Chennamaneni Padma: ఆవులే ఆమె సర్వస్వం | Cow Guardian Doctor Chennamaneni Padma Successful Special Story | Sakshi
Sakshi News home page

Chennamaneni Padma: ఆవులే ఆమె సర్వస్వం

Published Sat, Sep 30 2023 4:13 AM | Last Updated on Sat, Sep 30 2023 5:28 AM

Cow Guardian Doctor Chennamaneni Padma Successful Special Story - Sakshi

‘‘ఆవు పైన ప్రేమ... లెక్చరర్‌ ఉద్యోగాన్ని వదులుకునేలా.. నగరం నుంచి పల్లెతల్లికి దగ్గరయ్యేలా కొండకోనల వెంట ప్రయాణించేలా వరదలను తట్టుకొని నిలబడేలా చేసింది’’ అని వివరిస్తుంది డాక్టర్‌ చెన్నమనేని పద్మ. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినా, వృత్తి ఉద్యోగాల్లో కొనసాగుతున్నా ఊరు ఆమెను ఆకట్టుకుంది. 200 ఆవులకు సంరక్షకురాలిగా మార్చింది. పదేళ్లుగా చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలను, వరించిన జాతీయస్థాయి అవార్డులను వివరించారు పద్మ.

‘‘నా చిన్ననాటి రోజులకు ఇప్పటికీ ఆహారంలోనూ, వాతావరణంలోనూ చాలా తేడా కనిపించేది. తెలుగు లెక్చరర్‌గా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఉన్న ఎయిడెడ్‌ గర్ల్స్‌ కాలేజీలో ఉద్యోగం చేసేదాన్ని. వ్యవసాయం, ఆహారం ప్రాముఖ్యతను నేను చదువు చెప్పే అమ్మాయిలకు ప్రత్యక్షంగా చూపాలనుకున్నాను. మా నాన్నగారి ఊరు జగిత్యాలకు ఎప్పుడో ఒకసారి వెళ్లేదాన్ని.

ఊరి ప్రయాణం, అక్కడి వాతావరణం నాకు బాగా నచ్చేది. ఇదే విషయాన్ని మా క్లాస్‌ అమ్మాయిలకు చెప్పి, ఆసక్తి ఉన్నవాళ్లు పేర్లు ఇస్తే, తీసుకెళతాను అని చెప్పాను. ఒకేసారి యాభైమంది పేర్లు ఇచ్చారు. వారందరికీ బస్‌ ఏర్పాటు చేసి, తీసుకెళ్లాను. వ్యవసాయంలో ఏమేం పనులు ఉంటాయో అన్నీ పరిచయం చేశాను. అక్కడి గోశాలకు తీసుకెళితే పిల్లలంతా కలిసి, లక్ష గొబ్బెమ్మలు తయారు చేశారు.

ఎరువుగా గొబ్బెమ్మలు
కొన్నిరోజుల తర్వాత గోశాల వాళ్లు గొబ్బెమ్మలను తీసుకెళ్లమని చెప్పారు. అప్పటివరకు ఆలోచన చేయలేదు. కానీ, వాటిని హైదరాబాద్‌ తీసుకొచ్చి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏదైతే అది అయ్యిందని వ్యాన్‌లో లక్షగొబ్బెమ్మలను తీసుకొచ్చి, ఇంట్లో పెట్టించాను. ఎక్కడ చూసినా గొబ్బెమ్మలే. ఇంట్లోవాళ్లు ఏంటిదంతా అన్నారు.

కొన్ని రోజులు వాటిని అలాగే చూస్తూ ఉన్నాను. గోమయాన్ని ఎరువుగా వాడితే పంట బాగా వస్తుంది. అయితే, నగరంలో ఇదెలా సాధ్యం అవుతుంది అనుకున్నాను. రూఫ్‌ గార్డెన్‌వాళ్లకు ఇస్తే అనే ఆలోచన వచ్చిన వెంటనే వాట్సప్‌ గ్రూపుల్లో గొబ్బెమ్మలు కావాల్సిన వాళ్లు తీసుకెళ్లచ్చు మొక్కలకు ఎరువుగా అని మెసేజ్‌ చేశాను. రెండు, మూడు రోజుల్లో మొత్తం గొబ్బెమ్మలు ఖాళీ అయ్యాయి.

ఆవుల కొనుగోలు...
ఊరు వెళ్లినప్పుడల్లా దారిలో గోవుల గుంపు ఉన్న చోట ఆగి, కాసేపు అక్కడ ఉండి వెళ్లడం ఒక అలవాటుగా ఉండేది. అలా ఒకసారి 80 ఏళ్ల వ్యక్తి నా అడ్రస్‌ కనుక్కొని వచ్చాడు. తన దగ్గర ఉన్న ఆవులను బతికించలేకపోతున్నానని, పిల్లలు వాటిని వదిలించుకోమని చెబుతున్నారని ఏడ్చాడు. నాకేం చేయాలో అర్ధం కాలేదు. అంత పెద్ద వ్యక్తి గోవుల గురించి బాధపడుతుంటే చూడలేకపోయాను. ఏదైతే అది అవుతుందని 55 గోవులను అతను చెప్పిన మొత్తానికి నా పొదుపు మొత్తాల నుంచి తీసి, కొనేశాను.

అర్ధం చేసుకుంటూ...
కొనడంలో ధైర్యం చేశాను కానీ, ఆ ఆవులను ఎలా సంరక్షించాలో అర్ధం కాలేదు. వర్కర్లను, వాటికి గ్రాసం ఏర్పాటు చేయడం తలకు మించి భారమైంది. వాటిని చూసుకోవడానికి ఉద్యోగం మానేశాను. అయినవాళ్లంతా తప్పు పట్టారు. ‘కాలేజీకి త్వరలో ప్రిన్సిపల్‌ కాబోతున్నావ్‌.. ఇలాంటి టైమ్‌లో ఉద్యోగం వదులుకొని ఇదేం పని’ అన్నారు. కానీ, ఆవు లేని వ్యవసాయం లేదు. ఆవు లేకుండా మనిషి జీవనం లేదనిపించేది నాకు.

ఇంట్లోవాళ్లకు చెప్పి జగిత్యాలలోనే ఆవులతో ఉండిపోయాను. కానీ, ఊళ్లో అందరినుంచీ కంప్లైంట్లే! ఆవులు మా ఇళ్ల ముందుకు వస్తాయనీ, వాకిళ్లు పాడుచేస్తున్నాయని, పోలీసు కేసులు కూడా అయ్యాయి. ఆ ఊళ్లో పుట్టిపెరిగిన దాన్ని కాదు కాబట్టి, నాకెవరూ సపోర్ట్‌ చేసేవాళ్లు లేరు. దీంతో ఆవులను తీసుకొని గోదావరి నదీ తీరానికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పది రోజులు గడిచాయో లేదో విపరీతమైన వానలు, వరదలు. ఆ వరదలకు కొన్ని ఆవులు కొట్టుకుపోయాయి కూడా.

నాకైతే బతుకుతానన్న ఆశ లేదు. ఎటు చూసినా బురద, పాములు.. కృష్ణుడిని వేడుకున్నాను. ‘ఈ ఆవులు నీవి, నీవే కాపాడుకో..’ అని వేడుకున్నాను. అక్కణ్ణుంచి బోర్నపల్లి అటవీ ప్రాంతంలో 15 రోజులు ఆవులతో గుట్టలపైనే ఉన్నాను. మూగజీవాల గురించి, ప్రకృతి గురించి నాకేమీ తెలియదు. ఏం జరిగినా వెనక్కి వెళ్లేది లేదు అనుకున్నాను. నా మొండితనం ప్రకృతిని అర్థం చేసుకునేలా చేసింది. ఎప్పుడో వీలున్నప్పుడు హైదరాబాద్‌ వచ్చి వెళ్లేదాన్ని.

మా ఇద్దరు అబ్బాయిలు  జీవితాల్లో సెటిల్‌ అయ్యారు. ఇక నా జీవితం ఆవులతోనే అనుకున్నాను. కరోనా టైమ్‌లో మా కుటుంబం అంతా హైదరాబాద్‌లో ఉంది. నేను గోవులతో అడవుల్లో ఉన్నాను. ఓసారి కుటుంబం అంతా కూర్చుని ఆవులు కావాలా, మేం కావాలో తేల్చుకోమన్నారు. ఆవులే కావాలి అన్నాను. నాకు ఉన్న ఈ ఇష్టాన్ని గమనించిన మా వారు తను చేస్తున్న సెంట్రల్‌గవర్నమెంట్‌ జాబ్‌ నుంచి వీఆర్‌ఎస్‌ తీసుకొని వచ్చేశారు. తన పొదుపు మొత్తాలను కూడా ఆవుల సంక్షేమానికి వాడాం.

మహిళలకు ఉపాధి...
ప్రతి యేటా ఆవుల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 200 వరకు చేరింది. 50 ఆవులను గుట్టల ప్రాంతాల వారికి ఉచితంగా ఇచ్చేశాను. మిగతా వాటి గోమయంతో పళ్ల పొడి నుంచి వందరకాల ఉత్పత్తులను తయారు చేయిస్తున్నాను. ఇక్కడి గిరిజన ప్రాంత స్త్రీలు వీటి తయారీలో పాల్గొంటున్నారు. గోమయ ప్రమిదలు, పిడకలు, యజ్ఞసమిధలు.. ఇలా ఎన్నో వీటి నుంచి తయారు చేస్తున్నాం.

చిన్నా పెద్ద టౌన్లలో గోమయం ఉత్పత్తుల తయారీలో వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తున్నాం. ఈ ఉత్పత్తులతో ఎగ్జిబిషన్స్‌ ఏర్పాటు చేసి, నగర ప్రజలకు చేరువ చేస్తుంటాను. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గిరిజన మహిళలకు ఇస్తుంటాను. పట్టణాల్లో ఉన్నవాళ్లు ఎవరైనా వచ్చి ఆవులను చూసుకోవచ్చని ‘స్వధర్మ’ పేరుతో ఆన్‌లైన్‌లో ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ చేశాను. వీడియోలు చూసి ముందు చాలా మంది ఉత్సాహం చూపారు. కానీ, చివరకు ముగ్గురు మాత్రమే వచ్చారు.

వీడియోల్లో ఆవులను, ఇక్కడి వాతావరణం చూడటం వేరు. కానీ, నేరుగా ఈ పరిస్థితులను ఎదుర్కోవడం వేరు. ‘మేమూ వస్తాం, కానీ బెడ్‌రూమ్‌ ఉందా, అటాచ్డ్‌ బాత్‌రూమ్‌ ఉందా’ అని అడుగుతుంటారు. కానీ, మేమున్నచోట అలాంటి వసతులేవీ లేవు. దొరికినవి తింటూ, ఆవులతోనే జీవనం సాగిస్తూ ఉంటాం. ఆరు నెలలు గుట్ట ప్రాంతాల్లో, ఆరు నెలలు గోదావరి నదీ తీర ప్రాంతాల వెంబడి తిరుగుతుంటాను. ఈ జీవనంలో ఓ కొత్త వెలుగు, స్వచ్ఛత కనిపిస్తుంటుంది.

నేర్చుకున్న వైద్యం..
మనుషుల మాదిరిగానే ఆవులు కూడా ఎంతో ప్రేమను చూపుతాయి. జబ్బు పడతాయి. వాటికి ఆరోగ్యం బాగోలేకపోతే ‘నన్ను చూడు’ అన్నట్టుగా దగ్గరగా వచ్చి నిలబడతాయి. కనిపించకపోతే బెంగ పెట్టుకుంటాయి. వాటికి జబ్బు చేస్తే సీనియర్‌ డాక్టర్స్‌ని పిలిíపించి చికిత్స చేయిస్తుంటాను. నేనే వాటి జబ్బుకు తగ్గ చిక్సిత చేయడం కూడా నేర్చుకున్నాను. ఆవులకు సంబంధించి మురళీధర గో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాను. దీని ద్వారా రేపటి తరం పిల్లలకు మూగజీవాల విలువ... ముఖ్యంగా ఆవు గొప్పతనాన్ని తెలియజేయాలనుకుంటున్నాను’’ అని వివరించారు పద్మ.

వరించిన అవార్డులు
పట్టణప్రాంతాల వారిని పల్లెకు తీసుకెళ్లి చేయిస్తున్న సేవకు 2012లో నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌ అవార్డ్‌ను రాష్ట్రపతి ప్రణవ్‌ ముఖర్జీ చేతుల మీదగా అందుకున్నాను. 2013లో చైనాలో జరిగే యూత్‌ ఎక్సే ్చంజ్‌ ప్రొగ్రామ్‌కి ప్రభుత్వం టాప్‌ 100 మెంబర్స్‌ని పంపించారు. వారిలో నేనూ ఒకరిగా ఆ సోషల్‌ యాక్టివిటీస్‌లో పాల్గొనడం మర్చిపోలేనిది. ఈ యేడాది ఇందిరాగాంధీ అవార్డు సెలక్షన్‌కి కమిటీ మెంబర్‌గా ఆహ్వానం అందుకున్నాను. నిస్వార్థంగా చేసే సేవ ఏ కొద్దిమందికైనా ఉపయోగపడినా చాలు. రైతులు ఎవరైనా ఆవు కావాలని వస్తే వారి వివరాలన్నీ తీసుకొని, ఉచితంగా అందజేస్తున్నాం.

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement