ఇటీవల పశుమాంసం, గోమాంసం గురించిన చర్చ అవధులు దాటి సాగుతోంది. భారతీయ సమాజపు ఏకత్వంలోని భిన్నత్వాన్ని మరచిపోయినందువల్లనే కొన్ని పిదప బుద్ధులు కొందరికి అలవాటయ్యాయి! ఉదాహరణకు, కేరళలో 72 రకాల సమాజాలు (కమ్యూనిటీస్) ఉన్నాయి! వాళ్లంతా ‘‘అంటరానివారు’’ కారు సుమా! ఆ మాటకొస్తే మన రాష్ట్రం సహా అన్ని రాష్ట్రాలలోనూ గొర్రె మాంసం, మేక మాంసం చాలా ఖరీదైనందున, వీరు గొడ్డుమాంసం వినియోగిస్తున్నారు.
మనుషుల మనసులు మార్చగల పరిణామం ఏది? సమాజంలో కొందరు మూర్ఖులుగా మిగిలిపోవడానికి కారణం, భయమా? కొన్ని విశ్వాసాలకు భయమే కారణమైతే, దాన్ని తొలగించుకోవడం ఎలా? కార్యకారణ సంబం ధానికి ప్రకృతే మాతృక. తన ప్రస్తుత పరిస్థితి గురించి వివరించలేని భయ స్తుడొకడు ఆత్మతృప్తి కోసం ఒక టుమ్రీ వదిలాడట, ‘మూడు జన్మల సంగతి చెప్పగలను! పూర్వజన్మలో ఇచ్చి పెట్టుకోలేదు. కనుక ఈ జన్మలో దేవుడు నాకీయలేదు. కాబట్టి ఇకముందు జన్మలో నాకేమీ ఉండదు.’’ దీని బెంగతోనే, విశ్వాసం నుంచి దూరమై భయాన్ని ఆశ్రయించాడట. అందుకే మూడు తరా ల దరిద్రులు కొందరు ముష్టికి బయలుదేరారేగానీ, తమ దారిద్య్రానికీ, ఈ అసమానతలకీ అసలు కారణం దోపిడీ, అసమానతలు, మూఢ నమ్మకా లేనని తెలుసుకోలేకపోయారు.
ఇలాంటి సన్నివేశం ఒకటి మానవ సమాజ పరిణామవాద శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్‌కు ఎదురైంది. ఇందుకు సంబంధించినదే ఒక విశేషం నాలు గైదు రోజుల క్రితం బయటపడింది కూడా. అది కూడా డార్విన్ స్వదస్తూరీతో ఉన్న లేఖ రూపంలో వెలుగుచూసింది. ఫ్రాన్సిస్ మెడెర్మాట్ అనే న్యాయ వాదికి డార్విన్ రాసిన లేఖ అది. బైబిల్ పుట్టుపూర్వోత్తరాలు, జీసస్ క్రీస్తును దేవుని బిడ్డగా భావించుకోవడం గురించిన మీమాంసకు సంబంధించి మెడె ర్మాట్ లేవనెత్తిన సందేహానికి (నవంబర్ 23, 1880) డార్విన్ ఇచ్చిన ప్రత్యు త్తరమది (ది హిందు, 25-9-15). ‘బైబిల్ రచనను దైవ ప్రవచనంగా నమ్మ ను గాక నమ్మను.
జీసస్‌ను దేవపుత్రునిగా భావించడం లేదు’ అని చెప్పారా యన. ఇంతకీ బారిస్టర్ మెడెర్మాట్ ఏమని రాస్తే, డార్విన్ ఇలా స్పందించవ లసివచ్చింది? మెడెర్మాట్ మాటల్లోనే.. ‘‘మీ పుస్తకాలు చదివి నేను ఆనందిం చాలంటే, నా పఠనం తరువాత ముగింపులో బైబిల్ కొత్త నిబంధన లో (న్యూటెస్ట్‌మెంట్) నాకు అంతకుముందే ఏర్పడిన విశ్వాసాన్ని కోల్పోకూ డదు. నేను ఈ ఉత్తరం రాయడంలో ఉద్దేశం- బైబిల్ నూతన నిబంధనలలో మీకు అసలు నమ్మకం ఉందా, లేదా అని తెలుసుకోవడం. అందుకు ‘అవును’ లేదా ‘కాదు’ అన్న సమాధానం కావాలి.’’ దీనికే డార్విన్ ఆ సమాధానం ఇచ్చాడు. కాగా సమాధానాన్ని బయట పెట్టవద్దని మెడెర్మాట్ వేడుకున్నాడు. ఎందుకు ప్రాధేయపడవలసి వచ్చిందంటే, ఆ కాలంలో అవిశ్వాసులను మౌఢ్యం కొద్దీ కొరత వేస్తూ ఉండడం వల్లనే.
హితం పోయింది మతం వచ్చింది
ఈ మధ్య మన దేశంలో ప్రాచీన శాస్త్రవేత్తలు ప్రబోధించిన ధర్మచింతన పోయి, ‘మతం’పేరుతో గతం పాతర తవ్వి, ఆనాటి క్రైస్తవ సమాజంలోనూ, ఇస్లామిక్ సమాజంలోనూ కనిపించిన కొన్ని నమ్మకాలు పరివ్యాప్తం కావ డంతో ధర్మచింతన వెనకడుగు వేసి, సమాజహితం స్థానంలో మతం చోటు చేసుకుంది. మనిషికి మంచిమాటే అలంకారం అన్న సూత్రాన్ని నమ్మిన సుప్ర సిద్ధ జాతీయవాది, షికాగోలో సర్వధర్మ ప్రపంచ సమ్మేళనంలో ప్రసంగించిన దేశభక్త స్వామి వివేకానంద గానీ, ఆయన గురువుగా భావించే దయానంద గానీ మూఢ నమ్మకాలకు సాధ్యమైనంత దూరం జరిగి, భారతీయతను మాత్రమే చాటగలిగారు. వారు ఏనాడూ భిన్న భాషా సంస్కృతుల చింతన లను విమర్శించలేదు. అయితే పలు జీవన విధానాలు సహ జీవనం సాగి స్తున్న భారతీయత మొక్కట్లను చెదరగొట్టడానికి కొన్ని సంస్థలు, నాయక స్థానాలలో ఉన్న కొందరు వ్యక్తులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. దేశంలో వివిధ వర్గాల వారి ఆహార నియమాల మీద, అలవాట్ల మీద విరుచుకుపడు తున్నారు. ఈ ధోరణి భారతీయతకు విరుద్ధం.
అతివేలం, ఉన్మాదం ఎందులో ఉన్నా (క్రైస్తవం, ఇస్లాం, భారతీయత లేదా హైందవం) ఖండనార్హమే. చిత్రమేమిటంటే ధర్మానికి అర్థాలు మారిపో తున్న దశలో ఆదిశంకరుని ప్రవచనాలలో ‘మనది వైదిక ధర్మమేగానీ, హిం దూమతం కాదు. హిందూమతమని పిలిచినవాళ్లు పరదేశీయులని, హిందూ మతం అనరాదనీ ప్రబోధించారు (చూ. ఆదిశంకరుని ప్రవచనాలు: తెలుగు సేత: స్వామి శివశంకరశాస్త్రి). కాగా పర్షియన్లు, ఇతర విదేశీయులు సింధునదీ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ‘సింధు’ పదంలోని ‘స’కారం ఉచ్చరించలేక ‘స’కు బదులు, ‘హ’ కారంతో ‘సింధు’ను ‘హిందు’గా మార్చారనీ రాహుల్ సాంకృత్యాయన్ వెల్లడించారు. అటు ఆదిశంకరాచార్యులు, ఇటు రాహుల్జీ తెలిపిన వివరణను, నిర్వచనాన్నీ కొందరు స్వార్థపరులు తొక్కిపట్టి, ప్రచారం లోకి రానివ్వకపోవడానికి బలమైన స్వార్థప్రయోజనాలే కారణమై ఉండాలి.
ఆహార అలవాట్లపై దాడి తగునా?
మత విశ్వాసాల పేరిట భిన్న ధర్మచింతనలకు చెందిన వారి ఆహార అలవా ట్లపై దాడులు తగదు. ఇటీవల పశుమాంసం, గోమాంసం గురించిన చర్చ అవధులు దాటి సాగుతోంది. భారతీయ సమాజపు ఏకత్వంలోని భిన్నత్వాన్ని మరచిపోయినందువల్లనే కొన్ని పిదప బుద్ధులు కొందరికి అలవాటయ్యాయి! ఉదాహరణకు, కేరళలో 72 రకాల సమాజాలు (కమ్యూనిటీస్) ఉన్నాయి! వాళ్లంతా ‘‘అంటరానివారు’’ కారు సుమా! ఆ మాటకొస్తే మన రాష్ట్రం సహా అన్ని రాష్ట్రాలలోనూ గొర్రె మాంసం, మేక మాంసం చాలా ఖరీదైనందున, వీరు గొడ్డుమాంసం వినియోగిస్తున్నారు.
మన సంకీర్ణ భారతీయ సమాజంలో ఇస్లాం ప్రవేశానికి ముందే పశు మాంస భక్షణ ఒక భాగమని సుప్రసిద్ధ చరిత్రకారుడు, పరిశోధకుడు ప్రొఫె సర్ డి.ఎన్.ఝా (ఢిల్లీ విశ్వవిద్యాలయం) వెల్లడించాడు! దేశంలో వ్యవసా యం వృత్తిగా స్థిరపడే వరకూ అనేక సంచారజాతులు, ఇక్కడ స్థిరపడిన పెక్కు దేశ దిమ్మర జాతులలో పశుబలులు ప్రధానంగా సాగుతూండేవని ప్రాచీన భారతీయ సంహితలు, ముఖ్యంగా వేదాలు నిరూపిస్తున్నాయని పం డిత పరిశోధకులు వెల్లడించారు. ఆ కాలంలో దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పేరుతో పశువుల్ని నైవేద్యంగా చూపించేవారు. ఇంద్రుడికి, అగ్నికి ఎద్దు, ఆవు మాంసం సమర్పించేవారు; మరుత్తులు, అశ్వనీదేవతల పేరిట గోమాంసం నివేదించుకునే వారు; వేదాలలో 250 రకాల పశువులను పేర్కొన్నారనీ, వాటిలో కనీసం 50 రకాల పశువుల్ని బలివ్వడానికి, వాటి మాంసాన్ని ఆహా రంగా స్వీకరించడానికి అనువైన జాతులుగా పేర్కొన్నారని చరిత్రకారుల నిర్ధారణ! మహాభారతంలో రంతిదేవుడనే రాజు ప్రస్తావన ఉంది.
ఆయన, బ్రాహ్మణ వర్గానికి ఆహారధాన్యాలతో పాటు గొడ్డుమాంసం కూడా పంచిపె ట్టాడన్న ఖ్యాతి పొందాడు. ‘తైత్తిరీయ బ్రాహ్మణం’ ‘ఆవు మాంసం ఆహా రం’గా పేర్కొన్నదని, లేత ఆవు మాంసం కావాలని యాజ్ఞవల్క్యుడు పట్టుప ట్టాడనీ పరిశోధకలు ఉదహరించారు! ‘బ్రాహ్మణాలు’ కూడా గొడ్డుమాంసం వాడకానికి సాక్ష్యంగా నిలిచాయని నిపుణులు స్పష్టం చేశారు! ‘మనుస్మృతి’ కూడా గొడ్డు మాంసం వాడకాన్ని నిషేధించలేదు! ప్రాచీన ఆయుర్వేద గ్రం థం ‘చరక సంహిత’ ప్రకారం గోమాంసం అనేక రోగాలకు మందు.
పశు బలులు-పూర్వాపరాలు
ఈ విధంగా వ్యవసాయార్థికవ్యవస్థ క్రమంగా నిలదొక్కుకున్నకొద్దీ, సంఘం లో భారీ ఎత్తున పరివర్తనా దశ ప్రారంభం కావడంతో పశువుల్ని బలిపెట్టే కార్యాచరణలో కూడా మార్పులు అనివార్యం అయ్యాయనీ చరిత్రకారులు పేర్కొన్నారు. సరిగ్గా ఈ దశలోనే బ్రాహ్మణ్యం పాల్గొంటున్న పశుబలులు లాంటి యజ్ఞయాగాదుల నిర్వహణ కూడా కొనసాగిందనీ, అందుకే బుద్ధుడు అహింసను ప్రబోధిస్తూ ఈ కర్మకాండలపైన ధ్వజమెత్తాడని చరిత్రకారులు రాశారు. ఈ పశుబలుల కర్మకాండలో యజ్ఞయాగాదుల్లో 500 ఎడ్లు, 500 కోడెదూడలు, 500 ఆవుదూడలు, 500 గొర్రెలను యజ్ఞవాటికలో స్తంభాలకు కట్టి మరీ వధించేవారనీ ప్రొఫెసర్ రామ్ పునియానీ (బొంబాయి) పేర్కొ న్నారు.
కనుకనే ఆనాటి సమాజంలో గొప్ప హేతువాదిగా, దార్శనికుడిగా, త్యాగిగా చైతన్యశక్తితో ప్రభవిల్లిన బుద్ధుడు - అశ్వమేధ, పురుషమేధ, వాజ పేయ యాగాదుల వల్ల భారతీయ సమాజానికి మంచి ఫలితాలు రాలేదని పేర్కొనవలసి వచ్చింది. బుద్ధుడు ఒకసారి మగధ పర్యటనలో ఉండగా ‘కూటదంతుడు’ అనే ఒక బ్రాహ్మణ వర్గీయుడు 700 ఎద్దులను, 700 గొర్రెల్ని బలివ్వడానికి సిద్ధమవడం చూశాడు. అది గ్రహించిన బుద్ధుడు జోక్యం చేసు కుని ఈ హింసాకాండను అడ్డుకున్నాడు. అప్పటికే నూతన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ రంగంలోకి ప్రవేశించింది.
దానితో పశుసంపద రక్షణ సామాజికుల బాధ్యతగా, ముఖ్యావసరంగా పరిగణనలోకి వచ్చిందని మరువరాదు. అహింస గురించి బుద్ధుడు అంతగా పట్టుబట్టడం అనేది గుడ్డిగా జరగలేదనీ, పశు మాంసాన్ని ఒకసారి బుద్ధుడు కూడా రుచి చూడటమూ చరిత్రకు తెలి సిన ఘట్టమేననీ, ఒక సందర్భంలో పంది మాంసం (పోర్క్) తినడం వల్లనే ఆయన వ్యాధిగ్రస్తుడయ్యాడనీ చరిత్రకారులు తెలిపారు. నిజానికి దేశంలో బౌద్ధధర్మం వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే లేదా బౌద్ధంపైన ఒక వర్గం బ్రాహ్మ ణ్యం దాడులు ప్రారంభమైన తర్వాతనే, బౌద్ధం వల్లనే యజ్ఞయాగాదులకు, వర్ణవ్యవస్థలోని వివక్షా విలువలకూ అడ్డంకులు, సవాళ్లూ ఎదురైనందువల్లనే అన్ని స్థాయిల్లోనూ ప్రతిఘటన పెరిగింది.
ఆ సమయంలోనే యజ్ఞయాగాదు లను నమ్ముకున్న బ్రాహ్మణ్యంలోని ఒక వర్గం బౌద్ధ భిక్షువులపైన, ధర్మప్రచా రకుల మీద పుష్యమిత్ర శుంగ చక్రవర్తి ఆసరాతో ప్రత్యక్షదాడులకు దిగింది. ఇంకొక వైపున గౌతమ బుద్ధుడు జ్ఞానమార్గానికి ఆదరవైన ‘బోధి’ వృక్షా న్ని కాస్తా శశాంక రాజు కూల్చివేశాడనీ మరవరాదు!
అప్పటిదాకా బలిబశువు గానే బతుకు ఈడ్చిన ‘ఆవు’ కాస్తా కొందరికి అకస్మాత్తుగా ‘గోమాత’గా మార డమే ఒక విశేషం! రాచకొండ వివ్వనాథశాస్త్రి మరొకసారి హెచ్చరించినట్టు మళ్లీ ‘గోవులొస్తున్నాయ్, జాగ్రత్త’ సుమా! రాహుల్జీ నిర్ధారించినట్టు మానవ జాతి ప్రగతి పథం వైపు సాగించిన ప్రతి ఒక్క అడుగడుగు రక్తతర్పణంలోనే సాగింది. ఇటీవల గుజరాత్ ‘ప్రగతిపథం’లో కూడా ఆ ‘నర రక్తతర్పణం’ చారికలూ, సారికలూ నమోదైనాయి! ‘గోవులొస్తున్నాయ్, జాగ్రత్త’!
వ్యాసకర్త మొబైల్: 9848318414
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
మళ్లీ గోవులొస్తున్నాయ్ జాగ్రత్త!
Published Wed, Sep 30 2015 8:42 AM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM
Advertisement