అనాథ జీవాలకు అమ్మా.. నాన్న | Couple feeding stray animals | Sakshi
Sakshi News home page

అనాథ జీవాలకు అమ్మా.. నాన్న

Published Tue, Jul 2 2024 8:03 AM | Last Updated on Tue, Jul 2 2024 8:03 AM

Couple feeding stray animals

సాటి మనిషికి సాయం చేయలేని మనుషులున్న నేటి రోజుల్లో మూగజీవాలను కూడా ప్రేమతో...అక్కున చేర్చుకుంటున్నారు.. ఆకలితో ఉన్న జీవాలకు ఆపన్నహస్తంగా ఆహారం పంపిణీ చేస్తున్నారు.. వారి ఇంటి దరిదాపుల్లో వివిధ జాతుల ఆవులు, దూడలు, కుక్కలు, పిల్లులు, కోతులు, కాకులు.. ఇలా ఒక్కటేమిటి..ఎన్నో మూగ జీవాలు చూపరులను అబ్బురపరుస్తాయి. అటుగా వెళ్లేవారికి ఆ మూగజీవాలు తారసపడుతుంటాయి. వీటిని అక్కున చేర్చుకున్న వారే కూకట్‌పల్లికి చెందిన మణికొండ దేవేందర్‌రావు, రమాదేవి దంపతులు. ఇదంతా వీరు గుర్తింపు కోసమో.. లేక వ్యాపారం కోసమో అనుకుంటే పొరపాటే.. వారికి తెలిసిందల్లా ఒక్కటే.. వాటికి నిస్వార్థంగా సేవ చేయడమే..  
– తొట్ల పరమేష్‌

ఆపదలోని మూగ ప్రాణులకు ఆపన్నహస్తం
అక్కున చేర్చుకుని ఆహారం పంపిణీ 
వందల సంఖ్యలో జీవాలకు సేవ 

నవ సేవే.. మాధవ సేవ.. ఇది అందరికీ తెలిసిన నానుడి. కానీ సర్వ ప్రాణి సేవయే మాధవ సేవ అన్నది వారి పంథా. ఔను..భువిపై తనకు మాత్రమే హక్కు అన్నట్లు జీవుడు విర్రవీగుతుంటాడు. కానీ ఇలపై మనిషి ఎలాగో అన్ని ప్రాణులకూ జీవించే హక్కు ఉందంటూ వారు నినదిస్తున్నారు. ఆపై సేవకు అంకితమయ్యారు. ఒకటి కాదు..రెండు కాదు..వందల సంఖ్యలో మూగ జీవాలను అక్కున చేర్చుకుని కన్న బిడ్డల మాదిరిగా సాకుతున్నారు. మనిషికి మనిషే బరువైన ప్రస్తుత సమాజంలో ప్రతి ప్రాణినీ తన బిడ్డగా భావిస్తూ నిస్వార్థ సేవకు నిర్వచనం.. కూకట్‌పల్లికి చెందిన మణికొండ దేవేందర్‌రావు, రమాదేవి దంపతులు. వీరితోపాటు వీరి ఇద్దరి బిడ్డలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైనా కూడా మూగ జీవాల సేవలో తరిస్తున్నారు. 

 జీవాలకూ సొంత పేర్లు...
వీరి ఇంటి దరిదాపుల్లో వెళ్లిన వారికి కొన్ని పేర్ల పిలుపులు వినిపిస్తుంటాయి.. కొత్తగా వినేవారికి ఎవరి కోసమో వెతుకుతున్నారని పొరపడతారు.. కానీ, వారు పిలిచేది మూగజీవాలని తెలిశాక ఆశ్చర్యపోక మానరు... ‘ఏయ్‌ లక్ష్మీ ఇటు రావే..ఓయ్‌ శివా అటు వెళ్లరా..!’ ఎలాగైతే మనం సాటి మనుషులతో మాట్లాడతామో! అలాగే వారు మూగ జీవాలతో మాట్లాడుతుంటారు. వాటికి పేర్లు పెట్టడమే కాదు..ఆ పేరుతో పిలిస్తే అవి కూడా ఠక్కున అలెర్ట్‌ అయ్యి వారు చెప్పింది చేసేస్తాయి.  మమకారం చూపించాలే గానీ మూగ జీవాలు అంతకంటే ఎక్కువ వాత్సల్యాన్ని చూపిస్తాయని ఆ దంపతులు నిరూపిస్తున్నారు. పేరు పెట్టి వారు రమ్మంటే వచ్చేస్తాయి.. వెళ్లు 
అంటే వెళ్లిపోతాయి..తిను అంటే తినేస్తాయి..ఇక చాలు అంటే ఆపేస్తాయ్‌..అంతగా మూగ జీవాలతో వారికి బాండింగ్‌ ఏర్పడింది.

పక్కాగా టైం పాటిస్తూ.. 
మూగ జీవాలకు ఆహారంతో పాటు ప్రేమాప్యాయతలు కలగలిపి వడ్డిస్తారో ఏమో గానీ ఎక్కడున్నా సరే..రోజూ పక్కాగా టైం ప్రకారం వీరి వద్దకు వచ్చేస్తాయి. ఒక్క కాకులు, పావురాలే కాదు ఆవులు, కుక్కలు, పిల్లులు, కోతులు వాటికి నిర్దేశించిన సమయాల్లో వచ్చి వీరి రోజువారీ ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్తుంటాయి. ఇలా ఉదయం 6–7 గంటలకు ప్రారంభమయ్యే మూగ జీవాల రాక సాయంత్రం 7 గంటల వరకూ కొనసాగుతుంటుంది. ఉదయం6–7 గంటల మధ్య కాకులు, 9 గంటలకు పావురాలు, 10 గంటలకు ఆవులు, మధ్యాహ్నం 3 గంటలకు కుక్కలు, సాయంత్రం పిల్లులు..ఇలా ఒక్కో సమయంలో ఒక్కో మూగ జీవాలు ఇక్కడకు వచి్చపోతుండడం గమనార్హం.

ఆవుల గైనిక్‌..రమాదేవి
ఆవుల ప్రసవానికి వచ్చాయంటే జీహెచ్‌ఎంసీలో గుర్తుకొచ్చే వైద్యురాలు రమాదేవి. తమ వద్దకు వచ్చే ఆవులతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని గోశాలల్లో ఎక్కడైనా సరే ఆవులు ఈతకు వచ్చాయంటే ఆమెనే దగ్గరుండి ప్రసవం చేస్తారు. భుమి మీదకు వచ్చే ఆవు దూడపై మొదట తన చేతులు పడాల్సిందే.. ఒకరకంగా ఆమె ఆవులకు గైనిక్‌గా మారిపోయారు.

లేగ దూడలకు ప్రత్యేక బెడ్‌
మూగ జీవాల ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ వాటికి సపర్యలు చేస్తుంటారు. వాటిని తనకుటుంబ సభ్యులు, పిల్లల మాదిరిగానే బెడ్‌ మీద పడుకోబెట్టి సేవలందిస్తారు. ఓసారి 20 రోజుల లేగదూడకు యాక్సిడెంట్‌ అయ్యి కాలు విరగటంతో విషయం తెలుసుకున్న రమాదేవి  రహదారి వద్దకు వెళ్లి  దానిని ఆటోలో తీసుకొచ్చి అక్కడ నుంచి పశువుల ఆస్పత్రికి తరలించారు. అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో మూడు గంటల పాటు వేచి ఉండి డాక్టర్‌ను పిలిపించి చికిత్స చేయించిన అనంతరం రమాదేవి భర్త దేవేందర్‌రావు ఆ లేగ దూడను తన బెడ్‌పై పడుకోబెట్టి ఆహారంలో మాత్రలు, ఇంజక్షన్‌లు ఇచ్చి రెండు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నారు.  

మరణించిన వాటికి అంత్యక్రియలు
దెబ్బతగిలిన లేగదూడ కొద్ది రోజుల తరువాత మూర్చ వ్యాధితో చనిపోయింది. దాంతో మనస్తాపానికి గురైన వారు లేగదూడను బహిర్భూమిలో వదిలివేయకుండా మనుషులకు చేసిన విధంగానే లేగ దూడకు అంత్యక్రియలు నిర్వహించి కొద్ది రోజుల పాటు ఆ దంపతులు దిగులుతో రెండు మూడు రోజులు ఆహార పానీయాలు కూడా ముట్టలేదు. ఈ విధంగా మూగ జీవాలతో వారి అనుబంధం కొనసాగింది. కుక్కలకు కూడా ఏ చిన్న దెబ్బ తాకినా వాటికి చికిత్స చేయించి మందులు ఇవ్వటం వారికి అలవాటుగా మారింది.  

కాంక్రీట్‌ జంగిల్లోనూ కావ్‌..కావ్‌..జాడ 
పితృ దేవతలకు ప్రతీకగా కాకులను విశ్వసిస్తారు. అలాంటి కాకులను కాంక్రీట్‌ జంగిల్‌లో భూతద్దం పెట్టి మరీ వెతికినా కనిపిస్తాయో 
లేదో తెలియదు. కనుమరుగు అయిపోతున్నాయి అనుకుంటున్న కాకులు సైతం రోజూ ఠంచనుగా ఒకే సమయంలో వీరి ముంగిట వాలిపోతుంటాయి. వారు అందించే ఆహారాన్ని ఆరగించి వెళ్లిపోతుండడం ఇక్కడ నిత్యకృత్యమే.

ఐదేళ్ల క్రితం ప్రారంభమై... 
ఐదేళ్ల క్రితం మాట.. రెండు మూడు ఆవులతో ప్రారంభమై రోజులు గడిచే కొద్దీ ఆవుల సంఖ్య పెరిగింది. వీటికి తోడుగా కుక్కలు, పిల్లలు, కోతులు, కాకులు, పావురాలు.. ఇలా 70 వరకూ ఆవులు, 40 వరకు కుక్కలు, 15 వరకు పిల్లులు, 15 వరకు కాకులు, మరెన్నో పావురాలు వచ్చిపోతున్నాయి. అయితే ఇటీవల కోతులు కూడా వచ్చేవి. కానీ కుక్కల భయంతో అవి రావడం మానేశాయి.

నెలకు లక్షన్నర ఖర్చు..
మూగ జీవాలకు ఆహారం కోసం నెలకు లక్షన్నర వరకూ ఖర్చు చేస్తున్నారు. ఆవుల కోసం ప్రతిరోజూ రకరకాల కూరగాయలు, ఫలాలు, కుక్కల కోసం ఇంట్లో నాన్‌వెజ్‌ తినకపోయినప్పటికీ ప్రత్యేకంగా నాన్‌వెజ్‌ తెప్పించి పెడతారు. నెలకు నాలుగు    క్వింటాళ్ల రైస్‌ మూగ జీవాల కోసం కొనుగోలు చేస్తుంటారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement