అగ్రి బిజినెస్, నూతన వ్యవసాయ సాంకేతిక ఉత్పత్తులపై 300కు పైగా స్టాల్స్
500 రకాల అరుదైన దేశవాళీ విత్తనాల ప్రదర్శన, విక్రయాలు..
ప్రధాన ఆకర్షణగా ఖిలార్, పుంగనూరు ఆవుల ప్రదర్శన
ఓం మైదానంలో డిసెంబర్ 21 -25 వరకూ
డిసెంబర్ 22న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యాట్, డాగ్ షో పోటీలు,
సోలాపూర్: పట్టణంలోని ఓం మైదానంలో డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 25 వరకూ వ్యవసాయ ప్రదర్శన నిర్వహించనున్నట్లు శ్రీ సిద్దేశ్వర దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ ధర్మరాజు కాడాది తెలిపారు. స్మార్ట్ ఎక్స్ పో గ్రూప్ నేతృత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఆత్మా, జిల్లా పరిషత్ విభాగం సహకారంతో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వ్యవసాయ ప్రదర్శనలో భాగంగా 300 స్టాల్స్‌ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ ప్రదర్శనకు సంబంధించిన విశేషాలను గురించి వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ పరిశోధన కేంద్రం, సోలాపూర్ దానిమ్మ పరిశోధన కేంద్రం, జొన్న పరిశోధన కేంద్రం, వ్యవసాయ విజ్ఞాన కేంద్రం సోలాపూర్ , మోహల్ డివిజన్, సిల్క్ ఖాదీ గ్రామద్యోగ్ పరిశ్రమలు, పశుసంవర్ధక, సామాజిక అటవీ, జాతీయ బ్యాంకులు, నాబార్డ్, చక్కెర కర్మాగారాల సహకారంతో ఈ ప్రదర్శనను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ సాంకేతిక ఉత్పత్తులు, వ్యవసాయ యాంత్రికీకరణ, పాల ఉత్పత్తి, సెరికల్చర్, తేనెటీగల పెంపకం, అగ్రి బిజినెస్,వర్టికల్ ఫారి్మంగ్, ఆధునిక వ్యవసాయ పనిముట్లకు సంబంధించి వివరణాత్మక సమాచారాన్ని రైతులు సులభంగా పొందగలుగుతారని చెప్పారు. ఈ వ్యవసాయ ప్రదర్శనలో సోలాపూర్‌కు గర్వకారణమైన ఖిలార్ ఎద్దులు, ఆవులతోపాటు ప్రపంచంలోనే అరుదైన, అత్యంత పొట్టి రకమైన పుంగనూరు దేశీయ ఆవులను కూడా ప్రదర్శించనున్నట్లు ధర్మరాజు కాడాది పేర్కొన్నారు. సోలాపూర్, నాసిక్, పుణే రైతులు ఉత్పత్తి చేసిన దాదాపు 500 రకాల అరుదైన దేశవాళీ విత్తనాల ప్రదర్శన, విక్రయాలను చేపట్టనున్నట్లు తెలిపారు.
క్యాట్, డాగ్ షో
అలాగే డిసెంబర్ 22న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యాట్, డాగ్ షో పోటీలు సాయంత్రం విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందని, డిసెంబర్ 23న రాష్ట్రస్థాయి దేశవాళీ ఆవులు, ఎద్దుల ప్రదర్శన, పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని వివరించారు. అదేరోజున పుష్ప ప్రదర్శన కూడా జరుగుతుందని ధర్మరాజు కాడాది వివరించారు
ప్రదర్శనకు సంబంధించిన ఇతర విశేషాలు..
300 కు పైగా కంపెనీల హాజరు
ప్రముఖ కంపెనీల ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వాహనాల ప్రదర్శన.
భయనా నుంచి ప్రత్యేకంగా తీసుకువస్తున్న ఆరు కిలోల కోడి
ప్రపంచంలోనే అతి పొడవైన దేశీయ మిరపకాయల ప్రదర్శన
ప్రత్యేక హాలులో ఆర్గానిక్ ఫార్మింగ్, యానిమల్, బర్డ్, ఫ్లవర్ ఎగ్జిబిషన్
రైస్ ఫెస్టివల్, వ్యవసాయ సాహిత్య ప్రదర్శన
Comments
Please login to add a commentAdd a comment