central education department minister
-
సైన్స్ కోర్సు చదవలేకపోయానంటూ.. కన్నీళ్లు పెట్టుకుంది! కట్‌చేస్తే..
తల్లిదండ్రులు ఒక్కోసారి తమ పిల్లలు చదవాలనుకున్న ఉన్నత చదువులను చదివించలేకపోవచ్చు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ స్థాయి చదువులను చదివించలేకపోతుంటారు. కొందరేమో..! మగపిల్లవాడు కదా అని వాడిని మాత్రం అప్పోసొప్పో చేసి మరీ చదివిస్తుంటారు. ఆడపిల్లలని మాత్రం ఏ సర్కారీ బడిలోనో జాయిన్ చేసి.. తూతూ మంత్రంగా చదివిస్తుంటారు. పాపం అలానే ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో తల్లిదండ్రులు చేశారు. అయితే ఆ అమ్మాయి డ్రీమ్‌ని నెరవెర్చేందుకు కేంద్ర విద్యా మంత్రే కదిలొచ్చారు. అదెలా జరిగిందంటే..బీహార్‌లోని దానాపూర్‌కు చెందిన విద్యార్థిని ఖుష్బు కుమారి తాను సైన్సు కోర్సులో జాయిన్ అయ్యి డాక్టర్ అవ్వాలనుకుంది. అయితే ఇంట్లో పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో తల్లిదండ్రులు ఆ అమ్మాయిని బలవంతంగా ఆర్ట్స్ కోర్సులో జాయిన్ చేశారు. దీంతో ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల కారణంగా తన డ్రీమ్‌ని ఎలా కోల్పోయిందో ఓ వీడియోలో వివరించింది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరింది. ఆ బాలిక వీడియోలో తన తల్లిదండ్రులు చూపిస్తున్న లింగ వివక్షపై విరుచుకుపడుతూ.. తన గోడుని వెళ్లబోసుకుంది. తాను ఇంటర్లో సైన్స్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా..కానీ నా తల్లిదండ్రులు పదిలో 400 మార్కులకు తెచ్చుకుంటే నీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వచ్చని అన్నారు. అయితే తాను 399 మార్కులే స్కోర్ చేయడంతో తన కల కలగానే మారిపోయిందని కన్నీళ్లుపెట్టుకుంది. అబ్బాయిలకు మాత్రమే నచ్చిన చదువు చదువుకునే స్వేచ్ఛ ఉంది. ఆడపిల్లలకు ఉండదు. కనీసం తమకు ఫోన్ కూడా ఇవ్వరు పేరెంట్స్ అంటూ భోరుమంది వీడియోలో. అంతే ఆ వీడియోపై కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే స్పందించి.. ఆమెకు చదవు విషయంలో పూర్తి మద్దతిస్తానని హామీ ఇచ్చారు. పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ ఏర్పాటు చేసిన వీడియో కాల్లో మంత్రి ప్రధాన్ ఆ బాలికతో నేరుగా మాట్లాడారు. తల్లిదండ్రులపై ఎలాంటి ద్వేషం పెట్టుకోవద్దని చెప్పడమే గాక బాగా చదువుకోవాలని సూచించారు. అలాగే ఆమె చదువాలనుకున్న చదువుకి కావాల్సిన ఏర్పాట్లను బిహార్ సీఎం నితీష్ కుమార్ చూసుకుంటారని చెప్పారు మంత్రి ప్రధాన్. ఆ బాలిక ప్రతిస్పందనగా.. మంచి కళాశాలో సైన్సు కోర్సులో చేరాలన్న తన కోరికను కేంద్రమంత్రికి విన్నవించింది. ఆయన అందుకు తగిన ఏర్పాటు చేసేలా పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్‌కి ఆదేశాలు జారీ చేశారు. 2025-27 విద్యా సంవత్సరానికే ఆమెకు నచ్చిన కోర్సులో జాయిన్ అయ్యేలా వెసులబాటు కల్పించనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. కాగా, ఆ అమ్మాయి తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా తమ కూతురిని ఇలా బలవంతంగా ఆర్ట్స్ కోర్సులో జాయిన్ చేశామని చెప్పారు. ఏదీఏమైతేనేం తన కోరిక నెరవేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చేలా చేసింది. (చదవండి: ఎవరీ తారా ప్రసాద్..? ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..) -
CBSE 12th board Exams 2021: జూన్ 1లోగా నిర్ణయం
న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో.. సీబీఎస్ఈ క్లాస్ 12 పరీక్షల నిర్వహణపై జూన్ 1వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. పరీక్షల నిర్వహణపై రాష్ట్రాల్లో కొంతవరకు ఏకాభిప్రాయం వ్యక్తమైందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ తెలిపారు. రాష్ట్రాలు తమ అభిప్రాయాలు, సూచనలను సమగ్రంగా మే 25 లోగా తమకు పంపించాలని కోరారు. క్లాస్ 12 పరీక్షల నిర్వహణపై ఆదివారం కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రాలు తమ అభిప్రాయాలను ఈ సమావేశంలో వ్యక్తం చేశాయి. పరీక్షలు నిర్వహించకూడదనే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని మహారాష్ట్ర, పరీక్షలకు ముందే విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేయాలని ఢిల్లీ, కేరళ సూచించాయి. మరోవైపు, జూలై 15 నుంచి ఆగస్ట్ 26 మధ్య పరీక్షలు నిర్వహించి, సెప్టెంబర్‌లో ఫలితాలను విడుదల చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సూచించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి సీబీఎఎస్‌ఈ రెండు ప్రతిపాదనలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అవి 1) కొన్ని ఎంపిక చేసిన కేంద్రాల్లో మొత్తం 19 మేజర్ సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించాలి. మైనర్ సబ్జెక్టుల ఫలితాలను మేజర్ సబ్జెక్టుల్లో ఫలితాల ఆధారంగా నిర్ణయించాలి. మూడునెలల్లో మొత్తం ప్రక్రియను ముగించాలి. తొలినెలలో ప్రీ ఎగ్జామ్ యాక్టివిటీ, రెండోనెలలో పరీక్షలు, మూడోనెలలో ఫలితాలు వెల్లడించాలి. 2) మూడు గంటలు కాకుండా, గంటన్నర పాటే, వారి పాఠశాలలోనే పరీక్షలు జరపాలి. పరిస్థితిని బట్టి రెండుసార్లు పరీక్షలను నిర్వహించవచ్చు. జూలై 15 నుంచి ఆగస్ట్ 1 మధ్య ఫస్ట్ ఫేజ్, ఆగస్ట్ 8–26 మధ్య సెకండ్ ఫేజ్ పరీక్షలను నిర్వహించవచ్చు. కరోనా కారణంగా ఏ విద్యార్థి అయినా పరీక్ష రాయలేనట్లయితే.. ఆ విద్యార్థికి మరో అవకాశం ఇవ్వాలి. ఆబ్జెక్టివ్, షార్ట్ ఆన్సర్ తరహాలో ప్రశ్నపత్రం ఉండాలి. ఒక లాంగ్వేజ్, మూడు ఎలెక్టివ్ సబ్జెక్టుల్లో విద్యార్థి పరీక్ష రాయాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయం సీబీఎస్ఈ మొదటి ప్రతిపాదనను కొన్ని రాష్ట్రాలు, రెండో ప్రతిపాదనను మెజారిటీ రాష్ట్రాలు సమర్ధించినట్లు సమాచారం. 10వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ ఇప్పటికే రద్దు చేసింది. ఏప్రిల్–మేలో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. సమావేశం ఫలవంతంగా జరిగిందని, రాష్ట్రాల నుంచి విలువైన సూచనలు అందాయని రమేశ్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. ‘సలహాలు, సూచనలతో సమగ్ర నివేదికను మే 25లోపు పంపించాలని రాష్ట్రాలను కోరాం. ఆ తరువాత సాధ్యమైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకుని, అనిశ్చితికి తెరవేస్తాం’ అని వెల్లడించారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్, సంజయ్ ధాత్రే, పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులు ఈ వర్చువల్ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ కూడా గట్టిగా వినిపిస్తోంది. ‘క్యాన్సిల్‌బోర్డ్‌ఎగ్జామ్స్’ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంది. పరీక్షల నిర్వహణకు తాము వ్యతిరేకమని, టీకాలు వేయకుండా విద్యార్థులను పరీక్షలు రాయమనడం పెద్ద పొరపాటవుతుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 1.5 కోట్ల మంది క్లాస్ 12 విద్యార్థులున్నారని, వారిలో 90% 17 ఏళ్లు పైబడినవారేనని ఆయన వివరించారు. వారికి కోవిడ్ టీకా ఇవ్వడానికి వీలవుతుందేమో నిపుణులతో చర్చించాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు సుముఖమే కానీ, కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తరువాత పరీక్షలు జరిపితే మంచిదని భావిస్తున్నట్లు తమిళనాడు పేర్కొంది. ఈ పరీక్షలు విద్యార్థుల కెరీర్‌కు ఎంతో ముఖ్యమంది. -
ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ మెయిన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీ వంటి ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) రాసే అభ్యర్థులకు శుభవార్త. ఈ పరీక్షను ఇకపై మాతృభాషలోనే రాయొచ్చు. కంప్యూటర్ ఆధారిత జేఈఈ (మెయిన్)ను వచ్చే ఏడాది నుంచి పలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగంగా మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎన్ఈపీ విజన్‌ను దృష్టిలో పెట్టుకొని జేఈఈ(మెయిన్) టెస్టును పలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు ఎక్కువ స్కోర్ సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు రమేశ్ పోఖ్రియాల్ గురువారం ట్వీట్ చేశారు. జేఈఈ(మెయిన్) ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష పెట్టాలని పలు రాష్ట్రాల నుంచి చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. గుజరాతీ భాషలో జేఈఈ(మెయిన్) నిర్వహిస్తూ ఇతర భాషలను విస్మరించడం పట్ల గత ఏడాది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విద్యా శాఖ వివరణ ఇచ్చింది. గుజరాత్ ప్రభుత్వం కోరడం వల్లే గుజరాతీ భాషలో పరీక్ష నిర్వహిస్తున్నామని, 2021 నుంచి 11 ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ(మెయిన్) ఉంటుందని వెల్లడించింది. జేఈఈ(మెయిన్) ఫలితాల ఆధారంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పించే రాష్ట్రాల భాషను ఇందులో చేర్చనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మాతృభాషలో ఇంజనీరింగ్ అడ్మిషన్ టెస్టు నిర్వహిస్తున్నారు. అలాంటి భాషల్లో మెయిన్ ఉంటుందని సమాచారం. -
స్వాతంత్య్రోద్యమంలో మమేకం
తొలి ఎంపీగా రహంతుల్లా గుర్తింపు అనంతపురం టౌన్ న్యూస్‌లైన్, స్వాతంత్రోద్యమంలో భాగస్వాములైన ముస్లిం నేతలలో అనంతపురానికి చెందిన కెఎం రహంతుల్లా ఒకరు. 1940లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో విజయవాడ నుంచి బరిలోకి దిగి అప్పటికే పేరు ప్రఖ్యాతలు గడించిన ఖుద్దూస్‌ను ఓడించి అనంత కీర్తిని చాటారు. స్వాతంత్య్రానంతరం తొలి పార్లమెంటుకు కూడా ఎన్నిక కావడం విశేషం. మహాత్మాగాంధీ జిల్లాకు వచ్చినపుడు తాడిపత్రిలో ఆయన వెంట నడిచారు. తొలి కేంద్ర విద్యాశాఖామంత్రి అబ్ధుల్ కలామ్ ఆజాద్, తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలుండేవి. అనంతపురం నగరంలో టవర్‌క్లాక్‌ను ప్రారంభించడానికి అనంతకు వచ్చిన జవహర్లాల్ నెహ్రూ రహంతుల్లాతోనే ఉన్నారు. ఆయన కుమారుడు సైఫుల్లా మాజీ రాజ్యసభ సభ్యుడు. మరో కుమారుడు షఫీవుల్లా ప్రస్తుతం ముతవల్లీగా ఉన్నారు. స్వాతంత్య్ర కాలం నాటి అపురూపమైన వస్తువులు, లేఖనాలు ఇప్పటికీ షఫీవుల్లా వద్ద భధ్రంగా ఉన్నాయి. తొలి ఎంపీ జ్ఞాపకాలను మ్యూజియంలో భద్రపరచనున్నట్లు ఆయన తెలిపారు.