ఒక అక్షరం, ఒక ఆలోచన, ఒక పుస్తకం సమాజాన్ని ప్రభావితం చేస్తాయా? ఆలోచనలు అనంతం. అక్షర శక్తి అనల్పం. ఇవి రెండూ ఏకమై పుస్తక రూపం తీసుకుంటే అది చూపే ప్రభావానికి ఎల్లలు ఉండవు. ఛార్లెస్ డార్విన్ 1859 నవంబర్ 24న వెలువరించిన ‘జాతుల పుట్టుక’ (ది ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్) అనే గ్రంథం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. వచ్చిన తొలిరోజే 1,250 కాపీలు అమ్ముడు పోయాయంటే ఆ గ్రంథం సృష్టించిన సంచలనం ఎంతటిదో అర్థం చేసు కోవచ్చు. అంతగా సంచలనాత్మకం కావటానికి అందులో ఉన్నదేమిటి? డార్విన్ ఆ పుస్తకంలో ప్రతిపాదించిన ‘జీవ పరిణామ సిద్ధాంతం’! అది నూతన భావ విస్ఫోటనానికి నాంది పలికింది. నాటి వరకూ సమాజంలో పాతుకుపోయిన సృష్టివాద నమ్మకాలకు భిన్నంగా కొత్త అవగా హనకూ, ఆలోచనలకూ పట్టం కట్టడం. అందుకే పరిణామ సిద్ధాంతాన్ని ఎర్న్‌స్ట్ మయర్ అనే శాస్త్రవేత్త నూతన పథ నిర్దేశినిగా పేర్కొన్నాడు.
ఇంతకూ ఆ సిద్ధాంతం ఏం చెప్పింది? జీవులు... దగ్గర లక్షణాలున్న వాటి పూర్వీకులైన జీవుల నుండి పరిణామం చెందాయని. ఏ జీవీ ఉన్నది ఉన్నట్లుగా సృష్టి కాలేదనీ, ప్రకృతి పరిస్థితుల నెదుర్కొని దీర్ఘకాలంలో నేడు మనం చూస్తున్న జీవులు, జీవ వైవిధ్యం రూపుదిద్దుకున్నాయనీ. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ భూమిపై నివసించే ప్రతి జీవీ ప్రకృతి చెక్కిన శిల్పమే! ఇది ఒక భౌతిక ప్రక్రియ. ఇందులో ఏ అతీత శక్తుల ప్రమేయం లేదని ఆధారాలతో మరీ వివరించాడు డార్విన్. ఇదే సృష్టివాదులకు కంటగింపుగా మారింది. మనిషితో సహా అన్ని రకాల జంతు, వృక్ష జాతులనూ ఇప్పుడు ఉన్నట్లుగానే దేవుడు సృష్టి చేశాడనీ, అవి మార్పు చెందటం కొత్త జాతులు రావటం అనే ప్రసక్తే లేదని దాదాపు అన్ని మతాల నమ్మకం. ఆ నమ్మకానికి చేటు తెస్తుందనుకున్న ఏ సిద్ధాంతాన్నైనా, ఎన్ని నిరూపణలు చూపినా అంగీకరించేందుకు సృష్టివాదులు ససేమిరా ఒప్పుకోరు. అందుకే ఆదిలోనే మతం నుండి వ్యతిరేకతను, దాడిని ఎదుర్కోవలసి వచ్చింది.
అయినా ఈ సిద్ధాంతం 1930 నాటికి శాస్త్ర ప్రపంచ ఆమోదం పొందటం గమనార్హం. డార్విన్ చూపిన నిదర్శనాలు, ఇబ్బడిముబ్బడిగా సేకరించిన నమూనాలు, జీవ పరిణామ సిద్ధాంత ప్రతిపాదకుల్లో ఒకరైన ఆల్‌ఫ్రెడ్ రస్సెల్ వాలస్ మలయా దీవుల్లో కనిపెట్టిన అనేక జంతుజాతుల విశేషాలు సృష్టివాదుల నోరు కట్టేశాయి. డార్విన్ కాలం నాటి కంటే తరువాతి కాలంలోనే పరిణామాన్ని బలపరిచే ఎన్నో రుజువులు బయటపడినాయి. జీవించి ఉన్న జాతులను, గతించిన జాతులతో అనుసంధానించే అనేక మధ్యంతర జీవులు శిలాజాల రూపంలో దొరకటం డార్విన్ సిద్ధాంతాన్ని మరింత బలపరిచాయి.
చదవండి: ఆదివాసులకు చేయూతనిద్దాం!
శిలాజాలే కావు నేటి ఆధునిక పరిశోధనలు, జీనోమ్ సమాచారం సైతం డార్విన్ పరిణామ సిద్ధాంత విశిష్టతను, సత్యాన్ని చాటడం విశేషం. ఇంతటి ప్రభావశీలమైన జీవ పరిణామ సిద్ధాంతాన్ని వెల్లడించిన గ్రంథం వెలువడిన నవంబర్ 24వ తేదీని ‘అంతర్జాతీయ జీవ పరిణామ దినం’గా ప్రపంచం జరుపుకొంటోంది. పరిణామ విశ్వజనీనతనూ, సత్యాన్నీ ప్రజల ముందుంచే పనిని సైన్సు ప్రచార సంస్థలు భుజానికెత్తుకుని పరిణామ దినోత్సవాన్ని జరుపుతున్నాయి.
– ప్రొఫెసర్ కట్టా సత్యప్రసాద్, జన విజ్ఞాన వేదిక ఉమ్మడి రాష్ట్ర పూర్వ అధ్యక్షులు
(నవంబర్ 24న అంతర్జాతీయ జీవ పరిణామ దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment