పంటలు, దీర్ఘకాలిక పంటలతో పాటు పశువుల పెంపకానికి సంబంధింన విషయాలను అధ్యయనం చేశాయి. దిగుడులు, ఖర్చులు, నికరాదాయంతో పాటు.. రసాయనిక పురుగుమందులు, ఎరువుల ప్రభావం రైతులు, గ్రామీణుల ఆరోగ్యంపై ఎలా ఉందన్న విషయాన్ని పరిశీలించి తొలి అధ్యయనం కావటం మరో విశేషం. ప్రకృతికి సంబంధించిన అంశాలపై నోబెల్ ప్రైజ్‌గా భావించే టేలర్ పురస్కారం(2020) అందుకున్న ప్రముఖ పర్యావరణ ఆర్థికవేత్త పవన్ సుఖదేవ్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరగటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ నివేదికలో ఏముందంటే..? ప్రకృతి సేద్యంతో 49% పెరిగిన నికరాదాయం రసాయనిక సేద్యం జరిగే పొలాల్లో ఒకటో రెండో పంటలు పండిస్త ఉంటే.. ప్రకృతి వ్యవసాయంలో సగటున 4 పంటలు పండిస్తున్నారు. వరి, మొక్కజొన్న, మినుము, రాగులు, కంది వంటి ప్రధాన పంటల దిగుబడి రసాయనిక వ్యవసాయంతో పోల్చితే ప్రకృతి వ్యవసాయంలో సగటున 11% పెరిగింది. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో శ్రమ అవసరం రసాయనిక సేద్యంతో పోల్చితే సగటున 21% పెరిగింది. రైతు కుటుంబం, కలీల శ్రమ మొత్తాన్నీ లెక్కగట్టారు. గోదావరి డెల్టాలో రసాయన వ్యవసాయంలో ఏడాదికి 313 గంటలు పని చేస్తే, ప్రకృతి సేద్యంలో ఇది 377 గంటలకు పెరిగింది. రాయలసీమలో 258 నుంచి 322 గంటలకు పెరిగింది. ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో 234 నుంచి 268 గంటలకు పెరిగింది. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం మానెయ్యటంతో ఖర్చు సగటున 44% తగ్గింది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ప్రకృతి వ్యవసాయదారుల సగటు నికరాదాయం 49% పెరిగింది. చిన్న రైతులే ‘సామాజిక మూలధనం’ ప్రకృతి సేద్య అనుభవాలను ఒకరితో మరొకరు పంచుకోవటం వల్ల మీకు తోడుగా మేం ఉన్నాం అన్న భావం విస్తరించింది. పరస్పర విశ్వాసం, మద్దతు, సాంఘిక సమన్వయం పెరిగాయి. అన్యోన్యతకు దారితీసింది. ∙ఈ విధంగా రసాయనాల్లేని సాగు అనుభవాలను పంచుకోవడం ద్వారా సామాజిక మూలధనం గణనీయంగా పెరగడానికి మహిళా స్వయం సహాయక బృందాలు ప్రభావశీలంగా పనిచేస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయానికి మళ్లటంలో, ఈ క్రమంలో ఒకరికి మరొకరు తోడుగా నిలబడటంలో పెద్ద రైతుల కంటే చిన్న కమతాల రైతులు ముందంజలో ఉన్నారు. సావజిక మూలధనాన్ని పెంపొందిచటంలో చిన్న రైతుల పాత్ర చాలా ప్రధానమైనదని తేటతెల్లమైంది. మన రైతుల్లో 83% మంది చిన్న, సన్నకారు రైతులే. మెరుగైన ఆరోగ్యం... రసాయనిక వ్యవసాయం చేసే రైతులు, ఆ పొలాల్లో పనిచేసే కూలీలు అనారోగ్యాల పాలవుతూ చాలా పని దినాలు కోల్పోతూ ఉంటారు. వీరితో పోల్చితే ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే కూలీలు, రైతులు అనారోగ్యం వల్ల పనికి వెళ్లటం మానుకోవాల్సిన రోజులు మూడింట ఒక వంతు (33%) తగ్గినట్లు అధ్యయనంలో వెల్లడైంది. రసాయనిక పురుగుమందులు, ఎరువుల వాడే రైతులకు ఆరోగ్య ఖర్చులు ఎక్కువ. వారి జీవన నాణ్యత, పని సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. సాధారణంగా ఇటువంటి ఆరోగ్యంపై దుష్ప్రభావం కలిగించే నష్టాన్ని లెక్కలోకి తీసుకోవటం లేదు. ∙ప్రకృతి సేద్యం చేసే రైతుల ఆస్పత్రి ఖర్చులు 26% తక్కువ. ప్రకృతి వ్యవసాయదారులు ఎక్కువ రకాల పంటలు పండించడమే కాదు ఎక్కువ రకాల ఆహారాన్ని తినగలుగుతున్నారు. పోషకాలతో కూడిన అనేక రకాల ఆహారం తినటం వల్ల వీరి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంది. (చదవండి: ఆ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తి..చిట్టి మొక్కలతో గట్టిమేలే చేస్తున్నారుగా!) -
కోతలు.. కొత్త పథకాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో వ్యవసాయ రంగంపై శీత కన్ను వేసింది. గతంలో కంటే గణనీయ స్థాయిలో నిధులకు కోత పెట్టింది. ప్రధాన పథకాలన్నింటికీ కేటాయింపులను తగ్గించి వేసింది. ఇదే సమయంలో దేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని, తృణధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. మత్స్య రంగానికి మాత్రం కాస్త నిధులు ఇచ్చింది. భారీగా తగ్గిన కేటాయింపులు 202223 బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కలిపి రూ. 1,51,521 కోట్లను కేటాయించగా.. తాజా బడ్జెట్లో 5% తక్కువగా రూ. 1,44,214 కోట్లకు మాత్రమే ప్రతిపాదించారు.మొత్తంగా బడ్జెట్లో నిధుల కేటాయింపు శాతాన్ని చూస్తే.. వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాది 3.84% ఇవ్వగా, ఈసారి 3.20 శాతానికి తగ్గి పోయింది. ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్, కృషి వికాస్ యోజన పథకాలకు కేటాయింపులు భారీగా తగ్గిపోయాయి. ఇక పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు తోడ్పడేలా అమల్లోకి తెచ్చిన ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్’కు, పంటలకు మద్దతు ధర లభించేందుకు తెచ్చిన ‘పీఎం–ఆశ’ పథకాలను కేంద్రం పక్కన పెట్టేసింది. వ్యవసాయానికి రుణ సాయం.. దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు, తక్కువ వడ్డీతో మరిన్ని రుణాలు అందేలా చర్యలు చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. గత ఏడాది (రూ.18 లక్షల కోట్లు) కన్నా 11 శాతం అధికంగా ఈసారి రూ.20 లక్షల కోట్ల మేర పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. బ్యాంకులు పంట రుణాలకు 9 శాతం వడ్డీ వసూలు చేస్తాయని.. కేంద్రం అందులో 2 శాతాన్ని భరిస్తుండటంతో రైతులకు ఏడు శాతం వడ్డీకే రుణాలు అందుతున్నాయని చెప్పారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండేందుకు ఎలాంటి తనఖా లేకుండా ఇచ్చే రుణాలను రూ.1.6 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ► ఎక్కువ పొడవు పింజ ఉండే పత్తి ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు క్లస్టర్ ఆధారిత విధానాన్ని అనుసరిస్తామని నిర్మల తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ విధానం)తో విత్తనాల నుంచి మార్కెటింగ్ వరకు వ్యాల్యూ చైన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్య రంగానికి ఊపు కోసం.. ► దేశంలో చేపల ఉత్పత్తి, రవాణాను మెరుగుపర్చేందుకు ‘ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన’ కింద రూ.6,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఇతర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో రొయ్యల దాణా దిగుమతిపై కస్టమ్స్ పన్నును తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం.. ► దేశంలో సహజ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నట్టు నిర్మల ప్రకటించారు. ఇందుకోసం వచ్చే మూడేళ్లపాటు దేశవ్యాప్తంగా కోటి మంది రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. పంటలకు అవసరమైన సూక్ష్మ పోషకాలు (ఎరువులు), పురుగు మందులను పంపిణీ చేసేందుకు 10వేల ‘బయో–ఇన్పుట్ రీసోర్స్ సెంటర్’లతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ► పశు, వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేందుకు ‘గోబర్ధన్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో–ఆగ్రో రీసోర్సెస్ ధన్)’ పథకం కింద రూ.10 వేల కోట్లతో కొత్తగా 500 ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సహజవాయువును విక్రయించే అన్ని సంస్థలు తప్పనిసరిగా 5శాతం బయో కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను అందులో చేర్చాలని నిర్ణయించినట్టు తెలిపారు. భూమిని కాపాడేందుకు ‘పీఎం–ప్రణామ్’! ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగం, పురుగు మందుల వాడకాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ‘ప్రధాన మంత్రి ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరేషన్, అవేర్నెస్, నరిష్మెంట్ అండ్ అమెలియరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ (పీఎం–ప్రణామ్)’ పథకాన్ని చేపడుతున్నట్టు నిర్మల తెలిపారు. ఈ దిశగా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ► ఉద్యాన పంటల కోసం.. తెగుళ్లు సోకని, నాణ్యమైన మొక్కలను అందుబాటులో ఉంచేందుకు రూ.2,200 కోట్లతో ‘ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్’ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ► గ్రామీణ ప్రాంతాల్లో యువ పారిశ్రామికవేత్తలు ‘అగ్రి స్టార్టప్స్’ను నెలకొల్పేలా ప్రోత్సహించేందుకు ‘అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (ఏఏఎఫ్)’ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ► వ్యవసాయ రంగంలో రైతు ఆధారిత, సమ్మిళిత పరిష్కారాల కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ► ‘మిష్తి’ పథకం కింద దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో మడ అడవులను పెంచనున్నట్టు తెలిపారు. ‘శ్రీ అన్న’తో తృణధాన్యాల హబ్‌గా.. దేశాన్ని తృణధాన్యాల హబ్‌గా మార్చేందుకు ‘శ్రీ అన్న’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్’ను దీనికి వేదికగా ఎంచుకున్నట్టు తెలిపారు. ఇది తృణధాన్యాల ఉత్పత్తి, పరిశోధన, సాంకేతిక అంశాల్లో అత్యుత్తమ విధానాలను అంతర్జాతీయ స్థాయిలో పంచుకునేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా పనిచేస్తుందని వివరించారు. తృణధాన్యాల వినియోగంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. ఎందరో చిన్న రైతులు వీటిని పండించి ప్రజల ఆరోగ్యానికి తోడ్పడుతున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఐఐఎంఆర్ ఏంటి? దేశంలో తృణధాన్యాల దిగుబడి పెంచడం, కొత్త వంగడాల రూపకల్పన కోసం హైదరాబాద్‌లో ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్)’ను ఏర్పాటు చేశారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) పరిధిలో ఇది పనిచేస్తుంది. జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు వంటి తృణధాన్యాల పంటలపై ఇక్కడ పరిశోధనలు చేస్తారు. ఐఐఎంఆర్ దేశ విదేశాలకు చెందిన తృణధాన్యాల సంస్థలతో కలిసి పనిచేస్తుంది కూడా. పల్లెకు నిధులు కట్! గ్రామీణాభివృద్ధికి తగ్గిన కేటాయింపులు ఉపాధి హామీపై చిన్నచూపు ఇళ్లు, తాగునీటికి మాత్రం ఊరట.. మౌలిక రంగాన్ని పరుగులు పెట్టిస్తామంటూ భారీగా పెట్టుబడి నిధులను కేటాయించిన మోదీ సర్కారు.. గ్రామీణాభివృద్ధి విషయంలో ఈసారి కాస్త చిన్నచూపు చూసింది. ప్రధానమైన కేంద్ర ప్రాయోజిత పథకాలకు (ఫ్లాగ్షిప్) నిధుల కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులు (సవరించిన అంచనా) రూ. 1,81,121 కోట్లు కాగా, 2023–24 బడ్జెట్లో కేటాయింపులను 13 శాతం మేర తగ్గించి రూ.1,57,545 కోట్లకు పరిమితం చేసింది. ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో భారీగా కోత పెట్టడం గమనార్హం. ఉపాధి ‘హామీ’కి కోత... గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కేటాయింపుల్లో భారీగా కోత పడింది. 2022–23లో కేటాయింపుల సవరించిన అంచనా రూ.89,400 కోట్లతో పోలిస్తే 32 శాతం మేర తగ్గించేశారు. కాగా, 2022 జూలై–నవంబర్ కాలంలో ఈ స్కీమ్ కింద పనులు చేసేందుకు ముందుకొచ్చిన కార్మికుల సంఖ్య కోవిడ్ ముందస్తు స్థాయిలకు చేరినట్లు తాజా ఆర్థిక సర్వే పేర్కొనడం గమనార్హం. గ్రామీణ రోడ్లు.. జోరు తగ్గింది (పీఎంజీఎస్‌వై) గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మరింత మెరు గుపరిచేందుకు రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు వెచ్చి స్తోంది. అయితే, తాజా బడ్జెట్లో ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్‌కు కేటాయింపులను మాత్రం పెంచలేదు. 2023–24లో 38,000 కిలోమీటర్ల మేర పక్కా రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటికి ఓకే... (పీఎంఏవై) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి పెద్దపీట వేసేలా తాజా బడ్జెట్లో కొంత మెరుగ్గానే కేటాయింపులు జరిపారు. ప్రధానంగా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్ తరహాలోనే పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్‌ను నెలకొల్పుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. ఏటా రూ.10,000 కోట్లను ఈ ఫండ్‌కు ఖర్చు చేస్తామని, దీన్ని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిర్వహిస్తుందని ప్రకటించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాలకు 2023–24లో 57.33 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 20 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం. స్వచ్ఛ భారత్ మిషన్... దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జన (ఓడీఎఫ్)ను పూర్తిగా తుడిచిపెట్టడానికి 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్ పథకం (ఎస్బీఎం) కిందికి ఘన వర్ధాల (చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా తీసుకొచ్చారు. ఈ పథకానికి మాత్రం తాజా బడ్జెట్లో కేటాయింపులు పెంచారు. కాగా, పట్టణ ప్రాంతాల్లో 2023–24లో 13,500 కమ్యూనిటీ/పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, 3 లక్షల గ్రామాలను ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీరు నిర్వహణ కిందికి తీసుకురావాలనేది కేంద్రం లక్ష్యం. తాగునీటికి నిధుల పెంపు... స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుకు 2019–20లో జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించారు. దీనిలో భాగంగా 2023–24లో 4 కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు తాజా బడ్జెట్లో నిధుల కేటాయింపులను పెంచారు. భారత్ నెట్... భారత్ నెట్ కింద దేశంలోని పల్లెలన్నింటికీ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలనేది కేంద్రం లక్ష్యం. దీనిలో భాగంగా 2023–24లో 17,000 గ్రామ పంచాయితీలను కొత్తగా హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా అనుసంధానించనున్నారు. అలాగే 78,750 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5,50,000 ఫైబర్–టు–హోమ్ కనెక్షన్లు కూడా ఇవ్వాలనేది లక్ష్యం. రహదారులపై ప్రగతి పయనం ఎన్హెచ్ఏఐకు 2022–23 బడ్జెట్లో కేంద్రం రూ.1.42 లక్షల కోట్లు కేటాయించగా, 2023–24 బడ్జెట్లో రూ.1.62 లక్షల కోట్లు కేటాయించింది. ఈసారి కేటాయింపులను రూ.20,000 కోట్లు(13.90 శాతం) పెంచింది. జాతీయ రహదారుల రంగానికి 2022–23లో రూ.1.99 లక్షల కోట్లు కేటాయించగా, దీన్ని తర్వాత రూ.2.17 లక్షల కోట్లుగా సవరించింది. తాజా బడ్జెట్లో ఈ రంగానికి రూ.2.70 లక్షల కోట్లు కేటాయించడం గమనార్హం. -
ఏపీ స్ఫూర్తితో కర్షకులకు దీప్తి
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయానికి అండగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా కనీసం కోటి మంది రైతులను ప్రకృతి సాగు బాట పట్టించే లక్ష్యంతో కేంద్రం అడుగులేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేశారు. వ్యవసాయ రంగం బలోపేతానికిæ ఏపీ బాటలోనే జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టబోతున్నట్టు పరోక్షంగా ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో 7.54 లక్షల ఎకరాల్లో 7.05 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో కనీసం 15 లక్షల మంది రైతులను ప్రకృతి సాగు వైపు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పలు రాష్ట్రాలతోపాటు లాటిన్ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాలు సైతం ఏపీ బాటలో అడుగులేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పెద్దఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి ప్రకటించారు. చిరు ధాన్యాల కోసం ‘శ్రీఅన్న’ వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మిల్లెట్ పాలసీని తీసుకురాగా.. ఇదే లక్ష్యంతో ‘శ్రీఅన్న’ పథకాన్ని ప్రకటించిన కేంద్రం చిరు ధాన్యాలపై పరిశోధనలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులకు సహకారం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్‌ల)ను మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.2,718 కోట్లతో గోదాములు, డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్స్ నిర్మిస్తోంది. ఇదే బాటలో కేంద్రం కూడా జాతీయ స్థాయిలో పీఏసీఎస్‌లను మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు రూ.2,516 కోట్లు కేటాయించింది. ఏపీ బాటలోనే పీఏసీఎస్‌లను పూర్తి స్థాయిలో కంప్యూటరైజేషన్ చేస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో ప్రతి పంచాయతీలోనూ ఎంపీసీఎస్ల ఏర్పాటుతో పాటు ప్రైమరీ ఫిషరీస్, డెయిరీ కో–ఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ‘సహకార్ సే సమృద్ధి’ పథకాన్ని ప్రకటించింది. పీఎం మత్స్య సమృద్ధి యోజన పథకం కింద దేశీయ మార్కెట్లకు చేయూతనివ్వాలని సంకల్పించింది. ఇప్పటికే రాష్ట్రంలో 26 ఆక్వాహబ్‌లు, 14 వేల ఫిష్ ఆంధ్రా అవుట్‌లెట్స్‌తో పాటు పెద్ద ఎత్తున ఫిష్ వెండర్స్, ఫిష్ కార్ట్స్ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మార్కెట్‌ను విస్తృత పర్చేందుకు పెద్దఎత్తున ఆర్థిక చేయూత ఇచ్చేందుకు రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్రమంత్రి ప్రకటించారు. ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.20 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించినట్టు కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. రాష్ట్రంలో ఏటా సగటున రూ.2 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇస్తుండగా.. కేంద్రం నిర్ణయంతో ఈ ఏడాది కనీసం రూ.2.50 లక్షల కోట్లను రుణాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తగ్గనున్న మేత ధరలు మత్స్య ఉత్పత్తులు, ఎగుమతుల్లో ఏపీ నంబర్–1 స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో ఆ ప్రభావం మేత ధరలపై పడి ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగా కంపెనీలు మూడుసార్లు ïఫీడ్ ధరలు తగ్గించాయి. ఇటీవల తలెత్తిన ఆక్వా సంక్షోభ సమయంలో ముడి సరుకులపై విధించే దిగుమతి సుంకం తగ్గించాలని కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు ప్రభుత్వపరంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా ఆక్వా ఫీడ్ తయారీలో ఉపయోగించే ఫిష్ మీల్, క్రిల్ మీల్, మినరల్ అండ్ విటమిన్ ప్రీమిక్స్లపై విధించే దిగుమతి సుంకం 15 శాతం నుంచి 5 శాతానికి కేంద్రం తగ్గించింది. అంతేకాకుండా ఫిష్ లిపిడ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 30 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. దీంతో ఆక్వా ఫీడ్‌పై టన్నుకు కనీసం రూ.5 వేలకు పైగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. -
అద్భుతాలు చేస్తున్న అత్తోట రైతులు.. ప్రైవేటు రంగంలో తొలి విత్తన నిధి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: దేశీయ వరి విత్తనాలకు పెద్దపీట వేస్తూ ప్రకృతి వ్యవసాయంతో అద్భుతాలు చేస్తున్నారు అత్తోట రైతులు. 2016లో మూడు రకాల వరి వంగడాలతో ప్రారంభించి ఈ ఏడాది 365 దేశవాళీ రకాలను పండిస్తూ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. వరి వంగడాలను పండించడమే కాకుండా భూమి భారతి పేరుతో విత్తన నిధిని ఏర్పాటు చేశారు. దేశీయ వరి రకాలకు సంబంధించి ప్రైవేటు రంగంలో ఇదే తొలి విత్తన నిధి కావడం గమనార్హం. ఈ యజ్ఞానికి తానా తన వంతు సహకారం అందించింది. మొదట్లో ఏడెనిమిది మంది రైతులతో ఐదు ఎకరాల్లో ప్రారంభించిన ఈ ప్రక్రియ ఈ రోజున ఒక్క అత్తోట గ్రామంలోనే ఎనభై మందికి పైగా రైతులు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ దేశీయ వరి రకాలను పండిస్తున్నారు. రసాయనాల ప్రసక్తి లేకుండా కేవలం ప్రకృతి ఆధారిత సాగు పద్ధతుల్లో తీసిన విత్తనాలతో ‘దేశవాళీ విత్తన నిధి’ ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయం–దేశీయ వంగడాలు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో రైతులు కొన్నేళ్లుగా దేశవాళి వరి వంగడాలను ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేస్తున్నారు. గ్రామరైతు యర్రు బాపన్న నేతృత్వంలో మరో ఏడుగురు కలిసి దేశవాళీ వరి రకాల విత్తనాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఒక రైతు పంటను వేసుకోవడంతో పాటు విత్తనాలను కూడా తానే తయారు చేసుకునే అవకాశం దేశవాళీ విత్తనాలపై ఉంది. గత ఏడాది 365 రకాలను పండించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుకు కావాల్సిన ద్రవ, ఘన జీవామృతాలు, కషాయాలను స్వయంగా తయారుచేసుకుంటున్నారు. అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు అందిస్తున్నాయి. ‘దేశవాళీ విత్తన నిధి’ ఏర్పాటు అత్తోట రైతు యర్రు బాపయ్య గత ఆరేళ్లుగా ఈ విత్తనాలను సేకరిస్తూ సాగులో ఉన్నారు. ఆయన తానా సహకారంతో అత్తోట శివారులో విత్తననిధిని ఏర్పాటు చేశారు. ఇక్కడ 365 రకాల ధాన్యం అందుబాటులో ఉంచారు. ఈ పంటలు వేసుకునే రైతులకు ఆయా రకాలను అందిస్తున్నారు. ధాన్యం కావాలనే వారికి మర ఆడించి ఇచ్చేందుకు చిన్నస్థాయి రైస్‌మిల్‌ను తమ ఆవరణలోనే ఏర్పాటు చేసుకున్నారు. మెట్టలో తొలినుంచీ ప్రకృతి సేద్యం చేస్తున్న నామన రోశయ్య వీరికి స్ఫూర్తిగా నిలిచారు. 78 ఏళ్ల వయసులో కూడా ముప్పాతిక ఎకరం (75సెంట్లు)లో వ్యవసాయం చేస్తూ ఏడాదికి లక్షన్నరకు పైగా ఆదాయం సంపాదిస్తున్నాడు. ఈ వయసులోనూ కొబ్బరిచెట్లను అవలీలగా ఎక్కుతూ గెలలను దింపుతూ మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. కొబ్బరి సహా 23 రకాల పండ్ల చెట్లు సాగు చేస్తున్నాడు. అన్నీ ఆరోగ్య ప్రయోజనాలనిచ్చే రకాలే.. ఇక్కడ అరుదైన రకాలను సేకరించి సాగుచేశారు. బీపీటీ తరహాలోనే రోజువారీ ఆహార వినియోగానికి తగినట్టుండే ‘రత్నచోళి’ని సాగుచేశారు. వర్షాధారమై, ఎక్కువ పోషకాలుండే ‘సారంగనలి’ మరో రకం. వండేటపుడు చక్కని సువాసననిచ్చే పొడుగైన బియ్యం ‘ఢిల్లీ బాసుమతి’, ‘ఇంద్రాణి’ రకాలు, గడ్డి నుంచి బియ్యం వరకు సమస్తం నలుపురంగులో ఉండి రోగనిరోధక శక్తినిచ్చే ‘కాలాబట్టి’ (బ్లాక్‌రైస్), తెగుళ్లు, దోమకాటు దరిచేరని ‘దాసమతి’, మధుమేహాన్ని అదుపుచేసే నవారా, బలవర్ధకమైన ‘మాపిళై సాంబ’తోపాటు నెల్లూరు మొలకొలుకులు, తులసీబాసో, బాస్మతి, బహురూపి, చినుకుమిని, కుంకుమసాలి, దురేశ్వర్, పంచరత్న, రక్తశాలి, చింతలూరి సన్నం, కుజపటాలియా వంటివి ప్రముఖమైనవి. ఈ రకాలన్నీ ఆరోగ్య ప్రయోజనాలనిచ్చేవే. దేశవాళీ సాగును ప్రోత్సహించడమే.. దేశవాళీ వరి వంగడాల్లో గణనీయమైన జన్యువైవిధ్యాలున్నాయి. వివిధ కారణాలతో అనేక రకాలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వీటి సంరక్షణకు మా వంతు కృషి చేస్తున్నాం. దేశవాళీ సాగు ఎప్పుడూ దెబ్బతీయదు. అత్యంత అధ్వాన్నమైన పరిస్థితుల్లోనూ కనీసం యాభై శాతం ఫలితాన్ని అందిస్తుంది.అందుకే రైతులకు విత్తనాలు అందించేందుకు వీలుగా తానా సహకారంతో భూమి భారతి విత్తన నిధిని ఏర్పాటు చేశాము. – యర్రు బాపన్న, సంప్రదాయ సాగు రైతు, అత్తోట -
ప్రకృతి సాగుతో అబ్బురపరుస్తున్న టెక్కీ! ‘గూగుల్ ఫామ్స్’ ద్వారా మార్కెటింగ్..
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా జొహరాపురానికి చెందిన బాలభాస్కరశర్మ పదేళ్ల పాటు సింగపూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశారు. తండ్రి మరణంతో కర్నూలు వచ్చేసిన ఆయన బెంగళూరు కేంద్రంగా ఉన్న ఓ కంపెనీలో ఇంటినుంచే పని చేస్తున్నారు. కొలువును కొనసాగిస్తూనే.. కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో తనకున్న 8.50 ఎకరాల్లో 20 రకాల కూరగాయలు, ఆకు కూరలతో పాటు 10కి పైగా పండ్లను సాగు చేస్తూ వినూత్న రీతిలో మార్కెటింగ్ చేస్తున్నారు. ఎర్ర బెండ, నల్ల పసుపు, మామిడి అల్లం వంటి విభిన్న పంటలతో పాటు నిమ్మ, జామ, సీతాఫలం, మామిడి, అంజూర, నేరేడు, అరటి, మునగ, పాల సపోట, చెర్రీ, టమాటా, చెన్నంగి కొబ్బరి, ముల్లంగి, ఆకు కూరలను సాగు చేస్తున్నాడు. మధురై నుంచి ఎర్ర బెండ సీడ్‌ను, ఆయుర్వేద మందుల్లో ఎక్కువగా ఉపయోగించే నల్ల పసుపును మేఘాలయ నుంచి తెప్పించి నాటారు. గూగుల్ ఫామ్స్ ద్వారా బుకింగ్ బాలభాస్కరశర్మ పండించిన పంటలన్నిటినీ గూగుల్ ఫామ్స్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు. వారానికి రెండుసార్లు కూరగాయలు, ఆకు కూరలు కోతకు వస్తుండగా.. కోతకొచ్చే రెండ్రోజుల ముందుగానే గూగుల్ ఫామ్స్‌లో తాను పండించే పంటలు, వాటి ధరల వివరాలను వినియోగదారులకు లింక్ ద్వారా పంపిస్తున్నారు. తమకు అవసరమైన వాటిని ఏ మేరకు కావాలో ఎంచుకొని.. ఆ వివరాలను వినియోగదారులు సబ్మిట్ చేయగానే బాలభాస్కరశర్మకు మెయిల్ మెసేజి వస్తుంది. ఆ వివరాలను ఎక్సెల్ షీట్లో క్రోఢీకరించుకుని కోతలు పూర్తి కాగానే వాటి నాణ్యత కోల్పోకుండా ప్యాకింగ్ చేసి స్వయంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇలా కర్నూలులోని 3 అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్న వారికి తన పంటలను విక్రయిస్తున్నారు. గూగుల్ ఫామ్స్‌ను వినియోగించడం వల్ల సొంత వెబ్సైట్, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ అవసరం లేకుండా, ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా మొత్తం పంటల్ని విక్రయిస్తున్నారు. సాగులో ఆధునికత కూరగాయలు, ఆకు కూరలను మల్చింగ్ విధానంలో భాస్కరశర్మ సాగు చేస్తున్నారు. మల్చింగ్ వల్ల భూమిలో తేమ ఆరిపోకుండా ఉండటమే కాకుండా నీరు ఆదా అవుతుంది. చీడపీడల బెడద కూడా ఉండదు. కూరగాయలు, ఆకు కూరలు మంచి నాణ్యతతో ఉంటాయి. మామిడి, ఇతర పండ్ల తోటలకు వేరుశనగ పొట్టుతో మల్చింగ్ చేస్తున్నారు. సాగులో ఎరువులు, పురుగుల మందులు వాడరు. పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం కోసం 5 దేశీవాళీ ఆవులను పోషిస్తున్నారు. వాటిద్వారా వచ్చే జీవామృతం మొక్కలకు వేస్తారు. రసం పీల్చే పురుగుల నివారణకు వావిలాకు కషాయం, గొంగళి పురుగుల నివారణకు అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగ, చీడపీడలకు నీమాస్త్రం, వేప, సీతాఫలం నూనెలు వాడుతున్నారు. పండ్ల తోటలకు నష్టం కలిగించే పండు ఈగల నివారణకు సోలార్ ట్రాప్స్, తెలుపు, పసుపు జిగురు అట్టలు ట్రాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. రసాయన అవశేషాలు లేని పంటల సాగే లక్ష్యం రసాయన అవశేషాలు లేకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నాను. వారానికి ఐదు రోజులు వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటాను. క్షేత్రంలో ఓ కుటుంబానికి ఉపాధి కల్పిస్తున్నాను. మొదట్లో పండ్ల మొక్కలు నాటాను. ఆరు నెలలుగా కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నాను. వారానికి రెండుసార్లు ఆపార్ట్మెంట్స్లో విక్రయిస్తున్నాను. మంచి ఆదరణ లభిస్తోంది. పెట్టుబడికి తగినట్టుగా ఆదాయం వస్తుంది. – బాలభాస్కరశర్మ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, కర్నూలు -
Chilli Crop Cultivation: నల్ల తామరను జయించిన దుర్గాడ
మిరప పంటపై నల్ల తామరకు ప్రకృతి వ్యవసాయమే దీటుగా సమాధానం చెబుతోంది. రెండేళ్లుగా నల్ల తామర, మిరప తదితర ఉద్యాన పంటలను నాశనం చేస్తుండడంతో దీన్ని పెను విపత్తుగా ప్రభుత్వం గుర్తించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో కాకినాడ జిల్లాలోని మిరప రైతులు నల్ల తామర తదితర చీడపీడలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పంటను నిలబెట్టుకుంటున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన పలువురు రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సస్యరక్షణ మందులను వినియోగించి నల్ల తామర ఉధృతిని కట్టడి చేస్తూ పంటలను కాపాడుకుంటున్నారు. దుర్గాడ గ్రామంలో 650 ఎకరాల్లో గుండ్రటి రకం మిరప సాగవుతుంటే, ఇందులో 180 ఎకరాలలో రైతులు ప్రకృతి సేద్య పద్ధతులు పాటిస్తున్నారు. ఈ మిరప పంట నల్ల తామర పురుగును తట్టుకుని నిలబడటం విశేషంగా చెబుతున్నారు. దుర్గాడ రకం మిర్చి విరగ పండటంతో రైతులు సంతోషంగా ఉన్నారు. అయితే, అదే గ్రామంలో ఈ పొలాలకు పక్కనే ఉన్న, రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్న రైతుల పొలాల్లో మిరప తోటలు నల్లతామర తదితర చీడపీడలతో దెబ్బతి న్నాయి. భారీ పెట్టుబడులు పెట్టి రైతులు తీవ్రంగా నష్టపోయారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, కాకినాడ ఫొటోలు: వివివి వరప్రసాద్, పిఠాపురం కొత్త పురుగు నల్ల తామరను నియంత్రించడంలో రసాయనక ఎరువులు, పురుగుమందుల కంటే కషాయాలే బాగా పనిచేస్తున్నాయి. ఉల్లి కషాయం, జీవామృతం, మీనామృతం వంటివి వినియోగించిన పొలాల్లో మిరప పంట తామర పురుగును తట్టుకుని నిలబడింది. రసాయనిక సేద్యంలో దెబ్బతిన్న మిరప పొలాల్లో కషాయాలు, ద్రావణాలు ఉపయోగించిన చోట్ల పంట తిరిగి పుంజుకుంటుండటం విశేషం. సేంద్రియ ఎరువులు వాడిన పంట మంచి ఆదాయాన్నిస్తుండగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వినియోగించిన పంటలు దెబ్బతిన్నాయి. ఈ రైతులకు అవగాహన కల్పించి వచ్చే సీజన్లో ప్రకృతి వ్యవసాయం చేసేలా అవగాహన కల్పిస్తున్నాం. నల్ల తామర ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తున్నాం. సేంద్రీయ మందులతో కొత్త పురుగు ఉధృతి తగ్గింది. – ఇలియాజర్ (94416 56083), డీపీఎం, పకృతి వ్యవసాయ శాఖ, కాకినాడ కుళ్లిన ఉల్లితో కషాయం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, చేప వ్యర్థాలతో మీనామృతం, అల్లం–వెల్లుల్లితో అగ్ని అస్త్రం వంటివి తయారు చేసుకొని మిరప పంటకు వాడుతూ ప్రకృతి సేద్యంలో మంచి ఫలితాలు సాధిస్తున్నాం. కుళ్లిన ఉల్లిపాయలు, వేపాకులతో తయారు చేసే ఉల్లి కషాయం మిరప తోటల్లో నల్ల తామరను కట్టడి చేయటంలో కీలక స్థానం పోషిస్తోంది. ఎకరా మిర్చి తోట నుంచి ఇప్పటి వరకు రూ.3 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా కొన్ని కాయలు కోయాల్సి ఉంది. – వెలుగుల బాబ్జి (97014 41771), ప్రకృతి సేద్య పద్ధతుల్లో మిర్చి సాగు చేస్తున్న రైతు, దుర్గాడ ఎకరానికి రూ. 65 వేల పెట్టుబడి.. రూపాయి కూడా తిరిగి రాలేదు.. నేను గత కొన్నేళ్లుగా రసాయనిక ఎరువులు, పురుగుమందులతో మిరప సాగు చేస్తున్నా. ఐతే గత రెండేళ్ళుగా నల్ల తామర పురుగు సోకడంతో మిర్చి పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఎకరానికి రూ 65 వేల వరకు పెట్టుబడి పెట్టాను. ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. పంట పూర్తిగా తీసేయాల్సి వచ్చింది. రసాయనిక పురుగుమందులు పంటకు రక్షణ కల్పించ లేకపోయాయి. – ఇంటి ప్రసాద్, మిర్చి రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం, కాకినాడ జిల్లా -
పచ్చి కొబ్బరితో పాలు, ఆయిల్.. రోజుకు రెండు స్పూన్లు తీసుకుంటే..
జంతువుల పాలతో తయారైన ఉత్పత్తుల కన్నా మొక్కల ద్వారా తయారయ్యే పాలు (ప్లాంట్ బేస్డ్ మిల్క్) ఆరోగ్యదాయకమైనవే కాకుండా పర్యావరణహితమైనవి కూడా అన్న అవగాహన అంతకంతకూ ప్రాచుర్యం పొందుతున్నది. ఈ కోవలోనిదే కొబ్బరి పాల ఉత్పత్తి. పచ్చి కొబ్బరి పాలతో తయారయ్యే వర్జిన్ నూనె, యోగర్ట్ (పెరుగు) వంటి ఉత్పత్తులకు ఐరోపా తదితర సంపన్న దేశాల్లో ఇప్పటికే మంచి గిరాకీ ఉంది. కొబ్బరి పాల ఉత్పత్తుల మార్కెట్ ఈ ఏడాది 84 కోట్ల డాలర్లకు చేరనుంది. వచ్చే ఆరేళ్లలో 105 కోట్ల డాలర్లు దాటుతుందని ‘గ్లోబ్ న్యూస్‌వైర్’ అంచనా. మన దేశంలోనూ (ముఖ్యంగా కేరళ, తమిళనాడుల్లో) వాణిజ్య స్థాయిలో కొబ్బరి పాల ఉత్పత్తి జరుగుతోంది. ఈ నేపధ్యంలో డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తొలి కొబ్బరి పాలు, వర్జిన్ కొబ్బరి నూనె ఉత్పత్తి యూనిట్ ప్రారంభం కావటం ఆహ్వానించదగిన పరిణామం. రాష్ట్రంలో కొబ్బరి అధికంగా పండించే కోనసీమలోనూ కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు పెద్దగా లేవనే చెప్పవచ్చు. కేవలం కాయర్ (కొబ్బరి పీచు) ఆధారిత పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. ఈ లోటును భర్తీ చేస్తూ కొబ్బరి పాలను, దాని నుంచి వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారీ తొలి పరిశ్రమను నెలకొల్పారు అభ్యుదయ రైతు గుత్తుల ధర్మరాజు(39). డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన ధర్మరాజు ఎంటెక్ చదువుకున్నారు. 13 ఏళ్లపాటు చమురు, సహజవాయువు రంగంలో ఇంజినీర్‌గా సేవలందించారు. రెండేళ్ల క్రితం ముమ్మిడివరంలో ఆయన రూ. 1.5 కోట్ల పెట్టుబడితో ‘కోనసీమ ఆగ్రోస్’ పేరుతో పరిశ్రమను నెలకొల్పారు. ‘వెల్విష్’ పేరు మీద వర్జిన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి పాలను ఉత్పత్తి చేస్తున్నారు. కొబ్బరి పాలు, వర్జిన్ కోకోనట్ ఆయిల్‌తో పాటు పాలు తీసిన కొబ్బరి పిండిని విక్రయిస్తున్నారు. ముమ్మిడివరంతోపాటు అమలాపురం, రాజమహేంద్రవరాల్లో సొంతంగానే ప్రత్యేక దుకాణాలు తెరిచి కొబ్బరి పాలు, వర్జిన్ ఆయిల్‌లకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ రిటైల్‌గా అమ్ముతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో వెల్కం డ్రింకుగా కొబ్బరి పాలను అందించే ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారాయన. రోజుకు 250 లీటర్ల కొబ్బరి పాల ఉత్పత్తి పచ్చి కొబ్బరి ముక్కలతోపాటు కొద్దిగా నీరు కలిపి మిక్సీ పట్టి కొబ్బరి పాలను తయారు చేసి కొబ్బరి అన్నం తదితర వంటలు చేస్తుండటం మనకు తెలిసిందే. పచ్చి కొబ్బరి పాల నుంచి శుద్ధమైన, ఆరోగ్యదాయకమైన పారిశ్రామిక పద్ధతుల్లో తయారు చేస్తారు. దీన్నే వర్జిన్ కోకోనట్ ఆయిల్గా పిలుస్తారు. పక్వానికి వచ్చిన కొబ్బరి కాయను పగల గొట్టి, చిప్పల నుంచి కొబ్బరిని వేరు చేస్తారు. కొబ్బరికి అడుగున ఉన్న ముక్కుపొడుం రంగు పలుచని పొరను తీసి వేసి గ్రైండర్ల ద్వారా కొబ్బరి పాలను తయారు చేస్తారు. పది కేజీల (సుమారు 28) కొబ్బరి కాయల నుంచి 1.5 లీటర్ల పాలు.. ఆ పాల నుంచి ఒక లీటరు వర్జిన్ నూనెను ఉత్పత్తి చేస్తున్నట్లు ధర్మరాజు చెప్పారు. ఆయన నెలకొల్పిన పరిశ్రమకు రోజుకు 5 వేల కొబ్బరికాయల నుంచి పాలను, నూనెను తయారు చేసే సామర్థ్యం ఉంది. మార్కెట్ అవసరం మేరకు ప్రస్తుతం రోజుకు 3 వేల కాయలతో 250 లీటర్ల పాలు తీస్తారు. పాల నుంచి 125–150 లీటర్ల వర్జిన్ కొబ్బరి నూనె వస్తుంది. కొబ్బరి పాలలో 60% నూనె, 40% నీరు ఉంటాయి. ఈ పాలను సెంట్రీఫ్యూగర్స్లో వేసి వేగంగా (18.800 ఆర్పీఎం) తిప్పినప్పుడు నూనె, నీరు వేరవుతాయి. వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇలా ఉత్పత్తి అవుతుంది. ఈ క్రమంలో ఎటువంటి రసాయనాలూ వాడరు. చిక్కటి కొబ్బరి పాలు లీటరు రూ.250లకు విక్రయిస్తున్నారు. ఈ పాలను నేరుగా తాగకూడదు. 3 రెట్లు నీరు కలిపి తాగాలి. 1:3 నీరు కలిపిన కొబ్బరి పాలు లీటరు రూ.100కు, గ్లాస్ రూ.30కు అమ్ముతున్నారు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ కేజీ అమ్మకం ధర రూ.450. ఇది రెండేళ్ల వరకు నిల్వ ఉంటుంది. ఉప ఉత్పత్తుల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. 3 వేల కాయల కొబ్బరి నుంచి పాలు తీసిన తర్వాత 75 కిలోల లోఫాట్ కొబ్బరి పొడి వస్తుంది. దీని ధర కిలో రూ. 125–150. కొబ్బరి చిప్పలు కూడా వృథా కావు. వీటితో తయారయ్యే యాక్టివేటెడ్ కార్బన్‌కు కూడా మంచి ధర వస్తుందన్నారు ధర్మరాజు. – నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి అమలాపురం. పాల వినియోగం ఇలా ► కొబ్బరి పాలను సాధారణ పాలు వినియోగించినట్టే వాడుకోవచ్చు. టీ, కాఫీలతోపాటు పాయసం, మిఠాయిలు తయారు చేసుకోవచ్చు. విదేశాల్లో ఐస్‌క్రీమ్‌ల, సౌందర్య సాధనాల తయారీలో కూడా కొబ్బరి పాల వినియోగం ఎక్కువ. ► కొబ్బరి పాలను నీరు కలపకుండా నేరుగా తీసుకోకూడదు. దీనిలో 60 శాతం ఆయిల్ ఉంటుంది. మిగిలిన 35 శాతం నీరు. 1:3 పాళ్లలో నీరు కలిపి వాడుకోవాలి. ఒక గాసు కొబ్బరి పాలలో మూడు గ్లాసుల నీరు, కొంత పంచదార కలిపి రిటైల్ ఔట్లెట్లో అమ్ముతున్నారు. పుష్కలంగా పోషకాలు ► కొబ్బరి పాలల్లో పుష్కలంగా పీచు, పిండి పదార్థాలతో పాటు.. విటమి¯Œ –సీ, ఇ, బి1, బి3, బి4, బి6లతోపాటు ఇనుము, సెలీనియం, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, పొటాసియం, జింక్, సోడియం ఉన్నాయి. ∙కొబ్బరి పాలు వీర్యపుష్ఠిని కలిగిస్తాయి. అలసటను నివరించి శరీరానికి బలం చేకూరుస్తాయి. బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్ చేయడంతోపాటు గుండె జబ్బులను నివారిస్తాయి. ∙రక్తహీనతను నివారించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చంటి పిల్లలకు తల్లి పాలు చాలకపోతే కొబ్బరి పాలు తాపవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆదరణ పెరుగుతోంది కొబ్బరి పాలకు ప్రజాదరణ పెరుగుతోంది. రిటైల్ అమ్మకాలు పెరగడంతోపాటు శుభ కార్యక్రమాలకు వెల్కం డ్రింక్‌గా కూడా అమ్మకాలు పెరిగాయి. ముమ్మిడివరం, అమలాపురం, రాజమహేంద్రవరాల్లో రిటైల్ ఔట్లెట్లు ఏర్పాటు చేశాం. వాకర్లు ఎక్కువగా సేవిస్తున్నారు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ పసిపిల్లలకు మసాజ్ చేయడానికి చాలా అనువైనది. దీన్ని రోజుకు రెండు స్పూన్లు తీసుకుంటే.. మహిళల్లో హార్మోన్ అసమతుల్యత ఉపశమిస్తున్నట్లు మా వినియోగదారులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలలో బేబీ మసాజ్ అయిల్‌గా కోకోనట్ వర్జిన్ ఆయిల్‌కు మంచి మార్కెట్ ఉంది. ఒడిదొడుకులున్నప్పటికీ మంచి భవిష్యుత్తు ఉన్న రంగం ఇది. – గుత్తుల ధర్మరాజు (85559 44844), కొబ్బరి పాల ఉత్పత్తిదారు, ముమ్మిడివరం, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. కొబ్బరి పాలు.. కొత్త ట్రెండ్.. పశువులలో వచ్చే కొన్ని రకాల వ్యాధుల ప్రభావం వాటి పాల మీద ఉంటుంది. ఇది స్వల్పమోతాదే కావచ్చు. అలాగే, పశువుల పొదుగు పిండడం ద్వారా పాలను సేకరించడం ఒక విధంగా వాటిని హింసించడమేనని భావించే వారి సంఖ్య కూడా పెరిగింది. వీరు మొక్కల నుంచి వచ్చే పాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొబ్బరి పాలు వీరికి మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఇదొక కొత్త ట్రెండ్. కొబ్బరి తెగుళ్ల ప్రభావం పాల మీద ఉండదు. కొబ్బరి పాలు ఆరోగ్యానికి చాలా మేలు. కానీ, ఏదైనా మితంగా తీసుకోవాలి. – డాక్టర్ బి.శ్రీనివాసులు, అధిపతి, డా.వై.ఎస్.ఆర్. ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట. ∙కోనసీమ ఆగ్రోస్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న వర్జిన్ కోకోనట్ ఆయిల్ -
Natural Farming: ఏపీ స్ఫూర్తితో మేఘాలయలో ప్రకృతి సాగు
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ ప్రకృతిసాగు వైపు అడుగులేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇటీవలే మేఘాలయ రాష్ట్ర అధికారులు, గ్రామీణ జీవనోపాధి సంస్థ ప్రతినిధుల బృందం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి గిరిజనులు పాటిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై అధ్యయనం చేసింది. మేఘాలయలో ప్రకృతి వ్యవసాయ పరివర్తన కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించే క్రమంలో మేఘాలయ స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ సొసైటీతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుసాధికార సంస్థ, అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగులకు చెందిన నిట్టపుట్టు పరస్పర సహాయ సహకార సంఘం మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు మేఘాలయలో ప్రకృతిసాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక సహాయం అందించనుంది. మేఘాలయలో ఘరో, ఖాశీ హిల్స్‌లో ఎంపిక చేసిన ఐదు బ్లాకుల్లో 20గ్రామాల రైతులను ప్రకృతి వ్యవసాయ రైతులుగా తీర్చిదిద్దడంతోపాటు బలమైన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ) వ్యవస్థ రూపకల్పనకు చేయూతనిస్తుంది. ఇందుకోసం 10 మంది సీనియర్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల బృందం మేఘాలయాకు వెళ్లింది. ఈ బృందం అక్కడి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, ప్రాజెక్టు బృందంతో కలిసి పనిచేస్తుంది. ఎంపికచేసిన బ్లాకుల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రకృతిసాగు చేపట్టడం ద్వారా వాటిని రిసోర్స్ బ్లాకులుగా తీర్చిదిద్దనున్నారు. ఇంగ్లిష్ స్థానిక భాషల్లో ప్రకృతిసాగు విధానాలు, పాటించాల్సిన పద్ధతులపై మెటీరియల్ తయారుచేసి ఇస్తారు. సిబ్బందికి శిక్షణతోపాటు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తారు. రాష్ట్రస్థాయిలో కో ఆర్డినేట్ చేసేందుకు స్టేట్ యాంకర్‌ను నియమిస్తారు. సీజన్ల వారీగా రెండు రాష్ట్రాల కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రకృతి వ్యవసాయ అనుభవాలు, ఉత్తమ అభ్యాసాలను పరస్పరం పంచుకోవడానికి కృషిచేస్తారు. (క్లిక్ చేయండి: సర్రుమని తెగే పదును.. చురుకైన పనితనం) -
దేశవ్యాప్తంగా పది లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం
సాక్షి సాగుబడి డెస్క్: ప్రకృతి వ్యవసాయం 17 రాష్ట్రాలకు విస్తరించింది. ఈ రాష్ట్రాల్లో 16.78 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా ప్రకటించింది. బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం ఉపయోగించి రసాయనరహితంగా పంటలు పండించడాన్ని ప్రకృతి సేద్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణలో 2,403 హెక్టార్లలో 2,002 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అత్యధికంగా 6,30,000 మంది రైతులు ఆంధ్రప్రదేశ్‌లో (2.9 లక్షల హెక్టార్లలో) ప్రకృతి సేద్యం చేస్తుండగా, గుజరాత్లో అత్యధికంగా 3.17 లక్షల హెక్టార్లకు (2.49 లక్షల మంది రైతులు) ప్రకృతి సేద్యం విస్తరించిందని ప్రకృతి వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన జాతీయ పోర్టల్ పేర్కొంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అధ్యక్షతన ఢిల్లీలోని కృషిభవన్‌లో ’జాతీయ ప్రకృతి సేద్య కార్యక్రమం’సారథ్య సంఘం మొదటి సమావేశం శుక్రవారం జరిగింది. తోమర్ ప్రకృతి వ్యవసాయంపై జాతీయ పోర్టల్ (http://nat uralfarminf.dac.gov.in/)ను ప్రారంభించారు. ఈ పోర్టల్‌ను కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ అభివృద్ధి చేసింది. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం గురించి పూర్తి సమాచారం, అమలు విధానం, వనరులు, అమలు పురోగతి వివరాలను తెలిపే ఈ పోర్టల్ దేశంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని మంత్రి తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్, కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తదితరులు హాజరయ్యారు. -
అన్నదాతల్లో చైతన్యం తీసుకొస్తున్న ప్రవాసీయులు
ముస్తాబాద్(సిరిసిల్ల): దగాపడ్డ తెలంగాణ పునర్నిర్మాణానికి రెండు దశాబ్దాల క్రితమే నడుం బిగించారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించాలన్న సంకల్పం వారిని ముందుకు నడిపించింది. వెనకబడ్డ పురిటిగడ్డను బాగు చేసేందుకు మలి దశ తెలంగాణ ఉద్యమానికి ముందే 1999లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆవిర్భవించింది. ఖండాంతరాలలో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలు ఒక్కటై.. అమెరికాలోని న్యూజెర్సీలో టీడీఎఫ్ పురుడుపోసుకుంది. అలా మొదలైన టీడీఎఫ్ ప్రస్థానం రెండు దశాబ్దాలకు పైగా సేవలు అందిస్తూనే ఉంది. జైకిసాన్‌తో రైతులకు సేవలు అమెరికాలోని న్యూజెర్సీలో పురుడుపోసుకున్న టీడీఎఫ్‌ను పలు విభాగాలకు విస్తరించారు. 5 వేల మంది సభ్యులతో ప్రారంభమై ఎన్నో సేవలు అందిస్తోంది. భారతదేశం అంటేనే గుర్తుకు వచ్చేది వ్యవసాయ. అందుకు ప్రాధాన్యతను కల్పిస్తూ జైకిసాన్ విభాగాన్ని ప్రారంభించారు. రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు అవగాహన కల్పిస్తున్నారు. రసాయన ఎరువులకు దూరంగా, సేంద్రియ ఎరువులతో కలిగే లాభాలను వివరిస్తూ ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులకు కృషి చేస్తున్నారు. తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు చేయూతను అందించి, ఆత్మహత్యలు జరగకుండా అవగాహన కల్పిసున్నారు. జీవామృతం, ఘనామృతం తయారీ, డ్రమ్‌సీడర్ ద్వారా సాగు, పెస్టిసైడ్స్ ద్వారా కలిగే నష్టాలను వివరిస్తున్నారు. సమీకృత వ్యవసాయం వల్ల కలిగే ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండ్‌ను తీసుకువస్తున్నారు. పంట మార్పిడి, చిరుధాన్యాల సాగు, వాటి ద్వారా తయారయ్యే ఉత్పత్తులపై చైతన్యాన్ని తెస్తున్నా రు. గ్రామాలలో రైతుసేవా కేంద్రాలు ఏర్పా టు చేసి వారికి అవసరమైన యంత్ర పరికరాలను అందిస్తున్నారు. వ్యవసాయాధికారుల సమన్వయంతో కార్పొరేట్ స్థాయికి తీసుకువచ్చే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం వరి కొయ్యలు కాల్చకుండా, కొయ్యకాళ్లను ఎరువుగా ఎలా మార్చుకోవచ్చో చేసి చూపుతున్నారు. పశుపోషణతో కలిగే లాభాలను రైతులకు చేరవేస్తున్నారు. యంత్రాలను వాడుకుంటున్నాం ముస్తాబాద్‌లోని టీడీఎఫ్ రైతుసేవాకేంద్రంలోని యంత్రాలను వాడుకుంటున్నాం. డ్రమ్‌సీడర్, పచ్చిరొట్ట ఎరువుల తయారీ, సేంద్రియ సాగు పద్ధతులను వివరించారు. కేంద్రంలోని యంత్రాల సాయంతో గడ్డిని తొలగించుకున్నాం. కలుపు అవసరం లేకుండా అది ఉపయోగపడింది. రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. – దేవిరెడ్డి, రైతు, ముస్తాబాద్ ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి కావాలి రైతులు ఆరుగాలం శ్రమించి పండించే పంటలు ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఆ దిశగా వారిని చైతన్యం చేస్తున్నాం. అనవసర ఖర్చులు తగ్గిస్తూ సేంద్రియ విధానం వైపు తీసుకువస్తున్నాం. రైతులు బాగున్నప్పుడే దేశంలోని ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుంది. దానికోసం జై కిసాన్ పనిచేస్తుంది. – మట్ట రాజేశ్వర్‌రెడ్డి, టీడీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎన్నారైల సహకారంతో సేవలు తెలంగాణకు చెందిన ఎన్నారైలు ఇక్కడి ప్రజల జీవన విధానాలను మెరుగుపరిచేందుకు ఒక్కటై టీడీఎఫ్‌ను స్థాపించారు. దాని కోసం ఆహర్నిషలు పనిచేస్తున్నారు. సారవంతమైన నేలను కాపాడుకుంటూనే అధిక దిగుబడులు ఎలా సాధించవచ్చో శాస్త్రీయంగా అవగాహన కల్పిస్తున్నాం. రైతుల కోసం టీడీఎఫ్ మరింత ముందుకు వెళ్తుంది. – పాటి నరేందర్, జైకిసాన్ ఇండియా అధ్యక్షుడు -
Natural Farming: ప్రకృతి వ్యవసాయానికి ఏపీ చేదోడు
సమస్త జీవకోటి భారాన్ని మోసేది నేల. గతం నుండి మన తరానికి సంక్రమించిన వారసత్వ సంపద నేల. నేలను సారవంతంగా ఉంచే కారకాలు అపరిమితమైనవి కాదు, పరి మితమైనవి. విచ్చలవిడిగా భూమిని వాడిపడేస్తే... అది త్వరలోనే వట్టిపోతుంది. మనం ఈ భూమి మీద నివసిస్తున్నట్లే భవిష్యత్తు తరాలూ మనుగడ సాగించాలంటే... వారికి పనికి రాని నేలను కాక... సజీవమైన భూమిని అప్పగించాల్సిన బాధ్యత మనదే. మనుషుల నిర్లక్ష్యం, పేరాశ కారణంగా సాగు భూమి నిస్సారమైపోతోంది. నేల సేంద్రియ కర్బన పదార్థాలను కోల్పోయి పంటల సాగుకు పనికి రాకుండా పోతున్నది. వ్యవసాయంలో విచక్షణారహితంగా రసాయనాలను వాడటం వల్ల నేల నిస్సారమవుతున్నది. అధిక మొత్తంలో రసాయనాలు వాడిన ఫలి తంగా వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు తిన్న జీవజాలం అనారోగ్యం పాలవుతుంది. కన్న తల్లి పాలు కూడా పంటలపై చల్లే రసాయనాల కారణంగా విషతుల్య మవుతున్నాయని రాజస్థాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు డాక్టర్ ఇంద్రసోని పాల్ తెలిపారు. విషతుల్యమైన వ్యవసాయ ఉత్పత్తుల వల్ల పిల్లల రోగ నిరోధక శక్తి నశిస్తుందనీ, తెలివితేటలు, జ్ఞాపకశక్తి దెబ్బతింటాయనీ ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. అందుకే వ్యవసాయ విధానం ప్రకృతికి దగ్గరగా ఉండాలనే నినాదం ఇప్పుడు ఊపందుకుంది. అందులో భాగంగా నేలలోని సారం దీర్ఘకాలం మన గలిగే నిర్వహణ పద్ధతులు ప్రచారం చేస్తున్నారు. మట్టి ఆరోగ్యమే మనిషి ఆరోగ్యం అని తాత్వికతతో వ్యవసాయాన్ని సాగించాలి. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికీ, పర్యావరణాన్ని సుస్థిరమైనదిగా తయారు చేయ డానికీ, రైతుల జీవన ప్రమాణాలు పెంచడానికీ, సహజ వనరు లను ఉపయోగించి మంచి ఫలసాయం సాధించడానికీ, ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకంగా ‘రైతు సాధికార సంస్థ’ ద్వారా జీరో–బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమాలను అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం, వినియోగదారుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి బహుళ లక్ష్యాలతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. రైతుల సాగు ఖర్చులను తగ్గించడం, రైతుల దిగుబడిని మెరుగుపరచడం, వారి నష్టాలను తగ్గించడం, లాభదాయ కమైన ధరలను పొందడం ద్వారా వారి నికర ఆదాయాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అధిక ధర కలిగిన కృత్రిమ ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు ఉపయోగించకుండా ప్రకృతికి అనుగుణంగా గోమూత్రం, గో పేడ, వేప ఆకులు, స్థానిక వనరులతో... ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, బీజామృతం, నీమాస్త్రం, అగ్నిఅస్త్రం, బ్రహ్మాస్త్రం వంటివాటిని తయారుచేసుకుని వ్యవసాయంలో ఉపయోగించడానికి ప్రోత్సహిస్తోంది. ఇందువల్ల నేలలో జీవ పదార్థం అధికమవ్వడమే కాక మొత్తంగా భూసారం పెరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా మానవ ఆరోగ్యమే కాక, నేల ఆరోగ్యాన్నీ కాపాడవచ్చని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. (క్లిక్ చేయండి: తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!) – ఎ. మల్లికార్జున, ప్రకృతి వ్యవసాయ శిక్షకుడు -
ప్రకృతి సాగులో ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి : ప్రకృతి సాగులో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శమని కేంద్ర ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ సలహాదారు ఏకే యాదవ్ అన్నారు. ఏపీలో పెద్ద ఎత్తున చేపట్టిన ప్రకృతి సాగును ఆదర్శంగా తీసుకుని మణిపాల్ సహా ఈశాన్య రాష్ట్రాలు ముందుకు వెళుతున్నాయని చెప్పారు. ఆర్గానిక్ ఫుడ్ ఇండియా పోటీల్లో రాష్ట్రానికి నాలుగు ప్రతిష్టాత్మక పాన్ ఇండియా (జైవిక్ ఇండియా) అవార్డులు దక్కాయి. ఆగ్రాలో శనివారం జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో ఈ అవార్డులను కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి శివయోగి కాల్షద్‌తో కలిసి ఏకే యాదవ్ అందజేశారు. ఏపీ రైతు సాధికార సంస్థ తరఫున థీమెటిక్ లీడ్ ప్రభాకర్, మా భూమి సంఘ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నూకమ్ నాయుడు, నిట్టపుట్టు సంఘ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గంగరాజుతోపాటు వైఎస్సార్ జిల్లాకు చెందిన బండి ఓబులమ్మ ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఏకే యాదవ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రకృతి సాగు విస్తరణ దిశగా కేంద్రం తీసుకుంటున్న చర్యలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే స్ఫూర్తి అని చెప్పారు. తమ రాష్ట్రంలో కూడా ప్రకృతి సాగును ప్రోత్సహించే దిశగా కృషి చేస్తున్నట్లు కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ పేర్కొన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌కు 'క్యూ'
సాక్షి, అమరావతి: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రసాయన రహిత ఉత్పత్తుల ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ఈ విధానంలో మన రైతులు అవలంబిస్తున్న సాగు విధానాలను పరిశీలించేందుకు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం ఈనెల 19 నుంచి వారం రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడంతోపాటు రైతులు, రైతుసాధికార సంస్థ ప్రతినిధులతో జిల్లాల వారీగా సమావేశమై ప్రకృతి సాగు పద్ధతులను అధ్యయనం చేస్తుంది. ప్రకృతి సాగులో దేశానికే ఆదర్శం జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ (జెడ్బీఎన్ఎఫ్) కింద 2016లో శ్రీకారం చుట్టిన ప్రకృతి సాగు ప్రస్తుతం ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్)గా అమలవుతోంది. ప్రస్తుతం వరితో పాటు వేరుశనగ, కంది, మినుము, పెసర, పప్పుశనగ, మొక్కజొన్న, రాగి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల తోటలను ఈ విధానంలో సాగుచేస్తున్నారు. 2016లో 700 గ్రామాల్లో 40 వేల మందితో ప్రారంభమైన ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రస్తుతం 3,730 గ్రామాల్లో 7.30 లక్షల మంది రైతులు ఆచరిస్తున్నారు. రానున్న మూడేళ్లలో మరో 530 గ్రామాల్లో 1.75 లక్షల మంది రైతుల ద్వారా 4.25 లక్షల ఎకరాలకు విస్తరించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ విధానం ద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గడంతోపాటు ఆదాయం కూడా పెరుగుతోంది. అంతేకాదు.. గాలిలో కర్బన శాతాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ఈ సాగు ఇతోధికంగా దోహదపడుతోంది. దీంతో.. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు ఈ సాగుపై ఆసక్తి చూపుతున్నాయి. గ్రాండ్స్‌వెల్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో.. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ప్రకృతి సాగుపై అధ్యయనం చేసేందుకు 15 లాటిన్ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాలతో పాటు నేపాల్‌కు చెందిన ప్రతినిధుల బృందం రాష్ట్రాన్ని సందర్శిస్తోంది. అమెరికాకు చెందిన గ్రౌండ్స్వెల్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19న రాష్ట్రానికి రానున్న ఈ బృందం రాయలసీమ జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు క్షేత్రాలను పరిశీలిస్తుంది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టీవ్ బ్రేసియా సారథ్యంలో నెదర్లాండ్స్, కొలంబియా, నేపాల్, బ్రెజిల్, మెక్సికో, మాలి, ఘన, సెనెగల్ తదితర దేశాలకు చెందిన 30 మంది వ్యవసాయ రంగ నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. ఇక ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములవుతున్న మహిళా సంఘాల పాత్ర, సాగు విధానాలు, టెక్నాలజీ, ప్రభుత్వ ప్రోత్సాహం, భాగస్వామ్య సంస్థల సహకారం, అమలులో కీలకపాత్ర పోషిస్తున్న సామాజిక సిబ్బంది సేవలు, మార్కెటింగ్ విధానాలపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది. అంతేకాక.. రైతులు, మహిళా సంఘాలతోపాటు రైతు సాధికార సంస్థ జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులతో బృంద సభ్యులు భేటీ అవుతారు. అనంతరం.. ఈ సాగు అమలు ప్రణాళిక, లక్ష్యాలు, సాధించవలసిన ప్రగతిపై చర్చించి ప్రణాళిక రూపొందిస్తారు. ఏపీకి దక్కిన అరుదైన గౌరవం ప్రకృతి సాగులో ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు మన విధానాలను మోడల్‌గా తీసుకుని వారివారి రాష్ట్రాల్లో అమలుచేసేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడు వివిధ దేశాలు కూడా మనవైపు చూస్తున్నాయి. ఒకేసారి 15 దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం రాష్ట్రానికి వస్తుండడం మనకు దక్కిన గౌరవంగా భావించవచ్చు. – టి. విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్, రైతు సాధికార సంస్థ -
నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..
ఆయన ఓ విశ్రాంత ఉద్యోగి. నెలకు రూ.3 లక్షలు జీతం. ప్రైవేటు కంపెనీలో డిజిఎంగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్నారు ఘట్రాజు వెంకటేశ్వరరావు. వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో అమ్మమ్మ గారి ఊరు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామానికి వచ్చి తమ 4.5 ఎకరాల పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో దేశీ వరి రకాల సాగు చేపట్టారు. సుమారు రెండేళ్లు నిల్వ చేసిన ధాన్యాన్ని ఆరోగ్యదాయకమైన దేశీ బియ్యం విక్రయిస్తూ లాభాలతో ఆత్మసంతృప్తిని ఆర్జిస్తున్నారు. ఆయన అనుభవాల సారం ఆయన మాటల్లోనే.. ‘‘ప్రముఖ కంపెనీలో ముంబైలో ఉద్యోగం చేశాను. డీజీఎంగా బాధ్యతలు నిర్వహణ. ఐదేళ్ల క్రితం వీఆర్ఎస్ తీసుకుని హైదరాబాద్‌కు వచ్చేశాను. అప్పటికే ప్రకృతి సేద్యంపై ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ప్రకతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతుల్లో పాలొని మెళకువలు నేర్చుకున్నా. ఆచరణలో పెట్టేందుకు అమ్మమ్మ వాళ్ల ఊరైన కోలవెన్ను వచ్చి స్థిరపడ్డా. 4.5 ఎకరాల్లో తులసీబాణం, నారాయణ కామిని, నవారా, కాలాభట్, మార్టూరు సన్నాలు, రత్నచోడి, బహురూపి వంటి దేశీ వరి రకాలు సాగు చేస్తున్నా. రెండు ఆవులను తెచ్చుకున్నా. ఏటా సాగు ఆరంభంలో 40 ట్రక్కుల ఘన జీవామృతాన్ని పొలంలో చల్లుతున్నా. పంటకు అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. వర్రలతో బావిని కట్టించి 1200 లీటర్ల జీవామృతం తయారుచేసి 15 రోజులకోసారి చల్లుతున్నా. పంట ఆరోగ్యంగా ఎదుగుతున్నది. తెగుళ్ల బెడద లేదు. ఆవ పిండి చెక్క కూడా జీవామృతంలో కలిపి వాడుతున్నా. ఎకరాకు రూ. 25–30 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. 25–28 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తున్నది. పంటను ఆశించే పురుగు నివారణకు వేపపిండి చల్లుతాను. పోషకాలు జీవామతం ద్వారా అందుతాయి. మరీ అవసరం అయితే, అగ్ని అస్త్రం చల్లుతాను. ఎలాంటి పురుగైనా నాశనం అవుతుంది. దేశవాళీ విత్తన పంట నిల్వ, మార్కెటింగ్ విషయాలు చాలా ప్రధానమైనవి. పంట చేతికి వచ్చాక కనీసం 10 నెలల నుంచి రెండేళ్ల వరకూ పంటను మాగబెట్టిన ధాన్యాన్ని మిల్లులో ఆడించి నాణ్యమైన బియ్యాన్ని బెంగుళూరు, హైదరాబాద్, కొచ్చిన్, చెన్నై ప్రాంతాల్లో ఉన్న నేరుగా విక్రయిస్తున్నా. నవారా, కాలాభట్ స్థానికంగా కిలో రూ. 90కి, బయట ప్రాంతాలకు రూ. 120కే అందిస్తున్నా, రవాణా ఖర్చు కూడా కలిపి. ఇతర రకాల బియ్యం కిలో రూ.75కే ఇస్తున్నా. ప్రతి రైతూ ప్రకృతి విధానం వైపు అడుగులు వేస్తే దిగుబడులు, ఆరోగ్యం, ఆదాయం, భూసారం పెంపుదల సాధ్యమే. ప్రభుత్వం రైతు భరోసా, ఇతర సబ్సిడీలు అందిస్తున్నది. వీటితో పాటు ప్రకృతి విధానంలో పండించిన పంటకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ సదుపాయాలు విస్తరించి, అదనపు వసతులు కల్పిస్తే కొత్త రైతులు కూడా ఈ విధానంలోకి వచ్చేస్తారు.’’ – ఈ.శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, కృష్ణా జిల్లా వడ్లు ఎంత మాగితే అన్నం అంత ఒదుగుతుంది. ధాన్యం నిల్వ చేయకుండా తినటం వల్ల కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి. పంట నాణ్యంగా ఉంటే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అలాగే ప్రకృతి విధానం వల్ల భూసారం పెంపొందుతుందని గుర్తించాను. (క్లిక్: కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు! ఎలా తయారు చేసుకోవాలంటే!) – ఘట్రాజు వెంకటేశ్వరరావు (92255 25562), కోలవెన్ను -
లక్షల్లో వేతనాలు వదిలిన జంట.. ‘పంట’ భద్రులైంది!
ఆ దంపతులు ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆ అర్హతతో మెట్రో నగరాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందారు. లక్షల్లో వేతనాలు తీసుకుంటూ ఆనందమయమైన జీవితం గడుపుతూ వచ్చారు. అయితే వారి మదిలో ఓ వినూత్న ఆలోచన మెదిలింది. వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులను గమనించి తాము కూడా వ్యవసాయంలో ఏదో ఒక విజయాన్ని సాధించాలని భావించారు. అనుకున్నదే తడవుగా తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలి పల్లెబాట పట్టారు. పల్లెలో తమకున్న 25 ఎకరాల పొలంలో రకరకాల పంటలు సాగు చేస్తూ ఆదాయం ఆర్జించడమే గాక, అందరినీ అబ్బుర పరుస్తున్నారు. దాదాపు 30 ఆవులను సైతం పెంచుతూ ప్రకృతి వ్యవసాయంలో పరవశించిపోతున్నారు. భర్త చేస్తున్న వ్యవ‘సాయం’లో భార్య సైతం భాగస్వామి అవుతూ భర్తకు తోడునీడగా ఉంటోంది. సాక్షి, రాయచోటి : అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం గోపగుడిపల్లె పంచాయతీలోని నాగరాజుపల్లెకు చెందిన అశోక్‌రాజు, అపర్ణలు ఇంజినీరింగ్ పట్టభద్రులు. సుమారు పదేళ్లపాటు హైదరాబాదు, ఢిల్లీలోని పలు ప్రైవేటు కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేశారు. అశోక్‌కు నెలకు రూ. 1.20 లక్షల వరకు వేతనం వచ్చేది. అపర్ణకు రూ. 60–70 వేల వరకు వచ్చేది. ఎప్పటినుంచో వ్యవసాయంపై మక్కువ ఉన్న వారు సెలవు రోజుల్లో ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలను వెళ్లి పరిశీలించేవారు. ఈ క్రమంలోనే అందరి కంటే భిన్నంగా వ్యవసాయం చేయాలన్న తలంపు వారిలో మొదలైంది. అనుకున్నదే తడవుగా ఉన్న ఉద్యోగాలను వదిలేసి సొంతూరి వైపు నడిచారు. అమ్మానాన్నల సమక్షంలో ఉన్న 25 ఎకరాల పొలంలో రకరకాల పంటలను వేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. 30 ఆవులను పెంచుతున్నారు. అరుదైన పంటల సాగు ప్రస్తుతం అశోక్‌రాజు తనకున్న పొలంలో అరుదైన పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఐదేళ్ల క్రితం డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలను ఎకరాలో సాగు చేశారు. ఒక్కసారి మొక్కలు నాటితే 30 ఏళ్ల వరకు స్థిరమైన ఆదాయం ఉంటుందని భావించి మొక్కలను పెంచుతున్నారు. డ్రాగన్‌ఫ్రూట్స్ వంగడాలను థాయిలాండ్ (తైవాన్) నుంచి దిగుమతి చేసుకుని పొలంలో ఒక్కొక్క రాతి స్తంభానికి నాలుగు మొక్కలను నాటారు. తోటలో 350 రాతి స్తంభాలు అంటే 1500 డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి. రూ. 8 లక్షల వరకు డ్రాగన్ ఫ్రూట్స్ మీదనే ఖర్చు చేశారు. జూన్ నుంచి మొదలైతే డిసెంబరు వరకు ప్రతి 45 రోజులకు ఒక క్రాప్ వస్తూనే ఉంటుంది. కిలో రూ. 200 చొప్పున నెల్లూరు, హైదరాబాదు, తిరుపతి, మదనపల్లె, చిత్తూరు, పుత్తూరు, కడప ఇలా ఆర్డర్ల మీదనే సరఫరా చేస్తున్నారు. ఎవరికి అవసరమైనా బాక్సులో భద్రపరిచి బస్సుల ద్వారా రవాణా చేస్తున్నారు. నీరు లేకున్నా.. చెట్లు తట్టుకుని నిలబడతాయి. ఎప్పటికీ పంట కాస్తూనే ఉండడంతో మంచి ఆదాయం వస్తోంది. ఏడాదికి సుమారు 4–5 టన్నుల వరకు దిగుబడి వస్తుండగా, రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు టన్ను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం తోటలోని డ్రాగన్ ఫ్రూట్స్ అంట్లు తయారు చేసి ఒక్కొక్క మొక్క రూ. 80 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్క డ్రాగన్ ఫ్రూట్స్‌నే కాకుండా వరిలో కూడా వినూత్న వంగడాలు జీర సాబ, కుచిపటాలై, క్షేత్రాయ మహరాజ్, నవారు (షుగర్‌ను కంట్రోల్ చేసే వంగడంగా గుర్తింపు) లాంటివి సాగు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయంతోనే వేరుశనగ, మామిడి, నన్నారి సాగుకు కూడా శ్రీకారం చుట్టారు. చెరకు వేసి.. బెల్లం తీసి.. అశోక్‌రాజు దంపతులు ప్రకృతి వ్యవసాయంతో చెరకు పంటను పండిస్తున్నారు. సుమారు రెండు ఎకరాల్లో చెరకు పండించి తర్వాత రెండు నెలలపాటు కటింగ్ చేస్తూ వస్తారు. ప్రతిరోజు తోట సమీపంలోనే ఇంటి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గానుగ మిషన్ ద్వారా పాలు బయటికి తీసి పాకం పట్టి బెల్లం తయారు చేస్తున్నారు. రోజూ 200 కిలోలు చొప్పున తీస్తున్న బెల్లానికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు తయారు చేసిన బెల్లంను నేరుగా వచ్చి కొనుగోలు చేసి తీసుకు వెళుతున్నారు. వినూత్న పంటలతోపాటు వ్యవసాయంలోనూ తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న అశోక్‌రాజు దంపతులు 2021లో రైతు నేస్తం అవార్డును అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఆనందంగా ఉంది వ్యవసాయంలో చాలా సంతృప్తి ఉంది. అంతకంటే ఆరోగ్యం, ఆనందం కూడా ఉన్నాయి. అందుకే అందరి కోసం ప్రకృతి వ్యవసాయం ద్వారా రకరకాల పంటలను పండిస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్స్ ద్వారా ఇప్పటికే లక్షల్లో ఆదాయం వచ్చింది. ఆర్డర్ల మీద వాటిని పంపిస్తుంటాము. అలాగే చెరకు ద్వారా బెల్లం కూడా తయారు చేస్తున్నాము. వరిలో కూడా అద్భుతమైన వంగడాలను తీసుకొచ్చి పండిస్తున్నాం. ఈసారి కొత్తగా నన్నారి సాగు కూడా మొదలెట్టాం. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కంటే ప్రకృతి మధ్య చేసే వ్యవసాయంలో ఉన్న ఆనందమే వేరు. – ముప్పాళ్ల అశోక్‌రాజు, ప్రకృతి వ్యవసాయ రైతు, నాగరాజుపల్లె, రామాపురం మండలం -
వ్యవసాయంలో సదాశయం
పంటల సాగులో ఆయన ప్రత్యేకత చూపుతారు. రసాయన ఎరువులకు చాలా దూరంగా ఉంటారు. ప్రకృతి పద్ధతిలో..జీవ ఎరువులు ఎంతో మేలంటారు. శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తారు. అధిక దిగుబడులు సాధించేలా సాగులో మెలకువలు పాటిస్తారు. కొత్త వంగడాలపై దృష్టి సారించి.. సాగులో భళా అనిపిస్తారు. ఇతర రాష్రా ్టలకు విత్తనాలను అమ్మే స్థాయికి ఎదిగారు. చాలామంది రైతులు ఈయన వద్దకే వచ్చి వంగడాలు తీసుకెళుతుంటారు. ఆ ఆదర్శరైతే చాపాడు మండలానికి చెందిన 63 ఏళ్ల సదాశివారెడ్డి. ఆయన సాగు కృషిని మెచ్చి పలువురు సత్కరించారు. చాలా మంది రైతులు ఆయన మార్గంలో పయనిస్తున్నారు. ఆయన మాత్రం ప్రకృతికి ప్రణామం అంటారు. చాపాడు(వైఎస్సార్ జిల్లా): చాపాడు మండలం వి.రాజుపాళెం గ్రామానికి చెందిన లోమడ సదాశివారెడ్డి అనే రైతు తన 14 ఏట నుంచే తండ్రితో కలసి వ్యవసాయం చేస్తున్నాడు. ఏడో తరగతి చదువుకున్న ఈయన మొదటి నుంచి వ్యవసాయంలో కొత్త వంగడాలు.. అధిక దిగుబడులు లక్ష్యంగా సాగు చేస్తున్నాడు. తనకున్న ఐదకరాల్లో కొన్నేళ్ల క్రితం నుంచి ఉద్యాన పంటలు, ఆరుతడి పంటల సాగు చేస్తున్నాడు. 1992లో వ్యవసాయ పరిశోధన కేంద్రాల సహకారంతో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ.. తాను పండించిన వంగడాలను నేరుగా ప్రభుత్వానికే విక్రయిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆచార్య ఎన్జీ రంగా వరకూ.. 1992లో హైదరాబాదుకు చెందిన ఐపీఎం ప్రాజెక్టు వద్దకెళ్లి అక్కడి శాస్త్రవేత్తలతో వ్యవసాయంలో సలహాలు తీసుకున్న సదాశివారెడ్డి అప్పటి నుంచి మంచి దిగుబడులు తీస్తూ కొత్త వంగడాలతో వ్యవసాయం చేస్తున్నాడు. అప్పట్లోనే వేరుశనగపంటలో రసాయన ఎరువుల కంటే మిత్ర పురుగులు, కీటకాలు, పక్షుల వల్లనే పంటకు లబ్ధి చేకూరుతుందని పొలంలో వీటిని పెంపొందించటంపై ప్రత్యేక దృష్టి సారించారు. 1996లో ఐపీఎం తిరుపతిలోని ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వ్యవసాయ పరిశోధన కేంద్రం అనుసంధానంలో మూడేళ్ల పాటు అప్పటి వ్యవసాయ పరిశోధకులు జిల్లాలో పలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ సమయంలో రాజుపాళెంలోని సదాశివారెడ్డి పొలంలో కూడా పరిశోధనలు చేశారు. ఏటా నవంబరు నుంచి జనవరి వరకూ రైతులకు అందుబాటులో ఉంటూ వ్యవసాయంలో మెలకువలు, సూచనలు నేర్పించారు. పంటల సాగులో ఆముదం, ప్రొద్దుతిరుగుడు వంటి మొక్కలు అక్కడక్కడా ఉండేలా, వీటి తో పాటు ఎత్తుడి కొయ్యలను ఏర్పాటు చేసి వీటి మీద మిత్ర పురుగులు, కీటకా లు, పక్షులు ఉండేలా ఏర్పాటు చేసుకున్నారు. మినుము, వేరుశనగ ఇతర రాష్ట్రాలకు.. 2009 నుంచి 2013 వరకూ వేరుశనగ, మినుము పంటలతో పాటు పండ్లతోటల సాగు క్రమంలో సూరజ్, కోహినూరు, బావి వంటి పండ్లతోటలను, క్యాబేజీ, కాలీప్లవర్, బంతి పూలు వంటి వాటిని సాగు చేసి మంచి ఫలితాలు సాధించి డిల్లీ, ముంబయి ఇంకా పలు ప్రాంతాలకు ఎగుమతులు చేశాడు. ∙2017 నుంచి టీబీజీ104 రకం మినుము, టీసీజీఎస్1694 వంటి వేరుశనగ పంటలను పండిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రశాంతి సహకారంతో ఏటా 150 క్వింటాళ్ల మేర దిగుబడులు తీసి 30 క్వింటాళ్ల చొప్పున ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రానికి ఎగుమతి చేస్తూ ఇక్కడి ప్రాంత రైతులకు విక్రయిస్తున్నాడు. ఇంతే కాక తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని శ్రీకాకుళం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, తిరుపతి, నెల్లూరు ప్రాంతాలకు చెందిన రైతులు నేరుగా సదాశివారెడ్డి వద్దకు వచ్చి విత్తనాలు కొనుగోలు చేసి తీసుకెళతుంటారు. ∙ఇటీవల కడప ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు చంద్రిక, సునీల్‌కుమార్‌లు సాగులో ఉన్న వేరుశనగ పంటను పరిశీలించారు. ఏ పంట సాగు చేసినా డ్రిప్ విధానంలో సాగునీరు పెడుతూ, దాని ద్వారానే వేస్ట్ కంపోజ్ ఎరువు, కరిగే జీవ ఎరువులు, 13045 పోటాషియం సల్ఫేట్ వంటి ఎరువును పంటకు నీటి ద్వారా అందిస్తానని, వీటి కంటే ఎక్కువగా మిత్ర పురుగులు, కీటకాలు, పక్షుల ద్వారా పంటకు మేలు జరుగుతుందని సదాశివారెడ్డి తెలుపుతున్నాడు. జీవ ఎరువులు ఎంతో మేలు.. వ్యవసాయంలో రసాయన ఎరువులను నమ్ముకోవద్దని, జీవ ఎరువులు, ప్రకృతి వారసత్వంగా లభించే మిత్ర పురుగులు, కీటకాలు, పక్షుల వలన కూడా ఉపయోగం ఉంటుందని సదాశివారెడ్డి అంటున్నారు. పత్రికలు.. టీవీల్లో వచ్చే వ్యవసాయ కార్యక్రమాలు తన సాగుకు ఎంతో ఉపకరించాయని ఆయన అంటున్నారు. వరించిన వివిధ సత్కారాలు ఆదర్శ రైతు సదాశివారెడ్డి వ్యవసాయంలో సాధించిన విజయాల నేపథ్యంలో పలువురు సత్కరించారు. 1996, 97లో పురుగు మందులు లేని పంట దిగుబడులపై ఏపీఎం సత్కారం పొందాడు. 2002లో విత్తన ఉత్పత్తిపై అప్పటి జిల్లా కలెక్టర్ పరీధా చేతుల మీదుగా సన్మానం, 2010లో వేరుశనగ అధిక దిగుబడులపై డివిజనల్ వ్యవసాయ అధికారులతో సత్కారం పొందారు. 2017లో ప్రభుత్వ సంక్రాంతి సంబరాల్లో ఉత్తమ రైతుగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ సత్కారం పొందారు. గతేడాది ఎన్జీ రంగా యూనివర్సిటి వీసీ విష్ణువర్థన్‌రెడ్డి, వ్యవసాయ సీనియర్ శాస్త్రవేత్త ప్రశాంతి పంటలను పరిశీలన చేసి ఈ రైతును అభినందించారు. ఈ ఏడాది జూలై 8న వైఎస్సార్ జయంతి రైతు దినోత్సవం సందర్భంగా కడప ఊటుకూరు వ్యవసాయ కేంద్రంలో ఉత్తమ రైతుగా సత్కారం అందుకున్నాడు. -
సంప్రదాయ సేద్యం వైపు రైతులు..!
వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న నాణ్యతలు.. రైతులను సంప్రదాయ సేద్యంపై వైపు నడిపిస్తోంది. రసాయనిక ఎరువులు, పురుగు మందుల ధరలు కూడా ఏటా గణనీయంగా పెరుగుతున్నాయి. సహజ సిద్ధ పంట ఉత్పత్తులకు మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంది. సాగులో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండడంతో ఆ దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులకు లాభాసాటిగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం తోడ్పాటును అందిస్తోంది. దీంతో ఏటా జిల్లాలో ప్రకృతి సేద్యం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఆత్మకూరురూరల్: రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా దశాబ్దకాలంగా సేంద్రియ ఎరువులతో ప్రకృతి వ్యవసాయం సాగిస్తున్న మెట్ట రైతులు పంటల దిగుబడిలోనే గాకుండా తమ భూములను సారవంతం చేస్తూ వ్యవసాయ రంగంలో స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారు. జిల్లాలోని ఆత్మకూరు మండలం మహిమలూరులో తొలుత సహజ సేద్యం ప్రారంభమైంది. గడిచిన ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో జిల్లాలో ప్రతి మండలంలోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. గోమూత్రం, వివిధ రకాల చెట్ల ఆకులు తదితరాల మిశ్రమాన్ని మగ్గబెట్టడం ద్వారా తయారయ్యే కషాయాలను పంటలకు తగు మోతాదులో అందజేస్తూ ఆశించిన ఫలితాలు రాబడుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరుగుతున్న సాగు విస్తీర్ణం ప్రకృతి వ్యవసాయంపై ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టడంతో జిల్లాలోని రైతులు అన్ని మండలాల్లో ఈ విధానానికి ఆకర్షితులయ్యారు. ఒక్కో మండలంలో ప్రకృతి వ్యవసాయ ప్రధాన గ్రామాన్ని ఎంపిక చేసి సాగును ప్రారంభించారు. తొలి విడతలో 26గ్రామాలు, 2వ విడతలో 14, 3వ విడతలో 20, 4వ విడతలో 46, ఐదో విడతలో 22 ప్రకృతి వ్యవసాయ అధ్యాయన గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టారు. జిల్లాలో మరో 27 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేసేందుకు ప్రాథమిక ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారు. ఏడో విడతలో జర్మనీ నిధులతో ప్రత్యేక ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పలు రకాల పంటల సాగు ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, పిండి పదార్థాలు తదితర రకాలను అంతర పంటలుగా మిశ్రమ పంటలుగా రైతులు సాగు చేస్తున్నారు. భూమిని పచ్చగా ఉంచడం ద్వారా భూసారాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చనే మూల సిద్ధాంతాన్ని రైతులు ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. పత్తి, వరి, మామిడి, మినుములు, పెసర, తదితర పంటల సాగుతో పాటు 9 నుంచి 18 రకాలను ఏకకాలంలో పీఎండీఎస్ (ప్రీ మాన్సోన్ డ్రై సోయింగ్) విధానంలో పంటల సాగు చేపట్టడం ద్వారా పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. మిశ్రమ పంటలతో మెరుగైన ఫలితాలు ప్రకృతి వ్యవసాయ పద్ధతు మిశ్రమ పంటలు సాగు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం. ఆరోగ్యకరమైన ఉత్పత్తులతో పాటు భూమి సేంద్రియ పద్ధతుల్లో సారవంతం చేసుకోవడానికి ప్రకృతి వ్యవసాయం బలమైన చేయూతనిస్తోంది. అనవసర వ్యయాన్ని తగ్గించుకొని స్థిరమైన ఆదాయం పొందగలుగుతున్నాం. – ఇరగన శ్రీనివాసులు, రైతు, మహిమలూరు, ఆత్మకూరు మండలం ఖర్చులు సగానికి పైగా తగ్గింపు ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటల సాగులో రైతులకు అయ్యే ఖర్చులను సగానికిపైగా తగ్గించగలుగుతున్నాం. ఈ పద్ధతిలో ఉత్పత్తి అయిన వరి, మినుము, పెసర, కూరగాయలు, రకరకాల పండ్లు, ఇప్పటి వరకు స్థానిక రైతులతో పాటు వ్యాపారులు, ఉద్యోగులు వినియోగిస్తున్నారు. ఆయా పంట ఉత్పత్తులకు తగు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నాం. – చంద్రశేఖర్, ఎస్డీఏ (సబ్ డివిజన్ యాంకర్), ఆత్మకూరు అంతర్ పంటల సాగుతో ఆదాయం మా పొలాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి, పత్తి ప్రధాన పంటలుగా సాగు చేస్తున్నాం. అధికారుల సూచనలతో 18 రకాల చిరుధాన్యాలు, పచ్చిరొట్ట విత్తనాలు అంతర్ పంటలుగా సాగు చేసి ఆదాయం పొందుతున్నాం. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధిస్తున్నాం. – చిరుమామిళ్ల రాధమ్మ, మహిళా రైతు, బసవరాజుపాళెం, ఆత్మకూరు మండలం జీవామృతంతో మేలైన విత్తన శుద్ధి ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్లో తయారు చేస్తున్న జీవామృతంతో మేలైన విత్తనశుద్ధి ద్వారా పంట దిగుబడిలో ఆశాజనకమైన ఉత్పత్తులు పొందుతున్నాం. మేము సాగు చేసిన పత్తి పైరులో 15 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతం పిచికారీ చేస్తున్నాం. పిండినల్లి, రసం పీల్చు పురుగు వంటి నివారణ కోసం నీమాస్త్రం, ఇంగువ ద్రావణం పిచికారీ చేసి సత్ఫలితాలు పొందుతున్నాం. – గాలి విజయలక్ష్మి, మహిళా రైతు, బసవరాజుపాళెం, ఆత్మకూరు మండలం -
సాగులో ఏపీ విధానాలు సూపర్.. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయ రంగంలో ఏపీప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)పై మంగళవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలసి ఆయన మాట్లాడారు. వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ ఇన్చార్జి కమిషనర్ శేఖర్‌బాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ–క్రాప్ దేశంలోనే వినూత్నం: తోమర్ ‘వ్యవసాయం బాగుండి రైతుల ఆదాయం పెరిగితే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఆ దిశగా మీ (సీఎం జగన్) ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. వ్యవసాయ రంగంలో మీరు తెచ్చిన సంస్కరణలు విప్లవాత్మకం. ఏపీలో అమలు చేస్తున్న ఈ–క్రాప్ విధానం దేశంలోనే ఒక వినూత్న ప్రక్రియ. ఇది రైతులకు ఏ స్థాయిలో మేలు చేస్తుందో తెలుసుకుని ఆశ్చర్యపోయా. ప్రకృతి సేద్యం, అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కార్యక్రమాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తిగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. విజయవంతంగా అమలవుతున్న ఒక గొప్ప కార్యక్రమాన్ని దేశమంతా అమలు చేయడం అవసరం. వాటి ఫలాలను రైతులందరికీ అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. త్వరలోనే రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రుల సమావేశాన్ని నిర్వహించి ఈ–క్రాప్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న వినూత్న పథకాలు, కార్యక్రమాలను వివరిస్తాం. వాటిని ఆయా రాష్ట్రాల్లో అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటాం. సీఎం జగన్ సూచనలను స్వీకరిస్తున్నాం.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) రైతులకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం వాటిల్లిన సమయంలో ఎంతో అండగా ఉంటుంది. రైతుల ప్రయోజనాల కోసం కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు అన్ని రాష్ట్రాలు చేరాయి. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు వైదొలిగాయి. లోటుపాట్లను అధిగమిస్తూ ముందుకెళ్తేనే రైతులకు మరింత మేలు జరుగుతుంది. ఏపీలో కేంద్ర బృందం పర్యటన సందర్భంగా సీఎం జగన్ చేసిన సూచనల మేరకు మార్పులు చేస్తున్నాం. ఈ–క్రాప్ వివరాలతో బీమా పథకాన్ని అనుసంధానిస్తాం. ఈ మేరకు మార్గదర్శకాలు సవరించాం. పీఎంఎఫ్‌బీవైలో భాగస్వామ్యం అవుతున్నందుకు ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన సూచనలు కూడా స్వీకరిస్తాం. చెరిసగం భరిస్తే మరింత మేలు: సీఎం జగన్ ఫసల్ బీమా యోజన పథకాన్ని అందరికీ వర్తింప చేయాలంటే విధానపరంగా మార్పులు తేవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కేంద్రమంత్రితో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలున్నాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ కార్యక్రమాలన్నీ ఆర్బీకేల పరిధిలో జరుగుతున్నాయి. గ్రామ సచివాలయాలతో కలిసి ఇవి పనిచేస్తున్నాయి. ఇక్కడ వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశు సంవర్ధక, మత్స్య అసిస్టెంట్లతో పాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్లు సేవలందిస్తున్నారు. రైతులు సాగుచేసిన ప్రతి పంటను జియో ట్యాగింగ్‌తో ఇ–క్రాప్ చేస్తున్నాం. ప్రతి పంటను బీమా పరిధిలోకి తెచ్చేలా అడ్డంకులను తొలగించాం. పటిష్ట వ్యవస్థ ద్వారా డేటా సేకరిస్తున్నాం. ఈ–క్రాప్ డేటా ఆధారంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. రైతులు కట్టాల్సిన ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. మూడింట రెండొంతుల ప్రీమియం మొత్తాన్ని రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. పంటల బీమాలో యూనివర్సల్ కవరేజీ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. సన్న, చిన్నకారు రైతుల తరఫున చెల్లించాల్సిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తే మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. రైతులకు ఇంకా మేలు జరుగుతుంది. ఇందుకోసం ఈ–క్రాప్ డేటాను వినియోగించుకోవాలి. కొన్ని రాష్ట్రాలు ఫసల్ బీమా యోజనలో ఎందుకు లేవన్న అంశంపై దృష్టి సారించి సమస్యల పరిష్కారంతో పాటు మేం సూచించిన మార్పులు చేర్పులు చేసేందుకు ముందుకొచ్చిన కేంద్ర మంత్రి తోమర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. -
విత్తన్నం నుంచి విక్రయం వరకూ ప్రభుత్వమే..
-
రైతుల అభ్యున్నతికి మరో ముందడుగు
-
సీఎం జగన్ గొప్ప చొరవ తీసుకున్నారు: నీలం పటేల్
-
ఈ కంపెనీకి ప్రభుత్వం అండగా ఉంటుంది
-
సహజ సేద్యం.. భలే లాభం
సాక్షి, అమరావతి: సహజ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఇటీవల వెల్లడించిన నీతి ఆయోగ్ రాష్ట్రంలో ఆ తరహా సేద్యం చేస్తున్న రైతుల అభిప్రాయాలను సేకరించింది. సంప్రదాయ సాగు పద్ధతుల్లో కన్నా సహజ సేద్యంవల్ల రైతులకు అధిక లాభాలు వస్తున్నాయని, ఇదే సమయంలో వారికి పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతోందని తెలిపింది. అయితే.. మొదట్లో ఒకట్రెండేళ్లు దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ ఆ తర్వాత నుంచి దిగుబడులు పెరుగుతున్నాయన్న అభిప్రాయం రైతుల్లో నెలకొంది. ఈ విషయాన్ని రైతుల మాటల్లో నీతి ఆయోగ్ గమనించింది కూడా. అలాగే, రసాయన ఎరువులకు బదులు సాంకేతిక సహజ ఇన్పుట్స్ వినియోగంతో ఆరోగ్య సమస్యలు తలెత్తకపోగా పర్యావరణ హితానికీ దోహదపడుతోందని వెల్లడించింది. సంప్రదాయ సాగు విధానంలో ఎకరా విస్తీర్ణంలో వరి సాగుచేస్తే సగటున రసాయన ఎరువుల ఇన్పుట్స్ వ్యయం రూ.5,961 అవుతోందని.. అదే సహజ సేద్యంలో కేవలం రూ.846 మాత్రమే అవుతోందని నీతి ఆయోగ్ పేర్కొంది. మరోవైపు.. సహజ సేద్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అనుసరిస్తున్న రైతుల అనుభవాలను నీతి ఆయోగ్ క్రోడీకరించి విస్త్రృత ప్రచారం కల్పిస్తోంది. ‘సహజం’తో దిగుబడి.. ధర అధికం ఇక సంప్రదాయ సాగుతో పోలిస్తే సహజ సేద్యం పద్ధతుల్లో పెట్టుబడి వ్యయం బాగా తగ్గుతుందని నారాయణమూర్తి ‘సాక్షి’కి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► సహజ సేద్యంలో కొంత ఎక్కువ శ్రమచేయాల్సి ఉంటుంది. ► ఆవు మూత్రంతో పాటు బెల్లం, పప్పుల పిండి, పుట్ట మన్ను, అవు పేడతో ఎరువు చేస్తా. ► పురుగు చేరకుండా వేప, జిల్లేడు, తదితర ఐదు రకాల ఆకులతో కాషాయం తయారుచేసి ప్రతీ 15 రోజులకోసారి పిచకారి చేస్తా. ► దీనికి కొంత శ్రమ తప్ప ఖర్చు పెద్దగా కాదు. ► సహజ సేద్యం ద్వారా దిగుబడి పెరగడంతో పాటు పంటకు ఎక్కువ ధర వస్తోంది. ఈ విధానం ద్వారా పండించిన 75 కేజీల ధాన్యం బస్తా రూ.2,000 పలుకుతోంది. ► సహజ సేద్యం ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇస్తే మరింత లాభాలు వస్తాయి. ► అలాగే, పొలంలో వానపాముల సంఖ్య పెరిగింది. ► నీటిని నిలుపుకునే సామర్థ్యం పెరగడంతో నేల మెత్తగా మారింది. ► ఇదే పొలంలో నువ్వులు, పిల్లిపెసర, మినుములు, జనుము కూడా సాగుచేస్తున్నా. ► రసాయనాల వినియోగాన్ని తగ్గించేందుకు పరిసరాల్లోని రైతులను కూడా సహజ సేద్యం వైపు ప్రోత్సహిస్తున్నా. మరోవైపు.. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం, నాగమంగళం గ్రామానికి చెందిన ఎ. వెంకట సుగుణమ్మ సహజ సేద్యం పద్ధతుల్లో 0.4 హెక్టార్లలో వరి పండిస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు తగ్గిందని, రసాయన రహిత ఆహారం లభిస్తోందని ఆమె పేర్కొంటోంది. తెగుళ్లు, వ్యాధులు సోకడం తగ్గిందని, పొలంలో వానపాముల సంఖ్య పెరగడంవల్ల భూసారం పెరిగినట్లు ఆమె తెలిపింది. విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం పి. కొత్తగూడెం గ్రామానికి చెందిన ఎ. నారాయణమూర్తి సహజ సేద్యంచేస్తూ సంప్రదాయ సాగు విధానాల కన్నా ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ విధానంలో ఆయన ఒక హెక్టార్లో వరి పండిస్తున్నారు. దీంతో సంప్రదాయ సాగు విధానంలో కన్నా హెక్టార్‌కు అదనంగా రూ. 30,520 లాభం వస్తోంది. రసాయన ఎరువులు, పురుగు మందులకు బదులు సహజ జీవామృతం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వంటి అన్ని సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరించారు. ప్రతి 15 రోజులకోసారి ద్రవ జీవామృతాన్ని పిచికారీ చేశారు. ఫలితంగా.. సంప్రదాయ వరి సాగుకన్నా సహజ సేద్యంతో హెక్టార్‌కు 16.05 క్వింటాళ్ల ధాన్యం అధిక దిగుబడి వచ్చింది. -
ఎరువుల వెతలకు శాశ్వత పరిష్కారం!
యుద్ధం, కోవిడ్... విధ్వంసంతో పాటు సరికొత్త అవకాశాలనూ వెంట తెచ్చాయి. కోవిడ్ మహమ్మారి రోగ నిరోధక శక్తినిచ్చే ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తుల ఆవశ్యకతను జనబాహుళ్యం గుర్తెరిగేలా చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సృష్టిస్తున్న సంక్షోభం వల్ల భరించలేనంతగా పెరుగుతున్న రసాయనిక ఎరువుల ధరలు సేంద్రియ ప్రత్యామ్నాయాలకున్న ప్రాధాన్యాన్ని పెంచాయి. ప్రకృతి వ్యవసాయ వ్యాప్తిపై మరింతగా దృష్టిని కేంద్రీకరించేలా పాలకులనూ, రైతులనూ పురికొల్పుతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగు మందులను పూర్తిగా పక్కన పెడితే పంట దిగుబడులు కుదేలై ఆహార భద్రతకు ముప్పు వస్తుందనే భయాందోళనలకు ఇప్పుడు తావు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఏళ్లుగా అమల్లో ఉన్న ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయ అనుభవాలే ఇందుకు ప్రబల నిదర్శనాలు. ప్రకృతి వ్యవసాయ విస్తరణకు గ్రామస్థాయిలో మద్దతు వ్యవస్థలను నెలకొల్పటం ద్వారా నిర్మాణాత్మక కృషి చేస్తే... ప్రతి రైతునూ ప్రకృతి వ్యవసాయం వైపు దశలవారీగా మళ్లించటం... ఖర్చులు తగ్గించుకుంటూ సంతృప్తికరమైన దిగుబడులు సాధించడం సుసాధ్యమేనని ఆంధ్రప్రదేశ్ అనుభవాలపై థర్డ్ పార్టీ అధ్యయనాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. సుసంపన్నమైన ఈ అనుభవాలు మనకే కాదు ప్రపంచ దేశాలకూ గొప్ప ఆశాకిరణంగా కనిపిస్తున్నాయని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) వంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలే చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు ధరలు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ప్రతి ఆర్నెల్లకూ రెట్టింపయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. రసాయనిక ఎరువుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతున్నకొద్దీ కేంద్ర ప్రభుత్వం ఎరువులపై ఇస్తున్న రాయితీని కూడా తగ్గిస్తోంది. అంతిమంగా రైతుకు ఎరువులు మోయలేని భారంగా మారి పోతున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఇప్పటికే తడిసి మోపెడైంది. 2020–21లో రూ. 1,27,921 కోట్లుండగా, 2021–22 నాటికి రూ. 1,40,122 కోట్లకు చేరింది. ఈ సంవత్సరం ఇది ఇంకా పెరుగుతుంది. రసాయనిక ఎరువుల ధరలు విపరీతంగా పెరగడమే కాదు, లభ్యత కూడా తగ్గిపోతున్నందున... అవసరానికి మించి రసాయనిక ఎరువుల వాడకాన్ని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. దీనితోపాటు, రసాయనికేతర సుస్థిర ప్రత్యామ్నాయాల వైపు వెళ్లటమే శాశ్వత పరిష్కారం. ఆంధ్రప్రదేశ్‌లో రసాయనిక ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రకృతి వ్యవసాయ విస్తరణ వల్లనే ఇది సాధ్యమవుతోంది. ప్రకృతి సేద్యం విస్తారంగా సాగులో ఉన్న కర్నూలు జిల్లాలో 2020–21తో పోలిస్తే 1,25,427 టన్నుల ఎరువుల వాడకం తగ్గింది. ఏపీలో 2020–21లో 42.26 లక్షల మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువుల వినియోగం జరిగింది. 2021–22 నాటికి ఇది 36.22 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గింది. (చదవండి: వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం) రసాయనాల విచ్చలవిడి వాడకం సహా అస్థిర వ్యవసాయ పద్ధతుల వల్ల భూమి ఉత్పాదక శక్తిని కోల్పోతున్నది. ఇప్పటికే 35% సాగు భూమి నిస్సారమై ఎడారిగా మారిపోయింది. 2045 నాటికి 13.5 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణ వల్ల సొంత భూములను వదిలి పొట్ట చేతపట్టుకొని వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. (చదవండి: ప్రపంచ ఆహార భద్రతకు ప్రమాదం) వ్యవసాయం... ప్రకృతి వనరులపైన ఆధార పడిన జీవనోపాధి. అది ప్రకృతి వనరులను, పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే ప్రకృతి వనరులు, పర్యావరణం తిరిగి వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన దేశంలో సగానికి పైగా ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయం మీద ఆధారపడి వున్నారు. కాబట్టి, పర్యావరణంలో వస్తున్న మార్పుల్ని తట్టుకునే దిశగా వ్యవసాయం మారాల్సిన అవసరం వుంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని దశల వారీగా విస్తరింపజేయడం ద్వారా మాత్రమే భవిష్యత్తులో పెరిగే జనాభాకు సైతం ఆహార భద్రతన్విగలుగుతాం. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్ -
కలర్ 'రైస్'.. పోషకాలు 'నైస్'
చింతలూరి సన్నాలు.. తెల్లని బియ్యం రకాలు. సైజు చిన్నగా ఉండే వాటిని చిట్టిముత్యాలు అంటున్నారు. నలుపు రంగులో ఉంటే బ్లాక్ బర్మా.. డెహ్రడూన్ బ్లాక్, కాలాభట్టి అని పిలుస్తున్నారు. ఎర్ర రంగులో ఉంటే రక్తశాలి అని పిలుచుకుంటున్నారు. ఇంకా నారాయణ కామిని.. కూజీ పటాలియా.. ఇంద్రాణి.. రత్నచోడి అనే దేశీయ వరి రకాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రంగుల బియ్యాలు సంపూర్ణ పోషకాలనిస్తూ యాంటీ యాక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉంటాయని చెబుతున్నారు. క్యాన్సర్‌ను నిరోధించే గుణం వీటికి ఉందని కూడా ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం: బ్లాక్ బర్మా.. డెహ్రాడూన్ బ్లాక్.. కాలాభట్టి.. రక్తశాలి.. నారాయణ కామిని.. కూజీ పటాలియా.. ఇంద్రాణి.. రత్నచోడి.. చిట్టిముత్యాలు. ఈ పేర్లు ఇప్పుడు తారకమంత్రంగా మారాయి. దేశీయ వరి రకాలుగా పండిస్తున్న ఈ రంగుల బియ్యం తింటే వైద్యుని అవసరం ఉండదట. మనిషిని నిలువునా కుంగదీసే మధుమేహానికి ఈ బియ్యంతో చెక్ పెట్టవచ్చు. మోకాళ్లు, కీళ్ల నొప్పులకు చరమగీతం పాడవచ్చు. ఐరన్, జింక్, కాల్షియం, కాపర్ వంటివి శరీరానికి అందడంతోపాటు, రక్తపుష్టికి ఈ బియ్యమే రాచమార్గంగా చెబుతున్నారు. జీరో ఫార్మింగ్ (పెట్టుబడిలేని వ్యవసాయం)ను రైతులు అందిపుచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం దేశీయ వరి రకాలను పండించే దిశగా రైతులను కార్యోన్ముఖులను చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ సంఘ నిర్వాహక ప్రకృతి విభాగం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పైన పేర్కొన్న రకాల వరిని పండించే విస్తీర్ణం 300 ఎకరాలకు పైగా చేరింది. కలర్ రైస్ లాభాలు అదుర్స్.. పోషకాలు బోనస్ అన్నట్టుగా సాగుతున్న ఈ సేద్యం వైపు పలువురు ఆకర్షితులవుతున్నారు. పంటను బియ్యంగా మార్చి మార్కెట్‌ను అందిపుచ్చుకుంటున్నారు. పురాతన రకాలివి వరిలో పురాతన కాలం నాటి దేశీయ రకాలు దాదాపుగా మూలనపడ్డాయి. అధిక దిగుబడులనిచ్చే ఆధునిక వంగడాల వైపు రైతులు మళ్లడంతో దేశీయ రకాలు కనుమరుగయ్యాయి. ప్రకృతి వ్యవసాయం పుణ్యమా అని కొందరు అభ్యుదయ రైతుల కృషితో పురాతన వరి రకాలు ఊపిరి పోసుకుంటున్నాయి. వినియోగదారులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతూ.. రైతులను రారాజుగా మారుస్తున్నాయి. సుఖవంతమైన జీవితం, తగ్గిన వ్యాయామం నేపథ్యంలో శరీరం రోగాలకు ఆలవాలంగా మారింది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడితో పనిలేని ప్రకృతి వ్యవసాయం (జీరో ఫార్మింగ్) పేరిట తిరిగి దేశీయ వరి రకాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇవన్నీ పోషకాలను అందిస్తూ యాంటీ యాక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ కారకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ రకాలను తింటే జీర్ణవ్యవస్థకు ఇబ్బంది ఉండదని ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రకాలు మేలు జీరో ఫార్మింగ్‌తో దేశీయ వరి రకాలను రైతులు పండిస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ రకాల్లో పిండి పదార్థం తక్కువగా, పీచుపదార్థం అధికంగా ఉండటంతో జీర్ణం బాగుంటుంది. ఈ రకాల్లో గ్లైసమిక్ యాసిడ్ ఇండెక్స్ ఎక్కువ. యాంథోసైనిన్ అమినో ఆమ్లాల కారణంగా బియ్యంపై రంగుల పొరలు ఏర్పడతాయి. నల్ల బియ్యం రకంలో వరి కంకులు కూడా నల్లగా ఉంటాయి. ఈ రకం బియ్యం తినడం వల్ల ఐరన్, జింక్, కాల్షియం, కాపర్ అందుతాయి. పోషకాలు ఎక్కువ. మ«ధుమేహ రోగులకు ఈ రకం మేలు చేస్తుంది. యాంటీ యాక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ కారకాలుగా కూడా ఈ బియ్యం ఉపయోగపడతాయి. రక్తపుష్టికి రక్తశాలి రకం, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నివారణకు నారాయణ కామిని రకాల బియ్యం వినియోగిస్తే మేలు. జిల్లాలో 300 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ రకాలు సాగవుతున్నాయి. – నూకరాజు, జిల్లా అధికారి, ప్రకృతి వ్యవసాయ విభాగం ఎకరాకు రూ.90 వేల ఆదాయం జీరో ఫార్మింగ్‌తో దేశీయ వరి రకాలను పండించడం వల్ల ఎకరాకు రూ.90 వేల వరకు ఆదాయం వస్తోంది. ఎకరాకు అన్నిరకాల ఖర్చులు కలిసి రూ.18 వేలు అవుతుంది. ఎకరాకు 18 బస్తాల దిగుబడి వస్తుంది. బస్తా ధర రూ.6 వేల వరకు ఉంది. మొత్తం వచ్చే ఆదాయం రూ.1.08లక్షలు కాగా ఖర్చులు పోను రూ.90 వేలు మిగులుతుంది. ఆన్లైన్ మార్కెట్‌ను అందిపుచ్చుకుంటే మరింతగా ఆదాయం పొందవచ్చు. 120 రోజుల్లో కోతకు వచ్చే దేశీయ రకాలు పండించడానికి ఘన జీవామృతం, జీవామృతం, వేపపిండి, ఆముదం పిండి, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, పంచగవ్య వాడతాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి, పొగాకు, శీతాఫలం ఆకులు, కానుగ, జిల్లేడు, వేప, ఆవు పేడ, ఆవు నెయ్యి, అరటి పండ్లు, ఆవు పెరుగు, కల్లు వంటివి ఈ పంట కోసం వినియోగిస్తాం. ఏడాదిగా సాగు చేస్తున్నాం. ఆదాయం బాగుంది. మండలంలో కొన్నిచోట్ల ఈ దేశీయ వరి రకాలను కొందరు సాగు చేస్తున్నారు. ఈ రకాల బియ్యం కిలో మార్కెట్ డిమాండ్ ఆధారంగా రూ.120 నుంచి రూ.200 ధర పలుకుతున్నాయి. – మరిడి నాగకృష్ణ, రైతు, వెంకట్రామన్నగూడెం -
వెంకన్న లడ్డూకు‘అనంత’ పప్పుశనగ
అనంతపురం అగ్రికల్చర్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ప్రతిఒక్కరూ పరమపవిత్రంగా భావిస్తారు. అంతటి మహిమాన్వితమైన లడ్డూ తయారీకి అవసరమైన పదార్ధాల్లో చక్కెర, నెయ్యితో పాటు శనగపిండి కూడా ముఖ్యమైనది. ఇప్పుడా శనగపిండికి అవసరమైన పప్పుశనగను అనంతపురం జిల్లా నుంచి పంపిస్తున్నారు. అంటే లడ్డూ తయారీలో అక్కడి రైతులు పండిస్తున్న పప్పుశనగకు భాగస్వామ్యం దక్కుతోంది. పూర్తిగా ప్రకృతి సిద్ధంగా సాగుచేసిన పంటను సేకరించడానికి టీటీడీ సైతం చర్యలు చేపట్టింది. ప్రకృతి వ్యవసాయ విభాగం (జెడ్బీఎన్ఎఫ్) డీపీఎం లక్ష్మానాయక్ సహకారంతో ఈనెలాఖరున అవసరమైన పప్పుశనగను వెంకన్న సన్నిధికి చేర్చేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. 1,396 క్వింటాళ్లకు టీటీడీ ఆర్డర్ జెడ్బీఎన్ఎఫ్ విభాగం ఆధ్వర్యంలో తాడిపత్రి మండలం బొందలదిన్నె గ్రామంలో 57 మంది రైతులు సహజ పద్ధతుల్లో సాగుచేసిన 185 ఎకరాల్లోని దిగుబడి ఆధారంగా 1,396 క్వింటాళ్ల పప్పుశనగకు ఇటీవల టీటీడీ నుంచి ఆర్డర్ వచ్చినట్లు డీపీఎం లక్ష్మానాయక్ ‘సాక్షి’కి తెలిపారు. ఇక్కడి రైతులు ఎకరాకు 400 కిలోలు ఘన జీవామృతం, బీజామృతంతో విత్తనశుద్ధి, ప్రతి 20 రోజులకోసారి జీవామృతాన్ని పిచికారీ చేసి పప్పుశనగ పండిస్తున్నారని తెలిపారు. ఎక్కడా రసాయనాలు, పురుగు మందులు లేకుండా పూర్తిగా ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి లాంటి వాటితో తయారుచేసిన ప్రకృతి సిద్ధమైన సేంద్రియ పోషకాలు వాడుతున్నారన్నారు. పప్పుశనగలో అంతర పంటలుగా సజ్జ, అనుము, అలసందతో పాటు ఆవాలు కూడా వేశారన్నారు. అందువల్లే ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు నాణ్యమైన పప్పుశనగ దిగుబడులు వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఈనెలాఖరున పంట తొలగించి నూర్పిడి చేసిన తర్వాత 1,396 క్వింటాళ్లు టీటీడీకి పంపించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధర కన్నా 20 శాతం అధికంగా రైతులకు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. క్వింటా ఎంతలేదన్నా రూ.7 వేలకు తక్కువ కాకుండా పలికే అవకాశం ఉందన్నారు. తిరుమల వెంకన్న ప్రసాదం తయారీకి తాము పండించిన పప్పుశనగ వినియోగించనుండటంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారని డీపీఎం లక్ష్మానాయక్ వెల్లడించారు. -
ప్రకృతి వ్యవసాయంతో లాభాల పంట
-
సేంద్రియ విధానం... కొత్త పురుగు.. పరుగో పరుగు
పిఠాపురం: ‘త్రిప్స్ పార్విస్పైనస్’.. ఇండోనేషియా నుంచి వచ్చిన కొత్త రకం తామర పురుగు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో విధ్వంసం సృష్టిస్తోంది. రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మిరప, మామిడి, చింత, పత్తి, మునగ, దోస, సొర, క్యాప్సికమ్, బంతి, చామంతి వంటి ఉద్యాన పంటలను చిదిమేస్తోంది. ఈ పురుగు ఉధృతిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ పరిశోధనా సంస్థలు రంగంలోకి దిగి అధ్యయనం చేపట్టాయి. కాగా, ఈ కొత్త పురుగును తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ రైతులు సేంద్రియ విధానాలతో కట్టడి చేస్తున్నారు. గ్రామంలో 650 ఎకరాల్లో మిరప సాగు చేయగా.. సేంద్రియ పద్ధతులు పాటించిన 80 ఎకరాల్లో మిరప చేను కొత్త పురుగును తట్టుకుని నిలబడింది. దీంతో మిగిలిన రైతులు కూడా సేంద్రియ మందుల వాడకం ప్రారంభించి సత్ఫలితాలు సాధిస్తున్నారు. కుళ్లిన ఉల్లితో కషాయం దుర్గాడ గ్రామంలో కొంత విస్తీర్ణంలో ఉల్లి కూడా పండిస్తుంటారు. ఉల్లి కుళ్లి పోతే పనికి రాదని పారేసేవారు. ఇప్పుడు ఆ కుళ్లిన ఉల్లి మరో పంటకు ప్రాణం పోస్తోంది. కుళ్లిన ఉల్లితో రైతులు కషాయం తయారు చేస్తున్నారు. 70 కేజీల ఉల్లి, 20 కేజీల వేపాకు, 20 కేజీల సీతాఫలం ఆకు, 70 లీటర్ల దేశవాళీ ఆవు మూత్రం, 5 కేజీల ఉమ్మెత్త ఆకు, 4 లీటర్ల నీరు కలిపి 4 గంటలు ఉడకబెట్టి జీవామృతం తయారు చేస్తున్నారు. దీనినుంచి సుమారు 100 నుంచి 110 లీటర్ల జీవామృతం తయారవుతుండగా.. ఎకరానికి 6 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటితో కలిపి మిరప పంటపై పిచికారీ చేస్తుంటే కొత్త పురుగుతోపాటు ఇతర పురుగులు సైతం చనిపోతున్నట్టు రైతులు చెబుతున్నారు. దీనిని వారానికి ఒకసారి చొప్పున మూడు వారాలపాటు పంటకు పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల కొత్త తామర పురుగు పూర్తిగా పోతోందని, దెబ్బతిన్న పంట కూడా తిరిగి ఊపిరి పోసుకుంటోందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. నాలుగో వారంలో పులియబెట్టిన మజ్జిగ పిచికారీ చేస్తున్నామని, దీనివల్ల పంటకు చల్లదనం వస్తుందని చెబుతున్నారు. దేశవాళీ ఆవు పాలతో తయారైన మజ్జిగ మాత్రమే ఇందుకు ఉపయోగపడుతుందంటున్నారు. కాగా, ఉల్లి కషాయాన్ని పొరుగు రైతులకు లీటరు రూ.30 చొప్పున అమ్ముతున్నారు. కుళ్లిన చేపలతో మీనామృతం మరోవైపు ఇతర చీడపీడల నుంచి రక్షించుకునేందుకు మీనామృతాన్ని ఇక్కడి రైతులు వినియోగిస్తున్నారు. పిండినల్లి, పూత రాలడం వంటి సమస్యకు కుళ్లిన చేపలతో మీనామృతం తయారు చేస్తున్నారు. 70 కేజీల కుళ్లిన చేపలు, 70 కేజీల పాత బెల్లం, 70 లీటర్ల నీరు కలిపి 21 రోజులు ఊరబెడుతున్నారు. ఊరిన తరువాత 10 లీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల మీనామృతం చొప్పున కలిపి పిచికారీ చేస్తున్నారు. మీనామృతంను లీటరు రూ.100కు విక్రయిస్తున్నారు. అల్లం, వెల్లుల్లితో అగ్ని అస్త్రం మరోవైపు రసం తొలిచే పురుగు, గొంగళి పురుగు, కాయ తొలిచే పురుగుల నుంచి కాపాడుకునేందుకు అల్లం, వెల్లుల్లి కషాయాన్ని వినియోగిస్తున్నారు. కేజీ అల్లం, 500 గ్రాముల వెల్లుల్లి, కేజీ పొగాకు, 2 కేజీల వేపాకులను 48 గంటలపాటు నీటిలో నానబెట్టి దానిని మిర్చి పంటలపై పిచికారీ చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నట్టు ఇక్కడి రైతులు చెబుతున్నారు. పరిశీలిస్తున్నాం కొత్త పురుగు ఉధృతి ఇటీవల బాగా పెరిగింది. దీనిపై ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నాం. సేంద్రియ మందులతో కొత్త పురుగు ఉధృతి తగ్గినట్టు కనిపిస్తోంది. దుర్గాడలో రైతులు పాటిస్తున్న సేంద్రియ విధానాలపై ఉద్యాన శాస్త్రవేత్తలకు సమాచారం ఇచ్చాం. వారు వచ్చి నిర్ధారిస్తే సేంద్రియ మందుల తయారీ మరింత పెరిగే అవకాశం ఉంది. – శైలజ, ఉద్యాన అధికారి, పిఠాపురం కొత్త పురుగును తరిమికొడుతున్నారు స్థానిక రైతులు సేంద్రియ పద్ధతులతో కొత్త పురుగును తరిమికొడుతున్నారు. రసాయనక ఎరువులు, మందుల కంటే ఇవి బాగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఉల్లి కషాయం వాడిన పొలాల్లో మిరప పంట కొత్త పురుగును తట్టుకుని నిలబడింది. అలా వాడిన పొలాల్లో పంట మళ్లీ పుంజుకుంటోంది. – అనంతకుమార్, డిజిటల్ మాస్టర్ ట్రైనర్, ప్రకృతి వ్యవసాయం పరిశీలించి నిర్ధారిస్తాం సేంద్రియ మందుల వినియోగం వల్ల కొత్త పురుగు తగ్గుతున్నట్లు చెబుతున్నారు. అయితే వాటిని పరిశీలించి ఎంతవరకు తగ్గుతుంది, ఎలా పని చేస్తుందనేది నిర్ధారించాల్సి ఉంది. త్వరలో తూర్పు గోదావరి జిల్లా పర్యటించి పంటలను పరిశీలించి నిర్ధారిస్తాం. – శిరీష, ఉద్యాన శాస్త్రవేత్త, గుంటూరు ఉల్లి కషాయం కొత్త పురుగును కట్టడి చేస్తోంది కుళ్లిన ఉల్లి, వేపాకులతో తయారు చేస్తున్న కషాయం కొత్త పురుగును బాగా కట్టడి చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఇప్పటివరకు సుమారు 80 ఎకరాల్లో మిర్చి పంటలు కొత్త పురుగును తట్టుకుని నిలబడ్డాయి. దీంతో మిగిలిన రైతులు సేంద్రియ మందులు వాడటం ప్రారంభించారు. సొంతంగా దేశవాళీ ఆవులను పెంచుతూ బారీగా ఉల్లి కషాయం, మీనామృతం, అగ్ని అస్త్రం వంటి మందులు తయారు చేసి స్థానిక రైతులకు అందుబాటులోకి తెస్తున్నాము. దీనివల్ల మా ఏరియాలో కొత్త పురుగు ఉధృతి చాలా వరకు నియంత్రించబడింది. – గుండ్ర శివచక్రం, రైతు, దుర్గాడ -
ప్రకృతి సేద్యం.. ఎస్సీ రైతులకు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రకృతి సేద్యం చేస్తున్న ఎస్సీ రైతులకు ప్రోత్సాహం అందించేందుకు కార్యాచరణ ఖరారైంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 71,560 మంది ఎస్సీ రైతుల ఎంపిక పూర్తయింది. వారందరికీ కనీసం రూ.50 వేల చొప్పున సబ్సిడీ రుణాలు అందించేందుకు కసరత్తు మొదలైంది. ఆ మొత్తంలో రూ.10 వేలు సబ్సిడీ, రూ.40 వేలు రుణంగా ఇవ్వనున్నారు. సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా మూడు విడతల్లో ఎస్సీ రైతులకు ఈ రుణాలను పంపిణీ చేయనున్నారు. తొలి విడతలో 8,198 మందికి, రెండో విడతలో 34,100 మందికి, మూడో విడతలో 29,262 మందికి అందించనున్నారు. ఆ మొత్తాలను ఎస్సీ రైతులు ప్రకృతి సేద్యానికి పెట్టుబడిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ రైతు కుటుంబంలో మహిళల పేరిట రుణాలు మంజూరు చేస్తారు. ఎస్సీ కౌలు రైతులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. శిక్షణతోపాటు పరికరాలూ ఇస్తాం ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.హర్షవర్ధన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. రైతు సాధికార సంస్థ, ఎన్ఎస్ఎఫ్డీసీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సమన్వయంతో కార్యాచరణకు సహకరిస్తాయని తెలిపారు. సబ్సిడీ రుణాలే కాకుండా ప్రకృతి సేద్యంలో శిక్షణ ఇస్తామన్నారు. పంట రవాణా, మార్కెటింగ్ సదుపాయాల కోసం వినియోగించే వాహనాలను రాయితీలపై అందిస్తామని వివరించారు. -
ప్రకృతి సాగుకు పందిరేయాలి
వ్యవసాయ రంగానికి కొత్త దిశానిర్దేశం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రసాయన పరిశోధనా లయాల నుంచి వ్యవసాయాన్ని ప్రకృతి ఒడిలోకి నడపమని దేశ రైతాంగాన్ని వినమ్రంగా కోరారు. రైతును కష్టాల కాష్టంలోకి నెడుతూ... తప్పుగా నడుస్తున్న సాగుబడిని సహజ వ్యవసాయంగా మార్చుకొని, ‘తిరిగి మూలాల్లోకి’ వెళదామని హితవు పలికారు. దేశీయ సంప్రదాయిక తెలివికి ఆధునిక శాస్త్ర సాంకేతికత జోడించి, వాతావరణ మార్పు సంక్షోభంలో అలమటిస్తున్న ప్రపంచానికి కొత్త టానిక్ ఇద్దామన్నారు. భారత్‌ని ప్రపంచ శీర్షభాగాన నిలుపుదామని పిలుపిచ్చారు. వ్యవ సాయం–భూసార పరిరక్షణ–ఆహారోత్పత్తి–పంపిణి... ఇలా ఒకటికొకటి ముడివడి ఉన్న పలు విష యాల్లో పరివర్తన చివరకు మనిషి జీవనశైలి మార్పు వరకూ వెళ్లాలని అభిలషించారు. ఆర్తితో ప్రధాని చేసిన ప్రతిపాదన బాగుంది. స్వాగతించదగ్గ గొప్ప మలుపు. పెట్టుబడి వ్యయాన్ని రమా రమి తగ్గించి దిగుబడిని పెంచే శాస్త్రీయ విజయసూత్రమూ ఇదేనని ఆయన నొక్కి చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై గుజరాత్లో జరిగిన ఓ సదస్సు వేదిక నుంచి, అక్కడి సభికులనే కాక, ఈ–పద్ధతి ద్వారా దేశం నలుమూలలా దాదాపు 8 కోట్ల మంది రైతుల్ని ఉద్దేశించి ఆయనీ ప్రసంగం చేశారు. ‘నీరు రావడానికి ముందే వంతెన నిర్మించాలి’ అని అర్థం వచ్చే గుజరాతీ సామెతనూ ఆయన ఉటంకించారు. సామెతలో చెప్పినట్టే, ప్రకృతి వ్యవసాయం వైపు దేశ రైతాంగాన్ని మళ్లించడమే కేంద్ర ప్రభుత్వ విధానమయితే... తగినంత ముందుగానే చేయాల్సింది చాలా ఉంది. విధానపర మైన పూర్వరంగం, ఆర్థిక నిర్ణయాలు, ఆచరణాత్మక చిత్తశుద్ధి ఇందుకు ఎంతో అవసరం. కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో కంపెనీ లాబీలకు వశపడి, ప్రకృతి వ్యవసాయంపై వికృత వ్యాఖ్యలు చేసే శాస్త్రవేత్తల మూక ఆలోచనల్ని సమూలంగా మార్చాలి. మొత్తం వ్యవసాయ రంగమే దిశ మార్చుకునే సంధి కాలంలో... రైతులకు ప్రోత్సాహకాలివ్వాలి. కొత్త పద్ధతికి సానుకూలంగా ఆహారోత్పత్తి– పంపిణి–మార్కెట్ వ్యవస్థల్ని పటిష్టపరచాలి. అవేవీ లేకుండా, దేశ జనాభాలో సింహ భాగమైన రైతాంగాన్ని ఆకట్టుకునేందుకు ఇది ఉత్తుత్తి ప్రసంగమే అయితే, సమీక్షే అవసరం లేదు. ఉద్యమిం చిన రైతాంగం దీక్షకు లొంగి మూడు వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకున్న అక్కసుతోనో, పాలక బీజేపీ సిద్ధాంత పునాది ఆరెస్సెస్ అభిమానించే దేశీ ఆవుకు ప్రాధాన్యత ఉందనో... ప్రకృతి వ్యవ సాయంపై కేవలం సానుభూతితో మాట్లాడితే ఒరిగేదేమీ ఉండదు. నిజమైన కార్యాచరణ కావాలి. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో గాని, అంతకు ముందే అయినా ఇందుకవసరమైన విధాన–ఆర్థిక ప్రక టన వెలువడాలి. వ్యూహరచన జరగాలి. జన్యుమార్పిడి విత్తనాలు, విష రసాయన ఎరువులు, క్రిమి సంహారకాల పీడ వదిలించుకొని వ్యవసాయం క్రమంగా సహజసిద్ధ సాగువైపు మళ్ళాలి. సుభాష్ పాలేకర్ వంటి వ్యవసాయ నిపుణులు చాన్నాళ్లుగా ప్రకృతి వ్యవసాయం గురించి చెబుతున్నారు. పాలకులెవరూ పట్టించుకోలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ చేపట్టలేదు. నీతి ఆయోగ్ ఇటీవలి కాలంలో ఈ విధానాన్ని నెత్తికెత్తుకుంది. రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కాని ప్రస్తుత విధానం నుంచి మార్పు అనివార్యమని కేంద్రం గ్రహించడమూ దీనికి కారణమేమో? పైగా ఎరువులు–క్రిమిసంహారకాల దిగుమతి ఆర్థిక భారం మోయలేకుండా ఉంది. ఇది కాక... ఆహారో త్పత్తి–పంపిణి, వ్యావసాయిక–జీవవైవిధ్యం నుంచి మార్కెట్ వరకు మొత్తం వ్యవస్థను గుప్పిట్లో ఉంచుకునే క్రమంలో విధిగా ప్రత్యామ్నాయాల్ని ప్రతిపాదించాల్సిన స్థితి వచ్చింది. రైతుకు రెట్టింపు ఆదాయం చూపుతామన్న పాలకపక్ష హామీ, సమీప భవిష్యత్తులో నిజమయ్యే సూచనలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయమే రక్షగా కనిపించి ఉండవచ్చు! పైగా, ఈ పద్ధతితో పెట్టుబడి వ్యయం సగానికి తగ్గించగలిగితే, దాని మీద 1.5 రెట్లు అధికంగా కనీస మద్దతు ధర ప్రకటించడ మైనా, కాలక్రమంలో రెట్టింపు ఆదాయం చూపడమైనా సాధ్యపడవచ్చు! గతంతో పోలిస్తే, ప్రకృతి వ్యవసాయం స్థిరపడే సూచనలు ఇటీవల కనిపిస్తున్నాయి. ప్రధాని చెప్పినట్టు దేశంలోని చాలా ప్రాంతాల్లో లక్షలాది రైతులు నెమ్మదిగా ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం’ సత్ఫలితాలనిస్తోంది. దాని వెనుక ఎంతో కృషి ఉంది. అజిత్ ప్రేమ్‌జీ వంటి ట్రస్టుల ఆర్థిక ప్రోద్బలంతో మౌలిక సదుపాయాలు, శిక్షణ, అవగాహన, సాంకేతి కత–సమన్వయాల చేదోడు రైతాంగానికి లభిస్తోంది. ఇప్పుడు సహజ వ్యవసాయం చేస్తున్న వారి కష్టనష్టాల్ని పరిశీలించి, ఇంకా ఎక్కడెక్కడ, ఏయే రూపాల్లో సహకారం అందిస్తే అది స్థిరపడటానికి ఆస్కారం ఉంటుందో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు అధ్యయనం చేయాలి. ‘ఇదింకా ధ్రువపడలేదు, శాస్త్రీయ ఆధారాల్లేవు, గణాంకాల్లేవు...’ అనే తర్కం వీడి శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, ప్రభుత్వ విభాగాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు తమ ఆలోచనా దోరణి మార్చు కోవాలి. వారిని దారిలోకి తీసుకురావడం ఇప్పుడు కేంద్రం ముందున్న సవాల్! కార్పొరేట్ పెత్తనం నుంచి విత్తనం తిరిగి రైతు చేతికి రావాలి. పెట్టుబడి వ్యయం తగ్గి రైతుకు ఆత్మహత్యల దుస్థితి తప్పాలి. రసాయనాల పీడ వీడి భూసారం తిరిగి పుంజుకోవాలి. గాంధీజీ కలలు కన్న సహజ వ్యవసాయ స్వావలంబన ద్వారా గ్రామ స్వరాజ్యం పరిఢవిల్లాలి. వాతావరణ మార్పు సంక్షోభానికి సమాధానంగా ‘తిరిగి మూలాలకు’ మళ్లే ప్రక్రియ, మరేదేశం కన్నా కూడ మనమే వేగంగా సాధించగలమని ప్రపంచానికి చాటి చెప్పాలి. అందుకు ఇదే మంచి తరుణం! -
ఎండు తెగులుతో దెబ్బతిన్న మామిడి తోటను ప్రకృతి సేద్యంతో రక్షించాడిలా..!
ప్రకృతి సేద్య పితామహుడు సుభాష్ పాలేకర్ ప్రకృతి సేద్య పాఠాలతో స్ఫూర్తి పొంది, రసాయన మందుల వాడకానికి పూర్తిగా స్వస్తి పలికి, గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మామిడి రైతు మూల్పురి నాగవల్లేశ్వరరావు కృషి చక్కని ఫలితాన్నిస్తోంది. కృష్ణా జిల్లా ముసునూరు మండలం కొర్లగుంటలోని తమ కుటుంబానికి చెందిన 100 ఎకరాల్లోని మామిడి, పామాయిల్‌తో పాటు అరటి తదితర పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీక్షగా చేస్తున్న ప్రకృతి సేద్యంతో పచ్చగా అలరారుతున్న మామిడి తోటలను స్వయంగా చూసి, వివరాలు తెలుసుకునేందుకు కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి. ప్రసాద్, రైతు సాధికార సంస్థ ఉపాధ్యక్షులు టి. విజయకుమార్ తదితర అధికారులతో కూడిన బృందం రైతు నాగవల్లేశ్వరరావు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించటం విశేషం. నరికేద్దాం అనుకున్న తోట తిప్పుకుంది నాలుగేళ్ల క్రితం ఈయనకున్న 10 ఎకరాల మామిడి తోటలోని చెట్లకు కొమ్మ ఎండు తెగులు ఆశించింది. తోటలో 35 ఏళ్ల వయస్సున్న కలెక్టర్ (తోతాపురి) రకం చెట్లు 165 ఉండగా, అందులో 90 చెట్లు వరకు కొమ్మల చివరి నుంచి ఎండుపోవడాన్ని రైతు గమనించారు. పరిసర ప్రాంతాల్లో అప్పటికే 200 ఎకరాల్లో మామిడి తోటలు ఎండుతెగులు కారణంగా తీసేశారు. దీంతో తాము కూడా దెబ్బతిన్న చెట్లన్నీ నరికేసి వేరే పంట వేసుకోవాలనుకున్నారు నాగవల్లేశ్వరరావు. అదే సమయంలో పాలేకర్ ప్రకృతి సేద్యం వీడియోలు చూసి ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేశారు. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! అప్పటికే రైతుకు 30 ఆవులుండటంతో జీవామృతం, ఘన జీవామృతం, పశువుల ఎరువు, వేప పిండి, కొబ్బరి చెక్క తదితర వాటిని ఎండు తెగులు సోకిన మామిడి తోటకు ఉపయోగిస్తున్నారు. నాగవల్లేశ్వరరావు తన తోటలో ప్రతి మామిడి చెట్టుకు ఏడాదికి రెండు సార్లు (తొలకరి, పూత దశ) 30–40 కిలోల ఘనజీవామృతం వేస్తున్నారు. డిసెంబర్–జనవరి మధ్య చెట్టుకు 8 లీటర్ల చొప్పున 6 సార్లు ఇస్తున్నారు. దీంతో ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండానే తెగులు తగ్గిపోయి చెట్లు బాగున్నాయి. రెండేళ్లలో పూర్తిగా కోలుకొని పుంజుకున్నాయి. వర్షాకాలంలో ఎలా ఉంటాయో, మండు వేసవిలో కూడా అదే విధంగా పచ్చగా ఉంటున్నాయి. పర్యావరణానికి హాని చేయని సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా భూతాపోన్నతిని తగ్గించేందుకు కృషి చేస్తామని గ్లాస్కో వాతావరణ శిఖరాగ్ర సదస్సులో 45 దేశాల ప్రభుత్వాలు ప్రతిజ్ఞ చేశాయి. వ్యవసాయం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే విధంగా విధానాలు మార్చుకుంటామని 26 దేశాలు విస్పష్టంగా సరికొత్త వాగ్దానాలు చేశాయి. ఈ దేశాల్లో భారత్ సహా కొలంబియా, వియత్నాం, జర్మనీ, ఘన, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఇందుకు సహకరిస్తామని 95 కంపెనీలు కూడా ప్రకటించడం విశేషం. ప్రతి ఏటా కాపు ఒక ఏడాది కాస్తే, మరో ఏడాది కాయకపోవడం మామిడి తోటల ప్రధాన లక్షణం. అయితే ప్రకృతి వ్యవసాయం చేస్తుండటంతో ప్రతి ఏటా కాపు వస్తుండటం గమనార్హం. ప్రతి ఏటా దాదాపు 100 టన్నుల మామిడి దిగుబడి వస్తోంది. కాయలు కూడా ఎంతో నాణ్యతతో ఉంటున్నాయి. ప్రకృతి వ్యవసాయం చేయక ముందు మామిడి తోట ఒక ఏడాది కాస్తే, మరో ఏడాది కాసేది కాదు. అంతేగాకుండా కోతలు పూర్తయిన తరువాత చెట్లన్నీ చేవ కోల్పోయిన వాటిలాగా తయారయ్యేవి. దీంతో వాటికి పెద్ద మొత్తంలో రసాయన ఎరువులు వేయాల్సి వచ్చేది. ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టిన తరువాత వర్షాకాలంలో ఎలా ఉండేవో, వేసవిలో కూడా అంతే పచ్చగా ఉంటున్నాయి. – ఉమ్మా రవీంద్రకుమార్ రెడ్డి, సాక్షి, నూజివీడు, కృష్ణా జిల్లా. ఎండు తెగులు మటుమాయం ప్రకృతి వ్యవసాయం వల్ల ఎంతో మేలు ఉంది. రెండేళ్లలో ఒక్క రసాయన పురుగు మందు పిచికారీ చేయకుండానే ఎండుతెగులు మటుమాయమైంది. మామిడి చెట్ల జీవిత కాలం సైతం పెరుగుతుంది. భూమిలో సారం కూడా పెరిగింది. మామిడిలో చేసిన ప్రకృతి వ్యవసాయంతో సత్ఫలితాలు రావడంతో మా అన్నదమ్ములకున్న వంద ఎకరాల్లోని పామాయిల్, అరటితో పాటు ఇతర పంటల్లో సైతం ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి రైతూ ఆచరిస్తే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. రెండు ఆవులుంటే ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేయవచ్చు. – మూల్పూరి నాగవల్లేశ్వరరావు (నాని– 94916 99369), మామిడి రైతు, కొర్లగుంట, ముసునూరు మం., కృష్ణా జిల్లా. ప్రకృతి వ్యవసాయం స్ఫూర్తిదాయకం వేపను ఆశిస్తున్న డైబ్యాక్ డిసీజ్‌కు.. మామిడిలో ఎండు పుల్ల తెగులుకు సంబంధం లేదు. నీరు నిల్వ ఉండటం, ఇన్ఫెక్షన్కు గురవ్వటం వల్ల మామిడి తోటలకు ఈ సమస్య వస్తోంది. శ్రద్ధగా చర్యలు తీసుకుంటే మామిడి తోటలకు ముప్పు ఉండదు. నాగవల్లేశ్వరరావు చాలా శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ తోటను రక్షించుకోవటం రైతాంగానికి స్ఫూర్తిదాయకం. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో లాభాలున్నాయి. రైతులు మామిడికి పూత మొదలైన దగ్గర నుంచి పిందె ఏర్పడే వరకు దాదాపు 6 నుంచి 10 సార్లు రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల కాయలో రసాయన మందుల అవశేషాలుండటంతో ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి పనికిరావడం లేదు. ఎక్కువ రోజులు నిల్వ ఉండటం లేదు. ఈ కాయలను తిన్న ప్రజలు దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రకృతి సేద్యం చేసినట్లయితే కాయల నాణ్యత బాగుండటంతోపాటు రుచి, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. రైతులను ప్రకృతి సేద్యం సాగు వైపు దృష్టిసారించేలా చర్యలు తీసుకుంటున్నాం. – చొప్పర శ్రీనివాసులు (79950 86773), ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు, నూజివీడు. సేంద్రియ సేద్యంలో సస్యరక్షణపై సర్టిఫికెట్ కోర్సు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పంటల సాగు, చీడపీడల నియంత్రణపై రైతులు, వృత్తి నిపుణుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని (కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖ అనుబంధ సంస్థ) జాతీయ పంటమొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్.ఐ.పి.హెచ్.ఎం.) ‘సేంద్రియ సేద్యంలో సస్యరక్షణపై సర్టిఫికెట్ కోర్సు’ను ప్రారంభించింది. గ్రామీణ యువతకు సేంద్రియ వ్యవసాయంలో నైపుణ్యాలను పెంపొందిండం, గ్రామస్థాయిలో రైతులను పెద్ద సంఖ్యలో సేంద్రియ సేద్యంపై శిక్షణ ఇప్పించేందుకు మాస్టర్ ట్రైనర్లను తయారు చేయటం, సేంద్రియ రైతులు, సేంద్రియ ఉత్పత్తుల విక్రేతల్లో సేంద్రియ సర్టిఫికేషన్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ ఆర్ధిక విషయాల విశ్లేషణలో నైపుణ్యాలను పెంపొందించడమే ఈ సర్టిఫికెట్ కోర్సు లక్ష్యమని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. డైరెక్టర్ జనరల్ డా. సాగర్ హనుమాన్ సింగ్ తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్ 6 నుంచి 91 రోజుల పాటు మూడు విడతలుగా సర్టిఫికెట్ కోర్సు తరగతులను నిర్వహిస్తారు. మొదటి 21 రోజులు రాజేంద్రనగర్‌లోని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో రెసిడెన్షియల్ కార్యక్రమంలో సేంద్రియ సేద్యంలో ప్రాధమిక అంశాలపై తరగతులు నిర్వహిస్తారు. తర్వాత 60 రోజుల పాటు క్షేత్ర స్థాయిలో ఆచరణాత్మక ప్రాజెక్టు ద్వారా సేంద్రియ పంటలు సాగు చేయిస్తూ శిక్షణ ఇస్తారు. చివరి 10 రోజులు ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో సింహావలోకనం, తుది శిక్షణ వచ్చే ఏడాది మార్చి 23 వరకు వుంటుంది. 25 మందికి ప్రవేశం. ఇంటర్మీడియట్ లేదా పదో తరగతి తర్వాత వ్యవసాయంలో డిప్లొమా పూర్తి చేసిన 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఫీజు రూ. 6 వేలు. ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో వసతి ఉచితం. భోజన ఖర్చులను అభ్యర్థులే భరించాలి. మీరట్‌లోని ఐఐఎఫ్‌ఎస్‌ఆర్, ఘజియాబాద్‌లోని ఎన్సిఓఎఫ్, మేనేజ్ తదితర జాతీయ సంస్థల నుంచి వచ్చే నిపుణులు శిక్షణ ఇస్తారు. ఎన్.ఐ.పి.హెచ్.ఎం. వెబ్సైట్లో నిర్దేశించిన ఫార్మట్‌లో దరఖాస్తును పూర్తి చేసి ఈ అడ్రస్‌కు మెయిల్ చెయ్యాలి.. dirphmniphm-ap@nic.in ఇతర వివరాలకు.. కోర్సు కోఆర్డినేటర్ డా. శ్రీలత – 90103 27879, అసోసియేట్ కోర్సు కోఆర్డినేటర్ డా. దామోదరాచారి – 95426 38020. అనంతపురం జిల్లాలో 14, 15 తేదీల్లో డా. ఖాదర్ సభలు ‘సిరిధాన్య సాగు – రైతు బాగు’ సిరీస్‌లో భాగంగా అనంతపురం జిల్లాలో ఈ నెల 14, 15 తేదీల్లో ప్రముఖ స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి అనంత ఆదరణ మిల్లెట్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగే పలు సభల్లో ప్రసంగించనున్నారు. ప్రవేశం ఉచితం. 14వ (ఆదివారం) తేదీ ఉ. 10 గం.కు అనంతపురం జిల్లా నల్లమాడలోని ఆర్.డి.టి. కార్యాలయంలో మహిళాభివృద్ధి సొసైటీ నిర్వహణలో ‘కంపెనీ వ్యవసాయానికి స్వస్తి–సహకార వ్యవసాయానికి పంక్తి’ అనే అంశంపై డా. ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 94408 00632. 14వ (ఆదివారం) తేదీ సా. 5 గం.కు అనంతపురం లలిత కళా పరిషత్‌లో అనంత నగరాభివృద్ధి వేదిక, అనంత ఆదరణ ఎఫ్.పి.ఓ. ఆధ్వర్యంలో జరిగే సభలో ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే అంశంపై డా. ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 94405 21709. 15వ (సోమవారం) తేదీ ఉ. 10 గం.కు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఎ.ఎఫ్. ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే అవగాహన సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 91001 02809.15వ (సోమవారం) సా. 4 గం.కు అనంతపురం రాయల్ నగర్‌లోని ఈడిగ భవనంలో ‘సెర’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యలలో ‘ఈత వనం సాగు – గీత కార్మికుడి బాగు’ అనే అంశంపై అవగాహన సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 92464 77103. అందరూ ఆహ్వానితులే. చదవండి: Cerebrovascular Disease: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం ఇదే.. చేపలు తిన్నారంటే.. -
మీ ప్రకృతి ప్రేమ నిజమే అయితే...
ప్రకృతి వ్యవసాయం – రక్షిత ఫలసాయం అంటూ ఈ యేడు మేము బహుజన బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహి స్తుండటంతో రైతాంగంలో, మేధావుల్లో మంచి స్పందన లభిస్తున్నది. ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని అనేక మంది రచనలు పంపించారు. ప్రకృతి వ్యవసాయం లేదా తరతరాలుగా మనం అనుసరిస్తున్న సాంప్రదాయిక సహజ వ్యవసాయ పద్ధతులను కొనసాగిస్తే ఐదు రకాల ప్రోత్సాహకాలను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020 లోనే ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజనా’ పథకం కింద సబ్సిడీలు ప్రకటించింది. అయితే రసా యన ఎరువులు, పురుగుమందులు పూర్తిగా నిషే ధించి నేలతల్లినీ, ప్రజారోగ్యాన్నీ రక్షించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. శ్రీలంక ప్రభుత్వం, సిక్కిం రాష్ట్రం ప్రమాదకర రసాయన వ్యవసాయాన్ని పూర్తిగా నిషేధించాయని విన్నాము. ‘భార తీయ ప్రకృతి కృషి పద్ధతి’ కింద ఆంధ్రప్రదేశ్ , కేరళ రాష్ట్రాల్లో 2 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారని కొన్ని గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనీ, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా దీన్నొక పాఠ్యాంశంగా చేర్చాలనీ డిమాండ్ చేస్తున్నాం. ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రి కల్చర్ మూవ్మెంట్’ గణాంకాల ప్రకారం 2018– 19లో భారతదేశంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం సాగుతున్నది. ఆ నివేదిక ప్రకారం ప్రపంచంలో చైనా మూడవ స్థానంలో, అమెరికా ఏడవ స్థానంలో ఉండగా మనం 9వ స్థానంలో నిలిచాము. కాబట్టి ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన’ కింద ఎంతమంది రైతాంగానికి కేంద్ర ప్రభుత్వ సహాయం అందిందో ప్రకటించాల్సిన అవసరం ఉంది. పరంపరాగత వ్యవసాయానికి పరం పరగా వస్తున్న దేశీయ విత్తనాలు, బహుళ పంటలు ముఖ్యమైన వనరు. అలాంటి నాటు విత్తనాలను కాపాడి చిన్న, సన్నకారు రైతాంగానికి అందించాలి. కౌలు రైతులకు స్వయంగా సాగు చేసుకునే భూములు అందించడం ముఖ్యమైనది. కాబట్టి వేలాది ఎకరా లను హస్తగతం చేసుకున్న జమీందారీ, జాగిర్దారీ వ్యవస్థల్లాగా బహుళజాతి కంపెనీలకు రకరకాల పేర్ల పైన వేలాది ఎకరాలు అప్పగించరాదు. ప్రభుత్వ భూముల అమ్మకానికి చేసిన జీవోలను రద్దు చేసి రైతులకు భూపంపిణీ జరగాలి. చారిత్రక కడివెండి గ్రామంలో ‘దున్నేవారికి దుక్కులు – దుక్కుల్లో ప్రకృతి మొక్కలు’ అంటూ బహుజన బతుకమ్మ పిలుపు నిచ్చింది. అంతకు ముందే ఆలగడపలో సెజ్‌ల కోసం ప్రజల సాగు భూములను సేకరించవద్దని వేలాది ప్రజల సమ క్షంలో బహుజన బతుకమ్మ ఆడి పాడి చాటి చెప్పింది. బాబాసాహెబ్ ప్రవచించినట్లు ‘ఆర్థిక ప్రజా స్వామ్యం, రాజకీయ ప్రజాస్వామ్యం’ అమలు జరగా లంటే సామ్రాజ్యవాదుల జోక్యం లేకుండా వనరుల వికేంద్రీకరణ జరగాలి. వ్యవసాయం, చేతి వృత్తులు జంటగా అభివృద్ధి కావాలి. అందుకే భూసా రాన్ని కాపాడుకోవడానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ స్కీమ్ స్థానంలో మొత్తంగా రసాయన ఎరు వులు, క్రిమిసంహారక మందులను అరికట్టే నిర్ణయం తీసు కోలేరా? ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని చెప్పడమే నిజమైతే పురుగు మందుల కంపెనీలు చేసే ప్రచారాన్నయినా ఎందుకు అరికట్టలేక పోతున్నారు? పాడి–పంట–పెంట విధానాల ద్వారా ఇంటింటికో ఎరువుల కర్మాగారం, పాడి ఉత్పత్తుల అభివృద్ధి, సాంప్రదాయక ఇంధన వనరుల అభివృద్ధి దిశగా పథక రచనలు జరగాలి. దేశీయ సహజ వనరులపై పిడికెడు మంది గుత్తాధిపత్యాన్ని నివారించగలిగి నప్పుడే ఈ దిశగా నిజమైన ప్రయాణం మొదల వుతుంది. విమలక్క బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ తరఫున... మొబైల్ : 88868 41280 -
వినూత్న ఆలోచన: పాత చీరలతో కొత్త పుంతలు!
పంట పొలంలో నీటి వాడకాన్ని తగ్గించడంతోపాటు.. మొక్కల చుట్టూ మట్టి ఎండకు ఎండకుండా.. వానకు తడిసి కొట్టుకుపోకుండా రక్షించుకోవడానికి ఆచ్ఛాదన (మల్చింగ్) కల్పించటం ఉత్తమం. కొన్నాళ్లకు కుళ్లి మట్టిలో కలిసిపోయే పంటల వ్యర్థాలను ఆచ్ఛాదనగా వాడటం సాధారణంగా రైతుల పొలాల్లో కనిపిస్తూ ఉంటుంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులతో పాటు రసాయన వ్యవసాయం చేసే రైతులు సైతం మల్చింగ్ చేస్తూ ఉంటారు. అయితే, ఆచ్ఛాదనగా వాడే పంట వ్యర్థాల సేకరణ, లభ్యత, నిర్వహణలో ఇబ్బందుల కారణంగా ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వాడకం విస్తారంగా కనిపిస్తూ ఉంటుంది. ప్లాస్టిక్ షీట్‌తో మల్చింగ్ చేయటం ఆర్థికంగా రైతుకు భారమే కాకుండా పర్యావరణపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి, దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని అనేక విధాలుగా ప్రయత్నించే రైతులు వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు ఉన్నారు. అటువంటి కోవకు చెందిన మొదటి మహిళా ప్రకృతి వ్యవసాయదారు ఇసుకపల్లి నారా సుబ్బమ్మ (72889 82960). ఒంటిమిట్ట మండలంలోని మల్కాటిపల్లి గ్రామంలో ఆమె గత (2020–21) రబీ సీజనులో ఒక ఎకరా విస్తీర్ణంలో బంతి, చామంతి, మిరప పంటలలో పాత కాటన్ చీరలను ఆచ్ఛాదనగా తొలిసారి వినియోగించి మంచి ఫలితాలు సాధించారు. కలుపు నివారణ ఖర్చులు బాగా తగ్గాయని ఆమె తెలిపారు. అదే మాదిరిగా బొచ్చు వీరమోహన్ కూడా మార్కెట్లో అతి తక్కువ ధరకు దొరికే పాత నూలు (కాటన్) చీరలను టమాటో తోటలో మల్చింగ్ చేస్తూ చక్కని ఫలితాలు పొందుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం మిట్టమానిపల్లె గ్రామానికి చెందిన వీరమోహన్ గత ఏడాది నుంచి పాత చీరలను ఆచ్ఛాదనగా వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకార ప్రకృతి వ్యవసాయ విభాగం ఐసీఆర్పి రామానందరెడ్డి సహకారంతో ఈ వినూత్న ఆలోచనను ఆయన ఆచరణలో పెట్టారు. గత ఏడాది 20 సెంట్ల స్థలంలో పాత కాటన్ చీరతో మల్చింగ్ చేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో టమాటో సాగు చేసి సత్ఫలితాలు పొందారు. ఆ స్ఫూర్తితో ఈ ఏడాది తొలకరి వానలు పడగానే అరెకరం పొలంలో ఎత్తు మడులపై పాత నూలు చీరలను ఆచ్ఛాదనగా కప్పి టమాటో మొక్కలు నాటారు. చీరను ఒకసారి వేస్తే ఏడాది వరకు కలుపు ఇబ్బంది ఉండదని, ప్లాస్టిక్ షీట్ వేసినప్పటి కన్నా చీరను వాడటం వల్ల దిగుబడి కూడా పెరిగిందని అంటున్నారు వీరమోహన్. రైతాంగానికి పర్యావరణ హితమైన కొత్త మల్చింగ్ విధానాన్ని పరిచయం చేసిన ఏపీసీఎన్ఎఫ్ సిబ్బందికి, కొత్త పుంతలు తొక్కుతున్న ప్రకృతి వ్యవసాయదారులు సుబ్బమ్మ, వీరమోహన్లకు ‘సాక్షి సాగుబడి’ శుభాభినందనలు తెలుపుతోంది! – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ ప్లాస్టిక్ షీట్ ‘వర్సెస్’ పాత చీర ► ఎకరానికి ఎత్తు మడులపై పంటకు మల్చింగ్ చేసే స్థలం 2,400 మీటర్లు. ► ప్లాస్టిక్ షీట్ (21 మైక్రాన్స్) ఒక మీటరు ధర రూ. 4.50. ఎకరానికి ఖర్చు రూ. 10,800. ► పాత నూలు చీర (6 మీటర్లు) ధర రూ. 15. మీటరు పాత చీర ఖర్చు రూ. 2.50. ఎకరానికి ఖర్చు రూ. 6 వేలు. ► పాత చీరతో మల్చింగ్ వల్ల ఖర్చు ఎకరానికి సుమారు రూ.5 వేలు తగ్గించుకోవచ్చు. పంట పొలాన్ని ప్లాస్టిక్ కాలుష్యం నుంచి కాపాడుకోవచ్చు. ► ప్లాస్టిక్ షీట్ మట్టిలో కలిసిపోవడానికి సుమారు 60 నుంచి 80 ఏళ్లు పట్టవచ్చు. పంట ముగిసిన తర్వాత ప్లాస్టిక్ షీట్ ముక్కలను పూర్తిగా ఏరెయ్యడానికి వీలుకాదు. చిన్న ముక్కల్ని వేరటం కష్టం. ► ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు పొలంలో వాన నీరు ఇంకకుండా, పంట మొక్కల వేరు వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. పంట దిగుబడిపై ప్రభావం పడుతుంది. ► పాత చీరలు, గోనె సంచులు, పంట వ్యర్థాలను మల్చింగ్ కోసం వాడటం వల్ల కలుపు నివారణ జరగడంతోపాటు.. నీటి తేమ మట్టిలో త్వరగా ఆరిపోకుండా ఉంటుంది. ► పాత కాటన్ చీర ఏడాది పాటు పంటలకు మల్చింగ్గా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కొంత మేరకు చీకిపోతాయి కాబట్టి తీసేయవచ్చు. కాటన్ చీర పేలికలు మట్టిలో మిగిలిపోయినా.. మూడేళ్లలో పూర్తిగా కుళ్లి మట్టిలో కలిసిపోతాయి. ► వాడేసిన చీరలు ఏ ఊళ్లో అయినా దొరుకుతాయి. కాటన్ చీరలే కాదు.. సిల్క్ చీరలను కూడా మల్చింగ్గా వాడొచ్చు. పంట ముగిసిన తర్వాత సిల్క్ చీరను తీసెయ్యటం మరింత సులువు. ఇవి మట్టిలో కలిసిపోవడానికి కాటన్ చీర కన్నా మరికొంత ఎక్కువ కాలం పడుతుంది. పాత చీరల మల్చింగ్‌తో నికరాదాయం పెరిగింది టమాటో పంటకు గత నాలుగేళ్లుగా ప్లాస్టిక్ మల్చింగ్ షీట్‌ను వాడుతున్నాను. పంట అయిపోయిన తర్వాత ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ మొత్తాన్ని పొలం నుంచి తొలగించడానికి వీలయ్యేది కాదు. చిరిగిపోయి కొంత భూమిలోనే ముక్కలు ముక్కలుగా మిగిలిపోయేది. ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు పొలంలో అలాగే ఉండిపోయేవి. దీని కోసం ఖర్చు కూడా ఎక్కువగా అయ్యేది. కానీ, గత సంవత్సరం నుంచి ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది సహకారంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో భాగంగా చీరలతో మల్చింగ్ చేయటం ప్రారంభించాను. గత సంవత్సరం 20 సెంట్ల స్థలంలో ప్రారంభించి ఈ సంవత్సరం 50 సెంట్ల స్థలంలో చీరలతో మల్చింగ్ చేసి టమాటో మొక్కలు నాటాను. ఈ పద్ధతిలో సాగు చేయటం ద్వారా పంట దిగుబడి పెరిగింది. కాయ నాణ్యత కూడా బాగా వచ్చింది. మల్చింగ్ ఖర్చు కూడా తగ్గింది. నికరాదాయం పెరిగింది. – బొచ్చు వీరమోహన్ (99813 13983), టమాటో రైతు, మిట్టమానిపల్లె, మైదుకూరు మండలం, వైఎస్సార్ కడప జిల్లా రంగు వెలవని కాటన్ చీరలు అత్యుత్తమం ప్లాస్టిక్ షీట్‌ను ఆచ్ఛాదనగా వాడటం వలన భూమి లోపలి పొరల్లో ఉన్న జీవ వైవిధ్యం దెబ్బ తింటుంది. మొక్క ఎదుగుదలకు అవసరమైన సూక్ష్మజీవరాశి, వానపాములు నశిస్తాయి. భూమి లోపలి పొరల్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. వర్షపు నీరు భూమిలోకి ఇంకదు. రంగు వెలవని కాటన్ చీరలను మల్చింగ్గా వాడటం అత్యుత్తమం. – ఎం. నాగరాజ (86886 67258), జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, ఏపీ సహకార ప్రకృతి వ్యవసాయ విభాగం, కడప -
శ్రీవారి కోసం 365 రకాల దేశీ వరి!
పోషకాలతోపాటు ఔషధ విలువలు కలిగిన దేశీ వరి వంగడాల పరిరక్షణ ఉద్యమంలో తెలుగు నాట కొత్త శకం ఆరంభమైంది. దేశీ వరి బియ్యాన్ని మాత్రమే శ్రీవారి నైవేద్యానికి వినియోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల నిర్ణయించింది. మే 1 నుంచి తిరుమలలో శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన దేశీ వరి బియ్యంతో రోజూ 8 రకాల ప్రసాదాలను తయారు చేసి నైవేద్యం పెడుతున్నారు. వచ్చే ఏడాది శ్రీరామనవవి నుంచి రోజుకో దేశీ వరి రకం బియ్యంతో తిరుమలలో శ్రీవారికి నైవేద్యం అందించాలన్నది సంకల్పం. 60 ఏళ్ల క్రితం వరకు కొనసాగిన ఈ సంప్రదాయాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పునరుద్ధరిండం విశేషం. టీటీడీ పాలక మండలి సభ్యులు, యుగ తులసి ఫౌండేషన్ అధ్యక్షులు కొలిశెట్టి శివకుమార్, ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, దేశీ వరి రకాల పరిరక్షణ ఉద్యమకారుడు ఎం. విజయరామ్ సంయుక్త కృషి ఫలితంగా ఇది సాధ్యమైంది. ఒడిషాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సబర్మతి నుంచి సేకరించిన 365 రకాల దేశీ వరి విత్తనాలను జూన్ నెలలో ఒక్కో రైతుకు ఒక్కో రకం విత్తనాన్ని అందించడానికి ‘సేవ్’ సంస్థ ఏర్పాట్లు చేసింది. 2–3 ఏళ్లుగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని విజయరామ్ అన్నారు. నవారా, కాలాభట్ తప్ప మిగతా రకాలు ఎకరానికి 18–23 బస్తాల ధాన్యం దిగుబడి ప్రకృతి వ్యవసాయం ద్వారా వస్తుందని, 20 బస్తాలు పండితే వెయ్యి కిలోల బియ్యం వస్తాయన్నారు. టీటీడీపై ఆర్థిక భారం పడకుండానే రైతులు, దాతల ద్వారానే శ్రీవారి నైవేద్యానికి రోజుకో రకం దేశీ వరి బియ్యాన్ని అందించాలనేది సంకల్పం. ముందస్తు ఒప్పందం మేరకు రైతుల నుంచి దాతలు కిలో బియ్యం రూ. 60–70లకు సేకరించి, సొంత రవాణా ఖర్చులతో టీటీడీకి అందజేస్తారన్నారు. ఎవరిని సంప్రదించాలి? దేశీ వరి వంగడాలను భక్తి శ్రద్ధలతో గోఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే రైతులు హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్ (ఇందిరా పార్కు వద్ద, రామకృష్ణ మఠం ఎదురుగా) లో గల ‘సేవ్’ సంస్థ కార్యాలయం (040–27654337)లో సంప్రదించవచ్చు. గో ఆధారిత ఉత్పత్తులనూ ప్రోత్సహించాలి అపురూపమైన దేశీ వరి వంగడాలు అంతరించిపోకుండా కాపాడటానికి టీటీడీ నిర్ణయం దోహదపడుతుంది. 2022 శ్రీరామనవవి నుంచి రోజుకో రకం దేశీ వరి బియ్యాన్ని శ్రీవారి నైవేద్యానికి అందించనున్నాం. గో ఆధారిత ఉత్పత్తులను కూడా టీటీడీ ప్రోత్సహించాలి. ఇందుకోసం తిరుమలలో ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పాలి. – ఎం. విజయరామ్, ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు letssave@gmail.com గోవిందునికి గోమహానైవేద్యం గోవిందునికి శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో మాదిరిగా గోమహానైవేద్యం పెట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించడం శుభపరిణామం. ప్రతి రైతూ ఇందులో భాగస్వాములు కావాలి. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలోనూ దేశీ వరి బియ్యాన్నే వాడాలి. దేవాలయాలన్నిటిలోనూ నైవేద్యానికి దేశీ వరి బియ్యాన్నే వాడాలి. – కొలిశెట్టి శివకుమార్, టీటీడీ పాలక మండలి సభ్యులు, యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ -
Natural Farming: ఐదంతస్తులతో ఆదాయ మస్తు!
కర్నూలు(అగ్రికల్చర్): ఏ రంగంలోనైనా రాణించాలంటే అధునాతన పద్ధతులు, వినూత్న ఆలోచనలే కీలకం. ఇది వ్యవసాయ రంగానికీ వర్తిస్తుంది. సంప్రదాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దగా గిట్టుబాటు అయ్యే అవకాశం లేదు. వినూత్న ప్రయోగాలు చేస్తున్న రైతులు మాత్రం క్లిష్ట పరిస్థితుల్లోనూ తగిన ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఈ క్రమంలో రూపుదిద్దుకున్నదే ఐదంతస్తుల పంటల సాగు నమూనా. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ విధానాన్ని కర్నూలు జిల్లాలో ప్రోత్సహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. రైతులకు తోడ్పాటు ఐదంతస్తుల విధానంలో పంటలు సాగు చేసే రైతులకు తగిన తోడ్పాటు అందించాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు 2020–21 ఆర్థిక సంవత్సరంలోనే ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే.. వివిధ కారణాల వల్ల అమలు కాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్యాచరణకు దిగారు. ఈ ఏడాది జిల్లాలో దాదాపు 1,500 మంది రైతులతో ఐదంతస్తుల విధానంలో పంటలు వేయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు 754 ఎకరాల్లో సాగుకు రంగం సిద్ధమైంది. ఒక్కొక్క రైతుతో గరిష్టంగా ఎకరా వరకు సాగు చేయిస్తున్నారు. ఇందుకు గాను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతుకు ఎకరాపై మూడేళ్లకు గాను రూ.1.64 లక్షల ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఈ విధానంలో వేసిన పంటలను జియో ట్యాగింగ్ సైతం చేస్తున్నారు. స్వచ్ఛందంగా సాగు రెండేళ్ల క్రితమే జిల్లాలో పలువురు రైతులు స్వచ్ఛందంగా ఐదంతస్తుల విధానంలో పంటల సాగు చేపట్టారు. గూడూరు, ఓర్వకల్లు, మిడుతూరు, ప్యాపిలి, కల్లూరు, కర్నూలు తదితర మండలాల్లో దాదాపు 200 ఎకరాల్లో ఈ విధానంలో పంటలు సాగులో ఉన్నాయి. ఇది సత్ఫలితాలు ఇస్తోంది. పలువురు నిపుణులు సైతం ఈ విధానాన్ని పరిశీలించి రైతులకు లాభదాయకమని తేల్చారు. భూమి, నీరు, సూర్యరశ్మిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పంటలు సాగుచేసే ఈ పద్ధతి ద్వారా కరువును ఎదుర్కోవచ్చునని ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది. 30 సెంట్లలో సాగు చేశా ఐదంతస్తుల విధానంలో 30 సెంట్లలో పంటలు సాగు చేశా. ఇప్పటికి రెండేళ్లు పూర్తయ్యింది. పూర్తిగా ప్రకృతి వ్యవసాయమే. అన్ని ఖర్చులు పోను రూ.40 వేల వరకు నికరాదాయం వస్తోంది. కుటుంబానికి అవసరమైన కూరగాయలు లభిస్తున్నాయి. పలువురు ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధులు కూడా పరిశీలించి వెళ్లారు. ఇప్పుడు ‘ఉపాధి’ నిధులతో ప్రోత్సాహకాలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో మరికొంత విస్తీర్ణంలో సాగు చేయాలనుకుంటున్నా. – యు. మాదన్న నాగలాపురం, గూడూరు మండలం ఉపయోగాలివీ.. ► ఐదంతస్తుల విధానంలో పంటలు వేయడం వల్ల రైతులకు ఏడాది పొడవునా ఆదాయం వస్తుంది. ► పండ్లతోటలు, ఇతర వృక్షాలను పెంచడం ద్వారా వర్షాలను ఆకర్షించే అవకాశం ఉంటుంది. ► తక్కువ నీటి వినియోగంతోనే ఎక్కువ పంటలు పండించవచ్చు. ఐదంతస్తుల నమూనా ఇలా.. ► 1వ అంతస్తు కింద 36 అడుగుల విస్తీర్ణంలో మామిడి చెట్లు నాటాలి. ఇవి ఐదారేళ్లలో కాపునకు వస్తాయి. ► 2వ అంతస్తు 18 అడుగులు.. ఇందులో మోసంబి, అంజూర వేసుకోవచ్చు. మోసంబి 4–5 ఏళ్లలో, అంజూర ఐదో ఏడాది నుంచి కాపునకు వస్తాయి. ► 3వ అంతస్తు 9 అడుగులు ఉంటుంది. ఇందులో జామ, మునగ, కంది, బొప్పాయి, అరటి వేసుకోవచ్చు. జామ, మునగ, కంది ఆరు నెలలకు కాపునకు వస్తాయి. బొప్పాయి 9 –10 నెలలకు, అరటి ఏడాదిలోపు కాపునిస్తాయి. ► 4వ అంతస్తు 4–5 అడుగులు. కూరగాయలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, దుంపజాతి కూరగాయలు సాగు చేయవచ్చు. ► 5 అంతస్తు 2.5 అడుగులు. తీగజాతి, దుంపజాతి కూరగాయలు వేసుకోవచ్చు. ఇవి 3–4 నెలల్లో కాపునకు వస్తాయి. అంటే ఐదంచెల ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏడాది పొడవునా పంటలు ఉంటాయి. -
Natural Farming: వారెవ్వా వన్నూరమ్మా!.. ప్రధాని మోదీ ప్రశంసలు
మారుమూల కుగ్రామంలో ఉండే అతి సాధారణ దళిత మహిళా రైతు వన్నూరమ్మ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి దేశ ప్రజల దృష్టిలో పడింది. ఎడారి నేలలోనూ ఏడాది పొడవునా ఆమె విజయవంతంగా చేస్తున్న ప్రకృతి వ్యవసాయానిదే ఈ ఘనత! బంజరు భూమిని బాగు చేసుకొని.. వర్షాధారంగా ఏడాదిలో మూడు పంటలను రసాయనాల్లేకుండా పండించటం మాత్రమే కాదు.. ఎడారిని తలపించే చోట ఒక ఎకరంలో రూ. లక్షకు పైగా నికరాదాయం పొందటం వన్నూరమ్మ సాధించిన ఘన విజయం. ప్రకృతి వ్యవసాయం తమ కుటుంబాన్నే కాకుండా తండావాసుల జీవితాల్లోనూ వెలుగులు విరబూయిస్తున్న తీరును ఆమె నిస్సంకోచంగా చకచకా వివరించడంతో.. ఆమె కృషి దేశానికే ఆదర్శమని ప్రధాని ప్రశంసించారు. ఇంతకీ.. వన్నూరమ్మ తన బంజరు భూమిలో నీటి వసతి లేకుండానే బంగారు పంటలు ఎలా పండిస్తోంది..? చూసొద్దాం పదండి..! అసలే కరువు నేల.. వర్షపాతం తక్కువగా నమోదయ్యే ప్రాంతం. బోర్లు వేసినా భూగర్భ జలాలు లేక నీరు పడని దుస్థితి. ఇలాంటి నేలలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది దళిత మహిళా రైతు వన్నూరమ్మ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన వన్నూరమ్మ 11 ఏళ్ల క్రితమే భర్తను కోల్ఫోయింది. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. చదువుతోనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్న లక్ష్యంతో నలుగురు పిల్లలను చదివిస్తోంది. ప్రభుత్వం తమ కుటుంబానికి ఇచ్చిన 4.5 ఎకరాల భూమి భర్త మరణం తర్వాత బీడు పడిపోయింది. ఈ నేపథ్యంలో పంటలకు రసాయన ఎరువులు వాడకుండా ఏపీ ప్రభుత్వ సహకార ప్రకృతి సేద్య విభాగం డీపీఎం లక్ష్మీ నాయక్, సిబ్బంది సహకారంతో బీడు భూమిని తిరిగి సాగులోకి తెచ్చింది. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో వన్నూరమ్మ భూమి తల్లిని నమ్ముకుంది. ప్రకృతి సేద్యం నేర్చుకుంది. మూడేళ్ల క్రితం శిక్షణ పొందింది. ట్రాక్టర్‌తో దున్నించిన తర్వాత ఎత్తుమడులు చేసింది. కట్టెలు, వేరుశనగ కట్టె, పొట్టు పొలాన్ని ఆచ్ఛాదనగా వేస్తూ సాగుయోగ్యంగా మార్చుకుంది. మొదట అరెకరంలో చిరుధాన్యాలు సాగు చేసింది. ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహకరంగా ఉందని భావించి, రెండు ఎకరాలకు ప్రకృతి సేద్యాన్ని విస్తరించింది. ఏడాదంతా 365 రోజులూ పొలంలో పంటలు ఉండేలా ప్రణాళికతో సాగు చేస్తోంది. దీన్నే ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ (పిఎండిఎస్) పద్ధతి అంటారు. తొలుత వర్షాలకు ముందే నవధాన్యాలను మిశ్రమ పంటగా విత్తింది. ఆ తర్వాత సజ్జ, టమాటా, వంగ, మిరప పంటలను సాగు చేసింది. ప్రస్తుతం టమాటో పంట ఉంది. స్వయంగా తయారు చేసుకున్న ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, బ్రహ్మాస్త్రం లాంటి సహజ ఎరువులు, కషాయాలను తయారు చేసుకుని వాడుతూ పంటలను కాపాడుకుంటున్నది. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకం ద్వారా వచ్చే పంట దిగుబడి కంటే తన పంట అధికం గానూ, నాణ్యం గానూ ఉంటుందని వన్నూరమ్మ స్పష్టం చేస్తోంది. ప్రకృతి వ్యవసాయం చేసిన ఒక ఎకరంలో నవధాన్యాలు, వేరుశనగ, కూరగాయలు సాగు చేసేందుకు రూ.27 వేలు పెట్టుబడి కాగా, నికర లాభం రూ.1.07 లక్ష వచ్చినట్లు తెలిపింది. మహిళలను ప్రకృతి సేద్యం వైపు మళ్లిస్తూ.. భాగ్యలక్ష్మి మహిళా స్వయం సహాయక బృందానికి నేతృత్వం వహిస్తున్న వన్నూరమ్మ ప్రకృతి వ్యవసాయంలో పట్టు సాధించడంతో ఆ బృందంలో నలుగురు మహిళా రైతులు మొత్తం 12.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌గా బాధ్యతలు తీసుకున్న వన్నూరమ్మ.. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లివంక తండాకు చెందిన 170 మంది గిరిజన డ్వాక్రా గ్రూపు మహిళలకు తన అనుభవాన్ని, ఆశావహ దృక్పథాన్ని రంగరించి శిక్షణ ఇస్తున్నారు. వీరిలో 106 మంది రైతులు మొత్తం 138 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయనారంభించారు. తాను తయారు చేసిన జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలను అందిస్తూ ఆమె రైతులను ప్రోత్సహిస్తుండటం విశేషం. ప్రధానితో మాట్లాడినందుకు గర్వంగా ఉంది! భర్త చనిపోయిన తర్వాత భూమి బీడుపడింది. రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి సేద్యం నేర్చుకున్నాను. నవధాన్యాల సాగు మొదలుకొని కూరగాయల సాగు కూడా చేశాను. వ్యవసాయంలో మహిళలు కూడా రాణించాలనేది నా కోరిక. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతానని కలలో కూడా అనుకోలేదు. దేశ ప్రధానితో మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది. నాతో పాటు మహిళలు అధిక సంఖ్యలో ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. నా వంతుగా ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. – వన్నూరమ్మ (63042 78582), దళిత మహిళా రైతు, దురదకుంట , అనంతపురం జిల్లా పీఎండీఎస్ ప్రకృతి సేద్యం ఓ వరం మన్నూరమ్మ బంజరు భూమిలో 365 రోజులూ వర్షాధారంగానే వరుస పంటలు సాగు చేసి చూపింది. ప్రకృతి వ్యవసాయంలో పీఎండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) అనే ప్రత్యేక పద్ధతిని శ్రద్ధగా పాటిస్తూ.. ఎకరానికి ఏడాదిలో రూ. లక్షకు పైగా నికరాదాయం పొందారు. వర్షపు నీటితోపాటు, అంతకన్నా ఎక్కువ మొత్తంలో నీటిని గాలిలో తేమ నుంచి గ్రహించే విశిష్ట విధానంలో పంటలను సాగు చేయటం వల్లనే ఇది సాధ్యమైంది. ఎఫ్.ఎ.ఓ. నిపుణుడు డా. వాల్టర్ యన సలహా మేరకు ఈ శాస్త్రీయ పద్ధతిని ప్రపంచంలోనే మొట్టమొదటిగా అమలు చేçస్తున్నాం. అనంతపురం జిల్లాలో 110 మంది రైతులు, కోస్తాలో 3 లక్షల మంది రైతులు (43% నీరు/విద్యుత్తు ఆదా చేశారు) ప్రకృతి సేద్యంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. నీటి సంక్షోభాన్ని, భూతాపాన్ని రూపుమాపే ఈ సాగు పద్ధతి ప్రపంచానికే ఓ వరం. – టి. విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ, ఎక్స్అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రకృతి సేద్య విభాగం, ఏపీ వ్యవసాయ శాఖ vjthallam@gmail.com – ఈదుల శ్రీనివాసులు, సాక్షి, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా -
హేళన చేసిన వారే అనుసరిస్తున్నారు..!
ఎకరం పొలమే ఉన్న రైతు పొలంలో ఎంత పంట పండిస్తే మాత్రం ఏమంత సంతోషం కలుగుతుంది? అని ఎవరైనా అనుకుంటూ ఉంటేæవారు నిస్సందేహంగా పప్పులో కాలేసినట్లేనంటున్నారు యువ మహిళా రైతు రజిత! రసాయనాలు వాడకుండా, ఒకటికి పది–పదిహేను పంటలు పండిస్తే.. చిన్న కుటుంబం ఆనందంగా జీవించడానికి ఎకరం భూమి ఉన్నా చాలని రుజువు చేస్తున్నారామె. 8 ఏళ్లుగా ఆదర్శ సేద్యం చేస్తూ తోటి రైతులకు వెలుగు బాట చూపుతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో పాటు ఏడాది పొడవునా పలు పంటల విధానాన్ని అనుసరిస్తూ సేద్యాన్ని సంతోషదాయకంగా మార్చుకోవడమే కాకుండా ఇతర రైతులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడుకు చెందిన కె.రజిత(27). 19 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత పెళ్లవడంతో చదువు ఆగిపోయింది. ఆ దశలో డ్రాక్రా గ్రూపులో చేరిన రజిత విష రసాయనాల్లేని వ్యవసాయం (నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్)లో శిక్షణ పొంది తమ కున్న ఎకరం నల్లరేగడి భూమిలో విభిన్నంగా పంటలు పండించడం ప్రారంభించారు. 2012లో ఎన్‌పిఎం వ్యవసాయంలో విలేజ్ యాక్టివిస్టుగా చేరి.. తాను వ్యవసాయం చేసుకుంటూ తమ గ్రామంలో ఇతర రైతులకూ ఈ సేద్యాన్ని నేర్పించేందుకు కృషి చేశారు. తదనంతర కాలంలో పూర్తిస్థాయి ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమంలో క్లస్టర్ యాక్టివిస్టుగా బాధ్యతలు తీసుకొని ఐదుగురు సిబ్బంది తోడ్పాటుతో మూడు గ్రామాల్లో ప్రకృతి సేద్య విస్తరణకు కృషి చేస్తున్నారు. తమ ఎకరం పొలంలో ఆదర్శవంతంగా ప్రకృతి సేద్యాన్ని ఆచరిస్తూ ఇతర రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఎన్‌పిఎం సాగుతో ప్రారంభం మెట్ట ప్రాంతమైన నాగులుప్పలపాడు రబీ మండలం కావడంతో రైతులు ఎక్కువగా రసాయనిక వ్యవసాయంలో పుల్ల శనగను పండిస్తూ ఉంటారు. రజిత ఎన్‌పిఎం సేద్యం చేపట్టినప్పుడు పురుగుమందులు వాడకుండా వ్యవసాయం ఎట్లా అవుతుందని రైతులు ఎద్దేవా చేసేవారు. కానీ, క్రమంగా ఆమె మెళకువలను అలవరచుకొని ముందుకు సాగడంతో వారే ముక్కున వేలేసుకున్నారు. మూడేళ్లుగా కూరగాయ పంటలను సైతం అంతరపంటలుగా సాగు చేసుకుంటున్నారు రజిత. గత నాలుగైదేళ్లుగా పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేపట్టిన తర్వాత ప్రధాన పంటతోపాటు అనేక అంతర పంటలు పండిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారామె. ఎన్ని రకాల పంటలు సాగు చేసినా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు పండించటమే ప్రధాన ధ్యేయం. జీవామృతం, పంచగవ్య, కషాయాలను పంటలపై పిచికారీ చేస్తారు. ఎకరానికి 400 కిలోల ఘన జీవామృతం తయారు చేసుకొని పంటలకు సకల పోషకాలను అందిస్తున్నారు. మిత్ర పురుగులు వృద్ధి చెంది చీడపీడల బెడద నష్టదాయకంగా పరిణమించకుండా కాపాడుతున్నాయి. 10 రకాల అంతరపంటలు ప్రధాన పంట మిరపలో అంతర పంటలుగా 10 రకాలు సాగు చేసి మంచి ఫలితాలు సాధించింది. మిరప పంట ఆరు నెలల కాల వ్యవధిలో కాపు ముగుస్తుంది. ఈ లోగా మూడు నెలలు, రెండు నెలలు, నాలుగు నెలల కాల వ్యవధిలో ఉండే పంట రకాలను ఎంచుకొని సాగు చేపట్టింది. మిరప పంటకు చుట్టూ బెల్టుగా కంది పంటను సాగు చేసింది. కందితో పాటు ముల్లంగి, ఉల్లి, కొత్తిమీర, మొక్కజొన్న, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమోటా, ఎర పంటలుగా బంతి, ఆముదం కూడా సాగు చేపట్టింది. ఏడాది పొడవునా పంటలు 2017 ఏప్రిల్ నుంచి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతిలో నవధాన్యాలను ఎండాకాలంలోనే వెదజల్లి పచ్చి రొట్ట పంటలు సాగు చేసి కలియదున్ని.. తదనంతరం పంటలు సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో ఏడాది పొడవునా పొలాన్ని ఖాళీగా ఎండబెట్టకుండా ఏదో ఒక పంట లేదా పచ్చిరొట్ట పంటలు సాగులో ఉంటాయి. దీంతో భూమి గుల్లబారి భూసారం మరింత పెరగడంతోపాటు.. మిర్చి ప్రధాన పంటగా సాగు చేస్తుండగా ఇతర రైతులతో పోల్చితే చీడపీడల బెడద తమ పొలంలో చాలా తక్కువగా ఉందని, దిగుబడుల పరిమాణం, నాణ్యత కూడా బాగా పెరిగాయని రజిత తెలిపారు. మిర్చితోపాటు కొందరు రైతులు ఉల్లిని అంతర పంటగా వేశారని, తాను మిర్చితోపాటు వేసిన ఉల్లిపాయ ఒక్కొక్కటి పావు కిలో తూగితే, రసాయనిక వ్యవసాయం చేసే ఇతరుల పొలాల్లో ఉల్లి మధ్యస్థంగా పెరిగిందన్నారు. సాగు వ్యయం సగమే ప్రకృతి వ్యవసాయంలో ఎకరం పొలంలో ఎండు మిర్చితోపాటు పలు అంతర పంటలు సాగు చేయడానికి రజిత ఇప్పటి వరకు అన్ని ఖర్చులూ కలిపి రూ. 62,550 ఖర్చు పెట్టారు. మిర్చి సాగు చేసే ఇతర రైతులకు కనీసం రూ. 1,10,000 అయ్యిందని రజిత తెలిపారు. మిర్చి తొలి కోతలో ఎకరానికి 4.5 క్వింటాళ్లకు పైగా ఎండు మిర్చి దిగుబడి వచ్చింది. ధర క్వింటాకు రూ. 14,500 ఉండగా తమ పంటను రూ. 16,000కు అడిగారని, అయినా ధర పెరుగుతుందన్న భావనతో కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టానని రజిత వివరించారు. మొత్తంగా 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని ఆశిస్తున్నానన్నారు. అంతరపంటల అమ్మకం ద్వారా రూ. 35 వేలు ఆదాయం వచ్చిందన్నారు. ఖర్చులన్నీ పోను రూ. 2.30 లక్షలకు తగ్గకుండా నికరాదాయం వస్తుందని రజిత లెక్కగడుతున్నారు. ఆదర్శ ప్రకృతి వ్యవసాయదారుగా కుటుంబానికి రసాయనిక అవశేషాల్లేని ఆహారాన్ని అందించడంతోపాటు ఇతర రైతులకు స్ఫూర్తినిస్తున్న రజిత.. మరో వైపు చదువును సైతం కొనసాగిస్తున్నారు. దూరవిద్య ద్వారా బీకాం చదువుతున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులందరూ సంతోషంగా ఉన్నారని రజిత సంతోషపడుతున్నారు. హేళన చేసిన వారే అనుసరిస్తున్నారు..! నేను ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన కొత్తలో గ్రామంలోని చాలా మంది రైతులు హేళన చేసేవారు. చిన్న అమ్మాయి ఏమి తెలుసని అనేవారు. 2012 నుంచి పురుగుమందుల్లేని వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయంలోని మెళకువలను అధ్యయనం చేసి, నా ఎకరం పొలంలో ఆచరిస్తున్నాను. ఇవే నన్ను ఆత్మస్థయిర్యంతో ముందుకు నడిపించాయి. జీవామృతంతో పంటలు పండించే విధానాన్ని 2, 3 ఏళ్ల పాటు రైతులు మా పొలంలో చూసి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో తగ్గిన ఖర్చులు చూసి రసాయన ఎరువులు, పురుగుమందులతో పంటలు సాగు చేసే రైతులు నివ్వెరపోయారు. వాళ్ళు 2, 3 రెట్లు అధికంగా ఖర్చు పెడుతున్నారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణించిపోతున్నది. ప్రకృతి వ్యవసాయమే అన్ని విధాలా మంచిది. – కె.రజిత (76740 21990), యువ ప్రకృతి వ్యవసాయదారు, నాగులుప్పలపాడు, ప్రకాశం జిల్లా – ఎన్.మాధవరెడ్డి, సాక్షి ప్రతినిధి, ఒంగోలు ఫొటోలు: ఎమ్. ప్రసాద్, సీనియర్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి.. ప్రకృతి వ్యవసాయం
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేస్తున్నప్పటికీ కొందరు రైతులు మంచి ఆదాయాన్ని గడించలేకపోతున్నారు. రసాయనిక అవశేషాల్లేకుండా ఆరోగ్యదాయకంగా పండించిన పంట దిగుబడులను సైతం సాధారణ మార్కెట్లో మామూలు ధరకే అమ్మేసుకోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం ‘దళారుల్లేని సొంత మార్కెటింగే’ అంటున్నారు యువ రైతు లింగాల శంకర్. మూడేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ప్రకృతి వ్యవసాయం చేపట్టిన శంకర్.. ప్రణాళికతో ముందడుగు వేస్తూ బాలారిష్టాలను అధిగమించి.. సత్ఫలితాలను అందుకుంటున్నారు. తన పంట దిగుబడులను తానే నేరుగా వినియోగదారులకు అమ్ముకోవటంతో పాటు ఇతర రైతుల ఉత్పత్తులను సైతం అమ్మిపెడుతున్నారు. యువరైతుగా శంకర్ సక్సెస్‌ను చూసి ముచ్చటపడిన పద్మావతి (ఎంఫార్మసీ) ఉద్యోగం వదలి వచ్చి ఆయనను పెళ్లాడి, వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు శ్రమపడి ఎంత మంచి దిగుబడి సాధించినా రసాయనిక వ్యవసాయం చేస్తున్న చాలా మంది రైతుల్లాగా గంపగుత్తగా దళారులకు అమ్మేస్తే తగినంత ఆదాయం పొందటం అసాధ్యం అంటున్నారు యువ రైతు లింగాల శంకర్. విశాఖపట్నం దగ్గరలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన శంకర్ వైజాగ్‌లో బీఈ చదివి, హైదరాబాద్‌లోని టీసీఎస్‌లో ఆరున్నరేళ్లు అసిస్టెంట్ సిస్టమ్స్ ఇంజినీర్‌గా పని చేశారు. సుభాష్ పాలేకర్, కర్రి రాంబాబు తదితరుల స్ఫూర్తితో ఉద్యోగానికి స్వస్తి చెప్పి 2017లో ప్రకృతి వ్యవసాయదారుడిగా మారారు. రెల్లి గ్రామంలో ఆరెకరాల సొంత భూమితో పాటు, భోగాపురం మండలం బసవపాలెంలో మరో 30 ఎకరాలను కౌలుకు తీసుకొని అనేక పంటలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. గోవులతో లింగాల శంకర్ వ్యాన్ ద్వారా విక్రయాలు రైతుమిత్ర పరస్పర సహకార సంఘంలో శంకర్ క్రియాశీల సభ్యుడు. తన 36 ఎకరాల్లో పండించిన పంటలతోపాటు సొసైటీలోని 89 మంది ప్రకృతి వ్యవసాయదారులు పండించిన పంటలను సైతం మార్కెట్ చేయటంలో శంకర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరిలో 23 మంది కూరగాయలు, పండ్లు పండించే రైతులు. మిగతా వారు ధాన్యం, పప్పులు పండించేవారు. వీరంతా విశాఖకు దగ్గరలోని భోగాపురం, కొత్తవలస మండలాల్లోని రైతులే. వీరెవరూ సేంద్రియ సర్టిఫికేషన్ తీసుకోలేదు. వీరి నుంచి సేకరించిన కూరగాయలు, పప్పులు, బియ్యం తదితరాలను విశాఖపట్నం నగరంలో విక్రయిస్తున్నారు. ఒక్కచోట దుకాణం పెట్టేకన్నా రోజుకో చోట అమ్మకాలు చేపట్టడం ద్వారా అమ్మకాలు పెంచుకోవచ్చని భావించారు. శంకర్ మరో 8 మంది రైతులు సొంత డబ్బు పెట్టుబడి పెట్టి ఒక వ్యాన్‌ను కొనుగోలు చేశారు. ఈ మొబైల్ ఆర్గానిక్ స్టోర్ ద్వారా వారంలో 4 రోజుల పాటు విశాఖలో రోజుకో చోట (ఉ. 6.30 –10 గం. వరకు) తాము పండించిన, సేకరించిన 218 ప్రకృతి ఆహారోత్పత్తులను విక్రయిస్తున్నారు. తమకు 300 మంది నమ్మకమైన వినియోగదారులు ఉన్నారని శంకర్ తెలిపారు. వీలున్నప్పుడు తమ పొలాలకు వచ్చిపోతూ ఉండటంతో వీరికి నమ్మకం కలిగిందన్నారు. తమ రైతులపై ఉన్న నమ్మకమే సర్టిపికెట్ మాదిరిగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో ప్రకృతి వ్యవసాయోత్పత్తులు విక్రయిస్తున్న రైతుమిత్ర వ్యాన్ రైతుబజార్ ధర కన్నా 25% అధిక ధర రైతుబజార్లో సాధారణ కూరగాయలు, పండ్లను ఆ రోజు విక్రయించే చిల్లర గరిష్ట ధరకు 25% అదనంగా చేర్చిన ధరను ప్రకృతి రైతుల ఉత్పత్తులకు తాము ధర చెల్లిస్తున్నామని శంకర్ తెలిపారు. కూరగాయలు, పండ్లకు ఏడాది పొడవునా ఒకే ధర ఇవ్వటం కన్నా ఈ పద్ధతే రైతులకు, తమకూ బాగుందన్నారు. ప్రకృతి వ్యవసాయదారులకు రసాయన వ్యవసాయదారులతో పోల్చితే సాగు ఖర్చులు సగానికి సగం తక్కువ. ఏక పంటలుసాగు చేసే రసాయనిక వ్యవసాయదారుల కన్నా.. సొంత విత్తనాలతో బహుళ పంటలు సాగు చేసి నేరుగా వినియోగదారులకు అమ్మే ప్రకృతి రైతులకు నికరాదాయం ఎక్కువగా వస్తోందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎంత దిగుబడి తీసినా ఎవరి మార్కెటింగ్ వాళ్లే (సంఘంగా గాని లేదా వ్యక్తిగతంగా గాని) చేసుకుంటేనే నికరాదాయం పెరిగి ఆర్థికంగా కూడా సక్సెస్ కాగలుగుతారని శంకర్ స్వానుభవంతో చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలిపెట్టి మట్టిలో కాలుపెట్టి ప్రకృతి వ్యవసాయం చేపట్టిన యువరైతుగా శంకర్ తాను సక్సెస్ కావటమే కాదు తోటి రైతులనూ వెలుగుబాటలో నడిపిస్తున్నారు. ఇది చూసి ముచ్చటపడిన పద్మావతి (ఎంఫార్మసీ) ఉద్యోగం వదలి వచ్చి, గత ఏడాది ఆయనను పెళ్లాడారు. తనూ సంతోషంగా ప్రకృతి వ్యవసాయంలో పాలుపంచుకుంటున్నారు! ఇన్పుట్స్ : విన్నుకొండ గౌతమ్, సాక్షి, కొత్తవలస రూరల్, విజయనగరం జిల్లా ఏడాదిలో ప్రకృతి సేద్యంపై పట్టు పూర్తి కాలం వెచ్చించి ప్రకృతి వ్యవసాయంపై శ్రద్ధగా దృష్టి పెట్టిన శంకర్ ఏడాదిలోనే సాగు మెలకువలను వంట పట్టించుకోగలిగారు. ఏకదళ, ద్విదళ పంటలను పక్కపక్కనే సాగు చేయటం, కచ్చితంగా పంటల మార్పిడి పాటించటం, పశువుల ఎరువులో జీవన ఎరువులు కలిపి మాగబెట్టి పొలానికి వెయ్యటం, డ్రిప్ ద్వారా 8 రోజులకోసారి జీవామృతాన్ని పారించటం, కాలానుగుణంగా మార్కెట్ అవసరాలకు తగిన విధంగా వివిధ రకాల కూరగాయలు, వరి, చిరుధాన్యాలు, పప్పుధాన్య పంటల ప్రణాళికను రూపొందించుకొని అనుసరించటం ద్వారా మంచి దిగుబడులను రాబట్టుకోగలుగుతున్నారు. శంకర్ ఆరు ఒంగోలు ఆవులను పోషిస్తున్నారు. పంటలకు తగినంత పోషకాలను అందించే క్రమంలో చేపల మార్కెట్ నుంచి వ్యర్థాలను సేకరించి అమినో ఆమ్లం తయారు చేసి వాడుతున్నారు శంకర్. వంగ సాగులో రెండేళ్ల పాటు పుచ్చుల సమస్యను ఎదుర్కొన్నారు. కాయ తొలిచే పురుగు, కాయతొలిచే పురుగులను అరికట్టడానికి సీవీఆర్ మట్టి పిచికారీ పద్ధతి బాగా ఉపకరించిందని శంకర్ తెలిపారు. గతంలో 60–70% వంకాయల్లో పుచ్చులు వచ్చేవని మట్టి ద్రావణం వల్ల ఇది 10%కి తగ్గిందన్నారు. అయితే, పెసరలో ఎల్లో మొజాయిక్ వైరస్ తెగులును అదుపు చెయ్యటం ఇంకా సమస్యగానే ఉందన్నారు. 400 నాటు కోళ్లు పెంచుతున్నారు. సజ్జలు, వడ్లతో కూడిన మేతను వేస్తూ గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. గౌరవం.. ఆర్థిక స్థిరత్వం.. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చి మూడేళ్లు దాటింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి కన్నా ప్రకృతి వ్యవసాయదారుడిగా రెట్టింపు గౌరవం పొందుతున్నా. పండించిన ఉత్పత్తుల్ని నేరుగా వినియోగదారుడికి అమ్మితేనే మంచి ఆదాయం వస్తుంది. మొదటి ఏడాది సాగులో, మార్కెటింగ్‌లో కూడా ఒడిదుడుకులను ఎదుర్కొన్నా. ఇప్పుడు స్థిమితత్వం వచ్చింది. ఆదాయంతో పాటు సమాజంలో మంచి రెస్పెక్ట్ కూడా ఉంది. – లింగాల శంకర్ (92933 34477), రెల్లి ,కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా -
‘ప్రకృతి’ వరి దుబ్బుకు 55 పిలకలు!
వరి సాగు చేసే పొలాల్లో కొందరు రైతులు భూసారం పెంపుదలకు పచ్చి రొట్ట ఎరువులు సాగు చేస్తుంటారు. పప్పు జాతి జనుము, జీలుగ, పిల్లిపెసర వంటి ఒకటి, రెండు రకాల పచ్చి రొట్ట పంటలను సాగు చేసి రొటవేటర్‌తో పొలంలో కలియదున్నుతారు. అది కుళ్లిన తర్వాత ఆ పొలంలో వరి సాగుకు ఉపక్రమిస్తుంటారు. అయితే, గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలోని కంచర్లపాలెం గ్రామ కౌలు రైతు జి.విజయకుమారి ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం తోడ్పాటుతో మరింత విభిన్నమైన ప్రయోగాన్ని చేపట్టి అద్భుత ఫలితం సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఎకరం మాగాణిలో, ఖరీఫ్‌కు ముందు, వర్షాల రాకకు ముందే మే నెలలో, పచ్చిరొట్ట పంటలు వేశారు (దీన్నే ‘ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ – పీఎండీఎస్’ పద్ధతి అంటున్నారు). అందరిలా ఒక రకానికే పరిమితం కాలేదామె. ఏకంగా 18 రకాల పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలను కలిపి చల్లారు. భూమిలో ఎకరానికి మొదట 200 కిలోల ఘనజీవామృతం, ఆముదం పిండి వేసి కలియదున్ని విత్తనాలు వేశారు. పెరిగిన పచ్చి రొట్ట పైర్లను కూడా అందరిలా రొటవేటర్‌తో భూమిలో కలియ దున్న లేదు. కోసి పశుగ్రాసంగా వినియోగించారు. ఆ పంటల మోళ్లను, వేర్లను తీసెయ్యకుండా అలాగే వదిలేశారు. మళ్లీ దుక్కి దున్నకుండా లేదా దమ్ము చేయకుండానే.. ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం చల్లి వరి సాగుకు ఉపక్రమించారు. ఎదిగిన 18 రకాల పచ్చిరొట్ట పైరు, తాళ్లు పట్టి వరుసలుగా నాటిన వరి పంట తాళ్ల సహాయంతో నేలపై చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ ఎంటీయూ–1262 వరి విత్తనాలను వరుసలుగా మనుషులతో నాటించారు. 10 రోజులకోసారి ఎకరానికి మునగాకు కలిపిన 200 లీటర్ల ద్రవ జీవామృతాన్ని భూమికి అందించడమే కాకుండా పైరుపైన చల్లుతున్నారు. నాము తెగులు కనిపిస్తే వావిలాకు కషాయం రెండు సార్లు పిచికారీ చేశారు. అంతే. తొంభై రోజులు తిరిగే సరికి 55–59 వరకు పిలకలు కలిగిన వరి దుబ్బులను గ్రామస్తులు అబ్బురంగా చూస్తున్నారు. ఏపీ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్, ప్రకృతి వ్యవసాయ విభాగం గుంటూరు జిల్లా ప్రాజెక్టు మేనేజరు కె.రాజకుమారి ఈ వరి పొలాన్ని ఇటీవల స్వయంగా పరిశీలించి సంతోషాన్ని వ్యక్తపరిచారు. సమీపంలో రసాయన ఎరువులతో సాగయ్యే వరి పొలంతో పోల్చి చూడగా.. రెండు సాగు పద్ధతుల మధ్య ఎంతో వ్యత్యాసం కనిపించింది. విజయకుమారి పొలంలో ఎకరానికి 45–50 బస్తాల దిగుబడి వస్తుందన్న అంచనాకొచ్చారు. ఎక్కువ రకాల పచ్చిరొట్ట పంటలు వేయటం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి వైవిధ్యం పెరిగి భూసారం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిని దున్నకుండా వరి విత్తనాలు నాటించడం, ఘన, ద్రవ జీవామృతం వాడటం వల్ల వరికి పుష్కలంగా అన్ని రకాల పోషకాలు అందుతున్నాయని అంటున్నారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి అంతా ఆశ్చర్యంగా చూశారు! జనుము, జీలుగ, పిల్లిపెసర సహా 18 రకాల విత్తనాలను కలిపి పచ్చి రొట్ట పైరుగా వర్షాలకు ముందే చల్లినపుడు రైతులంతా ఆశ్చర్యంగా చూశారు. పచ్చిరొట్ట పైరును కలియదున్న లేదు. కోసి పశుగ్రాసంగా వాడాం. మోళ్లను అలాగే వదిలేశాం. మళ్లీ దుక్కి చెయ్య లేదు. దమ్ము చెయ్య లేదు. తాడు పట్టి చిన్న చిన్న గుంతలు తీసి వరి విత్తనాలను మనుషులతో నాటించాను. పైరుకు ఎకరానికి 600 కిలోల ఘనజీవామృతంతోపాటు ప్రతి పది రోజులకు జీవామృతం అందించాను. రెండుసార్లు వావిలాకు కషాయం చల్లాను. వరి పైరు బలంగా పెరిగింది. ఆకర్షణీయంగా ఉంది. తొంభై రోజుల్లో 55–59 వరకు పిలకలు వచ్చాయి. 45–50 బస్తాల దిగుబడి వస్తుందని రైతులే చెబుతున్నారు. – జి.విజయకుమారి (91211 47694), మహిళా కౌలు రైతు, కంచర్లపాలెం, గుంటూరు జిల్లా పీఎండీఎస్ గొప్ప ప్రయోగం ప్రపంచంలోనే ప్రప్రథమంగా గత రెండేళ్లుగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) పద్ధతిని ప్రకృతి వ్యవసాయంలో రైతులతో అమలు చేయిస్తు్తన్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో పీఎండీఎస్ విధానంలో 92 వేల రైతులు రకరకాల పంటలు సాగు చేస్తున్నారు. మే నెలలోనే 18 రకాల పచ్చి రొట్ట పంటలు వేసినా ఘనజీవామృతం గాలిలోని తేమను ఆకర్షించటం వల్ల పంటలు పెరగటం విశేషం. పచ్చిరొట్టను భూమిలో కలియదున్నకుండా, మోళ్లను అలాగే ఉంచి భూమిని మళ్లీ దుక్కి చేసి కదిలించకుండా, వరి విత్తనాలను లైన్ సోయింగ్ పద్ధతిలో నాటించటం విజయకుమారి చేసిన గొప్ప ప్రయోగం. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది పీఎండీఎస్‌ను మరో 700 గ్రామాలకు విస్తరించనున్నాం. – టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్‌ఛైర్మన్, ఏపీ రైతు సాధికార సంస్థ ‘ప్రకృతి సేద్యం –మూలసూత్రాలు, ఆచరణ’పై శిక్షణ ప్రకృతి వ్యవసాయం మూలసూత్రాలు, ఆచరణాత్మక పద్ధతులపై ప్రసిద్ధ శాస్త్రవేత్తలు డా. దేబల్ దేవ్, ప్రొ. స్టీఫెన్ గ్లియెస్మాన్ నవంబర్ 2 నుంచి 8 వరకు ఒడిశా రాయగడ జిల్లా కెరాండిగుడలోని బసుధ సంస్థ పరిశోధనా క్షేత్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయం పుట్టుపూర్వోత్తరాలు, మిశ్రమ పంటల సాగు, పంటల మార్పిడి, కలిసి పెరిగే పంటలు, అటవీ జాతి చెట్ల మధ్యలో పంటల సాగు, బహుళ అంతస్థుల ఇంటిపంటల సాగు, దేశీ వరి వంగడాల పరిరక్షణ, శ్రీవరి సాగు, ప్రకృతిసిద్ధంగా కలుపును అదుపు చేయటం, రసాయన రహిత వ్యవసాయంలో పంటల జీవవైవిధ్యం పాత్ర తదితర అంశాలపై అభ్యర్థులకు ఆంగ్లంలో లోతైన అవగాహన కల్పిస్తారు. ఆసక్తి గలవారు ఈ నెల 12 లోగా తమ పూర్తి వివరాలతోపాటు ధరఖాస్తు పంపాలి. బసుధ సంస్థ నిర్వాహకులు పరిశీలన అనంతరం శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు సమాచారం పంపుతారు. ఆ తర్వాత రూ. 16,000 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు.. ఫోన్ నంబర్: 98538 61558/94326 74377 11న రబీలో వరి, కూరగాయల ప్రకృతి సాగుపై శిక్షణ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ విధానంలో రబీలో వరి, కూరగాయల సాగుపై రైతునేస్తం ఫౌండేషన ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర్లోని కొర్నెపాడులో రైతులకు ఈ నెల 11(ఆదివారం)న శిక్షణ ఇవ్వనున్నారు. గుంటూరు జిలా అత్తోటకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు బాపన్న, రాజుపాలెం రైతు శివనాగమల్లేశ్వరరావు శిక్షణ ఇస్తారు. దేశీ వరి రకాల సాగు, కషాయాలు, ద్రావణాల తయారీపై కూడా శిక్షణ ఇస్తారు. కొవిడ్ నేపథ్యంలో 40 మందిని మాత్రమే శిక్షణకు అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 97053 83666, 0863–2286255. -
గులాబీ క్షేత్ర దినోత్సవానికి ప్రవేశం ఉచితం!
8, 22 తేదీల్లో ప్రకృతి సేద్యంపై విజయరామ్ శిక్షణ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ (ఎస్.పి.ఎన్.ఎఫ్.) పద్ధతిపై సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్ (సేవ్) ‘సేవ్’ సంస్థ వ్యవస్థాపకులు, ప్రకృతి వ్యవసాయదారులు విజయరామ్ ఈ నెల 8న తిరుపతిలో, 22న రాజమహేంద్రవరంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారికి, భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకునే వారికి అవగాహన కల్పిస్తారు. తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం, అంతర పంటల ద్వారా అధికాదాయం పొందటం, పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అమ్ముకోవటం, వాన నీటి సంరక్షణ పద్ధతులు, వ్యవసాయంలో దేశవాళీ ఆవు, ఎద్దు ప్రాధాన్యం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రవేశ రుసుము రూ. వంద. శిక్షణ సమయం ఉ. 9 నుంచి సా. 5 గంటల వరకు. ఆసక్తి గల వారు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. మార్చి 8 (ఆదివారం)న తిరుపతిలో.. వేదిక: ఎస్వీ యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియం, తిరుపతి రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. 88849 12344, 94495 96039, 86889 98047 మార్చి 22 (ఆదివారం)న రాజమహేంద్రవరంలో.. వేదిక : శ్రీ ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం, జామ్‌పేట, రాజమహేంద్రవరం. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. 94495 96039, 86889 98047, 99498 00201. 16న తమిళనాడులో గులాబీ క్షేత్ర దినోత్సవం బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐ.ఐ.హెచ్.ఆర్.) ఆధ్వర్యంలో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా దొడ్డమంచి గ్రామంలో గల తెలుగు రైతు మంజునాథ్ (79821 17354) కు చెందిన వన్య ఫార్మ్స్‌లో మార్చి 16, సోమవారం నాడు సేంద్రియ గులాబీ పూల సాగుపై క్షేత్ర దినోత్సవాన్ని (రోజ్ ఫీల్డ్ డే) నిర్వహించనుంది. సేంద్రియ పద్ధతుల్లో గులాబీలను సాగు చేస్తూ ఆయన మునగను అంతరపంటగా సాగు చేస్తున్నారు. కూరగాయలు, ఔషధ మొక్కలు కూడా సాగు చేయబోతున్నారు. రైతు క్షేత్రంలో గులాబీల సేంద్రియ సాగును ప్రత్యక్షంగా రైతులకు చూపించడం, సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం, ఐఐహెచ్ఆర్ సీనియర్ ఉద్యాన శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి అవకాశం కల్పించడం ఫీల్డ్ డే లక్ష్యం. ఉ. 9 గంటల నుంచి జరిగే ఈ క్షేత్ర దినోత్సవంలో రైతులకు ఉచిత ప్రవేశం ఉంటుంది. అయితే, 89192 71136 నంబరుకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. సుస్థిర లాభసాటి వ్యవసాయంపై 3 నెలల కోర్సు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల–ఆయకట్టు అభివృద్ధి శాఖ, నీరు–భూమి యాజమాన్య శిక్షణ, పరిశోధనా సంస్థ (వాలంతరి–రాజేంద్రనగర్) ఆధ్వర్యంలో ‘భూమి, నీటి యాజమాన్యంతో సుస్థిరమైన లాభసాటి వ్యవసాయం’పై 3 నెలల రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి ఈ నెల 5వ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 10 నుంచి జూన్ 9 వరకు కోర్సు కాలం ఉంటుంది. ఇంటర్/ఐటిఐ/డిప్లొమా చదివిన 18–30 ఏళ్ల వయసులో గ్రామీణ యువతీ యువకులు అర్హులు. కోర్సు రుసుము రూ. 5 వేలు. ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము రూ. 500. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఆదర్శ రైతుగా ఎదగవచ్చు లేదా వ్యవసాయ కన్సల్టెంట్‌గా స్థిరపడవచ్చు. దరఖాస్తు ఫాం, ఇతర వివరాలకు సంబంధిత వెబ్సైట్ చూడండి. 8న కొర్నెపాడులో సూపర్ నేపియర్ సాగుపై శిక్షణ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పశుగ్రాసాల సాగు, ప్రత్యేకంగా సూపర్ నేపియర్ గడ్డి సాగు, పశుపోషణపై మార్చి 8(ఆదివారం)న గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. సూపర్ నేపియర్ కణుపులను ఉచితంగా పంపిణీ చేస్తారు. గన్నవరం పశువైద్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ డా. సి.హెచ్. వెంకట శేషయ్య, పాడి రైతు విజయ్ (గుంటూరు) రైతులకు శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255. -
సీవీఆర్, చోహన్ క్యు సాగు పద్ధతులపై శిక్షణ
దక్షిణ కొరియాకు చెందిన డా. చోహాన్ క్యు ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై నిపుణురాలు, స్వచ్ఛంద సంస్థ ‘సర్ర’ డైరెక్టర్ రోహిణీ రెడ్డి (బెంగళూరు)తోపాటు.. మట్టిని ఎరువుగా, పురుగులమందుగా వాడే మట్టి సేద్య పద్ధతి ఆవిష్కర్త చింతల వెంకట రెడ్డి(హైదరాబాద్) ఈ నెల 29(బుధవారం)న రైతులకు శిక్షణ ఇస్తారని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ షిండే తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం రిక్వెల్ ఫోర్డ్ ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు శిక్షణ ఇస్తారు. డా. చోహన్‌క్యు పద్ధతిపై తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనా ఫలితాలను అధ్యాపకులు ఈ శిక్షణలో రైతులకు తెలియజేస్తారు. డా. చోహన్‌క్యు రూపొందించిన ఫెయిత్ (ఫుడ్ ఆల్వేస్ ఇన్ ద హోమ్) బెడ్ తయారీ పద్ధతిలో కూరగాయల సాగుపై ప్రత్యేక్ష శిక్షణ ఇస్తారు. భోజన సదుపాయం ఉంది. వివరాలకు.. సంపత్‌కుమార్ – 98854 55650, నీలిమ – 99636 23529. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై 5 రోజుల శిక్షణ సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.ఎస్.ఎ.), గ్రామీణ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయ రంగంలో వివిధ స్థాయిలో వ్యాపారావకాశాలు, ప్రభుత్వ నియమ నిబంధనలు, సమస్యలపై ఫిబ్రవరి 17 నుంచి 21వ తేదీ వరకు 5 రోజుల రెసిడెన్షియల్ శిక్షణా శిబిరం నిర్వహించనున్నట్లు సి.ఎస్.ఎ. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు తెలిపారు. పిజిఎస్ ఇండియా సేంద్రియ సర్టిఫికేషన్ నియమాలపై కూడా అవగాహన కల్పిస్తారు. హైదరాబాద్ తార్నాకలోని సెయింట్ ఆన్స్ జెనరలేట్‌లో జరుగుతుంది. ఫీజు రూ. 15 వేలు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు సంప్రదించాల్సిన నంబరు.. 85006 83300. trainings@csa-india.org/https://csa-india.org/events/200217-organic-food-marketing/ 2న కొర్నెపాడులో గొర్రెలు, మేకల పెంపకంపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ఫిబ్రవరి 2 (ఆదివారం)న గొర్రెలు, మేకల పెంపకంపై కడప జిల్లాకు చెందిన పశువైద్య నిపుణులు డా. జి. రాంబాబు శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరే వారు 97053 83666, 0863–2286255 2న బసంపల్లిలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వివిధ పంటల సాగుపై అనంతపురం జిల్లా సి కె పల్లి మండలం బసంపల్లిలోని దేవాలయ ఆశ్రమ ప్రాంగణంలో ఫిబ్రవరి 2వ తేదీ(ప్రతి నెలా మొదటి ఆదివారం)న సీనియర్ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ఫీజు రూ. 100. వివరాలకు.. 91826 71819, 94403 33349. రేపు సేంద్రియ వ్యవసాయం– మార్కెటింగ్‌పై సదస్సు సేంద్రియ వ్యవసాయం చేసే పద్ధతులు, మార్కెటింగ్ సమస్యలపై ఈ నెల 29(బుధవారం) మధ్యాహ్నం 2 గం. నుంచి సా. 5 గం. వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని మారుతి నర్సరీ(అమ్మపల్లి, నర్కోడా–ఒయాసిస్ స్కూల్ ఎదురు)లో రైతులు, వ్యాపారుల అవగాహన సదస్సు జరగనుంది. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, హార్ట్ ట్రస్టు, భారతీయ కిసాన్ సంఘ్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. వివరాలకు.. ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు – 76598 55588, మహిపాల్‌రెడ్డి – 76609 66644 -
సకుటుంబ ప్రకృతి సేద్యం!
‘ఎంత చదువుకొని ఎంత డబ్బు గడిస్తున్నా, తిరిగి మూలాలు వెతుక్కుంటూ రావాల్సిందే.. పొలంలోకి దిగాల్సిందే.. మన ఆరోగ్యం కోసం, మన పంటను మన చేతులతో పండించుకోవాల్సిందే..’ అంటున్నారు బూనేటి కిరణ్ గౌడ్. మంచి ఆహారం తినాలనుకుంటే సొంతంగా సహజ పద్ధతుల్లో పండించుకోవడమే ఉత్తమమని అంటున్నారు. మా ఆహారాన్ని మేమే పండించుకుంటాం అంటున్న కిరణ్ కుటుంబం ఇంట్లో పెద్దలు, పిల్లలందరూ కలిసి స్వయంగా వరి నాట్లు వేసుకోవడం, ఆరోగ్యదాయకమైన, రుచికరమైన దేశీ రకాలను మాత్రమే పండించడం విశేషం. దేశవాళీ వరి, మిర్చి, వంగ, టమాటో, సొర తదితర కూరగాయలు పండించుకుంటూ.. తాము తింటూ అమృతాహారం తింటూ తోడబుట్టిన వారికి, దగ్గరి బంధుమిత్రుల కుటుంబాలకూ రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తులను అందిస్తూ్త ఆదర్శప్రాయంగా నిలుస్తోంది కిరణ్ కుటుంబం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని పెద్దగొల్లపల్లిలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన కిరణ్ ఉన్నత చదువులు చదువుకొని కొన్నేళ్ల పాటు హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. తీరిక లేని ఉరుకులు పరుగుల జీవితం గడిపారు. ‘2006లో ఈ–పేపర్ సాంకేతికతను దేశంలోనే తొట్టతొలిగా అందించిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మాది.. అప్పట్లో ఆహారం గురించి ఆలోచించే తీరిక ఉండేది కాదు. అసలు ఆ ఆలోచనే లేదు. ఇక చాలనుకొని 2014లో విరమించుకున్నాను..’ అంటారాయన. పొలం పనుల్లో చిన్నారులు నగరంలో అముల్ డెయిరీ డీలర్‌షిప్‌ను నిర్వహిస్తూనే తమ స్వగ్రామంలోని భూమిలో గత రెండున్నరేళ్లుగా దేశీ వంగడాలతో ప్రకృతి సేద్యం చేస్తూ కుటుంబం కోసం అమృతాహారాన్ని పండిస్తున్నారు. తల్లి వినోదిని, భార్య అర్చన, కుమారు దేవ్రత్గౌడ్(10), కుమార్తె స్కంద(7)తోపాటు కిరణ్ ఇటీవల రబీ పంటగా దేశీ రకం సన్నజీర నారుతో నాట్లు వేశారు. ‘నాకు వ్యవసాయం తెలుసు. పిల్లలకు తెలియదు. ఇప్పుడు చెప్పకపోతే ఇకముందు వ్యవసాయమే మిగలదు. అందుకే రుచికరమైన, ఆరోగ్యదాయకమైన దేశీ వరి, కూరగాయలను పండిస్తున్నాను. మా ఇంట్లో అందరం తరచూ పొలానికి వెళ్తున్నాం. నాట్లు వేయడం వంటి కొన్ని పనులను మేమే చేసుకుంటున్నాం. ప్రస్తుతం పెద్దగొల్లపల్లి, మహేశ్వరం మండలం హర్షగూడలోని వ్యవసాయ క్షేత్రాల్లో ఆరేడు ఎకరాల్లో బాజ్ భోగ్, నవార, సన్నజీర తదితర రకాల వరి, కూరగాయలు పండిస్తూ మా దగ్గరి బంధుమిత్రులకు మాత్రమే ఇస్తున్నాం. అనుభవం గడించిన తర్వాత వందకు పైగా ఎకరాలను కౌలుకు తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేసి ప్రజలకు కూడా అమృతాహారాన్ని అందించాలన్నదే తన అభిమతమని కిరణ్ వివరించారు. వంట నూనెలు కూడా కలుషితమైపోయినందున ఎద్దు గానుగ కూడా పెట్టాలనుకుంటున్నాను. అయితే, కూలీల సమస్య అతిపెద్ద సవాలుగా ఉందన్నారు. ‘దేశీ రకాలను ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న రైతులు అపురూపంగా పండించిన ఉత్పత్తులను అమ్ముకోవడానికి తగిన మార్కెటింగ్ సదుపాయాల్లేక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా, మార్కెట్లో వ్యాపారులు ప్రకృతి వ్యవసాయోత్పత్తులు విపరీతమైన ఎక్కువ ధరకు అమ్ముతుండటంతో ఈ ఉత్పత్తుల విలువ తెలిసి కొనుగోలు చేస్తున్న వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఉదాహరణకు.. నవార బియ్యం కిలో రూ. వందకు రైతు అమ్ముతుంటే వ్యాపారులు ఆన్లైన్లో రూ. 350 వరకు అమ్ముతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి శంషాబాద్‌లో ప్రకృతి వ్యవసాయదారుల మార్కెట్‌ను ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను. స్వయంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను ఎంపికచేసి ఈ మార్కెట్లో చోటు ఇస్తాం. నేరుగా వినియోగదారులే వచ్చి రైతు ధరకే కొనుక్కుంటారు. నేను కూడా ఎక్కువ విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేసి ప్రజలకు అమ్ముతా. అప్పటి వరకు మా కుటుంబం, దగ్గరి బంధువుల కోసమే పండిస్తా. డబ్బు కోసం కాదు, మా ఆరోగ్యం కోసం..’ అని కిరణ్ అంటున్నారు. మహానగరంలో నివాసం ఉంటూనే మూలాలు వెతుక్కుంటూ పల్లెకు వెళ్లి, మట్టిని మక్కువతో గుండెలకు హత్తుకుంటున్న కొత్త తరం అన్నదాతలకు ప్రతినిధి కిరణ్ గౌడ్(98856 33353). ఈ కొత్త తరం ప్రకృతి వ్యవసాయదారులు పంటల సాగులోనే కాదు మార్కెటింగ్‌లోనూ తమదైన ముద్ర వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పంటల పండుగ సంక్రాంతి సందర్భంగా ఈ కొత్త తరం అన్నదాతలకు జేజేలు పలుకుదాం! ‘నాకు వ్యవసాయం తెలుసు. పిల్లలకు తెలియదు. ఇప్పుడు చెప్పకపోతే ఇకముందు వ్యవసాయమే మిగలదు. అందుకే మా ఇంట్లో అందరం తరచూ పొలానికి వెళ్తున్నాం. నాట్లు వేయడం వంటి కొన్ని పనులను మేమే చేసుకుంటున్నాం..’ బాజ్ బోగ్ వరి పంట (ఫైల్) ఫొటోలు: ఎస్ఎస్ ఠాగూర్, సీనియర్ ఫొటోగ్రాఫర్ -
ఏపీ సీఎంను కలవనున్న నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్
సాక్షి, అమరావతి: నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఈ నెల 13న ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డితో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అమరావతికి రానున్న రాజీవ్ కుమార్ ఎటువంటి పెట్టుబడి అవసరం లేని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్) పరిశీలించనున్నారు. -
సేంద్రియ ఎరువులకు రాయితీ: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సీఈఓ ఆనంద్ విశ్వనాథన్, ఇతర ప్రతినిధులు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి, కమిషనర్ విజయకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు ప్రకృతి వ్యవసాయం గురించి సీఎం వైఎస్ జగన్‌తో చర్చించారు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయానికి తాము సహాయం అందిస్తామని అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు. ఐదేళ్లలో రూ. 100 కోట్లమేర సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటామని, అవసరమైన సాకేంతిక సహకారం అందిస్తామని చెప్పారు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి విధివిధానాలు, పద్దతులు మరింత సమర్థవంతంగా రూపొందించాల్సి అవసరం ఉందంటూ సీఎం వైఎస్ జగన్ తన అభిప్రాయాలను వారికి తెలిపారు. సేంద్రియ ఎరువులను రాయితీపై అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు సీఎం వారికి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పలు చర్యలు తీసుకున్నామని వారికి వివరించారు. భవిష్యత్తులో పూర్తి నాణ్యత కలిగిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ప్రభుత్వ లేబరేటరీల్లో పరీక్షించిన తర్వాతే గ్రామాల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ట్యాబ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించడానికి, మార్కెట్ స్థిరీకరణకు పలు ప్రణాళికలతో మందుకు వెళ్తున్నామని వారికి తెలియజేశారు. -
సమస్త ‘ప్రకృతి’కి ప్రణామం!
అతనో సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత. ఉన్నత చదువులు చదివి హార్డ్‌వేర్ కంపెనీ నడుపుతూ ప్రకృతి వ్యవసాయానికి ఆకర్షితుడై చివరికి తన కంపెనీని వదులుకున్నాడు. తనకున్న 4 ఎకరాల వ్యవసాయ భూమిలో అతి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని సాగిస్తూ ఆదర్శ రైతుగా అధికారుల మన్ననలు, ప్రశంసలు అందుకుంటున్నాడు. అతని పేరు చెరుకూరి రాంబాబు. సాక్షి, వేటపాలెం (ప్రకాశం): మండలంలోని పందిళ్లపల్లికి చెందిన చెరుకూరి బసవయ్యది వ్యవసాయ కుటుంబం. తాను కష్టపడుతూ కుమారుడైన రాంబాబును బీఎస్సీ కంప్యూటర్ చదివించాడు. తండ్రి ఆశించినట్లు రాంబాబు విద్యాభ్యాసం అనంతరం 2002లో చీరాల్లో మైక్రో కంప్యూటర్స్ పేరుతో హార్డ్‌వేర్ కంపెనీ స్థాపించి మంచి పేరు సంపాదించాడు. కానీ అతనిలో ఏదో తెలియని కొరత ఉన్నట్లు గ్రహించాడు. వ్యవసాయంలోనే నూతన ఒరవడి సృష్టించాలనుకున్నాడు. అలా ఆలోచిస్తున్న తరుణంలో సుభాష్ పాలేకర్ చేపట్టిన ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని సృజనాత్మకతతో మెళకువలు త్వరగా ఆకలింపు చేసుకుని తనకున్న నాలుగు ఎకరాల్లో వరిసాగు ప్రారంభించాడు. మొదటి సంవత్సరం ఎకరానికి 15 నుంచి 17 బస్తాల దిగుబడి వచ్చింది. తక్కువ దిగుబడి వచ్చిందని కుంగిపోకుండా నాలుగు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు. ఎలా చేస్తారు.. ముందుగా విత్తనశుద్ధి చేసుకొని నారుమడి వేసి 25 నుంచి 30 రోజుల వ్యవధిలో నారు పీకి పొలంలో నాట్లు వేస్తారు. ప్రతి పది రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో కలిపి పైరుకు అందించడం జరుగుతుంది. 15 రోజులకు ఒక పర్యాయం జీవామృతం పైరుపై పిచికారీ చేస్తారు. పురుగు ఆశించినప్పుడు అజ్ఞాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ని కషాయాలు ముందుగానే తయారుచేసి ఉంచుకుని అవసరమైనప్పుడు పిచికారీ చేస్తారు. ఇలా నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం వలన ఈ సంవత్సరం 36 బస్తాలు ఎకరానికి పండించగలిగాడు. ఈవిధంగా పండించిన ధాన్యంను బియ్యంగా మలచి 50 కేజీల బస్తా బియ్యం రూ. 2500కు అమ్ముతున్నాడు. అదే క్రిమిసంహారక మందులు వాడిన ధాన్యం రూ.1300 అమ్ముతున్నారు. మార్కెట్లో 25 కేజీల సాధారణ బియ్యం రూ.1250 గా ఉంది. అదే ధరకు ఈ ప్రకృతి వ్యవసాయం బియ్యంను కూడా అమ్ముతున్నారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన ఆహారం ప్రజలకు అందుతుంది. ప్రకృతి వ్యవసాయం వలన ఎకరానికి రూ. 5వేల నుంచి రూ. 7వేలు వరకు పెట్టుబడి మిగులుతుంది. ఇలా 25 బస్తాలు పండించినా, రసాయనిక పద్ధతిలో 35 బస్తాలు పండించినా ముందు విధానంలోనే అధిక లాభం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయమే లాభసాటి.. ఉదాహరణకు ఎకరానికి ప్రకృతి వ్యవసాయం ద్వారా 25 బస్తాలు పండిస్తే బస్తాకు రూ.2500 చొప్పున రూ.62,500 వస్తాయి. పురుగు మందులు ఖర్చు లేదు. అదే రసాయనిక పద్ధతిలో 35 బస్తాలకు రూ.1300 చొప్పున రూ.45,500 వస్తాయి. యూరియా, పురుగు మందులకు రూ.7000 ఖర్చవుతుంది. మిగిలేది రూ. 38,500 మాత్రమే. అదే కౌలు చేసే రైతులకు కౌలు రూ. 20 వేలు పోను 35 బస్తాలు పండించగలిగితే సుమారు రూ. 15 వేల నుంచి రూ 20 వేల వరకు మాత్రమే మిగులుతాయి. ఈ లెక్కల ప్రకారం ప్రకృతి వ్యవసాయంలో అధిక లాభం ఉంటుంది. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం వలన అధిక లాభాలే కాకుండా అందరికీ ఆరోగ్యం అందేలా చేయవచ్చు. రైతే దేశానికి వెన్నుముక అనే నానుడికి సరైన అర్థం రావాలంటే ప్రతి రైతూ పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి. మనం పండించిన ఆహారం మన ప్రాంతాల వారే తినడం వలన ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గుతాయి. రూపాయి విలువ పెరుగుతుంది. రాబోయే తరానికి బలమైన, దృఢమైన పౌరులను దేశానికి అందించినవాళ్లమవుతాము. పెట్టుబడి లేకుండా అధిక లాభాలు పొందుతున్నాను ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి పెట్టుబడి లేకుండా సహజంగా లభించే ఆకుల ద్వారా కషాయాలు తయారు చేసి అధిక లాభాలు పొందుతున్నాను. ముందు ప్రయత్నంలో కొద్దిపాటి దిగుబడి వచ్చినప్పటికీ ఇప్పుడు దిగుబడి బాగా పెరిగింది. అందరూ ఈ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని ఆశిస్తున్నా. గతేడాది ప్రభుత్వ ఎన్‌పీఎం షాపు ఏర్పాటుకు సహాయం చేశారు. దీని ద్వారా అన్ని రకాల కషాయాలను తయారుచేసి గ్రామంతో పాటు ఇతర గ్రామాలకు కాషాయాలు అందిస్తున్నాను. రెండేళ్ల క్రితం ఉత్తమ ఆదర్శ రైతుగా ప్రభుత్వం అవార్డు అందుకోవడం జరిగింది. ఎవరైనా ఈ వ్యవసాయ పద్ధతులు ఆచరించేందుకు ముందుకు వస్తే నేర్పేందుకు సిద్ధంగా ఉన్నా. గత ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయ శాఖలో ఐసీఆర్పీగా నియమించి, సేవలు అందజేస్తున్నా. వ్యవసాయంలో సలహాలు కావాలన్నా.. బియ్యంతో పాటు ఇతర సేంద్రియ ఉత్పత్తులు కావాలనుకున్నా 9966889697 నంబర్‌ను సంప్రదించవచ్చు. - రైతు రాంబాబు -
17,18 తేదీల్లో సిరిధాన్యాల అటవీ వ్యవసాయంపై శిక్షణ
అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్ వలి పర్యవేక్షణలో కర్ణాటకలో జనవరి 17, 18 తేదీల్లో అటవీ చైతన్య ద్రావణంతో భూసారం పెంపుదల, సిరిధాన్యాలు – పప్పుధాన్యాల మిశ్రమ సాగు, సిరిధాన్యాల శుద్ధి విధానాలపై తెలుగు రైతుల కోసం శిక్షణా కార్యక్రమం జరగనుంది. హెచ్.డి. కోటెకు దగ్గరలోని హ్యాండ్ పోస్టులోని మైరాడ బేస్ క్యాంప్‌లో వసతి. బిదర హల్లి కబిని డ్యాం దగ్గర గల అటవీ వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ ఇతర వివరాలకు.. 99017 30600, 81234 00262, 93466 94156. మార్చి 15–17 తేదీల్లో నాగపూర్ బీజోత్సవం మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో వరుసగా ఏడో ఏడాది దేశీ బీజోత్సవం జరగనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విత్తన పరిరక్షకులు విత్తనాలను ప్రదర్శనకు ఉంచుతారు. ఈ బీజోత్సవంలో దేశీ వంగడాలతోపాటు సేంద్రియ ఆహారోత్పత్తులు, సుస్థిర జీవన శైలికి దోహదపడే ఉత్పత్తులు, సేంద్రియ ఖాదీ తదితర ఉత్పత్తులను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 90750 12745 13న కొర్నెపాడులో సేంద్రియ పశుగ్రాసం సాగుపై శిక్షణ ప్రకృతి వ్యవసాయ విధానంలో పశుగ్రాసాలు, సూపర్ నేపియర్ సాగుపై గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు రైతు శిక్షణా కేంద్రంలో జనవరి 13 (ఆదివారం)న రైతు సీతారామశాస్త్రి, గన్నవరం పశువైద్య కళాశాల ప్రొఫెసర్– హెడ్ డాక్టర్ సి.హెచ్.వెంకట శేషయ్య రైతులకు ఉ. 10 గం.ల నుంచి సా. 5 గం.ల వరకు శిక్షణ ఇస్తారు. అనంతరం శిక్షణకు హాజరైన రైతులకు సూపర్ నేపియర్ కణుపులను ఉచితంగా పంపిణీ చేస్తారు. పాల్గొనదలచిన రైతులు రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు సంప్రదించవలసిన నంబర్లు.. 97053 83666, 0863 2286255 -
జీరో బడ్జెట్ వ్యవసాయం జీరోనే
రైతుకి భూమికి ఉన్న అనుబంధం తెలిసినవారు వై.ఎస్. రాజశేఖరరెడ్డి. ఆ అనుబంధం తెలియని వాడు చంద్రబాబునాయుడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఐక్యరాజ్యసమితిలో తనకు వ్యవసాయంపై మాట్లాడటానికి ఆహ్వానం వచ్చిందని రకరకాల చిందులు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచానికి పాఠాలు చెప్పానని చెప్పుకుంటున్న మన ముఖ్యమంత్రి వ్యవసాయం గురించి ప్రపంచ వేదికల మీద చెప్పిన అబద్ధాలు సామాన్య జనానికికూడా అర్థమవుతోంది. ఇప్పటికే 60 వేల మంది రైతులు ఆంధ్రప్రదేశ్‌లో పాలేకర్ విధానంలో వ్యవసాయంలో ఉన్నారని చెప్పడం హాస్యాస్పదం. అయితే ఎక్కడ ఉన్నారో చూపిస్తే అది ఎంత వరకు నిజమో తెలుస్తుంది. ఆవు ఉన్న ప్రతీ రైతు సహజసేద్యం చేస్తున్నట్లు లెక్కలు చూపించి, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. 2029కి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పాలేకర్ సేద్యంలో తీసుకెళ్ళడానికి ప్రణాళిక. దానికి దాదాపు రూ. 16,000 కోట్లు అప్పు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలే తప్ప ఇది రైతులకు మేలు చేసే కార్యక్రమం కాదు అన్నది నిస్సందేహం. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించడానికి వెళుతున్నానని, మోదీకన్నా నేనే గొప్పవాడినని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టడం ఆయనకు అలవాటే, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది. దాని పక్క చాలా హాల్స్ ఉంటాయి. దానిలో ఎప్పుడూ ఏదో ఒక సెమినార్లు, మీటింగ్‌లు అనేక విషయాలపై జరుగుతుంటాయి. వీటికి ఎవరైనా తమ సొంత ఖర్చులపై వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇదేదో ఏపీ ముఖ్యమంత్రి ఒక్కడికే అవకాశం వచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. కానీ దాని వెనుక ఉన్న రహస్యం రైతులు చేసే వ్యవసాయం పేరుతో అప్పు తెచ్చుకోవడం. ఐక్యరాజ్యసమితిలో సస్టైనబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీ, పీఎన్బీ పరిబాస్, యూఎన్ ఎన్విరాన్ మెంటల్ ప్రోగ్రాం, ఎ వరల్డ్ ఆగ్రా పార్స్టీ సెంటర్ అన్నీ కలిపి పెట్టిన ఒక సెమినార్‌కు చంద్రబాబు హాజరై దానిలో వ్యవసాయం గురించి మాట్లాడటం జరిగింది. అసలు చంద్రబాబుకి వ్యవసాయం అంటే తెలుసా? ఎందుకంటే వ్యవసాయం దండగని చెప్పిన బాబు రైతులను తొలి నుంచీ దగాచేస్తూనే వచ్చారు. వ్యవసాయంలో ప్రకృతి, సేంద్రీయ, జీవరసాయన ఎరువుల వ్యవసాయం వంటి పద్ధతులు ఉన్నాయి. కొండకోనలో ఎవరు ఏమీ చేయకపోయినా ఏదో ఒక పండ్లు కానీ ఇతరత్రా పంటలు కానీ పండేది ప్రకృతి వ్యవసాయం. పశువుల ఎరువు, ఇతర వర్మికంపోస్టుల నుంచి తయారు చేసిన ఎరువులతో చేసేది సేంద్రీయ వ్యవసాయం. జీవరసాయన వ్యవసాయం అంటే మనకు దొరికే ఉమ్మెత్త, మారేడు బెల్లం, కోడిగుడ్లు, పచ్చిమిరపకాయలు మొదలైన వాటి నుండి జీవామృతం తయారు చేసి వాటి ద్వారా వ్యవసాయం చేసే ఒక పద్ధతి. దేశంలో హరిత విప్లవం సాధించాలని, రసాయనాలతో అత్యంత దిగుబడులు సాధించాలన్న లక్ష్యంతో మన వ్యవసాయ శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగా దేశానికి అన్నంపెట్టడం సాధ్యమయింది. రసాయన ఎరువు వేసి పండిన పంటల వలన జీవన విధానానికి ముప్పువాటిల్లుతున్న మాట నిజమే కానీ వాటిని బాగా తగ్గించి ప్రతి రైతుకీ అవగాహన కల్పించి, రైతులను ప్రోత్సహించటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అలాగని ప్రకృతి, సేంద్రియ, జీవరసాయన వ్యవసాయాలు తప్పు అని చెప్పటం కాదు. చిన్న చిన్న క్షేత్రాలకే పరిమితమైతే వాటి దిగుబడులు కూడా తగ్గడం జరుగుతుంది. బాబు రాజదాని కోసం తీసుకున్న 36 వేల ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని చెప్పినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే బీడు బారిన ఆ భూములలో పిచ్చి మొక్కలు ఎలాగూ ఉంటాయి కనుక. అదే జీరో బడ్జెట్ వ్యవసాయమని చెప్పినా ఆశ్చర్యంలేదు. 2029కి 100% జీరో బడ్జెట్ ఫైనాన్స్ వ్యవసాయంలో రైతులందరినీ భాగస్వామ్యం చేస్తానని చెప్పటం ఏ మేరకు సాధ్యపడుతుంది? అలాగే రాష్ట్రంలో 80 లక్షల హెక్టార్లకు ఈ విధానం ద్వారా రైతులను భాగస్వాములను చేస్తానని చెప్పిన మాటలు సత్య దూరం. అసలు అంత సాగు భూమి రాష్ట్రంలో ఉందా? చంద్రబాబుకి తెలియకా? లేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికా? ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇలాంటి చీప్ పబ్లిసిటీ వ్యవహారాలు మానుకొని రైతుల కష్టాలు తెలుసుకొని వ్యవసాయానికి చేయూతనిచ్చి రైతులను ఆదుకోవాలి. జీరో బడ్జెట్ వ్యవసాయం చేయడం సాధ్యం కాదని దీని వల్ల దిగుబడులు సాధించలేమని ఇప్పటికైనా తెలుసుకొని, ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం తెచ్చిన అప్పులు తీర్చడం రాష్ట్రానికి గుదిబండగా మారినందున, మళ్లీ కొత్త అప్పులు తేవడం మాని, రాష్ట్రంలో ఉన్న అవి నీతికి అడ్డుకట్ట వేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ప్రజలు కోరుచున్నారు. కొవ్వూరి త్రినాథరెడ్డి వ్యాసకర్త కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైఎస్సార్సీపీ రైతు విభాగం మొబైల్ : 9440204323 -
ప్రకృతి సేద్యంలో మేమే మేటి
సాక్షి, అమరావతి: సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రకృతిని కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. భారతదేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని చెప్పారు. 8 మిలియన్ల హెక్టార్లలో 60 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రకృతి సేద్య విధానం ప్రపంచానికే ఒక ఆదర్శ నమూనాగా నిలిచిందని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మంగళవారం ఐక్యరాజ్యసమితి సదస్సుల్లో ‘సుస్థిర సేద్యం–ఆర్థిక చేయూత–అంతర్జాతీయ సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. రాష్ట్ర జీఎస్డీపీలో 28 శాతం వ్యవసాయ రంగానిదేనని అన్నారు. రాష్ట్రంలో 62 శాతం జనాభాకు వ్యవసాయం, అనుబంధ రంగాలే జీవనాధారమని వెల్లడించారు. చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘వ్యవసాయం అంటే అత్యధిక వ్యయం, శ్రమతో కూడుకున్నది. భూసారం క్షీణించి పర్యావరణం దెబ్బతింటుంది. ఉత్పత్తి, మార్కెటింగ్ చాలా కష్టంతో కూడుకున్నవి. పంటలు సరిగ్గా పండక గ్రామీణులు పట్టణాలకు వలస వెళుతుంటారు. వాతావరణ మార్పులతో కరవు కాటకాలు, వరదలు సంభవిస్తుంటాయి. ఈ దుష్ప్రభావాలను అధిగమించడానికే ప్రకృతి వ్యవసాయాన్ని (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌ను) ప్రోత్సహిస్తున్నాం. ప్రకృతి సేద్యంలో మీరు ఒక డాలర్ పెట్టుబడి పెట్టినట్లయితే 13 డాలర్ల లాభం వస్తుంది. రసాయన ఎరువులతో వచ్చే దుష్ప్రభావాలు మేం ప్రవేశపెట్టిన ప్రకృతి వ్యవసాయంతో తొలగిపోతున్నాయి. సురక్షితమైన, మిక్కిలి పోషకాలతో కూడిన ఆహారోత్పత్తి సాధ్యమవుతోంది. వ్యవసాయాన్ని మేము లాభసాటిగా తీర్చిదిద్దడంతో ఐటీ నిపుణులు ఆ రంగంవైపు ఆసక్తి చూపుతున్నారు. రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైంది. యువతను వ్యవసాయం వైపు ఆకర్శిస్తున్నాం. ప్రకృతి సేద్యంతో పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాం. ప్రకృతి సేద్యంతో పండించిన ఆహారోత్సత్తులు తీసుకుంటుండటంతో తమ ఆరోగ్యం బాగుపడిందని ప్రజలు చెబుతున్నారు. వచ్చే ఐదేళ్లలో రైతాంగాన్ని 100 శాతం ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 2020 నాటికి 1.7 మిలియన్ల రైతులు, 2022 నాటికి 4.1 మిలియన్ల రైతులను ఈ సేద్యం వైపు మళ్లించాలన్నదే మా ధ్యేయం. కోర్ డ్యాష్‌బోర్డును మీకు కనెక్ట్ చేస్తా.. 20 ఏళ్ల క్రితం స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పుడు 9 లక్షల స్వయం సహాయక బృందాలున్నాయి. వీరంతా తమ గ్రామాలు దాటి తమ భాష రాని, తమ ప్రాంతం కాని ప్రాంతాలకు వెళ్లి ప్రకృతి వ్యవసాయంపై రైతాంగానికి అవగాహన కలిగిస్తున్నారు. భూమి ఉపరితలంపై కురిసే వర్షపు నీటిని రియల్ టైమ్ మేనేజ్మెంట్ ద్వారా ఒడిసి పడుతున్నాం, భూగర్భ జలాలుగా మారుస్తున్నాం. అల్పపీడనాలు ఏర్పడి అవి తుపానులుగా మారి ఎక్కడ కేంద్రీకృతమయ్యాయో రియల్ టైమ్ ట్రాకింగ్ వ్యవస్థతో చెప్పగలుగుతున్నాం. న్యూయార్క్‌లో ఉండి ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామంలో వీధిలైట్ల వ్యవస్థను నేను రియల్ టైమ్ వ్యవస్థ సహాయంతో నిర్వహించగలను. నాకు సీఎం కోర్ డ్యాష్‌బోర్డు ఉంది. సీఎం కోర్ డ్యాష్‌బోర్డును మీకు కనెక్ట్ చేస్తా. మీరు అందులోని అంశాలన్నీ చూడొచ్చు’’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. -
పొలం బాటలో.. పట్టభద్రుడు
ఇంజినీరింగ్ చదివిన ఏ కుర్రాడైన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనుకుంటాడు. కంపెనీలు ఇచ్చే ప్యాకేజీలతో తన ప్రతిభను కొలమానంగా వేసుకుంటారు. అయితే మదనపల్లెకు చెందిన ఆదర్శ రైతు ఎం.సి.వి. ప్రసాద్ దీనికి పూర్తి భిన్నం. తాను సంపాదించిన జ్ఞానం వ్యవసాయాభివృద్ధికి ఉపయోగపడాలని పరితపించాడు. తండ్రి ఇచ్చిన పొలంలో వ్యవసాయం మొదలుపెట్టాడు. ఖర్చులేని వ్యవసాయం(జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్) చేస్తూ అద్భుతాలు సాధిస్తున్నాడు. మదనపల్లె సిటీ: చదువు జ్ఞానాన్నిస్తుంది. సేద్యం ఆహారాన్ని అందిస్తుంది. ఆ రెండూ కలిస్తే అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయని నిరూపిస్తున్నాడు మదనపల్లెకు చెందిన ఆదర్శ రైతు ఎం.సి.వి.ప్రసాద్. చదువుకుంది సివిల్ ఇంజినీరింగ్. బెంగళూరులోని ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం. ఇవేవి అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. నేల తల్లికి ఏదో చేయాలని పరితపించేవాడు. అందుకే ప్రేమతో హలం పట్టాడు. అనుభవ పాఠాలతో పాటు నాన్న పద్మనాభరెడ్డి ఇచ్చిన 80 ఎకరాల భూమిలో వ్యవసాయ పనులు మొదలు పెట్టాడు. మహారాష్ట్రకు చెందిన రైతుభాందవుడు సుభాష్‌పాలేకర్ బాటలో పయనిస్తున్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఖర్చులేని వ్యవసాయం (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ) అమలు చేస్తున్నారు. తండ్రి వ్యవసాయంలో దిట్ట. మొట్టమొదట మదనపల్లెకు టమాట పంటను పరిచయం చేశారు. తండ్రి బాటలో పయనిస్తూ అద్భుతాలు సాధిస్తున్నారు. మదనపల్లె సమీపంలోని చిన్నతిప్పసముద్రం(సీటీఎం) వద్ద ప్రసాద్‌కు 80 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ అడుగుపెడితే చాలు వ్యవసాయానికి కొత్త జీవనాన్ని అందిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఖర్చులేని వ్యవసాయం ఆయన సొంతం2008లో మహారాష్ట్రకు చెందిన సుభాష్‌పాలేకర్ అనే వ్యవసాయవేత్త తిరుపతికి వచ్చారు. ఖర్చులేని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. దీనికి ఆకర్షితులైన ప్రసాద్ అదే బాటలో పయనిçస్తున్నారు. రసాయన, సేంద్రియ ఎరువుల అవసరం లేకుండా పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరిస్తున్నారు. 80 ఎకరాల తన క్ష్రేతంలో మిరప, టమట, చెరకు, సజ్జ, గోధుమ, మొక్కజొన్న, వంగ, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, మినుములు పండిస్తున్నారు. కూరగాయల సాగు కోసం పాలిçహౌస్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు దానిమ్మ, ఉసిరి, అల్లనేరేడు, జామ వంటి పండ్లను పండిస్తున్నారు. ఈ విధానంలో బీజామృతం, జీవామృతం,ç బ్రహ్మాస్త్రం వంటి వాటిని ఉపయోగించి ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని నిరూపించారు. ఈ విధానం వల్ల తక్కువ పెట్టుబడి, పర్యావరణ పరిరక్షణ, భూసారం పెరుగుదల, నీటి వనరుల పొదుపు వంటి వాటిని సాధించవచ్చు. 2008కి ముందు ఏటా సుమారు రూ.10 లక్షల పెట్టుబడి పెట్టిన ప్రసాద్‌కు పాలేకర్ విధానానికి మారిన తర్వాత అలాంటి అవసరమే లేకుండా పోయింది. ఇదంతా కేవలం దేశవాళీ ఆవులను నమ్ముకోవడం వల్ల కలిగిన లాభమంటారు. చెరకు: ఏడెకరాల్లో చెరకు సాగు చేశారు. బెల్లం తయారీ చేసి విక్రయిస్తూ ఎకరాకు రూ.1.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. ఎకరాకు రూ. 70 వేలు ఖర్చు చేస్తున్నారు. లెమన్‌గ్రాస్: ఆరు ఎకరాల్లో లెమన్‌గ్రాస్ సాగు చేశారు. పంట నుంచి నూనె తీసేందుకు స్టీమ్ డిస్టిలేషన్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఎకరా పంటకు దాదాపు 250 లీటర్ల వరకు నూనె వస్తుంది. మార్కెట్లో కిలో నూనె రూ.1000 వరకు ఉంటుంది. ఈ çపంట సాగు ద్వారా రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పామారోజా, దవనం, సిట్రోనెల్లా, వట్టివేర్లు, తులసి, లావెండర్ వంటి సుగంధ ఔషద మొక్కలు సాగు చేస్తున్నారు. వ్యవసాయక్ష్రేతంలో ఎనిమిది రకాల దేశవాళీ ఆవులను పోషిస్తున్నారు. వాటి పేడ, మూత్రంతో జీవామృతం తయారు చేసి భూసారాన్ని పెంచేందుకు ఎరువుగా వినియోగిస్తున్నారు. తెగుళ్ల నివారణకు బ్రహ్మాస్త్రం (వేప, కానుగ, సీతాఫలం, ఉమ్మెత్త, జిల్లేడు, వావిలాకులను 15 లీటర్ల గోమూత్రంలో ఉడికించి తయారు చేసి వినియోగిస్తున్నారు. గోఆధారిత కషాయాల ద్వారా పంటలకు సోకే సమస్త రోగాలను నివారిస్తున్నారు. యాంత్రీకరణకు తోడు బిందు పద్ధతిలో పంటలకు నీరందిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. సాగులో ఆధునిక, సేంద్రియ పద్ధతులను మేళవిస్తూ పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తున్నారు. ప్రకృతివనం: ప్రకృతివనం పేరుతో 52 రకాల సేంద్రియ ఉత్పత్తులను విక్రయిస్తూ 55 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. విద్యార్థుల సందర్శన.. వ్యవసాయ క్షేత్రాన్ని వివిధ వ్యవసాయ, ఉద్యాన విద్యార్థులు క్షేత్రస్థాయి పరిశోధనకు వస్తుంటారు. ఏపీతో పాటు కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు సందర్శిస్తున్నారు. సెలేషియా మొక్కలు పెంపకం.. వ్యవసాయ క్ష్రేతంలో మధుమేహ మందుకు పని కివచ్చే సెలేషియా మొక్కల పెంపకం చేపట్టారు. దాదాపు ఎనిమిది ఎకరాల్లో మొక్కలు పెంచుతున్నారు. జపాన్‌కు చెందిన టకామా కంపెనీతో దీన్ని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. అవార్డులు: ♦ దవనం మొక్కలను అత్యధికంగా సాగు చేయడంతో 2005లో సీఎస్ఐఆర్ ఉన్నతి అవార్డును అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ నుంచి అందుకున్నారు. ♦ 2011లో ఉత్తమ తైల యూనిట్ నిర్వహణకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ ఆర్థోపెడిక్ సంస్థ అవార్డు అందుకున్నారు. ♦ 2011లో ఏపీ ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్ అవార్డును పొందారు. ♦ 2013లో మానవత ఫౌండేషన్ అఛీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ♦ 2013 సుబ్బారావు ఉత్తమ రైతు అవార్డు ప్రకృతి వ్యవసాయమే సరైన మార్గం రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభానికి పాలేకర్ చెబుతున్న జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయమే సరైన మార్గం. 700 అడుగుల బోర్ వేస్తే తప్ప నీటి చుక్క జాడ దొరకని ప్రాంతంలో పాలేకర్ విధానాల వల్లే లాభసాటి ప్రకృతి వ్యవసాయం చేయడం సాధ్యం. సతీమణి యోగిత, స్నేహితుడు గుణశేఖర్లు పూర్తి సహాయ సహకాలు అందిస్తున్నారు. –ఎం.సి.వి.ప్రసాద్. -
చంద్రబాబు చెయ్యని ద్రోహం ఉందా?
సాక్షి, నిడదవోలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేయడంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. ప్రకృతి సేద్యంపై ప్రసంగించటానికి చంద్రబాబుకు ఐకరాజ్యసమితి ఆహ్వానంపై గొప్పలు చెబుతున్న టీడీపీకి ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన పత్రికాప్రకటన విడుదల చేశారు. ప్రకృతి సేద్యానికి అంటే ఎరువులు, పురుగు మందులు వాడకుండా చేసే వ్యవసాయానికి చంద్రబాబు కృషి చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. 2024 నాటికి రాష్ట్రంలో ఏకంగా 60లక్షల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేసేలా టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తుందని చెప్పడంపై ఆయన మండిపడ్డారు. ఈ విషయం ఇక్కడి ప్రజలకు, రైతులకు తెలియదన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఐకరాజ్యసమితికి ఏం చెప్పిందో, ఏం చేసిందో గానీ.. చంద్రబాబు నాయుడును సేవలు చేస్తున్నారని భావించి సెప్టెంబర్ 24 ఐకరాజ్యసమితి న్యూయార్క్ కార్యాలయంలో ప్రసంగించాలని కోరారట అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని అన్ని రకాలుగా సర్వ నాశనం చేసి, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులను మోసం చేసి, అప్పులపాలు చేసిన సీఎం.. పకృతి వ్యవసాయాన్ని బాగా చేయిస్తున్నట్టుగా అంతర్జాతీయంగా మేనేజ్ చేయడం రైతులు, రాష్ట్ర ప్రజలు గర్వపడాల్సిన విషయమా అని ప్రశ్నించారు. అంతేకాకుండా మరికొన్ని ప్రశ్నలు కూడా సందించారు. నాలుగేళ్ల కాలంలో రైతుకు, వ్యవసాయానికి చంద్రబాబు చెయ్యని ద్రోహం ఉందా? వ్యవసాయానికి చంద్రబాబు చేసిన సేవలకు ఐకరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం ఇచ్చారా? రైతు వ్యతిరేక ముఖ్యంత్రికి వ్యవసాయానికి సంబంధించి అంతర్జాతీయ గౌరవాలు అందుకునే అర్హత ఉందా? -
12న భీమవరంలో ప్రకృతి సేద్యం–ఆహారోత్పత్తులపై సదస్సు
సేంద్రియ ఆహారాన్ని అందించే ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యతపై ఈనెల 12(ఆదివారం)న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (ఆదివారం బజారు)లోని డా. గొట్టుముక్కల సుందర రామరాజు ఐ.ఎం.ఎ. కాన్ఫరెన్స్ హాలులో జరుగుతుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ గో ఆధారిత, ప్రకృతి వ్యవసాయదారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో భారతీయ కిసాన్ సంఘ్ నేత జె.కుమారస్వామి, ఆంధ్రప్రదేశ్ గో ఆధారిత, ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షులు బి. రామకృష్ణంరాజు తదితరులు ప్రసంగిస్తారు. వివరాలకు.. డా. పి.బి. ప్రతాప్‌కుమార్ – 94401 24253 -
1.3 ఎకరాల్లో ఏటా రూ. 5 లక్షలు!
ప్రకృతి వ్యవసాయోద్యమకారులు మసనొబు ఫుకుఒకా, సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో స్ఫూర్తి పొందిన గోగిరెడ్డి రాజేంద్రరెడ్డి అనే రైతు తనకున్న ఎకరం 30 సెంట్ల పొలంలో ఆహార అరణ్యాన్ని సృష్టించారు. గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామంలో రోడ్డు పక్కనే ఈ ఫుడ్ ఫారెస్ట్ పచ్చగా అలరారుతోంది. ఏఎంఐఈ చదువుకున్న రాజేంద్రరెడ్డి వ్యవసాయం చేస్తూ హైదరాబాద్‌లో సివిల్ కాంట్రాక్టులు చేస్తుండేవారు. 1.3 ఎకరాల నల్ల రేగడి భూమి. 30 అడుగుల్లో నీరు. పక్కనే పంట కాలువ. 2011–12 వరకు రసాయనిక వ్యవసాయ పద్ధతిలో అరటి తోట సాగు చేసేవారు. ఫుకుఒకా రచన ‘గడ్డి పరకతో విప్లవం’ చదివి ప్రకృతి వ్యవసాయం వైపు ఆకర్షితుడైన రాజేంద్రరెడ్డి.. హైదరాబాద్(2012)లో పాలేకర్ శిబిరంలో శిక్షణ పొంది ఐదంచెల పండ్ల తోటల నమూనాకు ఫిక్సయ్యారు. అలా ప్రారంభమైన ఫుడ్ ఫారెస్ట్ ఇప్పుడు ఏడాది పొడవునా ఆహార, ఆదాయ భద్రతను అందించే స్థాయికి ఎదిగింది. రాజేంద్రరెడ్డి మాటల్లోనే ఆయన అనుభవాలు.. కర్పూర అరటి, కొబ్బరితోనే రూ. 5 లక్షలు రసాయనిక ఎరువులు పురుగుమందులు ఆపేయగానే తెగుళ్లు ఆగిపోయి.. పంట ఆరోగ్యంగా కనిపించింది. అరటి గెల సైజు మొదటి రెండేళ్లు తగ్గింది. ఆచ్ఛాదన సరిగ్గా వేసిన తర్వాత గెల సైజు క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు పొలమంతా చెట్లు, చెట్ల మధ్యలో ఆచ్ఛాదనతో నిండి ఉంటుంది. బయటకన్నా 4–5 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. భూమిలో జీవనద్రవ్యం(హ్యూమస్) ఏర్పడడానికి కావాల్సిన సూక్ష్మవాతావరణం ఏడాది పొడవునా మా ఫుడ్ ఫారెస్ట్‌లో నెలకొని ఉంటుంది. మామూలు పొలాల్లో మాదిరిగా సేంద్రియ కర్బనం ఆవిరి కాదు. ఇదే పంటల ఉత్పాదకతను పెంచింది. అరటి గెలకు సగటున రూ. వెయ్యి ఆదాయం ఆరేళ్లు గడిచిన తర్వాత.. ఆదాయం ప్రధానంగా 600 కర్పూర అరటి చెట్లు, 40 కొబ్బరి చెట్ల ద్వారానే సమకూరుతోంది. తాజాగా ఒక గెల 16 అస్తాలతో 46 కిలోలు తూగింది. నికరంగా 40 కిలోల అరటి పండ్లు వచ్చాయి. పండ్లను నేనే స్వయంగా గుంటూరులో ఇళ్లకు తీసుకెళ్లి కిలో రూ.50కి అందిస్తున్నాను. సుడిగాలులకు కొన్ని చెట్లు పడిపోయినా.. సగటున ఏడాదికి నికరంగా 400 అరటి గెలలు వస్తాయి. సగటున గెలకు 20 కిలోల పండ్లు అనుకుంటే.. గెలకు రూ. వెయ్యికి తగ్గకుండా ఏటా రూ. 4 లక్షల ఆదాయం వస్తున్నది. కొబ్బరి కాయల ద్వారా రూ. లక్ష 23 ఏళ్ల నాటి కొబ్బరి చెట్లు 40 ఉన్నాయి. అధిక వర్షాలు, వడగాలులు ఎట్లా ఉన్నా ఏడాదికి చెట్టుకు కనీసం 150–200 కొబ్బరి కాయలు ఖాయంగా వస్తున్నాయి. 6 వేల కాయలను రూ. 15–20కి రిటైల్‌గా అమ్ముతున్నాను. గ్యారంటీగా రూ. లక్ష వస్తుంది. అరటి, కొబ్బరి ద్వారా ఏటా రూ. 5 లక్షల ఆదాయం వస్తున్నది. ఇది నికరాదాయమే. మా ఫుడ్ ఫారెస్ట్‌లో ఇంకా బొప్పాయి, మునగ, తేనె, కంద, జామ, పనస, కరివేపాకు, తమలపాకులు, ఆకుకూరలు.. ఇంకా చాలా పంటలే చేతికి వస్తాయి. వీటి వల్ల వచ్చే ఆదాయంతో తోటకు అయ్యే ఖర్చులు వెళ్లిపోతున్నాయి. పక్షులకూ ఏడాది పొడవునా ఆహారం ఈ ఫుడ్ ఫారెస్ట్‌లో ఏడాది పొడవునా ఏ రోజైనా ఆహారం దొరుకుతుంది. ఈ ఆహారం మాకు మాత్రమే కాదు. నేలలోని సూక్ష్మజీవులు, వానపాములు, ఇతరత్రా జీవరాశి.. నేలపైన సీతాకోక చిలుకలు, పక్షులు, ఉడతలు వంటి చిరుజీవులకూ నిరంతరం ఆహార భద్రత ఉంది. పక్షుల కోసం ఒక అరటి గెల వదిలేస్తాను. 20 అడుగుల కన్నా ఎత్తు పెరిగిన బొప్పాయి చెట్ల నుంచి పండ్లు కోయకుండా పక్షులకే వదిలేస్తున్నాను. జామ కాయలను అవి నా వరకు రానివ్వడం లేదు. అయినా సంతోషమే. ప్రకృతిలో మనుషులతో పాటు అన్ని జీవులూ బతకాలి. అప్పుడే మన బతుకూ బాగుంటుంది. వేరుకుళ్లు, ఆకుమచ్చ, వెర్చిచెట్టు.. నా బాల్యంలో అరటి తోటలకు తెగుళ్లు లేవు. రసాయనిక ఎరువులు వేయడం మొదలుపెట్టిన తర్వాత వేరుకుళ్లు, ఆకుమచ్చ, బంచ్ టాప్ వైరస్(వెర్రిచెట్టు) వచ్చాయి. రసాయనాలు వాడే తోటల్లో వెయ్యి చెట్లకు 150 చెట్ల వరకు నెమటోడ్స్ వల్ల వేరుపురుగు వస్తుంది. గెల పెరగదు.ఆరేళ్ల ప్రకృతి వ్యవసాయంలో వేరుపురుగు సమస్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. 600 చెట్లకు 15 చెట్లకు మాత్రమే ఈ సమస్య ఉంది. వచ్చే ఏడాదికి వాటికీ ఉండదు. మచ్చతెగులు కాయల పెరుగుదలను నష్టపరిచే స్థితిలో లేదు. 20 రోజులకోసారి జీవామృతం పిచికారీతో కంట్రోల్ చేసేవాళ్లం. ఈ సంవత్సరం అసలు పిచికారీ చేయలేదు. వచ్చే ఏడాదికి మచ్చతెగులు పూర్తిగా పోతుంది.మల్చింగ్ వల్ల 50 రకాల ప్రయోజనాలున్నాయని పాలేకర్ మాటలు మా ఫుడ్ ఫారెస్ట్ లో నాకు కళ్లముందు కనపడుతూ ఉంటాయి. తోటలో నుంచి రాలిన ఆకులు, రెమ్మలు, అరటి బొత్తలు, కొబ్బరి పీచు.. ఏదీ బయటపడేయం. అంతా ఆచ్ఛాదనగా మళ్లీ భూమిలోనే కలిసిపోతుంది. ఆర్థిక ప్రయోజనం 10% మాత్రమే! ప్రకృతి వ్యవసాయానికి నాలుగు మూలసూత్రాలని అంటారు (బీజామృతం, జీవామృతం, తగుమాత్రంగా నీటి తేమ, ఆచ్ఛాదన). కానీ, వీటిల్లో ఆచ్ఛాదనే మిగతా వాటికన్నా ఎన్నో రెట్లు ముఖ్యమైన విషయం అని నా అనుభవంలో తెలుసుకున్నాను. మా ఫుడ్ ఫారెస్ట్‌లో ఆచ్ఛాదన బాగా ఉండబట్టే ఇంత ఎండల్లోనూ 12–15 రోజులకోసారి నీరు పెట్టినా సరిపోతున్నది. రైతులందరూ తమకున్న పొలంలో ఎంతో కొంత భాగంలోనైనా తమ ప్రాంతానికి తగిన ఫుడ్ ఫారెస్ట్ ఏర్పాటు చేసుకుంటే.. ఆదాయ, ఆహార, ఆరోగ్య భద్రత కలుగుతుంది. జీవితానికి అంతకన్నా ఇంకేమి కావాలి? మా ఫుడ్ ఫారెస్ట్ నాకు నగదు రూపంలో ఇస్తున్నది పది శాతమే. మిగతా 90 శాతాన్ని ప్రకృతి సేవల రూపంలో ఇస్తుంది. అది అమూల్యం.. లెక్కగట్టలేం..! ఫుడ్ ఫారెస్ట్‌లోని అమృతాహారం (గోగిరెడ్డి రాజేంద్రరెడ్డిని 85006 17426 నంబరులో సంప్రదించవచ్చు) -
ఆస్పత్రిలో అమృతాహారం!
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆరోగ్య ప్రదాయినిగా జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)కి పేరు. దీన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేశారు. ఇది 500 పడకల ఆసుపత్రి. ఇక్కడి రోగులకు ఆసుపత్రి సేవల్లో భాగంగా భోజనం అందుతుంది. వారికి సహాయకులుగా వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం బయట క్యాంటీన్లకు వెళ్లాల్సి వచ్చేది. వారికి కూడా ఆసుపత్రి ప్రాంగణంలోనే భోజనం అందిస్తే బాగుంటుందనే ఆలోచనతో సత్యసాయి సేవాదళ్ ట్రస్టు ఆధ్వర్యంలో మూడేళ్ల క్రితం ఉచిత నిత్యాన్నదానం ప్రారంభించారు. మధ్యాహ్నం 300–350 మంది వరకూ, రాత్రి పూట 300 మంది వరకూ రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ఇందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన కూరగాయలు, ఆకుకూరలనే ఉపయోగిస్తుండటం విశేషం. రిమ్స్ ప్రాంగణంలో నిత్యాన్నదానం క్యాంటీన్లో అన్నంతో పాటు సాంబారు, ఒక కూర, పచ్చడితో అరటిపండు, బొప్పాయి పండ్ల ముక్కలు కూడా అందిస్తున్నారు. తొలుత ఈ క్యాంటీన్‌కు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు మొత్తం బయట మార్కెట్లోనే కొనుగోలు చేసేవారు. అలాగాకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేసిన ఆకుకూరలు, కూరగాయలైతే రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికీ మేలైనవనే ఉద్దేశంతో శ్రీకాకుళానికి చెందిన సామాజిక సేవకురాలు పేర్ల అనురాధ చొరవ చూపి కూరగాయల సాగు ప్రారంభించారు. ఇప్పుడు క్యాంటీన్లో రోజువారీ అవసరాలకు ఈ ప్రకృతి సాగు తోట నుంచే వెళ్తున్నాయి. ‘‘నిత్యాన్నదానం కోసం కేటాయించిన భవనం వెనుక దాదాపు వెయ్యి గజాల ఖాళీ స్థలం వృథాగా ఉండేది. దీనిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉపయోగించకుండా ప్రకృతి సేద్య విధానంలో పండించిన కూరగాయలు, ఆకుకూరల రుచి చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి ఇంటి వద్ద కొన్నిరకాల కూరగాయల మొక్కలు పెంచేవాళ్లం. ఆ ఆసక్తితోనే రిమ్స్‌లో ఆ ఖాళీ స్థలం ప్రకృతి సాగు కోసం ఇవ్వాలని జిల్లా కలెక్టరును కోరాం. రెండేళ్ల క్రితం అనుమతి రాగానే బయటి నుంచి సారవంతమైన మట్టి తెప్పించి వేయించాం. పశువుల గెత్తం కూడా వేశాం. తొలుత టమాటా, మునగ, వంకాయలు, పచ్చిమిర్చి సాగు ప్రారంభించాం. తర్వాత ముల్లంగి, దొండ, గోంగూర, కొత్తిమీర.. వేశాం. వాటిలో అత్యధికంగా గోంగూర, కొత్తిమీర రోజువారీ వంటకు సరిపోతోంది. సాంబారులో వాడకానికి కంది కూడా పండిస్తున్నాం. కరివేపాకు, కొత్తిమీర, గోంగూర పూర్తిగా ఇక్కడిదే వంటకు వినియోగిస్తున్నాం. వీటికి రసాయనిక ఎరువులు వేయలేదు. కేవలం వర్మికంపోస్టు ఎరువు తీసుకొచ్చి వేస్తున్నాం. చీడపీడల సమస్య కూడా కనిపించలేదు. ఎప్పుడైనా కనిపిస్తే దశపత్ర కషాయం, వేపనూనె పిచికారీ చేయిస్తున్నాం. పంటల మధ్యలో బంతి మొక్కలు పెంచడం ద్వారా చీడపీడలను నియంత్రిస్తున్నాం. పచ్చిమిర్చి రోజూ రెండు మూడు కిలోల వరకూ వస్తాయి. వచ్చే వేసవిలో అందుబాటులోకి వచ్చేలా ఇప్పుడు కొన్ని రకాల కూరగాయల మొక్కలు వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సాయి భక్తులు కాళీప్రసాద్, అన్నపూర్ణ గార్ల సహకారంతో అరటితో పాటు మామిడి, సపోట, ఉసిరి, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్ల మొక్కలు పెంచుతున్నాం. సాక్షి ‘సాగుబడి’లో వచ్చే కథనాలు, సూచనలు మాకెంతో ఉపయోగపడుతున్నాయి. ఈ స్ఫూర్తితో శ్రీకాకుళంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద పూలమొక్కలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే పెంచుతున్నాం. ప్రతిరోజూ పూజలకు వాటి పూలు సరిపోతున్నాయి’’ అని అనురాధ చెబుతున్నారు. – అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, ఫొటోలు: కుప్పిలి జయశంకర్ -
చెరకు చెట్లకు నిచ్చెనలు!
అవును..!మట్టిని పూర్తిగా నమ్మిన రైతు ఎన్నడూ నష్టపోడు..!!ఈ నమ్మకాన్ని సజీవంగా నిలబెడుతున్నాడు ఓ యువ రైతు.మట్టిలోని సూక్ష్మజీవరాశి పంటలకు సంజీవనిలా పనిచేస్తూ రైతులకు సిరులు కురిపిస్తోంది. మట్టి ద్రావణాన్ని పంటలపై పిచికారీ చేస్తే అద్భుత దిగుబడులు సాధించవచ్చని ఆవిష్కరించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి విశేష కృషి క్రమక్రమంగా రైతు లోకానికి చేరువ అవుతోంది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడకుండా.. కేవలం మట్టి ద్రావణం, నూనెలతోనే.. చెరకు, పత్తి, కంది+మొక్కజొన్న తదితర పంటలను విజయవంతంగా సాగు చేస్తున్న యువ రైతు జగదీశ్ యాదవ్ విజయగాథ ఇది. మట్టిలో పెరిగే పంటలకు ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులూ అక్కరలేదని.. కేవలం మట్టి ద్రావణం చాలని యువ రైతు జగదీశ్ యాదవ్ స్వానుభవంతో చాటిచెబుతున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్ గ్రామానికి చెందిన రైతు తుమ్మల మల్లయ్య, బుచ్చమ్మ దంపతుల మూడో కుమారుడు జగదీశ్ యాదవ్ డిగ్రీ వరకు చదువుకొని తండ్రి బాటలోనే వ్యవసాయం చేస్తున్నారు. 30 ఎకరాల పొలం ఉంది. గత ఏడాది వరకు రసాయనిక వ్యవసాయం చేస్తూ వచ్చిన జగదీశ్ ఈ ఏడాది సేంద్రియ పద్ధతుల్లో సాగుకు శ్రీకారం చుట్టారు. 12 ఎకరాల్లో చెరకు, మిగతా 18 ఎకరాల్లో బీటీ–2 పత్తి, కంది అంతరపంటగా మొక్కజొన్న, ఆలుగడ్డ తదితర పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటల్లో రసాయనిక ఎరువులు, పురుగుమందులు అసలు వాడటం లేదని జగదీశ్ చెప్పారు. పంటల ఎదుగుదల దశలో నూనెలను డ్రిప్‌తో పంటలకు అందిస్తున్నారు. దీంతోపాటు ప్రముఖ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) పద్ధతిలో మట్టి ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడులు సాధిస్తున్నారు. గత ఏడాది శనగ పంటలను రసాయనిక పద్ధతిలోనే సాగు చేశారు. శనగపచ్చ పురుగు ఆశించగా సీవీఆర్ పద్ధతి గురించి తెలుసుకొని ఎకరానికి 30 కిలోల లోపలి మట్టిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే 5–7 రోజుల్లో పురుగు బెడద పోయిందన్నారు. ఆ స్ఫూర్తితో ఈ ఏడాది పంటలన్నిటినీ సీవీఆర్ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. 15 అడుగుల ఎత్తు పెరిగిన చెరకు 12 ఎకరాల్లో సాగు చేస్తున్న చెరకు తోట అసాధారణంగా 14–15 అడుగుల ఎత్తు పెరగటం విశేషం. గడ ఒకటి 3 కిలోల బరువు ఉండటంతో.. ఎకరానికి 70–80 టన్నుల దిగుబడి వస్తుందని జగదీశ్ ఆశిస్తున్నారు. ఈ నెల 20 నుంచి చెరకు నరికి ఫ్యాక్టరీకి తోలనున్నారు. తమ ప్రాంతంలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడిన వారి చెరకు తోటలు తమ తోట కన్నా సగం ఎత్తు మాత్రమే ఎదిగాయని, ఎకరానికి 40 టన్నులకు మించి దిగుబడి వచ్చే అవకాశం లేదన్నారు. వీరు ఎరువులకే ఎకరానికి రూ. 20 వేల వరకు ఖర్చు చేశారని, తాము 12 ఎకరాలకు 4 దఫాలలో మొత్తం కలిపి కేవలం 60 లీటర్ల నూనెలను వాడామని(ఖర్చు రూ. 5 వేలు) తెలిపారు. 80632 రకం 13 టన్నుల చెరకు విత్తనాన్ని వరుసల మధ్య 5 అడుగులు.. మొక్కల మధ్య అరడుగు దూరంలో మూడు కన్నుల ముచ్చెలను గత మార్చి 20న నాటారు. చెరకు సాగుకు ముందు 12 ఎకరాల్లో 15 రోజుల పాటు రూ. 25 వేల ఖర్చుతో గొర్రెలను మందగట్టారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు 7 సార్లు సీవీఆర్ చెప్పిన విధంగా మట్టి ద్రావణాన్ని పిచికారీ చేశారు. పైమట్టి(భూమిపైన 6 అంగుళాల లోతు వరకు ఉన్న మట్టి) 15 కిలోలు, లోపలి మట్టి(భూమిలో 6 అంగుళాల లోతు నుంచి 4 అడుగుల లోతు వరకు ఉన్న మట్టి) 15 కిలోలను కలిపి 200 లీటర్ల డ్రమ్ముల్లో కలిపి ఎకరానికి పిచికారీ చేశామన్నారు. జేసీబీతో తన పొలంలో ఒక మూల నుంచి రెండు ట్రాక్టర్ల మట్టిని తీసి దాచిపెట్టుకొని ఉపయోగించామన్నారు. స్ప్రేయర్లకు అందనంత ఎత్తుకు పెరగటంతో జూలై నాటి నుంచి మట్టి ద్రావణం పిచికారీని కూడా నిలిపివేశానని జగదీశ్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం 15 అడుగుల ఎత్తుకు పెరగటంతో జడలు వేయడానికి కూడా నిచ్చెనలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం విశేషం. కలుపు, జడలు వేయటం, ఫ్యాక్టరీకి తోలకం తదితర ఖర్చులన్నీ పోను 12 ఎకరాలకు రూ. 22 లక్షల వరకు నికరాదాయం వస్తుందని భావిస్తున్నానని తెలిపారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకపోవటం వల్ల ఖర్చు తగ్గించుకోవటం సాధ్యమైంది. ఆ మేరకు పర్యావరణానికి జరిగే కీడును కూడా నివారించినట్టయింది. పత్తికి గులాబీ పురుగు సోకలేదు! కొన్ని ఎకరాల్లో బీటీ–2 రకం పత్తి, కంది+మొక్కజొన్న తదితర పంటలను కూడా ఈ ఏడాది రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా జగదీశ్ యాదవ్ సాగు చేయటం విశేషం. గులాబీ రంగు పురుగు తమ పొలంలో కనిపించలేదన్నారు. తెల్లదోమ, పచ్చదోమల నివారణకు ప్రతి 15 రోజులకోసారి మట్టి ద్రావణాన్ని(15 కిలోల పైమట్టి + 15 కిలోల లోపలి మట్టిని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి) పిచికారీ చేశామన్నారు. దోమ ఉధృతంగా ఉందనిపిస్తే 10 రోజులకోసారి పిచికారీ చేశామన్నారు. పైమట్టి ద్రావణం వల్ల పంట ఏపుగా పెరుగుతుందని, లోపలి మట్టి ద్రావణం వల్ల చీడపీడలు దరిచేరకుండా ఉంటాయన్నారు. నూనెలను ఎకరానికి 4 లీటర్ల చొప్పున రెండు సార్లు డ్రిప్ ద్వారా అందించామన్నారు. సాధారణంగా పత్తి రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులకు మాత్రమే ఎకరానికి రూ. 20 వేలకు పైగా ఖర్చు చేశారని, తాము ఎకరానికి మహా అయితే రూ. వెయ్యి మాత్రమే ఖర్చు చేశామన్నారు. మట్టి ద్రావణాన్ని తామే పిచికారీ చేసుకుంటామన్నారు. భారీ వర్షాల దెబ్బకు దిగుబడి తగ్గిందని అంటూ.. ఎకరానికి సగటున 9–10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. ఎన్ని రసాయనిక ఎరువులు వేసినా ఇంత దిగుబడి రాదు! చింతల వెంకటరెడ్డి చెప్పినట్లు మట్టి ద్రావణంతోపాటు.. నూనెలను వాడటం వల్లనే ఆశ్చర్యకరమైన దిగుబడులు సాధించగలిగాను. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండానే చెరకు తోట అద్భుతమైన దిగుబడి ఇచ్చింది. పత్తిలో ఎకరానికి రూ. 20 వేల వరకు రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఖర్చు తగ్గింది. రసాయనిక వ్యవసాయం చేసే ఇతర రైతులతో సమానంగా 8–11 టన్నుల దిగుబడి వస్తుంది. ఏ రకంగా చూసినా మట్టి ద్రావణం చక్కని ఫలితాలనిస్తున్నదని రెండేళ్లుగా వివిధ పంటలు సాగు చేసిన అనుభవంతో గ్రహించాను. ఇతర రైతులకూ ఇదే చెబుతున్నాను. – తుమ్మల జగదీశ్ యాదవ్ (80088 61961), పట్లూర్, మర్పల్లి మండలం, వికారాబాద్ జిల్లా (సీవీఆర్ మట్టి ద్రావణం గురించి పూర్తి వివరాలకు‘సాక్షి సాగుబడి’ ఫేస్బుక్ గ్రూప్ చూడండి.) – కె.సుధాకర్ రెడ్డి, సాక్షి, మర్పల్లి, వికారాబాద్ జిల్లా మట్టి ద్రావణం తయారీ -
ఉద్యోగం విడిచి ప్రకృతి సేద్యంలోకి..
ఆత్మసంతృప్తి నివ్వని పనిని, అది ఎంత ఎక్కువ ఆదాయాన్నిచ్చే పని అయినప్పటికీ, మనసు చంపుకొని కొనిసాగించడంలో అర్థం ఏముంది? వ్యవసాయ కుటుంబంలో పుట్టిన చండ్రా వెంకటేశ్వర్రావు మదిలో ఇదే ప్రశ్న మెదిలింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట ఆయన స్వగ్రామం. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కంపెనీలో ఉద్యోగంలో చేరి వివిధ రాష్ట్రాల్లో పనిచేశారు. వార్షిక ఆదాయం రూ.10 లక్షల వరకూ వస్తున్నప్పటికీ ఉద్యోగంలో పూర్తి సంతృప్తి లేదు. మనసంతా ప్రకృతి వ్యవసాయంపైనే ఉంది. రెండేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశారు. డాక్టర్ చో హన్ క్యు, పాలేకర్ సేద్య పద్ధతుల్లో శిక్షణ తీసుకొని తన పొలంలో ప్రకృతి సేద్యం ప్రారంభించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘రసాయన ఎరువులకు అలవాటు పడిన భూముల్లో ప్రకృతి సాగు ప్రారంభిస్తే మొదటి సంవత్సరం ఇబ్బందులు తప్పలేదు. భూమిని సారవంతం చేసుకుంటూ ప్రస్తుతం మూడెకరాల్లో వరి, రెండున్నర ఎకరాల్లో చెరకు, మూడున్నర ఎకరాల్లో కాకర, బీర, సొర, దోసతో పాటు చిక్కుడు వంటి పందిరి జాతి కూరగాయలను సాగు చేస్తున్నా. దిగుబడులు సంతృప్తికరంగా ఉన్నాయి. నీటి నిల్వ కోసం 15 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి కుంటను ఏర్పాటు చేసుకున్నా. పొలంలో ఉన్న నాలుగు బోర్లను వాన నీటితో రీచార్జ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశా. పొలం ఎగువ భాగంలో చెక్ డ్యాం నిర్మించా. ఇంతవరకు నీటి సమస్య లేదు. గతంలో కంటే భూగర్భ జలమట్టం పెరిగింది. నాలుగు దేశీ ఆవులను కొనుగోలు చేసి వాటి మూత్రం, పేడతోనే మొత్తం 10 ఎకరాల పంటకు కావాల్సిన సహజ ఎరువులు, ద్రావణాలను తయారు చేసుకుంటున్నా. నత్రజని కోసం జీవామృతం, వర్మీవాష్ తయారు చేస్తున్నా. జీవామృతం వడకట్టడం కోసం తక్కువ ఖర్చుతో ఫిల్టర్ యూనిట్‌ను సొంతంగా తయారు చేశా. డ్రిప్ ద్వారా పంటలకు అందిస్తున్నాం. వాగుల్లో సేకరించిన గవ్వలు, కోడిగుడ్ల పెంకులను నానబెట్టి కాల్షియం కోసం ఎరువును తయారు చేస్తున్నా. పొటాష్ కోసం పొగాకు కాడల ద్రావణాన్ని పంటలకు అందిస్తున్నా. పూత దశలో ఫిష్ అమినో యాసిడ్ పిచికారీ చేయడం ద్వారా పంటల దిగుబడితో పాటు నాణ్యత పెరుగుతోంది. బియ్యం కడిగిన నీటితో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా తయారు చేస్తున్నా. వరి గడ్డి, చెత్త, కల్లం తుత్తడి, రోడ్డు వెంట ఉండే మొక్కలను తీసుకు వచ్చి ఆచ్ఛాదనగా వాడుతున్నా. మా పొలంలో సుగంధ సాంబ వరి రకం ఈత దశకు వచ్చింది. 5 అడుగులు పెరగడం విశేషం. రాష్ట్రం అంతటా వరిలో దోమపోటు, అగ్గితెగులు, ఆకుచుట్ట, సుడిదోమ వంటి తెగుళ్లతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉంటే.. మా వరి పొలంలో తెగుళ్లు లేవు. గత సంవత్సరం తెలంగాణ సోన రకం వరి సాగు చేసి ఎకరాకు 25 బస్తాల ధాన్యం దిగుబడి సాధించా. బియ్యం పట్టించి కేజీ రూ.50కు నేరుగా వినియోగదారులకు అమ్మాను. చెరకు మొక్కల మధ్య అడుగు, సాళ్ల మధ్య 3 అడుగుల దూరంలో సాగు చేస్తున్నా. అధిక సంఖ్యలో పిలకలు వేసి ఏపుగా పెరుగుతోంది. వేసవి నాటికి చెరకు పక్వానికి వస్తుంది. జ్యూస్ సెంటర్లు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా..’ అని వెంకటేశ్వర్రావు వివరించారు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను వ్యవసాయంలో వాడుతున్నందున వాతావరణ సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. భూమి సారాన్ని కోల్పోయి పంటలు విపరీతమైన తెగుళ్ల బారిన పడుతున్నాయి. తమ ప్రాంత రైతులను ప్రకృతి సేద్యంపై చైతన్య పరిచేందుకు కృషి చేస్తానని వెంకటేశ్వర్రావు (96521 11343) తెలిపారు. – మేకపోతుల వెంకటేశ్వర్లు, సాక్షి, కోదాడ రూరల్, సూర్యాపేట జిల్లా -
నేలతల్లిని బీడువారిస్తే తర్వాతేమి తింటాం?’
► 9 ఏళ్లుగా ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న మహిళా రైతు మల్లీశ్వరి ► జీవామృతం, గో మూత్రం అందిస్తూ అరటి, చెరకు, పసుపు, మినుము పంటల సాగులో మంచి దిగుబడులు ► చీడపీడలు, తెగుళ్ల బెడద లేకుండా రుచికరమైన, నాణ్యమైన వ్యవసాయోత్పత్తులు కృష్ణా తీరంలో సారవంతమైన భూముల్లో ప్రకృతి వ్యవసాయం ఫలప్రదమవుతోంది. వ్యవసాయాన్నే నమ్ముకున్న చిన్న, సన్నకారు రైతులు నేలతల్లికి ప్రణమిల్లుతున్నారు. పాలేకర్ పద్ధతిలో సేద్యం చేస్తూ నాణ్యమైన పంటలను పండిస్తున్నారు. 9 ఏళ్ల క్రితం నుంచే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న కొద్ది మంది తొలి తరం ప్రకృతి వ్యవసాయదారుల్లో అన్నపురెడ్డి మల్లీశ్వరి ఒకరు. తన భర్త సంజీవరెడ్డితో కలిసి రోజుకు పది గంటల పాటు పొలంలో శ్రమిస్తూ ఆదర్శప్రాయంగా ప్రకృతిసేద్యం చేస్తూ.. సత్ఫలితాలు పొందుతున్నారు. ‘2008లో విజయవాడ పోరంకిలో సుభాష్ పాలేకర్ మీటింగ్‌కు మొదటిసారి వెళ్లాం. ప్రకృతి సేద్యం గురించి పాలేకర్ చాలా సంగతులు చెప్పారు. 2010లో పాలేకర్ గుంటూరు వచ్చినపుడు కూడా వెళ్లాను. రసాయనాలు, క్రిమిసంహారక మందులతో నేల ఎంత నిస్సారమవుతున్నదో పూసగుచ్చినట్టు చెబుతుంటే మనసు కదిలిపోయింది. ‘నేలను నమ్ముకుని బతికేవాళ్లం నేలతల్లిని బీడువారిస్తే తర్వాత ఏం తింటాం?’ అనిపించింది. ఏమైనా సరే ఇలాగే పండించాలనుకున్నాం...వెంటనే ఒక ఆవును కొని, మొదలుపెట్టాం’ అని మల్లీశ్వరి గుర్తుచేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి ఆమె స్వగ్రామం. తొలినాళ్లలో ఘన జీవామృతం, జీవామృతం, వివిధ రకాల కషాయాలు వాడారు. నాలుగేళ్ల క్రితం నుంచి కేవలం గోమూత్రం, జీవామృతం తోనే మంచి దిగుబడులు సాధిస్తున్నారు. 20 రోజులకోసారి జీవామృతం.. 10 రోజులకోసారి గోమూత్రం.. ఆరు ఎకరాల నల్లరేగడి భూమిలో అరటితోపాటు చెరకు, పసుపు పంటలను మల్లీశ్వరి సాగు చేస్తున్నారు. బోరు నీళ్లను డ్రిప్పు ద్వారా పంటలకు అందిస్తున్నారు. పంట ఏదైనా వారు అనుసరించే సాగు విధానం మాత్రం ఒక్కటే. ముందుగా దుక్కిలో ఎకరాకు 2 ట్రక్కుల కోళ్ల ఎరువు వేస్తారు. ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 20 రోజులకోసారి.. 10 రోజులకోసారి గోమూత్రాన్ని డ్రిప్పు ద్వారా పంటలకు అందిస్తారు. కలుపు నివారణకు, భూసారం పెంపొందించడానికి గడ్డీ గాదం, పంట వ్యర్థాలను ఆచ్ఛాదనగా వేస్తూ.. మంచి దిగుబడులు సాధిస్తున్నారు. రెండు ఆవులను పెంచుతున్నారు. ఆవుల పాకలో గోమూత్రం నిల్వ చేసేందుకు గుంత తవ్వి 3 సిమెంట్ వరలు ఏర్పాటు చేశారు. దాని అడుగున గులకరాళ్లు, బేబీ చిప్స్, ఇసుక మిశ్రమాన్ని వేశారు. ఈ గుంతలోకి 10 రోజులకోసారి 30 లీటర్ల గోమూత్రం చేరుతుంది. ఈ మూత్రాన్ని బకెట్లతో సేకరించి వడకట్టి, డ్రిప్ ట్యాంకులో పోసి, పంటలకు అందిస్తారు. 20 అడుగులు పెరిగిన అరటి చెట్లు.. 2008లో తొలిసారిగా అరటిని ప్రకృతిసేద్య పద్ధతిలో సాగు చేశారు. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటారు. జనవరి–ఫిబ్రవరి మాసాల్లో కోతలయ్యాయి. చక్కెరకేళి రకంలో గెలకు 70 కాయలు.. కర్పూర అరటి చెట్లు దాదాపు 20 అడుగుల ఎత్తు పెరగటం విశేషం. గెలకు 200 కాయలతో ఒక్కో గెల 45 కిలోల వరకూ బరువు తూగుతోంది. రసాయన ఎరువులతో సాగు చేసిన అరటి కాయల కన్నా.. ఇవి అధికంగా పొడవు పెరిగి, మంచి రంగుతో ఆకర్షణీయంగా, రుచిగా ఉన్నాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. దీంతో వ్యాపారస్తులు ఈ అరటికాయలపై ఆసక్తి చూపుతున్నారు. వీరి పసుపు పొలంలో పుచ్చు సమస్య లేదు. దుంప బాగా ఊరి ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఒకటిన్నర ఎకరాలో చెరకును సాగు చేస్తున్నారు. గత రబీలో మల్లీశ్వరి ఎకరాకు 5 క్వింటాళ్ల మినుము దిగుబడి సాధించి.. ఔరా అనిపించారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా ఇంతకంటే భరోసా ఏముంటుంది? ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గాయి. తోటి రైతులు ఎకరా భూమిలో సేద్యానికి ఏటా 10 పిండి కట్టలు (డీఏపీ, యూరియా, పొటాష్..) వేస్తున్నారు. సగటున ఒక పంటకు ఎకరాకు రూ.7–8 వేలు ఖర్చవుతోంది. పురుగుమందుల ఖర్చు అదనం. ఈ ఖర్చులు లేకుండానే ప్రకృతి సేద్యం చేస్తున్నాం. జీవామృతం, ఘనజీవామృతం సొంతంగా తయారుచేసుకోవటానికి కాస్త శ్రమ పడుతున్నప్పటికీ.. సంతృప్తి ఉంది. పండ్లు నాణ్యంగా, రుచికరంగా ఉంటున్నాయి. మంచి ధర పలుకుతోంది. ఆరోగ్యానికి, ఆదాయానికీ ఇంతకంటే భరోసా ఏముంటుంది? నాకు మందుబిళ్లలతో అవసరమే రాలేదంటే ప్రకృతి ఆహారాన్ని తినటమే కారణం. – అన్నపురెడ్డి మల్లీశ్వరి, మహిళా రైతు, నూతక్కి, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా వాతావరణం ఎలా ఉన్నప్పటికీ నిలకడగా పంట దిగుబడులు! మల్లీశ్వరి రోజుకు 10 గంటలు పొలంలోనే ఉండి అన్ని పనులూ స్వయంగా చూసుకుంటుంది. 9 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందువల్ల మా భూమి బాగుపడింది. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పంట దిగుబడులు నిలకడగా వస్తున్నాయి. పంట నాణ్యత బావుంది. సాగు ఖర్చులు బాగా తగ్గాయి. మమ్మల్ని చూసి మా ఊళ్లో కొంతమంది రైతులు ప్రకృతి సేద్యంపై ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. – అన్నపురెడ్డి సంజీవరెడ్డి (99510 60379), నూతక్కి, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా