
ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ వివిధ యాప్‌ల ద్వారా నిర్వహణ.. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే బుకీలతో పనిలేకుండా పందేలు
వ్యాపారులు, ఉద్యోగులతో పాటు విద్యార్థులు కూడా ఈ ఉచ్చులో..
357 బెట్టింగ్ వెబ్‌సైట్లను బ్లాక్‌చేసిన డీజీజీఐ.. మరో 700 యాప్‌లపై నిఘా
వీటికి చెందిన 2,400 బ్యాంకు ఖాతాల్లో రూ.126 కోట్లు ఫ్రీజ్.. సీజన్ ముగిసేలోపు రూ.లక్ష కోట్లు చేతులు మారే అవకాశం
ఈ సీజన్ ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ కోల్‌కత నైట్‌రెడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య మొదలైంది. డఫ్పా బెట్‌తో పాటు దాదాపు అన్ని బెట్టింగ్ యాప్‌లు కేకేఆర్ ఫేవరెట్ టీంగా బెట్టింగ్ నిర్వహించాయి. ఆర్సీబీపై మొదట్లో బెట్టింగ్ కాసిన వారు ఆ తర్వాత మళ్లీ కేకేఆర్‌పై బెట్టింగ్ కాశారు. కానీ, చివరికి ఆర్సీబీ గెలుపొందింది. దీంతో కేకేఆర్‌పై బెట్టింగ్ చేసిన వారంతా నిండా మునిగిపోయారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల్లో బెట్టింగ్‌ల జోరు తీరిది.
సాక్షి ప్రతినిధి కర్నూలు : అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్లు ఉండటం, ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో బెట్టింగ్ యాప్‌లు పుష్కలంగా ఉండడంతో అధికశాతం క్రికెట్ అభిమానులు ఆన్‌లైన్ బెట్టింగ్‌లో మునిగిపోతున్నారు. సెలబ్రిటీలు కూడా వీటిని ప్రమోట్ చేస్తుండడంతో రెండేళ్లుగా ఈ యాప్‌లు భారీగా పెరిగాయి. పైగా.. ఈసారి ప్లేయర్ల ఆక్షన్‌లో ఎక్కువశాతం ప్లేయర్లు జట్లు మారారు. దీంతో బెట్టింగ్ రాయుళ్లు జట్ల విజయావకాశాలను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. చివరికి.. వారి ఖాతాల్లోని డబ్బు ఆవిరవుతోంది. ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్‌లోనే బెట్టింగ్‌లు ఎక్కువగా జరుగుతుండడంతో పోలీసులకు కూడా ఇవి సవాల్‌గానే మారాయి. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసేలోపు రూ.లక్ష కోట్లు చేతులుమారే అవకాశముందని అంచనా.
బెట్టింగ్ యాప్‌లు ఇవే..
ఆన్‌లైన్ బెట్టింగ్‌లో ఎక్కువమంది ‘డఫ్పా బెట్టింగ్’ యాప్‌ను వాడుతున్నారు. దీంతో పాటు ఎక్స్ బెట్, స్కై ఎక్సే్ఛంజ్, ఫ్యాన్సీ లైఫ్, క్రికెట్ మజా, లైవ్‌లైన్, లోటస్, బెట్ 65, బెట్ ఫెయిర్, టెన్‌క్రిక్, 22 బెట్, ఫోర్‌రాబెట్, వన్ విన్, పారిమ్యాచ్, మెల్‌బెట్‌తో పాటు అనేక బెట్టింగ్ యాప్‌లు ఉన్నాయి.
ఆన్‌లైన్ బెట్టింగ్ తీరిది..
⇒ ఈ విధానంలో మ్యాచ్‌కు గంట ముందే కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. దాంతోనే బెట్టింగ్ కాయాలి.
⇒ మ్యాచ్‌కు ముందు రేటింగ్స్ ఇస్తారు. ఆ ప్రకారం పందెం వేయాలి.
⇒ మ్యాచ్ సాగేతీరును బట్టి ఇవి మారుతుంటాయి. డిపాజిట్ క్లోజ్ అయితే అప్పటికప్పుడు డిపాజిట్ చేసి బెట్టింగ్ కాసే అవకాశం ఉండదు. దీంతో చాలామంది రూ.50వేల నుంచి లక్షల రూపాయలు ముందుగానే యాప్స్‌లో డిపాజిట్ చేస్తున్నారు.
⇒ మ్యాచ్ పరిస్థితి, రేటింగ్స్‌ను బట్టి అప్పటికప్పుడు ఆకర్షితులై కూడా భారీగా బెట్టింగ్ కాస్తారు.
⇒ బెట్టింగ్‌లో గెలిస్తే క్షణాల్లో డబ్బు ఖాతాల్లో జమవుతుంది. ఓడిపోతే ఖాతా ఖాళీ అవుతుంది. .. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఆన్‌లైన్ బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని రూ.వేల నుంచి రూ.లక్షల వరకూ పొగొట్టుకుంటున్నారు.
ఆఫ్‌లైన్ బెట్టింగ్ ఇలా..
టాస్ నుంచి బాల్ టు బాల్ వరకూ బెట్టింగ్ సాగుతుంది. టాస్ ఎవరు గెలుస్తారు? తొలి ఓవర్ స్పిన్నర్‌తో బౌలింగ్ వేయిస్తారా? పేసర్‌తో వేయిస్తారా? మొదటి ఓవర్‌లో ఎన్ని పరుగులు వస్తాయి? జట్టు ఎంత స్కోర్ చేస్తుంది? ఎవరు గెలుస్తారు? ఫలానా బాల్‌కు ఫోర్ వస్తుందా? సిక్స్ వస్తుందా? లేదా ఒక్క పరుగే వస్తుందా? ఇలా అనేక రకాలుగా బెట్టింగ్‌లు ఉంటాయి. ఇక బుకీలు ముంబై, హైదరాబాద్, బెంగళూరులో ఉంటారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో సబ్‌బుకీలు ఉంటారు. మ్యాచ్ మారుతున్న స్వరూపాన్ని బట్టి బెట్టింగ్ లెక్కలు మారుస్తారు. వీరు వాట్సప్ గ్రూపుల్లో బెట్టింగ్ ధరలు నిర్ధారిస్తారు. ఆఫ్‌లైన్‌లో బెట్టింగ్ కాసేవారు బార్లతో పాటు హోటళ్లలో కూర్చుని బెట్టింగ్ కాస్తారు.
357 రకాల వెబ్‌సైట్లు బ్లాక్..
బెట్టింగ్‌లను అరికట్టేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) 357 రకాల వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది. వాటికి చెందిన 2,400 బ్యాంకు ఖాతాల్లో రూ.126 కోట్లను ఫ్రీజ్ చేసింది. మరో 700 యాప్‌లపై నిఘా ఉంచింది. అనుమతితో నడిచే బెట్టింగ్ యాప్‌లను టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు. ఈనెల 16న ఫణీంద్రశర్మ అనే వ్యక్తి ఫిర్యాదుతో హైదరాబాద్‌లో దగ్గుబాటి రానా, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, శ్రీముఖి, వర్షిణితో పాటు 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బెట్టింగ్ ఊబిలో వ్యాపారులు, ఉద్యోగులతో పాటు యువత ఎక్కువగా చిక్కుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment