
సాక్షి, సిటీబ్యూరో: దయాగుణంతో వీధికుక్కలకు ఆహారం పెట్టేవారు తమ పేర్లను జీహెచ్‌ఎంసీ వద్ద నమోదు చేసుకోవాల్సిందిగా జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అందుకుగాను bit.ly/GHMCdogfreederform లింక్ ద్వారా లేదా సంబంధిత క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపింది. తద్వారా జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో వీధి కుక్కలకు ఆహారం ఉంచేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీతో కలిసి పనిచేయవచ్చని పేర్కొంది.
దాంతో ప్రజలు కుక్కల బారిన పడే ప్రమాదాలు తగ్గుతాయని అభిప్రాయపడింది. పేర్లు నమోదు చేసుకున్న వారికి కుక్కలకు ఆహారం వేసే విధానం, జంతు సంరక్షణ మార్గదర్శకాలు తదితర అంశాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని తెలిపింది. స్టెరిలైజేషన్, వాక్సినేషన్ జరగని కుక్కల గురించి సమాచారమిచ్చి ఆ కార్యక్రమాల డ్రైవ్స్‌లో భాగస్వాములు కావొచ్చని పేర్కొంది. కార్యక్రమాలకు జంతు సంక్షేమ సంఘాలు కూడా సహకరించాలని కోరింది. తద్వారా నగరాన్ని సురక్షిత, ఆరోగ్యకర నగరంగా మార్చవచ్చని పేర్కొంది. వివరాలకు జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయాల్లో వెటర్నరీ అధికారులను సంప్రదించాల్సిందిగా సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment