పంటల సాగులో ఆయన ప్రత్యేకత చూపుతారు. రసాయన ఎరువులకు చాలా దూరంగా ఉంటారు. ప్రకృతి పద్ధతిలో..జీవ ఎరువులు ఎంతో మేలంటారు. శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తారు. అధిక దిగుబడులు సాధించేలా సాగులో మెలకువలు పాటిస్తారు. కొత్త వంగడాలపై దృష్టి సారించి.. సాగులో భళా అనిపిస్తారు. ఇతర రాష్రా ్టలకు విత్తనాలను అమ్మే స్థాయికి ఎదిగారు. చాలామంది రైతులు ఈయన వద్దకే వచ్చి వంగడాలు తీసుకెళుతుంటారు. ఆ ఆదర్శరైతే చాపాడు మండలానికి చెందిన 63 ఏళ్ల సదాశివారెడ్డి. ఆయన సాగు కృషిని మెచ్చి పలువురు సత్కరించారు. చాలా మంది రైతులు ఆయన మార్గంలో పయనిస్తున్నారు. ఆయన మాత్రం ప్రకృతికి ప్రణామం అంటారు.
చాపాడు(వైఎస్సార్ జిల్లా): చాపాడు మండలం వి.రాజుపాళెం గ్రామానికి చెందిన లోమడ సదాశివారెడ్డి అనే రైతు తన 14 ఏట నుంచే తండ్రితో కలసి వ్యవసాయం చేస్తున్నాడు. ఏడో తరగతి చదువుకున్న ఈయన మొదటి నుంచి వ్యవసాయంలో కొత్త వంగడాలు.. అధిక దిగుబడులు లక్ష్యంగా సాగు చేస్తున్నాడు. తనకున్న ఐదకరాల్లో కొన్నేళ్ల క్రితం నుంచి ఉద్యాన పంటలు, ఆరుతడి పంటల సాగు చేస్తున్నాడు. 1992లో వ్యవసాయ పరిశోధన కేంద్రాల సహకారంతో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ.. తాను పండించిన వంగడాలను నేరుగా ప్రభుత్వానికే విక్రయిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఆచార్య ఎన్జీ రంగా వరకూ..
1992లో హైదరాబాదుకు చెందిన ఐపీఎం ప్రాజెక్టు వద్దకెళ్లి అక్కడి శాస్త్రవేత్తలతో వ్యవసాయంలో సలహాలు తీసుకున్న సదాశివారెడ్డి అప్పటి నుంచి మంచి దిగుబడులు తీస్తూ కొత్త వంగడాలతో వ్యవసాయం చేస్తున్నాడు. అప్పట్లోనే వేరుశనగపంటలో రసాయన ఎరువుల కంటే మిత్ర పురుగులు, కీటకాలు, పక్షుల వల్లనే పంటకు లబ్ధి చేకూరుతుందని పొలంలో వీటిని పెంపొందించటంపై ప్రత్యేక దృష్టి సారించారు.
1996లో ఐపీఎం తిరుపతిలోని ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వ్యవసాయ పరిశోధన కేంద్రం అనుసంధానంలో మూడేళ్ల పాటు అప్పటి వ్యవసాయ పరిశోధకులు జిల్లాలో పలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ సమయంలో రాజుపాళెంలోని సదాశివారెడ్డి పొలంలో కూడా పరిశోధనలు చేశారు. ఏటా నవంబరు నుంచి జనవరి వరకూ రైతులకు అందుబాటులో ఉంటూ వ్యవసాయంలో మెలకువలు, సూచనలు నేర్పించారు. పంటల సాగులో ఆముదం, ప్రొద్దుతిరుగుడు వంటి మొక్కలు అక్కడక్కడా ఉండేలా, వీటి తో పాటు ఎత్తుడి కొయ్యలను ఏర్పాటు చేసి వీటి మీద మిత్ర పురుగులు, కీటకా లు, పక్షులు ఉండేలా ఏర్పాటు చేసుకున్నారు.
మినుము, వేరుశనగ ఇతర రాష్ట్రాలకు..
2009 నుంచి 2013 వరకూ వేరుశనగ, మినుము పంటలతో పాటు పండ్లతోటల సాగు క్రమంలో సూరజ్, కోహినూరు, బావి వంటి పండ్లతోటలను, క్యాబేజీ, కాలీప్లవర్, బంతి పూలు వంటి వాటిని సాగు చేసి మంచి ఫలితాలు సాధించి డిల్లీ, ముంబయి ఇంకా పలు ప్రాంతాలకు ఎగుమతులు చేశాడు.
∙2017 నుంచి టీబీజీ104 రకం మినుము, టీసీజీఎస్1694 వంటి వేరుశనగ పంటలను పండిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రశాంతి సహకారంతో ఏటా 150 క్వింటాళ్ల మేర దిగుబడులు తీసి 30 క్వింటాళ్ల చొప్పున ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రానికి ఎగుమతి చేస్తూ ఇక్కడి ప్రాంత రైతులకు విక్రయిస్తున్నాడు. ఇంతే కాక తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని శ్రీకాకుళం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, తిరుపతి, నెల్లూరు ప్రాంతాలకు చెందిన రైతులు నేరుగా సదాశివారెడ్డి వద్దకు వచ్చి విత్తనాలు కొనుగోలు చేసి తీసుకెళతుంటారు.
∙ఇటీవల కడప ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు చంద్రిక, సునీల్‌కుమార్‌లు సాగులో ఉన్న వేరుశనగ పంటను పరిశీలించారు. ఏ పంట సాగు చేసినా డ్రిప్ విధానంలో సాగునీరు పెడుతూ, దాని ద్వారానే వేస్ట్ కంపోజ్ ఎరువు, కరిగే జీవ ఎరువులు, 13045 పోటాషియం సల్ఫేట్ వంటి ఎరువును పంటకు నీటి ద్వారా అందిస్తానని, వీటి కంటే ఎక్కువగా మిత్ర పురుగులు, కీటకాలు, పక్షుల ద్వారా పంటకు మేలు జరుగుతుందని సదాశివారెడ్డి తెలుపుతున్నాడు.
జీవ ఎరువులు ఎంతో మేలు..
వ్యవసాయంలో రసాయన ఎరువులను నమ్ముకోవద్దని, జీవ ఎరువులు, ప్రకృతి వారసత్వంగా లభించే మిత్ర పురుగులు, కీటకాలు, పక్షుల వలన కూడా ఉపయోగం ఉంటుందని సదాశివారెడ్డి అంటున్నారు. పత్రికలు.. టీవీల్లో వచ్చే వ్యవసాయ కార్యక్రమాలు తన సాగుకు ఎంతో ఉపకరించాయని ఆయన అంటున్నారు.
వరించిన వివిధ సత్కారాలు
ఆదర్శ రైతు సదాశివారెడ్డి వ్యవసాయంలో సాధించిన విజయాల నేపథ్యంలో పలువురు సత్కరించారు. 1996, 97లో పురుగు మందులు లేని పంట దిగుబడులపై ఏపీఎం సత్కారం పొందాడు. 2002లో విత్తన ఉత్పత్తిపై అప్పటి జిల్లా కలెక్టర్ పరీధా చేతుల మీదుగా సన్మానం, 2010లో వేరుశనగ అధిక దిగుబడులపై డివిజనల్ వ్యవసాయ అధికారులతో సత్కారం పొందారు.
2017లో ప్రభుత్వ సంక్రాంతి సంబరాల్లో ఉత్తమ రైతుగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ సత్కారం పొందారు. గతేడాది ఎన్జీ రంగా యూనివర్సిటి వీసీ విష్ణువర్థన్‌రెడ్డి, వ్యవసాయ సీనియర్ శాస్త్రవేత్త ప్రశాంతి పంటలను పరిశీలన చేసి ఈ రైతును అభినందించారు.
ఈ ఏడాది జూలై 8న వైఎస్సార్ జయంతి రైతు దినోత్సవం సందర్భంగా కడప ఊటుకూరు వ్యవసాయ కేంద్రంలో ఉత్తమ రైతుగా సత్కారం అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment