గోవుల కళేబరాలపై మట్టి వేస్తున్న దశ్యం
గోవులను వెంటాడుతున్న ‘థ్రిప్స్’
Published Fri, Sep 23 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
– గురువారం కుప్పకూలిన 4 ఆవులు
– శ్రీమఠాన్ని కదిలించిన ‘సాక్షి’ కథనం
– కళేబరాలపై జేసీబీతో మట్టి
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠం గోపురం ఆవులను థ్రిప్స్ (మెదడువాపువ్యాధి) వెంటాడుతూనే ఉంది. గురువారం మరో నాలుగు గోవులు థ్రిప్స్‌తో కుప్పకూలాయి. అందులో రెండు గోవులు మృత్యువాత పడ్డాయి. మరణశయ్యపై గోమాతలు కొట్టుమిట్టాతుండటం స్థానికులను కలచివేస్తోంది. ఇంతగా గోవులు మృతి చెందుతున్నా మఠం మేనేజర్ మాత్రం వాతావరణ మార్పుపై సమస్యను నెట్టేయడం గమనార్హం. గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘మృత్యుఘోష’ కథనంతో సూపర్‌వైజర్ శ్రీనివాసఆచార్ నేతృత్వంలో స్థానిక వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అయితే గోవులను మేపటానికి తరలిస్తుండగా నాలుగు ఉన్నపాటున కుప్పకూలి పడిపోయాయి. మఠం సిబ్బంది ఎంతగా యత్నించినా రెండు గోవులు కూలిన చోటనే ప్రాణాలు వదిలాయి. మెదడువాపు కారణంగా ఆవులు కళ్ల తిరిగి నడవడానికి చేతగాక ఉన్నచోటనే కూలిపోతున్నాయి. కాళ్లలో సత్తువ లేక వ్యాధి విషమించి చనిపోతున్నాయి. అలాగే గోవులను తుంగభద్ర నది ఒడ్డున గోతులో పడేసిన కళేబరాలను జేసీబీతో మట్టివేసి పూడ్చిపెట్టారు. తీరమంతా ఆవుల కళేబరాలతో దుర్వాసన, కలుషితభరితంగా మారింది. స్థానిక వైద్యులతో పరీక్షలు నిర్వహిస్తున్నా వ్యాధి అదుపులోకి రావడం లేదు.
Advertisement