cows
-
పుట్టింటి గోవు.. ఆ ఇంటికి ఆదరువు
కుమార్తెకు పెళ్లిచేస్తే.. తోడుగా గోవును సాగనంపడం కొన్ని కుటుంబాల్లో ఆచారం. ఆస్తిపాస్తులు లేని గ్రామీణ పేదలు ఇలా గోవును కట్నంగా సమర్పించుకోవడం ఆనవాయితీ. ఆ నూతన వధూవరులిద్దరూ కట్నంగా వచ్చిన గోవును వరంగా భావించి.. దానిలోనే మహాలక్ష్మిని చూసుకున్నారు.పుట్టింటి కానుకతో మెట్టినింట కాసుల పంటగా మలుచుకున్నారు. ఆ గోవుతో ఏకంగా 150 ఆవుల పాడిని సృష్టించారు. నలుగురు పిల్లల పెళ్లిళ్లు మంద ఆదాయంతోనే కానిచ్చారు. కరువు సీమలో ఒక్క ఆవుతో కరువును జయించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది అయ్యమ్మ, వీరారెడ్డి కుటుంబం. – మంత్రాలయంఆ ఇంట అదే కామదేనువుకర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలం ఎరిగేరి గ్రామానికి చెందిన మూకయ్య, బంగారమ్మ దంపతుల పెద్ద కుమార్తె అయ్యమ్మ. ఆమెకు 18వ ఏట కోసిగి గ్రామానికి చెందిన కామన్‌దొడ్డి వీరారెడ్డితో వివాహం నిశ్చయించారు. మూకయ్య స్థోమతకు తగ్గట్టు అయ్యమ్మకు కట్నంగా గోవును ఇవ్వాలని నిర్ణయించి సుమారు 30 ఏళ్ల క్రితం పెళ్లి బాజాలు మోగించారు. అప్పగింతల రోజున తండ్రి మూకయ్య ఓ పెయ్యి ఆవును అయ్యమ్మకు ఇచ్చి భర్తతో మెట్టినింటికి సాగనంపాడు. అయ్యమ్మ, వీరారెడ్డి అనుబంధం వరకట్నంగా వచ్చిన ఆవుతోనే మొదలైంది. గోవునే వరలక్ష్మిగా భావించి.. కూలీనాలి చేసుకుంటూ ఆ దంపతులిద్దరూ గోవును పెంచుకున్నారు. తొలి చూడిలోనే అది మరో పెయ్యి దూడకు జన్మనిచ్చింది. ఇలా ఏడాదికి రెండు ఆవుల చొప్పున జన్మించగా.. పుట్టిన ఆవుల సంతతిని విక్రయించకుండా కుటుంబ పోషణకు వనరుగా ఆ దంపతులు మలచుకున్నారు. కూలి పనులు మానేసి పశువులను పోషించుకుని కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ వచ్చారు. ఇలా 30 ఏళ్లలో ఆవుల సంతతి 150కి పెరిగింది. వారింట అడుగుపెట్టిన గోవు సుమారు 16 ఏళ్ల క్రితం మరణించగా.. దాని సంతతి మాత్రం ఇప్పటికీ వృద్ధి చెందుతూనే ఉంది.వలసబాట పట్టకుండా..ఏటా వయసు మళ్లిన ఆవులు, దూడలను విక్రయిస్తూ అయ్యమ్మ, వీరారెడ్డి దంపతులు బాగానే కూడబెడుతున్నారు. ఏటా 10 టన్నులకు పైగా ఆవు పేడను సైతం రైతులకు విక్రయిస్తూ ఆదాయం గడిస్తున్నారు. ప్రస్తుతం ఈ దంపతుల వద్ద 50 గోవులు ఉన్నాయి. కోసిగి ప్రాంతం కరువుకు ప్రసిద్ధి. ఇక్కడ వ్యవసాయ పనులు ముగియగానే ప్రజలంతా ఇతర ప్రాంతాలకు వలసపోతుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి బతుకు బండి నడుపుకుంటారు. ఏటా ఎంత లేదన్నా 15 వేల కుటుంబాలకు పైగా ఇక్కడి నుంచి వలస వెళ్తారు. అయితే, అయ్యమ్మ కుటుంబం ఏ ఒక్కరోజు వలసబాట పట్టలేదు. పాడితో కరువును జయించడం ఎలాగో అయ్యమ్మ కుటుంబానికి చూస్తే బోధపడుతుంది.ఊపిరి ఉన్నంత వరకు వదలనుమా అయ్యకు మేం ఐదుగురు కూతుళ్లం. నేను పెద్ద కూతుర్ని. మా నాన్న ఓ ఆవును కట్నంగా ఇచ్చాడు. తోబుట్టువులు నలుగురికి ఒక్కో ఆవును కట్నంగా ఇచ్చాడు. నేను అదే ఆవుతోనే జీవితం ఆరంభించాను. ఊపిరి ఉన్నంతవరకు పాడి పోషణను వదలను. నేను తనువు చాలించినా పాడిని వదల పెట్టవద్దని నా పిల్లలకు చెబుతాను. గోవులు లేకుంటే మా బతుకు ఎలా ఉండేదో ఊహించలేను. – కామన్‌దొడ్డి అయ్యమ్మ, కోసిగిఎప్పుడూ ఇబ్బంది పడింది లేదుఅత్తమామలు ప్రేమతో ఆవును కట్నంగా ఇచ్చారు. దానిని మేం దైవంగా స్వీకరించాం. ఆవు పోషిస్తూ పాడిని పెంచాం. ఏనాడూ పాడి పోషణలో విసుగు చెందలేదు. ఇబ్బంది పడింది కూడా లేదు. ఇద్దరం పాడిని చూసుకుంటూ సంసారం కొనసాగించాం. మేం ఇప్పటివరకు కరువును చూడలేదు. ఇక్కడి నుంచి ఎంతోమంది వలసపోతున్నారు. మేం మాత్రం ఏ రోజూ వెళ్లలేదు. మా మామ మూకయ్య నేటికీ మా ఆదర్శ జీవనంపై ఆనందం వ్యక్తం చేస్తాడు. – కామన్‌దొడ్డి వీరారెడ్డి, కోసిగిపైసా అప్పు లేకుండా పెళ్లిళ్లుఅయ్యమ్మ, వీరారెడ్డి దంపతులకు రాముడు, ఈరయ్య, వీరభద్ర, మహేష్, కుమార్తె రామేశ్వరమ్మతో కలిపి ఐదుగురు సంతానం. పెద్ద కుమారుడు రాముడికి 20వ ఏట వివాహం జరిపించారు. ఆ పెళ్లికి రూ.30 వేలు ఖర్చు కాగా.. మందలో కొన్ని దూడలను విక్రయించి గట్టెక్కారు. రెండో కొడుకు ఈరయ్యకు 21వ ఏట వివాహం జరిపించగా.. రూ.50 వేలు ఖర్చయ్యింది. దీంతో కొన్ని ఆవులు, దూడలను విక్రయించారు. మూడో కొడుకు వీరభద్ర పెళ్లికి రూ.1.50 లక్షలు ఖర్చు కాగా.. అందుకు కూడా లేగ దూడలను అమ్మి శుభకార్యం జరిపించారు. నాలుగో కుమారుడు మహేష్‌కు రెండేళ్ల క్రితం వివాహం చేయగా.. రూ.3 లక్షలు ఖర్చయ్యింది. ఆ మొత్తాన్ని కూడా కొన్ని దూడల్ని విక్రయించి సొమ్ము సమకూర్చుకున్నారు. ఇక ఒక్కగానొక్క కూతురు రామేశ్వరమ్మకు సంబంధాలు వెతుకుతున్నారు. -
ఆత్మీయ నేస్తాలు.. పుంగనూరు పొట్టి దూడలు
మూడడుగుల ఎత్తుంటాయి.. చూడముచ్చటగా కనిపిస్తాయి. మార్కెట్లో ధర మాత్రం లక్షల్లో పలుకుతాయి. ప్రపంచంలోనే అరుదైన ఈ పుంగనూరు పొట్టి దూడలను పోటీపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. అదృష్ట చిహ్నంగా భావించే ఈ దూడలను పెంచుకునేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలో ఔత్సాహిక రైతులు చిట్టి ‘పొట్టి’ నేస్తాలను ప్రత్యేకంగా ఉత్పత్తి చేయిస్తున్నారు. అపురూప దూడలను విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈ విశిష్ట జాతిని మరింతగా పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా పలమనేరులోని పశు పరిశోధన కేంద్రంలోపొట్టి దూడల సంరక్షణకు ఏర్పాట్లు చేశారు. పలమనేరు : పుంగనూరు పొట్టిరకం దూడల పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. పుట్టిన సమయంలో ఈ దూడ కేవలం అడుగు ఎత్తు మాత్రమే ఉంటుంది. జీవితకాలంలో కేవలం మూడడుగులు మాత్రమే పెరుగుతుంది. తోక నేలను తాకేలా ఉండే ఈ రకం దూడలకు ప్రస్తుతం భలే డిమాండ్ వచ్చింది. ఫస్ట్ క్వాలిటీ రకం దూడలు రూ.2 నుంచి 4 లక్షలు పలుకుతున్నాయి. రెండో క్వాలిటీ దూడలు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రేటుకు అమ్ముడవుతున్నాయి. ఈ దూడలు ఇంట్లో ఇంటే ఆరోగ్యంతో పాటు అదృష్టం వరిస్తుందనే మాట వినిపిస్తోంది. వీటిని కొనేందుకు వందలాదిమంది నిత్యం పశువుల సంతలు, రైతుల వద్దకు తిరుగుతున్నారు. సాధారణంగా ఇళ్లలో పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లుల జాబితాలో ఇప్పుడు పొట్టిదూడలు సైతం చేరిపోయాయి. వీటికి పేరు పెట్టి ఆ పేరుతో పిలిస్తే వెంటనే వచ్చేస్తాయి. 15 సెం.మీ నుంచి 50 సెం.మీ మాత్రమే ఎత్తు కలిగిన ఈ దూడలు ముద్దులొలుకుతుంటాయి. పొట్టి ఆవులు 85 సెం.మీ నుంచి 110 సెం.మీ ఎత్తు పెరుగుతాయి. పలమనేరు ప్రాంతంలో కొందరు రైతులు వీటిని ఫామ్స్‌లో మేపి పొట్టి జాతిని ఉత్పత్తి చేయిస్తూ వాటిని రూ.లక్షలకు విక్రయిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పొట్టి రకం దూడల వ్యాపారం ఊపందుకోవడం విశేషం. ఇందుకే అంత డిమాండ్ పుంగనూరు పశువులు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటి యజమానులపై విశ్వాసం ప్రదర్శిస్తాయి. æ పొట్టి దూడలు ఇంట్లో తిరుగుతుంటే చాలా మంచిదని జనం నమ్ముతారు. పొట్టి ఆవులు ఇచ్చే పాలలో రోగనిరోధకశక్తి అధికంగా ఉంటుంది. ఈ పాలను సేవిస్తే అనారోగ్యం దరిచేరదని విశ్వాసం.తక్కువ మేత.. అధిక పాల దిగుబడిపలమనేరు సమీపంలోని క్యాటిల్‌ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రం ప్రారంభమైంది. ఇది 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. మేలైన పుంగనూరు ఎద్దుల వీర్యాన్ని పుంగనూరు రకం పొట్టి ఆవులను పెంచుతున్న రైతులకు అందిస్తోంది. వీటిని మరింత ఉత్పత్తి చేసేందుకు ఆర్కేవీవై కృషి చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పశువులు 700 దాకా ఉండగా, ఇందులో 277 వరకు పలమనేరులోని పశు పరిశోధన కేంద్రంలోనే ఉన్నాయి. ఈ పశువులు తక్కువ మేతతో ఎక్కువ వెన్నశాతం కలిగిన పాల దిగుబడినిస్తాయి. వీటి మూత్రంలో సైతం ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.రైతులకు అందిస్తున్నాం పలమనేరు పరిశోధన కేంద్రంతోపాటు ఏపీ ఎల్డీఏ ద్వారా కూడా ఈ జాతి వీర్యాన్ని రైతులు పొందవచ్చు. ఆవు ఎదకొచ్చిన తర్వాత స్థానిక వెటర్నరీ వైద్యుడి పర్యవేక్షణలో సెమన్ అందిస్తున్నాం. పుంగనూరు పొట్టిజాతిని అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఈ వీర్యం అవసరమైన రైతులు క్యాటిల్‌ఫామ్‌లో కూడా తీసుకోవచ్చు. –వేణు, శాస్త్రవేత్త, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, తిరుపతి మూడేళ్లుగా పెంచుతున్నా మూడేళ్లుగా పుంగనూరు రకం పొట్టి దూడలు పెంచుతున్నా. దేశవాళీ రకం పుంగనూరు ఆవుల ద్వారా దూడలను ఉత్పత్తి చేయిస్తున్నాం. ఈ ప్రాంతంలో చాలామంది పొట్టి దూడలు పెంచుతున్నారు. వీటికి భారీ డిమాండ్ ఉంది. ఆసక్తి ఉంటే రైతులకు ఇది ఎంతో లాభదాయకం. – మణి, రైతు, మారేడుపల్లె, గంగవరం మండలం -
భారీస్థాయిలో సిద్ధేశ్వర అగ్రికల్చరల్ షో, క్యాట్ అండ్ డాగ్ షో కూడా
సోలాపూర్: పట్టణంలోని ఓం మైదానంలో డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 25 వరకూ వ్యవసాయ ప్రదర్శన నిర్వహించనున్నట్లు శ్రీ సిద్దేశ్వర దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ ధర్మరాజు కాడాది తెలిపారు. స్మార్ట్ ఎక్స్ పో గ్రూప్ నేతృత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఆత్మా, జిల్లా పరిషత్ విభాగం సహకారంతో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వ్యవసాయ ప్రదర్శనలో భాగంగా 300 స్టాల్స్‌ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ ప్రదర్శనకు సంబంధించిన విశేషాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ పరిశోధన కేంద్రం, సోలాపూర్ దానిమ్మ పరిశోధన కేంద్రం, జొన్న పరిశోధన కేంద్రం, వ్యవసాయ విజ్ఞాన కేంద్రం సోలాపూర్ , మోహల్ డివిజన్, సిల్క్ ఖాదీ గ్రామద్యోగ్ పరిశ్రమలు, పశుసంవర్ధక, సామాజిక అటవీ, జాతీయ బ్యాంకులు, నాబార్డ్, చక్కెర కర్మాగారాల సహకారంతో ఈ ప్రదర్శనను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ సాంకేతిక ఉత్పత్తులు, వ్యవసాయ యాంత్రికీకరణ, పాల ఉత్పత్తి, సెరికల్చర్, తేనెటీగల పెంపకం, అగ్రి బిజినెస్,వర్టికల్ ఫారి్మంగ్, ఆధునిక వ్యవసాయ పనిముట్లకు సంబంధించి వివరణాత్మక సమాచారాన్ని రైతులు సులభంగా పొందగలుగుతారని చెప్పారు. ఈ వ్యవసాయ ప్రదర్శనలో సోలాపూర్‌కు గర్వకారణమైన ఖిలార్ ఎద్దులు, ఆవులతోపాటు ప్రపంచంలోనే అరుదైన, అత్యంత పొట్టి రకమైన పుంగనూరు దేశీయ ఆవులను కూడా ప్రదర్శించనున్నట్లు ధర్మరాజు కాడాది పేర్కొన్నారు. సోలాపూర్, నాసిక్, పుణే రైతులు ఉత్పత్తి చేసిన దాదాపు 500 రకాల అరుదైన దేశవాళీ విత్తనాల ప్రదర్శన, విక్రయాలను చేపట్టనున్నట్లు తెలిపారు.క్యాట్, డాగ్ షో అలాగే డిసెంబర్ 22న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యాట్, డాగ్ షో పోటీలు సాయంత్రం విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందని, డిసెంబర్ 23న రాష్ట్రస్థాయి దేశవాళీ ఆవులు, ఎద్దుల ప్రదర్శన, పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని వివరించారు. అదేరోజున పుష్ప ప్రదర్శన కూడా జరుగుతుందని ధర్మరాజు కాడాది వివరించారుప్రదర్శనకు సంబంధించిన ఇతర విశేషాలు.. 300 కు పైగా కంపెనీల హాజరు ప్రముఖ కంపెనీల ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వాహనాల ప్రదర్శన. భయనా నుంచి ప్రత్యేకంగా తీసుకువస్తున్న ఆరు కిలోల కోడి ప్రపంచంలోనే అతి పొడవైన దేశీయ మిరపకాయల ప్రదర్శన ప్రత్యేక హాలులో ఆర్గానిక్ ఫార్మింగ్, యానిమల్, బర్డ్, ఫ్లవర్ ఎగ్జిబిషన్ రైస్ ఫెస్టివల్, వ్యవసాయ సాహిత్య ప్రదర్శన -
అనాథ జీవాలకు అమ్మా.. నాన్న
సాటి మనిషికి సాయం చేయలేని మనుషులున్న నేటి రోజుల్లో మూగజీవాలను కూడా ప్రేమతో...అక్కున చేర్చుకుంటున్నారు.. ఆకలితో ఉన్న జీవాలకు ఆపన్నహస్తంగా ఆహారం పంపిణీ చేస్తున్నారు.. వారి ఇంటి దరిదాపుల్లో వివిధ జాతుల ఆవులు, దూడలు, కుక్కలు, పిల్లులు, కోతులు, కాకులు.. ఇలా ఒక్కటేమిటి..ఎన్నో మూగ జీవాలు చూపరులను అబ్బురపరుస్తాయి. అటుగా వెళ్లేవారికి ఆ మూగజీవాలు తారసపడుతుంటాయి. వీటిని అక్కున చేర్చుకున్న వారే కూకట్‌పల్లికి చెందిన మణికొండ దేవేందర్‌రావు, రమాదేవి దంపతులు. ఇదంతా వీరు గుర్తింపు కోసమో.. లేక వ్యాపారం కోసమో అనుకుంటే పొరపాటే.. వారికి తెలిసిందల్లా ఒక్కటే.. వాటికి నిస్వార్థంగా సేవ చేయడమే.. – తొట్ల పరమేష్ఆపదలోని మూగ ప్రాణులకు ఆపన్నహస్తంఅక్కున చేర్చుకుని ఆహారం పంపిణీ వందల సంఖ్యలో జీవాలకు సేవ నవ సేవే.. మాధవ సేవ.. ఇది అందరికీ తెలిసిన నానుడి. కానీ సర్వ ప్రాణి సేవయే మాధవ సేవ అన్నది వారి పంథా. ఔను..భువిపై తనకు మాత్రమే హక్కు అన్నట్లు జీవుడు విర్రవీగుతుంటాడు. కానీ ఇలపై మనిషి ఎలాగో అన్ని ప్రాణులకూ జీవించే హక్కు ఉందంటూ వారు నినదిస్తున్నారు. ఆపై సేవకు అంకితమయ్యారు. ఒకటి కాదు..రెండు కాదు..వందల సంఖ్యలో మూగ జీవాలను అక్కున చేర్చుకుని కన్న బిడ్డల మాదిరిగా సాకుతున్నారు. మనిషికి మనిషే బరువైన ప్రస్తుత సమాజంలో ప్రతి ప్రాణినీ తన బిడ్డగా భావిస్తూ నిస్వార్థ సేవకు నిర్వచనం.. కూకట్‌పల్లికి చెందిన మణికొండ దేవేందర్‌రావు, రమాదేవి దంపతులు. వీరితోపాటు వీరి ఇద్దరి బిడ్డలు సాఫ్ట్వేర్ ఉద్యోగులైనా కూడా మూగ జీవాల సేవలో తరిస్తున్నారు. జీవాలకూ సొంత పేర్లు...వీరి ఇంటి దరిదాపుల్లో వెళ్లిన వారికి కొన్ని పేర్ల పిలుపులు వినిపిస్తుంటాయి.. కొత్తగా వినేవారికి ఎవరి కోసమో వెతుకుతున్నారని పొరపడతారు.. కానీ, వారు పిలిచేది మూగజీవాలని తెలిశాక ఆశ్చర్యపోక మానరు... ‘ఏయ్ లక్ష్మీ ఇటు రావే..ఓయ్ శివా అటు వెళ్లరా..!’ ఎలాగైతే మనం సాటి మనుషులతో మాట్లాడతామో! అలాగే వారు మూగ జీవాలతో మాట్లాడుతుంటారు. వాటికి పేర్లు పెట్టడమే కాదు..ఆ పేరుతో పిలిస్తే అవి కూడా ఠక్కున అలెర్ట్ అయ్యి వారు చెప్పింది చేసేస్తాయి. మమకారం చూపించాలే గానీ మూగ జీవాలు అంతకంటే ఎక్కువ వాత్సల్యాన్ని చూపిస్తాయని ఆ దంపతులు నిరూపిస్తున్నారు. పేరు పెట్టి వారు రమ్మంటే వచ్చేస్తాయి.. వెళ్లు అంటే వెళ్లిపోతాయి..తిను అంటే తినేస్తాయి..ఇక చాలు అంటే ఆపేస్తాయ్..అంతగా మూగ జీవాలతో వారికి బాండింగ్ ఏర్పడింది.పక్కాగా టైం పాటిస్తూ.. మూగ జీవాలకు ఆహారంతో పాటు ప్రేమాప్యాయతలు కలగలిపి వడ్డిస్తారో ఏమో గానీ ఎక్కడున్నా సరే..రోజూ పక్కాగా టైం ప్రకారం వీరి వద్దకు వచ్చేస్తాయి. ఒక్క కాకులు, పావురాలే కాదు ఆవులు, కుక్కలు, పిల్లులు, కోతులు వాటికి నిర్దేశించిన సమయాల్లో వచ్చి వీరి రోజువారీ ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్తుంటాయి. ఇలా ఉదయం 6–7 గంటలకు ప్రారంభమయ్యే మూగ జీవాల రాక సాయంత్రం 7 గంటల వరకూ కొనసాగుతుంటుంది. ఉదయం6–7 గంటల మధ్య కాకులు, 9 గంటలకు పావురాలు, 10 గంటలకు ఆవులు, మధ్యాహ్నం 3 గంటలకు కుక్కలు, సాయంత్రం పిల్లులు..ఇలా ఒక్కో సమయంలో ఒక్కో మూగ జీవాలు ఇక్కడకు వచి్చపోతుండడం గమనార్హం.ఆవుల గైనిక్..రమాదేవిఆవుల ప్రసవానికి వచ్చాయంటే జీహెచ్ఎంసీలో గుర్తుకొచ్చే వైద్యురాలు రమాదేవి. తమ వద్దకు వచ్చే ఆవులతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని గోశాలల్లో ఎక్కడైనా సరే ఆవులు ఈతకు వచ్చాయంటే ఆమెనే దగ్గరుండి ప్రసవం చేస్తారు. భుమి మీదకు వచ్చే ఆవు దూడపై మొదట తన చేతులు పడాల్సిందే.. ఒకరకంగా ఆమె ఆవులకు గైనిక్గా మారిపోయారు.లేగ దూడలకు ప్రత్యేక బెడ్మూగ జీవాల ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ వాటికి సపర్యలు చేస్తుంటారు. వాటిని తనకుటుంబ సభ్యులు, పిల్లల మాదిరిగానే బెడ్ మీద పడుకోబెట్టి సేవలందిస్తారు. ఓసారి 20 రోజుల లేగదూడకు యాక్సిడెంట్ అయ్యి కాలు విరగటంతో విషయం తెలుసుకున్న రమాదేవి రహదారి వద్దకు వెళ్లి దానిని ఆటోలో తీసుకొచ్చి అక్కడ నుంచి పశువుల ఆస్పత్రికి తరలించారు. అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో మూడు గంటల పాటు వేచి ఉండి డాక్టర్‌ను పిలిపించి చికిత్స చేయించిన అనంతరం రమాదేవి భర్త దేవేందర్‌రావు ఆ లేగ దూడను తన బెడ్‌పై పడుకోబెట్టి ఆహారంలో మాత్రలు, ఇంజక్షన్లు ఇచ్చి రెండు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మరణించిన వాటికి అంత్యక్రియలుదెబ్బతగిలిన లేగదూడ కొద్ది రోజుల తరువాత మూర్చ వ్యాధితో చనిపోయింది. దాంతో మనస్తాపానికి గురైన వారు లేగదూడను బహిర్భూమిలో వదిలివేయకుండా మనుషులకు చేసిన విధంగానే లేగ దూడకు అంత్యక్రియలు నిర్వహించి కొద్ది రోజుల పాటు ఆ దంపతులు దిగులుతో రెండు మూడు రోజులు ఆహార పానీయాలు కూడా ముట్టలేదు. ఈ విధంగా మూగ జీవాలతో వారి అనుబంధం కొనసాగింది. కుక్కలకు కూడా ఏ చిన్న దెబ్బ తాకినా వాటికి చికిత్స చేయించి మందులు ఇవ్వటం వారికి అలవాటుగా మారింది. కాంక్రీట్ జంగిల్లోనూ కావ్..కావ్..జాడ పితృ దేవతలకు ప్రతీకగా కాకులను విశ్వసిస్తారు. అలాంటి కాకులను కాంక్రీట్ జంగిల్లో భూతద్దం పెట్టి మరీ వెతికినా కనిపిస్తాయో లేదో తెలియదు. కనుమరుగు అయిపోతున్నాయి అనుకుంటున్న కాకులు సైతం రోజూ ఠంచనుగా ఒకే సమయంలో వీరి ముంగిట వాలిపోతుంటాయి. వారు అందించే ఆహారాన్ని ఆరగించి వెళ్లిపోతుండడం ఇక్కడ నిత్యకృత్యమే.ఐదేళ్ల క్రితం ప్రారంభమై... ఐదేళ్ల క్రితం మాట.. రెండు మూడు ఆవులతో ప్రారంభమై రోజులు గడిచే కొద్దీ ఆవుల సంఖ్య పెరిగింది. వీటికి తోడుగా కుక్కలు, పిల్లలు, కోతులు, కాకులు, పావురాలు.. ఇలా 70 వరకూ ఆవులు, 40 వరకు కుక్కలు, 15 వరకు పిల్లులు, 15 వరకు కాకులు, మరెన్నో పావురాలు వచ్చిపోతున్నాయి. అయితే ఇటీవల కోతులు కూడా వచ్చేవి. కానీ కుక్కల భయంతో అవి రావడం మానేశాయి.నెలకు లక్షన్నర ఖర్చు..మూగ జీవాలకు ఆహారం కోసం నెలకు లక్షన్నర వరకూ ఖర్చు చేస్తున్నారు. ఆవుల కోసం ప్రతిరోజూ రకరకాల కూరగాయలు, ఫలాలు, కుక్కల కోసం ఇంట్లో నాన్‌వెజ్ తినకపోయినప్పటికీ ప్రత్యేకంగా నాన్‌వెజ్ తెప్పించి పెడతారు. నెలకు నాలుగు క్వింటాళ్ల రైస్ మూగ జీవాల కోసం కొనుగోలు చేస్తుంటారు. -
గోశాలలో గోవుల గోస
వేములవాడ అర్బన్: వేములవాడ రాజన్న గోశాలలో వసతులు కరువయ్యాయి. భక్తుల విశ్వాసంగా నిలిచే కోడెమొక్కుల కోడెలకు కనీస సౌకర్యాలు లేవు. వానకు తడుస్తూ.. ఎండకు ఇబ్బందిపడుతూ ఆరుబయటే ఉంటున్నాయి. చిన్నపాటి వర్షానికే బురదమయమవుతున్న నేలపైనే పడుకుంటున్నాయి. కనీస వసతులు లేక భక్తులు అందించే కోడెలు గోశాలలో ఇబ్బంది పడుతున్నాయి. కనీసం గోవులు నిల్చోలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కోడెమొక్కుల ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నా గోశాలలో మాత్రం వసతుల కల్పనపై ఆలయ అధికారులు దృష్టి పెట్టడం లేదు. రూ.కోట్లు వస్తున్నా..వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు కోడెమొక్కులు చెల్లిస్తుంటారు. కోడె మొక్కు టికెట్ ధర రూ.200 ఉంది. అలాగే కోడెమొక్కుల ద్వారా స్వామికి వచ్చే ఆదాయం ఏడాదికి దాదాపు రూ.22 కోట్ల వరకు ఉంటుంది. ఇంత ఆదాయం వస్తున్నా గోశాలలో మాత్రం సౌకర్యాలు లేవు. గోశాలల్లోని కోడెల సంరక్షణకు ఏటా రూ.2 కోట్ల వరకు వెచ్చిస్తున్నా, ఈ నిధులతో ఎలాంటి సౌకర్యాలు కలి్పంచలేకపోతున్నారు. వసతికి మించిన కోడెలు..రాజన్న ఆలయానికి రెండు గోశాలలు ఉన్నాయి. గుడి చెరువు కట్ట కింద ఉన్న గోశాలలో 150 కోడెలు, 20 ఆవులు ఉన్నాయి. రాజన్నకు మొక్కులు చెల్లించే కోడెలను, ఆవులను ఉంచుతారు. తిప్పాపూర్‌లో రెండో గోశాల ఉంది. ఇక్కడ 300 కోడెల కోసం రేకులòÙడ్డు వేశారు. కానీ ఆరు నెలల క్రితం కోడెలను రిజి్రస్టేషన్ ఉన్న గోశాలకు ఇవ్వకుండా..అధికారులను తప్పుదోవ పట్టించి తీసుకెళ్లడంతో అప్పటి నుంచి ఇతర గోశాలలకు రాజన్న కోడెలు, ఆవులను ఇవ్వడం లేదు. కోడెలను తిప్పాపూర్ గోశాలలోనే సంరక్షిస్తున్నా రు. ఇక్కడ 300 కోడెలకు వసతి ఉండగా..ప్రస్తుతం 1,600 కోడెలు ఉన్నా యి. దీంతో చిన్నపాటి వర్షానికే గోశాల బురదమయం కావడంతో కోడెలు కనీసం పడుకునే పరిస్థితి లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక చోట, రాత్రి నుంచి తెల్లారేవరకు మరో చోట కోడెలను ఉంచుతున్నారు.తడిస్తే వ్యాధుల బారినపడే అవకాశం ఉంది వర్షాకాలంలో పశువులు, ఆవులతో జాగ్రత్తగా ఉండాలి. వర్షంలో తడిస్తే బలహీనమై వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. కాళ్లు మెత్తబడి డెక్కల్లో పుండ్లు అవుతాయి. సరిగా తినలేకపోతాయి. ఎప్పటికప్పుడు పేడ తియ్యకపోతే ఏదైనా ఒక్క ఆవుకు రోగం వస్తే అన్ని ఆవులకు సంక్రమించే అవకాశం ఉంది. బురద ఎక్కువైతే కాలు జారి కిందపడే అవకాశాలు ఉన్నాయి. – ప్రశాంత్‌రెడ్డి, మండల పశువైద్యాధికారి, వేములవాడ త్వరలోనే అందిస్తాంభక్తులు అందించిన కోడెలను తిప్పాపూర్ గోశాలలో సంరక్షిస్తున్నాము. గోశాలలో పరిమితికి మించి కోడెలు ఉన్నాయి. ఆలయ అధికారులతో కమిటీ నియామకానికి కలెక్టర్‌కు ఫైల్ పంపించాం. కమిటీ ఆదేశాలతో కోడెలను రైతులకు, రిజిస్ట్రేషన్ ఉన్న గోశాలలకు అందిస్తాం. వారం రోజుల్లోగా ఆదేశాలు వస్తాయని అనుకుంటున్నాం. – శ్రీనివాస్, రాజన్న ఆలయ ఏఈవో -
రాజన్న కోడెలు పక్కదారి!
వేములవాడ అర్బన్: వేములవాడ రాజన్న కోడెలు పక్కదారి పడుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న భక్తులు శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో కోడెలను, ఆవులను అందజేస్తుంటారు. తమ కోరికలు నెరవేరితే కోడెమొక్కు చెల్లించుకుంటామని మొక్కుకున్న భక్తులు పలువురు కోడెలను ఆలయ గోశాలకు అప్పగిస్తుంటారు. ప్రధానంగా రైతులు తమ ఇంట్లో శుభకార్యాలు జరిగితే కోడెను తీసుకొచ్చి రాజన్న ఆలయానికి అప్పగించడం అనాదిగా జరుగుతోంది. అయితే ఈ కోడెలు, ఆవుల పోషణ ఇబ్బందిగా మారడంతో ఆలయ అధికారులు ఇటీవల వివిధ ప్రాంతాల్లోని ఇతర గోశాలల నిర్వాహకులకు కొన్ని కోడెలు, ఆవులను అందజేస్తున్నారు. వారు వాటిని పోషించడం లేదా రైతులకు అందజేయాల్సి ఉండగా.. కొందరు నిర్వాహకులు ఇతరులకు విక్రయిస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. అలాగే అసలు లేని గోశాలల పేరిట కూడా కొందరు కోడెలు తీసుకెళ్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్‌లో కోడెలతో వెళ్తున్న వ్యాన్ పట్టుబడడం, వారు చెప్పిన గోశాల అసలు లేనట్లు తేలడం ఈ అనుమానాలను బలపరుస్తోంది. పోషణ భారం తగ్గించుకునేందుకు.. వేములవాడ రాజన్న ఆలయ గోశాలలు స్థానిక తిప్పాపూర్‌లో ఒకటి, గుడిచెరువు కట్టకింద ఒకటి ఉన్నాయి. తిప్పాపూర్ గోశాలలో సుమారు 150 కోడెలు, వేములవాడ కట్టకింద గోశాలలో 150 కోడెలు, ఆవులు ఉన్నాయి. వేములవాడ కట్టకింద గోశాలలోని కోడెలను ఆలయంలో కోడె మొక్కుల కోసం తీసుకెళ్తుంటారు. ఆవులను స్వామి వారి పూజకు ఉపయోగపడే పాల కోసం వినియోగిస్తున్నారు. తిప్పాపూర్ గోశాలలో భక్తులు అప్పగించిన కోడెలు ఉంటాయి. ఇక్కడి కోడెలు ఎక్కువైనప్పుడు నిర్వహణ భారం తగ్గించుకునేందుకు ఇతర గోశాలలకు అప్పగిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో భూమి పట్టా పాస్బుక్కు ఉన్న రైతులకు పెంచుకునేందుకు ఉచితంగా అందజేసేవారు. తర్వాత కాలంలో వేలం ద్వారా రైతులకే అమ్మేవారు. అయితే 2012 నుంచి తెలంగాణ గోశాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో లేఖ తెచ్చుకున్నవారికి ఉచితంగా ఇస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో.. ఈనెల 2న తిప్పాపూర్ గోశాలలోని 20 కోడెలను ఫెడరేషన్ లేఖ తెచ్చుకున్న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దుబ్బాతండాలోని శ్రీ సోమేశ్వర గోసంరక్షణ సేవా సంఘానికి అందజేశారు. ఈ కోడెలతో బయలుదేరిన వ్యాన్‌ను జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో బజరంగ్దళ్ కార్యకర్తలు అడ్డుకుని తనిఖీ చేశారు. 20 కోడెలు ఉండాల్సి ఉండగా 24 కనిపించడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో దుబ్బాతండాలో ఈ పేరుతో గోశాల లేదని తేలింది. దీంతో ఈ వ్యాన్‌ను నేరుగా స్టేషన్‌ఘన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. కోడెలను ధర్మసాగర్ మండలంలోని గోశాలకు తరలించారు. గోశాల ఫెడరేషన్ సూచించిన గోశాలలకు కోడెలను అప్పగిస్తున్న అధికారులు.. ఈ కోడెలు గోశాలలకు వెళ్తున్నాయా.. లేదా? అని పరిశీలించకపోవడంపై భక్తులు, స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలపై విచారణ చేపట్టాలి రాజన్న ఆలయ కోడెలను ఈ ప్రాంత రైతులకు అప్పగించాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. కోడెల అప్పగింతలో అక్రమాలపై అధికారులు విచారణ చేపట్టాలి. హిందువుల మనోభావాలను కాపాడాలి. – గడప కిశోర్, విశ్వహిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి ఫెడరేషన్ లెటర్ మేరకే ఇచ్చాం ఎప్పటిలాగానే తెలంగాణ గోశాల ఫెడరేషన్ నుంచి వచ్చిన లేఖ మేరకే కోడెలను అందించాం. కానీ అక్కడ గోశాల ఉందో.. లేదో మాకు తెలి యదు. ఈ విషయం ఫెడరేషన్ వారు చూసుకోవాలి. – శ్రీనివాస్, రాజన్న ఆలయ ఏఈవో -
Chennamaneni Padma: ఆవులే ఆమె సర్వస్వం
‘‘ఆవు పైన ప్రేమ... లెక్చరర్ ఉద్యోగాన్ని వదులుకునేలా.. నగరం నుంచి పల్లెతల్లికి దగ్గరయ్యేలా కొండకోనల వెంట ప్రయాణించేలా వరదలను తట్టుకొని నిలబడేలా చేసింది’’ అని వివరిస్తుంది డాక్టర్ చెన్నమనేని పద్మ. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినా, వృత్తి ఉద్యోగాల్లో కొనసాగుతున్నా ఊరు ఆమెను ఆకట్టుకుంది. 200 ఆవులకు సంరక్షకురాలిగా మార్చింది. పదేళ్లుగా చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలను, వరించిన జాతీయస్థాయి అవార్డులను వివరించారు పద్మ. ‘‘నా చిన్ననాటి రోజులకు ఇప్పటికీ ఆహారంలోనూ, వాతావరణంలోనూ చాలా తేడా కనిపించేది. తెలుగు లెక్చరర్‌గా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉన్న ఎయిడెడ్ గర్ల్స్ కాలేజీలో ఉద్యోగం చేసేదాన్ని. వ్యవసాయం, ఆహారం ప్రాముఖ్యతను నేను చదువు చెప్పే అమ్మాయిలకు ప్రత్యక్షంగా చూపాలనుకున్నాను. మా నాన్నగారి ఊరు జగిత్యాలకు ఎప్పుడో ఒకసారి వెళ్లేదాన్ని. ఊరి ప్రయాణం, అక్కడి వాతావరణం నాకు బాగా నచ్చేది. ఇదే విషయాన్ని మా క్లాస్ అమ్మాయిలకు చెప్పి, ఆసక్తి ఉన్నవాళ్లు పేర్లు ఇస్తే, తీసుకెళతాను అని చెప్పాను. ఒకేసారి యాభైమంది పేర్లు ఇచ్చారు. వారందరికీ బస్ ఏర్పాటు చేసి, తీసుకెళ్లాను. వ్యవసాయంలో ఏమేం పనులు ఉంటాయో అన్నీ పరిచయం చేశాను. అక్కడి గోశాలకు తీసుకెళితే పిల్లలంతా కలిసి, లక్ష గొబ్బెమ్మలు తయారు చేశారు. ఎరువుగా గొబ్బెమ్మలు కొన్నిరోజుల తర్వాత గోశాల వాళ్లు గొబ్బెమ్మలను తీసుకెళ్లమని చెప్పారు. అప్పటివరకు ఆలోచన చేయలేదు. కానీ, వాటిని హైదరాబాద్ తీసుకొచ్చి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏదైతే అది అయ్యిందని వ్యాన్‌లో లక్షగొబ్బెమ్మలను తీసుకొచ్చి, ఇంట్లో పెట్టించాను. ఎక్కడ చూసినా గొబ్బెమ్మలే. ఇంట్లోవాళ్లు ఏంటిదంతా అన్నారు. కొన్ని రోజులు వాటిని అలాగే చూస్తూ ఉన్నాను. గోమయాన్ని ఎరువుగా వాడితే పంట బాగా వస్తుంది. అయితే, నగరంలో ఇదెలా సాధ్యం అవుతుంది అనుకున్నాను. రూఫ్ గార్డెన్వాళ్లకు ఇస్తే అనే ఆలోచన వచ్చిన వెంటనే వాట్సప్ గ్రూపుల్లో గొబ్బెమ్మలు కావాల్సిన వాళ్లు తీసుకెళ్లచ్చు మొక్కలకు ఎరువుగా అని మెసేజ్ చేశాను. రెండు, మూడు రోజుల్లో మొత్తం గొబ్బెమ్మలు ఖాళీ అయ్యాయి. ఆవుల కొనుగోలు... ఊరు వెళ్లినప్పుడల్లా దారిలో గోవుల గుంపు ఉన్న చోట ఆగి, కాసేపు అక్కడ ఉండి వెళ్లడం ఒక అలవాటుగా ఉండేది. అలా ఒకసారి 80 ఏళ్ల వ్యక్తి నా అడ్రస్ కనుక్కొని వచ్చాడు. తన దగ్గర ఉన్న ఆవులను బతికించలేకపోతున్నానని, పిల్లలు వాటిని వదిలించుకోమని చెబుతున్నారని ఏడ్చాడు. నాకేం చేయాలో అర్ధం కాలేదు. అంత పెద్ద వ్యక్తి గోవుల గురించి బాధపడుతుంటే చూడలేకపోయాను. ఏదైతే అది అవుతుందని 55 గోవులను అతను చెప్పిన మొత్తానికి నా పొదుపు మొత్తాల నుంచి తీసి, కొనేశాను. అర్ధం చేసుకుంటూ... కొనడంలో ధైర్యం చేశాను కానీ, ఆ ఆవులను ఎలా సంరక్షించాలో అర్ధం కాలేదు. వర్కర్లను, వాటికి గ్రాసం ఏర్పాటు చేయడం తలకు మించి భారమైంది. వాటిని చూసుకోవడానికి ఉద్యోగం మానేశాను. అయినవాళ్లంతా తప్పు పట్టారు. ‘కాలేజీకి త్వరలో ప్రిన్సిపల్ కాబోతున్నావ్.. ఇలాంటి టైమ్‌లో ఉద్యోగం వదులుకొని ఇదేం పని’ అన్నారు. కానీ, ఆవు లేని వ్యవసాయం లేదు. ఆవు లేకుండా మనిషి జీవనం లేదనిపించేది నాకు. ఇంట్లోవాళ్లకు చెప్పి జగిత్యాలలోనే ఆవులతో ఉండిపోయాను. కానీ, ఊళ్లో అందరినుంచీ కంప్లైంట్లే! ఆవులు మా ఇళ్ల ముందుకు వస్తాయనీ, వాకిళ్లు పాడుచేస్తున్నాయని, పోలీసు కేసులు కూడా అయ్యాయి. ఆ ఊళ్లో పుట్టిపెరిగిన దాన్ని కాదు కాబట్టి, నాకెవరూ సపోర్ట్ చేసేవాళ్లు లేరు. దీంతో ఆవులను తీసుకొని గోదావరి నదీ తీరానికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పది రోజులు గడిచాయో లేదో విపరీతమైన వానలు, వరదలు. ఆ వరదలకు కొన్ని ఆవులు కొట్టుకుపోయాయి కూడా. నాకైతే బతుకుతానన్న ఆశ లేదు. ఎటు చూసినా బురద, పాములు.. కృష్ణుడిని వేడుకున్నాను. ‘ఈ ఆవులు నీవి, నీవే కాపాడుకో..’ అని వేడుకున్నాను. అక్కణ్ణుంచి బోర్నపల్లి అటవీ ప్రాంతంలో 15 రోజులు ఆవులతో గుట్టలపైనే ఉన్నాను. మూగజీవాల గురించి, ప్రకృతి గురించి నాకేమీ తెలియదు. ఏం జరిగినా వెనక్కి వెళ్లేది లేదు అనుకున్నాను. నా మొండితనం ప్రకృతిని అర్థం చేసుకునేలా చేసింది. ఎప్పుడో వీలున్నప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్లేదాన్ని. మా ఇద్దరు అబ్బాయిలు జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఇక నా జీవితం ఆవులతోనే అనుకున్నాను. కరోనా టైమ్‌లో మా కుటుంబం అంతా హైదరాబాద్‌లో ఉంది. నేను గోవులతో అడవుల్లో ఉన్నాను. ఓసారి కుటుంబం అంతా కూర్చుని ఆవులు కావాలా, మేం కావాలో తేల్చుకోమన్నారు. ఆవులే కావాలి అన్నాను. నాకు ఉన్న ఈ ఇష్టాన్ని గమనించిన మా వారు తను చేస్తున్న సెంట్రల్‌గవర్నమెంట్ జాబ్ నుంచి వీఆర్ఎస్ తీసుకొని వచ్చేశారు. తన పొదుపు మొత్తాలను కూడా ఆవుల సంక్షేమానికి వాడాం. మహిళలకు ఉపాధి... ప్రతి యేటా ఆవుల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 200 వరకు చేరింది. 50 ఆవులను గుట్టల ప్రాంతాల వారికి ఉచితంగా ఇచ్చేశాను. మిగతా వాటి గోమయంతో పళ్ల పొడి నుంచి వందరకాల ఉత్పత్తులను తయారు చేయిస్తున్నాను. ఇక్కడి గిరిజన ప్రాంత స్త్రీలు వీటి తయారీలో పాల్గొంటున్నారు. గోమయ ప్రమిదలు, పిడకలు, యజ్ఞసమిధలు.. ఇలా ఎన్నో వీటి నుంచి తయారు చేస్తున్నాం. చిన్నా పెద్ద టౌన్లలో గోమయం ఉత్పత్తుల తయారీలో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం. ఈ ఉత్పత్తులతో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, నగర ప్రజలకు చేరువ చేస్తుంటాను. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గిరిజన మహిళలకు ఇస్తుంటాను. పట్టణాల్లో ఉన్నవాళ్లు ఎవరైనా వచ్చి ఆవులను చూసుకోవచ్చని ‘స్వధర్మ’ పేరుతో ఆన్లైన్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. వీడియోలు చూసి ముందు చాలా మంది ఉత్సాహం చూపారు. కానీ, చివరకు ముగ్గురు మాత్రమే వచ్చారు. వీడియోల్లో ఆవులను, ఇక్కడి వాతావరణం చూడటం వేరు. కానీ, నేరుగా ఈ పరిస్థితులను ఎదుర్కోవడం వేరు. ‘మేమూ వస్తాం, కానీ బెడ్రూమ్ ఉందా, అటాచ్డ్ బాత్రూమ్ ఉందా’ అని అడుగుతుంటారు. కానీ, మేమున్నచోట అలాంటి వసతులేవీ లేవు. దొరికినవి తింటూ, ఆవులతోనే జీవనం సాగిస్తూ ఉంటాం. ఆరు నెలలు గుట్ట ప్రాంతాల్లో, ఆరు నెలలు గోదావరి నదీ తీర ప్రాంతాల వెంబడి తిరుగుతుంటాను. ఈ జీవనంలో ఓ కొత్త వెలుగు, స్వచ్ఛత కనిపిస్తుంటుంది. నేర్చుకున్న వైద్యం.. మనుషుల మాదిరిగానే ఆవులు కూడా ఎంతో ప్రేమను చూపుతాయి. జబ్బు పడతాయి. వాటికి ఆరోగ్యం బాగోలేకపోతే ‘నన్ను చూడు’ అన్నట్టుగా దగ్గరగా వచ్చి నిలబడతాయి. కనిపించకపోతే బెంగ పెట్టుకుంటాయి. వాటికి జబ్బు చేస్తే సీనియర్ డాక్టర్స్‌ని పిలిíపించి చికిత్స చేయిస్తుంటాను. నేనే వాటి జబ్బుకు తగ్గ చిక్సిత చేయడం కూడా నేర్చుకున్నాను. ఆవులకు సంబంధించి మురళీధర గో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాను. దీని ద్వారా రేపటి తరం పిల్లలకు మూగజీవాల విలువ... ముఖ్యంగా ఆవు గొప్పతనాన్ని తెలియజేయాలనుకుంటున్నాను’’ అని వివరించారు పద్మ. వరించిన అవార్డులు పట్టణప్రాంతాల వారిని పల్లెకు తీసుకెళ్లి చేయిస్తున్న సేవకు 2012లో నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డ్‌ను రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ చేతుల మీదగా అందుకున్నాను. 2013లో చైనాలో జరిగే యూత్ ఎక్సే ్చంజ్ ప్రొగ్రామ్‌కి ప్రభుత్వం టాప్ 100 మెంబర్స్‌ని పంపించారు. వారిలో నేనూ ఒకరిగా ఆ సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం మర్చిపోలేనిది. ఈ యేడాది ఇందిరాగాంధీ అవార్డు సెలక్షన్‌కి కమిటీ మెంబర్‌గా ఆహ్వానం అందుకున్నాను. నిస్వార్థంగా చేసే సేవ ఏ కొద్దిమందికైనా ఉపయోగపడినా చాలు. రైతులు ఎవరైనా ఆవు కావాలని వస్తే వారి వివరాలన్నీ తీసుకొని, ఉచితంగా అందజేస్తున్నాం. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అతడు అలా అనంగానే..ఆ ఆవులన్నీ ఒక్కసారిగా..!
ఆవులు మేత మేస్తున్నప్పుడూ వాటికి నచ్చినట్లు వెళ్లిపోతాయి. ఒక్కొసారి వాటిని కాస్తున్న వ్యక్తి మాటలు కూడా వినవు. అలాంటిది ఓ వ్యక్తి జస్ట్ చేతులు చూపించి సైగ చేయగానే అవన్నీ ఏదో అర్థమైనట్లు భలే బిహేవ్ చేశాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ సైకిలిస్ట్ ఇంగ్లాండ్‌లోని రెండో ఎత్తైన పర్వతం గ్రేట్ డన్ ఫెల్ మీదుగా వెళ్తూ కాసేపు బ్రేక్ తీసుకున్నాడు. ఇంతలో అతడివైపుకే ఉన్నట్టుండి ఆవులన్నీ వచ్చేస్తున్నాయి. ఆవులు కాస్తున్న రైతు వాటిని రోడ్డుమీదకు రానీయకుండా ఆపాలని కోరాడు. దీంతో ఆ సైకిలిస్ట్ ఆవుల మందకు ఎదురుగా నిలబడి గట్టిగా "స్టాప్" అని అరుస్తూ.. చేతులతో సంజ్ఞ చేశాడు. అంతే అవన్నీ ఏమనుకున్నాయో గానీ భలేగా ఒక్కసారిగా అన్నీ కదలకుండా రోడ్డుపైనే నిలిచిపోయాయి. ఏ ఒక్కటి ముందుకు రాలేదు. పైగా ఆ రైతు వాటిని సమీపించేంత వరకు అలానే ఉండటం విచిత్రం. ఈ విషయాన్ని సైకిల్ రైడర్ "రైడ్‌లో నాకెప్పుడు ఎదరవ్వని విచిత్రమైన అనుభవం" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియోకి మిలయన్లలో వ్యూస్ లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by Andrew O'Connor (@andrewon2wheels) (చదవండి: "విమానాన్నే ఇల్లుగా మార్చేశాడు"..అందుకోసం ఏకంగా..) -
కలిసి కట్టుగా.. పులిని తరిమికొట్టిన ఆవుల మంద
ఐకమత్యమే మహాబలం.. మన చిన్నప్పటి నుంచి వింటున్న మాటే ఇది. ఆరణలోనూ ఇది సాధ్యమేనంటూ నిరూపించే ఘటనలనూ చూస్తూ వస్తున్నాం కూడా. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన ఓ ఘటన.. సీసీటీవీఫుటేజీ బయటకు రావడంతో వైరల్ అవుతోంది. ఆవుల మంద నుంచి ఒంటరిగా ఉన్న ఓ ఆవుపై నక్కినక్కి వచ్చి దాడికి దిగింది ఓ పెద్దపులి. దీంతో అది చావుకేకలు వేయగా.. అది చూసిన మిగతా ఆవులు బెదిరి చెల్లాచెదురు కాలేదు. క్షణం ఆలస్యం చేయకుండా ధైర్యంగా ముందుకు ఉరికాయి. వాటి ధైర్యానికి ఆ పులి బెదిరింది. ఆవును వదిలేసి అక్కడి నుంచి పొదల్లోకి లంఘించుకుంది. అయితే పులి అక్కడక్కడే ఉండడంతో.. గాయపడిన ఆ ఆవును చుట్టుముట్టి మళ్లీ దాడికి దిగకుండా తెల్లవారే దాకా కాపలాగా ఉన్నాయి మిగతా ఆవులు. ఆదివారం అర్ధరాత్రి భోపాల్ కేర్వా శివారుల్లోని ఓ డెయిరీ ఫామ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. గాయపడిన ఆ ఆవు పరిస్థితి పాపం విషమంగా ఉన్నట్లు సమాచారం. संगठन में शक्ति है… भोपाल के मदरबुल फार्म में बाघ ने एक गाय पर हमला किया तो उस गाय को बचाने दौड़ पड़ा गायों का झुंड। देखिए वीडियो…#Bhopal #cows pic.twitter.com/678Gy4YyN2 — Upmita Vajpai (@upmita) June 20, 2023 ఇదీ చూడండి: ఆ ఊర్లో మహిళలంతా దుస్తుల్లేకుండా ఐదురోజులపాటు.. -
చిట్టి పొట్టి ఆవులు.. చలాకీ గోవులు
పుంగనూరు జాతిలోనే అత్యంత బుల్లి ఆవు ఇది. 12 అంగుళాల (అడుగు) ఎత్తు.. 36 అంగుళాల (3 అడుగుల) పొడవుండే ఈ ఆవులను ‘మైక్రో మినీయేచర్ పుంగనూరు’గా పిలుస్తున్నారు. మనుషులకు ఇట్టే మచ్చికయ్యే ఈ ఆవులు ఇళ్లు, అపార్ట్మెంట్లు అనే తేడా లేకుండా.. ఏ వాతావరణంలో అయినా.. ఎక్కడైనా పెరుగుతాయి. వీటి నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. నట్టింట్లో గంతులేస్తూ.. చిన్నపిల్లల మాదిరిగా మారాం చేస్తూ.. యజమానుల చుట్టూనే ఇవి తిరుగుతున్నాయి. గతంలో పెరటికి మాత్రమే పరిమితమైన ఈ బుజ్జి గోవులు ఇప్పుడు బెడ్ రూముల్లోనూ సందడి చేస్తున్నాయి. ఇంటిల్లిపాదికీ ఆనందాన్ని పంచుతున్నాయి. సాక్షి, అమరావతి: గోవులు.. మనుషులకు ఎంతో మచ్చికైన జంతువులు. భారతీయ సంస్కృతిలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. పూర్వ అఖండ భారతదేశంలో 302 జాతుల ఆవులు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 32కు పరిమితమైంది. పొట్టి జాతి ఆవుల విషయానికి వస్తే మల్నాడ్ గిడ్డ (కర్ణాటక), వేచూరు (కేరళ), మన్యం (ఆంధ్రప్రదేశ్), బోనీ (బెంగాల్), మినీ మౌస్ (నేపాల్) జాతులు ఉన్నాయి. మన్యం–ఒంగోలు బ్రీడ్స్ నుంచి అభివృద్ధి చేసినవే పుంగనూరు ఆవులు. ఇవి 3నుంచి 5 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. పుంగనూరుతో సహా కనుమరుగైన పొట్టి జాతి గోవులను సంరక్షించాలన్న తపనతో కోనసీమ జిల్లాకు చెందిన ప్రముఖ నాడీపతి వైద్యుడు పెన్మత్స కృష్ణంరాజు సాగించిన పరిశోధనల ఫలితంగా అతి చిన్నవైన ‘మైక్రో మినీయేచర్ పుంగనూర్’ ఆవులు పురుడు పోసుకున్నాయి. ఏ వాతావరణంలోనైనా పెరిగేలా.. మట్టి నేలలతోపాటు గచ్చు, ఫామ్‌హౌజ్, టైల్స్, మార్బుల్స్‌తో కూడిన ఇళ్లు, అపార్టుమెంట్స్‌లో సైతం పెంచకునేలా 4 రకాలుగా వీటిని అభివృద్ధి చేశారు. అడుగు నుంచి రెండున్నర అడుగుల ఎత్తు, 40 నుంచి 70 కిలోల బరువుతో రోజుకు లీటర్ నుంచి రెండు లీటర్ల వరకు పాలిచ్చేలా వీటిని అభివృద్ధి చేశారు. వీటిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. పశుగ్రాసంతోపాటు ఎలాంటి ఆహారన్నయినా జీర్ణించుకోగలుగుతాయి. పెద్దలకే కాకుండా పిల్లలకు సైతం కూడా ఇట్టే మచ్చికవుతాయి. ఇప్పటివరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 60 మందికి వీటిని అందించారు. మైక్రో మినీయేచర్ సహా వివిధ జాతులతో అభివృద్ధి చేసిన 500 వరకు పొట్టి జాతుల ఆవులు నాడీపతి గోశాలలో సందడి చేస్తున్నాయి. నిత్యం గో ప్రేమికులు ఈ గోశాలను సందర్శిస్తూ చెంగుచెంగున గంతులేసే పొట్టి గోవుల మధ్య పుట్టిన రోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటూ మురిసిపోతున్నారు. నాడీపతి గోశాలలో సందడి చేస్తున్న పొట్టి ఆవులు వాటి అల్లరి చెప్పనలవి కాదు ఏడాది వయసున్న 2 అడుగుల ఎత్తు గల రెండు మినీయేచర్ పుంగనూరు ఆవులను తీసుకెళ్లి మా అపార్ట్మెంట్ 3వ అంతస్తులోని ప్లాట్‌లో పెంచుకుంటున్నాం. ఎలాంటి ఆహారం పెట్టినా తింటున్నాయి. మాతో పాటే వాకింగ్ చేస్తాయి. కారులో కూడా మా వెంట తీసుకెళ్తాం. ఇంట్లో అవి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. కుటుంబంలో భాగమైపోయాయి. చిన్నప్పటి నుంచి పెరట్లో ఆవులను పెంచుకోవాలన్న మా కోరికను ఇలా తీర్చుకుంటున్నాం. – వల్లివాటి శ్రీనివాసబాబు, దిల్సుఖ్నగర్, హైదరాబాద్ వాటి మధ్య ఉంటే టెన్షన్ హుష్‌కాకి మా ఇంట్లో రెండు మినీయేచర్ గిత్తలను పెంచుకుంటున్నాం. అవి మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. వాటిని చూస్తే చాలు మాలో ఉన్న టెన్షన్స్ చేత్తో తీసేసినట్టు పోతాయి. మాతోనే ఉంటున్నాయి. మాతో పాటే తింటున్నాయి. వాటికి ప్రత్యేకంగా బెడ్స్ కూడా ఏర్పాటు చేశాం. మాతో పాటే పడుకుంటున్నాయి. – పి.సూర్యనారాయణరాజు, పత్తేపురం, పశ్చిమ గోదావరి జిల్లా లక్ష్మి, విష్ణు అని పేర్లు పెట్టాం రెండు మినీయేచర్ పుంగనూరు ఆవుల్ని తెచ్చుకున్నాం. లక్ష్మి, విష్ణు అని పేర్లు పెట్టుకున్నాం. పేరు పెట్టి పిలవగానే చెంగున వచ్చి ఒడిలో వాలిపోతాయి. వాటిని చంటిపాపల్లా చూసుకుంటున్నాం. అవి లేకుండా ఉండలేకపోతున్నాం. ఎక్కడికెళ్లినా వెంట తీసుకెళ్తున్నాం. వాటితో గడుపుతుంటే మనసు ఎంతో ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటుంది – అమటం పద్మావతి, విశాఖ ప్రపంచంలో ఎక్కడా లేవు 1,632 ఆవులను బ్రీడింగ్ చేయడం ద్వారా వీటిని ఒక అడుగు ఎత్తు వరకు తీసుకురాగలిగాం. మినియేచర్ పుంగనూరు ఆవుల ఎత్తు 2 అడుగుల్లోపు కాగా, మైక్రో మినీయేచర్ పుంగనూరు ఆవుల ఎత్తు అడుగులోపే. ప్రపంచంలో ఇవే అత్యంత పొట్టి జాతి ఆవులు. వీటికి పేటెంట్ హక్కు కోసం దరఖాస్తు చేశా. వచ్చే పదేళ్లలో కనీసం లక్ష ఆవులను పునరుత్పత్తి చేసి అడిగిన ప్రతీ ఒక్కరికి అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నా. – డాక్టర్ పెన్మత్స కృష్ణంరాజు, పరిశోధకుడు, నాడీపతి గోశాల వ్యవస్థాపకుడు 14 ఏళ్ల పరిశోధనల ఫలితం నాడీపతిలో పీహెచ్డీ చేసిన కృష్ణంరాజు వేల ఏళ్ల క్రితమే అంతరించిపోయిన ప్రాచీన భారతీయ సనాతన వైద్యవిధానంతోపాటు అంతరించిపోతున్న అరుదైన పొట్టిజాతి గోవుల పునరుత్పత్తిపై 14 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. నాడీపతి వైద్య విధానంపై శిక్షణ ఇస్తూ సర్జరీలు, సైడ్ఎఫెక్ట్ లేని 100 రకాల థెరఫీల ద్వారా దీర్ఘకాలిక రోగాలకు వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత పొట్టి జాతి అవులను సృష్టించాలన్న సంకల్పంతో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి వద్ద 5 ఎకరాల విస్తీర్ణంలో నాడీపతి గోశాల నెలకొల్పారు. తొలుత పుంగనూరు–బోనీ జాతులను క్రాసింగ్ చేసి 3 అడుగుల ఎత్తు గల పొట్టి ఆవులను అభివృద్ధి చేశారు. వాటిని దేశంలో ఇతర పొట్టి జాతి బ్రీడ్‌లతో కృత్రిమ గర్భధారణ పద్ధతిలో మరిన్ని పొట్టి జాతి ఆవులను అభివృద్ధి చేశారు. చివరగా పుంగనూరుతో బోనీ, మల్నాడ్ గిడ్డ, మినీ మౌస్, వేచూరు ఆవులతో క్రాసింగ్ చేసి మైక్రో మినేయేచర్ పుంగనూరు ఆవును సృష్టించారు. -
‘అమ్మా’రావం!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఇలా అంతా కోరుకున్న రీతిలో వస్తున్న ఆవు దూడలు పాడి రంగంలో కొత్త క్షీర విప్లవానికి నాందిగా నిలుస్తున్నాయి. స్వదేశీ ఆవుల సంఖ్యను పెంచడం.. అలాగే అధికంగా పాలిచ్చే జాతి ఆవులను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2019లో ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ అనే పథకానికి శ్రీకారం చుట్టింది. దీన్ని తెలంగాణ, ఆంధ్రపదేశ్‌తోపాటు మరో పది రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టింది. ఇందులోభాగంగా కామారెడ్డి జిల్లా తిప్పాపూర్, ఎర్రపహాడ్, కొండాపూర్, చిన్నమల్లారెడ్డి, లింగంపల్లి, ఎల్లంపేట, మోతె, కొయ్యగుట్ట, మహ్మదాపూర్, కరత్పల్లి పది గ్రామాలను ఎంపిక చేశారు. ఇక్కడ వివిధ రకాల జాతులకు చెందిన 160 ఆవుల్లో లింగ నిర్ధారణ చేసి సాహివాల్, గిర్ తదితర స్వదేశీ జాతులతోపాటు అధిక పాలనిచ్చే హెచ్ఎఫ్, జెర్సీ కోడెల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేశారు. ఇందులో ఇప్పటివరకు 134 ఆవులు గర్భం దాల్చి 126 (94 శాతం) ఆడ దూడలు, 8 కోడె దూడలకు జన్మనిచ్చాయి. దీంతో రైతులు స్వదేశీ గిర్, సాహివాల్ ఆడ దూడలతోపాటు అధిక పాలనిచ్చే ఆవులకు యజమానులయ్యారు. లక్షలు పోసినా దొరకని స్వదేశీ, విదేశీ ఆవుజాతులు ఇప్పుడు తమ పంటపొలాల్లో పరుగెడుతుండటంతో సంబరపడిపోతున్నారు. ‘స్వదేశీ ఆవును పెంచుకోవాలన్నది నా జీవితాశయం. ఎవరి వద్దనైనా కొందామంటే ధర.. రూ.లక్షల్లో చెబుతున్నారు. అంత సొమ్ము భరించే స్తోమత లేదు. నా కల ఇక నెరవేరదు అనుకున్నా..! కానీ ఓ రోజు కేంద్ర పశుసంవర్థక శాఖ వారు మా ఊరిలో క్యాంప్ పెట్టి.. నా వద్ద ఉన్న విదేశీ జాతి హెచ్ఎఫ్ ఆవుకు కృత్రిమ గర్భధారణతో కోరుకున్న స్వదేశీ ఆవు దూడ పుట్టేలా ఉచితంగా చేస్తామన్నారు. అందులో ఆడ–మగ.. ఏది కోరుకుంటే అదే పడుతుందన్నారు. నాకు సాహివాల్ రకం ఆడ దూడ కావాలని అడిగాను. నా దగ్గర ఉన్న ఆవు గర్భంలో లింగ నిర్ధారణ వీర్యం ప్రవేశపెట్టి 9 నెలల్లో సాహివాల్ ఆడ దూడను కానుకగా ఇచ్చారు. ఇలా మా ఊరి ఆవుల్లో చేసిన కృత్రిమ గర్భధారణతో అందరికీ కోరుకున్న జాతి ఆడ దూడలే పుట్టాయి. ఇది మాకు ఆశ్చర్యంతోపాటు ఐశ్వర్యాన్ని ఇచ్చింది’ అంటూ కామారెడ్డి జిల్లా తిప్పాపూర్ పాడిరైతు ఏలేటి గణేశ్‌రెడ్డి ఆనందంతో గంతేశాడు.. ఈ ఆనందం ఇప్పుడు ఈయన ఒక్కడిదే కాదు కామారెడ్డి జిల్లాలో మరికొందరిది కూడా. ఇక అన్ని పల్లెలకు.. కేంద్ర ప్రభుత్వం–విజయ డెయిరీ సహకారంతో చేపట్టిన కామారెడ్డి పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో వచ్చే నెల నుంచి అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,192 మంది వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులతో కృత్రిమ గర్భధారణ శిబిరాల్లో రైతు రూ.250 చెల్లిస్తే వారు కోరుకున్న దూడలకు జన్మనిచ్చేలా ఆవులను సిద్ధం చేయనున్నారు. అయితే 90 శాతం ఆడ దూడలు, 10 శాతం కోడె దూడలుండే విధంగా సమతౌల్యం పాటించనున్నారు. ఈ పథకం విస్తృతంగా రైతుల్లోకి వెళ్తే వచ్చే ఏడేళ్లలో టాప్–10 రాష్ట్రాల జాబితాలోకి తెలంగాణ చేరే అవకాశం ఉందని పాడి నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వెరీవెరీ స్పెషల్.. ►గిర్, సాహివాల్ ఆవుల పాలల్లో పోషకాలు, ఔషధ గుణాలు ఎక్కువ. సంతానోత్పత్తి సమర్థత కూడా అధికం. తక్కువ మేత, ఎక్కువ పాల దిగుబడితో ప్రస్తుతం ఈ స్వదేశీ జాతి ఆవులకు రూ.లక్షల్లో డిమాండ్ ఉంది. ►హెచ్ఎఫ్ ఆవుల్లో ఎక్కువ పాల దిగుబడితోపాటు ప్రసవించే పదిహేను రోజుల ముందు వరకు పాలు ఇవ్వడం ప్రత్యేకం. పాడిలో పెను మార్పులు పైలట్ ప్రాజెక్ట్‌గా పది గ్రామాల్లో చేసిన ప్రయోగం విజయవంతం కావడం శుభపరిణామం. ఈ పథకాన్ని మార్చిలో రాష్ట్రమంతా విస్తరిస్తాం. దీంతో పాడి రంగంలో పెనుమార్పులు రానున్నాయి. –డాక్టర్ మంజువాణి, సీఈఓ, లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ మా ఇంట్లో పోషకాల గోవు.. స్వదేశీ గిర్ ఆవుకు కృత్రిమ గర్భధారణతో మళ్లీ గిర్ ఆడ దూడ పుట్టింది. గిర్ ఆవు పాలల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. నా ఆవు రోజుకు 16 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. ఒక్క స్వదేశీ ఆవు ఉంటే ఆరోగ్యం మన వెంట ఉన్నట్టే. –మన్నె గంగారెడ్డి, తిప్పాపూర్, కామారెడ్డి పుణేలో.. ఫలించిన ప్రయోగంతో.. అంతరిస్తున్న దేశీ జాతులతోపాటు అధిక పాలనిచ్చే విదేశీ జాతి సంతతి వృద్ధి కోసం భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ (ఫుణే).. ఫ్లో సైటీమెట్రీ (బయాలాజికల్ విశ్లేషణ)తో తొలి అడుగు వేసింది. లింగ నిర్ధారణ వీర్యంతో పుణేలో చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో, అక్కడి నుంచి తొలుత దేశీ జాతులు, ఆపై విదేశీ జాతుల లింగ నిర్ధారణ వీర్యాన్ని సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ఆవుల్లో కృత్రిమ గర్భధారణ చేయగా, ఆశించిన విధంగానే ఎక్స్ క్రోమోజోమ్‌తో అండ ఫలదీకరణ ప్రయోగంతో కోరుకున్న స్థాయిలో ఆడ ఆవుదూడలు పుట్టాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్, జమ్ము,కశ్మీర్, ఒడిశాల్లో కృత్రిమ గర్భధారణ వేగవంతం చేశారు. మిగతా రాష్ట్రాల్లో వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని విస్తృతం చేయనున్నారు. -
ఆవు పేడతో కట్టిన ఇళ్లతో అణుధార్మికత నుంచి రక్షణ
వియారా(గుజరాత్): ఆవు పేడతో నిర్మించిన ఇళ్లు అణుధార్మికత నుంచి రక్షణ ఇస్తాయనే విషయం సైన్సు నిరూపించిందని గుజరాత్‌లోని తాపి జిల్లా సెషన్స్ జడ్జి సమీర్ వ్యాస్ పేర్కొన్నారు. గో మూత్ర ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతుందని తెలిపారు. అందుకే దేశంలోని గోవులను, వధించడం మానేసి రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గోవుల అక్రమ రవాణాకు పాల్పడిన ఓ వ్యక్తికి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పులో ఈ విషయాలను ఆయన పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్‌లో ఇచ్చిన తీర్పు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ప్రపంచంలోని అన్ని సమస్యలకు గోవధే కారణమని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అమిన్ అంజుమ్(20) 2020లో గుజరాత్ నుంచి ఆవులను తరలిస్తూ పట్టుబడ్డాడు. -
అమ్మకు వందనం.. పాతికేళ్లుగా గో సేవ.. పాలు పితకరు, అమ్మరు!
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంటున్న ఎనభై ఏళ్ల బదాంబాయికి మూగజీవాలంటే ప్రేమ. పాతికేళ్ళ క్రితం గోశాల ఏర్పాటు చేసిన ఆమె, నేటికీ గో సంరక్షణ కోసం పాటుపడుతుంటుంది. గోవులపై ఆమెకున్న ప్రేమకు కుటుంబం కూడా మద్దతుగా ఉంటుంది. శక్తి ఉన్నన్ని రోజులు గో సేవ చేస్తానని చెబుతున్న ఆమెను అందరూ గోవుల అమ్మగా కీర్తిస్తుంటారు. మదన్‌లాల్, బదాంబాయి దంపతులు తమ వైవాహిక జీవితం మొదలుపెట్టిన నాటి నుంచే ఆవు కనబడితే చాలు దండం పెట్టుకునేవారట. ఈ విషయం గురించి బదాంబాయిని అడిగితే ప్రతీ రోజూ ఉదయం క్రమం తప్పకుండా గో పూజ చేసేదాన్నని, ఆ భక్తి, ప్రేమ ఏళ్లు గడిచినకొద్దీ పెరిగిందే కానీ తగ్గలేదని చెబుతుంది కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో రాణించాడు మదన్‌లాల్. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వారూ జీవితాల్లో స్థిరపడుతున్నారు. ఆ సమయంలోనే గోశాల పెట్టాలన్న ఆలోచనను భర్తకు వివరించింది బదాంబాయి. అందుకోసం స్థలాన్వేషణ చేశారు. 1996లో 44వ నంబరు జాతీయ రహదారిపై జంగంపల్లి వద్ద స్థలాన్ని కొనుగోలు చేశాడు. ‘శ్రీ కుమార్ పాల్ జీవ్ దయా ట్రస్ట్’ను ఏర్పాటు చేసి అదే సంవత్సరం 21 ఆవులతో గోశాల మొదలుపెట్టారు బదాంబాయి దంపతులు. వాటి సంరక్షణకు పనివాళ్లను నియమించారు. బదాంబాయి రోజూ ఉదయం 9 గంటలకు టిఫిన్‌బాక్స్ పట్టుకొని గోశాలకు చేరుకునేది. అక్కడే సాయంత్రం వరకు గోవులను చూసుకుని తిరిగి ఇంటికి చేరుకునేది. మదన్‌లాల్, ఆయన కొడుకులు కూడా వ్యాపారంలో బిజీగా ఉన్నా ప్రతీ ఆదివారం గోశాలకు వచ్చేవారు. పాతికేళ్ల అనుబంధం... ఎవరైనా ఆవులు అమ్మడానికి తీసుకువెళుతున్నారంటే చాలు వాటిని బాదంబాయి కొనుగోలు చేస్తుంటుంది. అలాగే దేవాలయాల వద్ద ఆవులను పెంచడం భారంగా భావించి ఈ గోశాలకు తీసుకు వస్తుంటారు. ఇప్పుడు గోశాలలో ఆవులు, లేగల సంఖ్య 158కి చేరింది. ప్రతి రోజూ ఉదయమే బదాంబాయి కొడుకులు మహేందర్, మహిపాల్ లు ఆవులకు దాణా, కూరగాయలు, పండ్లు తీసుకువచ్చి వేస్తారు. ఆదివారం, సెలవు రోజుల్లో కొడుకులతోపాటు కోడళ్లు, మనవలు, మనవరాళ్లు కూడా గోశాలకు వచ్చి పనులు చేస్తుంటారు. అమావాస్య రోజున కుటుంబం అంతా గోశాలలోనే గడుపుతారు. అమ్మ వచ్చిందంటే చాలు ఆవులన్నీ ఆమెకు దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తాయి. ఆమె వయసు పైబడటం, ఆరోగ్య దృష్ట్యా అమ్మకు ఇబ్బంది కలగగూడదన్న ఉద్దేశ్యంతో ఇటీవల అడ్డుగా ఇనుప జాలీలను ఏర్పాటు చేశారు. జాలీల నుంచి వాటికి బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తుంటుంది. శక్తి ఉన్నన్ని రోజులూ గోవులకు సేవ చేస్తానని, పిల్లలందరూ ఇదే పనిని భక్తిగా చేస్తుంటారని వివరిస్తుంది బదాంబాయి. అన్నీ తానై.. 2008లో బదాంబాయి భర్త మరణించాడు. అయినా, ఆమె గో సంరక్షణ మానుకోలేదు. 21 ఆవులతో మొదలైన వాటి సంఖ్య వందల్లోకి చేరింది. గడ్డివేయడం, గోశాల శుభ్రం చేయడం, బెల్లం, ఇతర బలవర్ధకమైన ఆహారాన్ని తినిపించడం ద్వారా ఆవులతో ఆమె అనుబంధం పెంచుకుంటూనే ఉంది. ప్రతి గోవు బాగోగులు దగ్గర ఉండి చూసుకోవడంలోనే ఆమె రోజు మొత్తం గడుపుతుంటుంది. పాలు పితకరు, అమ్మరు ఈ గోశాలలో ఆవుల పాలు పితకరు. ఎన్ని ఆవులు ఈనినా సరే పాలు లేగలకు వదిలేస్తారు. ఆవులను గానీ, లేగలను గానీ అమ్మడం అనే మాట ఉండదు. వయస్సు పైబడి చనిపోయే దాకా వాటి సంరక్షణ బదాంబాయి, ఆమె కుటుంబం చూసుకుంటూ ఉంటుంది. చనిపోయిన గోవులను అక్కడే ఒక పక్కన గొయ్యి తీసి సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆవు మూత్రాన్ని మాత్రం సేకరించి బాటిళ్లలో నింపి పెడతారు. ఎవరైనా గృహ ప్రవేశాలు, యాగాల సందర్భంగా ఆవు మూత్రం కావాలని వచ్చిన వారికి ఇస్తారు. ఆవు పేడ కూడా తీసుకువెళతారు. కాగా ఆవు పేడను ఒక చోట జమ చేసి ఏడాదికోసారి అమ్ముతారు. పేడ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులను గోసేవా ట్రస్టుకే జమ చేస్తారు. ఆవులను మేపడం, గడ్డి కోసి వేయడం వంటి పనుల కోసం ఇప్పుడు నలుగురు పనివాళ్లను నియమించారు. వారికి వేతనాలతో పాటు దాణా కొనుగోలు కోసం నెలకు దాదాపు రూ.లక్షా 20 వేలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు బదాంబాయి కొడుకులు. నాలుగెకరాల్లో గడ్డి పెంపకం.... ఆవుల కోసం గోశాలలో నాలుగు ఎకరాల్లో గడ్డి పెంపకం చేపట్టారు. ఒక వైపు గడ్డి విత్తనం వేసి మొలకెత్తగానే, మరో పక్కన విత్తనం వేస్తారు. ఈ విధానం వల్ల ఎప్పుడూ గడ్డి అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటారు. ఈ జాగ్రత్తతో పాటు ఎండుగడ్డినీ కొనుగోలు చేసి నిల్వ చేస్తారు. దాతలు కొందరు గడ్డిని అందిస్తారు. ఏటా ఎండు గడ్డి కోసం రూ.3.50 లక్షల వరకు ఖర్చు చేస్తామని బదాంబాయి కొడుకులు మహేందర్, మహిపాల్‌లు తెలిపారు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి చదవండి: Venkampalli: వెల్కమ్ టు వెంకంపల్లి.. ఒక ఊరి కథ Rainwater Harvesting: చినుకు చినుకును ఒడిసి పట్టి.. ఆ నీటితోనే ఇంటి అవసరాలు సహా ఆవరణలో సపోటా, జామ.. ఇంకా -
‘వందేభారత్’ రైలుకు వరుస ప్రమాదాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
ముంబై: గుజరాత్– మహారాష్ట్ర రాజధానుల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన వందే భారత్ సెమీ స్పీడు రైలుకు వరుస ప్రమాదాలు జరుగుతుండటంపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఎవరైనా రైల్వేట్రాక్ వెంబడి పశువులను వదిలితే చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించింది. ముంబై–గాంధీదీనగర్ రైల్వే మార్గం వెంబడి ఉన్న చుట్టుపక్క గ్రామాల సర్పంచ్‌లను రైల్వే భద్రతా విభాగం అధికారులు కలసి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌రైలుకు పశువులు అడ్డం వచ్చి ఆగిపోయిన వరుస ఘటనలు జరిగిన గ్రామాల పెద్దలకు నోటీసులు జారీ చేశారు. రైల్వే ట్రాక్ వెంబడి పశువులను నిర్లక్ష్యంగా వదలొద్దని, సంబంధిత పశు యజమానులతో మాట్లాడే బాధ్యతలను గ్రామ సర్పంచ్‌లకు అప్పగించారు. రైల్వే ట్రాక్‌లపై ఎవరైనా పశువుల్ని నిర్లక్ష్యంగా వదిలితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని ఈ సందర్భంగా హెచ్చరించారు. సెపె్టంబరు 30న గాం«దీనగర్– ముంబై మార్గంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్నుంచి ఇప్పటివరకు వందేభారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పశువులు ఢీకొట్టడంతో ఆటంకం ఏర్పడిన ఘటనలు తరచూ జరిగాయి. గత శనివారం గుజరాత్‌లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో పశువులను ఢీకొట్టి వందేభారత్ రైలు ఆగిపోయింది. అంతకుముందు అక్టోబర్ 6, 7 తేదీల్లో కూడా ఇవే ఘటనలు జరగడంతో రైలు ముందుభాగం కొంతమేర దెబ్బతింది. దీంతో రైల్వే భద్రతా విభాగం దృష్టి సారించింది. ఎక్కువమొత్తంలో పశువులు ఉన్న యజమానులతో ఆయా గ్రామాల పెద్దలు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది. అయినప్పటికీ పశువులను రైల్వే ట్రాక్‌లపై నిర్లక్ష్యంగా వదులుతూ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ప్రొవిజన్స్ ఆఫ్ రైల్వే యాక్టు 1989, సెక్షన్ 154, ప్రకారం ఒక ఏడాదిపాటు జైలుశిక్ష, జరిమాన, లేదా రెండింటిని అ మలు చేయవచ్చని, సెక్షన్ 147 ప్రకారం ఆర్నెల్ల పా టు జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా, లేదా రెండూ అమలు చేయవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. -
తన మ్యూజిక్‌తో గోవులను ఆకర్షించేస్తున్నాడు.. వీడియో వైరల్
-
అద్భుత దృశ్యం.. ఆ గోవులన్నీ శ్రీకృష్ణుడే వచ్చాడనుకున్నాయేమో..!
పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు తన పిల్లనగ్రోవితో మంత్రముగ్ధుల్ని చేసేవాడని చెబుతారు. పిల్లనగ్రోవి వాయిస్తుంటే గోవులన్నీ ఎక్కడున్నా ఆయన చుట్టూ చేరేవి. ఆ సంఘటనను ఇప్పుడు గుర్తు చేశారు ఈ మోడ్రన్ కృష్ణుడు. సాక్సోఫోన్ వాయిస్తుంటే ఓ పొలంలో గడ్డి మేస్తున్న ఆవులన్నీ పరుగున వచ్చి ఆయన చుట్టూ చేరాయి. సంగీతానికి భాష అవసరం లేదని నిరూపించారు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఆవులు గడ్డి మేస్తున్న ప్రాంతంలో రోడ్డు పక్కన నిలుచుని సాక్సోఫోన్ వాయించాడు. ఆయన మ్యూజిక్ విన్న కొద్ది క్షణాల్లోనే దూరంగా ఉన్న ఆవులన్నీ పరుగున వచ్చి చుట్టూ చేరాయి. సుమారు 20-30 గోవులు ఉన్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ సంగీతం శక్తి ఇది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను 10 లక్షలకుపైగా మంది వీక్షించారు. దీనిపై పలువురు కామెంట్లు చేశారు. ‘ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మన భగవాన్ క్రిష్ణ చేసిన విధంగానే ఉంది. ఆయన తన పిల్లన గ్రోవితో అందరిని తనవైపు ఆకర్షించేవారు, ఆయన గోవులను సైతం’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ఇదీ చదవండి: క్రాకర్ కాల్చడం ఇంత కష్టమా.. ఎమ్మెల్యే తిప్పలు చూస్తే నవ్వు ఆగదు.. వీడియో వైరల్ -
విజృంభిస్తున్న ‘లంపీస్కిన్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెల్లజాతి ఆవులు, ఎద్దులకు సోకుతున్న లంపీస్కిన్ వ్యాధి విజృంభిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటివరకు 5,219 పశువులు ఈ వ్యాధి బారినపడగా వాటిలో 24 ఆవులు మృతి చెందాయి. 2,484 పశువులు ఇప్పటికీ వ్యాధితో బాధపడుతున్నాయని పశుసంవర్ధక శాఖ తెలిపింది. 32 జిల్లాల్లో లక్షణాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మినహా మిగిలిన 32 జిల్లాల్లోని పశువులకు ఈ వ్యాధి సోకిందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షలకుపైగా తెల్లజాతి పశువులుంటాయని అంచనా వేస్తుండగా ఇప్పటివరకు మొత్తం పశుసంపదలో 0.27 శాతానికి ఈ వ్యాధి సోకింది. గత వారం, పది రోజులుగా ఈ వ్యాధికారక క్యాప్రిపాక్స్ వైరస్ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 150 పశువులకు ఈ వ్యాధి సోకిందని అధికారులు వివరించారు. వ్యాధి సోకిన పశువులను ఐసొలేషన్‌లో ఉంచడంతోపాటు ఇప్పటివరకు 5,34,273 పశువులకు వ్యాక్సిన్లు వేశారు. వాతావరణ సానుకూలతతో ఉత్తరాదిలో ఐదారు నెలల కిందటి నుంచే ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని వేలాది పశువులు లంపీస్కిన్ కారణంగా చనిపోయాయి. అయితే సెప్టెంబర్ మధ్య వరకు రాష్ట్రంలో లంపీస్కిన్ ఆనవాళ్లు కనిపించలేదు. ఆ తర్వాత అక్కడక్కడా కనిపించినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ వ్యాధి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే నష్టనివారణ చర్యలు చేపట్టడంతో రాష్ట్రంపై పెద్దగా ప్రభావం ఉండదని పశుసంవర్ధక శాఖ అధికారులు భావించారు. కానీ ఉన్నట్టుండి లంపీస్కిన్ వ్యాధి తీవ్రరూపం దాలుస్తోంది. దోమలు, ఈగలు, గోమార్ల ద్వారా సంక్రమించే క్యాప్రిపాక్స్ వైరస్‌కు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, చలి వాతావరణం కూడా తోడైందని అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను బట్టి రాష్ట్రంలోని 20 శాతం పశువులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేంద్రం హెచ్చరికలు.. దేశంలో లంపీస్కిన్ వ్యాధి విజృంభిస్తున్న తీరుపై కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. పశువులకు వ్యాక్సినేషన్‌ను ఉధృతం చేయాలని శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించింది. లంపీస్కిన్ లక్షణాలు కనిపించిన పశువులున్న 5 కి.మీ. పరిధిలోని అన్ని గ్రామాల్లోగల పశువులకు వ్యాక్సిన్లు వేస్తున్న పశుసంవర్ధక శాఖ... ఇకపై రాష్ట్రంలో అన్ని తెల్లజాతి పశువులకు టీకాలు వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 15 రోజుల కార్యాచరణను రూపొందించింది. యుద్ధప్రాతిపదికన పశువులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. లంపీస్కిన్ లక్షణాలివే.. ►పశువులకు తీవ్రమైన జ్వరం ►కంటి నుంచి నీరు కారడం ►చర్మంపై పెద్దపెద్ద గడ్డలు ►తీవ్రమైన ఒళ్లు నొప్పులు ►చర్మమంతా పొలుసులుగా మారడం ►పశువు మేత తినదు... పాలివ్వదు వ్యాధిబారినపడ్డ ఆవుల పాలు తాగొద్దు పశువుల్లో లంపీస్కిన్ లక్షణాలు కనిపిస్తే రైతులు వెంటనే స్థానిక పశువైద్యాధికారికి సమాచారం ఇవ్వాలి. ముందుగా జ్వరం నియంత్రణకు వైద్యులు మందులు వాడతారు. వ్యాధి సోకిన పశువులను మంద నుంచి దూరం చేయాలి. ఆ పశువులు తిన్న గడ్డి ఇతర పశు వులకు వేయొద్దు. వాటి పాలు తాగొద్దు. ఈ వ్యాధి కారణంగా గొడ్డుమోతు తనం కూడా వచ్చే అవకాశముంది. – డాక్టర్ ఎస్. రాంచందర్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రోగం గురించి చెప్పేవారే లేరు పశువులు లంపీస్కిన్ వ్యాధి బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏ మందులు వాడాలి వంటి విషయాలు చెప్పే వారు మాకు అందుబాటులో లేరు. – బొక్కల మల్లారెడ్డి, హుజూరాబాద్ వ్యాక్సిన్ ఇచ్చారు.. లంపీస్కిన్ వ్యాధి నుంచి ఆవులను కాపాడేందుకు పశువైద్యులు మా ఆవులకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఆవులను మందలోకి వదలకుండా నేనే మేతకు తీసుకువెళ్లి తిరిగి ఇంటికి తీసుకొస్తున్నా. – కరుణాకర్‌రావు, మెట్పల్లి, మాక్లూర్ మండలం, నిజామాబాద్ జిల్లా రెండు ఎడ్లకు సోకింది మా రెండు ఎడ్లకు లంపీస్కిన్ వ్యాధి సోకింది. ఎడ్ల శరీరంపై దద్దుర్లు వచ్చాయి. పశు వైద్యాధికారికి చెబితే వచ్చి టీకాలు వేశారు. జాగ్రత్తలు చెప్పారు. – రాతిపల్లి మల్లేశ్, సుబ్బరాంపల్లి, చెన్నూరు మండలం, మంచిర్యాల జిల్లా -
స్వదేశీ సాహివాల్‌కు అద్దె గర్భంతో కొత్త ఊపిరి
శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి: చేను, చెలకల్లో మళ్లీ స్వదేశీ గోజాతుల అంబారావాల సవ్వడి పెరిగిపోనుంది. అంతరించిపోతున్న అరుదైన దేశీ పశుసంపద సంరక్షణ బాధ్యతను తీసుకున్నవారితో పాటు, తాజాగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ కొత్త చరిత్రను తెరమీదకు తెస్తోంది. నూటికి నూరుశాతం సాహివాల్ జన్యు లక్షణాలు కలిగిన కోడె వీర్యాన్ని, ఆవు నుండి తీసిన అండాలను జగిత్యాల ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ ప్రయోగశాలలో ఫలదీకరణ చేసి ఆవుల గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా సాహివాల్ దూడలకు ఇటీవలే ఊపిరి పోశారు. కోస్నూరుపల్లె మూల మోహన్‌రెడ్డి, సింగారావుపేట బద్దం రాజశేఖరరెడ్డికి చెందిన ఆవులకు రెండు నెలల క్రితం పుట్టిన లేగదూడలు పూర్తి సాహివాల్ జన్యు లక్షణాలతో ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. గడిచిన ఆర్నెల్లలో వెటర్నరీ కళాశాల వైద్యులు ఈ విధంగా 172 అండాలు ఫలదీకరణ చేసి అందులో వంద వరకు ఆవుల గర్భంలో అమర్చారు. దీంతో వచ్చే రెండు మూడు నెలల్లో ఒక్క జగిత్యాల జిల్లాలోనే వందకు పైగా దేశీ సాహివాల్ దూడలు జన్మించనుండటం పశుసంపద రక్షణకు సంబంధించి గొప్ప మలుపు కానుంది. ఈ పద్ధతి (ఐవీఎఫ్)లో కాకుండా కృత్రిమ గర్భధారణ చేస్తే పూర్తి జన్యులక్షణాలతో దూడలు పుట్టేందుకు పదితరాలు (ముప్పై నుండి నలభై సంవత్సరాలు) సమయం తీసుకునే అవకాశం ఉండగా తాజా అద్దెగర్భ ప్రయోగం తొలి దశలోనే విజయవంతం కావడం స్వదేశీ పశు సంపద అభివృద్ధిపై ఆశలు రేకెత్తిస్తోంది. యాభై స్వదేశీ జాతుల్లో..ప్రస్తుతం పదే! ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిధిలోని బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రీసోర్సెస్ (బీఏజీఆర్) దేశంలో 50 స్వదేశీ గోవు జాతులను గుర్తించగా, అందులో మెజారిటీ జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. 2012–19 మధ్య కాలంలో స్వదేశీ గోవులు 8.94 శాతం అంతరించాయి. ఈ నేపథ్యంలో రైతులు, ప్రభుత్వ సంస్థల సంరక్షణ చర్యలతో.. ప్రస్తుతం ఒంగోలు, పుంగనూరు (ఆంధ్రప్రదేశ్), పొడతురుపు (తెలంగాణ), గిర్ (రాజస్తాన్), సాహివాల్ (పంజాబ్, రాజస్తాన్), తార్పార్కర్ (రాజస్తాన్), డివోని (కర్ణాటక, మహారాష్ట్ర), వేచూర్, కాసరగోడ్ (కేరళ), కాంక్రేజ్ (గుజరాత్, రాజస్తాన్) గోవు జాతులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో ఉన్నాయి. గోకుల్ మిషన్‌తో సంరక్షణ చర్యలు ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా స్వదేశీ జాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘గోకుల్ మిషన్’ను ప్రకటించింది. 2021 మొదలుకుని 2026 వరకు రాష్ట్రీయ పశుధాన్ వికాస్ యోజనను అమలు చేస్తోంది. అందులో భాగంగానే జగిత్యాల వెటర్నరీ కళాశాలలో రూ.5.26 కోట్లతో ఓ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిలో సాహివాల్ గోవుల సంరక్షణను ప్రారంభించింది. తెలంగాణ బ్రాండ్‌గా.. పొడతురుపు ‘పొడతురుపు’గోవులకు ఇటీవలే కేంద్రం తెలంగాణ బ్రాండ్‌గా గుర్తింపునిచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లాతో పాటు నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం ఇవి 15 వేల వరకు ఉన్నట్టు తేల్చారు. కొండల్లోనూ ఆహారం సంపాదిస్తాయి. క్రూర జంతువుల నుండి కాపాడుకుంటాయి. ఈ ఆవు పాలల్లో ఔషధ గుణాలుంటాయి. రోజంతా శ్రమించే గుణం ‘పొడతురుపు’సొంతం. జన్యుపరమైన గుర్తింపు రావటంతో ఈ జాతిని సంరక్షించే బాధ్యతను అధికార యంత్రాంగం చేపట్టింది. అంతటా చేపట్టాలి వెటర్నరీ కాలేజీలో ప్రయోగం విజయవంతం కావటం స్వదేశీ గోమిత్రుల్లో సంతోషం నింపుతోంది. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా జగిత్యాలకు 30 నుండి 40 కి.మీ దూరంలో ఉండే ప్రాంతాల్లోనే ఈ విధంగా చేసేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా, ఈ పరిజ్ఞానం విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలని ఇప్పటికే సొంతంగా స్వదేశీ గోజాతులను సంరక్షిస్తున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. (క్లిక్ చేయండి: వైఎస్సార్ రెండిస్తే.. నేను నలభై చేసిన) సేవ్ స్వదేశీ ఆవు దేశీ గోవులను యుద్ధ ప్రాతిపదికన సంరక్షించాలంటూ అల్లోల దివ్యారెడ్డి ఇటీవల సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన పిల్లలకు స్వచ్చమైన పాలను అందించేందుకు ఆమె పడిన తపన.. స్వదేశీ గో సంరక్షణ వైపు అడుగులు వేయించింది. సంగారెడ్డిలో వంద గోవులతో (గిర్) ప్రారంభమైన దివ్యారెడ్డి ఫామ్ ప్రస్తుతం 250 ఆవులు, కోడెలతో నిండిపోయింది. చాలాకాలంగా పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో స్వదేశీ ఆవులను విదేశీ బ్రీడ్‌తో కృత్రిమ గర్భధారణ చేస్తుండటంతో స్వదేశీ ఆవు జాతులు అంతరించి పోయాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశంలో 26 శాతం హైబ్రిడ్ , మరో 56 శాతం క్రాస్‌బ్రీడ్ గోవులున్నాయని వివరించారు. వీటి స్థానంలో స్వదేశీ జాతుల అభివృద్ధి కోసం తాను ఓ అడుగు ముందుకు వేశానని దివ్యారెడ్డి చెప్పారు. (క్లిక్ చేయండి: అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది) -
గ్రామాలు ముంపులోకి.. గోవులు వనంలోకి
సహజంగా అటవీ ప్రాంతాల్లో ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతలు, జింకలు, దుప్పిలు, అడవిపందులు ఇలా రకరకాల జంతువులు ఎక్కువగా ఉంటాయి. కానీ సోమశిల వెనుక జలాలతో నిండిన అటవీ ప్రాంతంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఒకటి కాదు.. రెండు కాదు.. వేల సంఖ్యలో ఆవులు.. ఎద్దులు సంచరిస్తున్నాయి. నమ్మశక్యంగా లేదా.. అవును.. ఇది అక్షరాలా నిజం.. అంత భారీ సంఖ్యలో ఎలా ఉన్నాయని ఆశ్చర్యమేస్తోందా.. అయితే ఈ ఆసక్తికర సమాచారం మీకోసం.. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో వందకుపైగా గ్రామాలు సోమశిల వెనుక జలాలకు మునిగిపోయాయి. 1978 నుంచి సోమశిల జలాశయంలో నీటిని నింపేందుకు కడప జిల్లాలోని ముంపు గ్రామాలను గుర్తించి, వాటికి నష్టపరిహారం ఇప్పించి, ఖాళీ చేయించారు. 2007 నుంచి 70 టీఎంసీల నీరు నిల్వకు రంగం సిద్ధం చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముంపు గ్రామాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియ మరింత వేగంగా పూర్తి చేశారు. నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయం నిర్మించారు. భూసేకణలో భాగంగా జిల్లాలోని వందకుపైగా గ్రామాలు నీట మునిగాయి. అప్పట్లో చాలామంది ముంపు బాధితులు గ్రామాలను వదిలి వెళ్లేటప్పుడు తమతోపాటు ఉన్న ఆవులు, ఎద్దులను అక్కడే వదిలి వెళ్లిపోయారు. విధిలేని పరిస్థితుల్లో అలా తమ పెంపుడు మూగజీవాలను వదిలి వెళ్లాల్సి వచ్చిందని వారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. నాడు వందల్లో.. నేడు వేలల్లో సోమశిల ముంపు వాసులు 44 ఏళ్ల క్రితం తమ గ్రామాలను ఖాళీ చేసేటప్పుడు వదిలేసిన పశు సంపద అప్పట్లో వందల్లో ఉంటుంది. ఆ తర్వాత సంతానోత్పత్తి జరిగి వాటి సంఖ్య నేడు వేలల్లోకి చేరిందని అంచనా. ప్రస్తుతం సోమశిల అటవీ ప్రాంతానికి అలవాటు పడిన ఆవులు, ఎద్దులు వెనుక జలాలు తగ్గిన సమయంలో అప్పుడప్పుడూ గ్రామాల వైపు వస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. వాటిని కొందరు ఉచ్చు వేసి పట్టుకునేందుకు ప్రయతి్నస్తుంటారని అంటున్నారు. ఉచ్చులేసిపట్టుకున్నా.. సోమశిల వెనుక జలాల అటవీ ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్న ఆవులు, ఎద్దులను పట్టుకోవాలంటే కష్టమే. కొంతమంది వీటితో వ్యాపారం చేసుకునేందుకు ఊచ్చులేసి పట్టుకుంటుంటారు. ఇటీవల ఉచ్చులేసి పట్టుకున్న ఆవులను పోలీసులు విడిపించి, మళ్లీ అడవిలోకి పంపించిన సంఘటన నందలూరులో చోటుచేసుకుంది. మునిగిపోయిన గ్రామాలు.. అట్లూరు మండలంలో మల్లెలపట్నం, చెండువాయి, రాఘవరెడ్డిపేట, చెర్లోపల్లె, ఒంటిమిట్ట మండలంలో గుండ్లమాడ, మాధవరం, ఉప్పరపల్లె, బోయనపల్లె, చిన్నపరెడ్డిపల్లె, కలికిరి, మదిలేగడ్డ, పొన్నపల్లె, మల్లంపేట, కొండమాచుపల్లె, కుడగుంటపల్లె, కొడుములూరు, నందలూరు మండలంలో యల్లంపేట, రంగాయపల్లె, తిమ్మరాచపల్లె, చుక్కాయపల్లె, చాపలవారిపల్లె, కొమ్మూరు, కోనాపురం, వెంకటరాజంపేట, చింతకాయలపల్లె, ఎగువరాచపల్లె, జంగాలపల్లెతో పాటు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో మరికొన్ని ఉన్నాయి. ముంపు గ్రామాలు పశుసంపదకు నిలయాలు సోమశిల ముంపు గ్రామాలు పశు సంపదకు నిలయాలుగా ఉండేవి. పచ్చటి పొలాలు, పాడిసంపదతో కళకళలాడేవి. సోమశిల జలాశయం కోసం అప్పటి ప్రభుత్వాలు పరిహారం ఇచ్చి జిల్లాలోని వందకుపైగా గ్రామాలను ఖాళీ చేయించాయి. ఆ సమయంలో చాలా వరకు పశుసంపదను వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. –భువనబోయిన లక్ష్మనయ్య, మాజీ ఎంపీపీ, నందలూరు అడవిలోకి ప్రవేశం నిషేధం సోమశిల వెనుక జలాలు గల అటవీ ప్రాంతం లో ప్రవేశం నిషేధం. అడవిలో ఉండే జీవాలు అడవికే పరిమితం. వాటిని అక్రమ రవాణా చే యడం చట్టరీత్యా నేరం. ముంపు గ్రామాలు ఖాళీ చేసినప్పుడు పశుసంపదను ఇక్కడే వది లేయ డంతో ఇప్పుడు ఆవులు, ఎద్దులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా అడవిలో ఉన్న వాటిని పట్టు కోవడం నేరమే. –కుందనూరి ప్రసాద్, రేంజర్, అటవీశాఖ, ఒంటిమిట్ట సోమశిల ప్రాంతంలో ఆవులు, ఎద్దులు అనేకం సోమశిల వెనుక జలాల వెంబడి ఉన్న అడవుల్లో ఆవులు, ఎద్దులు వేల సంఖ్యలో ఉంటాయి. ముంపు గ్రామాలు ఖాళీ చేసిన క్రమంలో వాటిని వదిలి వెళ్లారు. అవే ఇప్పుడు అడవిలో ఉన్నాయి. ముంపు గ్రామాలు ఒకప్పుడు పాడిపంటలతో కళకళలాడాయి. పాడి అడవిపాలై, పంటలు నీటమునిగిపోయాయి. –ఆశీర్వాదం, ముంపుబాధితుడు, కోనాపురం, నందలూరు -
Allola DIVYA REDDY: గోమాత
ఆవు... అమ్మ తర్వాత అమ్మ. పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. నేలకు సారం... మట్టికి జీవం ఇస్తుంది. పంటకు ప్రాణం... అవుతుంది. అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది. మనిషి మనుగడకు ఆధారం అయింది. అలాంటి మన ఆవు ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఆవును కాపాడే ఒక అమ్మ కావాలి. ఆ అమ్మ... అల్లోల దివ్యారెడ్డి. పెట్ రైట్స్ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు చట్టాలున్నాయి. పులుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకుంది ప్రభుత్వం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచమంతా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి పర్యావరణ వ్యవస్థలో మన ఆవులు ఎందుకు స్థానాన్ని కోల్పోతున్నాయి. ఆవును మచ్చిక చేసుకుని అడవి నుంచి ఇంటికి తెచ్చుకున్నారు మన పూర్వికులు. ఇప్పుడవి ఎల్లలు దాటి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నాం మనం. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే ఆ తర్వాత ఉద్యమించినా ప్రయోజనం ఉండదంటారు అల్లోల దివ్యారెడ్డి. మన దేశీయ ఆవులను సంరక్షించే బాధ్యతను చేపట్టారామె. ‘ప్రమాదం అంచున ఉన్న దేశీయ ఆవులను సంరక్షించు కుందాం’... అని పిలుపునిస్తున్నారు. ఇందుకోసం సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇప్పుడు ఎకలాజికల్ ఇంజనీరింగ్ బాధ్యతను చేపట్టిన ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారామె. ఏటూ మిల్క్ మన ఆవులవే! ‘‘మాది తెలంగాణ, సంగారెడ్డి జిల్లా కేంద్రం. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. నాన్న వాటర్ వర్క్స్‌లో ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా రిటైర్ అయ్యారు. నేను ఇంజనీరింగ్ తర్వాత పెళ్లి చేసుకుని, మా వారికి వ్యాపారంలో సహాయంగా ఉన్నాను. అత్తగారిల్లు నిర్మల్. ఇద్దరు పిల్లలతో నాలోకం నాదిగా, పిల్లలను చక్కగా పెంచుకోవడమే తొలి ప్రాధాన్యంగా ఉండేది. అలాంటిది 2014 నన్ను పూర్తిగా మార్చేసింది. అప్పుడు వార్తా పత్రికల్లో, టీవీ చానెళ్లలో పాల కల్తీ గురించి వరుస కథనాలు వచ్చాయి. నా పిల్లలకు తాగిస్తున్న పాలు స్వచ్ఛమైనవి కావా, విషపూరితమైన ఆహారాన్ని పిల్లలకు ఇస్తున్నానా... అని ఎంత ఆవేదన చెందానో మాటల్లో చెప్పలేను. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఏటూ (అ2) పాల గురించి అధ్యయనం మొదలుపెట్టాను. మన దేశీయ ఆవు ఇచ్చే పాలే ఏటూ మిల్క్ అని తెలిసిన తర్వాత సంతోషం వేసింది. హైదరాబాద్‌లో ఏటూ మిల్క్ కోసం అన్వేషణ మొదలు పెట్టాను. ఆశ్చర్యం... పాలు దొరకనే లేదు. మనం, మన పిల్లలు మాత్రమే కాదు, మన ఆవు కూడా ప్రమాదం అంచున ఉన్నట్లు అప్పుడు తెలిసింది. వెంటనే పది ఆవులతో సంగారెడ్డిలోని మా పొలంలోనే క్లిమామ్ గోశాల మొదలుపెట్టాను. అక్కడి నుంచి మా ఇంటికి నలభై నిమిషాల ప్రయాణం. అప్పటి నుంచి మా పిల్లలు స్వచ్ఛమైన పాలతో పెరుగుతున్నారు. మన దేశీయ గోసంతతి పెంచడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా 2015లో పది ఆవులతో మొదలైన గోశాలలో ఇప్పుడు 250 ఉన్నాయి. మా క్లయింట్లు చాలా మంది ఇప్పుడు రెండు – మూడు ఆవులను పెంచుకుంటున్నారు. కొంతమంది ఏకంగా వంద ఆవులతో ఫార్మ్ పెట్టారు. దేశ పర్యటన మూపురం ఉన్న ఆవు మన దేశీయ ఆవు. అలాంటి దేశీయ ఆవుల సంఖ్య పెంచడానికి దాదాపుగా దేశమంతా పర్యటించాను. రైతులతో మాట్లాడాను. ఆవును పెంచడం పాలకోసం అనుకుంటారు, కానీ నిజానికి ఆవు పాలు మనకు బోనస్ మాత్రమే. అసలైన ప్రయోజనం నేలకోసం. నేలను సారవంతంగా ఉంచుకున్నంత కాలమే మనిషికి మనుగడ. వందగ్రాముల ఆవుపేడలో పదిలక్షల సూక్ష్మజీవులుంటాయి. అవి నేలను సజీవంగా ఉంచుతాయి. రసాయన ఎరువులు, పురుగుమందులతో నేలలో ఉండాల్సిన జీవజాలం అంతరించిపోతోంది. ఆవుపేడ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చు. అందుకే ‘నేల పండాలంటే ఆవు ఉండాలి. అది మన దేశీయ ఆవు అయి ఉండాలి’ అంటాను. సేంద్రియం మనకు కొత్త కాదు! మన రైతులు సేంద్రియ వ్యవసాయమే చేసేవారు. యాభై – అరవై ఏళ్ల వెనక్కి వెళ్లి చూడండి. వాళ్లకు యూరియాలు, డీఏపీలు తెలియదు. ఆవులు, గేదెల ఎరువుతో సేద్యం చేసుకుంటూ రైతు రాజులాగా జీవించాడు. అలాంటి రైతును అధిక దిగుబడి అంటూ రసాయన ఎరువులతో పక్కదారి పట్టించాం. ఇప్పుడు రైతు ఉన్నంత దీనస్థితిలో మరెవరూ ఉండకపోవచ్చు, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఒడిదొడుకులు మరే పరిశ్రమలోనూ కనిపించవు. ఇప్పుడు మళ్లీ రైతును సేంద్రియం వైపు మళ్లించడానికి వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. గ్రామాల్లో ప్రతి ఇంట్లో కనీసం ఒక్క దేశీయ ఆవు ఉన్నా చాలు, దేశంలో ఆవుల సంతతి పెరుగుతుంది, వ్యవసాయం బాగుపడుతుంది. మనిషి జీవనం గాడిలో పడుతుంది. ఆవులకు కృత్రిమ గర్భధారణను తప్పనడం లేదు, కానీ విదేశీ బ్రీడ్‌తో గర్భధారణను వ్యతిరేకిస్తున్నాను. రెడ్ సింధీ, సహీవాల్, గిర్ వంటి రోజుకు పదిహేను లీటర్ల పాలిచ్చే రకాలున్నాయి. అలాంటి మనదేశీయ జాతితో గర్భధారణ చేసినప్పుడే మన ఆవు మనకు మిగులుతుంది. లేకపోతే శ్రీలంక పరిస్థితి తప్పదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి ఆవులను దిగుమతి చేసుకుందా దేశం. సొంత నేల ఆవు జాతులను పట్టించుకోలేదు. చివరికి దిగుమతి చేసుకున్న బ్రీడ్ నిలవలేదు, సొంత బ్రీడ్ అంతరించిపోయిందక్కడ. నేను న్యాయస్థానం మెట్లెక్కింది కూడా ఈ విషయంలోనే. కృత్రిమ గర్భధారణ హైబ్రీడ్‌తో వద్దు, మన దేశీయ జాతులతో చేయాలని న్యాయస్థానాన్ని కోరాను’’ అన్నారు అల్లోల దివ్యారెడ్డి. ఇంత పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నప్పటికీ ఎక్కడా అవరోధాలు లేకుండా ముందుకు సాగడానికి ఇంట్లో అందరి సహకారం ఉందని, కుటుంబ సభ్యుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారామె. ఆవు నన్ను ఎంచుకుంది! అవుతో కలిసి సాగుతున్న నా జర్నీ అంతటినీ ఓసారి వెనక్కి చూసుకుంటే... గోసేవను ఎంచుకున్నది నేను కాదు, గోవులే నన్ను ఎంచుకున్నాయనిపిస్తోంది. నేను చేస్తున్నదేదీ ముందుగా ప్రణాళిక వేసుకుని మొదలుపెట్టింది కాదు. పాల కల్తీ గురించి తెలిసినప్పటి నుంచి ఒక్కటొక్కటిగా అడుగులు వాటంతట అవే పడుతున్నాయి. ఈ పోరాటంలో విజయం సాధించేవరకు విశ్రమించను. ఆవును నగరాల్లో ఇళ్లకు కూడా పరిచయం చేయడానికి మట్టి గణపతిలో కొద్దిగా గోమయం కలిపి చేస్తున్నాను. గోమయంతో కూడిన మట్టి గణపతి విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేయవచ్చు లేదా కరిగించి ఇంట్లో మొక్కలకు ఎరువుగానూ వేసుకోవచ్చు. మన ఆవు కోసం ఇంకా ఏ ఆలోచన వస్తే దానిని ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్తాను. మన జాతీయ చిహ్నంలో ఉన్న ఎద్దు బొమ్మను ఉదహరిస్తూ జాతి సంపదను పరిరక్షించుకుందాం... అని సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నంలో ఉన్నాను. – అల్లోల దివ్యారెడ్డి, వ్యవస్థాపకురాలు, క్లిమామ్ గోశాల – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
అయ్యో.. గోమాతలారా..
వెలుగోడు: నంద్యాల జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిలో మునిగి వంద ఆవులు గల్లంతయ్యాయి. మేతకు వెళ్తున్న ఆవుల మందను అడవి పందులు బెదిరించడంతో రిజర్వాయర్‌లోకి దూకాయి. వెంటనే అప్రమత్తమైన వాటి యజమానులు, మత్స్యకారులు రిజర్వాయర్‌లో చిక్కుకున్న 350 గోమాతలను రక్షించగా, మరో 100 ఆవుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలుగోడుకు చెందిన శంకర్, సుంకన్న, కురుమన్న, బాలలింగం, వెంకటరమణతో పాటు మరో ఐదుగురికి చెందిన వెయ్యి ఆవులు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిధిలోని డీఎల్బీ రెగ్యులేటర్ వద్ద గట్టు వెంట శుక్రవారం ఉదయం మేతకు వెళ్లాయి. అదే సమయంలో ఎదురుపడిన అడవి పందుల గుంపు ఆవుల మందను బెదిరించాయి. దీంతో భయపడిన ఆవులు (దాదాపు 450) వెలుగోడు జలాశయంలోకి పరుగులు తీశాయి. బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి 9 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రవాహానికి ఆవులు కొట్టుకుపోయాయి. దిక్కు తోచని స్థితిలో ఆవుల కాపరులు బిగ్గరగా కేకలు వేయడంతో రిజర్వాయర్ వద్ద ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై పుట్టీల సాయంతో నీటిలో ఉన్న 350 ఆవులను రక్షించారు. గల్లంతయిన ఆవుల కోసం గాలిస్తున్నారు. ఆవులను రక్షించటానికి గ్రామస్తులు జాలరులను రంగంలోకి దింపారు. మర బుట్టలతో జాలరులు ఆవుల కోసం శుక్రవారం సాయంత్రం వరకు గాలించారు. ఘటనా స్థలానికి ఆత్మకూరు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ జగన్మోహన్, తహసీల్దార్ మహమ్మద్ రఫీ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీను, ఆర్ఐ రామాంజనేయులు, వీఆర్వోలు చేరుకొని సహాయక చర్యలను సమీక్షించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో వంద ఆవుల ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. -
ఇన్నోవాలో రెండు ఆవుల తరలింపు
కేతేపల్లి: ఇన్నోవా కారులో రెండు ఆవులను కుక్కి హైదరాబాద్‌లోని కబేళాకు తరలిస్తుండగా గురువారం కేతేపల్లి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద గురువారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇన్నోవా కారులో రెండు ఆవులను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.అనిల్‌రెడ్డి తెలిపారు. -
అరుదైన రకం.. మేలైన నిర్ణయం!
అరుదైన రకానికి చెందిన పుంగనూరు జాతి ఆవులకు మంచి రోజులు వచ్చాయి. వెయ్యేళ్ల నాటి ఆవుగా గుర్తింపు పొందిన ఈ పొట్టి రకాన్ని అధికంగా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకోసం ఐవీఎఫ్ ల్యాబ్‌తోపాటు సెమన్ స్టోరేజీ బ్యాంకును పలమనేరులోనే ఏర్పాటు చేసింది. సరోగసీ పద్ధతిలో పొట్టి జాతి ఆవుల అధికోత్పత్తికి అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపడుతోంది. పలమనేరు: ప్రపంచంలోనే అరుదైన రకం పశువులుగా పుంగనూరు జాతికి పేరుంది. ప్రస్తుతం వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. అందుకే వీటిని అధికంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఆర్కేవీవై ద్వారా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిధుల ద్వారా పలమనేరు పశుపరిశోధన కేంద్రంలో ఐవీఎఫ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. దీనిద్వారా పుంగనూరు జాతి పశువులను ఎక్కువగా ఉత్పత్తి చేయనున్నారు. ఈ ల్యాబ్‌ను నెలరోజుల్లో ప్రారంభించేందుకు ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. పరిశోధన కేంద్రం లక్ష్యం ఇదీ పలమనేరు సమీపంలోని కేటిల్‌ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధనా కేంద్రం పేరుతో ప్రారంభమైన ఈ పశుపరిశోధన సంస్థ 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఇన్‌సైటీవ్ కన్సర్వేషన్ (స్థానికంగా వీటి సంఖ్యను ఉత్పత్తి చేయడం) దీని లక్ష్యం. 20 పొట్టి రకం పశువులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 276 పశువుల వరకు పెరిగినప్పటికీ ఆశించినంత ఉత్పత్తి జరగడం లేదు. క్రమేణా ఇక్కడ పేయి దూడల ఉత్పత్తి తగ్గుతోంది. ఒకే రక్త సంబంధం కలిగిన కోడెలతో సంక్రమణం చెందడంతో జన్యుపరమైన ఇబ్బందులతో దూడలు ఆరోగ్యకరంగా జన్మించడం లేదు. దీనిపై దృష్టిపెట్టిన ప్రభుత్వం స్థానిక పరిశోధనా కేంద్రంలో పిండమార్పిడి కేంద్రాన్ని (ఎంబ్రయో ట్రాన్స్ఫర్ ల్యాబ్) నెలకొల్పింది. దీంతోపాటు ఎన్ఏహెచ్ఈపీ (నేషనల్ అగ్రికల్చర్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్)కింద ఐకార్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్) ద్వారా రూ.3 కోట్ల నిధులతో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా స్థానిక ల్యాబ్‌లో సెమన్ స్టోరేజీ చేసి, ఆ వీర్యాన్ని గుంటూరు జిల్లాలోని లాంఫారం, కర్ణాల్‌లోని యన్.బి.ఏ.జి.ఆర్ (జాతీయ జన్యువనరుల కేంద్రం)లో భద్రపరిచేవారు. ఇకపై పూర్తి స్థాయిలో అన్ని పనులు ఇక్కడే జరగనున్నాయి. పిండమార్పిడి పద్ధతి పుంగనూరు జాతి ఎద్దునుంచి సెమన్‌ను తీసి దాని ద్వారా ఎక్కువ అండాలను ఉత్పత్తి చేయిస్తారు. ఆపై కృత్రిమ గర్భ«ధారణ ద్వారా ఫలదీకరణం జరిపి ఈ అండాలను పోగుచేసి సరోగసీ పద్ధతిలో ఎదకొచ్చిన ఆవులకు ఇంప్లాంట్ చేస్తారు. దీంతో ఈ జాతి పశువులను ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. తద్వారా ఏటా వందల సంఖ్యలో పొట్టిరకం పశువుల ఉత్పత్తి జరగనుంది. అంతరించిపోతున్న అరుదైన జాతులు దేశంలో 34 రకాల పశు జాతులున్నాయి. వీటిల్లో అత్యంత ముఖ్యమైంది పుంగనూరు పొట్టి రకం పశువులే. ఇవి స్థానిక పశు పరిశోధనా కేంద్రంలో 200 ఉండగా వీటి సంఖ్య ఇప్పుడు 276కు చేరుకుంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఇవి వందకు పైగా ఉన్నట్టు సమాచారం. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో వేచూరు రకం పొట్టి ఆవుల (ఇవి ఎరుపు రంగులో ఉంటాయి) సంఖ్య పదికి పడిపోయింది. ఇక అ«ధిక పాలనిచ్చే షాహీవాల్ రకం కనుమరుగవుతోంది. ప్రస్తుతం ఇవి మన దేశంలోని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పాకిస్తాన్‌లోనూ మాటంగొమేరి జిల్లాలో మాత్రం కనిపిస్తున్నాయి. ఏదేమైనా వీటన్నింటికంటే అత్యంత అరుదైన జాతి పుంగనూరు రకమే. అందుకే వీటిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పుంగనూరు రకాన్ని మరింత అభివృద్ధి చేస్తాం ఇక్కడి పరిశోధనా కేంద్రంలో 276 వరకు పుంగనూరు రకం పశువులున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎల్డీఏ ద్వారా ఈ జాతి వీర్యాన్ని అందించేందుకు ఇప్పటికే కృషి చేస్తున్నాం. మరో నెల రోజుల్లో ఇక్కడ ఐవీఎఫ్ ల్యాబ్ సిద్ధమవుతుంది. దీంతో వీర్యాన్ని వృథా కానీయకుండా ఎక్కువ పశువులకు ఇచ్చి పుంగనూరు వెరైటీని పెంచుతాం. రాబోవు రెండేళ్లలో పశువుల సంఖ్యను 500 చేసేలా లక్ష్యం పెట్టుకున్నాం. డాక్టర్ వేణు, సైంటిస్ట్, పశుపరిశోధన కేంద్రం, పలమనేరు -
‘మేలు’ కలయిక మరింత పెరగాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పశు సంపద పెంపుదల, నాణ్యమైన పశుజాతుల అభివృద్ధి కోసం అమలవుతున్న కృత్రిమ గర్భధారణ కార్యక్రమం ఏటేటా ఊపందుకుంటోంది. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 1.25 కోట్ల పశువులకు కృత్రిమ గర్భధారణ చేపట్టినట్టు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (టీఎస్ఎల్డీఏ) లెక్కలు చెప్తున్నాయి. పల్లెల్లో గోపాలమిత్రల సహకారంతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టుతో మేలుజాతి గేదెలు, ఆవుల సంతతి వృద్ధి చెందుతోందని.. తద్వారా పాల ఉత్పత్తి కూడా పెరుగుతోందని అధికారులు తెలిపారు. 2014లో 13.7 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయగా.. 2019–20లో అత్యధికంగా 18.9 లక్షల పశువులకు కృత్రిమ గర్భాన్ని అందించగలిగినట్టు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి 16.9 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేసినట్టు తెలిపారు. జాతీయ స్థాయితో పోలిస్తే వెనుకే.. పశువుల కృత్రిమ గర్భధారణ విషయంగా జాతీయ స్థాయి గణాంకాలతో పోలిస్తే తె లంగాణ కొంత వెనుకబడే ఉంది. జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం మూడోదశ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్లో తెలంగాణలో ఏ ఒక్క జిల్లా కూడా 50శాతం లక్ష్యాన్ని పూర్తిచేయలేకపోవడం గమనార్హం. 2019–20 సంవత్సరానికి గాను కేంద్రం పెట్టిన లక్ష్యాల్లో.. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కేవలం 9 శాతమే పూ ర్తిచేయగలిగారు. అత్యధికంగా గద్వాలలో 46%, వరంగల్ అర్బన్ జిల్లాలో 43% పశువులకు మాత్రమే కృత్రిమ గర్భధారణ చేయ గలిగినట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కృత్రిమ గర్భధారణ ఎందుకు? పశువుల్లో గర్భధారణ కోసం ఆడ, మగ జాతి కలయిక కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చని.. ఆడ పశువు ఎదకు వచ్చిన 36 గం టల్లోనే ఈ కలయిక జరగాల్సి ఉంటుందని పశువైద్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. అంతేగాకుండా మేలుజాతి మగ పశువులు ఎక్కు వగా అందుబాటులో లేకపోవడం కూడా సమస్యగా ఉందని అంటున్నాయి. మేలుజాతి పశువుల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చే యించడం వల్ల.. పశువులు మేలుజాతి దూడలకు జన్మనివ్వడంతోపాటు వాటి ద్వారా అధిక పాల దిగుబడి లభిస్తుందని వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశువులకు గర్భధారణ కార్యక్రమాన్ని చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నాయి. కరీంనగర్ కేంద్రంగా.. రాష్ట్రంలో కరీంనగర్ కేంద్రంగా పశువుల వీర్యకణాల వృద్ధి సంస్థ కొనసాగుతోంది. అక్కడ మేలుజాతి (ముర్రా జాతి) దున్నపోతులను పూర్తి జాగ్రత్తలతో పెంచుతారు. వాటి నుంచి వీర్యాన్ని సేకరించి రైతులకు, పశువుల పెంపకందారులకు అందజేస్తుంటారు. ఈ బ్రీడింగ్ సీజన్ ఏటా అక్టోబర్ నుంచి ప్రారంభమై ఫిబ్రవరి చివరివారం వరకు కొనసాగుతుంది. బర్రెలు చలికాలంలో ఎక్కువగా ఎదకు వస్తే.. ఆవులు ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఎదకు వస్తాయి. ఈ సమయాన్ని గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం గ్రామాల్లో గోపాలమిత్రల సేవలను వినియోగించుకుంటారు. గోపాలమిత్రలకు ప్రోత్సాహకం కట్ వీర్యకణాల వృద్ధి సంస్థ నుంచి పశువుల వీర్యాన్ని స్ట్రాల రూపంలో ఇస్తారు. ఒక్కో స్ట్రాకు రూ.25 చొప్పున వీర్యకణాల వృద్ధి సంస్థకు చెల్లిస్తారు. ఆ వీర్యాన్ని పశువుల్లో ప్రవేశపెట్టేందుకు గోపాలమిత్రలకు రూ. 50 ప్రోత్సాహకంగా ఇస్తారు. సదరు పశు వు గర్భం ధరిస్తే రూ.100, ఈనితే మరో రూ.150 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతులు కూడా ఒక్కో పశువుకు కొంత సొమ్మును గోపాలమిత్రలకు ఇస్తుంటారు. అయితే ఈ ఏడాది గోపాలమిత్రలకు చెల్లించే ప్రోత్సాహకం రూ.50లో రూ.15 కోతపెడుతూ పశుగణాభివృద్ధి కమిటీలు తీర్మానం చేశాయి. మరీ రూ.35 మాత్రమే ఇవ్వడంపై గోపాలమిత్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బీర్ పీనా.. దూద్ దేనా !
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధిక పాల దిగుబడి కోసం గేదెలు, ఆవులకు మోతాదుకు మించి బీర్‌దాణా (బీర్ తయారు చేయగా మిగిలిన వ్యర్థాల లిక్విడ్) తాగిస్తున్నారు. ఇలా చేయడం వలన ప్రత్యక్షంగా పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు.. పరోక్షంగా పాలు తాగిన చిన్నారుల అనారోగ్యానికి కారణమవుతున్నారు. సాధారణంగా పాలిచ్చే గేదెలు, ఆవులకు రైతులు అధిక పాల దిగుబడి కోసం కడుపునిండా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పల్లిపట్టి, బెల్లంపట్టి, కుసుమ నూనె తీయగా మిగిలిన కిల్లి, తవుడు, కందిపొట్టు, మొక్కజొన్నతో తయారు చేసిన సంప్రదాయ దాణా వాడుతుంటారు. వీటిలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. అయితే బహిరంగ మార్కెట్లో ఈ దాణా ధరలు రెట్టింపవడంతో వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు కొంతమంది పక్కదారిపట్టారు. ధర తక్కువ బీర్ తయారీ కంపెనీలు ట్యాంకర్ల ద్వారా రహస్యంగా సరఫరా చేస్తున్న బీర్‌దాణాను డ్రమ్ముకు రూ.900 నుంచి రూ.1,000 చొప్పున కొనుగోలు చేసి పశువులకు అందిస్తున్నారు. సంప్రదాయదాణాలో ఐదు శాతానికి మించి బీర్‌దాణా వాడకూడదు. కానీ తక్కువ ధర.. 20–30 శాతం పాలు ఎక్కువగా ఇస్తుండడంతో రైతులు ఒక్కో పశువుకు రోజుకు సగటున నాలుగు నుంచి ఐదు కిలోల చొప్పున వాడుతున్నారు. పశువుల ఆరోగ్యానికి ఇది హానికరమని వైద్యులు హెచ్చరించినా పెడ చెవిన పెడుతున్నారు. ఫలితంగా పశువుల జీవితకాలం పదిహేనేళ్ల నుంచి పదేళ్లకు పడిపోతోంది. ఎనిమిది నుంచి పది ఈతలు ఈనాల్సిన గేదెలు నాలుగైదు ఈతలకే పరిమితమవుతున్నాయి. ఆరోగ్యపరిస్థితి క్షీణించి, త్వరగా మృత్యువాత పడుతున్నాయి. పశువుల పాకలోని డ్రమ్ముల్లో బీర్ లిక్విడ్ డిమాండ్ ఎక్కువ కావడంతో.. పశువైద్యశాఖ అధికారుల అంచనా ప్రకారం జిల్లా లో 1,88,182 పశువులు ఉండగా, వీటిలో 1,22, 58 7 గేదెజాతివి ఉన్నాయి. విజయ, మదర్ డెయి రీలు 8,570 మంది రైతుల నుంచి పాలు సేకరిస్తున్నాయి. గ్రేటర్ వాసులకు రోజుకు కనీసం 25–30 లక్షల లీటర్ల పాలు అవసరమవుతుండగా, ప్రస్తుతం జిల్లాలో 2.50 లక్షల లీటర్లకు మించి సరఫరా కావడం లేదు. బహిరంగ మార్కెట్లో లీటర్ పాలను రూ.70 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. దిగుబడికి, డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాçసం ఉండడంతో రైతులు పశువుల నుంచి అధిక దిగుబడి సాధించేందుకు బీర్‌దాణాను వాడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 4,144 పాడిపశువులను 75 శాతం నుంచి 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేశారు. పశుగ్రాస సాగు కోసం ఈ ఏడాది ఇప్పటి వరకు 140.2 మెట్రిక్ టన్నుల విత్తనాలు సరఫరా చేశారు. సొంతంగా పొలం ఉన్న వారు గడ్డినిసాగు చేసినప్పటికీ.. పొలం లేనివారు పశువులకు ఆహారంగా బీర్‌దాణాను వినియోగిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రభుత్వం సరఫరా చేసిన పశువుల్లో ఇప్పటికే 417 చనిపోవడం గమనార్హం. ఆరోగ్య సమస్యలు వస్తాయి సాధారణంగా మక్క, తవుడు, వేరుశశగ చెక్క, కందిపొట్టుతో తయారు చేసిన దాణాను పశువులకు వాడుతుంటారు. కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఖర్చవుతుంది. బీర్దాణాకు లీటర్‌కు రూ.పదిలోపే దొరుకుతోంది. ఇందులో ఆల్కాహాల్ శాతం ఎక్కువగా ఉండడంతో పశువులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలల్లో ఎసిడిటీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగిన పిల్లలకు జీర్ణకోశ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదముంది. – డాక్టర్ శంకర్,వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, తలకొండపల్లి