వరకట్నంగా ఇచ్చిన ఆవుతో 150 గోవుల మంద
ఆ ఆదాయంతోనే నలుగురికి వివాహాలు
కరువు సీమలో ఆదర్శ జీవనం సాగిస్తున్న కుటుంబం
కుమార్తెకు పెళ్లిచేస్తే.. తోడుగా గోవును సాగనంపడం కొన్ని కుటుంబాల్లో ఆచారం. ఆస్తిపాస్తులు లేని గ్రామీణ పేదలు ఇలా గోవును కట్నంగా సమర్పించుకోవడం ఆనవాయితీ. ఆ నూతన వధూవరులిద్దరూ కట్నంగా వచ్చిన గోవును వరంగా భావించి.. దానిలోనే మహాలక్ష్మిని చూసుకున్నారు.
పుట్టింటి కానుకతో మెట్టినింట కాసుల పంటగా మలుచుకున్నారు. ఆ గోవుతో ఏకంగా 150 ఆవుల పాడిని సృష్టించారు. నలుగురు పిల్లల పెళ్లిళ్లు మంద ఆదాయంతోనే కానిచ్చారు. కరువు సీమలో ఒక్క ఆవుతో కరువును జయించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది అయ్యమ్మ, వీరారెడ్డి కుటుంబం. – మంత్రాలయం
ఆ ఇంట అదే కామదేనువు
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలం ఎరిగేరి గ్రామానికి చెందిన మూకయ్య, బంగారమ్మ దంపతుల పెద్ద కుమార్తె అయ్యమ్మ. ఆమెకు 18వ ఏట కోసిగి గ్రామానికి చెందిన కామన్‌దొడ్డి వీరారెడ్డితో వివాహం నిశ్చయించారు. మూకయ్య స్థోమతకు తగ్గట్టు అయ్యమ్మకు కట్నంగా గోవును ఇవ్వాలని నిర్ణయించి సుమారు 30 ఏళ్ల క్రితం పెళ్లి బాజాలు మోగించారు. అప్పగింతల రోజున తండ్రి మూకయ్య ఓ పెయ్యి ఆవును అయ్యమ్మకు ఇచ్చి భర్తతో మెట్టినింటికి సాగనంపాడు.
అయ్యమ్మ, వీరారెడ్డి అనుబంధం వరకట్నంగా వచ్చిన ఆవుతోనే మొదలైంది. గోవునే వరలక్ష్మిగా భావించి.. కూలీనాలి చేసుకుంటూ ఆ దంపతులిద్దరూ గోవును పెంచుకున్నారు. తొలి చూడిలోనే అది మరో పెయ్యి దూడకు జన్మనిచ్చింది. ఇలా ఏడాదికి రెండు ఆవుల చొప్పున జన్మించగా.. పుట్టిన ఆవుల సంతతిని విక్రయించకుండా కుటుంబ పోషణకు వనరుగా ఆ దంపతులు మలచుకున్నారు.
కూలి పనులు మానేసి పశువులను పోషించుకుని కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ వచ్చారు. ఇలా 30 ఏళ్లలో ఆవుల సంతతి 150కి పెరిగింది. వారింట అడుగుపెట్టిన గోవు సుమారు 16 ఏళ్ల క్రితం మరణించగా.. దాని సంతతి మాత్రం ఇప్పటికీ వృద్ధి చెందుతూనే ఉంది.
వలసబాట పట్టకుండా..
ఏటా వయసు మళ్లిన ఆవులు, దూడలను విక్రయిస్తూ అయ్యమ్మ, వీరారెడ్డి దంపతులు బాగానే కూడబెడుతున్నారు. ఏటా 10 టన్నులకు పైగా ఆవు పేడను సైతం రైతులకు విక్రయిస్తూ ఆదాయం గడిస్తున్నారు. ప్రస్తుతం ఈ దంపతుల వద్ద 50 గోవులు ఉన్నాయి. కోసిగి ప్రాంతం కరువుకు ప్రసిద్ధి. ఇక్కడ వ్యవసాయ పనులు ముగియగానే ప్రజలంతా ఇతర ప్రాంతాలకు వలసపోతుంటారు.
సుదూర ప్రాంతాలకు వెళ్లి బతుకు బండి నడుపుకుంటారు. ఏటా ఎంత లేదన్నా 15 వేల కుటుంబాలకు పైగా ఇక్కడి నుంచి వలస వెళ్తారు. అయితే, అయ్యమ్మ కుటుంబం ఏ ఒక్కరోజు వలసబాట పట్టలేదు. పాడితో కరువును జయించడం ఎలాగో అయ్యమ్మ కుటుంబానికి చూస్తే బోధపడుతుంది.
ఊపిరి ఉన్నంత వరకు వదలను
మా అయ్యకు మేం ఐదుగురు కూతుళ్లం. నేను పెద్ద కూతుర్ని. మా నాన్న ఓ ఆవును కట్నంగా ఇచ్చాడు. తోబుట్టువులు నలుగురికి ఒక్కో ఆవును కట్నంగా ఇచ్చాడు. నేను అదే ఆవుతోనే జీవితం ఆరంభించాను. ఊపిరి ఉన్నంతవరకు పాడి పోషణను వదలను. నేను తనువు చాలించినా పాడిని వదల పెట్టవద్దని నా పిల్లలకు చెబుతాను. గోవులు లేకుంటే మా బతుకు ఎలా ఉండేదో ఊహించలేను. – కామన్‌దొడ్డి అయ్యమ్మ, కోసిగి
ఎప్పుడూ ఇబ్బంది పడింది లేదు
అత్తమామలు ప్రేమతో ఆవును కట్నంగా ఇచ్చారు. దానిని మేం దైవంగా స్వీకరించాం. ఆవు పోషిస్తూ పాడిని పెంచాం. ఏనాడూ పాడి పోషణలో విసుగు చెందలేదు. ఇబ్బంది పడింది కూడా లేదు.
ఇద్దరం పాడిని చూసుకుంటూ సంసారం కొనసాగించాం. మేం ఇప్పటివరకు కరువును చూడలేదు. ఇక్కడి నుంచి ఎంతోమంది వలసపోతున్నారు. మేం మాత్రం ఏ రోజూ వెళ్లలేదు. మా మామ మూకయ్య నేటికీ మా ఆదర్శ జీవనంపై ఆనందం వ్యక్తం చేస్తాడు. – కామన్‌దొడ్డి వీరారెడ్డి, కోసిగి
పైసా అప్పు లేకుండా పెళ్లిళ్లు
అయ్యమ్మ, వీరారెడ్డి దంపతులకు రాముడు, ఈరయ్య, వీరభద్ర, మహేష్, కుమార్తె రామేశ్వరమ్మతో కలిపి ఐదుగురు సంతానం. పెద్ద కుమారుడు రాముడికి 20వ ఏట వివాహం జరిపించారు. ఆ పెళ్లికి రూ.30 వేలు ఖర్చు కాగా.. మందలో కొన్ని దూడలను విక్రయించి గట్టెక్కారు. రెండో కొడుకు ఈరయ్యకు 21వ ఏట వివాహం జరిపించగా.. రూ.50 వేలు ఖర్చయ్యింది. దీంతో కొన్ని ఆవులు, దూడలను విక్రయించారు.
మూడో కొడుకు వీరభద్ర పెళ్లికి రూ.1.50 లక్షలు ఖర్చు కాగా.. అందుకు కూడా లేగ దూడలను అమ్మి శుభకార్యం జరిపించారు. నాలుగో కుమారుడు మహేష్‌కు రెండేళ్ల క్రితం వివాహం చేయగా.. రూ.3 లక్షలు ఖర్చయ్యింది. ఆ మొత్తాన్ని కూడా కొన్ని దూడల్ని విక్రయించి సొమ్ము సమకూర్చుకున్నారు. ఇక ఒక్కగానొక్క కూతురు రామేశ్వరమ్మకు సంబంధాలు వెతుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment