సీఎం చంద్రబాబు ఒప్పుకోలు
సాక్షి, అమరావతి : వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరికీ ఆహారం అందించలేకపోయామని సీఎం చంద్రబాబు చెప్పారు. సోమవారం రాత్రి 11.30గంటలకు విజయవాడలోని ఎన్డీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ముందు వచ్చిన వాళ్లు ఎక్కువ ఫుడ్ ప్యాకెట్లు తీసుకోవడం వల్ల తర్వాత వారికి ఇవ్వలేకపోయామన్నారు. సింగ్‌నగర్ ప్రాంతంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు కనీసం నీళ్లు లేక అలమటించిపోతున్నారన్నారు.
బుడమేరుకు గండ్లు పడిన విషయాన్ని తమ ప్రభుత్వం గుర్తించలేకపోయిందని, అందుకే సింగ్‌నగర్ ప్రాంతం మునిగిందన్నారు. తన ఇంట్లోకి నీళ్లు రావడాన్ని రాజకీయం చేస్తున్నారని, నీళ్లు వస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన ఇల్లు మునగకుండా ఉండేందుకు విజయవాడను ముంచానడం ఏమిటని నిలదీశారు. సహాయక చర్యలు విఫలమవడానికి కొందరు అధికారులే కారణమన్నారు.
డ్రోన్ డ్రామా..! సర్వే డ్రోన్లతో ఆహార పంపిణీ అంటూ హడావుడి
మధ్యాహ్నం 12.30 గంటలు.. విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణం.. ఓ వ్యక్తి హడావుడిగా డ్రోన్‌తో కలెక్టర్ కార్యాలయంలోకి ప్రవేశించాడు. ఖాళీ ప్రాంగణంలో డ్రోన్‌ను కిందకు దింపి ఓ అధికారిని పరిచయం చేసుకున్నాడు. డ్రోన్ కంపెనీ యజమానితో ఫోన్ ద్వారా మాట్లాడించాడు. తమ డ్రోన్లను సర్వే కోసం వినియోగిస్తామని, వరద ప్రాంతాల్లో ఫొటోలు తీసేందుకు చక్కగా పనికొస్తాయని, రెండు కిలోల వరకు మాత్రమే బరువు మోస్తాయని యజమాని పేర్కొనడంతో వరద ప్రాంతాలకు ఆహారం, మంచినీళ్లు, మందులు సరఫరా చేసేందుకు డ్రోన్లు కావాలని ఆ అధికారి కోరారు. అనంతరం ఓ ప్లాస్టిక్ బక్కెట్‌లో దాదాపు కిలో పురికొసలు వేసి తాడు ద్వారా డ్రోన్‌కు కట్టి ఎగురవేశారు.
కాసేపటికి పెట్టుబడులు, మౌలిక వసతుల కార్యదర్శి రంగ ప్రవేశం చేశారు. వాటి పనితీరును గమనించిన ఆయన చిన్న బరువుకే ప్లాస్టిక్ బక్కెట్ ఊగిపోతోందని, వరద ప్రాంతాల్లో బలమైన గాలులను తట్టుకుంటుందా? అని సందేహం వ్యక్తం చేశారు. ఇంతలో సీఎం చంద్రబాబు అరగంట తర్వాత వచ్చి డ్రోన్ ప్రయోగాన్ని వీక్షించారు. అంతే.. డ్రోన్‌లు ఎనిమిది నుంచి పది కేజీలు బరువు మోసుకెళ్తాయని, వాటి ద్వారా మందులు, మంచినీళ్లు, ఆహారం సరఫరా చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన డ్రోన్ల డ్రామా ఇదీ!!
Comments
Please login to add a commentAdd a comment