
తల్లిదండ్రులు ఒక్కోసారి తమ పిల్లలు చదవాలనుకున్న ఉన్నత చదువులను చదివించలేకపోవచ్చు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ స్థాయి చదువులను చదివించలేకపోతుంటారు. కొందరేమో..! మగపిల్లవాడు కదా అని వాడిని మాత్రం అప్పోసొప్పో చేసి మరీ చదివిస్తుంటారు. ఆడపిల్లలని మాత్రం ఏ సర్కారీ బడిలోనో జాయిన్ చేసి.. తూతూ మంత్రంగా చదివిస్తుంటారు. పాపం అలానే ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో తల్లిదండ్రులు చేశారు. అయితే ఆ అమ్మాయి డ్రీమ్‌ని నెరవెర్చేందుకు కేంద్ర విద్యా మంత్రే కదిలొచ్చారు. అదెలా జరిగిందంటే..
బీహార్‌లోని దానాపూర్‌కు చెందిన విద్యార్థిని ఖుష్బు కుమారి తాను సైన్సు కోర్సులో జాయిన్ అయ్యి డాక్టర్ అవ్వాలనుకుంది. అయితే ఇంట్లో పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో తల్లిదండ్రులు ఆ అమ్మాయిని బలవంతంగా ఆర్ట్స్ కోర్సులో జాయిన్ చేశారు. దీంతో ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల కారణంగా తన డ్రీమ్‌ని ఎలా కోల్పోయిందో ఓ వీడియోలో వివరించింది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరింది.
ఆ బాలిక వీడియోలో తన తల్లిదండ్రులు చూపిస్తున్న లింగ వివక్షపై విరుచుకుపడుతూ.. తన గోడుని వెళ్లబోసుకుంది. తాను ఇంటర్‌లో సైన్స్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా..కానీ నా తల్లిదండ్రులు పదిలో 400 మార్కులకు తెచ్చుకుంటే నీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వచ్చని అన్నారు. అయితే తాను 399 మార్కులే స్కోర్ చేయడంతో తన కల కలగానే మారిపోయిందని కన్నీళ్లుపెట్టుకుంది.
అబ్బాయిలకు మాత్రమే నచ్చిన చదువు చదువుకునే స్వేచ్ఛ ఉంది. ఆడపిల్లలకు ఉండదు. కనీసం తమకు ఫోన్ కూడా ఇవ్వరు పేరెంట్స్ అంటూ భోరుమంది వీడియోలో. అంతే ఆ వీడియోపై కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే స్పందించి.. ఆమెకు చదవు విషయంలో పూర్తి మద్దతిస్తానని హామీ ఇచ్చారు.
పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ ఏర్పాటు చేసిన వీడియో కాల్‌లో మంత్రి ప్రధాన్ ఆ బాలికతో నేరుగా మాట్లాడారు. తల్లిదండ్రులపై ఎలాంటి ద్వేషం పెట్టుకోవద్దని చెప్పడమే గాక బాగా చదువుకోవాలని సూచించారు. అలాగే ఆమె చదువాలనుకున్న చదువుకి కావాల్సిన ఏర్పాట్లను బిహార్ సీఎం నితీష్ కుమార్ చూసుకుంటారని చెప్పారు మంత్రి ప్రధాన్.
ఆ బాలిక ప్రతిస్పందనగా.. మంచి కళాశాలో సైన్సు కోర్సులో చేరాలన్న తన కోరికను కేంద్రమంత్రికి విన్నవించింది. ఆయన అందుకు తగిన ఏర్పాటు చేసేలా పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్‌కి ఆదేశాలు జారీ చేశారు. 2025-27 విద్యా సంవత్సరానికే ఆమెకు నచ్చిన కోర్సులో జాయిన్ అయ్యేలా వెసులబాటు కల్పించనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. కాగా, ఆ అమ్మాయి తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా తమ కూతురిని ఇలా బలవంతంగా ఆర్ట్స్ కోర్సులో జాయిన్ చేశామని చెప్పారు. ఏదీఏమైతేనేం తన కోరిక నెరవేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చేలా చేసింది.
(చదవండి: ఎవరీ తారా ప్రసాద్..? ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..)
Comments
Please login to add a commentAdd a comment